జీవితం అంచున -12 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
నేను చేసే కోర్సు అమ్మకు ఉపయోగపడుతుందని ఆశ పడ్డానే తప్ప అమ్మ అవసరానికి నేను పక్కన లేకపోవటం నన్ను క్షణం నిలవ నీయలేదు. పిల్లి పిల్లలను చంకన వేసుకుని తిరిగినట్టు నేనెప్పుడూ అమ్మ వయసును కూడా ఖాతరు చేయకుండా అమ్మను వెంటేసుకుని దేశదేశాలు తిరుగుతుండే దానిని. ఈ సారే ఎందుకో అమ్మ ఇండియా నుండి నాతో బయిలుదేరకుండా నా వెనుక ఓ నెలలో వస్తానని ఆగిపోయింది.
సరిగ్గా నెల తిరిగే సరికి కోవిడ్ కారణంగా విమాన రాకపోకలు నిలిచి పోయాయి. ఆస్ట్రేలియా మరీ గట్టి నియమ నిబంధనలతో బయటి దేశాల నుండి టూరిస్టుల రాకను నిలిపివేయటమే కాకుండా ఆస్ట్రేలియా పౌరుల పోకను కూడా కట్టడి చేసేసింది.
అమ్మను రప్పించుకోనూ లేను, నేను దేశ సరిహద్దు దాటనూ లేను.
తొలిసారిగా ఆస్ట్రేలియా పౌరసత్వం నాకు దుఃఖాన్ని మిగిల్చింది. అమ్మ అనారోగ్యాన్ని వివరిస్తూ ప్రత్యేక క్యాటగిరీలో ట్రావెల్ బ్యాన్ ను సడలించమని అభ్యర్ధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాను. తిరుగు టపాలో రిజెక్ట్ అయి వచ్చింది. పట్టు వదలని విక్రమార్కునిలా పదే పదే అప్లై చేస్తూనే వున్నాను. మూడుసార్లూ నిరాకరింపబడింది.
ఆస్ట్రేలియాది తన దేశ పౌరుల ఆరోగ్యాన్ని సురక్షితంగా వుంచే ప్రయత్నమే అయినప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులు కూడా ఇతర దేశాలకు విజిటింగ్ కి వెళ్ళి ఈ బ్యాన్ కారణంగా పరదేశాల్లో ఇరుక్కుపోయి అయిన వారికి దూరమై పడరాని పాట్లు పడ్డారు ఈ దశలో.
ఎప్పుడు నాకు అనుమతి లభిస్తే అప్పుడే వెళ్ళిపోతానని గ్రహించిన మా అమ్మాయి నా కోర్సుకి సంబంధించి యూనివర్సిటీని కన్సల్ట్ చేసింది. ప్రతీవారం అటెండెన్స్ లేకపోయినప్పటికీ ఫరవాలేదని, కాకపోతే “Provide CPR and FirstAid” అనే యూనిట్ మటుకు ప్రాక్టికల్ గా వుంటుందని, దానికి నా ఫిజికల్ ప్రెజెన్స్ అవసరమని సెలవి చ్చారు.
తరువాత కోర్సు ఆఖరి మాసంలో తప్పనిసరిగా సిములేటెడ్ క్లినికల్ ల్యాబ్స్ మరియు ప్లేస్మెంట్ కి వుండకపోతే మాత్రం మొత్తం సంవత్సర కాలం చదువు వృధా అయిపోతుంది. తిరిగి ఫీజు కట్టి, అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
నా కన్నా ఎక్కువగా అమ్మాయి దిగులు పడింది. అంత ప్యాషన్ తో చేరి ఎంతో శ్రద్దగా చదువుకుంటున్న నాకు ఎందుకో ఆ తరుణంలో అమ్మ ధ్యాస తప్ప కోర్సు, యూనిట్లు, పరీక్షలు, ప్లేస్మెంట్… ఏదీ ముఖ్యమనిపించ లేదు.
ఏనాడూ అనుకోలేదు అమ్మ దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు అమ్మ కావాలన్న ప్పుడు ఇలాంటి ప్రతిబంధకం వస్తుందని. ఎన్ని కాసులున్నా తీర్చలేని కలవరమది.
ప్రైవేట్ జెట్లున్న దొరబాబులు సైతం ఎగరలేని పరిస్థితి. అయినోళ్ళ సమక్షంలో మిగిలినోళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఎడబాటైన అమ్మాబిడ్డలు, భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు నష్టజాతకులే. నేనూ నష్టజాతకురాలినే అయ్యాను.
అమ్మ దగ్గర వాలాలన్న నా బలమైన కోరిక, మూసేసిన బార్డర్లను బద్దలు కొట్టాలన్న కసి, అమ్మ దగ్గరున్న శౌచ్యం తెలియని పనివాళ్ళను మాన్పించాలన్న తపన, స్వయంగా అమ్మను పరిరక్షించుకోవాలన్న కాంక్ష నిద్ర పట్టనీయ లేదు.
నా అసహాయత పై, నా ఆవేదన పై, నా దైన్యం పై దయచూపని దైవం.. దినదినప్రవర్ధమానమై ప్రజ్వరిల్లుతున్న కరోనా సర్వమానవ వినాశనం. అమ్మను తలుచుకునే కొద్దీ మనసు సంద్రంలో సుడిగుండాలు, కళ్ళల్లో జలపాతాలు ఊరు తున్నాయి.
మార్గాలన్నీ మూసుకుపోయాయి. దూరాలు మరింత దట్టమయ్యాయి.
ఒకే కల…
నిలువునా నీరు కార్చేస్తున్న తీరని వాంఛ..
అమ్మ దగ్గరుండాలన్న దహించేస్తున్న జ్వాల..
వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వార్తలు..
ఏ సరిహద్దుల సమస్యా లేకుండా మంత్రలేపనమేదో పాదాలకద్దుకుని ఇక్కడ మాయమయి అక్కడ అమ్మ పక్కన వాలాలన్న ప్రగాఢమైన కోరిక.
సరిగ్గా అదే సమయంలో అమెరికా చిన్నమ్మాయి ఇంటర్ స్టేట్ మార్పిడి, క్రొత్త ఇంటి గృహప్రవేశం, ఉద్యోగంలో మార్పులతో సతమతమవుతోంది.
“ఇండియాకి పర్మిషన్ గ్రాంట్ కావటం లేదు కాని అమెరికా అయితే పర్మిట్ చేస్తారేమో ప్రయత్నించమ్మా…ఇటు వచ్చి నాలుగు రోజులు వుండి ఇటు నుండి ఇండియా వెళ్ళవచ్చు.. ఇన్విటేషన్ పంపుతాము” అంటూ చిన్న ఆశాజ్యోతి వెలిగించింది.
“అలాగే ప్రయత్నించండే… ఈ దేశ సరిహద్దు దాటించి పుణ్యం కట్టుకో తల్లీ..” అన్నాను ఆశగా.
పాస్పోర్ట్, వీసాలు చేతిలో వుండీ సరిహద్దు దాటటానికి, ట్రావెల్ చేయటానికి ప్రభుత్వ అనుమతి కోసం ట్రావెల్ పర్మిట్ కోసం వెంపర్లాడటం ప్రపంచ చరిత్రలోనే ఒక విశేషం.
అమెరికా నుండి చిన్నల్లుడి మొదటి ప్రయత్నం విఫలమయ్యింది.
రెండు రోజుల్లో కండిషన్స్ మార్చి మళ్ళీ అప్లై చేసాడు. ఎంబసీ అసలు దరఖాస్తు పూర్తిగా చూసిందో లేదో తెలీదు. “Permission Not granted” అంటూ మళ్ళీ జవాబు.
నేను లేకుండా అమ్మకు ఏమవుతుందోనన్న బెంగ నన్ను తినేయ సాగింది.
బుధవారం పైన మోజు పోయింది.
రాత్రింబవళ్ళు ఇండియాకి వెళ్ళే అడ్డదారుల కోసం గూగుల్ చేయటం… సీసీ టీవీ కెమరాల్లో అనుక్షణం అమ్మను గమనించటం… అదే నా దినచర్య.
అమాంతం ఓ శుభోదయాన చిన్నమ్మాయి “మమ్మీ సూట్ కేసు సర్దుకో… టికెట్స్ బుక్ చేసుకో… you are permitted to travel” అంది.
నమ్మశక్యం కాలేదు.
“నిజంగానే…ఎలా సాధ్యమయ్యింది” అంటూ ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.
“యస్… ఈసారి నీ అల్లుడు వేరే మెయిల్ ఐడి నుండి అప్లై చేసారు. దరఖాస్తు ప్రతిసారి ఒకే ఆఫీసర్ దగ్గరకు వెళ్ళదుగా.. దేవుడు మన మొర ఆలకించి నీ దరఖాస్తు కాస్త మెత్తటి మనసున్న వాడి చేతిలోకి పంపాడు… “Granted” అని స్టాంప్ కొట్టేసాడు..” ఆనందంగా చప్పట్లు చరుస్తూ మరీ చెప్పింది చిన్నమ్మాయి.
“మా తుఝే సలాం… గుడ్ బై టు నర్సింగ్ & ఆస్ట్రేలియా…” చకచకా పెద్దమ్మాయికి ఫోను చేసాను.
“నాకు US కి వెళ్ళటానికి పర్మిషన్ గ్రాంట్ అయ్యింది. ఇప్పుడే చెల్లి మెయిల్ ఫార్వార్డ్ చేసింది. నువ్వు త్వరగా వచ్చి టికెట్స్ బుక్ చేయాలి” ఉత్సాహంగా చెప్పాను.
గరాజ్ నుండి సూట్ కేసులు తెచ్చుకుని బట్టలు సర్దుకోవటం మొదలెట్టేసాను.
*****
(సశేషం)