విజ్ఞానశాస్త్రంలో వనితలు-12
చెరుకుగడలో తీపిని పెంచిన వృక్ష శాస్త్రవేత్త- డాక్టర్ జానకి అమ్మాళ్ (1897-1984)
– బ్రిస్బేన్ శారద
ప్రపంచంలో చెరుకు ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ భారతదేశానిదే అగ్రస్థానం. అయితే, ఇరవయ్యవ శతాబ్దపు మొదటి వరకూ భారతదేశం (అప్పుడు ఆంగ్లేయుల పాలనలో వుంది) చెరుకుని పాపా న్యూగినీ, ఇండోనేషియా, జావా, వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అక్కడ పెరిగే చెరుకు తీపి దనం పరంగా, నాణ్యత పరంగా ఉత్తమమైనది.
భారతదేశంలో పెరిగే చెరుకు గురించి పరిశోధనలు చేసి, దాని నాణ్యతను మెరుగు పర్చేందుకు చేయాల్సిన పరిశోధనల కోసం 1912లో డాక్టర్ చార్ల్స్ ఆల్‌ఫ్రెడ్ బార్బెర్ (Dr. C.A. Barber) అనే ఆంగ్లేయుడు సర్ టి యేస్ వెంకట్రామన్ (Sir T.S. Venkatraman) అనే శాస్త్రవేత్తతో కలిసి సుగర్‌కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ (Sugarcane Breeding Institute) అనే సంస్థను కోయంబత్తూరులో స్థాపించారు. (ప్రస్తుతం ఈ సంస్థ ICAR (Indian Council for Agricultural Research ) యొక్క అనుసంధాన సంస్థగా పనిచేస్తోంది.)
డాక్టర్ జానకీ అమ్మాళ్ (1897-1984)
1934 ప్రాంతాల్లో జానకీ అమ్మాళ్ అనే కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త చెరుకు వంగడా ల్లో విస్తృతంగా పరిశోధనలు చేసారు. చెరుకునీ, మొక్కజొన్ననీ కలిపి చేసిన వంగడాల వల్ల భారతదేశంలో చెరుకు సాగులో ఎన్నో గుణాత్మకమైన మార్పులొచ్చాయి. అయితే విషాదం ఏమిటంటే ఈ పరిశోధనలకి ఆమెకి ఎటువంటి గుర్తింపూ రాలేదు. ( ఆ సంస్థ యొక్క వెబ్‌సైటులో కూడా ఆమెని గురించిన ఎటువంటి ప్రస్తావనా లేదు-||రచయిత||).
చెరుకు, వంకాయ వంగడాల్లో ఆవిడ విశేష కృషి చేసి గొప్ప ఫలితాలు సాధించిన ఎడవలత్కక్కత్ జానకీ అమ్మాళ్(EK Janaki Ammal) 1897లో కేరళలోని తలచ్చేరి గ్రామంలో జన్మించారు. జానకి తండ్రి కృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హై కోర్టు సబ్ జడ్జిగా పని చేసేవారు. ఆమె తల్లి దేవీ కురవాయి. ఈవిడ తండ్రి ఆంగ్లేయుడైన జాన్ హేనింగ్ టన్, తల్లి కేరళ స్త్రీ కురుంబికురువాయి.
సాంఘికంగా వెనకబడ్డ కులంలోని వారైనా, ఆర్ధికంగా వీరి కుటుంబం బాగా వున్న వారే. పెద్ద కుటుంబంలోని చాలా మంది పిల్లల్లో జానకి ఒకర్తి. ఆమె బాల్యమంతా పెద్ద రెండంతస్థుల భవంతిలో, పియానో వాద్యం మధ్య చీకూ చింతా లేకుండా గడిచి పోయింది.
వాళ్ళ కుటుంబంలోని ఆడపిల్లలందరికీ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళైపోయినా, ఆమె మాత్రం అప్రతిహతంగా చదువుకుంటూనే పోయారు. మద్రాసులోని క్వీన్ మేరీ కాలేజీలో బీయెస్సీ ముగించి 1920 ప్రాంతాల్లో ఆమె కాలేజి లెక్చరరుగా ఉద్యోగంలో చేరారు. 1924లో ఆమెకి యూనివర్సిటి ఆఫ్ మిషిగన్బార్బౌర్ స్కాలర్‌షిప్ లభించింది. ఈ ఉపకార వేతనాన్ని 1917లో లెవీ బార్బౌర్ (Levi Barbour) అనే మానవతావాది ఆసియా ప్రాంతాల్లోని స్త్రీల విద్యకోసమని కేటాయినారు. ఆ వేతనంతో ఆమె అక్కడ బాటనీలో ఎమ్మెస్సీ చేసారు.
అది ముగిసిన వెంటనే ఆమె మళ్ళీ భారతదేశానికి తిరిగొచ్చారు. విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం మొదలుపెట్టారు. కొన్నేళ్ళ ఉద్యోగం తరవాత ఆమె మళ్ళీ మిషిగన్ వెళ్ళారు. ఈసారి ఆమె బోటానీలో పీహెచ్‌డీ సాధించారు. వృక్షాల్లోని జన్యువు ల్లోని క్రోమోసోంల గురించి ఆమె పరిశోధన చేసారు. ఈ శాస్త్రాన్ని సైటొజెనెటిక్స్అంటారు.
డాక్టరేట్ పట్టాతో స్వదేశం తిరిగొచ్చి ఆమె మద్రాసులో ప్రొఫెసర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అప్పుడే సుగర్‌కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్‌లో చెరుకు జన్యువుల గురించి పరిశోధన సాగించ వలసిందిగా ప్రభుత్వం ఆమెని కోరింది. అక్కడ ఆవిడ చెరుకుని ఇతర జాతుల జన్యువులతో కలిపి కొత్త రకాలైన చెరుకుని పెంచారు. ఇంతకు ముందే చెప్పినట్టు, ఆవిడ చెరుకు, మొక్కజొన్న జన్యువులని కలిపి కొత్త వంగడాన్ని కనిపెట్టారు.
1939లో ఆమె జెనెటిక్స్ కాన్‌ఫరెన్స్ఒకదాని కోసం స్కాట్‌లాండ్ వెళ్ళారు. రెండో ప్రపంచ యుద్ధం మొదలవడంతో ఆమె ఇంగ్లండులోనే వుండిపోవాల్సి వొచ్చింది. 1940లో జానకి ఇంగ్లండు వెళ్ళి అక్కడ జాన్ ఇన్నిస్హార్టికల్చరల్ఇన్స్టిట్యూట్‌లో పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ పరిశోధనాశాలలో ఆమె సి.డి.డార్లింగ్‌టన్ అనే సైటాలోజిస్టుతో కలిసి పనిచేసారు. వారిద్దరూ కలిసి 1945లో “క్రోమోజోం ఎట్లస్ ఆఫ్ కల్టివేటేడ్ ప్లాంట్స్” అనే పరిశోధనా గ్రంథాన్ని వ్రాసారు. దాదాపు పది వేలకి పైగా మొక్కల జాతుల క్రోమోజోం వివరాలని పొందుపర్చారు. ఇప్పటికీ ఈ గ్రంథం బోటనిస్టుల పరిశోధనలో ప్రాముఖ్యత వహిస్తుంది. ఆ తరవాత కొన్నేళ్ళ వరకూ వృక్ష జన్యు శాస్త్రంలో ఆమె పరిశోధన జైత్ర యాత్రలా సాగింది.
1945 నుండీ 1951 వరకూ జానకిగారు ఇంగ్లండులోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీలో సైటాలజిస్టులా పనిచేసారు. అక్కడ ఆమె మేగ్నోలియా (సంపంగి ) జాతి మొక్కల క్రోమోజోంల పై పరిశోధన చేసారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ నియమిం చిన మొదటి మహిళా వృక్ష్స శాస్త్రజ్ఞురాలు జానకీ అమ్మాళ్. ఆ రోజుల్లో బ్రిటన్‌లో ఆర్థిక పరిస్థితి దుర్భరంగా వుండేది. ప్రపంచ యుద్ధానంతర వాతావరణంలో బ్రిటన్ సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. జానకీ మాత్రం అటు వంటి పరిస్థితుల్లో కూడా అకుంఠిత దీక్షతో పరిశోధన సాగించారు. హార్టీకల్చరల్ సొసైటీ, వెస్లీ కేంపస్‌లో కొన్ని రకాల మెగ్నోలియా పూవులకి ఆమె పేరు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, ఆమె పరిశోధనలెంత ముఖ్య మైనవో!
1951లో భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆమెని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (Botanical Survey Of India, BSI) అనే సంస్థ ఏర్పాటు చేయడం కోసం రమ్మని స్వదేశానికి ఆహ్వానించారు. ఎంతో సంతోషంగా భారత దేశం తిరిగొచ్చారు జానకీ అమ్మాళ్. అయితే స్వదేశంలో తోటి శాస్త్రవేత్తలు మాత్రం ఆమెని తమదానిగా అంగీక రించ లేకపోయారు. సంస్థ కోసం ఆమె చేసిన ప్రతీ ప్రతిపాదననీ తోసిపుచ్చారు. నిరాశ చెందిన జానకీ, సంస్థ విషయాలు వొదిలేసి కొత్త కొత్త మొక్కలూ, వాటి జన్యువులనూ గురించిన పరిశోధనలో మునిగిపోయారు.
అయితే, ఆ తర్వాత ఆమె పరిశోధన దిశ మార్చుకుంది. అప్పటి వరకూ మొక్కల్లో నూ, వృక్షాల్లోనూ వాణిజ్య ప్రయోజనాలు వెతికిన ఆవిడ పరిశోధన 1960ల నుంచి ప్రకృతి పరిరక్షణ కోసం సాగింది. దేశంలో ముమ్మరంగా సాగుతోన్న అడవుల విధ్వంసాన్ని తీవ్రంగా వ్యతిరేకించారావిడ.
1970లో కేరళలోని సైలెంట్ వేలీ అనే ప్రాంతంలో అడవులని నరికేసి హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలని తలచింది ప్రభుత్వం. జానకీ అమ్మాళ్ నేతృత్వాన పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక ఉద్యమం జరిగింది. 1980లో ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, నేషనల్ పార్కుగా ప్రకటించింది ప్రభుత్వం.
ఆమెకి ఎనభై యేళ్ళ వయసులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. నవంబరు 1984లో, తన ఎనభై నాలుగేళ్ళ వయసులో మరణించారు జానకీ అమ్మాళ్ .
*****
ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు.
“నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా కినిగెలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఉచితంగా లభ్యమవుతుంది.