విజ్ఞానశాస్త్రంలో వనితలు-11

వృక్ష-రసాయన శాస్త్రవేత్త ఆషిమా ఛటర్జీ (1917-2006)

– బ్రిస్బేన్ శారద

          ఆయుర్వేదం, యునాని వంటి వైద్య పద్ధతులకి భారతదేశం పుట్టినిల్లు. మొక్కలు, వృక్షాలూ, ఆకులూ, వేర్లూ, అన్నిటిలో మనిషులకొచ్చే చాలా రుగ్మతలకి మందులున్నా యని ఈ వైద్య విధానాలు నమ్ముతున్నాయి. అయితే ఆయుర్వేదం లాటి వైద్యవిధానా లు ఏ మొక్కా, లేక ఏ ఆకు ఏ జబ్బు నయం చేస్తుందో చెప్పగలవే కానీ, ఆయా ఆకుల్లో వున్న రసాయనాలకూ, వాటి లక్షణాలకూ వున్న సంబంధాన్ని గురించి చెప్పదు. ఆకుల్లో, ఇంకా మిగతా ఇతర వృక్ష భాగాల్లో వుండే రసాయనాల అధ్యయనం కొంచెం ఆలస్యంగానే మొదలైందని చెప్పొచ్చు.

          వృక్షశాస్త్రాన్ని రసాయన శాస్త్రంతో అనుసంధానించి చేసే అధ్యయనాలు ఈ వైద్య విధానాలకి ఎంత ముఖ్యమైనవో వేరే చెప్పక్కర్లేదు. ఈ శాస్త్రాన్ని “ఫైటో కెమిస్ట్రీ” (Phyto-chemistry)  అని పిలుస్తారు. వృక్షాల్లో, చెట్ల భాగాల్లో వుండే వివిధ రకాలైన రసాయనాలని విశ్లేషించి, వీటిల్లో మనిషికి పనికొచ్చేవేవో తేల్చి చెప్తుందీ శాస్త్రం. మొక్కల్లోని రసాయనా లనీ, ఔషధ గుణాలనీ విశ్లేషించే శాస్త్రాన్ని ఫైటోమెడిసిన్ (Phytomedicine) అంటారు.

          ఆ మాటకొస్తే, కేవలం వైద్యానికే కాదు, ఈ వృక్ష రసాయనాల్లో మనిషి మనుగడకి పనికొచ్చే విషయాలింకెన్నో వున్నాయి. రంగులూ, ఆహార పదార్థాలు, ఇలాటి వాటిల్లొ కూడా వృక్షాల్లో వుండే రసాయనాలు పనికొస్తాయి. మనది ఎంతో వైవిధ్యమైన వృక్ష సంపద వున్న దేశం కావడంతో సహజంగానే వీటి గురించిన పరిశోధనలు చాలానే జరిగాయి.

          మామూలుగా వృక్షశాస్త్రాన్నో, రసాయన శాస్త్రాన్నో చదవడం ఒక ఎత్తైతే, ఇటు వంటి ప్రత్యేకమైన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, పైగా అందులో విశేష ప్రతిభ కనపర్చడం మామూలు విషయం కాదు.

          డాక్టర్ ఆషిమా ఛటర్జీ అటువంటి ఒకానొక ప్రత్యేకమైన ప్రతిభాశాలి. మామూలు చదువులకే ఆడపిల్లలు కష్టపడే రోజుల్లో ఆవిడ రసాయన శాస్త్రంలో ప్రపంచ స్థాయి పరిశోధనలు చేసారు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ సాధించిన మొట్టమొదటి మహిళగా ఆమెని పేర్కొంటారు.

          ఆషిమా 1917 సెప్టెంబరు 23న కలకత్తా నగరంలో జన్మించారు. ఆమె తండ్రి ఇంద్ర నారాయణ్ ముఖర్జీ కలకత్తాలోని ప్రముఖ వైద్యుడు. వారిది మామూలు మధ్య తరగతి కుటుంబం. 1936లో కెమిస్ట్రీలో బి.యెస్.సి, 1938 లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్.సీ ముగించారు ఆషిమా. ఆ పైన ఇంకా ముందుకెళ్ళి కలకత్తా యూనివర్సిటీలో 1944లో పీహెచ్‌డీ కూడా ముగించారు. ఒక భారతీయ విశ్వవిద్యాలయం ఒక మహిళకి డాక్టరేట్ ఇవ్వడం అదే మొదలు. వృక్షాల్లోంచి ఉత్పత్తి చేస్కునే పదార్థాల్లోని రసాయన చర్యల మీద ఆవిడ పీహెచ్‌డీ పరిశోధన సాగింది. ఆ పరిశోధనలకోసమై ఆషిమా ప్రపంచ ప్రసిద్ధు లైన శాస్త్రజ్ఞులు, శ్రీ సత్యేంద్రనాథ్ బోస్, శ్రీ ప్రఫుల్ల చంద్రరే లతో కలిసి పని చేసారు.

          పీహెచ్‌డి ముగించిన ఆషిమా పై పరిశోధనల కోసం విస్కాన్సిన్, కాల్‌టెక్ యూనివర్సిటీలలో పని చేసారు. అక్కడ ఆవిడ వృక్షాల్లో వుండే రసాయన పదార్థాల (వీటిని Alkaloids అంటారు) గురించి పరిశోధన చేసారు. వీటిల్లో మానవ శారీర రుగ్మత లను నయం చేయగల biologically active alkaloids పైన ప్రత్యేకమైన ఆసక్తి చూపెట్టారు.

          1949 నుంచీ 1950 వరకూ ఆవిడ స్విట్జర్లాండ్ లో పని చేసారు. 1950లో కలకత్తా తిరిగొచ్చి, లేడీ బ్రేబౌన్ కాలేజీలో తాను అంతకుముందే స్థాపించి వున్న కెమిస్ట్రీ విభాగంలో లెక్చరరుగా చేరారు. 1954లో కలకత్తా విశ్వవిద్యాలయంలో రీడరుగా పదోన్నతి పొందారు.

          అప్పటినించి 1982లో పదవీ విరమణ చేసేంత వరకూ అవిడ పరిశోధన అప్రతి హతంగా సాగిపోయింది. ఆ పరిశోధనా ఫలితాలు కొన్ని మచ్చుకు-

  • ఆల్కలాయిడ్ లక్షణాల విశ్లేషణలో కొత్త పద్ధతులు, వీటి వల్ల కొన్ని సంక్లిష్టమైన ఆల్కలాయిడ్‌లని కూడా అర్థం చేసుకొని వాడుకోవడం సులువైంది.
  • వింకా అనే ఆల్కలాయిడ్‌ల విశ్లేషణ- వీటిని కొన్ని రకాల కేన్సర్ చికిత్సలలో వాడుతున్నారు.
  • మూర్ఛ వ్యాధికి ఆయుష్-54 అనే ఆయుర్వేద మందు
  • మలేరియా చికిత్స కోసం ఆయుష్-64 అనే మందు
  • ఇవే కాక ఆవిడకి ఎన్నో ఆయుర్వేద మందులకు పేటెంట్ హక్కులున్నవి.

          ఈ చికిత్సలూ, మందులే కాకుండా ఆవిడ ఆయుర్వేద చికిత్సా, పరిశోధనల కోసం ఒక రీజినల్ రీసెర్చ్  ఇన్స్టిట్యూట్ ని కలకత్తాలో స్థాపించారు. ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న ఈ పరిశోధనాలయాన్ని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ డ్రగ్ అండ్ డెవెలొప్మెంట్ (NRIADD) అని పిలుస్తారు.

          1972 నుండీ 2003 వరకూ ఆషిమా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కి (ఆనరరీ) ప్రోగ్రాం కొ-ఆర్డినేటర్ గా సేవలందించారు. వృక్షాల్లోని చికిత్సా విశేషాల గురించి ఎన్నో వైద్య గ్రంథాలు రచించారావిడ.

          1975 లో పద్మ భూషణ్ సత్కారమూ, 1989లో ఆశుతోష్మూకర్జీ బంగారు పతకమూ ఆవిడని వరించాయి. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీకి ఎన్నికైన మొదటి మహిళా శాస్త్రవేత్త ఆషిమా.

          1945లో అవిడ రసాయన శాస్త్రవేత్త శ్రీ బరదానంద చటర్జీని వివాహమాడారు. వీరికొక కుమార్తె, జూలీ.1967లో నాలుగు నెలల తేడాతో తన తండ్రినీ, భర్తనూ కోల్పోయారు ఆషిమా. ఆ కష్ట సమయంలో ఆమె ప్రయోగశాలలోని సహోద్యోగులే ఆమెకి అండగా నిలిచారు. శ్రీ బరదానంద గౌరవార్థం బెంగాల్ఇంజినీరింగ్ కళాశాలలో ఒక రసాయన శాస్త్ర ఆచార్య పదవిని నెలకొల్పారు ఆషిమా.

          2006 నవంబర్ 22 న మరణించిన ఆషిమా ఛటర్జీ వృక్షాల్లోని ఔషధ గుణాల పరిశోధన కోసం, విజ్ఞానా శాస్త్ర బోధన కోసం చివరి దాకా శ్రమించారు. 2017 సెప్టెంబరు 23న గూగుల్ ఆషిమా ఛటర్జీ నూరవ జన్మదినం సందర్భంగా గూగుల్ డూడుల్ వేసింది.

***

*శ్రీ సత్యేంద్రనాథ్ బోస్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రానికి ఎనలేని సేవ చేసారు. ఆయన గౌరవార్థమే భౌతిక ప్రపంచంలోని ఒక రకమైన కణాలకి బోసోన్స్అని పేరు పెట్టారు. నిజ జీవితంలో మనం చూసే కాంతి కణాలు (ఫోటాన్) బోసోన్ కి ఒక ఉదాహరణ.)

*శ్రీ ప్రఫుల్లచంద్ర రే ని నైట్రిట్ శాస్త్రానికి అద్యుడిగా భావిస్తారు. భారతీయ రసాయన శాస్త్ర పరిశోధనల్లో ఆయనకున్న పేరు సాటిలేనిది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.