గులకరాళ్ళ చప్పుడు(కథ)
-శ్వేత యర్రం
కెనాల్ కట్ట మీద నాగేశ్వరస్వామి గుడికాడ జనాలే లేరు ఆ రోజు. రాధమ్మ నవ్వులు మాత్రం ఇనిపిస్తున్నాయ్. వాళ్ళ నాయన రామిరెడ్డి, కూతురు రాధమ్మ నవ్వులు చూస్కుంట, బీడీలు తాగి సందుల మధ్య గారలు పట్టిన పళ్ళతోటి నవ్వుకుంట, కూతురు దోసిలిపట్టిన చేతులల్ల గులకరాళ్ళు పోస్తున్నాడు. రాధమ్మ దోసిలినిండా ఉన్న గులక రాళ్ళు జాగర్తగ పట్టుకొని, కట్టకు కిందికి దిగనీక ఉన్న మెట్లలో రెండు దిగి నీళ్ళల్లోకి గట్టిగ ఆ రాళ్ళు యిసిరేస్తుంది. రెండోకారు పంటకొరకు కేసీ కెనాల్ కాల్వల గవర్నమెంటు ఇడ్సిన నీళ్ళు నిండుగున్నయి ఇంకా. ఆ నీళ్ళల్ల రాధమ్మ ఏసిన గుప్పెడు గులకరాళ్ళు, వేడి నూనెల ఇడిసిన బూందిలెక్క ‘సుయ్’మని సప్పుడుజేస్తుంటే రాధమ్మ నవ్వుకుంట ఎగురుతుంది. ‘చూశ్నవా నాయన ?!’ అనంగనే రామిరెడ్డి నవ్వుకుంట ఇంకొన్ని గులక రాళ్ళు చేతులల్ల ఏర్కొని, వచ్చి తీస్కపొమ్మని కూతురికి సైగ చేశ్నాడు.
కట్టకాన్నుంచి ఇంటికొచ్చెటప్పుడు బోయ రత్నమ్మ అంగట్ల ఎగ్గుబోండా కొనిచ్చినాడు రాధమ్మకు. తినమంటే ఇంటికాడ తిందమనింది. రామిరెడ్డికి తెల్సు కూతురు ఇంటికాడ ఎందుకు తిందమనిందో, ఆ పిల్ల ప్రేమకి కండ్లల్ల నీళ్ళు తిరిగినయి. ఇంటికి పోయినమ్మటే వాళ్ళమ్మనడిగి ఆ ఒక్క గుడ్డుతో ఏసిన బొండాని నాలుగు ముక్కలు చేపిచ్చుకోని, ‘అమ్మా, ఇది నీకూ, నాకూ’ అని రెండు ముక్కలు ఆన్నే పెట్టీ, ‘నాయనా నీ మందులోకి’ అని ఒక ముక్క చిన్న ప్లేట్ల పెట్టి రామిరెడ్డికిచ్చి, మిగిలిన ముక్క చుట్టిచ్చిన పేపర్లనే తీస్కపొయి ‘ఒర్యా బాలూ, యాడున్నవురా?’ అని గట్టిగ అర్సి, ఉరుక్కుంటొచ్చిన కుక్కపిల్లకు మిగిలిన ముక్కపెట్టి ఇంట్లోకి పోయింది.
అన్నం తినుకుంట స్కూళ్ళ జరిగినవన్ని చెప్తుంది రాధమ్మ. మధ్యమధ్యల ఇంగ్లీషుల మాట్లాడుకుంట, అమ్మానాయనలకు అర్థంకాదని మళ్ళ అదే మాట తెలుగుల చెప్తుంది. చెన్నమ్మ అంగట్ల అప్పుకు తెచ్చుకున్న పదిరూపాయల సారాయి ప్యాకెట్టు కొరికి గ్లాసులో నీళ్ళతోటి కల్పుకొని, బోండా నంజుకొని తినుకుంట, కూతురి మాటలు ఇనుకుంట మురిసిపోతున్నాడు రామిరెడ్డి.
కూతురికి మొత్తం వాళ్ళ నాయన మాటలే వచ్చినయి అనుకుంట నవ్వుకుంట ఇంటుంది పార్తమ్మ.
పెళ్ళైన పదేడేళ్లకి రాధమ్మ పుట్టింది. తిరుపతికి పోయి గుండుకొట్టిచ్కరమ్మని రామిరెడ్డి వాళ్ళమ్మ ఒకటే సతాయిస్తుంటే ఎల్లాడ్డి కాడ అప్పుజేసి జీపు బాడిగకి తీసుకున్నాడు రామిరెడ్డి, కూతురు కష్టపడకూడదని. ఆ డ్రైవర్ నంద్యాల్లో ‘భోజనం చేసొస్తాన్నా’ అని పోయి ఫుల్లుగ తాగొచ్చి జీప్ నడిపి డివైడర్ ఎక్కిచ్చి అవతలి రోడ్డు మీదికి పోనిచ్చినాడు. మందు ఎక్కువై, అట్లనే ఇంకా ఆపకుండ పోతనే వుంటే, భుజం మీదున్న టవల్ తీసి డ్రైవర్ గొంతుకేసి గుంజి, ‘నీయవ్వ బండాపు’ అని గట్టిగ అర్శినాడు రామిరెడ్డి. అప్పటికి ఐపులోకొచ్చిన డ్రైవర్ బండి రోడ్డుపక్కకాపి, దిగి పారిపోయినాడు.
బండి రిపేర్ డబ్బులకి మళ్ళ ఎల్లాడ్డి కాన్నే అప్పు తీసుకున్నాడు. పెళ్ళానికి, నాలుగు నెలల కూతురుకి దెబ్బలేం తగల్లేదనే సంతోషం తప్పిచ్చి రామిరెడ్డికి అప్పులతోటి తలకాయనొప్పులెక్కువయినై. దానికితోడు రెండేళ్ళ నుండి బుడ్డలిత్తనాలు, కందులు పంట సరిగా రాక నష్టాలొచ్చినయి. గుత్త డబ్బులు సగమే కట్టినందుకు చిన్నలక్షిమిరెడ్డి యాడబడ్తే ఆడ తక్కువజేసి మాట్లాడ్తున్నాడు. ఒకేడు బావుండి ఇంకో ఏడు బాలేకా అట్లనే చేను గుత్తకు చేస్కుంట వస్తున్నాడు రామిరెడ్డి.
కూతురు తనలెక్క కాకుండ బా చదువుకోవాల్నని టౌన్ల ఇంగ్లీష్ మీడెం స్కూలుకి
పంపిస్తున్నాడు. పదకొండేండ్ల రాధమ్మ క్లాసుల ఎప్పుడు ఒకటో ర్యాంకో రెండో ర్యాంకో
తెచ్చుకుంటది. ‘నేను డాక్టర్ అయిత అమ్మా, హార్ట్ డాక్టర్, నాయన గుండె కొట్టుకుంటుందా లేదా నేనే చూస్త’ అని రాధమ్మ చేతులు తిప్పుకుంట చెప్తుంటే రామిరెడ్డి నవ్వుకుంట మీసం తిప్పుకుంటాడు.
ఈ సారి ఎప్పట్లెక్క కాకుండ పక్కూరోళ్ళని చూసి గుత్తకు తీస్కున్న చేన్ల ఉల్లిగడ్డ లేశ్నాడు రామిరెడ్డి. శానా రేటు పెట్టి కొనుక్కొచ్చినాడు ఇత్తనం. ఊర్లో ఎవరూ ఏయని పంట ఏస్తే ఊరోళ్ళంతా చేను మీదపడి పీక్కపోతారు, అందుకే ఉల్లిగడ్డలు లావు అయినా ల్నుంచి రోజూ చేనికాన్నే నులకమంచం ఏస్కోని పండుకునేటోడు రామిరెడ్డి. ఎప్పుడన్న సాయంత్రంపూట రాధమ్మ గానీ ‘కట్టకాడికి పోదం నాయనా, గులకరాళ్ళ ఆటాడుకుందం’ అంటే మాత్రం ఎమ్మటే తీస్కపోయెటోడు,
‘ఆ సప్పుడంటే భలిష్టం రాధమ్మకు’ అని మనసులనే అనుకుంట. ఇంగో రెండు రోజులల్ల ఉల్లిగడ్డ పెరికి, కాడలు తరిగి, కాటం చూసి, సంచులల్ల పొయ్యాల. రామిరెడ్డి టౌన్ల లారీ మాట్లాడొచ్చినాడు, కర్నూలు రైతుమార్కెట్‌కి తోల్కపోయి ఉల్లిగడ్డలు అమ్మి రానీకే. రాధమ్మ స్కూలు ఫీజడిగితే ‘రెండ్రోజులల్ల కడ్తమని చెప్పమ్మా స్కూళ్ళ’, అని, ‘పంట బాగొచ్చింది, డబ్బులు బానే వచ్చేటట్లున్నయ్ పార్తమ్మ’ అని భార్యకి చెప్పి, కూలోళ్ళని మాట్లాన్నీక పోయినాడు. డబ్బులొస్తే అమ్మనాయన నవ్వుకుంట ఉండొచ్చని రాధమ్మ అనుకుంటుంటది ఎప్పుడు.
నాయన అమ్మతోటి చెప్పిన మాటలకు రాధమ్మ ఉరుక్కుంట అమ్మకాడికి పోయి, అమ్మ బుగ్గలు పట్టుకొని ముద్దుపెట్టుకుంట, ‘డబ్బులొస్తాయామ్మా మనింటికి?’ అని నవ్వుకుంట అడిగింది. పార్తమ్మ నవ్వుకుంట జొన్నరొట్టె మీద ఎన్నపూస పూసి, చుట్ట జుట్టి రాధమ్మ చేతికిచ్చింది. అది నోట్లవెట్టుకొని కొరుక్కుంట బయట ఆడ్కనీక పోయింది రాధమ్మ.
లారీ నిండా లోడైంది ఉల్లిగడ్డ. ఊర్లో శానమందొచ్చి చూసిపోతున్నారు రామిరెడ్డి పంటని. రామిరెడ్డి సంబరానికి తక్కువలేకుండ పోయింది ఆ రోజు. పంట డబ్బులు రావాలని, వస్తయని ఆశతోటి పొద్దున స్కూలుకి పోయేటప్పుడు ఇంట్ల దేవుడి గూడు కాడ మొక్కుకుంట ‘సాయంత్రం కట్టకాడ గుడికొస్తలే సామి’ అని దేవునికి చెప్పింది రాధమ్మ.
కర్నూల్ నుంచి వాళ్ళూరికి పోవాలంటే మధ్యల రాధమ్మ స్కూలుండే టౌను మీన్నుంచే పోవాల. వాళ్ళ ఊరికి స్కూలు బస్సులు రావు, ఎట్లనో ఇరుక్కొని ఆర్టీసీ బస్సులనే పిల్లలు టౌన్ల స్కూలుకి పోతుంటారు. ‘సాయంత్రం స్కూలు ఇడ్సినాక నేను
ఇంటికొచ్చె బస్సులనే నాయన కర్నూల్ నుంచి వస్తే బావుండు’ అని ఆ రోజు స్కూళ్ళ ఉన్నంతసేపు అనుకుంటనే ఉంది రాధమ్మ.
అనుకున్నట్లే బస్సుల నాయన్ని చూసి సంబరంగా ఉరుక్కుంటబోయి రామిరెడ్డి కాలుమీద కూర్చోయింది. నాయన మొకంల నవ్వులేదు. ‘ఏమైంది నాయనా’ అని రాధమ్మ అడిగితే, ‘మార్కెట్ల ఉల్లిగడ్డను రేటు పడిపోయిందంట తల్లి. రెండ్రుపాయలు కేజీ అంటే లారీ బాడుగకి కూడ సరిపోల్యా. మార్కెట్ కాన్నే ఎవరో తెల్సినోళ్ళు కనబడ్తే లారీ బాడుగకి, బస్సు చార్జీలకి అప్పు తెచ్చుకున్న. ఇంత అద్వాన్నం ఎన్నడు చూడల్యా రాధమ్మ’ అని ఏడుపు ఆప్కోని ఎర్రగైన కళ్ళతోటి కూతుర్ని చూస్కుంట చెప్పినాడు రామిరెడ్డి. ఇంటికి పోయేవరకు ఏం మాట్లాడకుండ మనసులనే దేవున్ని తిట్టుకుంట కూర్చుంది రాధమ్మ. శాన కోపమొచ్చింది దేవుడి మీద రాధమ్మకు, కట్టమీంద గుడికి పోయి వాయన్నే అడిగిరావాలనుకోయింది. నష్టమొచ్చిందని ఒకటే మాట భార్య పార్తమ్మ కు చెప్పి, రాత్రయ్య వరకు బర్లకొట్టంలనే ఉన్నాడు రామిరెడ్డి. ఆ రోజు చెన్నమ్మ కాడ అప్పుచేసి తెచ్చుకున్న సారాయి సరిపోల్యా. ‘బయిటికి పోయొస్తా’ అని భార్యకు చెప్పి మళ్ల చెన్నమ్మ కల్లంగడికి పోయినాడు. పొద్దున్న ఉల్లిగడ్డ అమ్మినాక లారీ బాడుగకు అప్పు అడగనీక మార్కెట్టు మొత్తం ఎండలనే తిరిగినేది గుర్తొచ్చి, ఇంగో సారాయి ప్యాకెట్టు అప్పడగలేక బయటికొచ్చినాడు. రాత్రి ఇంటికి పోల్యా రామిరెడ్డి. మర్సటి రోజు పొద్దున్న గూడ పోల్యా. ఊర్ల అందరు ఎత్కులాడ్తున్నరు. పక్కూర్లు తిరిగొచ్చినారు. యాడ కనపల్ల్యా రామిరెడ్డి.
‘యాల స్కూలుకి పోనమ్మా’ అని రాధమ్మంటే ఏడ్సుకుంట కూర్చున్న పార్తమ్మ ఏమీ పలకల్యా. మద్యానంపూట గుర్తొచ్చింది రాధమ్మకు దేవుని మీంద నిన్నట్నుంచి ఉన్న కోపం. ఉరుక్కుంట కట్టకాడికి పోయింది రాధమ్మ. ఆడికివోయినాక గుడిలోపలకి పోబుద్దిగాక ఆన్నే కట్ట కాడ మెట్లమీద కూచ్చోని చుట్టూ ఉన్న గులకరాళ్ళు ఒక్కోటి నీళ్ళలోకి ఇసురుకుంట ఎక్కడ్నో కిందికి జూస్తుంది రాధమ్మ. కండ్లమ్మటి నీళ్ళుకార్తుంటే తుడుస్కోకుండ అట్లనే కూర్చోయింది. కిందికి చూస్కుంట రాళ్ళు ఇసుర్తున్నా, అవి నీళ్ళల్లో పడినప్పుడు వచ్చే ఆ ‘సుయ్’ చప్పుడు మాత్రం రాధమ్మ మనసుల ఇనపడ్తనే ఉంది. కొంచేపటికి రాధమ్మ నీళ్ళలేకి రాళ్ళేస్తున్నా, ఆ రాళ్ళ చప్పుడు మాత్రం ఇనపడ్డం లేదు. అప్పుడు మొకం పైకెత్తి చూసింది.
నిన్న కర్నూలుకి పోయేటప్పుడు నాయనేస్కున్న ఖద్దరు అంగీపంచెలనే ఎవరో లావు మనిషి నీళ్లల్ల మొకం పైకి తేలుతున్నాడు. కెనాల్ కట్ట బ్రిడ్జిమీద పోతున్న జనాలు అప్పటికే గుంపుజేరి చూస్తున్నారు. రాధమ్మ లేచి మెట్లమీద నిలబడి ఆ మనిషినే చూస్తుంది. ఇద్దరు మొగోళ్ళు కట్ట మీన్నుంచి కెనాల్ నీళ్ళల్ల దుంకి, ఉబ్బిపోయిన రామిరెడ్డి శవాన్ని రాధమ్మ నిలబడ్డ ఒడ్డుకి తెచ్చినారు.
అప్పటి వరకు ఏడుస్తున్న రాధమ్మ కండ్లల్ల నీళ్ళాగిపోయినయి. రామిరెడ్డి దగ్గరికి పోయి వాయన గుండె మీద చెవు ఆనిచ్చి నాయన గుండె కొట్టుకుంటుందా లేదా అని ఇంటుంది రాధమ్మ.
*****
శ్వేత యర్రం కర్నూలు జిల్లా(ఇప్పుడు నంద్యాల) ప్రాతకోట గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిపెరిగారు. ప్రస్తుతం అమెరికాలో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పట్నుంచి తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాల్ని ఎంతో ఇష్టంగా చదివిన వీరు, అజు పబ్లికేషన్స్ అనే పుస్తక ప్రచురణ సంస్థలో కో-పబ్లిషర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘గులకరాళ్ళ చప్పుడు’ వీరి మొదటి కథ.
నచ్చింది కథనం ఒక్కటే కాదు భాష కూడా. హృదయాన్ని కదిలించింది. మొదటి కథ లా అస్సలు లేదు. చదివాక కొంచెం సేపు చదువరులకు గుండె చప్పుడు వినిపించక తప్పదు
Chala bagundi Swetha,Chinnappati sanghathulu enno gurthochhayi,thanks you.
చాలా చాలా బాగా రాశారు శ్వేతగారు, ఆ చివరి సంఘటన ఇంకా మా కళ్లముందు మెదులుతూనే ఉంది. రాధమ్మకు రామిరెడ్డి గుండె చప్పుడు వినపడితే బాగుండనిపిస్తుంది…🍃
అక్క నేను పుట్టినంక నుండి ఇప్పటి వరకు గుర్తుండి చూడలేకపోయిన మొగళ్లలో చెన్నమ్మ కూడా ఒకమే. చానా మంది చెప్తుండ్రి ఆమె గురించి మళ్లీ గుర్తు చేసినవ్ ఆమెను ఆమె అంగడి ని. నువ్వు రాసిన ఈ కథలో కొన్ని పదాలు నాకు ఇప్పుడు సదివేందుకు కష్టంగా వున్నా, మన రాయలసీమలో మనం మాట్లాడే మాటల్లో ఉంటే అహ్ అనుభూతి వేరు అని అందరూ సెప్తుంటే విని వొదిలేస్తుంటి. కానీ నేను ఈయల ఈ కథ సదువుతునంత సేపు అహ్ అనుభూతిని చాలా బాగా ఆస్వాదించాను.కథ చానా బాగుండాది అక్క.. ధన్యవాదాలు!
తొలి కూర్పు లాగ లేదు చాలా బాగుంది ధన్యవాదాలు
Chala bagundhi
Chala bagundi Ma
మొదటి కథలా అనిపించలేదు. అక్షరాల వెంట కళ్లని పరిగెత్తించారు. భాష చాలా అందంగా ఉంది. ముగింపు బహుశా కొన్ని రోజుల వరకు మర్చిపోలేను అనుకుంటా. రచయితకి మంచి భవిష్యత్తు ఉంది. మాడలికం వదిలి పెట్టొద్దు. ధన్యవాదాలు.
Bagundhi swetha..super
Katha chala bagundi akka …rayalaseema slang chaala baaga rasaav …baga connect avtundi story … nen kuda prathakota lo spend chesanu kadaa chala chala nachindi…