స్వయంసిద్ధ (ఒక అభినేత్రి జీవనరేఖ)

– గణేశ్వరరావు

         ఉమ్రావ్ జాన్ లో రేఖని చూసిన వాళ్ళెవరూ ఆమెని మరిచిపోలేరు. (అన్నట్టు ‘ప్రేమ’ ‘పెళ్ళి’ నిర్వచనాలు రేఖ జీవితచరిత్ర చదివాక మారిపోతాయి!)
 
          శ్రీదేవీ మురళీధర్ – యాసిర్ ఉస్మాన్ నవల ‘రేఖ-ది అన్ టోల్డ్ స్టోరీ’ ఆధారంగా రాసిన ‘స్వయంసిద్ధ’ (ఒక అభినేత్రి జీవనరేఖ) పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యానాలు ముందు చదవండి. యాసిర్ పాత్రికేయుడు, రేఖ జీవితచరిత్ర (నవల అనటం సరికాదు) రాసాడు కనక సినీ జర్నలిస్ట్. సినీ జర్నలిజంలో, వ్యక్తి జీవితాలను తడమడం జాస్తి, దోషాలు స్వతస్సిద్ధం, మన డిమండి డ్రామారావుని మాత్రం మించిపోలేదు!
 
          వెండి తెరకు ఇవతల ఉండే వారికి అవతల ఉండే వాళ్ళను గురించి ఎటు వంటి భ్రమలూ, అతిశయించిన అభిప్రాయాలు ఉంటాయో తెలుసు కదా! హేతువాదానికి లోబడి చేసిన రచన కాదిది. అసలేం జరిగింది? అతనికే తెలీదు, ఇక మనకేం చెబుతాడు? జరిగింది జరిగినట్లు ఆయా వ్యక్తులే అంగీకరించటం లేదు. అందుకే ఆ సంఘటనలను చదివాక, ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరచుకుంటే సరి!
 
          ఇంతకీ ఈ పుస్తకం స్థూలంగా – చిరుప్రాయంలో బాలీవుడ్ అడవిలోకి ‘అభినేత్రి’ గా అడుగుపెట్టిన రేఖ ‘బయోగ్రఫీ’. మొదటి నుంచి అందరూ ఆమెని వాడుకున్న వారే, ఆమె గతం తెలిసి ఆమెని వెలివేశారు, ఆమె భర్త, పిల్లలూ కావాలని కోరుకుంది, కాని దొరికినవి ‘శారీరక సంబంధాలు ! ‘చేదు’ ముద్దు పెట్టిన బిశ్వజిత్ మొదలుకుని అమితాబ్ వరకు , మధ్యలో ఇద్దరు మొగుళ్ళు వినోద్ మెహ్రా, ముకేష్ అగర్వాల్ !
 
          ‘నేను చెయ్యని పని అది (ఆక్షన్ అనగానే బిశ్వజిత్ – రేఖ పెదవుల మీద తన పెదవులను నొక్కిపెట్టాడు. యూనిట్ సభ్యులు వెకిలి కేకలు వేశారు), నాకు తెలియజేయకుండా జరిగింది. ఆ అనుభవం మిగిల్చిన బాధను ఏదీ తుడిచెయ్యలేదు” – రేఖ. ‘లైఫ్’ పత్రిక ముద్దు ఫోటో ప్రచురించడం వల్ల తాను వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదగవచ్చని రేఖ అనుకుంది. ప్రతి అపవాదూ ఒక ప్రచారం. ప్రతి విషాదం ఒక అవకాశం.  ‘నేను నటిని మాత్రమే కాదు, సెక్స్ ఉన్మాదిని, .. నేను ఇప్పటి వరకు గర్బం దాల్చడం లేదంటే ఆశ్చర్యకరమే!’ – రేఖ.
 
          ‘అనోఖి అదా’ లో నటిస్తున్నప్పుడు రేఖ జితేంద్ర ప్రేమలో పడింది, అన్ని బాలీవుడ్ ప్రేమకథల లాగే ఇది కూడా ముగిసింది. ‘నేను జీతూనే నమ్మాను, పెళ్ళి కావాలని అత్యాశ పడలేదు. నా నుండి అతడు పొందినది నాకు కూడా తన వైపు నుంచి న్యాయంగా దక్కాలని మాత్రమే కోరుకున్నాను’ – రేఖ.
 
          రేఖ జీవితంలో ప్రవేశించిన మొదటి నిజమైన ప్రేమికుడు వినోద్.. ‘నా 18వ పుట్టిన రోజున  నా పడక గదిలో నన్ను ముద్దు పెట్టుకున్నాడు’ – రేఖ
‘పెళ్ళికి ముందు సెక్స్ అనేది చాలా సహజం. కేవలం శోభనం నాడే స్త్రీ సెక్స్ అనుభవించాలని నాంచారులు చెప్పే నీతులు అర్థంలేనివి’ – రేఖ 
 
          రేఖ. వినోద్ ల పెళ్ళి కలకత్తాలో అయింది, అయితే ఆమె సమాజంలో ఎటు వంటి ఆమోదం లేని సంబంధం నుండి పుట్టింది కాబట్టి వినోద్ మెహ్రా తల్లి ఆమెను కోడలిగా అంగీకరించలేదు. ‘7౩ లో జరిగిన గొడవ తరువాత రేఖ బొద్దింక విషం మింగింది. నిర్మాతలు గాభరా పడ్డారు, రేఖ-వినోద్ ప్రమాదవశాత్తు బొద్దింక పడిన ఉప్మా తినటం చేత ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ప్రెస్ కు సర్ది చెప్పారు. తర్వాత తానెప్పుడూ వినోద్ మెహ్రాను పెళ్ళి చేసుకోలేదని ఖండించింది రేఖ.
 
          రెండేళ్ళు (72-74) విలన్ జీవన్ కొడుకు, నటుడు అయిన కిరణ్ కుమార్,  రేఖా సన్నిహితంగా ఉన్నారు. అతన్ని ‘కిన్ కిన్’ అని ప్రేమగా పిలిచేది. ఆమె తల్లి సంగతి తెలిసి కిరణ్ ‘ఛాందస’ కుటుంబం కూడా ఆమెను పక్కన పెట్టింది.
 
          ఆమె వైవాహిక జీవితం సమాజంలో పాతుకుపోయిన కపటత్వం వల్ల మాత్రమే తిరస్కరణను ఎదుర్కోవలసి వచ్చింది. సమాజం నమ్మే నిస్సారమైన నీతులు రేఖ జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ, ఆమె ఆనందాన్ని, అందరి లాగా జీవించే మౌలికమైన హక్కును దోచుకున్నాయి.
 
          ‘అతడికి పెళ్ళి అయిందన్న వాస్తవం వల్ల నాకేమీ తేడా లేదు’ – రేఖ.  ‘దో అంజానే’ లో అమితాబ్ సరసన నటించటంతో ‘దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఉర్రూత లూగించే ప్రణయ రంగం సిద్ధమైంది’. ‘సమయపాలన, ఏకాగ్రత వంటి వృతి నైపుణ్యాలు అతడి నుండి నేర్చుకున్నాను. అతడు నా ప్రవర్తనను, జీవన శైలిని ప్రభావితం చేశాడు.’- రేఖ.
 
          ‘అమితాబ్ రేఖను మలిచాడు. ఆమెకు మాట్లాడటం, నడవడిక నేర్పించిన వ్యక్తి. అతడి ప్రభావంతోనే ఆమె నటిగా, స్త్రీగా ఎదిగింది!’ -ప్రకాష్ మెహ్రా, దర్శకుడు.
 
          ‘నేను ఎప్పుడూ ధరించే రెండు ఉంగరాలు అమితాబ్ ఇచ్చినవే. నాతో కలిసి పనిచేయడానికి అతను నిరాకరించడంతో అవి ఆయనకు తిరిగి ఇచ్చేసి అతనితో విడిపోవాలని నిర్ణయించుకున్నాను’ – రేఖ.
 
          ’84 లో రేఖ – సంజయ్ దత్ ని పెళ్ళాడింది అన్న వార్త వచ్చింది. ఈ పుకార్లతో వారిద్దరూ నటించిన ‘జమీన్ ఆస్మాన్’ చిత్రం లాభపడింది. తర్వాత రాజ్ బబ్బర్, రేఖ ప్రేమ వ్యవహారం ‘సంసార్’ లో నటిస్తున్నప్పుడు గుప్పు మంది. బాక్సాఫీస్ వసూళ్ళ దృష్ట్యా రేఖకు ఆమె హీరోలతో ప్రేమాయణాలు అంటగట్టటం లక్ష్యంగా ఈ పుకార్లు పుట్టుకొచ్చాయని కొందరు అనుమానించారు.
 
          ‘ఖూన్ భరీ మాంగ్’ తో లేడీ అమితాబ్ గా గుర్తింపు పొంది ఉన్నత స్థానాన్ని చేరు కుంది. మూడుపదుల వయసులో కొత్త తారలు శ్రీదేవి వంటి వారితో పోటీ సాధ్యం కాలేదు, ఆమె నటించిన చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. ’90 లో ముఖేష్ తో రేఖ పెళ్ళయింది. పెళ్ళయిన ఏడు నెలలకే అతను ఆమె దుపట్టాతో ఉరి వేసుకున్నాడు. ’91 లో ఆమె తల్లి మరణించింది. అవార్డ్ ఆమె చేతుల్లోంచి అందుకుంటూ మొదటి సారి జెమిని గణేశన్ ఆమెని ‘తన కూతురు’ అన్నాడు.
 
          2016 లో అమితాబ్ ‘బెస్ట్ ఆక్టర్’ అవార్డ్ తీసుకుంటున్నప్పుడు రేఖ – జయ పక్కకు చేరింది. ‘ఆ ఇద్దరి కళ్ళు అమితాబ్ వైపు దశాబ్దాలుగా తమ జీవితంలో భాగమైన అతి ముఖ్యమైన ఆ వ్యక్తి మీద నిలిచిపోయాయి.’
 
          ఈ పుస్తకం ప్రాథమికంగా రేఖ జీవితం గురించే కానీ,  ‘కళాకారిణి’ రేఖ గురించి మాత్రం కాదు . జీవితానికి, కళకి మధ్య ఒక అగాధం ఉంది. ఒక తార నిజ జీవితం చదివినప్పుడు సాధారణంగా కలిగే భావం ఆ జీవితం అవినీతికరమైనదని! సినిమా కథలకీ, జీవితానికీ ఉండే వ్యత్యాసం వేరు. నిత్య జీవితానికీ, తారల జీవితానికీ ఉండే వ్యత్యాసాన్ని ఏం చేసేటట్టు? దీనిని తీసి వెయ్యలేం. ఈ పుస్తకం చదివాక, ధర్మేంద్ర హేమామాలినిని  రెండో పెళ్ళాంగా చేసుకోలేదా, అమితాబ్ రేఖకి ఎందుకు అన్యాయం చేసినట్లు అనిపించింది నాకు! ఈ పుస్తకం రాసిన రచయితకు అదే అనిపించి అనుకుంటా  ‘జయ పక్కకి చేరి రేఖా ..ఇద్దరూ అమితాబ్ వైపు ఆరాధనగా చూస్తూ నిలబడటం!’ అని చక్కని ముగింపు ఇచ్చాడు: 
 
కాగా తేట తెలుగులో, అనువాదం చేసిన శ్రీదేవి ‘స్వయంసిద్ధ’ అనే పేరు పుస్తకానికి పెట్టడంతో ఆ తార మీద ఆమెకున్న ఆరాధన, అభిమానం తెలిసిపోతోంది. ‘ఇందులో నా మనసు కూడా వ్యక్తమౌతుంది. నాకు నచ్చని విషయాలు, అవమానకరం అనిపించినవి తొలగించాను’ అంటూ తన ముందు మాటల్లో ఆమె అన్నారు. అన్నట్టు ఇది ఆషామాషీగా అచ్చు వేసిన పుస్తకం కాదు, అత్యంత ప్రేమ, శ్రద్ధతో ప్రతి పేజీ తీర్చిదిద్దినది, అరుదైన చిత్రాలతో ప్రతీ పేజీ అలంకరించబడింది. కేవలం ముఖచిత్రం చూస్తే తెలియడం లేదూ!
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.