పౌరాణిక గాథలు -13
-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి
అంకితభావము – అహల్య కథ
ఆమెని మనం మర్చిపోయాం. కాని, ఆమెని పవిత్రమైన స్త్రీగా చరిత్ర గుర్తుపెట్టు కుంది.
ఆమె పేరు అహల్య. గౌతమ మహర్షి భార్య. సన్యాసికి మహర్షికి మధ్య తేడా ఉంది. సన్యాసులకి గృహసంబంధమైన సంబంధాలు ఉండవు. అన్నీ త్యాగం చేసి వచ్చేస్తారు.
మహర్షులకి కుటుంబం ఉంటుంది. కాని, నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా వచ్చి జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను గురించి తెలుసుకోడంలో మునిగి ఉంటారు. శిష్యులకి విద్య బోధిస్తూ ఆ సంపాదనతో జీవిస్తారు.
పూర్వం విద్యార్థులే గురువు దగ్గర ఉండి వాళ్ళతో కలిసి జీవించేవాళ్ళు. క్రమశిక్షణ తో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగు పెట్టేవాళ్ళు.
గౌతమ మహర్షి తన భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య కూడా అంకిత భావంతో భర్తకి సేవ చేసేది. తెలియకుండానే ఆమె జీవితంలో ఒక తప్పు జరిగి పోయింది.
తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు. కాని, ఆ రోజుల్లో చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు ఉండేవి. అందుకే జీవితంలో తమ వల్ల మళ్ళీ తప్పు జరగకుండా జాగ్రత్త పడే వాళ్ళు.
నిజానికి అహల్య తప్పు చెయ్యక పోయినా జరిగిన తప్పుకి ఆమె బాధ్యురాలయింది. నీతికి ప్రాధాన్యత ఇచ్చే గౌతముడు అహల్య తనని మోసం చేసిందనుకుని కోపంతో మండిపడ్డాడు.
ఒక్క క్షణం ఓర్పు వహించి ఉంటే తన భార్య పరిస్థితి ఏమిటో ఆయనకి అర్థమై ఉండేది. కాని అంత వరకు ఆగక వెంటనే శపించాడు.
మహర్షి అహల్యని పాషాణంగా మారమని శపించాడు. అహల్య తన దురదృష్టాన్నే అదృష్టంగా భావించింది. తెలియక జరిగినా తప్పు తన వల్ల జరిగింది కనుక, అందుకు శిక్ష అనుభవించడానికి ఆమె సిద్ధ పడింది.
కొంత సమయం గడిచాక గౌతముడికి కోపం తగ్గింది. తన భార్య వల్ల జరిగిన తప్పు పెద్దదేమీ కాదు. అయినా తను వేసిన శిక్ష చాలా పెద్దది. ఇప్పుడు పశ్చాత్తాప పడినా ప్రయోజనం లేదు. ఇచ్చిన శాపాన్ని ఆమె అనుభవించక తప్పదు కదా!
గౌతముడు భార్యతో “ఒక్కొక్కసారి ఒకళ్ళు చేసిన తప్పుకి మరొకళ్ళు బాధ పడవలసి వస్తుంది. ఏది జరిగినా మన పూర్వజన్మ కర్మ వల్ల జరుగుతుంది.
శ్రీరామచంద్రుడు ఇటు వచ్చినప్పుడు అతడి పాదస్పర్శకి నీకు శాపవిమోచనం కలుగుతుంది. అది అతి త్వరలో జరుగుతుంది. ఇతరులకి ఆదర్శ వనితగా నువ్వు చరిత్రలో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతావు.
ఆపదలో భగవంతుణ్ని ప్రార్థిస్తే ఆపద నుంచి బయట పడే అవకాశం దానంతట అదే వస్తుంది” అన్నాడు.
అంతా విన్న అహల్య “కష్టపడకుండా దేన్నీ సాధించలేం. రాయిగా బ్రతకడం వల్ల ఇంతకంటే ఏ అపకారమూ జరగదు. ఇలా జరగడం తన దురదృష్టం” అనుకుంది.
ప్రస్తుతం అహల్య పెద్ద ఆపదలోనే ఉంది. రాయిగా మారినా ఆమెకు జ్ఞానం ఉంది. అందుకే జరిగినదానికి కోపంగాని, బాధగాని ఆమెకి లేవు. తనకి కలిగిన పరిస్థితికి లోబడి భగవంతుణ్ని ప్రార్థిస్తూ గడిపేస్తోంది.
ఆపదలు కలిగినప్పుడు భగవంతుణ్ని ప్రార్థిస్తూ మంచి పనులు చేసుకుంటూ పోతే కష్టాలు వాటంతట అవే పారిపోతాయి. విధిని ఎవరూ మార్చలేరు కనుక, కర్మఫలాన్ని కూడా సంతోషంగానే అనుభవించాలి.
“ఎప్పుడు రాముడి పవిత్ర పాదస్పర్శ తగులుతుందో అప్పుడు శాపవిముక్తి జరుగు తుంది” అని మహర్షి చెప్పాడు. మహర్షుల మాటలు ఎప్పుడూ తప్పవు.
భగదవతారమైన రాముడు అడవిలోకి రావాలి… అహల్య ఉన్న వైపు నడవాలి… రాయిగా మారిన అహల్యకి అతడి పాదం తగలాలి… అహల్యకి శాపవిముక్తి కలగాలి.
అహల్య ఓర్పుతో రాముడి రాక కోసం ఎదురు చూస్తోంది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, రాముణ్ని తల్చుకుంటూ, అతడి రాకకోసం ప్రార్థిస్తూ తమ ఆశ్రమం దగ్గరే రాయిలా పడి ఉంది.
ఆమె ప్రార్ధన ఫలించింది. రాముడు వచ్చాడు. ఆడవిలో సరిగ్గా ఆమె ఎక్కడయితే రాయిగా మారి పడి ఉందో అదే ఆశ్రమం వైపు వచ్చాడు.
అతడి పవిత్రమైన పాదాలు ఆ రాయికి తగిలాయి. వెంటనే రాయి పవిత్రమైన, తేజస్సు కలిగిన స్త్రీమూర్తిగా మారి లేచి నిలబడింది. ఆమెని చూసి రాముడు చాలా ఆశ్చర్యపోయాడు.
ఆమె అతడి పాదాలకి నమస్కరించింది. అంకిత భావంతోను, భక్తి శ్రద్ధలతోను ప్రార్థిస్తూ, శాపాన్ని అనుభవిస్తూ… ఎండలోను, వానలోను, చలిలోను, వేడిలోను తను వచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తూ…ఎన్నో సంవత్సరాలు రాయిలా పడి ఉన్న ఆమెని చూసి రాముడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు.
మనం అందరం తప్పులు చేస్తాం. కాని, వాటిని అధిగమించడానికి ప్రయత్నించం. ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించాలనే అనుకుంటాం. ప్రార్థనలతో గాని, నిస్వార్ధ సేవతో గాని, బాధలు అనుభవించిగాని వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి.
అంకిత భావంతో ప్రార్ధిస్తే భగవంతుణ్ని దర్శించవచ్చు!
*****