సీతాలు
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-వెంకట శివ కుమార్ కాకు
జోరున వర్షం పడుతోంది. పట్నంకి దూరంగా మారుమూలకి విసిరెయ్యబడిన పల్లెటూరు. చాలానే పూరి గుడిసెలు వున్నాయి. ఒక గుడిసె దగ్గర వున్న గొడ్ల చావడి నుంచి ఒక బర్రె అరుస్తూనే వుంది. అది అరుపు కాదు ఏడుపులా వుంది. ఆ ఊళ్ళో కరెంట్ పోయి చాలానే సమయం అయ్యింది.
ఆ బర్రె ఏడుపు లాంటి అరుపులు విని మనెమ్మ లేచి కూర్చుంది. తనకి పాతికేళ్ళు వుంటాయి. నిద్ర మత్తులో కళ్ళు నులుముకుంటూ “ఇదిగో మామా…. ఆ సీతాలు ఒకటే అరుస్తోంది. వెళ్ళి ఒకమారు చూడ్రాదా?” అని గోపాలాన్ని తట్టి లేపింది. సీతాలు ఆ బర్రె పేరు. గోపాలం మనెమ్మ మొగుడి పేరు. “ఏంటే అర్ధరాత్రి నీ గోల? ఆ సీతాలు గోల.. గమ్మునే పడుకోలేరా….” అంటూ చిరాకు పడుతూ లేచాడు. చుట్టూ చిమ్మ చీకటి. ఏం కనిపించడం లేదు.
“అయినా…. దానికి పడుకొనే ముందు గడ్డి మోపు ఎయ్యమన్నా గదా…. ఎయ్యలేదా ఏటి?” అని తను కూడా కళ్ళు నలుపుకుంటూ కోపంగా అడిగాడు. “యేసాను మామా…. మన సీతాలు కడుపుతో వుంది కదా… సరిపోలేదేమో!” అని మనెమ్మ అంది. ” సరే సరే! దీపం బుడ్డీ ఇటివ్వు….నేనెల్లి ఓ పారి సూసొస్తా” అని లేచి నిలుచున్నాడు.
ఆ చీకట్లో మనెమ్మ దీపం బుడ్డీ కోసం ఎతుకులాడుతూ వుంది. “కరెంట్ పోయి ఎంత సేపాయినాది?” అని అడిగాడు. “మన ఊళ్ళో…. అసలు కరెంట్ వుండేదియెప్పుడు సెప్పు మామా? పేరుకి మాత్రమే మన ఊరుకి కరెంట్ వుంది. అవరమైనప్పుడు వుంటుందా ఏటి? ” అని నిట్టూర్చింది.
“సరే సరే బుడ్డీ దొరికిందా లేదా?” అని గట్టిగా అరిచాడు. అక్కడ వీడికన్నా గట్టిగా సీతాలు ఇంకా అరుస్తూనే వుంది. “అట్టా అరవమాకు…. బుడ్డీ దొరికింది. అగ్గి పెట్టె ఎక్కడ పెట్టేసానో!” అని చీకట్లో వెతుకుతూ వుంది. “అహే…. నా సొక్కా జేబులో వుంటాది సూడు. అలాగే ఆ బీడీ కట్ట కూడా అందుకో” అని చొక్కా వైపు చూపించాడు.
కాస్త తడుముకుంటూ…. ఆ చొక్కా తగిలించిన వైపు వెళ్ళింది. ముందు అగ్గి పెట్టె తీసి ఒక పుల్ల వెలిగించింది. ఆ వెలుతురులో మనెమ్మ మెరిసిపోతూ కనిపించింది. గోపాలం చూపు మనెమ్మ పై పడింది. “బీడీ కట్ట ఏడ పెట్టినావు?” అని చొక్కా అంతా వెతుకుతూ అంది. “ఎనక జేబులో వుంటుంది సరిగ్గా సూడు మే..మనెమ్మ” అంటూ తన దగ్గరకి వచ్చాడు. మనెమ్మ నడుంని గట్టిగా పట్టుకున్నాడు.
“ఏటి మామా మోటు సరసం? యేళా పాళా లేదా? పిల్ల సూస్తాది. అక్కడ సీతాలు కూడా అరుస్తోంది. ఇప్పుడు ఈ సరసం ఏటి మావా?” అని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ అంది. అవేం పట్టించుకోలేదు. తనని దగ్గరకి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. మరింత సిగ్గు పడుతూ దూరంగా నెట్టేసింది. “కాస్తాగు మామా… ముందు ఆ సీతాలు సంగతి సూసిరా” అని బుడ్డీ వెలిగించి చేతికి అందించింది. “సరే సరే…. వచ్చాక నీ సంగతి కూడా సూస్తా. ఈ సారి నువ్వు అరుపు అందుకోవాలి” అని బుగ్గ గిల్లి వెళ్ళాడు. “చీ పో ….” అంటూ దూరం జరిగి నిలుచుంది. బుడ్డీ సాయంతో గుడిసె బయటకి వచ్చాడు గోపాలం.
వర్షం బాగా పెద్దది అయ్యింది. చిమ్మ చీకటి… అప్పుడప్పుడు మెరుస్తున్న ఆకాశం. చేతిలో వున్న బుడ్డీ దీపం గాలికి విలవిలలాడుతోంది. నేల మీద బురద పేరుకు పోయిం ది. అడుగు జాగ్రత్తగా వెయ్యకపోతే కాలు జారుతోంది. చూసి చూసి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. ఎలాగో అలా మెల్లగా సీతాలు దగ్గరకి వెళ్ళాడు. అది గోపాలాన్ని చూసి ఇంకా గట్టిగా అరుస్తోంది. దాని పొట్ట మీద చెయ్యి వేసి తడిమాడు. ఇంకా అరుస్తూనే వుంది. దాని వైపే చూసాడు. ప్రేమగా హత్తుకున్నాడు. దాని కళ్ళలో బాధ కనిపిస్తోంది.
“ఊరుకో సీతాలు.. నేను వచ్చేసాను కదా. కాసేపు ఓపిక పట్టు” అని నోరులేని జీవాన్ని తన మాటలతో ఓదారుస్తున్నాడు. “ఒసేయ్! కాసిన్ని యేన్నీళ్ళు యెట్టుకురా” అని పెద్దగా కేక వేసాడు. దాని పొట్ట అంతా పరీక్షించాడు. “ఒసేయ్ సీతాలు…. నీకు ఆడపిల్లే పుడుతుంది సూడు” అని నవ్వుతూ అన్నాడు.
“నీకో ఇషయం సెప్పనా…. మేం మనుషులం కాబట్టి ఆడపిల్ల పుడితే ఏడుస్తున్నాం. మాలో కొందరైతే పుట్టిన ఆడపిల్లని దూరంగా విసిరేస్తున్నారు కూడా. మీ బర్రెలకి ఆ బాధ లేదు లే… ఆడపిల్లనే కావాలి. అది ఎదగాలి… తల్లవ్వాలి… బోలెడన్ని పాలివ్వాలి…. అప్పుడే కదా బోలెడంత లాభం” అని ఆ మూగ జీవంతో చెప్పి నవ్వేసాడు. ఏదో అర్ధమయినట్టు సీతాలు కూడా తన బాషలో అరిచింది.
అప్పుడే వేన్నీళ్ళు పట్టుకొని మనెమ్మ వచ్చింది. “ఏంది మామ…. సీతాలుతో నీ ముచ్చట్లు?” అని వస్తూ వస్తూ అడిగింది. “ఏం లేదు మనే…. నీకు ఆడపిల్లే పుట్టుద్ది అని సెప్తున్నా” అని అన్నాడు. “మామా…. మన బిడ్డ పేరు లక్ష్మి కదా… మన సీతాలుకి కూడా ఆడబిడ్డ పుడితే లక్ష్మి అనే పిలుద్దామా? ఏమంటావు మామా?” అని సంబరంగా అంది.
బర్రె పిల్లకి నా కూతురి పేరా? అని బుర్ర గోక్కుంటూ “సరే చంటిది లేస్తాదేమో… నువ్వెళ్ళు నేను చూసుకుంటా” అని అన్నాడు. “ఏమైనా అవసరమైతే గట్టిగా ఒక కేకేయ్ మామా” అని చెప్పి కొంగు తలకి అడ్డం పెట్టుకొని గుడిసె వైపు వెళ్ళి పోయింది. గోపాలం మాత్రం సీతాలు దగ్గరే వుండి పోయాడు. దాని పక్కనే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.
తన కూతురు లక్ష్మి పుట్టినప్పుడు సంగతులు గుర్తుకు వచ్చాయి. మెల్లగా గతంలోకి దొర్లాడు…
అప్పటికే గోపాలంకి, మనెమ్మకి పెళ్ళయ్యి ఏడేళ్ళయ్యింది. ఇరుపొరుగు చెవులు కొరుక్కోడం మొదలెట్టారు. “నీ దొడ్లోకి దూడలు వస్తున్నాయి. మరి మీ నట్టింట్లో పిల్లలు పాకేదీ ఎప్పుడో?” అని దెబ్బిపొడుస్తూ అడుగుతున్నారు. కొందరేమో సరదాగా ఆట పట్టిస్తూ అడుగుతున్నారు. కానీ ఆ ప్రశ్నలు గోపాలాన్ని, మనెమ్మని చాలా బాధ పెడు తున్నాయి.
అందుకే ఊళ్ళో వున్న గుడిలో మొక్కేసారు. బందువుల, స్నేహితుల సలహాలు విని చుట్టుపక్కల ఊళ్ళలో వున్న గుడులు కూడా తిరిగేసారు. పూజలు చేసారు. నోములు నోచారు. వ్రతాలు కానించారు. ఏం లాభం లేదు. ఈ ప్రయత్నంలో అలా ఒక ఊళ్ళో గుడిలో రాములవారు, సీతమ్మ దర్శనం చేసుకున్నారు. అదే ఊరి చివర జరిగే సంతకి వెళ్ళారు.
ఆ సంతలో మనెమ్మ కోసం రంగురంగుల గాజులు కొన్నాడు. చాలా ఆనందంగా వుంది. ఒక దగ్గర ఆవులు, బర్రెలు, కోళ్ళు అమ్ముతున్నారు. రకరకాల మేలు జాతి బర్రెలు వున్నాయి. ఆ రోజు సంతలో దాదాపు అన్నీ మేలుజాతి పశువులు అమ్ముడు పోయాయి. మనెమ్మ చూపు ఒక బర్రె దూడ మీద పడింది. అది చాలా బక్కగా వుంది. “మామా…. ఆ దూడ సూడు సాలా బాగుంది కదా” అని అంది. “ఏం బాగుందే! ఒంట్లో కండే లేదు…. సత్తువే లేదు దాని కాడ” అని నీరసంగా అన్నాడు.
వీళ్ళ మాటలు విని “ఓ అమ్మీ…. అది అమ్మే దానికి కాదు లే” అని అమ్మేవాడు అన్నాడు. “ఇక్కడ సూడండి. ఇది సాలా మంచి జాతిది. ఇది కొనుక్కోండి…. మీ ఇంట్లో పాల కుండలు పొంగి పొర్లతాయి. నా మాట నమ్మండి” అని వేరే బర్రెల వైపు చూపిం చాడు. గోపాలం ఆ దూడల వైపు చూస్తున్నాడు. మనెమ్మ చూపు మాత్రం ఇంకా ఆ బక్క చిక్కిన దూడ మీదే వుంది.
“ఇంకా ఏందే? దాని వైపే సూస్తున్నావు” అని గోపాలం మనెమ్మని పక్కకి లాగాడు. “ఓమ్మా…. దాని తల్లి దీన్ని కనగానే సచ్చింది. దీనికి సరిగా పాలు లేక ఇలా తగలడింది. ఎందుకమ్మా ఈ దురదృష్టపు దూడ నీకు?” అని అమ్మేవాడు కూడా చెడుగా చెప్పాడు. అదే సమయంలో ఆ దూడ చిన్నగా అరిచింది. “అమ్మా….” అని పిలిచినట్టు అనిపిం చింది మనెమ్మకి. మనెమ్మ ఇంక ఆగలేదు. ఆ దూడ కొనాల్సిందే అని మొండి పట్టుదల పట్టింది. పెళ్ళయ్యాక ఇది కావాలి అని మనెమ్మ పట్టు పట్టడం ఇదే తొలిసారి. గోపాలం ఆలోచనలో పడ్డాడు.
చేసేదిలేక ఆ దూడని కొన్నాడు. ఆ దూడని వెంటపెట్టుకొని ఇంటికి బయలు దేరారు. మనెమ్మ ఆనందానికి అవదుల్లేవు. ఆ దూడని తమ దొడ్లో వున్న వేరే బర్రెకి దగ్గరగా కట్టింది. ఆ బర్రెకి అప్పటికే ఒక దూడ వుంది. ఈ కొత్త దూడకి ఏం పెట్టిన తినడం లేదు. తాగడం లేదు. అలా ఒక రోజు గడిచింది. మనెమ్మ బాధ పడింది. “అనవసరంగా ఆ దూడ కొనమని గోల సేసావు… అదేమో ఏం తినడం లేదు. తాగడం లేదు. మన దొడ్లో సస్తే ఎంత కీడు” అని గోపాలం కూడా బాధ పడిపోయాడు. “ఆ దూడని కాపాడు” అని రెండు చేతులు ఎట్టి దేవుడికి మొక్కింది.
మరుసటి రోజు పొద్దునే…. చీపుర తీసుకొని దొడ్లోకి వచ్చింది మనెమ్మ. వేరే బర్రె దగ్గర ఈ కొత్త దూడ పాలు తాగడం చూసింది. చాలా ఆనందం వేసింది. ఆ దృశ్యం చూస్తూ మనెమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి వున్న చోటే పడి పోయింది. కొంచెం దూరంలో దొడ్లో పశువులకి గడ్డి వేస్తున్న గోపాలం పరిగెట్టుకుంటూ వచ్చాడు.
మనెమ్మని తన రెండు చేతుల్లో తీసుకొని ఇంట్లోకి పరిగెట్టాడు. మంచం మీద మెల్లగా పడుకో పెట్టాడు. “ఇది దురదృష్టం దూడ … ఇది మీకు ఎందుకు? వద్దన్నా కొంటున్నారు?” అని అమ్మేవాడు చెప్పిన మాటలు ఒక్క నిమిషం బుర్రలో గిర్రున తిరిగాయి. గోపాలం కళ్ళలో కన్నీళ్ళు జలజల జారాయి. తేరుకొని పక్కింటి అనసూయ త్తని కేకేసి పిలిచాడు.
ఆమె వచ్చి మనెమ్మని పరీక్షించింది. గోపాలం వైపే చూస్తూ “ఎంత పని చేసావు?” అని కోపంగా అంది. “నేనేం చేసాను అత్తా” అని బిత్తర చూపులు చూసాడు. “సాధించావు రా అల్లుడా… కంగారేం లేదు… నువ్వు తండ్రివి కాబోతున్నావు” అని సంతోషకరమైన వార్త చెప్పింది. ఆ మాట విని గోపాలం ఆనందంతో గెంతులు వేసాడు. మనెమ్మ నీళ్ళోసు కుంది అనే వార్త ఊరంతా కొన్ని నిమిషాల్లో వ్యాపించింది. “గోపాలం ఇంటికి కొత్త దూడ వచ్చింది. మనెమ్మ కడుపు పండింది” అని జనం కథలు కథలుగా చెప్పుకున్నారు.
మనెమ్మ కాసేపటికి కళ్ళు తెరిచింది. గోపాలం తనని దగ్గరకి తీసుకున్నాడు. తను సిగ్గు పడింది. ” సీతాలు అని పేరు పెడుదాం మామా….” అని మెల్లగా అంది. ఆ మాటలు విని ఆశ్చర్యంతో “మనకి ఆడ బిడ్డ పుట్టుద్ది అని నీకు అప్పుడే ఎట్టా తెలుసు? పేరు కూడా సెపుతున్నావు?” అని నవ్వుతూ అన్నాడు. “నేను సెప్పేది పూర్తిగా ఇను మామా… నేను సెప్పేది మనం తెచ్చిన దూడ గురించి. దాని పేరు సీతాలు. అది కూడా మన బిడ్డ లెక్కే…. ఎట్టా వుంది పేరు?” అని నవ్వుతూ అంది.
“అయితే నాకు ఇద్దరు కూతుళ్ళా….” అని గోపాలం కూడా నవ్వుతూ అన్నాడు. “అబ్బో…. ఇప్పుడు నీకు మనకి ఆడపిల్లే పుట్టుద్ది అని ఎట్టా తెలుసు?” అదే ప్రశ్న గోపాలాన్ని అడిగింది. “నువ్వు, నేను మంచోళ్ళం కదా… ఆడబిడ్డ మంచోళ్ళకి కాకపోతే ఎవరికి పుట్టుద్ది… సూస్తూ వుండు మనకి లక్ష్మీ దేవి పుట్టుద్ది. ఇంక మనకి అన్నీ మంచి రోజులే” అని నమ్మకంగా చెప్పాడు. మనెమ్మ ముందుకు వంగి గోపాలాన్ని ముద్దు పెట్టు కుంది. గోపాలం కూడా మనెమ్మని ముద్దెట్టుకున్నాడు.
ఇక సీతాలుని సొంత బిడ్డలా చూసుకున్నారు. మనెమ్మకి కూడా తొమ్మిది నెలలు గడిచాయి. ఒక రోజు సాయంత్రం. గోపాలం ఎక్కడికొ వెళ్ళడానికి తయారవుతున్నాడు. తన వైపే కోపంగా చూస్తూ “ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా మామా?” అని మనెమ్మ అడిగింది. “పక్కూరిలో సంత… మంచి బేరం ఇప్పిస్తాను అని మన గిరన్న సెప్పాడు. అందుకే యెళ్ళడం తప్పడం లేదు. అయినా నీకు నొప్పులు రాడానికి ఇంకా వారం పైనే వుంది కదా….” అని నచ్చ చెప్పాడు. “నువ్వు నా మాట యెప్పుడు ఇన్నావు గనుక… సరే కూడు తిని బయలుదేరు మామా” అని మూతి తిప్పుతూ అంది. “సరే సరే…. ఏడు ఘంటలకి బయలుదేరుతా” అని చెప్పాడు.
మనెమ్మ పొయ్యి మీద అన్నం పెట్టింది. అప్పుడే కరెంట్ పోయింది. మేఘాలు దగ్గరగా చేరాయి. చిమ్మ చీకటి అలుముకుంది. చినుకులుగా మొదలయ్యి వర్షం జోరు పెరుగుతోంది. “వర్షం పెద్దది అయ్యేలా వుంది. నేను వెళ్తాను” అని గోపాలం కండువా తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే పశువుల దొడ్లో సీతాలు అరుస్తూ వుంది. గోపాలం అటు వైపు చూసాడు. “ఏమైంది సీతాలు? ఎందుకు అలా అరుస్తున్నావు?” అని కోపం తెచ్చు కున్నాడు.
“ఒకసారి యెళ్ళి సూడు మామా” అని బ్రతిమాలింది మనెమ్మ. గోపాలం పశువుల పాక వైపు వెళ్ళాడు. సీతాలు దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు. అది నాలుకతో గోపాలం చెయ్యి నాకింది. ఏం అర్ధం కాలేదు. ఎప్పుడూ ఇలా లేదు. ఆకలిగా వుందేమో అని కొంచెం గడ్డి తెచ్చి దాని ముందు వేసాడు. అక్కడ నుంచి వచ్చేస్తున్నాడు. సీతాలు మళ్ళీ అరవడం మొదలు పెట్టింది.
“ఏమైందే?” అని మళ్ళీ దగ్గరకి వచ్చాడు. సీతాలు నాలుకతో గోపాలం చెయ్యి నాకుతూ వుంది. గోపాలం దూరంగా జరిగితే మళ్ళీ అదే అరుపు. దాని దగ్గరే రాత్రి తొమ్మిదయ్యింది. “గోపాలన్నా! సంతకి వస్తున్నావా లేదా? గిరన్న నిన్ను తోలుకొని రమ్మన్నాడు” అని మల్లిగాడు వచ్చి చెప్పాడు. గోపాలం కాసేపు ఆలోచించాడు. దూరంగా జరిగాడు. సీతాలు మళ్ళీ అరవడం మొదలు పెట్టింది. ఎప్పుడూ ఇలా జరగలేదు. కాసేపు ఆలోచించాడు.
“నేను సంతకి రావడం లేదు లే. మా సీతాలు ఒకటే అరుస్తోంది. దాన్ని సూసు కోవాలి అని రావడం లేదు అని గిరన్నకి సెప్పు” అని మల్లికి చెప్పి పంపించేసాడు.కాసేపు సీతాలు దగ్గరే కూర్చున్నాడు. “మామా! కూడు తిందువు రా” అని మనెమ్మ కేకేసింది. దాని వైపే చూస్తూ గోపాలం మెల్లగా లేచాడు. కొంచెం దూరం వెళ్ళి ఆగాడు. ఏం పట్టనట్టు గడ్డి తింటోంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగాడు. అది తోక ఊపుకుంటూ గడ్డి తింటోంది. ఆశ్చర్యంగా దాని వైపే చూస్తూ వెళ్ళి పోయాడు
గోపాలం గుడిసెలోకి వచ్చాడు. మనెమ్మ కూడు పెడుతోంది. “నువ్వు కూడా కూర్చోవే….” అని మనెమ్మని పక్కనే కూర్చో పెట్టుకున్నాడు. అన్నం. కూర కలిపి మనెమ్మకి గోరు ముద్దలు తినిపించాడు. మనెమ్మ కళ్ళలో కన్నీళ్ళు జారాయి. “ఎందుకే ఇప్పుడు యేడుస్తున్నావు?” అని అన్నాడు. “కూరలో కారం యెక్కువేసినట్టున్నా” అని నవ్వుతూ వుంది. గోపాలం కూడా మనసారా నవ్వుకున్నాడు.
“మన సీతాలుకి ఏమైంది ఈ రోజు? నేను దూరంగా వెళ్తుంటే అరుస్తూనే వున్నాది. నేను సంతకి రావడం లేదు అని చెప్పగానే అరవడం ఆపేసింది” అని అనుమానంగా అన్నాడు. “ఏంది మామ నువ్వు సెప్పేది? నువ్వు సంతకి యెళ్ళకూడదు అని అది అట్టా అరిచిందా ఏటి? విడ్డూరం కాకపోతే….” అని నవ్వుతూ అంది. “అదే నాకు కూడా అర్ధం కావడం లేదు” అమాయకంగా అన్నాడు. “మనం ఇప్పటికే దాన్ని సొంత బిడ్డలా సూసు కుంటున్నం అని ఊరోళ్ళు మనల్ని పిచ్చోళ్ళులా చూస్తున్నారు. ఇప్పుడు ఇది విన్నారు అంటే పిచ్చే అనుకుంటారు” అని చెప్పి నవ్వేసింది. గోపాలం కూడా నవ్వుకున్నాడు.
అప్పుడు దొడ్లో నుంచి సీతాలు మళ్ళీ అరిచింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టారు. నవ్వి నవ్వి మనెమ్మ కడుపు పట్టుకుంది. నొప్పులు మొదలయ్యాయి. సీతాలు అరుస్తూనే వుంది. గోపాలం కంగారు పడుతున్నాడు. మనెమ్మని మంచం మీద పడుకోబెట్టాడు. పరిగెట్టుకుంటూ పక్క గుడిసె వైపు వెళ్ళాడు. అనసూయత్తని వెంట పెట్టుకొచ్చాడు. “ఒరేయ్ అల్లుడా! పొయ్యి మీద కాసిన్ని యేన్నీళ్ళు యెట్టు” అని అంది.
అనసూయత్త మనెమ్మ పక్కనే కూర్చుంది. మనెమ్మ నొప్పులతో అరుస్తోంది. పొట్ట పట్టుకొని చూసింది. “బిడ్డ అడ్డం తిరిగినట్టుందే….” అని గోపాలం వైపు చూస్తూ అంది. ఆ మాట విని వణికి పోతున్నాడు. “ఇప్పుడు ఈ వర్షంలో, చీకటిలో పక్కూరులో వుండే డాక్టర్ దగ్గరకి యెళ్ళడం కూడా కష్టమే” అని అనసూయత్త దీనంగా అంది. “నువ్వే ఏదో ఒకటి సెయ్యత్త….” అని రెండు చేతులు పట్టుకొని వేడుకున్నాడు.
“ఆ భగవంతుడే కాపాడాలి” అని పైకి చూపించింది. “నువ్వు లక్షమ్మవ్వని తీసుకొని రా” అని పంపించింది. గోపాలం లక్షమవ్వ కోసం వెళ్ళాడు. సీతాలు ఆపకుండా అరుస్తూనే వుంది. తన వైపే చూస్తూ వెళ్ళాడు. కాసేపటికి లక్షమ్మవ్వని తీసుకొని వచ్చాడు. “నువ్వు కాసేపు బయటే వుండు రా మనవడా….” అని గోపాలాన్ని బయటకి పంపించేసారు.
గుడిసె బయట గోపాలం అటుఇటు తిరుగుతున్నాడు. ఒక పక్క జోరున వర్షం పడుతోంది. మెరుపుల కాంతి వచ్చి వెళ్ళాక…. మరింత బయం పెంచుతున్న చీకటి ఒకవైపు. ఉరుములు చేస్తున్న శబ్ధం ఇంకో వైపు. దీనికి తోడు ఆగకుండా అరుస్తున్న సీతాలు మరో వైపు. లోపల లక్షమ్మవ్వ, అనసూయత్త తమకు తెలిసిన వైద్యం చేసి దేవుడి పైనే భారం వదిలేసారు. గోపాలం చేతులు నలిపేసుకుంటున్నాడు.
కొద్ది నిమిషాల తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినగానే వున్న చోటే మోకాళ్ళ మీద కూర్చుండి పోయాడు గోపాలం. ఆనందం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తు న్నాడు. లక్షమ్మవ్వ చేతిలో ఆడబిడ్డతో బయటకి వచ్చింది. “అరేయ్ మనవడా! మాలచ్చిమి పుట్టింది పో… పండగ సేసుకో….” అని చెప్తూ బిడ్డని తన చేతిలో పెట్టింది. బిడ్డని చేతిలో తీసుకొని ముద్దెట్టుకున్నాడు.
అక్కడ పశువుల దొడ్లో సీతాలు తాడు తెంచుకుంది. పరిగెట్టుకుంటూ గుడిసె వైపే వచ్చింది. గోపాలం దగ్గరకి వచ్చింది. తన చెయ్యిని మళ్ళీ ఆప్యాయంగా నాకింది. అప్పుడు గోపాలంకి అర్ధమయ్యింది. “ఒసేయ్ సీతాలు! ఇదిగో లక్ష్మీ….” అని దానికి బిడ్డని చూపించాడు. “మనెమ్మకి ఎలా వుంది?” అని కంగారుపడుతూ అడిగాడు. “సాలానే రక్తం పోయింది. కాస్త నీరసంగా వుంది. ఏం పర్లేదు లే. బిడ్డని సూస్తే హుషారు మళ్ళీ వచ్చేస్తాది” అని లక్షమ్మవ్వ నవ్వుతూ వుంది.
బిడ్డని తీసుకొని లోపలికి వెళ్ళాడు. మనెమ్మ ప్రేమగా చూసింది. బిడ్డని తన పక్కనే పడుకోబెట్టి ప్రేమగా చెయ్యి పట్టుకున్నాడు. బయట నుంచి సీతాలు అరిచింది. ఇద్దరూ నవ్వుకున్నారు. “ఇందుకే సీతాలు నన్ను సంతకి పోనీకుండా ఆపింది” అని నవ్వుతూ అన్నాడు. తను కూడా తల ఊపుతూ నవ్వింది. అనుకున్నట్టుగానే పుట్టిన బిడ్డకి లక్ష్మీ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన వేళా విశేషం గోపాలం పశువుల దొడ్లో పశువుల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు చుట్టుపక్క ఊళ్ళకి కూడా పాలు అమ్ముతున్నాడు.
అలా గతం నుంచి బయటకి వచ్చాడు.
గతం గుర్తుకు వచ్చి సీతాలుని హత్తుకొని నిలుచున్నాడు. అది ఇంకా బాధతో అరుస్తూ వుంది. కాసేపటికి మనెమ్మ చంకలో బిడ్డతో వచ్చింది. అప్పటికే కొంచెం కొంచెం తెలవారుతోంది. కోళ్ళు గుడిసెల పైకి ఎక్కి కూస్తున్నాయి. చెట్ల పై పక్షుల సందడి మొదలయ్యింది. సీతాలు ఇంకా బాధతో మూలుగుతూనే వుంది. మనెమ్మ కూడా సీతాలు కి దగ్గరగా వెళ్ళింది. దాని మీద చెయ్యి వేసి నిమిరింది.
“మామా! పశువులకి కూడా బిడ్డ అడ్డం తిరుగుద్దా?” అని అమాయకంగా అడిగింది. “మన సీతాలుకి ఏం కాదులే… పైన దేవుడు వున్నాడు కదా. ఆయనే సూసుకుంటాడు” అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసాడు. “అది కాదు మామా! మన సీతాలు తల్లి కూడా సీతాలు పుట్టాగానే సచ్చిపోయింది అని అమ్మేవాడు ఆ రోజు చెప్పాడు కదా… నాకు చాలా బయంగా వుంది మామా” అని ఏడుపు అందుకుంది.
గోపాలం ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకి కూడా ఏడుపు వచ్చే స్తోంది. మనెమ్మని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ ఏడుస్తున్నారు. అప్పుడు సీతాలు తోక వచ్చి మనెమ్మ సంకలో వున్న లక్ష్మీకి తగిలింది. గిలిగింతలు పెట్టింది. దాంతో లక్ష్మీ పకపక నవ్వింది. సీతాలు వీపు మీద తన బుజ్జి చెయ్యి వేసింది. ప్రేమగా తాకింది. ఆ బుజ్జి పాపాయి స్పర్శతో సీతాలు గట్టిగా కేక పెట్టింది. కొద్ది క్షణాల్లో సీతాలుకి చిన్న దూడ పుట్టింది. సీతాలు దూడని ప్రేమగా నాకేస్తూ వుంది. గోపాలం, మనెమ్మల ఆనందం ఆకాశాన్ని తాకింది. ఆ చిన్న దూడని చూసి పాప పకపక నవ్వింది.
*****
నా పేరు వెంకట శివ కుమార్ కాకు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. కథలు రాయడం హాబీ. నలభై కి పైగా షార్ట్ ఫిల్మ్స్ కి కథ , కథనం, మాటలు, పాటలు అందించాను. ఒక అయిదు షార్ట్ ఫిల్మ్స్ కి డైరక్షన్ కూడా చేసాను. నేను అసోసియేట్ డైలాగ్ రైటర్ గా చేసిన కృష్ణరావు సూపర్ మార్కెట్ అనే సినిమా amazon prime లో వుంది. ఇంకా ఒక 4 చిన్న సినిమా లకు రచన చేసాను. వాటి రిలీస్ కోసం ఎదురు చూస్తున్నాను. నాకు రాయడం అంటే చాలా ఇష్టం అది పత్రిక నా, వెబ్ మాగజీన్ నా , షార్ట్ ఫిల్మ్ , వెబ్ సిరీస్ , ఫీచర్ ఫిల్మ్ అని తేడా లేదు. ఏదైనా ఒక్కటే. రాస్తూనే వుంటాను.
శివ రాస్తూనే ఉండు…భాగుంది.
మనెమ్మ గోపాలం మధురమైన పల్లె జీవితం కళ్ళకి కట్టినట్లు రాశారు రచయత. చాలా బావుంది ‘sitalu’.
Thank you !
మంచి feel-good story అందించారు…అభినందనలు
Thank you !
చాలా బాగుంది.
Thank you !