వ్యాధితో పోరాటం-23

కనకదుర్గ

          నాకేమనిపించిందంటే శైలు చేసిన గొడవ మా ఇంట్లో అందరికీ చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్నానేమో అనుకుంటూ వచ్చి ఉంటాడేమో!

          మర్నాడు నేను లేచి కాల కృత్యాలు తీర్చుకుంటుంటే అమ్మ కాఫీ చేసి, ఉప్మా టిఫిన్ కూడా చేసి పెట్టింది అల్లుడికి.

          నేను వచ్చి శ్రీనిని స్నానం చేస్తావా అని అడిగాను. శనివారం ఆఫీస్ ఉండదు, స్నానం చేసి, బోంచేసి సాయంత్రం ఇంటికి వెళ్దామంటాడనుకున్నాను.

          “లేదు, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను,” అన్నాడు.

          ” అయితే నేను స్నానం చేసి వస్తాను,” అని చెప్పి లోపలికి వెళ్ళాను.

          స్నానం చేసి వచ్చే వరకు వెళ్ళిపోయాడు. నాన్న, ” నువ్వు స్నానానికి వెళ్ళగానే, పాంట్, షర్ట్ వేసుకుని, వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడమ్మా. నేను అమ్మ భోజనం చేసి వెళ్ళమని ఎంత చెప్పినా వినలేదు. ఏమ్మా! అంతా బాగేనా? ఏదైనా సమస్యా?” అని అడిగాడు నాన్న.

          “వెళ్ళిపోయాడా? అయ్యో! అదేం లేదు నాన్న, అంతా బాగానే ఉంది. నన్నందరూ బాగా చూసుకుంటారు.” అని చెప్పాను కానీ మనసులో విపరీతమైన నిరాశా, నిస్పృహలు చోటు చేసుకున్నాయి.

          శ్రీని వాడిన టవల్ తీసే వరకు నా నోట్బుక్ పాతది అక్కడ పడి ఉంది. నాన్న దాంట్లో పద్దులు రాసుకుంటున్నారు.

          నోట్బుక్ తీసి పెట్టడానికి తీసే వరకు అందులోంచి ఒక నోట్ పడింది. అమ్మా, నాన్న లోపలికి వెళ్ళిపోయారు నయం. అసలే నాన్నకు అనుమానం వస్తుంది.

          ఆ నోట్ తీసి చదివాను.

          ” నీకు అన్నీ తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావు. ఇపుడు అడ్జస్ట్ కావడానికి రావటం లేదంటే నీ ఇష్టం. నీకు రావాలనిపిస్తే రా, లేకపోతే వెళ్ళిపోవచ్చు.”

          నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  ఏం రాసాడు? వెళ్ళిపోవాలా? ఎక్కడికి? ఎందుకు? పెళ్ళంటే బొమ్మలాటను కుంటున్నాడా?

          నేనే మన్నాను, అడ్జస్ట్ కావడానికి నేననుకున్నదాని కన్నా ఎక్కువ సమయం పట్టొచ్చని అన్నానే కానీ, నేను వేరు వెళ్దామనలేదు. అలా చెపితే అడ్జస్ట్ కావడానికి నీకెలాంటి సాయం కావాలో చెప్పు, నాకు చేతనయినంతగా నేను సాయం చేస్తానం టాడనుకున్నాను కానీ ఇలా నిర్దయగా వెళ్ళిపో అని ఒక్క మాటలో తేల్చేస్తాడనుకో లేదు.

          నాకు 22ఏళ్ళ వయసు, తనకి 26 ఏళ్ళు – నాలుగు సంవత్సరాల తేడా అంతే. అదే కాదు. డబ్బాలు కొట్టుకునే తత్వం కాదు, మద్రాస్ ఐ.ఐ.టి లో ఎం.టెక్ చేసాడు మంచి తెలివైన వ్యక్తి, పుస్తకాలు చదివే అలవాటుంది, కుటుంబం అంటే ప్రేమ.

          ఒకవైపు కోపం, ఉక్రోషం, మరో పక్క అమ్మ వాళ్ళు చూస్తే బాధ పడతారేమోనని కంగారు. అవును వీళ్ళే కదా! నేను వాళ్ళింట్లో అడ్జస్ట్ కాలేమోనని చెబుతున్నా అబ్బాయి మంచివాడు, మంచి ఉద్యోగం, నువ్వు  కోరుకున్నట్టుగా కట్నం తీసుకోవడం లేదు, చదువుకోవడానికి అభ్యంతరం పెట్టడని నచ్చచెప్పి, చినమామయ్యతో నచ్చచెప్పించి మరీ చేసారు. ఇపుడు చెప్పనా, ఎంత మంచివాడో – చెప్పేయనా?

          “చిన్ని ఎప్పుడొచ్చావే? శ్రీనివాస్ రాలేదా?’ అనే మాటతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.

          మా అన్నయ్య పక్కనే ఉంటాడు. వచ్చాడు.

          “నిన్న మధ్యహ్నం వచ్చా అన్నా. శ్రీనివాస్ రాత్రి వచ్చాడు, ఇపుడే వెళ్ళిపోయా డు.” అన్నాను నన్ను నేను కూడతీసుకుని.

          ” ఈ రోజు శనివారం కదా! ఆఫీసుండదు ఈ రోజు, రేపు వుండి రేపు రాత్రికి వెళ్ళా ల్సింది!” అన్నాడు అన్నయ్య.

          నాన్న వచ్చి, “మేమదే అన్నాము. కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.” నాన్నకు శ్రీని ప్రవర్తన అయోమయంగా ఉంది. ఎందుకంటే తన పేరు చిన్నల్లుడి పేరు ఒకటేనని, తనలాగే బాధ్యాతాయుతమైన మనిషని, కష్టపడి పని చేస్తాడని, చాలా మర్యాదగా ఉంటాడని, పెద్దలను గౌరవం ఇస్తాడని చాలా మెచ్చుకుంటుండేవాడు.

          నేను లోపలికి వెళ్ళాను. అమ్మని చూడగానే పట్టుకుని గట్టిగా ఏడవాలనిపించింది.

          “అమ్మా నీకు గుర్తుందా, నాకు ఎంట్రన్స్ లో మంచి మార్కులే వచ్చాయి కదా! నేను చదివింది వనితా కాలేజ్ లోనే కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే సీట్ వచ్చేది. అపుడు ఎం.ఏ ఇంగ్లీష్ పొద్దున, సాయంత్రం భారతీయ విధ్యాభవన్ లో జర్నలిజం చేసే అవకాశం వుండేది. కానీ పొద్దున్నుండి, రాత్రి దాక బయటే వుంటే ఇంట్లో వాళ్ళతో కలిసిపోవడం కష్టం అవుతుంది, అదీకాక మా అత్తగారికి కొంచెమన్నా సాయం చేయకుండా బయటే వుంటే బావుండదని ఒకటే నాకిష్టమయిన జర్నలిజం కోర్స్ చేస్తాను అని చెప్పాను….”

          “అవును గుర్తుంది. ఇపుడేమయింది?” అన్నది అమ్మ.

          ” ఏం లేదమ్మా! ఇట్లాంటివి గుర్తుపెట్టుకోరు మనుషులు..”

          మా అమ్మ దగ్గరకొచ్చి, ” ఏం జరిగిందమ్మా? నిన్నటి నుంచి చాలా ఢల్ గా ఉన్నావు. ఎవరేమన్నా అన్నారా?”

          ” ఏం లేదమ్మా! మీరు చాలా గుర్తొస్తున్నారని ఒక్కరోజు మీతో ఉందామనుకుని వచ్చాను. మనం కలిసి సమయం గడపనే లేదు.” అన్నాను పొంగుకొస్తున్న దు:ఖాన్ని అదిమిపెడ్తూ.

          “మీరిద్దరూ బాగున్నారా? గొడవలేం లేవు కదా!”

          ” లేవమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. చదువుకుంటున్నాను. ఇంకేం కావాలి.” అన్నాను.

          ఉద్యోగం లేకుండా పెళ్ళి చేసుకున్నందుకు చెప్పు తీసుకుని నన్ను నేను బాగా కొట్టుకోవాలనిపించింది.

          పెళ్ళి కాక ముందు నేను రోజు ఏడ్ఛేదాన్ని కాదు. కాపురానికి వెళ్ళిన రెండు నెల్ల నుండి ఏడవని రోజు లేదు.

          పెళ్ళంటే అంత ఈజీకాదని, ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకోకుండా పెళ్ళి చేసుకోకూడదని అంటే ఇద్దరూ సమాన బంధం కావాలనుకుంటే, ఆ బంధం ఎలా వుండాలి, మన జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇద్దరూ బాధ్యతలను సమంగా ఎలా పంచుకోవాలనే విషయాలు ముందే చర్చించుకోవాలి. ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరితో ఎలా ఉండాలి, అందరూ వచ్చిన కొత్త కోడలితో ఎలా ఉండాలి అనే అవగాహాన ఉండాలి. లేకపోతే సినిమాలో కోడలు రాగానే బాధ్యాతలన్నీ తీసుకుని ఎంత బాగా చూసుకుంటున్నా అత్తా, ఆడబిడ్డలు కష్టాలు పెట్టడం అయినా సహనంతో ఆ కోడలు అన్నీ భరించి పూజలు చేసి కుటుంబాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తుంది కదా! అలాగే ఉండాలనుకుంటారు నిజజీవితంలో కోడళ్ళు కూడా!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.