ఆఖరి మజిలీ
హిందీ మూలం- `आखिरी पड़ाव का दुःख’- సుభాష్ నీరవ్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
రాత్రి ఎన్ని గంటలయిందో తెలియదు. కళ్ళలోంచి నిద్ర ఎగిరిపోయింది. మనస్సు లోంచి శాంతి అదృశ్యమైపోయింది. కాసేపు పక్కమీద నుంచి లేచి కూర్చుంటున్నాను. కాసేపు పడుకుంటున్నాను. కాసేపు `వాహే గురు-వాహే గురు’ స్మరించుకుంటున్నాను. గురుమీత్, హరజీత్ నిన్న మాట్లాడుకున్న మాటలు నాకింకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నా యి. నా వృద్ధ హృదయం అప్పటి నుంచి ఒక చక్రంలాగా పరిభ్రమిస్తోంది. అయ్యో భగవంతుడా! రబ్బా! జీవితంలోని ఈ ఆఖరి రోజుల్లో నాకు ఎటు వంటి దుఃఖాన్ని మిగిల్చావు తండ్రీ?
నా పిల్లలతండ్రి, నా జీవితభాగస్వామి ఒక రోడ్డుప్రమాదంలో మరణించినప్పుడు గుండెల మీద అనుకోకుండా వచ్చిపడిన పర్వతంలాంటి దుఃఖాన్ని నిండుయవ్వనంలో సహించుకున్నాను. ఆయన వెనకాల నేను ఒంటరిగా, నా ఇద్దరు చిన్న పిల్లలతో నిస్సహాయంగా మిగిలిపోయాను. నా అదృష్టం బాగుండి ఆయన ఒక గది, వంటిల్లుతో వున్న గూడు నాకు తల దాచుకునేందుకు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. నేను ఈ పిల్లలని నా కొంగులో జాగ్రత్తగా పదిలంగా ఎలా ఉంచుకున్నానో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఇతరుల ఇళ్ళకి వెళ్ళి పాత్రలు తోమవలసివస్తే తోమాను. బట్టలు ఉతకవలసివస్తే ఉతికాను. పొలాలలో కూలిపని చేయవలసివస్తే చేశాను. పేడ, చెత్త ఎత్తవలసివస్తే ఎత్తాను. కాని ఎవరి ముందూ చెయ్యిచాచలేదు. నేను తక్కువగా తిని, నా పిల్లలకి కడుపునిండా తినిపించాను. నా ఇద్దరు కొడుకులు నాకు రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు. వీళ్ళ కోసం నేను ఏం చెయ్యగలిగానో అది చేశాను. వీళ్ళని చదివించాను. పరమాత్మా! నీ కృపాకటాక్షాల వల్ల గురుమీత్ చదువుకుని ఒక స్కూల్లో టీచరయ్యాడు. చిన్నవాడు హరజీత్ పదోతరగతి పాసై ఒక ఏజెంటు ద్వారా యూకేకి వెళ్ళాడు.
హరజీత్ మీద నేను పెట్టుకున్న ఆశలేవో పెట్టుకున్నాను. కాని గురుమీత్ కి మాత్రం తన తమ్ముడి మీద కొంచెం ఎక్కువ ఆశలే ఉన్నాయి. వాడు దొరికినచోటల్లా అప్పు తెచ్చి ఏజెంటు జేబులు నింపాడు. హరజీత్ ని విమానం ఎక్కించి పంపించాడు. ఊళ్ళో చాలా మంది కుర్రాళ్ళు విదేశం వెళ్ళారు. వాళ్ళ ఇళ్ళలో ఇప్పుడు వైభవంగా, ఆడంబరంగా ఉంది. సాధారణమైన ఇళ్ళు బిల్డింగుల్లా మారిపోయాయి. ఆ ఇళ్ళవాళ్ళు మారుతికారుల్లో తిరుగుతున్నారు. కాని, హరజీత్… వాడు అక్కడికి వెళ్ళి ఇంక వెనక్కి తిరిగి చూడటం మానేశాడు. వాడు అక్కడే పెళ్ళి చేసుకున్నాడు. ఆ విదేశంలో నిలబడటానికి, పైకి రావడానికి అక్కడి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం అవసరమని వాడంటాడు. మొదట్లో అయితే వాడు అన్నయ్య గురుమీత్ కి డబ్బు పంపిస్తూ ఉండేవాడు. తరువాత వాడు డబ్బులు పంపించడం మానేశాడు. వాడు గురుమీత్ రాసిన ఉత్తరాలకి జవాబు కూడా ఇవ్వలేదు.
గురుమీత్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పు డు చిరాకు పడేవాడు, తిట్లు లంకించుకునేవాడు– “నేను చేసినదంతా మరిచిపోయాడా శుంఠ! అక్కడికి వెళ్ళి తెల్లదొరసాని ఒళ్ళో కూర్చున్నాడు. నా తల మీద ఉన్న అప్పు తీర్చాలనే చింత ఏమైనా ఉందా వాడికి? వడ్డీ అయితే హనుమంతుడి తోకలాగా పెరుగు తూ పోతోంది.”
ఆ తరువాత ఒకరోజున హరజీత్ చడీచప్పుడూ లేకుండా, ముందు చెప్పకుండానే ఇండియాకి వచ్చాడు. వాడు పూర్తిగా అయిదేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు. అదికూడా ఒంటరిగా. హరజీత్ వచ్చాడంటే నా కళ్ళలోంచి కన్నీరు ఆగటం లేదు. అయిదేళ్ళ తరువాత వాడి ముఖం చూడగలిగాను. వాడిని మాటిమాటికీ దగ్గరికి తీసుకుని వాడి తల మీద ముద్దు పెట్టుకున్నాను, “నాన్నా హరజీతూ, నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను పూర్తిగా మరిచిపోయావురా. నీకు నేనెప్పుడూ గుర్తు రాలేదా? మరి నువ్వు ఒక్కడివే ఎందుకొచ్చా వు?…కోడలిని కూడా తీసుకువస్తే బాగుండేది కదా. నేను కన్ను మూసేలోగా నేను కూడా నా కోడలు ఎలా ఉంటుందో చూసేదాన్ని.”
గురుమీత్, వాడి భార్య, హరజీత్ ని బాగా ఝాడించిపడేశారు. ఎత్తిపొడిచారు. గురుమీత్ తన తల మీద ఉన్న అప్పులు, పెరిగిపోతున్న వడ్డీ గురించి చెప్పుకుని ఏడ్చాడు. వాళ్ళిద్దరూ హరజీత్ ఉన్నంతసేపూ, ఇప్పుడు వచ్చావు గనక పైన రెండు గదులు వేసి వెళ్ళమని పట్టుపట్టారు. కాని హరజీత్ కేవలం పైన ఒక ఇంగ్లీషు బాత్ రూం కట్టించి, కింద ఇంటి ఫ్లోరుకి టైల్స్ వేయించాడు. పైన గదులు వేయించడానికి తొందర లోనే గురుమీత్ కి డబ్బు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
హరజీత్ ఇక్కడ ఉన్నంత వరకూ నా గురించి ఇంతో అంతో పట్టించుకునేవాడు. వాడు వెళ్ళిపోయాక మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.
నాకు కాళ్ళూచేతులూ ఆడుతున్నన్నాళ్ళూ నేను ఏపనీ చేయకుండా కూర్చునే దాన్ని కాదు. ఎప్పుడూ ఏదో ఒక పని నా చేతుల్లో ఉండేది. ఇల్లు శుభ్రంగా ఉంచుకునే దాన్ని. చీపురుపెట్టి ఇల్లంతా తుడుచుకునేదాన్ని. రెండుపూటలా వంట చేసేదాన్ని. గిన్నెలు తోముకునేదాన్ని. బట్టలు ఉతుక్కుని పైన ఆరవేసేదాన్ని. కోడలు ప్రీతో దగ్గర కూర్చుని ఆమె తలకి నూనె మెల్లమెల్లగా పట్టించేదాన్ని. అప్పుడు ప్రీతో కూడా నేనంటే ఇష్టంగా ఉండేది. “అత్తయ్యగారూ-అత్తయ్యగారూ” అంటూ నా చుట్టూ తిరిగేది. కాని దేహం అనేది దేహమే కదా. వయస్సుతో పాటు అలసట మొదలవుతుంది. చిన్న-చితక రోగాలు ఈ శరీరం మ్మీద దండయాత్ర చెయ్యడం మొదలుపెడతాయి. నా ఒళ్ళు కూడా నెమ్మదిగా నాకు సహకరించడం మానేసింది. మోకాళ్ళలో నొప్పి మొదలయింది. శరీరాని కి పడక కావలసివచ్చింది. నేను ఈ చిన్న గదిలో ఇమిడి ఉండిపోయాను.
దీన్ని గది అని కూడా ఎలా అనగలం, ఇది ఒక చిన్న స్టోర్రూం. అందులోనే ఒక పాత మంచం మీద నాకు పక్క వేశారు. పక్కకి తలవైపున కొంచెం చోటు ఉంది. అక్కడ ఒక చిన్న విరిగిన టేబిలుని ఇటుకల సాయంతో నిలబెట్టి దాని మీద చిన్న-పొన్న సామాను పెట్టివుంచారు. నా మందుసీసాలు, గాజు చిమ్నీ ఉన్న ఒక పాత దీపం, నా బట్టలు పెట్టిన ఒక చిన్న పెట్టె ఉన్నాయి. దాని మీదనే ఒకవైపు మా ఆయన ఫోటో పెట్టి వుంది. నా మంచం ఎడమవైపున గోడకి ఆనించి ఉంది. దానికి పైన పసుపుపచ్చని కాంతి ని ఇస్తున్న బల్బు పెట్టి వుంది. రావడానికి, వెళ్ళడానికి కుడివైపున కొద్దిగా చోటు మిగిలి వుంది. ఈపక్కనే, తలవైపున ఒక స్టూలు మీద నీళ్ళ జగ్గు, ఒక గ్లాసు, ఒక చెంచా, ఒక గిన్నె ఉన్నాయి. గోడలకి కిటికీ అంటూ ఏదీ లేదు. వెలుతురు వచ్చే మరే సదుపాయం కూడా లేదు. కేవలం ఒక తలుపు మాత్రం ఉంది. అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. భరించలేని చలి ఉన్నప్పుడు కూడా నేను దీనిని వెయ్యను. తలుపు వేసివుంచితే నాకు ఊపిరి సలపదు. దానికి ఒక పాత లావుపాటి దుప్పటి ఎప్పుడూ తెరలాగా కట్టివుంటుంది. అది ఉన్న కారణంగా బయట వస్తూపోతూ ఉండే వ్యక్తికి లోపల పక్క మీద పడివున్న నేను కనిపించను. ఈ గదిని ఆనుకునే పై డాబా మీదకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్లకి కింద చిన్న స్నానపుగది ఉంది. అందులోనే ఒక నీళ్ళ పంపు ఉంది. దీన్ని ఇప్పుడు నేనే వాడుతున్నాను. ఇంట్లో మిగిలిన వాళ్ళందరికీ పైన ఇంగ్లీషు స్టైల్ లో పెద్ద బాత్ రూం ఉంది. మెట్లకి అవతల ఒక పెద్ద గది, ఒక వంటగది ఉన్నాయి. గురుమీత్, వాడి భార్య, ఇద్దరు పిల్లలు అందులోనే ఉంటారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ప్రతి మనిషి నా గది ముందు నుంచే వెళ్ళాలి.
కొన్నేళ్ళ కిందట నాకు ఒంట్లో బాగున్నప్పుడు నేను గదిలోంచి బయటికి వచ్చి చిన్న ప్రాంగణంలో కూర్చుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వచ్చి వీధిలోకి కూడా వెడుతూ ఉండేదాన్ని. కాని మంచం పట్టిన తరువాత మోకాళ్ళలో నొప్పి మొదలయ్యాక మంచం నన్ను వదిలిపెట్టదు. నేను మంచాన్ని విడిచిపెట్టను. నేను కడుపు ఖాళీ చేసుకునే అవసరం వచ్చినప్పుడే లేస్తూ ఉంటాను. పక్కమీద పడుకుని వుండి పైకప్పుని, లేకపోతే గోడలని అలా చూస్తూ ఉండిపోతాను. లేకపోతే `వాహే గురు – వాహే గురు’ జపిస్తూ ఉంటాను. మొదట్లో తరచు నేను నాలో నేనే, లేకపోతే గోడలతో ఏదో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. గోడలకి కూడా చెవులు ఉంటాయని, అవి వినగలవని అంటారు. కాని గోడలకి నోళ్ళు ఉండవు. అవి మాట్లాడలేవు.
ఇప్పుడెవరూ నా గదిలోకి రారు. నా ఒంట్లో ఎలావుందని అడగరు. కొడుకూ, కోడలూ కూడా. గురుమీత్ ఇద్దరు పిల్లలు బిందర్, జిందర్ఎప్పుడైనా తెర తీసుకుని నా గదిలోకి వచ్చేవారు. నా పక్కమీద కూర్చుని ఆడుకుంటూ వుంటే నాకెంతో ఆనందంగా ఉండేది. నేను పిల్లలతో మాట్లాడుతూ సంతోషించేదాన్ని. నాకు సమయం బాగా గడిచేది. కాని, నేను జబ్బుపడిన దగ్గరి నుంచి పిల్లలు కూడా నా దగ్గరికి రావడం మానేశారు. బహుశా కోడలే వాళ్ళని ఆపుజేసి ఉంటుంది. ముందు అయితే గురుమీత్ స్కూలుకి వెళ్ళేటప్పు డూ, స్కూలు నుంచి తిరిగి వచ్చేటప్పుడూ నా దగ్గర కొంచెంసేపు కూర్చుంటూ ఉండే వాడు. నాకెలా ఉందని అడిగేవాడు. నా మందుల గురించి అడిగి తెలుసుకునేవాడు.
కాని, క్రమంగా వాడుకూడా నా పరిస్థితి గురించి అడగడం, నా దగ్గర కూర్చోవడం మానేశాడు. సెలవు రోజున అయితే ఒకటి-రెండుసార్లు తప్పకుండా తెర ఎత్తి తొంగి చూస్తాడు. కాని, నా గురించి ఏమీ అడగడు. నేను ఒక మూల ఒక పనికిరాని వస్తువులాగా పడి ఉన్నాను.
“వాహే గురు…రక్షించు తండ్రీ! కరుణించు… ఈ ముసలితనంలో నరకం చూపించకు…”
నా మందు అయిపోయి చాలా రోజులయింది. ఎవరైనా ఇటు తొంగిచూస్తే కదా వాళ్ళతో చెప్పగలను. వీళ్ళు నన్ను పూర్తిగా వదిలేశారు. “ఒరే రాతిగుండె మనుషుల్లారా, ఎప్పుడైనా ఈ తెర ఎత్తి ఈ దిక్కుమాలిన దాన్ని నన్ను కూడా ఒక కంట చూడండిరా, బతికున్నానో లేదో…”
నేను ఎందుకు మొత్తుకుంటున్నానని ఒక్కోసారి అనుకుంటాను. నుదుటి మీద రాసివున్నది అనుభవించక తప్పదు… రెండుపూట్లా అన్నం పెడుతున్నారంటే అదే మన్నా తక్కువా…ఇంట్లో నుంచి బయటికి విసిరి పారెయ్యలేదు కదా… ఆ దేవుడికి వెయ్యి దణ్ణాలు.. కనీసం కోడలు తెరకింది నుంచి అన్నం కంచం లోపలికి జరుపుతుంది. పాత్రలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఏమయిందో, ఎప్పుడైనా దగ్గర కూర్చుని, లేకపోతే కొంచెంసేపు నిలబడి మాట్లాడనైనా మాట్లాడదు. తనతో చెప్పుకోవాలని నేనుకూడా ఏమిటేమిటో మనస్సులో పెట్టుకుని ఆలోచిస్తున్నాను. కాని తను అయితే అవకాశమే ఇవ్వదు.
మొదట్లో నేను మంచంమీద పడివుండి, కోడలిని లేదా పిల్లల్ని గట్టిగా పిలిచేదాన్ని. ఒకసారి మంచినీళ్ళ కోసం, మరోసారి అన్నం కోసం, ఇంకోసారి మందు కోసం లేదా బాత్ రూంకి వెళ్ళడంకోసం. వాళ్ళని పిలిచి-పిలిచి నా గొంతు ఎండిపోయేది. అయినా ఎవరూ నావంక తొంగి కూడా చూసేవారు కాదు. చివరికి గతి లేక పిలవడమే మానేశాను. నా అంతట నేనే కర్ర తీసుకుని, మోకాళ్ళ మీద చెయ్యి పెట్టుకుని లేస్తున్నాను. పంపు దగ్గర నీళ్ళు తీసుకుంటున్నాను లేదా నా అవసరాలు తీర్చుకుని వస్తున్నాను. ఇప్పుడు నాకిదంతా అలవాటైపోయింది.
“వాహే గురు, నువ్వే రక్షించాలి తండ్రీ…”
గోడ మీద కుడివైపున ఒక కాలెండరు వేలాడుతోంది గురునానక్ దేవుడి బొమ్మతో. నేను కాలెండరు వంక చూసినప్పుడల్లా నాకు నానక్ బాబా నావంకకే చూస్తూ నవ్వుతు న్నట్లు అనిపిస్తుంది. నేను “వాహేగురు- వాహేగురు” అంటూ ప్రార్థించుకుంటున్నాను– “ఓ సత్య స్వరూపుడవైన ప్రభూ! వృద్ధాప్యంలో ఇంకా బాధలు పెట్టకు. నీ దగ్గరికి పిలుచు కో. ఇంక నేను సహించుకోలేను.”
ఒక్కొక్కసారి టేబిలు మీద పెట్టివున్న గురుమీత్-హరజీత్ ల తండ్రిగారి ఫోటోని చూసుకుంటూ ఉంటాను. ఆయనతో మాట్లాడుతూ ఉంటాను—“చూస్తున్నారు కదా మీరు! మీరు వెళ్ళిపోయాక నా పరిస్థితి ఎంత దుర్భరమైపోయిందో చూడండి.”
గడిచిన రెండు-మూడు రోజుల నుంచి ఇంట్లో సందడిగా ఉంది. గురుమీత్ కూడా నా పరిస్థితి తెలుసుకునేందుకు వస్తున్నాడు. అప్పుడప్పుడూ పిల్లలు కూడా వచ్చి తొంగి చూసి వెడుతున్నారు. నా మందులు కూడా వచ్చాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. తరువాత తెలిసింది హరజీత్ ఇంగ్లాండు నుంచి తన భార్యాబిడ్డలతో పదిహేను రోజులకి వస్తున్నాడని. ఈ సంగతి విని నాకు సంతోషం కలిగింది. “పోనీలే, ఇప్పుడైనా భగవంతు డు నేను కళ్ళు మూసేలోగా హరజీత్ ని, వాడి పిల్లలని చూసే ఆనందం ప్రసాదిస్తు న్నాడు!”
హరజీత్ వచ్చాక ఇంటికి కళాకాంతులు వచ్చాయి. హరజీత్ భార్య పూర్తిగా దొరసాని. వాడి పిల్లలు చాలా అందంగా ఉన్నారు- పుష్టిగా, బొద్దుగా, తెల్లని శరీరఛాయతో. వాళ్ళు కూడా గురుమీత్ పిల్లలతో బాటు మాటిమాటికీ తెర పైకెత్తి నా గదిలోకి తొంగి చూస్తున్నా రు. హరజీత్ భార్య రెండు-మూడుసార్లు నా గదిలోకి వచ్చి నాతో మాట్లాడింది. ఇంగ్లీషులో ఏమేమిటో మాట్లాడింది. నాకేమీ అర్థం కాలేదు. మధ్య-మధ్యలో తప్పకుండా పంజాబీ-హిందీ పదాలు ఒకటీ-రెండూ నా చెవుల్లో పడ్డాయి. కాని తను నాతో మాట్లాడటం నాకు చాలా బాగుంది. తను నా దగ్గరే కూర్చుని ఉండాలని నాకనిపించింది.
గడిచిన కొద్దిరోజుల నుంచి వెధవ మూత్రం ఎక్కువగా వస్తోంది. రాత్రిపూట రెండు-మూడుసార్లు నేను లేవవలసి వస్తోంది. మోకాళ్ళ నొప్పి మూలంగా నాకు ప్రాణం పోతోంది. గదికి బయటవున్న మురుగుకాలువ దగ్గరే కూర్చుందామనిపిస్తుంది. కాని కోడలు తిడుతుందనే భయంతో కూర్చోను. ఒకసారి కూర్చున్నాను కాని, మర్నాడు పొద్దున్నే కోడలు తన ముక్కూ-నోరూ దుపట్టాతో మూసుకుని నాకు తిట్లహారతి ఇచ్చింది. ఇంక ఆ విధమైన ఆలోచన విరమించుకున్నాను. మొన్నరాత్రి మూత్రవిసర్జన కోసం బయటికి వచ్చినప్పుడు గురుమీత్ గది నుంచి తగువులాడుకుంటున్న మాటలు వినిపిం చాయి. గురుమీత్, వాడి పెళ్ళాం గట్టిగా హరజీత్ తో జగడం చేస్తున్నారు. నేను నా పని చేసుకుని గురుమీత్ గది వైపుకి వెళ్ళాను. తలుపు తెరిపించి వాళ్ళతో చెబుదామని పించింది –“నాయనా! పుత్తర్! దేనికిరా దెబ్బలాడుకుంటున్నారు? మీరు చెప్పేదేదో కూర్చుని మాట్లాడుకోండి… ఇంతరాత్రివేళ ఇంత గట్టిగా మాట్లాడుతూ తగువులాడుకుంటే ఇరుగుపొరుగు వాళ్ళు ఏమనుకుంటారు…” కాని మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి కర్ర సాయంతో గదికి బయటనే ఉండిపోయాను. లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నది నాకు స్పష్టంగా వినిపిస్తోంది—
“నువ్వు ఇక్కడి నుంచి బాగానే వెళ్ళిపోయావు. వెళ్ళేటప్పుడేమో అన్నావు పైన రెండు గదులు వేసుకోవడానికి డబ్బు పంపిస్తానని” గురుమీత్ భార్య ప్రీతో దెప్పుతోంది.
“అవును. పంపలేకపోయాను. నాక్కూడా ఇప్పుడు కుటుంబం ఉంది. అక్కడ ఖర్చులు చాలా ఎక్కువ. అతికష్టం మీద గడుపుకోవాలి.” హరజీత్ అంటున్నాడు.
“మరి నేను లక్షల కొద్దీ అప్పు చేసి నిన్ను బయటికి పంపించింది నువ్వు అక్కడికి వెళ్ళి జల్సా చెయ్యడానికా? ఇక్కడ నేను నీ అప్పు తీరుస్తూ కూర్చోనా? నాకు మాత్రం కుటుంబం, పిల్లలూ లేరా?” గురుమీత్ చాలా కోపం మీద ఉన్నట్లు తెలుస్తోంది.
“మొత్తం అప్పునంతా తీరుస్తాను, కాని కాస్త నెమ్మదిగా.”
“నువ్వు అక్కడికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలయింది, ఏం చేశావు నువ్వు? ఊళ్ళో వేరేవాళ్ళ పిల్లలు కూడా బయటికి వెళ్ళారు. రెండు-మూడేళ్ళలోనే వాళ్ళవాళ్ళు ఊళ్ళో భవంతులు కట్టుకున్నారు. వాళ్ళవాళ్ళు కూడా ఒక్కరొక్కరుగా విమానాలెక్కి విదేశాలు తిరిగివచ్చారు. నువ్వూ ఉన్నావు. ఒకటేమో అయిదేళ్ళ వరకూ ముఖం కూడా చూపించ లేదు. అయిదేళ్ళ తరువాత వచ్చినా కేవలం బాత్ రూం కట్టించి, టైల్సు వేయించి వెళ్ళి పోయావు. మళ్ళీ నాలుగేళ్ళు ఐపూ-అజా లేకుండాపోయావు. డబ్బులూ పంపలేదు, ఏ ఉత్తరానికీ జవాబు ఇవ్వలేదు.” గురుమీత్ చెప్పుకుపోతున్నాడు.
“మీకు నా పౌండ్లే కనిపిస్తున్నాయి. అరే, ఒక్కొక్క పౌండు కోసం రాత్రనక, పగలనక నేను ఎలా ఒళ్ళు వంచి పని చేయాల్సి వస్తోందో అది నా ఒక్కడికే తెలుసు. ఇక్కడ కూర్చుని మీకేం తెలుస్తుంది?”
“అయితే పెళ్ళి చేసుకునేందుకు నీకు అంత తొందరేం వచ్చేసింది. కాస్త డబ్బు సంపాదించుకుని ఇక్కడ అప్పు తీర్చేసేవాడివి. తరువాత పెళ్ళి చేసుకునేవాడివి. ఇల్లు చూసుకునేవాడివి…”
“అన్నయ్యా, పెళ్ళి చేసుకోపోతే అక్కడ నాకు ఉండటం సాధ్యమయేది కాదు. పెళ్ళి చేసుకున్నాను కాబట్టే అక్కడ స్థిరంగా ఉండగలిగాను. అక్కడ స్థిరపడటానికి ఇక్కడ నుంచి వచ్చిన పెళ్ళి అయినవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. లేకపోతే…” హరజీత్ సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు.
“కాని నేను అప్పు మీద వున్న వడ్డీ తీర్చడానికే చస్తున్నాను. అసలు సొమ్ము ఎలా వున్నది అలా ఓ పర్వతంలాగా నా గుండెల మీద పడివుంది. నాకు ప్రాణం మీదికి వచ్చింది. అప్పు ఇచ్చినవాళ్ళు ఎత్తిపొడుస్తున్నారు- ఇప్పుడు నీ తమ్ముడు విదేశంలో సంపాదిస్తున్నాడు, ఇప్పుడు నీకు డబ్బుకి లోటేమిటని. చూడు తమ్ముడూ, నువ్వు నా తలమీద నుంచి ఈ అప్పుభారాన్ని దించు. నేను కూడా సంతోషంగా కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాను.” గురుమీత్ మాటలో ఏడుపు ధ్వనించింది.
“లెక్క ప్రకారం చూస్తే ఈ ఇంట్లో నాకు కూడా భాగం ఉంది. అది నేను విడిచి పెట్టేశాననుకో.” హరమీత్ మాట కూడా తీవ్రమయింది.
“ఏంట్రా, వాటా నువ్వు రేపు తీసుకునేది ఇవ్వాళే తీసుకో.” గురుమీత్ కంఠస్వరం హెచ్చింది. “వాటా అడగటానికి బయలుదేరాడు. ఒరే, నేను అప్పు తీసుకుని నిన్ను పంపించకపోతే నువ్వు దేశం బయటికి ఎలా వెళ్ళేవాడివి….నేనిక్కడ ఇన్నేళ్ళ నుంచి అమ్మని నా దగ్గర పెట్టుకున్నాను. ఇందులో నీకు కూడా బాధ్యత అనేది ఉంది. అమ్మని నీతో తీసుకుపో. నా ఋణభారం కూడా దించి నన్ను విముక్తుడిని చెయ్యి. ఇంతకన్నా నాకింకేమీ అక్కర్లేదు.”
“అమ్మని నేనెల్లా తీసుకెళ్ళగలను?” హరజీత్ గొంతు తగ్గించి అన్నాడు, “అమ్మ అక్కడ ఉండలేదు. తనకి ఇక్కడే బాగుంటుంది. అమ్మని చూసుకునేందుకు నేను డబ్బు పంపిస్తూ వుంటాను.”
“అబ్బో! డబ్బు పంపిస్తావు…చాలా బాగా చెప్పావు. ఓ పక్క అప్పు తీర్చడం నీ వల్ల కావడంలేదు. అమ్మని చూసుకునేందుకు నువ్వు డబ్బు పంపిస్తావా?” గురుమీత్ ఒళ్ళు రవులుకుపోతోంది.
నేను ఇంక అక్కడ ఎక్కువ నిలబడలేకపోయాను. మౌనంగా వచ్చి నా మంచం మీద పడుకున్నాను. రాత్రి చాలాసేపటి వరకు ఇద్దరు అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరుగు తున్నట్లు వినిపిస్తూనే ఉంది.
నిన్న మధ్యాహ్నం హరజీత్ నా దగ్గరికి వచ్చి చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నా డు. హరజీత్ చెప్పింది విని నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. “అయ్యో రబ్బా! భగవం తుడా! నేనేం వింటున్నాను? ఇది వినే ముందు నా ప్రాణాలు ఎందుకు పోలేదు? వాహే గురు! నువ్వు నా మీద ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నావా తండ్రీ? ఏ పిల్లల కోసం నేను నా జీవితాన్ని సమర్పించుకున్నానో, ఏ బాధనైనా మౌనంగా సహించుకున్నానో, వాళ్ళే ఇదంతా ఆలోచిస్తున్నారు.”
సాయంత్రం గురుమీత్ కూడా వచ్చి హరజీత్ చెప్పిందే నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.
నాకేమీ అర్థం కాలేదు. నాకయితే మనస్సు పరిభ్రమిస్తోంది. కళ్ళలోంచి కన్నీళ్ళు జలజలా జాలువారుతున్నాయి. “ఎందుకిలా బాధ పెడుతున్నారు. తల్లినే భారంగా తలుస్తున్నారు…” నా నోట్లోంచి మాట ఏదీ రావడంలేదు. నేను నా అంతరంగంలోనే వాళ్ళని బతిమాలుకుంటున్నాను, “నాన్నా, నేను మిమ్మల్ని ఏమీ అనడంలేదు. నా శ్వాస మిగిలి ఉన్నంత వరకూ నన్నీగదిలోనే మీ దగ్గరే ఉండనివ్వండి… ముసలిదాన్ని నన్నీఆఖరి సమయంలో ఎందుకు మీ నుంచి దూరం చేస్తున్నారు? పుత్తర్! … నాకేమీ అక్కరలేదు. ఆ దేవుడి ముఖం చూసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. వాహే గురు మీకూ, మీ పిల్లలకీ దీర్ఘాయుర్దాయం ఇవ్వాలి….”
“ఓ సత్యస్వరూపుడా, దేవా, ఈ ఆఖరి సమయంలో ఈ నరకం చూపించకు తండ్రీ”- నేను మనస్సులోనే ప్రార్థన చేసుకుంటున్నాను.
పక్క మీద పడుకుని నేను ఇటూ-అటూ దొర్లుతున్నాను. దిక్కుమాలిన నిద్రకి ఏమయింది? ఎందుకనో భీష్మించుకుని కూర్చుంది. అది మాత్రం ఏం చేస్తుంది? మనస్సు హాహాకారం చేస్తున్నప్పుడు అది నా దగ్గరికి ఎలా రాగలుగుతుంది? నా కడుపున పుట్టిన ఈ గురుమీత్, హరజీత్ లు ఇంత కఠినాత్ములు ఎలా అయ్యారు?….జీవితంలోని ఈ ఆఖరి మజిలీలో ఈ దుఃఖం కూడా చూడవలసి వస్తుందని నేను కలలో కూడా అనుకో లేదు. నా కళ్ళ ముందు గురుమీత్, హరజీత్ ల చిన్నతనపు రోజులు కదలాడాయి.
వాళ్ళ బాల్యంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. గురుమీత్, హరజీత్ ఇద్దరూ పంచాయితీ ప్రెసిడెంటు గారి అబ్బాయిని కొట్టారు. ఆయన భార్య ఫిర్యాదు చేయడానికి నా దగ్గరికి వచ్చింది. తను ఎగిరెగిరి పడుతూ అంది- “మా అబ్బాయి మీద చెయ్యి వెయ్యడానికి నీ కొడుకులకి ధైర్యం ఎలా వచ్చింది! ఇంకెప్పుడైనా ఇలా చెయ్యి చేసుకుంటే వీళ్ళ చేతులు, కాళ్ళు విరగ్గొట్టేస్తాం. జాగ్రత్త.” ఆవిడ అవాకులూ-చవాకులూ మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ తరువాత నేను నా ఇద్దరు కొడుకులకి బుద్ధి చెప్పాను. కళ్ళలో కన్నీళ్ళు నిండగా వాళ్ళిద్దరినీ బాగా నిందించాను- “ఏరా, మీరు ఆ ప్రెసిడెంటుగారి అబ్బాయితో జగడం పెట్టుకున్నారు. నన్నీ వూళ్ళో ఉండనిస్తారా లేదా.” దానికి గురుమీత్ అన్నాడు- “అమ్మా, ఎవరైనా నన్నే మన్నా, నాన్నని ఏమన్నా ఏమో కాని, నిన్నేమైనా అంటే నేను సహించలేను. వాడు ప్రెసిడెంటు గారి అబ్బాయి అయినా సరే.” తరువాత హరజీత్ కూడా అన్నాడు- “అమ్మా, వాడు మమ్మల్ని అమ్మ పేరుతో తిట్టాడు. మేం మాట్లాడకుండా ఎలా ఉండము?…నిన్ను ఎవరైనా తిట్టారంటే మేము వాళ్ళ పళ్ళు రాలగొట్టేస్తాం.”
నా పిల్లలు చెప్పింది విని నా హృదయం ఉప్పొంగింది. ఈ గురుమీత్ అంటూ ఉండేవాడు, “అమ్మా, నువ్వేమీ చింతించకు. నన్ను పెద్దవాడి నవనీ. అప్పుడింక నిన్నెప్పుడూ పని చెయ్యనివ్వను. నువ్వు మంచం మీద కూర్చుని ఏం చెయ్యాలో చెప్పు. నేను ఆవిధంగా చేస్తాను.”
నేను ఈ రోజున మంచం మీద కూర్చున్న ఆ అమ్మనే. కాని కొడుకులు మాత్రం వాళ్ళు కాదు. ఇవాళ నేను వీళ్ళకి బరువైపోయాను. నా జీవితకాలమంతా నేను వీళ్ళు సుఖంగా ఉండాలనే ప్రయత్నించాను. ఉన్న ఇబ్బందులన్నీ నేను నా గుండెలో పెట్టు కుని సహించుకుంటూ ఉన్నాను. వీళ్ళకి ఎటు వంటి ఇబ్బంది కలగకూడదని. తల్లుల హృదయం ఉన్నదే ఇందుకు. ముందు పిల్లలకి పాలు పడతారు. తరువాత వాళ్ళ కష్టాలు, బాధలు తాము సహించుకుంటారు.
నా చూపులు బాబా నానక్ ఉన్న క్యాలెండరు మీద నిలిచాయి. తరువాత టేబిలు మీద పెట్టిన గురుమీత్- హరజీత్ ల తండ్రి గారి ఫోటో మీద. వాళ్ళిద్దరూ నాతో అంటు న్నట్లు నాకు అనిపిస్తోంది- “నీ పిల్లల సుఖాన్ని కోరుకుంటున్న సుఖదేయీ! ఇప్పుడు కూడా నువ్వు నీ పిల్లల సుఖం గురించే ఆలోచించు. వీళ్ళకి ఈ విధంగానే సుఖం కలిగితే, నువ్వు వీళ్ళ సుఖానికి అడ్డం రాకు. వీళ్ళు నిన్ను వృద్ధాశ్రమంలోనే కదా విడిచిపెట్టాల ను కుంటున్నారు, చెత్తకుండీలో విసిరిపారెయ్యాలని కాదు కదా…”
బయట పక్షుల కలరవం వినిపిస్తోంది. బహుశా తెల్లవారే సమయం అయింది. “వాహే గురు-వాహే గురు” అంటూ నేను మోకాళ్ళ మీద చేతులు వేసుకుని లేచి నిల బడ్డాను. పెట్టెలోంచి నావి రెండు జతల బట్టలు తీసి వాటిని ఒక సంచిలో పెట్టాను. నా మందులు, గ్లాసు, గిన్నె, చెంచా తీసుకున్నాను. గోడ మీద నుంచి బాబా నానక్ ఉన్న క్యాలెండరు తీసి పెట్టుకున్నాను. టేబిల్ మీద పెట్టిన ఫోటోలో గురుమీత్-హరజీత్ ల తండ్రిగారు నవ్వుతున్నారు- “నన్ను ఇక్కడే వదిలేసి వెడుతున్నావా సుఖదేయీ!” నా కళ్ళు గంగ-యమునల్లాగా ప్రవహిస్తున్నాయి. నేను టేబిల్ మీద నుంచి ఫోటో తీసి దాన్ని దుపట్టా అంచుతో తుడుస్తూ మందస్వరంతో అంటున్నాను- “లేదు. మీకు ఇక్కడేం పని వుంది? మీరు కూడా పదండి నాతో!”
***
సుభాష్ నీరవ్ – పరిచయం
27 డిసెంబరు 1953 న మురాద్ నగర్, ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన శ్రీ సుభాష్ నీరవ్ (అసలు పేరు : సుభాష్ చంద్ర) హిందీ కథారచయితగా, కవిగా, పంజాబీ-హిందీల మథ్య అనువాదకర్తగా గత 42 సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందినవారు. ఇప్పటి వరకు వీరి 9 కథా సంకలనాలు, 3 మినీకథా సంకలనాలు, 3 కవితా సంకలనాలు, 2 బాలకథా సంకల నాలు, వెలువడ్డాయి. 6 కథాసంకలనాలకి సంపాదకత్వం చేశారు. కొన్ని కథలు విద్యా సంస్థల వేరువేరు స్థాయి కోర్సులలో పాఠ్యాంశాలుగా చోటు చేసుకున్నాయి. వీరు పంజాబీ నుంచి ఇంచు మించు 700 కథలు, 200 మినీ కథలు, 500 కవితలను అనువదించారు. ఇవికాక వివిధ ప్రక్రియలలో 60 కన్నా ఎక్కువ సాహిత్యగ్రంథాలను పంజాబీ నుంచి అనువదించారు. పంజాబీ కవితలకు ఒక హిందీ అనువాద సంకలనం సాహిత్య అకాడమీ, ఢిల్లీ నుండి ప్రచురితమయింది. ప్రసిద్ధ హిందీ పత్రికలు `కథాదేశ్’, `చేతన’, `మంతవ్య’ యొక్క పంజాబీ కథల ప్రత్యేక సంచికలకి సంపాదకత్వం మరియు పంజాబీ నుండి అనువాదం చేశారు. ఉత్తమసాహిత్య సృజనకు భారతీయ అనువాద పరిషత్, రాజస్థాన్ పత్రిక, ఇండియా నెట్ బుక్స్ మొ. ద్వారా గణనీయమైన సన్మానాలు పొందారు. కేంద్రప్రభుత్వంలో అండర్ సెక్రటరీ పదవి నుంచి డిసెంబరు 2013లో రిటైర్ అయిన తరువాత పూర్తిగా సాహితీ వ్యాసంగానికి సమయం ఇస్తున్నారు. వీరు న్యూఢిల్లీ వాస్తవ్యులు.
*****
బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.