తస్లీమా నస్రీన్ లజ్జ నవలపై సమీక్ష
– దివికుమార్
మిత్రులారా!
భారత ఉపఖండానికి సుదీర్ఘ ఉమ్మడి చరిత్ర ఉంది. తరతరాల ఉమ్మడి సంస్కృతిక వారసత్వం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించిన సంపద్వంతమైన ఉజ్వల పోరాట ఘట్టాలు ఉన్నాయి.
అయినా మతం ప్రాతిపదిక పైన విడిపోయిన వాస్తవం మన కళ్ళముందే ఉంది.
ఇదే ప్రదేశంలో మతతత్వాన్ని రగిల్చి మత విద్వేష రాజకీయాలతో తమ పబ్బం గడుపుకుంటున్న పాలకవర్గాలు ఉన్నాయి. అన్ని మతాలలో లౌకికవాద త్యాగపూరిత శక్తులు ఉన్నాయి. మూడు దేశాలలో పాలకవర్గాలను, మతతత్వ శక్తులను నడిపించే సామ్రాజ్యవాద ప్రయోజనాల రాజకీయ కుట్రలూ కూహకమూ ఉంది.
సామ్రాజ్యవాదాన్ని మతతత్వాన్ని ఎదుర్కొనే ఉమ్మడి దృక్పథము, సంఘటిత పరచవలసిన ప్రత్యామ్నాయ ఉద్యమశక్తుల ఐక్యత ఉండవలసినంతగా లేవు. అన్ని రకాల మత తత్వాలకు వ్యతిరేకంగా ఉపఖండం స్థాయిలో లౌకికశక్తులు ఐక్యంగా సాగించ వలసిన కృషి యొక్క ఆవశ్యకత, బాబ్రీ మసీదు విధ్వంసం పిదప స్పష్టంగా కనిపించింది.
1993 సెప్టెంబర్ లో లక్నోలో విప్లవ కార్మిక సంస్థ నిర్వహణలో జరిగిన మతతత్వ వ్యతిరేక సదస్సులో సమర్పించిన “మతతత్వం- సంస్కృతి” అనే పత్రంలో ఈ అంశాన్ని నేను మొదటిసారి ప్రతిపాదించే అవకాశం తీసుకున్నాను.
25 ఏళ్ళ క్రితం 1996లో డాక్టర్ తస్లీమా నస్రీన్ రాసిన “లజ్జ” నవల సమీక్షలో,దానినే మరింత విస్పష్టంగా ప్రకటించాము.
ఈ దృక్పథానికి లోబడే 2004 ఆగస్టు ప్రజాసాహితి ప్రత్యేక సంచికను ‘శాంతి ప్రజాస్వామ్యం కోసం ఉపఖండపు ఉమ్మడి సాహిత్య సంచిక’ గా వెలువరించ గలిగాము.
ఆనాటికి మా మౌలిక అవగాహన – దృక్పథాలను తగినంత స్పష్టంగా అర్థం చేసుకోలేని వారికి మతతత్వం , విచ్చలవిడిగా పేట్రేగి వికృత విన్యాసాలు సాగిస్తున్న నేడు బాగా అర్థం కాగలవని భావిస్తూ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన కొత్త పాఠకుల దృష్టికి కూడా దీన్ని తీసుకు వస్తున్నాము. గ్రహించగలరు.
….దివికుమార్ 31-8-2021
పుస్తక సమీక్ష
మతతత్వం లజ్జాకరం —దివికుమార్
తస్లీమా నస్రీన్ పేరు వినని సీరియస్ సాహిత్య పాఠకులుండరంటే ఆశ్చర్యం లేదు. ఆమె బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి కూడా ముస్లిం మతఛాందసత్వాన్ని ఎలు గెత్తి ఖండించారు.
మతతత్వం మైనారిటీల పాలిట ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ‘లజ్జ’ నవల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ఆకాశంలో సగమైన మహిళలను పడగవిప్పిన మత ఛాందసం ఎంత క్రూరంగా నియంత్రిస్తుందో వెల్లడించి సవాలు చేశారు. చివరకు ముస్లిం మతవాదుల ‘ఫత్వా’ కు గురైనారు. ఆమె ప్రాణాలకు ముస్లిం ముల్లాలు 50వేల టాకాల వెలను కట్టారు. మరణశిక్ష విధించి, పాశ్చాత్య దేశాలలో (స్వీడన్) తలదాచుకో వాల్సిన దుస్థితిని ఆమెకు దాపురించేట్టు చేశారు. మత తత్వానికి తలొగ్గటం లాంటి లజ్జా కరమైన పనులకు పాల్పడకుండా ఆమె ఎదిరించి నిలిచారు.
తస్లీమా నస్రీన్ చేసిన ముఖ్యమైన నేరం `లజ్జ’ నవల రాయటం!
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులకు జీవిత భద్రత లేదు, అడుగడుగునా అవమానాలకూ, అణచివేతలకూ బలి కావటంతప్ప! నోరెత్తి ఎదిరించే స్థితి కూడా లేదనీ ‘లజ్జ’ నవల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పటం ఆవిడ చేసిన తీవ్రమైన నేరంగా బంగ్లాదేశ్‌లో మతవాదులూ, ప్రభుత్వమూ భావించాయి.
1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేయబడిన వెంటనే బంగ్లాదేశ్‌లో చెలరేగిన ముస్లిం మతోన్మాదపు దాడులు అక్కడి మైనారిటీలయిన హిందువులపై ఎలా సాగినాయో, ఒక కుటుంబం ఉదాహరణగా లజ్జ నవలలో చిత్రించా రు. బెంగాలీ భాషలో రచించిన ఈ నవల ఒక్క నెలలోపునే మూడుసార్లు ప్రింటయి లక్షలాది కాపీలు అమ్ముడుపోయింది. అవి మరాఠీ, ఇంగ్లీషు భాషలలో అనువాదమైన 3సం॥ల తర్వాతైనా బి.వి.ఆర్. అనువదించగా తెలుగువారికి అందుబాటులో కొచ్చింది. ఇప్పటికే ఆ నవల పై సమీక్షలు, వ్యాఖ్యానాలూ చాలా వచ్చి వున్నాయి. అయినా క్లుప్తంగా. కధను చెప్పకుందాం!
***
సురంజన్ దత్తా 33 సం॥ల నిరుద్యోగ యువకుడు. రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవాడు. అతని తండ్రి సుధామయి, తాత సుకుమల్ దత్తా. వీరంతా మైమెన్‌సింగ్ పట్టణంలో సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినవారు, తాము పుట్టిన నేలనూ గాలినీ, దేశాన్నీ మనుషుల్నీ విపరీతంగా ప్రేమించినవారు.
1947లో భారత పాకిస్తాన్ విభజన సమయంలో పెద్ద ఎత్తున మతకలహాలు చెలరేగిన తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుండి హిందు కుటుంబాలూ, పశ్చిమ బెంగాల్ అస్సాంల నుండి ముస్లిం కుటుంబాలు సరిహద్దులు దాటి కాందిశీకుల్లా వెళ్ళి పోయినా, సుకుమల్ దత్తా కుటుంబం మాత్రం తమ దేశాన్ని విడిచిపెట్టలేదు. తాము బెంగాలీలమనే అనుకున్నారు. ఇంకా ఎక్కువగా మానవులమనుకున్నారు. వారి కుటుంబం ఏనాడూ ‘మతం’తో ‘ఐడెంటిఫై’ (గుర్తింపు) కాలేదు. కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావం కొంత వున్నట్టుగా రేఖామాత్రంగా అర్ధమయేట్టు రచయిత్రి చేశారు. నిజమైన సెక్యులర్ (లౌకిక) జీవనం, మానవ సంబంధాలూ నెరిపారు. అయినా వీరక్కడ మైనారిటీ లయిన కారణంగా కొందరు ముస్లిం స్వార్థపరుల దౌర్జన్యానికి గురయ్యారు. దానితో ఉన్న ఆస్తిపాస్తులను అయినకాడికి అమ్మేసుకుని, పుట్టి పెరిగిన ఊరుని బలవంతంగా వదిలి, ఢాకా నగరానికి చేరుకోవాల్సి వస్తుంది.
1952లో తూర్పు పాకిస్తాన్‌లో ఉర్దూను జాతీయ భాషగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా బెంగాలీలు పెద్ద ఉద్యమం లేవదీశారు. అందులో సురంజన్ తండ్రి డాక్టర్ సుధామయి చురుకుగా పాల్గొన్నాడు.
1971లో యాహ్యాఖాన్ (పాకిస్తాన్) మిలిటరీ నియంతృత్వానికి వ్యతిరేకంగా తుపాకీ పుచ్చుకుని యుద్దం చేయలేకపోయినా గట్టి ఉద్యమకారుడుగా నిలబడి పోరాడి చిత్ర హింసల పాలయ్యాడు. పాకిస్తానీ సైనికుల మతోన్మాద తత్వానికి ఘోరంగా అవమానింప బడ్డాడు. అయినా తన మాతృదేశాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. స్వతంత్ర బంగ్లాదేశ్ స్థాపన జరిగినందుకు మిక్కిలి ఆనందపడ్డాడు.
ఆ యుద్ధంలో పాకిస్తాన్ మిలటరీకి మద్దతుగా నిలిచి ఘోర హత్యాచారాలుగావించిన “జామాతీ” మత నాయకులు అధికారులు ఓటమి పాలయి, పాకిస్తాన్ పారిపోయి, షేక్ ముజుబూర్ రెహమాన్ హత్యానంతరం (1975 ఆగస్టు 15) నిదానంగా బంగ్లాదేశ్‌లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం మత నాయకత్వాలలో మిలటరీ, నిరంకుశాధికార వర్గం, ఒకనాడు దురాగతాలకు పాల్పడినవారు తగు మోతాదులో ప్రవేశం పొందారు. (ఈ ముఖ్యమైన అంశాన్ని తస్లీమా నస్రీన్ నవలలో పేర్కొన లేదు) ఆ నాటి నుండి తిరిగి మతోన్మాదం కొత్త బుసలు కొట్టటం మొదలయింది.
“భారత దేశంలో హిందూ మతోన్మాదం పెచ్చరిల్లే కొద్దీ బంగ్లాదేశ్‌లో ముస్లిం మతోన్మాదం ప్రజ్వరిల్లుతూ వచ్చింది”. 1990లో జరిగిన మతోన్మాదపు దాడులకు సురంజన్ అతని కుటుంబ సభ్యులు, తమ ముస్లిం స్నేహితుల ఆదరణ పరిరక్షణలో క్షేమంగా ఉన్నారు. మతోన్మాదం పెరిగిన కొద్దీ డాక్టరు సుధామయి ప్రాక్టీసు క్షీణిస్తూ వుంటుంది. ఆర్థికంగా కూడా యిబ్బందులు పడే పరిస్థితుల్లోకి జారిపోతూ వుంటారు. తండ్రికి గుండెపోటు. సురంజనేమో నిరుద్యోగి.
1992 డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రిమసీదు విధ్వంసాన్ని అమెరికన్ టి.వి./ఎ.ఎన్.ఎన్ (ANN) ఛానెల్ ప్రపంచమంతా కళ్ళకు కట్టినట్టు ప్రసారం చేసింది. భారత దేశంలో ముస్లిం ద్వేషాన్ని పెంచి రాజకీయ లబ్దిపొందుదామని బి.జె.పి.వారూ, వారి మూలవిరాట్టులూ ఎలా ప్రయత్నించారో, అలాగే బాబ్రీ విధ్వంసానికీ బంగ్లా హిందువు లకు ఏ సంబంధం లేకపోయినా, బంగ్లాదేశ్‌లో ముస్లిం మతోన్మాదులు అక్కడి హిందువు లపై, దేవాలయాల పై తీవ్రమైన దాడులూ విధ్యంసాలూ సాగించారు. బంగ్లాదేశ్ లోని 12 కోట్ల జనాభాలో 2 నుండి 2.5 కోట్ల మంది హిందువులుంటారు. ఈ నవల ప్రకారం వాళ్ళు ఇండియాకు పారిపోవటానికైనా ప్రయత్నించారు కానీ ఎదురు తిరిగి నిలబడటానికి ప్రయత్నించలేదు.
ఏనాడూ మతం పట్లా, దేవుని పట్లా విశ్వాసం చూపని డాక్టర్ సుధామయి (ఢాకా) ఇంటి పైన కూడా దాడి జరిపి, విధ్వంసం చేసి ఆయన కూతురు ‘మాయ’ను ముస్లిం మతోన్మాదపు రౌడీలు ఎత్తుకు పోతారు. ఆ సమయంలో ఇంటిలో లేని సురంజన్ తన ముస్లీం స్నేహితుల ద్వారా మాయ కోసం ఎంతో వెతికి విఫలమవుతాడు. తను పుట్టి పెరిగిన దేశంలో తానొక కాందిశీకుడుగా బతకటానికి మానసికంగా వ్యతిరేకిస్తున్న సురం జన్, తన తండ్రి ద్వారా తను నమ్మిన, అలవరచుకున్న ఒక్కొక్క విశ్వాసాన్నే కోల్పోతూ వుంటాడు. తన ముస్లిం స్నేహితులను కూడా అనుమానిస్తాడు. ఒక్క మసీదునైనా ధ్వంసం చేయలేని తమ లాంటి వారి అశక్తతను అసహ్యించు కుంటాడు. హేతు, తర్క బద్ధ జ్ఞానాన్నంతా కోల్పోతాడు. ఒక ముస్లిం వేశ్యకు డబ్బులు ఎరచూపి, తన గదికి తెచ్చుకుని, అమానుషంగా హింసించి, రేప్ చేశానని మిధ్యా సంతృప్తిని పొందుతాడు. చివరికి తన మీదా, తను పుట్టిన దేశం మీద, అక్కడి మతతత్వ వాతావరణం మీదా ద్వేషం, అసహ్యం కలిగి, బంగ్లాదేశం వదిలి ఇండియా పారిపోవటానికి తండ్రిని కూడా వొప్పిస్తాడు.
1947 నుండి సమీప బంధువులు పదేపదే ఘోషించినా, బోధించినా ఇండియాకు పోవటానికి డాక్టరు సుధామయి నిరాకరించాడు. ఇంతకూ “ఇక్కణ్మించి పారిపోయి వీళ్ళంతా సాధించేదేమిటో” సుధామయికి అర్ధం కాలేదు. ఈ బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య తగ్గిన కొద్దీ ఇక్కడ మిగిలిన కొద్ది మంది హిందువులు మరింత హింసకు గురిచేయ బడతారు. నిజానికి, ఈ వెళ్ళిపోతున్న వాళ్ళకూ బంగ్లాదేశ్లో మిగిలిపోయిన వాళ్ళకూ , ఇద్దరికీ అది నష్టమే. “ఈ దేశంలో నివసించే హిందువులు ఎంత హింసననుభవించి చని పోయారో, అదంతా ఇదివరకటి, ఇప్పటి ఇండియాలోని హిందువుల పాపాలకి ప్రతిఫలం” (పేజీ 210) అని బలంగా భావించిన సుధామయి, శారీరకంగా అనారోగ్యం పాలయి వుండటం, కూతురు పదేపదే గుర్తురావటం, కొడుకు మనోదౌర్బల్యానికి గురవటంతో, ఇండియాకు పోవటానికి, గత్యంతరం లేక అంగీకరిస్తాడు.
ఈ దిగజారుడు పర్యవసానం ఎవరికి లజ్ఞ్జాకరమైనది? హిందూ-ముస్లిం మతోన్మాదు లకు కాదా? భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు కాదా?
భారతదేశం వెలుపల ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశాలలో జీవిస్తున్న హిందు వులు కోట్లాది మంది వున్నారు. బాబ్రీమసీదు కూల్చివేత ద్వారా పైన పేర్కొన్న కోట్లాది హిందువుల భద్రత పట్ల సంపూర్ణమైన నిర్లక్ష్యాన్ని హిందూ మత తత్వవాదులు ప్రదర్శిం చారు.
బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల పై దాడుల ద్వారా భారతదేశంలో వున్న 12 కోట్ల ముస్లిములను హిందూ మతోన్మాదుల దయాదాక్షిణ్యాలకు ముస్లిం మతతత్వ వాదులు వదిలేశారు.
జీవిత అభద్రతలకు మతకారణం కూడా వచ్చి చేరగానే, అన్నిరకాల అభద్రతల మొత్తం మతద్వేషంగా, మతోన్మాదంగా రూపాంతరం చెందుతుంది. మత కలహాల చరిత్ర నిండా మనకు ఇదే లభ్యమవుతుంది. దోపిడి పాలక వర్గాలలోని ఆధిపత్య శక్తులు తమ భావజాలం ద్వారా, విపరీత విద్వేష ప్రచారం ద్వారా, తమ నిర్మాణాల ద్వారా సాధారణ ప్రజానీకాన్ని కూడా మతోన్మాదులుగా మారాల్సిన అభద్రతా భావాన్ని కలిగిస్తారు. మత ఘర్షణలూ, కలహాలూ రౌడీ మూకలకు విచ్చలవిడి ఆట విడుపుగా ఉంటాయి.
“లజ్జ” నవలలో బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత 13 రోజుల పాటు డాక్టరు సుధామయి కుటుంబం పడిన భౌతిక, మానసిక వేదనను, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరిగిన దాడులను తస్లీమా నస్రీన్ చిత్రించారు. సరిగా అదే కాలంలో భారత దేశమంతా కర్ఫ్యూలు, మతోన్మాదపు దాడులు–ప్రత్యేకించి సూరత్, అహమ్మాదా బాద్, భోపాల్‌లలో ముస్లిం కుటుంబాల పై, మహిళల పై పధకం ప్రకారం హింసాకాండ రేప్‌లు జరిగాయి.
ఈ పరిణామాల క్రమం బంగ్లాదేశ్ పై ముస్లిం మతోన్మాదుల రాజకీయపట్టు పెరిగింది. భారత దేశంలో బి.జె.పి. అధికార సింహాసనాన్ని కొద్ది రోజులైనా అధిష్టించ గలిగింది. కానీ ఘోరంగా నష్టపోయింది భారత దేశంలో ముస్లిములూ, బంగ్లాదేశ్‌లో హిందువులు మాత్రమే.
భారతదేశ విభజన తర్వాత 1980వ పడిలో ఉపఖండంలో మతోన్మాదం తిరిగి జడలు విప్పుకుంది. దీనికి కారకులూ, బోధకులూ ఆయా దేశాల్లోని పాలకులే! స్వాతంత్రోద్యమ ఫలాలు ఉపఖండంలో 100 కోట్లకు పైగా గల హిందూ, ముస్లిం- సిక్కు మతాలకు చెందిన పేద, మధ్య తరగతి వర్గాలకు అందలేదు. వారిది నిత్య జీవన్మరణ సమస్య. పాలకుల వాగ్దానాల భ్రమలు వీడిపోతున్నాయి. గతంలో లాగా చిట్టి పొట్టి సంస్కరణలు కూడా చెయ్యలేని పరిస్థితి దాపురించింది. సర్వవ్యాపిత ఆర్థిక, రాజకీయ సంక్షోభం. రాజకీయాల్లో రౌడీల, గూండాల పెత్తనం, అక్రమ సంపాదనాపరుల ఆధిపత్యం పెచ్చరిల్లింది. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో ముందు వెనుకలుగా ఉపఖండమంతా ఇదే పరిస్థితి సాగుతోంది.
ప్రజల యొక్క అసంతృప్తి, నిరసన, ఆందోళనా, పోరాటాలను పక్కదారి పట్టించా ల్సిన ఆవశ్యకత ఆధిపత్య శక్తులకు అత్యవసరమైంది. గతంలో బ్రిటీషు సామ్రాజ్య వాదులు స్వాతంత్రోద్యమాన్ని ఛిన్నాభిన్నం చేయటానికి వేసిన నీచపుటెత్తుగడలే ఉపఖండంలోనీ మూడు దేశాల్లో గల బలాఢ్య వర్గాలకు (సంఖ్య రీత్యా వారు చాలా మైనారిటీలు) మార్గమైంది.
వందకోట్ల పేద మధ్య తరగతి వర్గాల ప్రజల మధ్య అనుమానం, అసూయ, విద్వేషం-చివరికి నిర్మూలనా స్థాయికి అవి చేర్చబడ్డాయి. మతతత్వానికి మతతత్వమే పరిష్కారమనే విధంగా భావించే సాంస్కృతిక భావజాలవ్యాప్తి జరిగింది. అది మనిషిలోని హేతుజ్ఞానాన్ని చంపుతుంది. హేతుజ్ఞానం కోల్పోయిన మనిషి మృగప్రాయుడవుతాడు. తనకు తెలియకుండా చిక్కుకున్న లేక తన చుట్టు అల్లబడిన విషవలయంలో మనిషి తనకు తాను దూరమై అమానవీయుడుగా ప్రవర్తిస్తాడు. ఇతరులు అలాగే ప్రవర్తించే పరిస్థితులు కల్సించబడతాయి. మతతత్వం యొక్క అంతిమ పర్యవసానం ఇదేనని “లజ్జ” నవల ద్వారా తస్లీమా నస్రీన్ విస్పష్టంగ ప్రకటించింది. మతతత్వం లజ్ఞాకరమైన దిగా ఆమె ఘోషించింది.
‘లజ్జ’ నవల బంగ్లాదేశ్‌లో మైనారిటీలయిన హిందువుల పై సాగుతున్న వివక్షతో పాటు, దాడుల గురించినది కనుక , భారతదేశంలో హిందూ మతోన్మాదులు తమ చర్యల సమర్దనకు ఆ నవలలోని అనేక భాగాలను తమకు అనుకూలంగా మలుచుకుని వినియోగించుకున్నారు. ఈ పుస్తకం మరాఠీ అనువాదమూ, కొన్ని తెలుగు పత్రికలు ప్రచురించిన ముస్లిం మతోన్మాదుల దాడుల వివరాల వెనుక, ఇక్కడి మతోన్మాద చర్యల్ని సమర్దించుకోటానికీ! ఇక్కడ ముస్లిం మతద్వేషాన్ని పెంచటానికే!!
తస్లీమా నస్రీన్ బి.జె.పి, విహెచ్‌పి. వారి హిందూమతోన్మాదాన్ని నిర్ద్వందంగా ఖండించినా, వారు ఆవిడ నవలను వాడుకున్నారు. అలా చేయటం వారికి లజ్జాకరంగా లేకపోవటం ఆశ్చర్యం కాదు.
‘లజ్ఞ’ నవలంతా ప్రధానంగా డాక్టర్ సుధామయి కొడుకు సురంజన్ మనోగతం పై నడుస్తుంది. అతని తండ్రి, తల్లి, చెల్లెలు ఆలోచనలు కూడా నవలలో చోటు చేసుకుం టాయి. ఈ పాత్రల స్వీయాత్మక తత్వం (subjectivism) నవలలో వ్యక్తమవుతుంది. ఈ కారణంగా మిగిలిన పాత్రలూ, స్వభావాలూ, ప్రవర్తనలన్నీ పై నలుగురి ఆలోచనల, స్వభావాల, మార్పుల కనుగుణంగానే పాఠకులు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తం మానవ సంబంధాలను సంకుచిత కారణాలలో ప్రదర్శించటంగా రూపొందింది. అదే ఈ నవలలోని ప్రధాన బలహీనత. పై తరహా శైలిని అనుసరించటమే కాక జర్నలిజం తరహా రిపోర్టింగ్ వలె నవల అక్కడక్కడ అనిపిస్తుంటుంది.
మతతత్వం యొక్క ఆర్థిక రాజకీయ మూలాల్లోకి తస్లీమా నస్రీన్ వెళ్ళలేదు. చాలా మందికిలాగానే మతతత్వానికి మతమే కారణమని ఆమె కూడా భ్రమపడింది.
సమాజంలో ఆధిపత్య శక్తులు తమ పట్టుని కోల్పోతున్న పరిస్థితులలో, దాన్ని నెలకొల్పుకోవడానికి మతాన్ని వాహకంగా (సాధనంగా) వినియోగించుకునే రాజకీయమే మతతత్వం. పరస్పర విద్వేషాన్ని వ్యాప్తి చేసే మతతత్వాల రూపాలు తేడాగా వున్నా వాటి సారం ఒకటిగానే వుంటుంది. తాత్వికంగా, భౌతికంగా వాటి పునాదులు కూడా ఒకే విధంగా వుంటాయి. కానీ భిన్నదేశాలలో మెజారిటీ మైనారిటీల పేర్లలో భేదం వుండ వచ్చు. ఆ కారణంగా … సైద్దాంతికంగా మతతత్వాలన్నీ ఓడించవలసినవే అయినా, స్థానికంగా వాటి భౌతికశక్తి యొక్క వాస్తవ స్థితిగతులను బట్టి దాడి-రక్షణ (affence-defence) స్థాయిలలో అవి ఉండినప్పుడు ‘దాడి’ చేసే మతతత్వం పై మన గురి హెచ్చుగా వుండటం సహజమేకాక అవసరం కూడా అవుతుంది.
అందుకే భారతదేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాదులు హిందూ మతం పేరిటసాగు తున్న మతతత్వానికి వ్యతిరేకంగా నిలబడితే బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లలో ఇస్లామిక్ మత తత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. దాడి చేయగల స్థితిలో వున్న మతతత్వం లౌకిక వాదానికీ, దాని విలువలకై కృషి చేసే వారి పై సైద్ధాంతికంగా, భౌతికంగా తీవ్ర ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ వుంటుంది.
మైనారిటీలను, సాధారణ ప్రజలను మనుషులుగా కాకుండా కేవలం ఓటర్లుగా మాత్రమే పరిగణించే దొంగ లౌకికవాదులను సాకుగా చూపి, మొత్తంగా లౌకికవాదం పైనే మతతత్వవాదులు దాడి చేస్తూంటారు.
మొత్తంగా భారత ఉపఖండాన్ని ఒకటిగా పరిగణించి, పై అవగాహనను అన్వయిం చుకుని, సాహితీ రూపాలలో రచయితలు వ్యక్తీకరించాలి. ఏ మతతత్వమైనా సైద్ధాంతి కంగా ఒకటే అయినా వాటి భౌతిక శక్తిసామర్ధ్యాలు, ప్రజా ఉద్యమపు ప్రధాన దాడి (టార్గెట్)ని నిర్ణయిస్తాయి. లజ్జ నవల ద్వారా పాఠకులకు పై అవగాహనను అందించే అవకాశం వుండీ తస్లీమా అందుకు పూను కోలేదు.
అలాగే — దేవుడూ…భక్తీ…మతమూ..మతావేశమూ…మతతత్వమూ వీటి యొక్క స్వభావాలూ, పరిధులూ భిన్నంగా వుంటాయి. సామాజిక దృక్పధం వున్న వారు వాటిని వేరుచేసి చూడాలి. మత విద్వేషతత్వపు పొరలు కమ్మిన వారి పైనే దాడిని ఎక్కుపెట్టాలి. కేవలం దేవుడు-భక్తి-.మతం పట్ల మాత్రమే నమ్మకం కలిగిన వారిని మతతత్వానికి వ్యతిరేకంగా కలుపుకు వచ్చే ప్రయత్నం చేయాలి. మతావేశపరుల్ని (మతతత్వపు) శత్రు శిబిరంలోకి పోనివ్వకుండా తటస్థం చేసుకోవాలి. అందుకే అందరి పైనా ఒకే స్థాయిలో దాడి చేయకూడదు. మతంపట్ల నమ్మకం గల వారందరినీ మతత్వవాదులుగా పరిగణిం చి, వారిని కూడా తిట్టి రెచ్చగొట్టి మతతత్వం కాంపులోకి నెట్టి శత్రు బలాన్ని పెంచ కూడదు. ఈ నవల ద్వారా పాఠకులకు పైరకపు అవగాహన యివ్వటానికి అవకాశం వున్నా రచయిత్రి వినియోగించు కోలేకపోయారు.
సురంజన్ చురుకుగా రాజకీయాల్లో పాల్గొన్నాడని చెబుతుంది. కానీ అతని యొక్క రాజకీయ దృక్పధం… కమ్యూనిస్టు అభిమానిగా అనిపించేట్టు మాత్రమే వ్యక్తపరుస్తుంది. అస్పస్టంగానే విడిచిపెడుతుంది. పాలకవర్గ రాజకీయాల్లోని డొల్లతనాన్ని, మతతత్వాన్నీ ఎత్తిచూపుతూ మొత్తంగా రాజకీయాలే అటువంటివనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది.
బహుశా తస్లీమా యొక్క రాజకీయ అవగాహనా పరిధి కూడా సురంజన్ స్థాయిలోనే వుండి వుండవచ్చు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలలోని మతతత్వ శక్తులను వేరువేరుగా ఓడించ లేము. మళ్ళీ మళ్ళీ, ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతారు. కనుక మొత్తంగా ఉపఖండాన్నే ఒక యూనిట్‌గా పరిగణించి ఆలోచన చేయవలసి వుంటుంది. చరిత్రా, సంస్కృతి, వారసత్వం కూడా అంతర్వాహినిగా వినియోగపడే మేరకు వెలికి తీయాలి. మొత్తం ఉపఖండంలోని లౌకిక ప్రజాస్వామికవాదులు ఒక వేదిక పైకి వచ్చే ప్రయత్నం సాగాలి. మతతత్వానికి ప్రధాన భూమికలుగా వున్న ఆర్దిక రాజకీయ వ్యవస్థల పునాదుల్లో మార్పు తెచ్చే ప్రయత్నమే లౌకికి ప్రజాస్వామిక భూమికల్ని బలోపేతం చేస్తుంది. సాధారణ ప్రజల తక్షణ, దీర్హకాలిక జీవన సమస్యల పరిష్కారానికై జరిపే నిజాయితీతో కూడిన కృషే వారిని కుల, మతాల అడ్డుగోడల్ని అధిగమించి ఐక్యం చేయగలుగుతుంది.
ఉపఖండంలో గత 50సం॥లకు పూర్వం ఉండిన సామాజిక వ్యవస్థలో మౌలిక మార్పు సంభవించలేదు. బ్రిటీషు సామ్రాజ్యవాదులు 1905లో జరిపిన బెంగాల్ విభజనకు వ్యతిరే కంగా ఈ శతాబ్దారంభంలో ప్రారంభమైన మతాతీత ప్రజావెల్లువ దాని నిజమైన ఫలితా ల్ని ఇంకా చూడలేదు. కనుకనే వెంటనే 1906లో పుట్టిన ముస్లింలీగు, 1909లో ఒక రాష్ట్రం లో ప్రారంభమై 1915లో దేశ వ్యాపితమైన హిందూ మహాసభ—వాటి వాటి రూపాలు మార్చుకున్నా, ఆనాటికంటే నేడు బలోపేతమై పచ్చి అభివృద్ది నిరోధక పాత్రను ఇంకా తీవ్ర స్థాయిలో పోషిస్తున్నాయి. ఫాసిస్టు తత్వాన్నీ, అమానవీయతనూ పెంచి పోషిస్తు న్నాయి. మతంకంటె భాషా, ప్రాంతమూ, సంస్కృతే బలీయమైనవని బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడటమే ఒక రుజువుగా ఉండినా, మతవాదం వినిపించుకోదు. 20వ శతాబ్దపు ఆరంభంలో మొదలయిన ఉపఖండ మతతత్వ చరిత్రకు శతాబ్దాంతానికైనా ముగింపు పలకవలసి ఉంది.
ఈనాడు ఎంతో ఆత్మ విశ్వాసంతో, నిబద్ధతతో కలం పడితే గాని రచయితలు నిలబడలేని స్థితులు దాపురించాయి. తన అవగాహనా పరిధిలో తస్లీమా నస్రీన్ ఇస్లాం
మత ఛాందసత్వానికి వ్యతిరేకంగా కలం పట్టారు. ఎన్నో దుష్ప్రచారాలనీ, ఆంక్షలనీ అణచివేతలనూ తట్టుకుని మతతత్వవాదులకు తలవంచకుండా దూర దేశాలకు ప్రవాసం పోవలసి వచ్చినా ధైర్యంగా నిలబడి రచనలు సాగిస్తున్నారు. ఆవిడ కొచ్చిన పేరు ప్రతిష్టలను ‘లజ్జ’ నవల ద్వారా హిందూ మతతత్వవాదులు వినియోగించుకో కుండా చూసుకోవలసిన మరొక బాధ్యత ‘ లౌకికవాదుల పైన అదనపు కర్తవ్యమై ఉంది.
చివరగా… ఒక్క మాట! ప్రచురణలోని అనువాద లోపాలూ, అక్షర దోషాల గురించి ప్రస్తావించకపోవటమే ఉత్తమం.
సవివరంగా వ్రాశారు,అభినందనలు