దుబాయ్ విశేషాలు-8
-చెంగల్వల కామేశ్వరి
UAE రాజధాని అబుదాబీ విశేషాలు
అబుదాబీలో చూడవలసినవి చాలా ఉన్నాయి. ముందుగా షేక్ జాయేద్ గ్రాండ్ మసీదు.(మాస్క్( Mosque))
షేక్ జాయేద్ గ్రాండ్ మసీదు 1996 మరియు 2007 మధ్య నిర్మించబడింది. దీనిని సిరియన్ ఆర్కిటెక్ట్ యూసఫ్ అబ్దేల్కీ రూపొందించారు.
భవన సముదాయం సుమారు 290 బై 420 మీ (950 బై 1,380 అడుగులు), 12 హెక్టార్ల (30 ఎకరాలు) కంటే ఎక్కువ విస్తీర్ణంలో,ఈ మసీద్ నిర్మించారు.
ఈ ప్రాజెక్టును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దివంగత అధ్యక్షుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ప్రారంభించారు , ఇస్లామిక్ ప్రపంచంలోని సాంస్కృ తిక వైవిధ్యాన్ని వాస్తు మరియు కళ యొక్క చారిత్రక మరియు ఆధునిక విలువలతో కట్టిన అత్యద్భుత నిర్మాణం.
షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు మరియు దాని విద్యా సాంస్కృతిక కార్యకలాపాలు మరియు సందర్శకుల కార్యక్రమాలతో అభ్యాస మరియు ఆవిష్కరణ కేంద్రంగా పని చేస్తుంది.
ఈశాన్య మినార్‌లో ఉన్న ఈ లైబ్రరీ, ఇస్లామిక్ విషయాల శ్రేణిని సూచించే క్లాసిక్ పుస్తకాలు మరియు ప్రచురణలతో సమాజానికి సేవలు అందిస్తుంది: శాస్త్రాలు , నాగరికత , కాలిగ్రాఫి , కళలు మరియు నాణేలు, వీటిలో 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి కొన్ని అరుదైన ప్రచురణలు ఉన్నాయి. ఈ లైబ్రరీలో అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, జర్మన్ మరియు కొరియన్లతో సహా విస్తృత భాషలలో లభిస్తాయి.
ఈ గ్రాండ్ మాస్క్ చూడాలంటే కనీసం మూడుగంటలు సమయం పడుతుంది. పచ్చని ఉద్యానవనం నడుమ ధవళవర్ణ సుందర సౌధం మనలను ఆకట్టుకుంటుంది. మసీదులోకి వెళ్ళాలంటే షాపింగ్ కాంప్లెక్స్ లో నుండి మసీదులోకి వెళ్ళే పర్యాటకుల సౌకర్యార్ధం ఎస్కలేటర్స్ తో,ర్యాంప్ లతో, చాలా అధునాతనంగా ఉంటుంది. నడవలేని వారి కోసం బ్యాటరీ కార్లు కూడా ఉంటాయి.
మసీదు నలువైపులా నిర్మించిన సుందర ప్రాకారాలతో నడుమ సువిశాలమయిన నునుపైన పాలరాయితో రంగురంగుల చిత్ర రచనలతో నిర్మితమైన ఓపెన్ ప్లేస్ తో ఆకాశంలోని తారలు చంద్రుడు కన్పిస్తూ చల్లని గాలులతో అహ్లాదభరితంగా ఉంటుంది.
మసీదు లోపలకు వెళ్ళే దారంతా అటూ ఇటూ రంగు రంగు లతలు పూలు చిత్రిం చిన మార్బుల్ తో చేసిన స్థంభాలు వాటి పైన నగిషీలు చెక్కిన తోరణ ద్వారాలు మనని చూపు తిప్పుకోనీయవు. విద్యుత్ కాంతి శోభలను ప్రసరించే దీప గుచ్చాలు (షాండ్లియర్స్) ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
ఈ మసీదుకి వెళ్ళే మహిళలు బురఖా ధరించవలసి వస్తుంది.
డ్రెస్ ఛేంజ్ రూమ్స్ ఉంటాయి. అక్కడకెడితే వాళ్ళిచ్చిన బురఖా వేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలి. మసీద్ లోనికి వెళ్ళే వారిని తనిఖీ చేయందే పంపరు.
మసీదు లోపల భాగములో నమాజ్ చేసులోవటానికి ప్రత్యేక మయిన హాలు ఉంటుంది. ఇతర వేళలలో అనుమతించరు.
ఆ హాలుకి బయట ఉన్న పాలరాయి నగిషీలలో ఉన్న శిల్పకళ మనకి ఆనందాశ్చ ర్యాలు కలగచేస్తాయి. కళలకు మతంతో పనిలేదు.
రాజుల సొమ్ము రాళ్ళ పాలు అంటారు కాని, ప్రపంచంలో ఏ మూలనయినా, ఏ ప్రముఖ కట్టడాలు అయినా చక్రవర్తులుకి ఉన్న కళాత్మదృష్టి వలనే నిర్మితమయ్యాయి.
వారు కట్టించిన కట్టడాలు శిల్పకళకు శిల్పులకు అజరామరమయిన కీర్తి ప్రతిష్ట లతో చరిత్రలో నిలిచిపోయాయి.
మళ్ళీ అబుదాబీలోని మరికొన్ని విశేషాలతో కలుస్తాను.
*****
(సశేషం)