మిట్ట మధ్యాహ్నపు మరణం- 27

– గౌరీ కృపానందన్

          “ఏమిటి చూస్తున్నారు రాకేష్?”

          “వాళ్ళు వచ్చేశారు.” చిరునవ్వుతో అన్నాడు రాకేష్.

        “ఎవరు వచ్చారు?” భయంగా అడిగింది ఉమ.

        “పోలీసులు” అన్నాడు.“ఎందుకు వస్తున్నారు ఉమా?”

          “నాకు తెలియదు.”

          “నువ్వేగా పిలిపించావు?”

          “నేను పిలిపించానా? ఎందుకు రాకేష్? మీరేం చెబుతున్నారు.“ ఉమకే తన నటన చాలా చండాలంగా ఉందనితెలిసి పోయింది.

          “ఏమీ తెలియనట్లు నటించకు ఉమా. నువ్వు ఆ టెలిగ్రాము చూసావు కదూ.”

          ఉమ మౌనంగా ఉండి పోయింది. ఇతన్నించి ఎలాగైనా తప్పించు కోవాలి. చుట్టూ చూసింది. గదిలో ఎవరూ లేరు. మెల్లిగా గది గుమ్మం దగ్గిరికి వెళ్ళి పోవాలి. రాకేష్ టేబిల్ మీద ఉన్న ఫోర్క్ ని చేతిలో తీసుకున్నాడు. అతన్ని దాటే వెళ్ళాలి. ఎలా?

          “టెలిగ్రాం నేనూ చదివాను. నువ్వూ చదివావు. అవును కదూ.”

          “ఆ టెలిగ్రాం వేరే ఎవరికో వచ్చిందని మీరేగా చెప్పింది.”

          “ఉమా! నా ముందు నటించకు. పోలీసులు వచ్చేసారు. నీకూ తెలుసు. నాకూ తెలుసు. నీ ముఖంలో భయం, కంగారు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. భయపడ కు. నేను నిన్ను ఏమీ చేయను. కానీ వాళ్ళు వచ్చే ముందు ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. సిన్సియర్ గా జవాబు చెప్పు ఉమా. నేను మూర్తిని హత్య చేశానా?”

          ఏమిటిది? ఇలా అడుగుతున్నాడు ఎందుకు? ఉమ అతని వైపు చూసింది.

          “వాళ్ళు వచ్చేలోగా జవాబు చెప్పు ఉమా.”

          “నేను జవాబు చెప్పలేను.”

          “నా గురించి నీకు తెలియదా? నాతో ఇంతకాలం కలిసి మెలిసి ఉన్నావు. నేను మూర్తిని చంపుతానా?”

          “పోలీసులు అలాగే నమ్ముతున్నారు.”

          “నువ్వువాళ్ళని నమ్ముతున్నావు. అంతేనా. మనస్పూర్తిగా చెప్పు.”

          “నేనేమీ చెప్పలేక పోతున్నాను రాకేష్.”

          రాకేష్ లేచాడు. సర్వింగ్ టేబిల్ మీద ఉంచిన కత్తిని తీసుకున్నాడు.

          “నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు కదూ.”

          “ఎవరు వస్తున్నారు? నాకేమీ తెలియదు.”

          “ప్లీజ్ ఉమా! అబద్దాలు వద్దు. నటనలు వద్దు. నిజాయితీగా ఉందాం. నేను నీ దగ్గర ఏదీ దాచకుండా చెప్పాను. ఇప్పుడు నీ వంతు.”

          తలుపుకు అవతల బూట్ల శబ్ధం విన్పించింది. తలుపులు ఎవరో తడుతున్నారు.

          “ఏమయ్యింది? లోపల గడియ పెట్టుకున్నాడా?”

          “లేదు లేదు. మీరు లోపలికి రండి” అన్నాడు రాకేష్.

          డోర్ క్లోసర్ ఉన్నందు వలన తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి.

          చాలా జాగ్రత్తగా ఇనస్పెక్టర్ రాజపాండియన్ లోపల ప్రవేశించారు. ఆయనచేతిలో తుపాకీ ఉంది. రాకేష్ చేతిలో ఉన్న కత్తిని చూసిన ఇనస్పెక్టర్…

          “రాకేష్! కత్తిని కింద పారేయి. లేకపోతే షూట్ చేయాల్సి వస్తుంది.”

          “షూట్?” ప్రశ్నించాడు రాకేష్. “ఎందుకు ఇంత హడావడి? మీకెవరు కావాలి?”

          “రాకేష్! రాకేష్ అంటే నువ్వేగా?”

          “అవును. మీ పేరు?”

          “నా పేరు ఏదైతే నీకు ఎందుకు? చేతిలో ఉన్న కత్తిని క్రింద పారెయ్.”

          “ఇదిగో“ అంటూ కత్తిని టేబిల్ మీద పెట్టేశాడు.

          రాజ పాండియన్ కాస్త ఆశ్చర్యంతో అతన్ని సమీపించారు.

          “భయపడకండి. నేనేమీ చెయ్యను. స్వాభావికంగానే నేను కాస్త మెతక.”

          రాకేష్ ఉమను చూసి నవ్వాడు. ఉమ బిత్తర పోయినట్లుగా అలాగే చూస్తూ ఉంది.

          “విషయం ఏమిటి ఇనస్పెక్టర్?”

          “మీరేనా ఈ చీటీని పంపించింది?” ఉమవైపు చూస్తూ అడిగారు ఇనస్పెక్టర్.

          ఉమ రాకేష్ వైపు చూస్తూ తటపటాయించింది. “అవును” అంది.

          “చీటీ ఏమిటి? నేను చూడవచ్చా?” అడిగాడు రాకేష్.

          “ఇతనేనా రాకేష్?” ఇనస్పెక్టర్ ఉమను అడిగారు.

          “అవును” తల ఊపింది.

          “రండి రాకేష్. వెళదాం.”

          “ఎక్కడికి?’

          “పోలీస్ స్టేషనుకి.”

          “అరెస్ట్ చేస్తున్నారా?”

          “ఆ విషయం మాధవరావు గారు వచ్చాక నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మాతో వస్తే  ప్రాబ్లం లేకుండా పని పూర్తి అవుతుంది.”

          “ఎందుకు రావాలి?”

          “ప్రశ్నలకి జవాబు చెప్పడానికి.”

          “ఉమా! నువ్వు కూడా రాకూడదూ.”

          ఉమ భయపడింది.“నేను రాను” అంది.

          “భయపడుతున్నావు కదూ. నీ భర్తను హత్య చేసిన వాణ్ని చూసి.” కన్నుగీటి నవ్వాడు.

          “మీరు ఇంటికి వెళ్ళండి ఉమా! తోడుగా కానిస్టేబుల్ ని పంపిస్తాను. మాధవరావు వచ్చాక కబురు పంపుతాను. కావలంటే రావచ్చు. ఏమయ్యా? ఈ గుంపు ఎందుకు. జరగండి.”

          “ఆ టెలిగ్రాము పంపించింది మాధవరావుగారే కదా ఉమా. బ్రిల్లియంట్మేన్! ఆఖరున కనిపెట్టేశారు.”

          “మిస్టర్ రాకేష్! అన్నీ తరువాత చూసుకుందాం. మాతో వస్తారా?

          “భేషుగ్గా. దానికన్నావేరే పనేముంది నాకు? ఉమా! మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటేశావు కదూ.”

          “ఫర్ఎ కిల్లర్ యు ఆర్ అన్ యూషువల్ స్టేడి” అన్నారు ఇనస్పెక్టర్.

          “ఏం చేయను సార్ ? సినిమాలల్లో చూపిస్తున్నట్లు ఆమె గొంతుకు అడ్డంగా కత్తి పెట్టి, దగ్గరికి రావద్దని బెదిరించనా? నా కవన్నీ చేతకాదు సార్. ఉమా! నేను జెంటిల్ మాన్ కదా.”

          “హోటల్ రూమ్ లో రక్తాన్ని విరజిమ్మిన జెంటిల్ మెన్! పదవయ్యా. నీకు ఎదురుగా బలమైన సాక్ష్యాదారాలు దొరికితే మాధవరావు ఈ పాటికి వచ్చేసి ఉంటారు. పద” అంటూ అతని భుజాలను పట్టి తోసారు.

          “ఈజీ.. ఈజీ.. నేను మీరు రమ్మన్న చోటికి వస్తూనే ఉన్నానుగా. ఎందుకుతోయడం? ఏ స్టేషనుకి? సర్వర్లందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చెప్పండి వాళ్ళకి.”

          రాకేష్ దాదాపు స్నేహంగానే ఆయన వెంట వెళ్ళాడు. గది గుమ్మం దగ్గర తలతిప్పి ఉమను చూశాడు.“ఉమా! కలవరపడకు. నీ కోసం తిరిగి వస్తాను. ఏ జైలూ నన్ను కట్టుది ట్టం చేయలేదు. తప్పకుండా తిరిగి వస్తాను.”

          రాకేష్ వెళ్ళే ముందు మేనేజర్ దగ్గరకి వెళ్ళాడు.“మీ పేరేమిటి?” అడిగాడు.“కాఫీ చాలా బాగుంది మీ హోటల్లో.”

          అతను వెళ్ళే దిశనే చూస్తూ దిగ్భ్రమ చెందిన దానిలా చూస్తూ నిలబడి పోయింది ఉమ.

          “ఏమిటమ్మా వ్యవహారం? అతనే నా హంతకుడు. నీ భర్తను చంపేసాడా? అందరూ అలా చెబుతున్నారా?”

          “తెలియదు. నాకేమీ తెలియదు” అన్న ఉమ అక్కడినించి కదలసాగింది.

          “కావాలంటే, ఇంటి దాకా ఎవరినైనా తోడుకు పంపించ మంటారా?” అన్నారు మేనేజర్ ప్రసాద్. “మీరు పంపిన చీటీని చూడగానే వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.”

          “థాంక్స్”అంది.

          “తోడుకు ఎవరినైనా?”

          “వద్దు సార్. నాకేమీ భయం లేదు.” ఉమ కీ ఇచ్చిన బొమ్మలాగా నడిచింది. రాకేష్ హంతకుడని తెలిసి, అతనికి భయపడి, చాతుర్యంగా, స్వార్థమా? పోలీసులకి తెలియ పరిచి… కానీ పోలీసులు రాగానే అతను వ్యతిరేకించలేదు. కొంచం కూడా ఎదురు తిరగ లేదు. గుండెలు తీసిన బంటులాగా ఉన్నాడా? సాక్ష్యాలు చాలవా? మాధవరావు టెలిగ్రా ములో క్లియర్ గా ఉంది, హంతకుడు ఇతడేనని.

          ఉమ మనసులో ఏ మూలనో కాస్త నిరాశగా కూడా అనిపించింది. ఏదో జరగబోతు న్నదని ఎదురు చూసి, ఆ సంఘటన జరగనట్లు. రాకేష్ ఆ కత్తిని చేతిలో తీసుకున్నంత వరకు సరే. మరి అతను ఆమె మీద ఎందుకు దాడి చేయలేదు? ఆ తరువాత అతను ప్రవర్తించిన విధం…. ఎక్కడో ఏదో లోటుగా అనిపించింది. అతని మాటలని బట్టి చూస్తే ఎవరూ హంతకుడు అని అనుకోరు.

          “ఉమా! నీ కోసం నేను చేసిన పనులు…”

          ఏమిటా పనులు?

          ఆనంద్ ఎదురుగా వచ్చాడు.

          “ఉమా! ఎక్కడికి వెళ్ళావు? అమ్మచాలా కంగారు పడుతోంది. ఇంత సేపయ్యిందేం?”

          “ ఆనంద్! నాకేమీ అర్థం కావడం లేదు.”

          “ఏమయ్యింది ఉమా?’

          “చెబుతాను. రాకేష్ తెలుసు కదా? అతని గురించి బెంగళూరు మాధవరావు గారి నుంచి ఒక టెలిగ్రాం వచ్చింది. అవునా? అతను ఆ టెలిగ్రాము  వివరాలు నా నుంచి దాచి పెట్టాడు ఎందుకు?”

          “టెలిగ్రాం ఏమిటి? అర్థం అయ్యేటట్లు చెప్పు.”

          “అతనే ఆనంద్. ఖచ్చితంగా అతనే. పోలీసులకి నిరూపించడం సాధ్యం కాదని అనుకుంటున్నాడు. అందుకే అంత ధైర్యంగా వాళ్ళతో వెళ్ళాడు.”

          “పోలీసులు ఏమిటి? విషయం చెప్పు ఉమా. అయోమయంగా ఉంది.

          “మూర్తిని హత్య చేసింది ఎవరో తెలుసా? రాకేష్!”

          ఆనంద్ నిశ్చేష్టులయ్యాడు.

          “రాకేషా? ఎవరు చెప్పారు?”

          “మాధవరావు నుంచి టెలిగ్రాము వచ్చింది. దాన్ని రాకేష్ చూశాడు. చూసి నా నుంచి దాచి పెట్టాడు. నేను అతన్ని ఒక రెస్టారెంట్ కి పిలుచుకుని వెళ్లి, తెలివిగా పోలీసులను పిలిపించాను. అతనేమో పోలీసులు వచ్చాక…”

          “ఆశ్చర్యంగా ఉంది ఉమా! నిన్ను కత్తి చూపించి భయపెట్టేడా?”

          “ఆలా ఏమీ జరగనే లేదు. మారు మాట్లాడకుండా వాళ్ళవెంట వెళ్ళి పోయాడు, ఎదురుతిరగకుండా.”

          “ఎక్కడో ఏదోలోటు కనబడుతోంది. కానీ అతన్ని చూస్తే ఎక్కువ మాట్లాడే మనిషి కాదనిపిస్తోంది. మాటల్లో ఒక కన్సిస్టెన్సీ లేదు. ఇలాంటి వాళ్ళంతా బండబారిన గుండె ఉన్నవారై ఉంటారు. చెప్పలేం.”

          “ఒక విధమైన అలక్ష్య భావంతో పోలీసులతో వెళ్ళిపోయాడు.”

          “టెలిగ్రాములో ఏమని ఉంది?”

          “రాకేష్ నీ భర్తను హత్య చేసిన వ్యక్తి. అతని దగ్గర జాగ్రత్తగా ఉండమని మాధవరావు టెలిగ్రాము ఇచ్చారు.”

          “పోలీసులు తీసుకెళ్ళిపోయారు కదా.”

          “అవును.”

          “ఇంకేం? మిగతా విషయాలు రేపు చూసుకుందాం. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది.”

          “ఆనంద్! అతన్ని చూస్తే నీకేమని అనిపిస్తోంది?”

          “ఒకరి ముఖం చూసి ఏదీ నిర్ధారణగా చెప్పలేం ఉమా. వెళదాం రా.”

          ఉమ సీరియస్ గా ఆలోచిస్తూ నడిచింది. ఆమె మనసులో రాకేష్ చూపించిన ఫోటో మెదిలింది. అతని అమ్మ పోలికలు ఉన్నాయని అతనికి నా పట్ల ప్రేమ లేక ఆకర్షణ కలిగి ఉండవచ్చు. నన్ను తల్లి యొక్క పునర్జన్మగా అనుకున్నాడు. ఇంకొకరికి భార్యగా నన్ను ఊహించుకోలేక, ఉప్పెనలా పొంగిన ద్వేషంతో మూర్తిని హత్య చేసి ఉంటాడు. ఈ లాజిక్ సరిగ్గానే ఉంది. మాధవరావు ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా టెలిగ్రాం ఇచ్చి ఉండరు. కానీ అతను దేన్నీ లెక్క చేయకుండా పోలీసుల వెంట ఎందుకు వెళ్ళాడు? ఆలోచనలతో ఉమకి తల బద్దలవుతున్నట్లు అనిపించింది.

          మాధవరావు అరగంట ఆలస్యంగా బయలు దేరిన బోయింగ్ లో ఆఖరి క్షణంలో టికెట్ దొరికి ముప్పై అయిదు నిమిషాలలో చెన్నైకి వచ్చి, విమానానికి మెట్లను అమర్చే ఆ కొద్ది సమయంలో కూడా కలవరం చెందారు. త్వరగా విమానాశ్రయం నుంచి బైటికి వచ్చి టాక్సీ ఎక్కారు.

          టాక్సీ కన్నా వేగంగా ఆయన ఆలోచనలు పరిగెడుతున్నాయి. దేవుడా! అతను ఆ అమ్మాయిని ఏమీచేసి ఉండకూడదు. ఆమె అతని దగ్గర చిక్కుకుంది. అతను దేనికీ జంకని వ్యక్తి. ఆమెను పణంగా పెట్టి అతను తప్పించుకుని ఉంటే… ఛ… అలా అనుకో వద్దు.

          సైదాపేట్టై పోలీస్ స్టేషన్ లో దిగి వెంటనే ఫోన్ చేసి ఇనస్పెక్టర్ రాజపాండియన్ ని కాంటాక్ట్ చేశారు.

          “వచ్చేసారా. వెల్ కం.”

          “ఏమయ్యింది? చెప్పండి.”

          “మీ రాకేష్ ఇక్కడే ఉన్నాడు. లజ్ కార్నర్ పోలీస్ స్టేషన్ కి రండి.”

          “గుడ్! అరెస్ట్ చేసేసారా?”

          “దానికి అవసరమే కలుగలేదు. చెప్పిన మాట వినే బుద్దిమంతుడు రామూలాగా మా వెంటవచ్చాడు. ఇక్కడ కూడా కుదురుగా కూర్చుని ఉన్నాడు.”

          “ఏమిటీ? రాకేషా అలా ఉన్నాడు?”

          “అవును. రాకేషే. మీరు ఇక్కడికి రాగానే ఎంక్వయిరీ చెయ్యండి. అరెస్ట్ చేయాలం టే చెప్పండి. ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి.”

          “రాకేష్ మిమ్మల్ని ఎదురించ లేదా?”

          “లేదు.”

          “అతను రాకేష్ కాదనుకుంటాను. నేను వెతికేది పిచ్చి పట్టిన హంతకుడిని.”

          “మౌనంగా బెంచీ మీద కూర్చుని ఉన్నాడు. మీరు రండి. మీరు అన్నట్లు వేరే వ్యక్తి అయి ఉండొచ్చు. తన పేరు రాకేష్ అనే చెప్పాడు.”

          “ఆ అమ్మాయి ఉమ?’

          “ఇంటికి వెళ్ళి పోయింది.”

          “సరే. నేను వెంటనే వస్తాను.”

          టాక్సీలో మైలాపూరుకి వెళ్తున్నప్పుడు మాధవరావు భ్రుకుటి ముడిపడింది. ఎక్కడో ఏదో లింకు దొరకడం లేదు. మొదట అతన్ని చూద్దాం. పోలీసుల లోతు చూస్తున్నాడా. దేనికైనా బలమైన సాక్ష్యాలు ఉన్నాయా? ఒకే హోటలు, అదే రోజు, మాయా, క్రికెట్, ఫోటో మాధవరావు మనసులో గత కొన్ని రోజులుగా ఆయన చేసిన పరిశోధనలన్నీ సినిమా రీళ్ళ  లాగా పరిగెత్తాయి.

          ఇతనే! అనుమానం లేదు. అమాయకుడిగా నటిస్తున్నాడు. బెంగళూరుకి తీసుకు వెళ్ళి అడగవలసిన విధంగా అడిగితే నిజం బైటికి రాక తప్పదు.

          మాధవరావు పోలీస్ స్టేషన్ ని సమీపించారు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.