జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-17

   -కల్లూరి భాస్కరం

          ‘కావర పడితే మావురానికి వెళ్ళు’ అని, తెలంగాణలో ఉన్న ఒక సామెతను ప్రస్తావించి రాంభట్ల ఒక ముచ్చట చెప్పుకుంటూవచ్చారు. ఆదిలాబాద్ జిలాల్లోని మాహూరు ఒక శక్తిక్షేత్రం. అక్కడి దేవతను మాహూరమ్మ-మావూరమ్మ-మావురమ్మ-మారెమ్మ అంటారు. అక్కడి అర్చకులను మారెమ్మకాపులనీ, ‘నెత్తురు కోతలవాళ్ళ’ని కూడా అంటారు. మాహూరమ్మ ప్రతిమ ఉన్న ఒక చిన్నమందిరాన్ని ఒక యువతి తలకెత్తు కుంటుంది. జనపనారతో జడలాగా అల్లిన ఒక కొరడాలాంటి సాధనంతో ఒక వ్యక్తి తన అర్ధనగ్న దేహాన్ని బాదుకుంటూ ఉంటాడు. ఒంటి మీద నెత్తుటిచారికల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. పక్కనే ఇంకొక వ్యక్తి ‘వీరణం’ అనే వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటాడు. వారి వెంట ఉన్న మరో ఇద్దరి చేతుల్లో కూడా జనపనార కొరడాలు ఉంటాయి.

          ఆంధ్రప్రాంత గ్రామాలు, పట్టణాల జనాలకు కూడా ఇది చిరపరిచిత దృశ్యమే. అప్పటికే నెత్తుటి చారికల్లాంటివి ఉన్న ఒంటిని కొరడాతో బాదుకుంటూ పరుగు నడకతో మీది మీదికి వస్తున్నట్టుండే వ్యక్తిని చూస్తే చిన్నప్పుడు భయం వేసేది. రాంభట్ల రాసింది చదివే వరకూ ఈ దృశ్యం వెనుక ఉన్న అసలు కథ నాకు తెలియదు. దుర్భరమైన విషాదం కలిగినప్పుడు నెత్తురోడేలా తమను తాము బాదుకోవడం మ్లేచ్ఛుల అలవాటంటా రాయన. దీని సాదృశ్యం షియా ముస్లింలలో కనిపిస్తుంది. మొహరం పండగప్పుడు వారు కూడా నెత్తురోడేలా తమను బాదుకుంటూ శోకిస్తారు. ఈ శోకాన్ని వారు ‘మాతం’ అంటారు. ఈ పండుగను మనవాళ్లు ‘పీర్ల పండుగ’ అంటారు.

          మాహూరమ్మ, లేదా మావూరమ్మకూ; మొహరం పండుగకూ ఏమైనా అజ్ఞాత సంబంధముందా; లేక అది కేవలం యాదృచ్చికమైన నామసామ్యమేనా అన్న సంగతి మనకు తెలియదు. కాకపోతే, ఇంతకు ముందు సుక్కమహాదేవి విగ్రహ విధ్వంసానికి వేదికైనట్టు చెప్పుకున్న ‘మారీ’ నగరానికి, మావూరమ్మకు ఉన్న సంబంధాన్ని రాంభట్ల ఊహిస్తారు. సుక్కమహాదేవిని బాలగానూ, బాలాత్రిపురసుందరిగానూ, బాలాజీగానూ, తారగానూ మార్చుకుని కొందరు ఆరాధిస్తుండగా; అసురులు మాత్రం మారీ నగరాన్ని మరవలేక మారీవూరు-మాహూరు కట్టుకుని తమ భక్తిని చాటుకుంటూ తిరుగుతున్నారని పిస్తుందని ఆయన అంటారు. మారీ నగరంతోపాటు, సుక్కమహాదేవి విగ్రహవిధ్వంసాన్ని తలచుకుని పెట్టే ఈ శోకానికి అయిదువేల సంవత్సరాల వెనకటికి విస్తరించిన దుర్భర విషాద గతం ఉందన్నమాట!

          మాహూరమ్మే మావుళ్ళమ్మ అయినట్టుంది. నా చిన్నతనంలో పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో ఉన్నప్పుడు తిరిగిన మావుళ్ళమ్మ గుడి పరిసరాలు, ఆ దేవత పేరిట ఏటా జరిగే జాతర దృశ్యాలు ఇప్పటికీ కళ్ళముందున్నాయి.

          అదలా ఉంచితే, పై కథనంలో పేర్ల మధ్య ఉన్న పోలికలను బట్టి; అన్వయాలను బట్టి వెంటనే ఒక నిర్ధారణకు రమ్మని నేను అనను. ఎవరైనా వాటిని సాధికారికంగా తోసి పుచ్చవచ్చు; లేదా వాటిని ఆధారం చేసుకుని సొంతంగా మరి కొంత పరిశోధన చేయ వచ్చు. ఇప్పటికిప్పుడు నాకు స్థూలంగా ఏమనిపిస్తోందంటే; సరిహద్దుల స్పృహ లేకుండా, వలసలే సర్వసాధారణమైన పురాప్రపంచంలో జనాలు తమ మధ్య మత విశ్వాసాలు, భాష, సంస్కృతీ వగైరా సంబంధమైన ముడులు వేసుకుంటూ వచ్చారు.  కాలగతిలో అవి, జతపరచడానికి పిల్లలకిచ్చే బొమ్మల విడిభాగాల్లా మారాయి. అవి కలగాపులగమవడమే కాదు; వాటి లింకులు కొన్ని మాయమయ్యాయి. దాంతో అవి అనూహ్యంగానూ, అజ్ఞాతంగానూ మారాయి.

          ఇంకొకటి ఏమనిపిస్తోందంటే, చరిత్ర కందని, లేదా చరిత్ర కెక్కని కాలం నుంచీ ఇక్కడ మత, సంస్కృతులపరంగా సమాంతరమైన అనేక పాయలు ప్రవహిస్తూవస్తు న్నాయి. వాటి మూలాలు అస్పష్టంగా ఉండిపోయాయి. ఈ దేశం వైవిధ్యవంతంగా నేటికీ చెప్పుకోడానికి కారణాలు కూడా అవే కావచ్చు.

          మ్లేచ్ఛుల్లోనే పుట్టిన ఏకేశ్వరమతాల ప్రభావం మన దగ్గర శైవ, వైష్ణవ, మధ్వ మతాల పై కనిపిస్తుందని రాంభట్ల మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అదలా ఉంచితే, ఆయన పేర్కొన్న మరో కథనం ఇలా ఉంటుంది: క్రీ.పూ. 2300లో, అంటే ఇప్పటికి దాదాపు 4500 సంవత్సరాల క్రితం మెసపొటేమియాలోని అక్కాడియన్ సామ్రాజ్యాన్ని సర్రోకిన్ అనే చక్రవర్తి పాలించాడు. పశ్చిమ పండితులు అతన్ని ‘సారగాన్’ అన్నారు. అతని రాజధాని పేరు ‘అగద’. అది ఆ తర్వాత ‘అక్కడ్’ అయింది. ఆ ప్రాంతంలో మాట్లాడిన భాషను అక్కాడియన్ అన్నారు. అది మ్లేచ్ఛకూటానికి చెందిన భాష.

          సర్రోకిన్ జన్మవృత్తాంతం అచ్చం మన మహాభారతంలోని కర్ణుని కథను పోలి ఉంటుంది. అతని తల్లి ఒక రాచకన్య; ఆమె నగరదేవతకు అర్చకురాలిగా ఉండేదని ఊహ. ఏదో భారీనిర్మాణాన్ని చేపట్టడం వల్ల ఆ నగరంలో చండశాసనం అమలులోకి వచ్చింది. ఆ సమయంలో దాంపత్యాలు, పెళ్ళిళ్ళు నిషిద్ధాలని ఇంతకు ముందు చెప్పు కున్నాం. గర్భవతి అయిన రాచకన్య రహస్యంగా కొడుకుని కన్నది. చెలికత్తెలు అతన్ని ఒక తుంగపెట్టెలో ఉంచి వరుణా నదిలో విడిచిపెట్టారు. ఆ పెట్టె ఒక నీరడి (నీటి సరఫరా వ్యవస్థలో పనిచేసేవాడు)కి దొరికింది. అందులోని పసివాణ్ణి ఆ నీరడే పెంచి పెద్దచేశాడు. కొంత వయసు వచ్చాక ఆ అబ్బాయి ఆ నగర రాజు దగ్గర పానపాత్ర అందించే ఉద్యోగానికి కుదురుకొన్నాడు. ఆ తర్వాత తనే రాజై, చక్రవర్తి కూడా అయ్యాడు. అతని సామ్రాజ్యం మధ్యధరా సముద్రం నుంచి అరేబియా సముద్రం వరకూ విస్తరించింది.

          ప్రాచీన పశ్చిమాసియాకు చెందిన సుమేరు భాషలో ‘అగ’ అంటే దేవాలయమనీ, రాజప్రాసాదమనే అర్థాలున్నాయి. ‘అగ్గడ’ అంటే సింహాసనానికి చెల్లించవలసిన పన్ను. ‘అగ-కడ’ అనే రెండు మాటలు కలసి ‘అగ్గడ’ అయింది. ‘అగ’ అంటే దేవాలయం, లేదా రాజప్రాసాదం అయితే; ‘కడ’ అనే మాటకు పన్ను అని అర్థం. కేరళీయులు ‘కడ’ అనే అంటారు. సంస్కృతంలో ఈ మాట ‘కరం’ అయింది. ఇది సంస్కృతం నుంచి అగద భాషకు వెళ్ళిందో, లేక అగద నుంచి సంస్కృతానికి వచ్చిందో రాంభట్ల చెప్పలేదు కానీ; సంస్కృత-మ్లేచ్ఛ భాషల పరస్పర ప్రభావానికి దీనిని కూడా ఉదాహరణగా చెప్పుకో వచ్చు.

          ఒకే అర్థం ఇచ్చే జంటపదాలు కొన్ని తెలుగులో కనిపిస్తాయని అంటూ రాంభట్ల కొన్ని మాటలను ఉదహరించారు. వాటిలో ‘ఇలవేల్పు’ అనే మాట ఒకటి. ఇందులోని ‘ఇల, ఇలు’ అనేది మ్లేచ్చపదం; ‘వేల్పు’ తెలుగు మాట; రెండు మాటలకూ అర్థం దేవుడనే! ‘దీపం సెమ్మా’ అనేది ఇంకొక మాట. సెమ్మా అనేది ఫారసీ నుంచి వచ్చిన మాట. ఈ రెండు మాటలకూ అర్థం ఒకటే. ఇలాంటిదే, ‘పేదరాసి పెద్దమ్మ’ అనే మరో జంటపదం. తమిళులు, మలయాళీలు అమ్మను ‘ఆచ్చి’ అంటారు; ‘పేర్(పెద్ద) ఆచ్చి’ అంటే పెద్దమ్మ. పేర్ ఆచ్చిని మనవారు పేదరాసిని చేసి, దానికి అదే అర్థం కలిగిన పెద్దమ్మను చేర్చారు. ఈ జంటమాటల్లో ఒకటి పాతపదం అయితే ఇంకొకటి కొత్తపదం అయుండచ్చు.

          అసీరియన్ నిఘంటువు కూడా, ‘ఇలు’(ilu) అనే మాటకు God, deity, the god referring to a specific deity,  protective deity అనే అర్థాలు ఇచ్చింది. ‘protective deity’ అనే అర్థం ఇలవేల్పు అనే మాటకు మనమిచ్చే అర్థానికి దాదాపు సరిపోతోంది. ‘అగ్నిం ఈళే పురోహితం’ అనే ఋగ్వేదంలోని తొలి మంత్రంలో ఉన్న ‘ఈళే’ అనే మాటలోని ‘ఇల్’ ఆర్యభాషాపదంలా కనిపించదనీ; దేవుడికి, లేదా రాజులకు గౌరవసూచకంగా వాడే ‘ఇలు’ అనే అసీరియా (మ్లేచ్ఛ) పదంతో సంబంధమున్నదిగా కనిపిస్తుందని కోశాంబీ కూడా అంటాడు (An Introduction to the Study of Indian History, P. 143). అలాగే, అసీరియాభాషలో ‘దన్ను’(dannu) అనే మాట ధైర్యాన్ని, బలిమిని చెబుతుందనీ, దీని నుంచే ‘దానవ’ శబ్దం పుట్టి ఉండవచ్చుననీ కోశాంబీ ఊహ. ఈ మ్లేచ్చపదాన్ని తెలుగులో సరిగ్గా ఇదే అర్థంలో వాడతాం.

          మళ్ళీ సర్రోకిన్ చక్రవర్తి గురించిన రాంభట్ల కథనానికి వస్తే, అగ్గడ అంటే సింహాసనానికి చెల్లించే పన్ను కనుక, పన్నువసూలు అధికారులను, అంటే నేటి వ్యవహారంలో రెవెన్యూ అధికారులను, అగ్గడులనేవారు కాబోలు. ప్రతిరోజూ సర్రోకిన్ పంక్తిని ఆరువందల మంది అగ్గడులు భోజనం చేసేవారట. స్వయంగా చక్రవర్తి భార్య కూడా వడ్డనలో పాలుపంచుకునేదట. తెలుగులో ‘ప్రెగ్గడ’ అనే మాట ఈ అగ్గడ నుంచే వచ్చి ఉండవచ్చునని రాంభట్ల ఊహ. ‘పేర్ (పెద్ద) అగ్గడ’ ప్రెగ్గడ అయింది; అంటే, పన్ను వసూలు సిబ్బంది పైన పెద్ద అధికారి అన్నమాట.

          ఈ అగ్గడ సంప్రదాయం విచిత్రంగా మార్వాడీలలో కనిపిస్తుందని ఆయన అంటారు. మార్వాడీల దగ్గర పనిచేసే డబ్బు వసూలు ఉద్యోగిని ‘మునీమ్’ అంటారు. వారిలో పెద్ద మునీమ్, యజమాని ఇంట్లోనే ఉంటాడు, యజమాని సహపంక్తిన భోజనం చేస్తాడు. యజమాని తను ధరించే దుస్తుల్లాంటివే అతనికి ఇస్తాడు. 

          ‘అగ’ అనే మాటకు దేవాలయమనీ, రాజప్రాసాదమనీ రెండు అర్థాలూ ఉండడానికి కారణం రాంభట్ల ప్రత్యేకించి వివరించకపోయినా నాకు ఇలా అనిపిస్తోంది: సుమేరు, లేదా మెసపొటేమియాలోని ప్రాచీననగర రాజ్యాలలో పాలన దేవాలయం కేంద్రంగానే జరిగేది, నగరదేవత పేరు మీదే వ్యవసాయ భూముల పంపకం జరిగేది, ధాన్యరూపంలోని శిస్తును దేవతకే సమర్పించేవారు. ఈ విధంగా దేవాలయానికీ, రాచకార్యాలకు కేంద్రమైన తావుకూ తేడా ఉండేది కాదు కనుక రెండింటికీ ‘అగ’ అనే మాటను వర్తింపజేసి ఉంటారు. రెంటి మధ్యా ఈ అభేదం ఏదో రూపంలో తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా మన దగ్గర దక్షిణాదిన ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలను చూస్తే అది అర్థమవుతుంది. చుట్టూ ఎత్తైన బృహద్ ప్రాకారాలతో అవి అచ్చం పటిష్ఠమైన కోటల్లానే ఉంటాయి; లోపల ఆస్థాన మంటపాలతోనూ, అక్కడ జరిగే నృత్యగీత పురాణ శ్రవణాది ఉపచారాలతోనూ రాజాస్థానా లను తలపిస్తూ ఉంటాయి. గుళ్ళో దేవుడికి జరిగే ఈ ఉపచారాలను కూడా రాజోపచారా లనే అంటాం. దేవుడికి విలువైన నగానట్రా సమర్పించడం ఆనవాయితీ కనుక, వాటికి అవసరమైన రక్షణ రీత్యా అవి రెండవ దుర్గంలా పరిణమించడం అర్థవంతమే. 

          సంస్కృతానికీ; తెలుగు, తమిళం మొదలైన దక్షిణాది భాషలకూ మ్లేచ్ఛభాషలతో ఉన్న సంబంధం గురించి చెప్పుకోవడంలో ఇన్ని విషయాలను తడమాల్సివచ్చింది. రాంభట్ల అనుసరించిన బెడ్రిక్ హ్రోజ్నీ ప్రకారం, తెలుగు, కన్నడాలు సుమేరు భాషలు; కాకపోతే, వాటి మీద మ్లేచ్ఛభాషల ప్రభావం ఉంది. ఇక, తమిళ, మలయాళాలు అసుర భాషలు, అంటే మ్లేచ్ఛభాషలు. మొత్తంగా ఈ నాలుగింటినీ పశ్చిమాసియా భాషలంటాడు హ్రోజ్నీ. సుమేరు ప్రాంతంలోనే పుట్టిన అగద, అగ్గడ, లేదా అక్కడ్ భాష ప్రభావంతో సుమేరు భాషకూడా అజంతత్వాన్ని(అన్ని పదాలూ అచ్చుతోనే అంతమైనప్పుడు ఆ భాషను అజంతభాష అంటారు) తెచ్చుకుంది. సుమేరు ప్రభావంవల్లనే మన తెలుగు కూడా అజంతభాష అయింది.

          ప్రత్యేకించి భాషా సంబంధమైన పై అంశాల పై ఆ రంగానికి చెందిన నిపుణులు ఎలా స్పందిస్తారో, లేక స్పందించారో నాకు తెలియదు. కిందటి వ్యాసభాగంలో చెప్పినట్టు ఇక్కడ కూడా సంస్కృతం పైనా, తెలుగు, తమిళాది దక్షిణాది భాషల పైనా పశ్చిమాసియా ప్రభావాన్ని స్థూలంగా గుర్తించడమే ప్రస్తుతానికి నా పరిమితి. రాంభట్లకు సంబంధించి నాకు ఒక ఊరట ఏమిటంటే, ‘అగ’ అనే మాట పై ఆయన రాసినదానికి ఐరావతం మహదేవన్ నుంచి కొంత ధ్రువీకరణ లభించడం!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.