గ్లోబల్ విలేజ్

-కందేపి రాణి ప్రసాద్

          అనగనగా ఒక సముద్రం. ఆ సముద్రంలో అనేక జలచారలున్నాయి. చేపలు, కప్పలు, ఆక్టోపస్ లు, తాబేళ్ళు, మొసళ్ళు, తిమింగలాలు, షార్కులు నత్తలు, పీతలు, రొయ్యలు ఒకటేమిటి రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి. అన్నీ ఎంతో ప్రేమగా ఒకదానినొకటి పలకరించుకుంటూ కలుసుకుంటూ ఉంటాయి. చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి.
 
          సముద్రంలో చేపలు పట్టడానికి వేటగాళ్ళు వలలతో వస్తుంటారు. ఆ వలల నుండి జంతువులన్నీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కానీ, తెలియకుండానే చాలాసార్లు వలలో చిక్కిపోతుంటాయి. మానవులకు ఆహారంగా మారిపోతుంటాయి. తల్లి దండ్రులు వేటగాళ్ళు గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటాయి. పిల్లలు పుట్టగానే ఈతను నేర్పుతుంటాయి. ఆహారాన్ని అన్వేషించడం, వేటాడి తెచ్చుకోవడం వంటి జీవన నైపుణ్యాలను పెద్దలు పిల్లలకు నేర్పుతూ ఉంటారు. ఆ సముద్రంలో ఒకప్పుడు సాధార ణంగా జరిగే విషయాలివి. కొత్తగా నవ నాగరికత ప్రవేశించాక ప్రతివారి జీవితాల్లోనూ కొత్త దనం చోటు చేసుకున్నది.
 
          మానవ వికాసంలోని నాగరికత జంతువుల్లోకి కూడా చేరింది. అక్కడకూడా స్కూళ్ళు వెలిశాయి. సహజంగా నేర్చుకునే ఈత ఆహార అన్వేషణ కాకుండా చదువులు కూడా వచ్చి చేరాయి. ఒకవేళ వేరే సముద్రాలలోనికి వెళ్ళవలసి వస్తే ఎలా బతకాలి ట్రెయి నింగ్ స్కూళ్ళు మొదలయ్యాయి. ఒకవేళ సముద్రాలు ఇంకిపోతే నేల మీద బతకటానికి కావాల్సిన స్కిల్ల్స్ కూడా నేర్పిస్తారట. ఇలా గ్లోబల్ విలేజ్ పేరుతో ప్రపంచమంతా సుగ్రామంగా మారాలని యువత యోచిస్తున్నది.
 
          పిల్లలందరినీ స్కూళ్ళలో చేర్చారు. చేపలు, రొయ్యలు, నత్తలు, ఆక్టోపస్, సీహార్స్ ల పిల్లలన్నీ స్కూళ్ళలో చేరాయి. రోజూ కొత్త కొత్త విషయాలన్నీ నేర్పుతున్నారు. గంటకు పది కిలో మీటర్ల వేగంతో ఈదులాడే చేపల్ని గంటకు 50కిలో మీటర్ల వేగంతో ఈదమని చెపుతున్నారు. ఆక్టోపస్ పిల్లలకు ఎనిమిది చేతులతోనూ హోం వర్కులు చేయమని స్కూల్లో టీచర్లు చెప్పారు. నత్తల పిల్లలకు చాలా స్పీడుగా నడవాలని ట్రెయినింగ్ ఇస్తున్నారు. తాబేళ్ళ పిల్లలకు భయపడకుండా తల బయటనే ఉంచు కోవాలని ఆదేశిస్తున్నారు. ఏదైనా ప్రమాదం ఎదురైనపుడు పోరాడాలి గానీ తలను డిప్ప లోపలికి దూర్చకుంటే ఎలాగా అని అడుగుతున్నారు. సీహార్స్ పిల్లలతో ఇలా చెప్పారు. మీ పేరులో గుర్రం అని ఉన్నది. అంటే మీరు పరుగేత్తగలరు అన్నమాట. అదిమామూలు గుర్రల్లాగా నేల మీద పరుగెత్తడం నేర్చుకోండి. కప్పల పిల్లలను ఇలా ఆదేశించారు“మీరు ఎలాగూ నేల మీద కూడా నడవగలరు కానీ మీ కప్పలన్నీ గెంతుకుంటూ నడిచే వరకూ చాలా సమయం వృధా అవుతున్నది. కాబట్టి వేగంగా నడవడం, పరుగెత్తడం నేర్చుకోక పోతే ఆధునిక కాలంలో మనలేరు.
 
          అలాగే మొసలి పిల్లలకు కూడా చెప్పారు. “మీ అమ్మా నాన్న పూర్వకాలంలో పాక్కుంటూ నడిచేవారు. కానీ ఈ స్పీడు యుగంలో అలా కుదరదు. అందుకే మీరు సైకిల్ తొక్కడం నేర్చుకుంటే బాగుంటుంది. సైకిల్ కొనుక్కోండి. ప్రతి రోజు ఉదయాన్నే ప్రాక్టిసు మొదలెట్టండి. ఈ సైక్లింగ్ వలన మీ భారి ఆకారాలు తగ్గిపోయి జీరో సైజుకు వస్తాయి. అందరూ తమ ఆకారాన్ని బరువును ఫ్యాటునూ తగ్గించుకుంటున్నారు”.
 
          సముద్రంలో చదువుల మానియా మొదలయింది. పిల్లలు ఈ పనులన్నీ చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. తల్లిదండ్రులకు పెద్ద శిక్షగా మారింది. ఉదయాన్నే ఆహార అన్వేషణకు వెళ్ళే తల్లిదండ్రులు పిల్లల వెంట పరుగులు తీయటం సరిపోతున్నది. ఎప్పుడూ లేని ఈ కొత్త కష్టం ఏమిటో అర్థం కాలేదు. ఈ కొత్త ప్రపంచం ఏమిటో తెలియ లేదు. గ్లోబల్ విలేజ్ సూత్రం అర్థం కాలేదు.
 
          ఇలాగే కొన్ని రోజులు గడిచేయి. బంగాళాఖాతంలో జీవించే ఈ పిల్లలందరికీ ఫసిఫిక్ సముద్రంలో ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు. అది చాలా లోతైన సముద్రమట. అక్కడ ఎలా ఈదాలో ట్రెయినింగ్ ఇస్తున్నారు. పిల్లలు అలసిపోయాయి. తల్లిదండ్రులకు ఆహారం సరిగా అందక నీరసించి పోయాయి.
 
          అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ చదువుల పేరుతో దోపిడీ తప్ప ఏమీ ఒరగలేదని అర్థం చేసుకున్నాయి. హాయిగా బంగాళాఖాతంలో జీవించే వాటిని పసిఫిక్ సముద్ర పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దటం నచ్చలేదు. పిల్లలందరికీ టేన్షన్లు వచ్చాయి. రోగాల బారిన పడ్డాయి. అంతకు ముందు ఆనందంగా జీవించిన జీవులన్నీ నరకయాతన పడటం మొదలెట్టాయి. అయినా వాటి వలన కలిగే ఉపయోగ మేమిటో అర్థం కాలేదు.
 
          అందరూ నీరసించిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్లోబల్ విలేజ్ వద్దని అనుకున్నారు. పిల్లలకు ఈ చదువులు వద్దు. అమెరికా డాలర్లు వద్దని నిర్ణయించారు. టేన్షన్లు, రోగాలు లేని పిల్లలు స్వేచ్చగా ఉండాలని అనుకున్నారు. ముందుగా స్కూలు పెట్టిన వాళ్ళని వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి వారి జీవితాల్లో వెలుగు వచ్చి చేరింది.
సముద్ర జీవులన్నీ ఉపిరి పిల్చుకున్నాయి. ఎవరి స్థానాల్లో వారు ఆనందంగా జీవించ సాగారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.