నా జీవన యానంలో- రెండవభాగం- 37
-కె.వరలక్ష్మి
తామరాకు మీది నీటి బిందువులా
తొణికిసలాడుతోంది జీవితం
ఎప్పుడు జారి మడుగులో కలుస్తుందో తెలీదు
ఉదయం పరిమళాలొలికిన
జాజీపువ్వు తొడిమలోని
మంచు స్ఫటికం ఇప్పుడేది ?
మా గీత నన్ను చూడడానికి వస్తూ నోకియా ఫోన్ తెచ్చింది. 999రూ||తో ప్రీపెయిడ్ కార్డ్ వేయించి ఇచ్చింది. ఆ రోజు 9.1.2006. అప్పటి నుంచీ నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టేను. మోహన్ పెన్షన్ 40 వేల వరకూ తన ఎకౌంట్లో బాంక్ లో ఉండి పోయింది. 3నెలలలోగా ఆ డబ్బు బైటికి తీసెయ్యాలన్నారు బేంకువాళ్ళు. దాని కోసం లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అడిగారు. MRO ఆఫీసులో అప్లై చేసాను. అక్కడి RI నా అప్లికేషన్ అడుగున పెట్టేసి రేపు-మాపు అని తిప్పడం మొదలు పెట్టేడు. MRO సెలవులో ఉన్నాడు. కొన్నాళ్ళు తిరిగేక 5వేలు లంచం అడిగేడు. అంత ఇవ్వలేను అన్నానని నా అప్లికేషను మాయం చేసేసేడు. ఎండనక కొండనక తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది. చివరికి మాబంధువొకాయన ద్వారా పెద్దాపురo RDకి చెప్పించాను. ఆయన కలుగజేసు కుని చివాట్లేస్తే కళ్ళు మూసుకుని సంతకం పెట్టి ఇచ్చేడు.
అలాగే మా ఊరి ట్రెజరీ ఎకౌంటెంట్ ఇబ్రహీమ్ బేంక్ నుంచి డబ్బు వెనక్కి తెప్పించి ఇచ్చేటప్పుడు 4 వేలు తీసుకుని ఇచ్చేడు. నాకు ఫేమిలీ పెన్షన్ శాంక్షన్ అయినప్పుడు 3 వేలు తీసుకున్నాడు. నా పెన్షన్ మూడు వేలు. అతనున్నళ్ళూ ప్రతీ సంవత్సరం లైవ్ సర్టిఫికెట్టు ఇచ్చినప్పుడల్లా ఆ నెల పెన్షన్తీసేసుకునేవాడు. అది ట్రెజరీ కాబట్టి వాళ్ళు అడిగినంతా ఇవ్వకపోతే పెన్షన్ ఆపేస్తారు అన్నారు పెన్షనర్స్ అసోసియే షన్ వాళ్ళు. గవర్నమెంటు ఆఫీసుల్లో అలాంటి జలగలుంటాయి.
చితా దహతి నిర్జీవం – చింతా దహతి జీవనం – అన్నాడు సుభాషిత కర్త. అది నా వల్ల అవుతుందా చింతలు తొలగించుకోవడం. forget and forgive అనుకుంటే మంచిదే మరి!
చినుకు రాజగోపాల్ నుంచి ఫోనొచ్చింది, చినుకు – అంబికా కథల పోటీల్లో నా కథ ‘ప్రత్యామ్నాయం’ మొదటి బహుమతి పొందిందని, ఆ బహుమతిప్రధాన సభ 2006 మార్చి 12న విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఆ సభకు కారామాస్టారు, పెద్దిభొట్లు, భమిడిపాటి జగన్నాధరావు గారు వక్తలుగా వచ్చారు. మొదటిసారి ఆ పెద్దల పక్కన కూర్చోవడం, సభా నిర్వహణ చాలా బాగా జరిగింది. ఆ కథకు వచ్చిన బహుమతి సొమ్ము 3 వేలు కథా నిలయం కోసం కారా మాష్టారికి ఇచ్చేసాను స్టేజిమీదే. అంతకు ముందొక 5 వేలు పంపేను. కథలన్నిటినీ ఒకచోట చేర్చి కథా రచయితల కోసం పాటుపడుతున్న కథానిలయానికి ఎంతిచ్చినా తక్కువే! ఆ మర్నాడే నార్తండియా టూర్ కి వెళ్తున్న మా కోడలి అమ్మానాన్నలు, మా పెద్ద ఆడపడుచు దంపతులతోబాటు నాకూ టిక్కెట్లు కొన్నాడు మా అబ్బాయి. మార్చి 13 న 10.30 PM కి సికింద్రాబాద్ -పూనా ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఎక్కేం. 14 పగలూ, రాత్రీ కూడా ట్రెయిన్ లోనే ఉండి 15 ఉదయం వారణాసిలో దిగేం. ఆటోల్లో ఆంధ్రా ఆశ్రమానికి వెళ్తే అక్కడ రూమ్స్ దొరకలేదు. ఆ చుట్టుపక్కల అన్ని ఇళ్ళలోనూ రూమ్స్ అద్దెకి ఇస్తారని తెలిసింది. రోజుకి గదికి 100 రూ|| చొప్పున రూమ్స్ తీసుకుని (రూమ్స్ అంటే ఉత్త రూమ్సే . మంచాలు వగైరాలేవీ ఉండవు) బేగ్స్ రూమ్ లో పెట్టేసి 8AMకి గంగ వొడ్డుకి వెళ్ళేం. ఘాట్లన్నీ చూపిస్తానన్న లక్ష్మణ్ అనే బోట్ డ్రైవర్ కి మనిషికి 70 రూ॥ చొప్పున ఇచ్చి అతని పడవలో ప్రయాణించి గంగా ఘాట్లన్నీ చూసేం. గంగ అవతలి వొడ్డు కెళ్ళి నదీస్నానం చేసి దీపాలు, తర్పణాలు సమర్పించేం. 11 AM కి అంతా రూమ్స్ కి తిరిగొచ్చి మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో స్నానాలు చేసి రెడీ అయ్యాం. కాని, ఆ రోజు హోలీ కావడం వల్ల మధ్యాహ్నం రెండు దాటే వరకూ బైటికి అడుగు పెట్టలేక పోయాం. ఒకటే రంగులు చల్లుకోవడం, అంతకన్నా ముఖ్యంగా ఆ వీధి చివర ఓ మసీదు ఉంది. మతాలకి సంబంధించిన గొడవలు అవుతాయేమోనని ఆ ఇంటివాళ్ళు మమ్ముల్ని భయపెట్టేరు. ఉదయం బైటికెళ్ళేటప్పుడే వీధుల్లో హోలీ మంటలు, రంగుల సందడి ఎక్కువగానే ఉంది. మా విడిదికి దగ్గర్లో చిన్న గల్లీలో హనుమాన్ టెంపుల్ ఉంది. దాని ఎదుట నాలుగడుగుల దూరంలో అరుగు మీద ఒక ఆంధ్రావాలా చిన్న టీకొట్టు నడుపు తున్నాడు. ఉదయం వెళ్ళేటప్పడు మేం అక్కడే కాఫీలు తాగేం. అప్పటికప్పుడు ఫ్రెష్ గా మరిగించిన పాలతో ఇతను కలిపే కాఫీ, టీలు ఎంత బావున్నాయంటే నది నుంచి తిరిగొచ్చేటప్పుడు అదే గల్లీ నుంచి వచ్చి కడుపునిండా ఇడ్లీలు, పూరీలు తిన్నాం. మేం రూమ్ కి వచ్చేక అనుకోకుండా వర్షం పడింది. మధ్యాహ్నం రెండుగంటలకి బైటికి వచ్చి చూస్తే వీధులన్నీ మురికితో నిండిపోయాయి. సన్నటి గల్లీలు, చెత్త, దుర్వాసన. అపరిమి తంగా వీధుల్లో తిరుగుతున్న ఆవుల్ని చూసి ఉదయమే ఆశ్చర్యం కలిగింది. అవి వేసే పేడ అడుగడుగునా. అలా వీధుల్లో ఉన్న ఆవులకి వాటి యజమానులో కాదో తెలీదు అక్కడే చెంబుల్లోకి పాలు పిండుకుని వెళ్తున్నారు. తమాషాగా రెండుగంటల వేళకూడా పాలు పితుకుతున్నారు. ‘అయ్యో, కానీ ఇంత అశుభ్రంగా ఉందేమిటి.’ అన్పించింది.
విశ్వేశ్వరాలయంలోకి వెళ్ళే జనాలు బైట దుకాణాల్లో అమ్ముతున్న చిట్టి పిడతలలోని పాలు, పెరుగు పట్టుకెళ్ళి లింగాకారం మీద ఒంపుతున్న్నారు. అవి వెంటనే బైటికి పోయే మార్గంలేక ఆలయంలోపలా మురుగువాసన. అక్కడి నుంచి విశాలాక్షి, అన్నపూర్ణ, కాల భైరవ ఆలయాలకు వెళ్ళేం. శంకరాచార్య ప్రతిష్టించిన విశాలాక్షి ఆలయం దూరంగా చిన్న గల్లీలో పాడుపడిన స్థితిలో చీకటిగా ఉంది. మేమైతే వెతుక్కుంటూ వెళ్ళేం కాని అక్కడికి ఎవరూ వెళ్తున్నట్టు లేదు. అందరూ అన్నపూర్ణ గుడికే వెళ్ళి తాము తెచ్చిన గుప్పిళ బియ్యాన్ని పసుపుగుడ్డ మూటలో పూజారికిస్తే ఆయన ఆ బియ్యాన్ని దేవి విగ్రహం ముందు బియ్యం రాశిలో పోసి కలిపేసి తిరిగి కొన్ని బియ్యం ఆ గుడ్డలో పోసి ఇస్తున్నాడు. ఆ సంగతి తెలీని నేనూ , మా ఆడపడుచూ మా వియ్యపురాలిని చూస్తూ నుంచున్నాం. ఇక్కడి నుంచి కాల భైరవుడి గుడి దూరంగా ఉండడం వల్ల ఆటోల్లో అక్కడికి వెళ్ళేం. జనం ఎక్కడ పడితే అక్కడ వెలిగించే దీపాల నూనెతో, హారతుల పొగతో మసిబారి ఉన్న ఆలయంలో కాలభైరవ విగ్రహాన్ని చూడడం కొంచెం భయం కలిగించింది. సింధూరం బాగా పట్టించిన హనుమంతుని విగ్రహ రూపాలు కూడా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. మన వాళ్ళకో చిత్రమైన అలవాటుంటుంది. ఎక్కడ ఎంత మంచి శిల్పం కన్పించినా ఇంత పసుపూకుంకుమా పూసేసి, అరటిపండులో చిన్న ముక్కతుంచి ఆ విగ్రహం మూతికి అంటిస్తారు. అసలు రూపమేమిటో అర్థంకాదు.
ఇదంతా 2006నాటి సంగతి లెండి, ఇప్పడు కాశీ చాలా మారిపోయింది అంటు న్నారు. అవన్నీ చూస్తూ రోజంతా గొప్ప నిరుత్సాహంలో మునిగిపోయిన నాకు ఒక రిలీఫ్, అద్భుతమైన అనుభూతి సాయంకాలం దశాశ్వమేధ ఘాట్ లో లభించింది. గంగానదికి హారతి ఇచ్చే కార్యక్రమం అది, పౌర్ణమి రోజు, గంగకు అవతలి వైపు నుంచి చంద్ర బింబం పైకి వస్తూండగా, ఒక స్టేజి పై నుంచి భజనలు మనసును అనిర్వచనీయమైన అనుభూతి కి లోను చేస్తూండగా తెలీని తన్మయత్వంలో మునిగిపోయాను. అంత జనంలో నాతో ఉన్న వాళ్ళను వదిలేసి ఆ గాయకుణ్ణి చూడడానికి స్టేజి దగ్గరకు వెళ్ళేను. పాతికేళ్ళు కూడా లేని ఆ గాయకుడి పేరు మహేంద్ర అట, మెహదీ హాసన్ గొంతులా మనసులో నిండిపోయే గాత్రం అది. ఆ కార్యక్రమానికి గొప్ప అందం ఆ పాట. ఆ రోజు అతడు గాయకుడిగా రావడం నా అదృష్టం. గానం శిశుర్వేత్తి – పశుర్వేత్తి కదా ! చందమామ నది పైన సగం సగం దోబూచు లాడి ఆకాశంలో నిల్చి కనువిందు చేసేసరికి భజన ఆగి హారతి ప్రారంభమైంది. కర్పూర పరిమళాలు కమ్ముకుంటూండగా శంఖ నాదాల్తో, గంటల శబ్దం తో ఐదు స్టేజీల పై హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ఆ దీపాల వెలుగులో మెరిసి పోయే గంగా నదిని జీవితంలో ఒక్కసారైనా చూసి ఆ అలౌకిక ఆనందాన్ని అనుభూతి చెందాలి అన్పించింది.
రాత్రి బాగా పొద్దుపోయేక విడిదికి వచ్చి నేల మీద దుప్పట్లు పరుచుకుని పడుకు న్నాం. మర్నాడు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి నిన్నటి ఆంధ్రా స్టాల్ కే వెళ్ళి టిఫిన్స్ తిని, రెండేసి కాఫీలు తాగి అతనికి బై, బై చెప్పేసి రూంకి వచ్చి మా బేగ్స్ తీసుకుని రూమ్ వెకేట్ చేసేం. నాలుగడుగులు నడిచే సరికి ఖాళీగా వెళ్తున్న వేన్ ఒకటి కన్పిస్తే మధ్యాహ్నం మేం ట్రెయిన్ ఎక్కే వరకూ మాతో ఉండేలా మాట్లాడేరు. ఆ రోజు మొదట బెనారస్ యూనివర్శిటీ చూసేం. ఆ లోపలి బిర్లా విశ్వేశ్వరాలయం బావుంది. వరసగా సంకట విమోచన హనుమాన్ టెంపుల్, తులసీ రామాయణ్ మందిర్, దుర్గామందిర్ చూసి సారనాథ్ వెళ్ళాం. అక్కడి స్థూపాన్ని, ప్రాచీనకాలం నాటి రావి చెట్టునీ చూసి, అక్కడి పార్క్ లోని కాసేపు విశ్రమించాం. వాళ్ళిద్దరూ బెనారస్ చీరల షాపింగ్ కి వెళ్ళేలా కబుర్లతో ఊరించాడు వేన్ డ్రైవర్. వాళ్ళు కొన్ని చీరలు కొని హైదరాబాద్ పంపించేలా ఏర్పాటు చేసుకున్నారు. రాతితో చెక్కిన చిన్న చిన్న జ్ఞాపికలు తేలికైనవి కొన్నాను నేను. 1.30 PM కి మండుతున్న ఎండలో పరుగులుతీసి ఢిల్లీ వెళ్ళే కాశీవిశ్వేశ్వర ఎక్స్ప్రెస్ ఎక్కేం. మర్నాడు ఉదయం 7.30కి న్యూ ఢిల్లీ స్టేషన్లో దిగేం. అక్కడ ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్, మా ఆడపడుచు రాణి బావగారబ్బాయి మా కోసం స్టేషన్ కి వచ్చి ఉన్నాడు. మొదట మెట్రోలోనూ, కొంత దూరం ఆటోలోనూ ప్రయాణించి రాజేంద్ర ఫ్రెండ్ రవికాంత్ ఉండే ద్వారకాలోని నల్ సంసద్ విహార్ లో ఫ్లాట్ కి చేరుకున్నాం. రవికాంత్ ఫేమిలీతో ఇంటికెళ్ళి ఉండడం వల్ల మమ్మల్ని అక్కడ ఉంచేడు రాజేంద్ర.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.