యాదోంకి బారాత్-14
-వారాల ఆనంద్
సిరిసిల్ల-వేములవాడ-సంస్థలూ అనుబంధాలూ
కొందరు ఉద్యోగ బాధ్యతల్ని తీసుసుకున్న తర్వాత అందులో పూర్తిగా అంకితమయినట్టు నటిస్తారు. ఎంత కష్ట మొచ్చిందిరా దేవుడా అని అంటూ వుంటారు. అక్కడికి తానొక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు తాను మాత్రమే కష్టపడుతున్నట్టు.. అదీ ఉచితంగానూ ఏదో మేహర్బానీకి చేస్తున్నట్టు. అలాంటి వాళ్ళను చూస్తే నాకయితే కోపం రాదు కానీ, వాళ్ళ అమాయకత్వానికి జాలి కలుగుతుంది. “తవ్వెడు ఇచ్చిన కాడ తంగెళ్ళు పీకాలి” అని సామెత. మరెందుకట్లా ఫీలవుతారో తెలీదు అందంతా గొప్ప కోసమే. అంతా అయ్యోపాపం అనుకోవాలని. అట్లా అయ్యోపాపం అనిపించుకునే బతుకు బతుకే కాదని, నేనను కుంటాను.
నా మట్టుకు నేనయితే ఉద్యోగ బాధ్యతను దానికి అదనపు బాధ్యతల్ని ఇష్టంగానే చేసాను. ఇష్టం కాని రోజు చెయ్యలేదు. బాసులతో గొడవ పడ్డ రోజులూ వున్నాయి.
సిరిసిల్లా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మొదటి విద్యాసంవత్సరం గడిచి ఉద్యోగం ఒక దారిన పడింది. మరోవైపు సిరిసిల్లా, వేములవాడ, కరీంనగర్ లలో మిత్రుల తో కాలం సాగుతూపోయింది. ‘తిరిగిన కాళ్ళూ.. వాగిన నోరూ ఊరికే వుండదు’ అన్నట్టు గానే నాకూ ఉద్యోగం ఒక్కటే కాకుండా ఇంకా ఏదో చేయ్యాలనే తపన మొదలయింది. కవితలు, కథలు రాసే ప్రయత్నం సాగుతూ ఉండగానే ఇది సరిపోదు ఇంకా ఎదో చేయాలనే ఆలోచన నిలవనీయకుండా వుండేది.
సరిగ్గా అప్పుడే కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలతో పరిచయం ఏర్పడింది. ఆదివారాలు ఉదయమే వెంకటేశ్వర టాకీసులో సినిమాలకు వెళ్ళసాగాను. ఆ సినిమాల్ని చూడడంతో పాటు ఆయా ప్రపంచ సినిమాల గురించి తెలుసుకోవడం, చదవడం కూడా శురూ అయింది.
మరోవైపు వేములవాడలో డాక్టర్ రఘుపతి రావు మామయ్య కూడా సామాజిక కార్యక్రమాల పట్ల సానుకూలంగా వున్నవాడే. తాను రాయడం అంతగా చేయలేదు కాని అనేక నవలలు, పుస్తకాలు చదివి ఇంట్లో సమకూర్చి పెట్టాడు. వాటి ప్రభావం వల్లనే జింబో నేనూ సాహితీ రంగంలోకి వచ్చాము. అందుకు ఆయనకు ఎంతో రుణపడివున్నాం కూడా. డాక్టర్ రఘుపతి మామయ్య సిరిసిల్ల లయన్స్ క్లబ్ లో కూడా చాలా ఆక్టివ్ గా ఉండే వాడు. అప్పుడే తాను లయన్స్ క్లబ్ డిప్యుటీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయ్యాడు. ఇంకేముంది లయన్స్ క్లబ్ కార్యక్రమాలు మరింత పుంజుకున్నాయి. తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం వేములవాడలో ఘనంగా జరుపాలని నిర్ణయించారు. అప్పటికి వేముల వాడలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి వసతి గృహం బాగుండేది. ఉత్సవం అందులో ఏర్పాటయింది. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ కే.ఎస్.శర్మ ముఖ్య అతిథి. లయన్స్ ప్రముఖులంతా ఎట్లాగూ వుంటారు. వేములవాడలో నగుబోతు ప్రభాకర్, నల్ల ప్రభాకర్, నగుబోతు చంద్రమౌళి, సిరిసిల్లలో భోగ వెంకట స్వామి, విష్ణు ప్రసాద్ రావు, ముత్యం రెడ్డి ఇంకా అనేక మంది లయన్స్ లో ప్రముఖులు. ఇక ఆ సందర్భంగా ఒక సావనీర్ తీయాల ని సంకల్పించారు. లయన్స్ సంస్థతో నాకేమీ సంబంధం లేదు పెద్దగా గొప్ప అభిప్రాయ మూ వుండేది కాదు. ‘షో’ ఎక్కువ పని తక్కువ అనుకుంటూ ఉండేవాడిని. కాని మామయ్య పిలిచి సావనీర్ భాద్యత నీదే అన్నాడు. ఇంక ఏముంది సరే నన్నాను. దానికి కొన్ని రోజులు కరీంనగర్ లో వుండి ప్రింటింగ్ పనులు చూడాలి. సిరిసిల్లలో ప్రముఖులయిన లయన్స్ కొంత మంది మా కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ రావు దగ్గరకు వచ్చి ఆనంద్ ను ఓ నాలుగు రోజులు డిప్యుటేషన్ మీద మాతో పంపమని అడిగారు. వూరి పెద్దలు కనుక ఆయనకు సరే అనక తప్పలేదు. ఇక నేను చలో కరీంనగర్. గడియారంకాడ గౌరిశెట్టి కాంప్లెక్ష్ లో వున్న నిర్మల ప్రింటింగ్ ప్రెస్ లో సావనీర్ ముద్రణ. ఆ ప్రెస్ బి. విజయ కుమార్ ది. విజ్జన్నతో అప్పుడే పరిచయం. చిత్రిక పురాణం రామచంద్రలతో అప్పటికే రచయితగా వున్న పరిచయం విజయకుమార్ తో కలివిడిగా ఉండేందుకు దోహద పడింది. నిజానికి బి.విజయకుమార్ తో పరిచయం కావడానికి, స్నేహం చేయడానికి ముందస్తుగా తెల్సి ఉండాల్సిన అవసరం లేదు. కలిస్తే చాలు. అందరితో పాలు నీళ్ళలా కలిసి పోయే గొప్ప లక్షణం ఆయనది.
అదిగాదన్నా.. అంటూ భుజం మీద చేయి వేసేవాడు. అలాంటి విజయకుమార్ తో సిరిసిల్లా లయన్స్ క్లబ్ సావనీర్ ద్వారా దగ్గరి పరిచయం మొదలయింది. ఆ తర్వాతి దశాబ్దాలలో అది అనేక రకాలుగా వృద్ది చెంది సాహిత్య సృజనాత్మక రంగాల్లో నా ఎదుగుదలకు ఎంతో దోహద పడింది. ఆ ప్రెస్ లోనే రత్నాకర్, సుగుణాకర్ తదితరుల పరిచయం కూడా జరిగింది. ఇక మూడు రోజులు రాత్రీ పగలూ కష్టపడి సావనీర్ సిద్ధం చేసాం. తెల్లవారితే ఫంక్షన్ అనగా మా టెన్షన్ చెప్పనలవికాదు. ఆ రాత్రి పూర్తి మెలకు వతో వుండి బైండింగ్ తో సహా పూర్తి చేసాం. ఉదయమే విజ్జన్న నేను అక్కడే హోటల్ లో చాయ్ తాగం. బుక్స్ రిక్షాలో వేసుకుని నేను వేములవాడ బస్సెక్కాను. ఇంటి దగ్గరికి వెళ్ళే సరికి రఘుపతి మామయ్యాతో సహా లయన్స్ అంతా వున్నారు. సావనీరందదేమో అను కుంటున్నారంతా. నన్ను చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్నానపాణాదులు లేని నా ముఖంచూసి వెళ్ళి రెడీ అయి మీటింగ్ కు రా అన్నారు. మీటింగ్ బాగా అట్టహాసంగా జరిగింది.
నా బాధ్యతను నేరవేర్చినందుకు నన్నూ అభినందించారు.
తర్వాత కొంత కాలానికి లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్లా వాళ్ళు అదే టీ టీ డీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రెండు రోజుల భారీ ఐ కాంప్ (కంటి పరీక్షా కాంప్) పెట్టారు. చాలా గొప్ప కార్యక్రమం అది. అందులోనూ నేను చొరవగా పాల్గొన్నాను. ఆనాటి కాంప్ కు రుద్ర రవి, ఫసీ, ముత్యం రెడ్డి, సుద్దాల బాలయ్యతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. అంతకు ముందు రోజే హైదరాబాద్ లో కమలహసన్ “ఆకలి రాజ్యం” సినిమా చూసి వచ్చిన ముత్యం రెడ్డి ఆ సినిమాను వర్ణించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. స్క్రీన్ ప్లే మొత్తం వున్నది వున్నట్టు మా ముందు ప్రెజెంట్ చేసాడు. ఫలితంగా మర్నాడు ఉదయమే రవి మిత్రులందరినీ వెంటేసుకుని హైదరాబాద్ వెళ్ళి ఆకలి రాజ్యం చూసి వచ్చాడు.
ఐ క్యాంపు తర్వాత లయన్స్ క్లబ్ కార్యక్రామలతో నేను పెద్దగా సంబంధం పెట్టుకో లేదు.
***
మరోవైపు వారం వారం లేదా సెలవు దొరికినప్పుడల్లా కరీంనగర్ వెళ్ళడం మామూలే. మంకమ్మ తోటలో నివాసం. ఇంట్లో మిగతా అంతా పిల్లలు. నేను క్రమంగా దామోదర్ నారాయణ రెడ్డి వెంకటేష్ల సర్కిల్ దాటి ఫిలిం సొసైటీ ఎంక్లోజర్ లోకి వచ్చాను. గడియారం దగ్గర ధిల్లీవాలా స్వీట్ హౌస్ పక్కనే వున్న బాలాజీ డ్రెస్సెస్ కు వెళ్ళడం మొదలు పెట్టాను. రేణికుంట రాములు సార్ అప్పుడు కరీంనగర్ ఫిలిం సొసైటీ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. నాకు ఆయన చిన్నప్పటి నుండే తెలుసు. మేము మిఠాయి దుకాణం ఇంట్లో వున్నప్పుడు నాన్న నన్ను ‘సంసన్స్’ దుఖానానికి తీసుకుచ్చే వాడు. ఆదే తర్వాత బాలాజీ అయింది. అదే రాములు సార్ ఫిలిం సొసైటీ రాములు అయ్యాడు. రాములు గారిని కలిసి వేములవాడలో ఫిలిం సొసైటీ పెట్టాలని వుంది మీ సహాయం కావాలి అనగానే దాందేముంది. యూనియన్ బాంక్ లో ఎన్.శ్రీనివాస్ ఉంటాడు తానే ఇప్పుడు ప్రెసిడెంట్. రేపుదయం రండి అన్నాడు. ఉదయం వెళ్ళగానే శ్రీనివాస్ అక్కడికి రావడం. వేములవాడలో స్టార్ట్ చేయడానికి చేయాల్సిన పనుల పై చర్చించాం. అప్పటికే తాను నా రచనలు చదివి వున్నాడు. బాగా స్నేహంగా కలిసిపోయాడు. ఆ స్నేహం అనేక దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా సాగింది.
***
వేములవాడ వెళ్ళి వేములవాడలో ఏదయినా చేయాలి. కాలం ఇట్లా వృధాగా గడపడంలో అర్థం లేదని మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్ తో అన్నాను. ఫిల్మ్ సొసైటీ పెడితే ఎట్లా వుంటుంది అనికూడా అన్నాను. కిరణ్ వెంటనే స్పందించాడు. ఏం చేయాలో నువ్వు చెప్పు బావా ఎట్లా చేయాలో నేను చూస్తాను అన్నాడు. మరో ఆత్మీయుడు పి.ఎస్.రవీంద్ర తో చర్చిస్తే బ్రహ్మాండంగా వుంటుంది పదండి ముందుకు అన్నాడు. నాకు లోపలెక్కడో ఇంత చిన్న వూర్లో మనతో అవుతుందా అనే మీమాంస పీకుతూనే వుంది. కాని, కిరణ్ రవీంద్రలు రెండువైపులా వుండి అరె నువ్వు ప్రణాళిక వెయ్యి నడిపిద్దాం అన్నారు.
మొదట కలిసివచ్చే వాళ్ళతో కార్యవర్గం రూపొందించాలి. గోకుల్ టాకీస్ యజమాని తో మాట్లాడి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు సినిమా వేసుకునే అవకాశం కల్పించమని అడగాలి, సభ్యత్వాలు చేయించాలి. ఇవీ మా ముందున్న పనులు. ఏ సినిమాలు వేయాలన్నది నా భాద్యత. అంతే వేములవాడ రోడ్లమీద పడ్డాము. నగుబోతు ప్రభాకర్ అధ్యక్షుడిగా, నల్ల ప్రభాకర్, డా కే.మనోహర్ ఉపాధ్యక్షులుగా, వారాల ఆనంద్ కార్యదర్శిగా, ఇట్టేడు కిరణ్ కుమార్ సంయుక్త కార్యదర్శిగా, నగుబోతు చంద్రమౌళి కోశాధికారిగా పి.ఎస్.రవీంద్ర, జింబో, వజ్జల శివకుమార్, ఎడ్ల రాజేందర్, యాద కిషన్, కృష్ణ చంద్రతో పాటు ఇంకా పలువురు కార్యవర్గ సభ్యులుగా కమిటీ రూపొందింది.సభ్యత్వ కార్డులు మిగతా పనులన్నీ పూర్తి అయ్యాయి. ఇక సినిమా కోసం నేను మొట్టమొదటి సారిగా సికింద్రాబాద్ ఆర్పిరోడ్ లో వున్న సినిమా డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసుల చుట్టూ తిరిగి సత్యజిత్ రే ‘షత్రంజ్ కే కిలారీ’ సినిమా ప్రారంభ చిత్రంగా వేయడానికి బుక్ చేసాను. ఇక సొసైటీని ప్రారంభించడానికి FEDERATION OF FILM SOCIEITES OF INDIA Regional committee member ఎం.ఫిలిప్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆఫీసు రాణీగంజ్ లో వుండేది. ఆ రోజు నా వెంట మంగారి రాజేందర్ జింబో కూడా వున్నాడు. వేములవాడ ఎక్కడుంటుంది, ఏ సినిమా వేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వేసి తాను రావడానికి అంగీకరించాడు. ఇక స్థానిక ఏర్పాట్లల్లో కిరణ్, రవీంద్రలతో పాటు మిగతా సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పుడు వేములవాడ ఊర్లోకి హైదరాబాద్ నుండి సూపర్ పేర ఒకే బస్ వచ్చేది. ఆ బస్సు రాత్రి 10కి గుడి ముందుకు చేరి మళ్ళీ ఉదయమే 5 గంటలకు వెళ్ళేది. దాన్లోనే సినిమా బాక్సులు వేములవాడ చేరేవి. అట్లా 23 ఆగస్ట్ 1981 రోజున గోకుల్ టాకీస్ లో ఉదయం వేములవాడ ఫిలిం సొసైటీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభ మయింది. అప్పటి మండలాద్యక్షుడు ఆర్.పాపా రావు, సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి, డాక్టర్ ఎం. రఘుపతి రావు, నగుబోతు ప్రభాకర్ లు వేదిక పై వుండగా ఎం.ఫిలిప్ ప్రారంభ ఉపన్యాసంతో సొసైటీ శురూ అయింది. సభ బాగా జరిగి సినిమా మొదలయింది.
ఆ నాటి ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ ఫిలిం సొసైటీ నుంచి నరెడ్ల శ్రీనివాస్, రేణికుంట రాములు, డి.నరసింహారావు, ఉప్పల రామేశం మమ్మల్ని అభినందించడానికి వచ్చారు, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో మా అధ్యాపకుడయిన నరసింహా రావు గారు ‘ఆనంద్ యు ఆర్ బిహైండ్ దిస్…’ అని మనస్పూర్తిగా అభినందించాడు. ఆ రోజు సభావేదిక మీదికి కరీంనగర్ మిత్రుల్లోంచి ఒకరిని పిలవాల్సి వుండే… నాకు తోచలేదు ఎవరూ అన లేదు.. కానీ ఆ తప్పు ఇప్పటికీ నన్ను తొలుస్తూనే వుంటుంది. ఇక సిరిసిల్లా నుంచి ఆత్మీయులు రుద్ర రవి, ఫసి, జూకంటి జగన్నాధం ఒకే స్కూటర్ మీద వచ్చారు. అదొక పండుగ వాతావరణం. ఇదంతా బాగానే వున్నా సినిమా పై సభ్యుల ప్రతిస్పందన ఎట్లా వుంటుంది, appreciate చేస్తారా లేదా అన్నది నన్ను తొలుస్తున్న ప్రశ్న. అప్పటిదాకా సభ్యుల్లో అధిక శాతం వ్యాపార సినిమాలకు అలవాటుపడ్డ వాళ్ళే. నాకదో బెంగగా అనిపించసాగింది. సినిమా ముగిసేంతవరకు అది కొనసాగింది. కాని అనేక మంది టీచర్లు, టెంపుల్ ఉద్యోగులు కొందరు వ్యాపారవేత్తలూ బాగా స్పందించారు. మంచి సినిమా చూసే అవకాశం కల్పించారని అభినందించారు. మా అందరికీ బాగా ఉత్సాహం వచ్చింది. తర్వాత సిరిసిల్లా రుద్రరవి, ఫసి, జూకంటి అంతా కలిసి ఉడిపి హోటల్ లో కొంత సమయం గడిపి సెలవు తీసుకున్నాం.
వేములవాడలో మొదటి సమాంతర సినిమా– ‘షత్రంజ్ కే ఖిలారి’:
సత్యజిత్ రే తన జీవిత కాలంలో తీసిన రెండు హిందీ సిన్మాల్లో ఇది ఒకటి (రెండవది ‘సద్గతి’). ఇది ప్రేమ్ చంద్ కథ ఆధారంగా రూపొందించబడింది. ‘షత్రంజ్ కే ఖిలారి’ గొప్ప రాజకీయ వ్యంగ్యాత్మక మయిన సినిమా. ఈస్ట్ ఇండియా కంపనీ మన దేశంలోని అవధ్ లాంటి వివిధ రాజ్యాల్ని ఎట్లా కూలదోశాయో దానికిగాను స్నేహ ఒప్పందాల పేర తమ మిలిటరీని ఆయా రాజ్యాల్లో దింపి క్రమంగా ఆ ప్రాంతాల్ని ఎట్లా ఆక్రమించింది ఈ సినిమా గొప్పగా చూపిస్తుంది. ప్రేమ్చంద్ మూల కథకు కొంత కథనాన్ని జోడించి తీసిన ఈ సినిమా విశేష ప్రశంసలు అందుకుంది. ఇందులో ముఖ్యంగా అమ్జద్ ఖాన్ పాత్ర పోషణ ప్రశంసించదగింది.
ఇది సత్యజిత్ రే తన సృజనాత్మక జీవితంలో తీసిన అత్యంత ఖరీదయిన సినిమా కూడా. బాంబే హిందీ సినిమా పరిశ్రమకు చెందిన సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్, సయీద్ జాఫ్రీ, షబానా ఆజ్మి, ఫరిదా జలాల్, రిచర్డ్ అట్టెంబరో తదితరులు నటించారు ‘షత్రంజ్ కే ఖిలారి’లో. వేములవాడ ఫిలిం సొసైటీ సభ్యులకు ఆ రోజుల్లోనే బాగా నచ్చిందీ సినిమా. అట్లా ఎప్పుడూ దేవస్థానమూ జాతరా జనంతో బిజీగా వుండే వేముల వాడలో కళాత్మక సినిమాల ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజుల్లో వాటి పైన చర్చలు,సెమినార్లు కూడా నిర్వహించాము.
***
జ్ఞాపకాల్ని రాయాలనుకున్నప్పుడు అవసరమా అనుకున్నాను. గొప్పగా ఏముం టాయి అని కూడా అనుకున్నాను. కానీ జీవితం గురించి, ఆయా కాలాల గురించీ ఎన్నో విషయాలు రికార్డ్ అవుతాయి అని కూడా అనుకున్నాను. అట్లా మొదలయిందీ బారాత్. అయితే ఈ జ్ఞాపకాలు ఎంత ఆబ్జెక్టివ్ గా రాసినా కొందరు మిత్రులు బాధ పడుతున్నారు. తిడుతున్నారు. ఆ విషయం రాయకుంటే ఏమయింది అంటున్నారు.
“ఓటమి తెలియనప్పుడు గెలుపు మజా ఏముంటుంది…”
“ఎదో చిన్న అవమానం ఎదురుకానప్పుడు జీవితంలో సన్మానం ఏమి ఆనంద మిస్తుంది”. ఏది ఏమయినా బాధల్నీ సంతోషాల్నీ గుది గుచ్చుకుంటూ జీవితం సాగింది. జ్ఞాపకాలూ సాగుతాయి.
***
సిరిసిల్లా కాలేజీలో పనిచేసిన రోజులు ఎంత చైతన్యం. ఒక్క సిరిసిల్లనే కాదు స్కూళ్ళల్లో కాలేజీల్లో విద్యార్థుల మధ్య పనిచేయడమే గొప్ప చైతన్యం. మామూలు ఆఫీసు రొటీన్ as per the last month పని కాదది. ప్రతి రోజు నూతనత్వమే. కొత్త సమస్యలు, సరికొత్త స్పనదనలు. 80ల్లో అది మరీ ఎక్కువ. ఓ పక్క పెల్లుబికే రాజకీయ చైతన్యం. మరో పక్క లంపెన్ వర్గాలు. రెండూ ఉండేవి. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు లేవు. ఎవరు చదవాలన్నా గవర్న్మెంట్ కాలేజీకే రావాలి. పైగా కో ఎడ్యుకేషన్. బెల్లు మోగిందంటే చాలు. లెక్చరర్ మారే సమయంలో కాలేజీ అంతా జాతరలా ఒకటే గోల గోలగా వుండేది. క్లాసులన్నీ ఎంగేజ్ కాగానే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. భలే వుండేది. ఇక మా లైబ్రరీ కూడా అంతే పిల్లలు వుంటే అతివృష్టి లేకుంటే ఎడారి. అప్పటికి వేముల వాడ ప్రాంతం కూడా కలిపి మొత్తం సిరిసిల్ల తాలూకాకు ఒక్కటే జూనియర్ కాలేజీ. సిరి సిల్ల ప్రాంతమంతా గొప్ప చైతన్యంతో కూడుకున్నది, కల్లోలిత ప్రాంత చట్టం అమలయి వున్న గ్రామాలవి. అంతా నివురుగప్పిన నిప్పులా వుండేది. సిరిసిల్లా పట్టణ విద్యార్థులు, ఆర్థికంగా కొంత మెరుగయిన కుటుంబాల విద్యార్థులు ఒక రకంగా వుండేవాళ్ళు. పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు అందుకు భిన్నంగా కనిపించేవాళ్ళు. అమ్మాయిల్లోనయితే ఎక్కువ మంది ముడుచుకుని వుంటే కొంత మంది మాత్రం చలాకీగా వుండేవాళ్ళు. ఈ నేపధ్యంలో భిన్నమైన అనుభవాలు.
అప్పటికే సిరిసిల్ల కాలేజీలో పరీక్ష సెంటర్ డిబార్ కావడం లాంటివి జరిగాయి. విద్యార్థుల్లో మాస్ కాపీ తత్వం వుండేది. దానికి తోడు కొంత మంది అధ్యాపకులు విద్యార్థు ల్లో బోగస్ పాపులారిటీ కోసం పరీక్షల్లో ‘నఖల్ల’కు అవకాశం కల్పించేవాళ్ళు. ఎవరే మయినా పరీక్ష హాల్లో కొంత స్ట్రిక్ట్ గా వుంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. దాడు లు చేసేవాళ్ళు. అలాంటి సంఘటనలు సిరిసిల్లాలో రెండు జరిగాయి.
ఒక ఏడాది వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. వేములవాడ నుంచి కలిసి రావాల్సిన నేనూ కిషన్ సార్ వేర్వేరుగా వచ్చాం. నేను బస్సులో వచ్చాను. కాలేజీ గేటు దగ్గరే ఏదో కోలాహలం కనిపించింది. నామానాన నేను వస్తున్నాను. మురళి అనే విద్యార్థి మరి కొందరు అరేయి అంటూ నా మీదికి వచ్చారు. ఊహించని పరిణామం. చిట్టీలు గుంచు కుంటావారా అంటూ దాడికి దిగారు. ఇంతలో ఆ గుంపులోనే రఘు అని నన్ను కొంత అభిమానించే వాడు ఉరికి వచ్చి ఆ గుంపును ఆపాడు. సార్ను ఏమనొద్దురా అంటూ. అప్పటికే వాళ్ళు కాళ్ళూ చేతులూ ఆడించారు. అవి నన్ను తాక లేదు. ఇంతలో బాటనీ అటెండర్ కనకయ్య వచ్చి సార్ రండి అంటూ లోనికి తీసుకెళ్ళాడు. రఘు లేకుంటే ఆ రోజు నా వీపు ‘సాఫ్’ అయ్యేదే. లోనికి వెళ్తుంటే చెప్పారెవరో అప్పటికే పరీక్షల రూములో కిషన్ సార్ మీద అటాక్ చేసారని. ఉదయం 8కే పరీక్ష మొదలయింది. పరీక్ష ముగిసే సరికి ఏమి జరిగిందో ఎవరు చెప్పారో కాని స్టూడెంట్స్ వచ్చి సారీ చెప్పారు. అంతటితో ఆ వివాదం ముగిసింది.
ఇక మరో సందర్భంలో సాయంత్రం వేళ పరీక్షల విభాగం గదిలో ఒక విద్యార్థి మంఛి ఎకనామిక్స్ అధ్యాపకుడు లక్ష్మణ్ రావు గారి మీద అటాక్ చేసాడు. అదీ పరీక్షల విషయం లోనే. నేను అక్కడే వున్నాను. సార్ దాన్ని ప్రతిష్టగా తీసుకుని పోలీసు కంప్లైంట్ చేసాడు. కేసు నమోదయింది. నేను విట్నెస్. కోర్టులో కేసు పడింది. ఆ విద్యార్థి కుటుంబం నుంచి రఘుపతి మామయ్య ద్వారా వొత్తిడి. వాడి భవిష్యత్తు పాడయిపోతుందని వేదన. ‘దాడి జరిగింది నిజం కోర్టులో నేనదే చెబుతాను’ అన్నాను. సార్ తో రాజీ పడితే నాకేమీ అభ్యంతరం లేదన్నాను. ఎట్లాగో సర్దుకున్నారు. కానీ కేసు కేసే కదా. కోర్టుకు నేను కూడా వెళ్ళి అటూ ఇటూ కాకుండా సాక్ష్యం చెప్పి వచ్చాను. కేసు పోయింది. అదొక భిన్నమ యిన అనుభవం.
మరోసారి మళ్ళీ పరీక్షల సమయమే..బాలరాజు లాంటి కొందరు స్టూడెంట్స్ కి నా ఇన్విజిలేషన్ నచ్చలేదు. నఖలు కొట్టనీయవా అంటూ నువ్వయితే కాలీజీ బయటకురా అంటూ గుంపుగా తయారయ్యారు. ప్రిన్సిపాల్కు ఈ విషయం తెలిసి నా వద్దకు వచ్చాడు. ఇంతలో రుద్ర రవి, ఫసి, ముత్యం రెడ్డి లాంటి మిత్రులు కరీంనగర్ కు కలిసి వెళ్ళడానికి నా వద్దకు కారులో వచ్చారు. ప్రిన్సిపాల్ అది చూసి ఆనంద్ వెంటనే వెళ్ళు అంటూ నన్ను తరిమినంత పనిచేసారు. ఆ ప్రహసనం అట్లా ముగిసింది.
***
ఈ అనుభావాలు ఇట్లా వుంటే స్పూర్తి వంతమయినవి మరికొన్ని. ప్రగతిశీల భావాలున్న పిల్లలు నా చుట్టూ చేరేవాళ్ళు. లైబ్రరీకి వచ్చేవాళ్ళు. నేనేమో ఈ పుస్తకం చదవండి అది చదవండి అంటూ చలం, శ్రీ శ్రీ తదితరుల రచనలు ఇచ్చే వాణ్ని. కొందరు ఆసక్తిగా చదివేవాళ్ళు. మరికొందరేమో సిద్దాంత గ్రంధాలు అడిగే వాళ్ళు. అవి కాలేజీలలో వుండవు అంటే ఇంట్లో వుంటే ఇవ్వండి వస్తాం అనేవాళ్ళు. నేనేమో అప్పటికే సమాంతర సినిమాల పట్ల ఆసక్తి పెంచుకొని వున్నాను. సరిగ్గా ఆదే సమయం లో ప్రముఖ కవి అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు శ్రీ చొప్పకట్ల చంద్ర మౌళి సిరిసిల్లా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. ఆర్.పుల్లయ్య గారు ప్రిన్సిపాల్. వేముల వాడ నటరాజ కళానికేతన్ కార్యక్రమాలతో చనువున్న చొప్పకట్ల కొలీగ్ కావడంతో నాలో ఉత్సాహం పెరిగింది. ఆ ఏడు కాలేజీ వార్షికోత్సవంలో “ అడవి తల్లికి దండా లో… తల్లి అడివికి దండా లో… రేలా రేలా రే..’ లాంటి పాటలతో విద్యార్థినీ విద్యార్థులతో నృత్యాలు చేయించాం. విద్యార్థుల్లో ఎంత ఉత్సాహమో చెప్పలేను.
ఇదిట్లా వుంటే నారయణ అనే విద్యార్థి ఏంతో ఉద్రేకంగానూ ఆలోచనాత్మకంగానూ ఉండేవాడు. బాగా దగ్గరయ్యాడు. మనిషిలో ఎదో అసహనం. ఎదో చేయాలనే తపన. ఎవరి మీదో చెప్పలేనంత కోపంగా ఉండేవాడు. నేనతన్ని కొంత సాహిత్యం వైపు మరల్చే ప్రయత్నం చేసాను. ఇంతలో నాకు బదిలీఅయి గోదావఖనికి వెళ్ళాను.ఒక రోజు గోదావరి ఖని నుండి కరీంనగర్ కు వస్తూ చాయ్ కోసం పెద్దపల్లి బస్ స్టాండ్ లో దిగాను. బయటకు వస్తుంటే ఒకతను నమస్తే సార్ అని పలకరించాడు. ఎప్పటి ఎప్పటి విద్యార్థులో కలవడం మామూలె కదా. ఆగి పలకరించాను. గుర్తు పట్టారా సారన్నాడు. లేదన్నాను. మాది సిరిసిల్ల. మీ స్టూడెంట్ ని అన్నాడు. చాలా సంతోషం వేసింది. బాగున్నావా ఏం చేస్తున్నావ్ అన్నాను.. బాగానే వున్నాను సర్. మీకు తెలిసిందా సార్ అన్నాడు. ఏమిటీ సంగతి అన్నాను. మన నారాయణ అంటూ ఆగాడు.. ఏమయింది అన్నాను ఆదుర్దాగా.. కామారెడ్డి లో ఎన్ కౌంటర్ చేసారు సర్ అన్నాడు… అంతే కొయ్యబారి పోయాను. నోట మాట రాలేదు. పోస్టర్లు వేస్తుంటే పట్టుకున్నారు తర్వాత.. అన్నాడు నాకింకేమీ వినిపించ లేదు. దుఖం పొర్లుకోచ్చింది. ఎంత తెలివయినవాడు..మనసున్నవాడు.. “ మీకు చాలా దగ్గరగా ఉండేవాడు కదా సార్, చెప్పాలనిపించింది. వుంటాను సర్. మళ్ళీ కలుస్తాను” అంటూ అతను వెళ్ళిపోయాడు. బస్సు డ్రైవర్ పిలుపుతో కళ్ళు తుడుచు కుంటూ బస్సెక్కాను. ఇట్లా ఒక్క నారాయణే కాదు ఎంతమందో.. గుర్తు చేసుకుంటే మనసంతా కన్నీటి ఉప్పెనవుతుంది.
***
1980 నుంచి మూడు నాలుగేళ్ళ పాటు కాలేజీ అనుభవాలు ఇట్లా వుంటే కాలేజీ బయట సాంస్కృతిక రంగంలో వేములవాడ ఫిలిం సొసైటీ, సిరిసిల్లాలో ఫిలిం సొసైటీ ఏర్పాటు, మా “లయ” కవితా సంకలనం వెలువడడం ప్రధాన జీవనానుభావాలు. సాహిత్యమూ, కళాత్మక సినిమా రంగాలతో నా సహజీవనం అప్పుడే మొదలయింది. సినిమాలు, ఫిలిం సొసైటీ ఉద్యమం ఒక పార్శ్వమయితే సాహిత్యం మరోటి.
సాహిత్యం విషయానికి వస్తే 1982 లో వెలువడ్డ లయ మా మొదటి సంకలనం.
70 వ దశకం చివర, 80వ దశకం తొలి రోజుల్లో తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత ఓ ఉప్పెన. దాదాపు ఆ నాటి యువకవులంతా మినీ కవితా రచనలో మునిగి పోయారు. మరో వైపు కందుర్తి లాంటి వాళ్ళు మినీ కవితని అంగీకరించ లేదు. అనేక వాదాలూ వివాదాలూ నెలకొన్నాయి. ఆ నేపధ్యంలో వేములవాడ పోయెట్రీ ఫోరం నుంచి వెలువడిన అయిదుగురు యువ కవుల సంకలనం ‘లయ’ (‘RHYTHM’). అందులో జింబో, వఝల శివకుమార్, పి.ఎస్.రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్, వారాల ఆనంద్ రాసిన మినీ కవితలున్నాయి. అప్పుడు లయకు మంచి స్పందనే వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర లేవు గానీ మంచి సమీక్షలూ వచ్చాయి. అట్లా లయ ఈ అయిదుగురు కవులకూ గొప్ప లాంచింగ్ పాడ్ అనే చెప్పుకోవచ్చు.
***
“కవిత్వం మన జీవన విధానానికీ, జీవిత సంఘర్శనలకీ ప్రతిస్పందన”
“ఎక్కడ సమస్యలుంటాయో అక్కడ సంఘర్షణ వుంటుంది, అక్కడ కవిత్వమూ వుంటుం ది, ఆ సంఘర్షణలకు “లయ”గా ఈ సంకలనం మీ ముందుకు తెస్తున్నాం” అని ప్రకటించి ఈ సంకలనాన్ని తెచ్చాము.
నేను అప్పటికే లైబ్రరీ సైన్స్ కోర్సు పూర్తి చేసి మొదట మంథనిలో తర్వాత ఏప్రిల్ 1980లో సిరిసిల్ల జూనియర్ కాలేజీలో చేరిపోయాను. రవీంద్ర ఫోటో స్టూడియో ఏర్పాట్ల ల్లో, శివకుమార్ పైచదువులకు జబల్పూర్ వెళ్ళే ప్రయత్నాల్లోనూ వున్నారు. జింబో భరత్ భూషణ్ తీసిన ఫోటో, శేఖర్ తో లెటర్స్ రాయించి పుస్తకానికి కవర్ పేజీ ప్రింట్ చేయిం చాడు. ఇక ఇన్నర్ పేజీల బాధ్యత నేను తీసుకుని సిరిసిల్లాలోని ఒక ప్రెస్ లో అచ్చు. బైండింగ్ పనులు చూసాను. అట్లా ‘లయ’ వెలుగులోకి వచ్చింది. అప్పటికే కరీంనగర్లో శిల్పి స్టూడియోతో మాకు సన్నిహితుడయిన అలిశెట్టి లయలో భాగస్వామ్యానికి అంగీ కరించాడు.
అప్పుడు మొదలయిన కవుల్లోంచి అలిశెట్టి సెలవంటూ లోకం నుంచి వెళ్ళిపోగా ఇప్పటికీ జింబో, వఝల శివకుమార్ , పి.ఎస్. రవీంద్ర, వారాల ఆనంద్ సృజనాత్మక రంగంలో వుండడం, అందరూ దాదాపు అప్పటి అదే ఉత్సాహం కలిగి వుండడం నాకెంతో సంతోషంగా వుంది.
లయలోని కొన్ని కవితల్ని ఇక్కడ ఇస్తున్నాను 1980ల నాటి ఈ మినీ కవితల్ని చదవండి
“బతుకు”
నే చచ్చిపోతాననే కదూ
నీ బాధ
పిచ్చివాడా
ఈ వ్యవస్థలో మనం బతికింది
తొమ్మిది మాసాలే”
-జింబో
———-
వేదనా గీతం
మాకు మీలా సేఫ్టీ లాకర్లల్లో
వసంతాల్ని బంధించడం చేత కాదు
వ్యధల్ని గుండెల్లో బంధించుకోవడం తప్ప
మాకు వెన్నెల్లో రమించడం తెలీదు
సూర్యుడిలో వెన్నెల్ని కోరుకోవడం తప్ప
ఊహా విహాసయంలో గంధర్వ
విపంచి వినిపించదు
పేగుల తీగల వేదనా సహిత గీతం తప్ప
కారణం
మీరు మా చెమటని
మేం మా ఆకల్నీ తిని బతుకుతాం
-వఝల శివకుమార్
———
“రాత్రి చనిపోయింది”
వర్షం భోరున ఏడుస్తోంది
అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు
నాకేమిటని
గాలి వీస్తోంది
నేనున్నాని
సూర్యుడు తొంగి చూస్తున్నాడు
మబ్బుల తెర అడ్డం వస్తుంది
నేను అప్పుడే లేచి చూసాను
చనిపోయింది ఎవరా అని
ఆలోచిస్తే తెలిసింది
చనిపోయింది రాత్రేనని
-పి.ఎస్.రవీంద్ర
————–
“రీప్రింట్”
ఈ సమాజం
అచ్చు తప్పులున్న
ఓ గొప్ప పుస్తకం
ఇప్పుడు కావాల్సింది
తప్పొప్పుల పట్టిక
తయారు చేయడం కాదు
ఆ పుస్తకాన్ని
సమూలంగా
పునర్ ముద్రించడం జరగాలి
-వారాల ఆనంద్
——————–
“ఉనికి”
అలా
సమాధిలా
అంగుళం మేరకన్నా
కదలకుండా పడి వుంటే ఎలా
కొన్నాళ్ళు పోతే
నీ మీద నానా గడ్డీ మొలిచి
నీ ఉనికే నీకు తెలిసి చావదు
-అలిశెట్టి ప్రభాకర్
***
అట్లా లయ కవితా సంకలనం నా యాదిలోనూ తెలుగు కవితా ప్రపంచంలోనూ మిగిలిపోయింది.
*****
(సశేషం)
వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు.
రచనలు-
లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం), ముక్తకాలు(చిన్న కవితలు)
అర్థవంతమయిన ‘సినిమా’ల పై పుస్తకాలు- నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, సినీ సుమాలు , 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణాలో చలన చిత్రం,
తెలంగాణ సినిమా దశ దిశ, Signature of Love(poetry), Children’s Cinema, Documentary films made-
తెలంగాణా సాహితీ మూర్తులు: ముద్దసాని రాంరెడ్డి, యాది సదాశివ,
శివపార్వతులు, Long Battle with short messages,
A Ray of Hope, KAFISO a saga of film lovers.