స్కూల్ లో జాయిన్ అయ్యాక ఒకరోజు ఆంధ్రవాణి నాతో “నీకు చీరలు లేవా సుభద్రా తిరిగి తిరిగి ఈ నాలుగు చీరలే కట్టుకుంటున్నావు” అన్నప్పుడు మనసు చిన్నబుచ్చు కున్నా తొలిసారి చీరలు గురించి ఆలోచించాను. నిజమే స్కూల్ కి కట్టుకోవటానికి పనికొ చ్చేవి తక్కువే ఉన్నాయి. కొనుక్కోలేని పరిస్థితులే కనుక ఎప్పుడూ చీరల గురించీ, నగలు గురించి ఆలోచించలేదు.
అంతకు ముందు అప్పట్లో కట్ పీస్ చీరలని వచ్చేవి అవే చాలా తక్కువ ధరకు కొనుక్కుని ఇంట్లో వాడే దాన్ని.
వీర్రాజు గారికి ఖర్చులు పోను మిగతాడబ్బులు ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపుల్లో ఆర్ట్ కి సంబంధించిన పుస్తకాలు కొనటానికో, అప్పటి డబ్బునిబట్టి కళాకృతులు కొనటానికో, అదీ కాకపోతే మావేకాక ఇతరుల పుస్తకాలు ప్రచురించటానికో వాడేవారు. అప్పట్లోనే కాదు తర్వాత్తర్వాత కూడా మా పుస్తకాలు ప్రచురణకు ఒకేసారి పెట్టుబడి పెట్టేవాళ్ళం కాదు. ఒకసారి ముఖచిత్రం కోసం, ఒకసారి మేటరు ప్రింటింగ్ కోసం పేపరు కొని ప్రెస్సులో ఉంచేవారు అప్పట్లో లెటర్ ప్రెస్ కనుక డబ్బులు ఎక్కవ సమకూడి నప్పుడు పుస్తకం ప్రింటింగ్ పూర్తి చేసే వారు. అలా అంచెలంచెలుగా పుస్తకం బయటకు వచ్చేది.
అయితే పెళ్ళి అయిన దగ్గర్నుంచి తనకు ఆర్ట్ మీద వచ్చే డబ్బులోంచి రెండు శాతం నాకు ఇచ్చేవారు. దానినే నా కోసమో, పల్లవి కోసమో ఏవైనా అవసరార్థం వాడు కునేదాన్ని.
మా ఆడబడుచులు వచ్చినప్పుడు వాళ్ళకీ, వాళ్ళు పిల్లలకీ కొనమని వీర్రాజుగారు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రమే మాకు కూడా బట్టలు కొనాలని గుర్తుకు వచ్చేదేమో నీకూ, పల్లవికి కూడా కొనుక్కోమని ఇచ్చేవారు. వాళ్ళెవ్వరూ రాని ఏడాది మాకు కొనాలని గుర్తురాక పోవటం నాకు కోపం వచ్చి మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళకి మాత్రమే కొనేదాన్ని. అందుచేత నాకు చీరలు తక్కువే ఉండేవి.
పల్లవికి పుట్టినరోజుకి మాత్రం తప్పని సరిగా ఆయనకి బాధ్యత తెలియడానికి డబ్బులు అడిగి మరీ డ్రస్ కొనేదాన్ని. నా దగ్గర కూడబెట్టుకున్న డబ్బులతో చవకగా వచ్చే బట్ట కొని ఏవో ఇంగ్లీష్ మాగజైన్స్ లో చూసి రకరకాల డిజైన్లలో నేనే గౌన్లు కుట్టే దాన్ని. నాకు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందనే ఆశ లేక ఒక దశలో నేను కుట్టిన డిజైనర్ గౌన్లు తీసుకొని ఒక రెడీ మేడ్ షాపులో చూపించి ఫ్యాషనబుల్ గా కుడతానని వర్క్ ఇవ్వగలరా అని కూడా అడిగాను. కాని వాళ్ళషాపుకి బొంబాయి నుండి డ్రసెస్ వస్తాయని చెప్పారు. నిస్పృహగా వెనుతిరిగాను.
ఎలా అయితేనేం నేను కన్నకల సాకారమై నేను ఉద్యోగంలో చేరాక ఆంధ్రవాణి మాటలతో నేను కొన్ని చీరలు కొనుక్కోవాల్సిన అవసరం తెల్సింది. ఇప్పుడు స్కూలుకు వెళ్ళటానికి అప్పుడప్పుడు ఒకటిరెండు చీరలు కొనుక్కోక తప్పలేదు. స్కూలుకి ఒక ఆమె చీరలు తీసుకు వచ్చి వాయిదా పద్ధతిని టీచర్లకు అమ్ముతుంది. ఆమె దగ్గర నేను కూడా ఓ రెండు చీరలు కొనుక్కున్నాను.
ఉద్యోగాల కోసం బయటకు వచ్చే ఆడవాళ్ళకు తప్పనిసరిగా సాటివాళ్ళ దగ్గర, నలుగురిలోనూ చులకన కాకుండా ఉండాలంటే చవకవైనాసరే కొన్ని చీరలు ఉండాల్సిందే అనుకున్నాను.
అంతే కాకుండా నా సహోద్యోగులతో బాటూ కబళవాయి నగలషాపులో ప్రతినెలా వందరూపాయలు కట్టటం కూడా మొదలెట్టాను. అలా నాకు దుద్దులు, పల్లవికి లోలకులు కొన్నాను.
రోజూ బస్సులో రానూ పోనూ ఓ గంటకు పైగా ప్రయాణం చేస్తుండటం వలన దారిలో జనాలను పరిశీలించటం అలవాటు అయ్యింది. తరుచుగా నేను చూస్తున్న దృశ్యాలూ, వింటున్న మాటలు నాకు కవితలు రాయటానికి దోహదం చేసేవి. స్కూల్లో పిల్లల్ని కదిపితే వారి నేపథ్యాలు, జీవితాల నుండీ ఎన్నో కథలు రాలేవి. ఉద్యోగంలో చేరాక నాకు ఒక కొత్తచూపు వచ్చినట్లయింది. ఒక్కోసారి ఆ పిల్లలలో నా బాల్యం దోబూచు లాడేది. అందువల్ల తరుచూ రాత్రి పడుకున్నప్పుడో, లేకపోతే మధ్యరాత్రి మెలకువ వచ్చినప్పుడో కాగితం నిండా అక్షరాలు కవితలను తీర్చేవి.
అందుచేత తరుచూ కవితలు రాస్తుండేదాన్ని.
తొందరలోనే నా రెండో కవితాసంపుటి మోళీ పేరుతో ప్రచురితమైంది. అప్పట్లోనే కాదు తర్వాత్తర్వాత కూడా మా పుస్తకాలు ప్రచురణకు ఒకేసారి పెట్టుబడి పెట్టేవాళ్ళం కాదు. ఒకసారి ముఖచిత్రం కోసం, ఒకసారి మేటరు ప్రింటింగ్ కోసం పేపరు కొని ప్రెస్ లో ఉంచేవారు అప్పట్లో లెటర్ ప్రెస్ కనుక డబ్బులు ఎక్కవకూడినప్పుడు పుస్తకం ప్రింటింగ్ పూర్తి చేసే వారు.అలా అంచెలంచెలుగా పుస్తకం బయటకు వచ్చేది.
చిన్నవయసులోనే వీర్రాజు గారి ప్రోత్సాహంతో ప్రెస్ లో పనిచేసే బాలప్రసాద్ స్వంతంగా ప్రెస్ లీజ్ కి తీసుకొని బాలాజీ ప్రింటర్స్ పేరుతో నడిపేవాడు. మా పుస్తకాలే కాక వీర్రాజు గారు తాను ముఖచిత్రాలు వేసిన కవులు, రచయితల పుస్తకాలు కూడా దగ్గరుండి మరీ బాలాజీ ప్రెస్ లోనే ప్రింట్ చేయించేవారు.
నేను మోళీ సంపుటికి కూడా ఆవిష్కరణసభ పెట్టలేదు. ఈ సంపుటికి కూడా పత్రికల్లో సమీక్షలు బాగా వచ్చాయి. కడియాల రామ్మోహనరాయ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక ఇంత వరకూ దొమ్మరి ఆట చేసేవాళ్ళ గురించి, సర్కస్ వాళ్ళు గురించి కవితలు రాలేదు అని మోళీ కవిత గురించి తాను చాలా చోట్ల ప్రస్తావించా నని తెలియజేసారు.
నేను ఎంతగానో సంబరపడ్డాను.
ముఖ్యంగా ప్రభలో టి.ఎల్.కాంతారావుగారు కొత్తకలాలు శీర్షికన శీలావీర్రాజు , కె.శివారెడ్డి, ఎన్.గోపీ, దేవీప్రియల సరసన నన్నూ పరిచయం చేయటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఆ ఏడాది చివర్లో మా మేడంతో ” ప్రతీ సంవత్సరం ఆరో తరగతి నుండి పదో తరగతి వరకూ ఫైనల్ పరీక్షలలో మొదటి స్థానంలో వచ్చిన పిల్లలకు బహుమతులు ఇస్తాన”ని చెప్పాను. మా మేడం ఆశ్చర్యంగా చూసారు. నాకు డబ్బు బాగా ఉందేమో అనే అనుమానం మా స్కూల్ లో వాళ్ళందరికీ కలిగింది. కానీ నేను చిన్నప్పటి నుండి చదువు కోడానికి ఎదుర్కొన్న అవాంతరాలు, తరగతి పుస్తకం లేకుండా స్నేహితుల పుస్తకాలు చూసి నోట్సులు తయారు చేసుకొని చదివిన పరిస్థితులు నన్ను వెంటాడుతూ ఉండటం వలనా, వాళ్ళ ముఖాలలో నా బాల్యం కనబడుతుండటం వలనా ఆ నిర్ణయం తీసుకు న్నాననేది తర్వాత్తర్వాత నా స్నేహితులకు మాత్రమే తెలుసు. నేను ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఫస్ట్ వచ్చిన వారికి వాళ్ళ తరగతి పుస్తకాలు ఇచ్చేదాన్ని. తొమ్మిది, పది తరగతుల వారికి నగదు రూపంలో ఇచ్చేదాన్ని. అయితే ఆ తరువాత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తుండటంతో అవి కాకుండా తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ పుస్తకాలు, అట్లాస్, పరీక్షలకు అవసరమయ్యే తెలుగు వ్యాసాల పుస్తకాలు ఇవ్వట మే కాకుండా ఆయా క్లాసులకు తగినట్లుగా కథల పుస్తకాలూ బహుమతి గా ఇచ్చేదాన్ని. ఈ కార్యక్రమం ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున జరిపేదాన్ని. దాంతో విధ్యార్థులు ఫస్ట్ రావటానికి పోటిపడి చదివేవారు. స్కూలు పిల్లలకే కాక టీచర్ల పిల్లలకు కూడా పిల్లల కథల పుస్తకాలు బహుమతిగా ఇస్తుండటం అలవాటు అయ్యింది. ఈ బహుమతి ప్రధానాలు నేను రిటైర్ అయ్యాక కూడా రెండు మూడు ఏళ్ళకు పైగానే కొనసాగించాను. కానీ తర్వాత అవి సక్రమంగా పిల్లలకు అందటం లేదని తెలిసి మానే సాను.
స్కూల్ లో నేను చెప్పాల్సినవి హైస్కూల్ తరగతులే కావటం, పదేళ్ళ తర్వాత పాఠాలు చెప్పటం వీటి వలన పని వత్తిడి ఎక్కువ గానే ఉండేది. అంతేగాక ఆ ఏడాదే పదోతరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి. స్టాండర్డు ఎక్కువ కావటం వలన అన్ని స్కూళ్ళకీ సబ్జెక్టు వారీ టీచర్లకు కూడా ట్రైనింగ్ లు ఉండేవి. నా పోష్టు సెకండరీ గ్రేడ్ టీచర్ పోష్టు. నేను పాఠాలు చెప్పేది హైస్కూల్ కు. అందువలన విద్యాశాఖ ఎవరికి ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా నేను వెళ్ళక తప్పని పరిస్థితి.
ఒకరోజు మేడం నన్ను పిలిచి వాళ్ళ అమ్మాయి పదోతరగతి చదువుతుందనీ, తెలుగులో ఛందస్సూ, లెక్కల్లో ట్రిగొనోమెట్రి చెప్పటానికి వాళ్ళింటికి రమ్మని కోరారు. స్కూల్లో తెలుగు, లెక్కలకి సీనియర్ టీచర్లు ఉండగా నన్ను రమ్మనడం ఆశ్చర్యం కలిగినా నేనేమీ మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం కదా నేను తెలుగులో చెప్తే అర్థం చేసుకోగలదో లేదో అని సందేహం వెలిబుచ్చినా కూడా మళ్ళీ ఆమే ‘స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళి మీ పాపని కూడా తీసుకొని రమ్మ’న్నారు. సరే అని ఆ సాయంత్రం పల్లవిని తీసుకుని మేడం ఇంటికి వెళ్ళాను. మాకు టిఫిన్ , టీ ఇచ్చి పల్లవితో మేడం కబుర్లు చెప్తుంటే నేను వాళ్ళమ్మాయి ప్రేమకు పాఠాలు చెప్పాను.
వీర్రాజు గారు ఎప్పట్లా ఉద్యోగంలో బిజీగానే ఉన్నారు. 1985లో తిరిగి ముఖ్య మంత్రి అయ్యాక రామారావు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి, 55 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామసేవకుల వ్యవస్థ రద్దు, పూజారి వ్యవస్థ రద్దు, శాసనమండలి రద్దు మొదలైనవి.
ఇంకొక ముఖ్యమైనది సంగీత అకాడమీ, సాహిత్యఅకాడమీ, నాటక అకాడమీలను రద్దుచేయటం. పొట్టిి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లిలో 1985 డిసెంబరు రెండోతేదీని స్థాపించి అకాడమీలన్నింటినీ అందులో కలిపేయటం సంచలనాత్మక నిర్ణయం.
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థానకవిగా దాశరథి, ఆస్థాన గాయకుడిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఉండేవారు. వాటిని కూడా రద్దు చేయటంతో కోపించి బాలమురళీకృష్ణ ఆంధ్రాలో కచ్చేరీలు చేయనని మద్రాసుకు వెళ్ళిపోయాడు.
ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు తగ్గించడంతో అక్కయ్యవాళ్ళు విజయనగరం వెళ్ళిపోయారు. అయితే సుప్రీం కోర్టు అది చెల్లదని తీర్పు ఇవ్వటంతో ప్రభుత్వం వాళ్ళందరికీ కూర్చోబెట్టి మొత్తం డబ్బు ఇవ్వాల్సి రావటం కొసమెరుపు.
ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల ఎంపిక, పుస్తక ప్రచురణ మొదలైన చర్చల గురించి ఆదివారం రోజుల్లో ఇంటికి వచ్చేవారు కుందుర్తి సత్యమూర్తి.
వీర్రాజు గారు వారం అంతా ప్రభుత్వ సేవలో ఉండటం చేత సెలవురోజుల్లో ఇంటికి వచ్చే కవులు రచయితల తాకిడి ఎక్కువగా ఉండేది. ఉదయం తొందరగా తయారై కూర్చుంటే రాత్రి పది వరకు ఎవరో ఒకరు రావటం సాహిత్య చర్చలు జరుగుతూనే ఉండేవి. మా యింటికి తరుచుగా ఇంట్లో మనిషిలా అయిన వ్యక్తి నాళేశ్వరం శంకరం. ఆయన ఒక్క వారం కలవకపోతే వీర్రాజు గారే ఉదయమే వాకింగ్ లా ముసారాం బాగ్ లోని ఆయన ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళిద్దరూ కలిసి తిరిగి గోపీగారి ఇంటికో శివారెడ్డి గారింటికో వెళ్ళేవారు. ఆ విధంగా ఇంట్లో వారికి మాత్రం వీర్రాజు గారితో మాట్లాడే అవకాశమే ఒక్కొక్క ప్పుడు దొరికేది కాదు. అందుచేత పల్లవి బాధ్యత అంతా నాదే కావటంతో స్నేహితుల్లా పాటలు పాడుకోవటమైనా కబుర్లు చెప్పుకోవటమైనా మేమిద్దరమే.
ఉద్యోగంతో రానురానూ వీర్రాజు గారు విసుగుచెందేవారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుండునని ఆలోచన మొదలుపెట్టారు.
ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరిలో మొదలయ్యే సమయంలో అయితే రెండు నెలల పాటు తీరిక ఉండేదికాదు. ఎగ్జిబిషన్ లో సమాచారశాఖ స్టాల్ ఏర్పాటు పనుల్లోనూ తిరిగేవారు. ఏ కొద్ది సమయం దొరికినా సాహిత్యం కోసం కేటాయించే వారు.
ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున అవార్డు వచ్చిన వారితో బాటు అభ్యుదయ దృక్పథంతో రాస్తున్న కవులతో ఒకసారి కవిసమ్మేళనం నిర్వహించారు. అందులో నేనూ పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ కవితలన్నింటినీ “పెన్గన్” పేరుతో ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలో పుస్తకంగా ప్రచురించారు.
యువభారతిలో పరిచయం అయిన రత్నమాల తర్వాత్తర్వాత విప్లవం వైపు ఆకర్షితులై కార్యకర్తగా మారింది. కాని మా కుటుంబంతో స్నేహం మాత్రం మారలేదు. మేము బాబుతో తలమునకలుగా ఉన్నరోజుల్లో తన కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నా మమ్మల్ని కలుస్తుండేది. అప్పట్లోనే ఒకసారి నారాయణగూడ YMCA లో కొంతమంది రచయిత్రులం కలవాలనుకుంటున్నాం రమ్మని ఒక ఆదివారం పిలిచింది. అప్పుడ ప్పుడే సమాజంలో మహిళల సమస్యల కోసం పోరాడక తప్పని సందర్భంగా స్త్రీ శక్తి సంఘటన ఏర్పడింది. వీర్రాజు గారు బాబుని చూసుకుంటానని నన్ను వెళ్ళమనేవారు.
అప్పుడే మొదటిసారి కె.లలిత, పోపూరి లలితకుమారి, వీణాశత్రుఘ్న, సూశీతారు, రామా మెల్కోటే మొదలైన ఒక పదిమంది అక్కడ కలిసాం. అప్పుడే మొలకెత్తతున్న స్త్రీవాద భావజాలంతో వారంతా చర్చించారు. ఎక్కువమంది ఇఫ్లూ ప్రొఫెసర్లు కావటంతో చర్చలు ఇంగ్లీష్ లోనే జరిగాయి. నాకు అర్థం అవుతోన్నా ఇంగ్లీష్ లో మాట్లాడేటంత పరిజ్ఞానం లేదనే భావంతోనూ, అందరిలో చొరవగా కలగలిసిపోలేని మొగమాటంతో అరకొరగానే మాట్లాడాను. ఆ తర్వాత మరో రెండుసార్లు వెళ్ళాను కానీ నాకున్న బాధ్యత లతో తర్వాత మానేసాను.