యాత్రాగీతం
అమెరికా నించి ఆస్ట్రేలియా
(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)
-డా||కె.గీత
భాగం-12
గ్రాండ్ కురండా టూరు (Grand Kuranda) తరువాయి భాగం
దాదాపు పదిన్నర ప్రాంతంలో కురండా స్టేషనుకి చేరుకున్నాం. రైల్లో ఇచ్చిన వివరాల అట్టలోని ప్రతి ప్రదేశం వచ్చినప్పుడల్లా సమయాన్ని రాసిపెట్టాడు సత్య. చివర్లో మేం అందరం ఆటోగ్రాఫులు చేసి ఆ అట్టని మాతో గుర్తుగా తెచ్చుకున్నాం.
రైలు దిగుతూనే గిఫ్ట్ సెంటర్ లో నించి అవతలి వైపుకి వెళ్ళాల్సి ఉండడంతో అంతా ఏవేవో కొనుక్కోవడం మొదలెట్టారు. అన్నిటికంటే ఎక్కువగా కొంటున్నవి మంచి నీళ్ళు. నేను సత్య కోసం గ్రాండ్ కురండా రైలు బొమ్మ ముద్రించిన టీ షర్టు కొన్నాను. అక్కడికక్కడే వేసేసుకుని ముందుకు దారితీసాడు సత్య.
స్టేషను కింది అంతస్తులో ఉంటే వెళ్ళాల్సిన రోడ్డు పై అంతస్తులో ఉంది. అంటే కొండవాలులో రైలు స్టేషను ఉందన్నమాట. చుట్టూ ఆకుపచ్చదనంతో విభేదిస్తూ ఆకాశపు నీలి రంగు. రెంటి మధ్యా గొడవ తీర్చడానికి చొచ్చుకు వస్తున్నట్లు తెల్లటి మేఘాలు. రోడ్డు మీది నించి చుట్టూ దట్టమైన చెట్ల మధ్య నించి, తీగెల మధ్య నించి భలే అందంగా కనిపిస్తూ ఉన్నాయి స్టేషను, రైలు బండి, పట్టాలు.
బయట అడుగుపెట్టగానే ఎప్పుడూ వర్షం కురిసినా ఎక్కడికక్కడ ఇంకిపోయే సతత హరితారణ్యాలలో ఉండే మాంఛి మట్టివాసన చుట్టుముట్టింది. అప్పటికప్పుడు అక్కడే ఒక తూనీగనై ఎగిరిపోవాలనిపించేంత పరవశంగా అనిపించింది.
బయట టూరు బస్సు సిద్ధంగా ఉంది. కొండని దొలిచి, వేసిన ప్రధాన రహదారి పక్కనే నడిచే దారిని కూడా సిమెంటు చేసారు. విలేజ్ కి నడక దారి (Walkway to Village) అని బోర్డు కూడా ఉంది. స్టేషను నించి ఒక మైలు దూరంలో ఊరు ఉంటుంది. నడవగలిగే వాళ్ళు నడవొచ్చు. నడవలేని వాళ్ళు బస్సెక్కొచ్చు అని బస్సు డ్రైవరు చెప్పగానే మేం నడవడానికి ఉత్సాహంగా ముందుకు కదిలాం. త్రోవ పొడవునా ఆస్ట్రేలియా స్థానిక లెదర్ వస్తువులు, దుస్తులు, ఆభరణాలు అమ్మే షాపులతో బాటూ రెస్టారెంట్లు, జ్యూస్, ఐస్క్రీము షాపులు ఉన్నాయి. ఇక్కడి వస్తువులు ఖరీదున్నా నాణ్యం గా ఉన్నాయి.
చుట్టూ వేడిమి చెమటలు పట్టిస్తున్నా నడక హాయిగా ఉంది. చెమ్మచెమ్మగా ఉన్న దారిలో పెద్ద చెట్ల కాండాల దగ్గిర మొలిచిన చిన్న మొక్కలు, రెంటినీ అల్లుకున్న తీగెలు, ఆకుల మీద అందంగా మెరుస్తూన్న వాన చినుకులు, చుట్టూ మొక్కల చాటున దాక్కుని మమ్మల్ని గమనించనట్లు రొదలు చేస్తున్న ఇలకోళ్ళు, పక్షులు హాయిగా వాటి ప్రపంచంలో అవి మైమరిచి ఉన్నాయి.
అలవోకగా నడిచెయ్యొచ్చు. దార్లో అలసటొస్తే కూచోడానికి తమాషాగా పాత రైలు పట్టాలతో తయారు చేసిన ఒకటో రెండో బల్లలున్నాయి కూడా.
బటర్ ఫ్లైస్ శాంక్చువరీ జంక్షనులో ఉంది. ఒక వైపన్నీ షాపులు, మరో వైపు పిల్లలు ఆడుకునే పార్కు,
మధ్యలో ఇన్ఫర్మేషన్ సెంటర్. రోడ్డు దాటితే శాంక్చువరీ. చిన్నదైనా చాలా బావుంది. ఇంత వరకు ఎక్కడా చూడని వెరైటీ సీతాకోకచిలుకల్ని ఇక్కడ చూసాం. గిఫ్ట్ షాపులోనే టిక్కెట్లు కొనుక్కునే కౌంటరు కూడా ఉంది. మాలాగా ప్యాకేజీ టూరు కాకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ టిక్కెట్టు కొనుక్కోవచ్చు. దాటి లోపలికి వెళ్ళగానే పెద్ద గ్రీన్ హౌస్ లో పెంచుతున్నారు అక్కడి సీతాకోకచిలుకల్ని. లోపల ఇంకాస్త వేడిగా ఉంది. అయినా అదొక అద్భుత ప్రపంచం. అడుగుపెట్టగానే చుట్టూ అందమైన సీతాకోకచిలుకలు మూగుతాయి. అప్పటికప్పుడే చేతుల మీద, భుజాల మీద వాలి అంతలోనే రివ్వు మంటుంటాయి. చుట్టూ ఉన్న పచ్చని మొక్కలకు గుత్తులుగా పూసిన పసుపు అంచు కలిగిన ముదురు ఎరుపు రంగు కాయల్ని, రేకులు విప్పార్చి మనకేసే చూసే గులాబీ రంగు దేవగన్నేరు పూలని, తెలుపు రేకలు విరిసిన గోపీ చందనం రంగు మొగ్గల్ని కాస్త అక్కడక్కడా ఒంటికి పూసుకున్నట్టు రంగురంగుల సీతాకోకచిలుకలు. అసలు ఎక్కడా కానరాని అద్భుతమైన రంగుల మేళవింపు ఇక్కడ కానవస్తుంది. ఇందులోనే ఉన్న ఫెయిరీ గార్డెను విభాగంలో వందలాదిగా అన్నీ చిన్న పసుపుపచ్చని సీతాకోకచిలుకలే. నిజంగా బుజ్జి బుజ్జి ఫెయిరీల్లాగా ముచ్చటగా ఉన్నాయి. అక్కణ్ణించి బయటికి వచ్చేట పుడు సీతాకోకచిలుకగా మారిన మనస్సు మాత్రం అక్కడే రెక్కలు అల్లారుస్తూ ఉండి పోయింది.
కానీ గ్రీన్ హౌస్ లో వేడిమికి ఉడికి ఉడికి తిరిగి లోపలి హాలులోకి రాగానే ఏసీ చల్లని గాలి తగలగానే ప్రాణం లేచివచ్చినట్టయ్యింది. అక్కడ గోడల నిండా నమూనా సీతాకోక చిలుకల అవశేషాల్ని అతికించిన అద్దాల పెట్టెలున్నాయి. ప్రపంచంలోకెల్లా పెద్ద దయిన 14 అంగుళాల సీతాకోకచిలుక అవశేషాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది ఈ అరణ్య ప్రాంతంలోనే దొరకడం విశేషం.
సరిగ్గా అరగంటలో అక్కణ్ణించి బయటికి వచ్చేసాం. సిరి ఆటస్థలంలోని ఉయ్యాల వైపు పరుగు తీసింది. సత్య అటు వెళ్ళడంతో నేను, వరు, కొబ్బరి బొండాం, చెరుకు రసం అన్న బోర్డు కనిపిస్తే తాగొద్దామని అటు వెళ్ళాం. కొబ్బరి బొండాలు అయిపోయాయన్నా రు. ఇక్కడి చెరుకురసం మన దగ్గరంత తియ్యగా లేదు. అంతేకాకుండా ఒక గ్లాసు రసం తీసియ్యడానికి పదిహేను నిముషాలకు పైగా వేచి చూడవలసి వచ్చింది. అయిదు డాలర్ల ఖరీదైన రసాన్ని తలా కాస్తా తీర్థంలా తాగేం. ఇంతలో పక్కనే ఉన్న ఇండియన్ సరుకు లు కూడా కలిపి అమ్ముతున్న సావనీర్ దుకాణం బయట గాజులు ఒక్కొక్కటి ఒక డాలరు, అరడజను అయిదు డాలర్లని చూసి నవ్వుకున్నాం. రకరకాల రంగులు వేసున్న మామూలు మెటల్ గాజులవి.
అక్కణ్ణించి మరో అయిదు నిమిషాల్లో అప్పటికే మా అందరి కోసం ఎదురుచూస్తు న్న టూరు బస్సెక్కి దగ్గర్లోని రెయిన్ ఫారెస్టేషన్ నేచర్ పార్కు (Rain Forestation Nature Park) అనే చోటికి చేరుకున్నాం.
అక్కడే మా భోజనం, మధ్యాహ్న కార్యక్రమాలన్నీ ఏర్పాటు చెయ్యబడ్డాయి. కొండ మీద ఉన్న ఆ ఆవరణంతా చెక్కతోనే నిర్మించబడింది. ఎంట్రన్స్ లో పెద్ద కొలను. చుట్టూ దట్టమైన చెట్లు. చూడముచ్చటగా ఉందక్కడ. వెళ్తూనే విశాలమైన ఎత్తైన షెడ్ల ఆవరణలో బఫె లంచి ఏర్పాటు చేసారు.
పచ్చివి, ఉడికించినవి కాయగూరలు, కాల్చిన మాంసం, అన్నం, కొమ్ము శనగలు, కాయగూరల కూర, అన్ని రకాల పండ్ల ముక్కలు, అక్కడే స్వయంగా తయారుచేసిన రుచీ పచీ లేని బ్రెడ్. ఉడికించిన పెద్ద పెద్ద గుమ్మడికాయ ముక్కలు చెప్పుకోదగ్గ విశేషం. బాగా వేడిగా ఉండేసరికి పిల్లలు అవన్నీ తినడం మానేసి ఇక పండ్లు మాత్రం తిని కడుపు నింపుకున్నారు. శనగల మీద నార్త్ ఇండియన్ గరం మసాలా ఏదో కనిపించీ కనిపించ కుండా చల్లినట్టుగా అనిపించింది.
మొత్తానికి ఏదో తినడం పూర్తి చేసి మరో అరగంటలో మళ్ళీ ఎంట్రన్సులోకి వచ్చి గిఫ్ట్ సెంటరు కౌంటరు దగ్గిర మొసలితో ఫోటో తీసుకోవడానికి టిక్కెట్లు తీసుకుని లైనులో నిలబడ్డాం. అది మూతి కట్టిన చిన్న మొసలి పిల్ల. దాన్ని ఒక్కొక్క గ్రూపు చేతులో పెట్టి ఒకళ్ళని తలా, ఒకళ్ళని తోకా అంటూ పట్టుకోమని క్లిక్ మనిపిస్తూంటే మన సంగతి దేవుడెరుగు పాపం దాని సంగతేంటో అనిపించింది. అది అదే పనిగా తోకని కదుపుతూ దొరికితే ముక్క తీద్దామని ప్రయత్నించసాగింది. ముట్టుకుంటే గట్టి రబ్బరులా ఉంది.
అక్కణ్ణించి ఒంటిగంటకల్లా “ఆర్మీ డక్స్ రైడ్” (Army Ducks Ride) కి వెళ్ళాం. త్రోవంతా చెక్కతో నిర్మించిన షెడ్లలోనించే ఉంది. దార్లో షెడ్డునానుకునే అరటి చెట్లు, పనస చెట్లు కాయలతో విరగకాసి కనిపించాయి. చెరుకులైతే ఎక్కడపడితే అక్కడ గడ్డిలా నాటారు. పెద్ద మిలటరీ వ్యానులా ఉన్న వాహనమ్మీద గతుకుల రోడ్లమీద అడవిలోకి తీసుకెళ్ళిన ఆ ప్రయాణం నడుములు విరగ్గొట్టేటట్లు ఉన్నా అక్కడక్కడా వాహనాన్ని ఆపినపుడు నిశ్శబ్దంలో అడవిలోంచి వినిపించే సన్నని శబ్దాల్ని విని తీరాలి. బురద నేలల్లో చప్పున దూకే చిన్న చిన్న జంతువులు, ఆకుల గలగలలు, మిడతలు, ఈగల రొదలు, పక్షుల కూతలు, ఎక్కడో వినిపిస్తున్న జలపాతపు రొదలు….అది మరొక ప్రపంచం. మానవ మహోన్నత ప్రయాణంలో మరిచి పోయిన గతపు జాడల్ని తలుపుకి తెచ్చే క్షణాలవి! ఉన్నట్టుండి హఠాత్తుగా వ్యాను త్రోవ పక్కనే ఉన్న సరస్సులోకి దిగి పడవగా మారడం విశేషం. మొత్తం గంటపాటు ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, ఎటు లైనా ఇచటనే ఆగిపోనా అంటూ ఆ అడవిన చిక్కుకున్న మనస్సుని మరల్చుకోవడం కష్ట సాధ్యమైంది!
మా గైడు & డ్రైవరు గండు చీమల్ని పట్టుకుని రుచి చూడమంటూ ముందుకొచ్చిన వాళ్ళకు నాలుకకు అంటించి రుచి చూపించసాగేడు. మా వరు ధైర్యంగా ముందుకెళ్ళిం ది. నా వల్ల కాదు కానీ ఫోటో మాత్రం తీసుకుని అక్కణ్ణించి ముందుకు కదిలేను.
ఇక అక్కణ్ణించి తిన్నగా డిడ్జిరిడూ (Didgeridoo) అనబడే పెద్ద చెక్క సన్నాయిలా పైకి కనిపించే సంగీత వాయిద్యం మీద నక్క అరుపులు, పక్షుల కూతలు వినిపించారు. ఆ వాయిద్యం వినడానికి మాత్రం కర్ణకఠోరంగా ఉంది. ఆడవాళ్ళు ఆ వాయిద్యాన్ని అసలు ఊదకూడదని, ఊదినా అందరి ముందు ఊదే ప్రదర్శనలు చెయ్యకూడదని నియమం అన్నపుడు భలే ఆశ్యర్యమనిపించింది.
ప్రతి సంసృతిలోనూ ఆడవాళ్ళమీద నిషేధాలే.
ఆ తరువాత ఓపెన్ థియేటర్ కి చేరుకున్నాం. రెండు గంటల ప్రాంతంలో ఎంత గానో ఎదురుచూస్తున్న అబోరీజినల్ నృత్య ప్రదర్శన మొదలైంది. ఇద్దరు వాద్యగాళ్ళు, ముగ్గురు నృత్యకారులు స్థానిక ఆటవిక నృత్యాన్ని ప్రదర్శించారు. వారి జీవనమే నృత్యంగా సాగిన ఆ ప్రదర్శనలో జంతువులని, పక్షులని పోలిన భంగిమల్లో నృత్యం చెయ్యడం, వేటాడడం మొ.వి ప్రదర్శించారు. చివరగా వాళ్ళతో నాట్యం చెయ్యడానికి వాలంటీర్లని పిలిచినప్పుడు ముందు నేను చెయ్యెత్తేను. ఆడవాళ్ళని సంగీత ప్రదర్శన లో పాల్గొననివ్వని వాళ్ళు నృత్యానికి ఏమంటారో చూద్దామనిపించింది. మొత్తానికి స్టేజీ మీదికి ముగ్గురు ఆడవాళ్ళం, ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు పిల్లలు వెళ్ళేం. నాతోపాటూ సిరి కూడా వచ్చి చేరింది. వాళ్ళు అప్పటికప్పుడు మాకు రెండు మూడు స్టెప్పులు నేర్పించి వాళ్ళతో కలిసి నాట్యం చెయ్యనిచ్చేరు. చేతుల్ని, కాళ్ళని పైకి లేపకుండా కాళ్ళు అదే పనిగా అక్కడక్కడే కదుపుతూ చేసే ఆ నాట్యం చేస్తుంటే ఆ సంస్కృతిని హత్తుకున్న అనుభూతి కలిగింది.
అక్కణ్ణించి బ్యాచ్ లుగా విడగొట్టి పది, పదిహేను మందికి “బూమరాంగ్” ని ఒక్కొక్క సారి ఎగరేసే అవకాశం కల్పించారు. ఈ “బూమరాంగ్” అనే చాపం లాంటి చెక్క ముక్కని ఇక్కడ కంగారూలని, ఇతర జంతువులని వేటాడడానికి ఉపయోగిస్తారట. అక్కడే జావెలిన్ లాంటి ఈటెని లాఘవంగా విసిరే ప్రదర్శన చేసారు.
ఆ ఆవరణలోనే ఉన్న కొయాలా, కంగారూ, మొసళ్ళ పార్కులో జంతువుల్ని స్వేచ్ఛ గా వదిలెయ్యడం విశేషం. అలవాటు కావడం వల్లనో ఏమో అవి కూడా భయం లేకుండా చుట్టూ తిరగసాగేయి.
సిరి ఒక వాలబీ పిల్ల దగ్గిర చేరి “ఓ… వాలబై ఐ యామ్ సింగింగ్ యూ… ఏ లల్లబై” అంటూ జోలపాట పాడడం మొదలెట్టింది.
మొత్తానికి స్థానిక వేషధారణలు, ఆచారవ్యవహారాల ప్రదర్శనలు చూసినా, పూర్తిగా వారి జనానీకాన్ని చూడలేక పోయినందుకు, జీవన స్థితిగతుల్ని తెలుసుకోలేకపోయి నందుకు అసంతృప్తిగా అనిపించింది.
అందులో ప్రధాన వేషం వేసిన వ్యక్తి బయటి వరకు వచ్చి అందరి దగ్గిరా సెలవు తీసుకుంటున్నప్పుడు అతనితో ఫోటో తీసుకున్నాం. ఫోటో తీసుకునేటప్పుడు అతను నన్ను “నీ భుజమ్మీద చెయ్యెయొచ్చా సిస్టర్?” అని మర్యాదగా పర్మిషన్ అడిగేడు.
ఆస్ట్రేలియాలో ఎక్కడా టిప్పులు ఇవ్వడం అనేది నియమం కాకపోయినా మేం ప్రతిచోటా టూరు గైడ్లకి, డ్రైవర్లకి, ప్రదర్శనకారులకి ఒక్కొక్కళ్ళకి ఇరవై డాలర్లకి తక్కువ కాకుండా టిప్పులు ఇస్తూ వచ్చాము.
మూడున్నరకల్లా అక్కణ్ణించి బస్సెక్కి “స్కై రైలు” స్టేషనుకి చేరుకున్నాం. ఇది కేబుల్ కారు రైడ్. తీరా లైనులో అరగంట నిలబడ్డాక కేబుల్ కారుకి రిపేరు వచ్చిందని మా రైడ్ ని క్యాన్సిల్ చేసారు. వెనక్కి సరాసరి మా హోటలు వరకు మేం అక్కడ కొండ మీద లోకల్ గా తిరిగిన బస్సులోనే తిరిగి తీసుకు వచ్చేసారు. త్రోవంతా ఎలా వచ్చామో కూడా తెలియకుండా నిద్ర ఆవహించింది మమ్మల్ని.
*****
(సశేషం)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.