చంపకములు, తిమిశమ్ములు, తిలక
మ్ములు తాలమ్ములు మొగళ్ళు, పద్మక
ములు నతిముక్తకములు, వకుళమ్ములు
తమాలములు హింతాలములూ..
కిష్కింధలో తార పాత్ర పై తాను ప్రత్యేక దృష్టిపెట్టి వ్రాసుకున్నాడు. శివతాండవం, మేఘ దూతం వలెనే రగడ వృత్తంలో రచనను సాగించాడు తాను.
ఇందులోనూ! లయాత్మకంగా, హాయిగా పాడుకునే వీలు ఇందులోనే కదా ఉన్నది. పైగా తన లక్ష్యమూ అదే!
ఆ ఉత్సాహం రెట్టింపై, జనప్రియ రామాయణ బాలకాండ వ్రాస్తున్న తరుణమిది. రామాయణానికి వైష్ణవ సిద్ధాంత పరంగా ఎన్నెన్నో వ్యాఖ్యనాలున్నాయి. శరణాగతి తత్వ ప్రధానంగా శ్రీమద్రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించటం తాను బాల్యం నుండీ చూస్తూ వస్తున్న విశిష్టానుభవం. ఆయా వ్యాఖ్యానాలను ప్రవచించేవారి మేధా సంపత్తికి అచ్చెరువందటం మాత్రమే కవిగా తన కర్తవ్యం ఇప్పుడు! వారు వివేచించిన పద్ధతిలో ఆలోచిస్తే కావ్య సౌందర్య పరంగా తాను ఆలోచించటం కష్టతరం. ప్రధానంగా కవితా దృష్టితో ముందు రామాయణాన్ని ఆవిష్కరించటం, ఇప్పుడు తన ప్రధాన లక్ష్యం. విశ్వ బంధుత్వ బోధనే వాల్మీకి రామాయణ రచనకు మూల కారణమంటారు.
కవీంద్ర నౌమి వాల్మీకిం యేన రామాయణీ కథా
విశ్వ బంధుత్వ బోధాయ కృతా త్రైలోక్య పావనీ
ఇటు వంటి కావ్యాన్ని ఎందరెందరు కవులు ఎన్నెన్ని విధాలుగా తమ తమ హృదయాకాశ పటలాల పై స్వయంగా వీక్షించి, తమవైన భావాలతో అలంకరించి ఆవిష్కరించారో తలచుకుంటే తనువు పులకరించి పోతుంది. ఈ పులకరింత నుండే ఉద్భవించింది, జనప్రియంగా రామాయణాన్ని తానూ ఆవిష్కరించి తీరవలెనన్న తీక్ష్ణమైన ఆకాంక్ష. అనుకున్నదే తడవుగా కన్నడ కవి కు.వెం.పు జనప్రియమన్న పదం తన రామాయణానికి కూడా చక్కగా అదుకుతుందని అనిపించింది. కానీ, ఆయన వచన కావ్యంగా రామాయణాన్ని తన పోకడలతో వ్రాసుకున్నాడు. ముఖే ముఖే సరస్వతీ!
అందుకే తానుకూడా ఇప్పుడు రామాయణ రచనకు పూనుకున్నది.’
తాను వ్రాస్తున్న రామాయణ పుటలు తిరుగవేస్తున్న పుట్టపర్తికి అందులోని అక్షరాల కుదురైన వ్రాత పద్ధతి ఒక్కసారి అర్ధాంగి కనకమ్మను గుర్తుకు తెచ్చింది. ఒక్కచోటంటే ఒక్క చోట కూడా తప్పన్నది లేకుండా ముత్యాలు పేర్చినట్టుగా వ్రాసిన పద్ధతిలో ఆ పని పట్ల ఆమె శ్రద్ధను మాత్రమే కాదు, భర్త ఐన తన పట్ల ఆమెకున్న ఆరాధనా భావం కూడా తొణికిసలాడుతున్నట్టుగా అనిపించింది. ఎప్పుడైనా తానే పురుషాహంకారంతో ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి ఉండవచ్చు. ఉండవచ్చేమిటి? చాలానే ఉన్నాయి.
ప్రొద్దుటూరు నివాసంలోనూ, తిరువనంతపురంలోనూ, ఢిల్లీలోనూ ఉద్యోగజీవితానికై తంటాలు పడేటప్పుడూ, తరువాత, తాను వైరాగ్య భావనతో దేశాలు పట్టి పోయినప్పుడు కానీ, ఏ నాడూ, తన మాటకు ఆమె ఎదురాడిన దాఖలేలే లేవు కదా!! ఇంతటి సహనం అమెకే విధంగా అబ్బిందో ఇప్పటికీ ఆశ్చర్యమే తనకు! తనకు కనకమ్మ వంటి ఇల్లాలే దొరక్కపోయి ఉంటే, తన జీవితం ఏ విధంగా ఉండేదో? అనిపిస్తుంది, ఇప్పుడు!’
ఈ ఆలోచనల్లో మునిగి ఉన్న పుట్టపర్తి, ‘అయ్యా!’ అన్న పిలుపుకు ఉలిక్కిపడి తలెత్తి చూశారు. ఎదురుగా ఆఖరి బిడ్డ నాగపద్మిని నిలుచుని ఉంది,
బెదురు కళ్ళతో చూస్తూ!
తన ఏకాగ్రతకు భంగం కలగటంతో భృకుటి ముడివడింది పుట్టపర్తికి. కానీ, ఎదుట బిడ్డ ముఖం చూసేసరికి, లేత నవ్వు విరిసింది, ముఖంలో! ఏమ్మా?’
అడిగారు పుట్టపర్తి.
‘స్కూల్ నుంచీ ఎవరో వచ్చినారు. మిమ్మల్ని హెడ్మాస్టర్ రమ్మని చెప్పినారంట, ఒక గంటలో!’
‘సరేలే, మరీ, అమ్మనడిగి ఒక కాఫీ తీసుకునిరా పో!’
తల ఊచి వెంటనే తుర్రుమని వెళ్ళిపోయింది చిన్న బిడ్డ. మళ్ళీ జనప్రియ రామాయణం వ్రాత ప్రతి పరికిస్తూ, సరస్వతీ సాక్షాత్కర ఖండం సన్నివేశాన్ని చదవటం మొదలెట్టారాయన.
అయ్యాదికవి దరికి
నమర లోకమునుండి
దిగివచ్చినది గిరాందేవీ శ్రుతికలిత
కల్హారమాశలకు దావీ కఛ్ఛపీ
షడ్జ పంచమ శయ్య సంరంభమున విన్న
కేకి లోకమ్ములను గోకిలలు ఎలుగివ్వ.’
చేర్చుక్కగా నిడ్డ
చిన్ని జాబిలి రేక
సుధల నిటలము చెమ్మగిల్లా, అవతంస
సుమ ధూళి చెంప సొంపిల్లా తిలకంబు
ప్రతిఫలించినయట్లు బంధూక బంధువగు
తరుణాధరమ్ము పై చిరునగవు వట్రిల్ల!
రాగయుక్తంగా ఇలా పాడుకుంటూనే వున్నారాయన. నాగపద్మిని కాస్త, ఆయాస పడుతూ, చేతిలో వేడి కాఫీ లోటాతో వచ్చేసిందప్పుడే! పాపం వేడిగా ఉంది కదా లోటా, అయ్య ఎదురుగా కింద చాప మీదే పెట్టి నిల్చుంది అలాగే!! పుట్టపర్తికి జాలేసింది. అయ్యో వేడిగా ఉంది కదా. లోటా, ఏదీ చెయ్యి చూపించు?’
చెయ్యి ఊదుకుంటూ ‘లేదయ్యా, తగ్గిపోయింది కానీ, ఆయనెవరో, వెంకట సుబ్బయ్యంట, మదనపల్లె నుంచీ మీ కోసం వచ్చినాడంట! రమ్మంటారా అని అడిగి రమ్మనిందమ్మ!’
చెప్పింది నాగ. ‘ఆ..ఆ పిల్లవాడా? రమ్మను. ఆ అబ్బాయితోనే ఇంకో కాఫీ పంపించ మను అమ్మను’.
ఒక్క క్షణం ఆగకుండా తుర్రుమని వెళ్ళిపోయింది నాగపద్మిని.
చేతిలోని జనప్రియ రామాయణం వ్రాత ప్రతిని పక్కన పెట్టి, బీడీ వెలిగించు కుంటూ ఉంటే, అంతలో వెంకటసుబ్బయ్య రానే వచ్చాడు.
నమస్కారం స్వామీ! అంటూ చేతిలో కాఫీని స్వామి ఎదురుగా పెట్టి నిల్చునే ఉన్నాడు.
‘ఆ కాఫీ నీ కోసమే రా నాయనా!’ నవ్వుతూ అంటుంటే పొర పోయిందాయనకు. వెంకటసుబ్బయ్య కంగారుపడ్డాడు, చేతితో, ఏమీ ఫరవాలేదని సైగచేసి, పక్కనే పెట్టుకున్న నీళ్ళ చెంబెత్తి, గటగటా నీళ్ళు తాగుతున్నారాయన. నీళ్ళు తాగుతూనే కూర్చో అన్నట్టు ఎదురుగా పరచిన చాప చూపించారు.
వెంకట సుబ్బయ్య పుట్టపర్తిని కడపలో కలుసుకోవటం ఇదే మొదటిసారి. వారు నీళ్ళు తాగుతూ ఉంటే,చూసీ చూడనట్టుగానే గదినీ, చుట్టూ అమర్చిన చెక్క బీరువా లనూ పరికించి చూస్తున్నాడు వెంకట సుబ్బయ్య. పుట్టపర్తి కూడా కిందనే పరచిన చాప మీదే కూర్చుని వున్నారు. ఎదురుగా వ్రాత కోతలకూ పఠనకూ పనికి వచ్చేలా కరణం వ్రాత బల్ల. దానికి దగ్గరలో ఎరుగు, నీలం సిరా బుడ్లూ, పాత పద్ధతిలో పాళీలమర్చిన మూడు నాలుగు చెక్క కలాలు, గోడలకు తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి, లక్ష్మీ తాయారు పటం, ఆశ్చర్యంగా కృష్ణ చైతన్య స్వామి పటమూనూ!!
‘ఎట్లున్నారప్పా మీ అమ్మా నాయనా, ఇంకా మీ ఊళ్ళో నన్ను పిలిపించినారే. ఆ స్కూల్ వాళ్ళు ?’ అడిగారు.
‘అందరూ బాగున్నారు స్వామీ!’
‘ఏదైనా పనుండి వచ్చినావా ఇక్కడికి?’
‘పని అంటే..’
ఆగిపోయాడు వెంకట సుబ్బయ్య.
‘సరేలే! ఏదైనా ఇంటికి సంబంధించిన పనుంటుందేమో! ఇంతకూ, ఆ రోజు మీ వాళ్ళు చేసిన సన్మానం, చూపిన ఆదరణా, బాగున్నాయిరా!! పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు. అదీ తృప్తి నాకు. దానికి మీరు కూడా పిల్లలకు ముందే చెప్పినారేమో అల్లరి చేయవద్దని, ఐనా వాళ్ళంతా క్రమ శిక్షణతో అట్లా బుద్ధిగా ఉండటం చూస్తే ముచ్చట య్యింది. మా స్కూల్ లో ఉంది కోతి మూక! ఎప్పుడూ అల్లరే వీళ్ళకు! ఐనా అల్లరి చేయక పోతే బాల్యం గుర్తులేముంటాయి? అల్లరీ అవసరమే! శ్రుతి మించకుండా ఉంటే బాగుం టుంది. మేమూ బాగానే అల్లరి చేసేవాళ్ళంలే చిన్నప్పుడు.”
అనుకోకుండా స్వామి, హాస్య ధోరణిలోకి రావటం చూసి, వెంకటసుబ్బయ్య్యకు కాస్త ధైర్యం వచ్చింది. ‘స్వామీ! నేను ఇంట్లోకి వచ్చి, మిమ్మల్ని కలుసుకోవాలని అమ్మగారిని అడుగుతూ ఉంటే, అదే సమయంలో మీరేదో ‘గిరాందేవీ’ అని రాగ యుక్తంగా ఎంతో మధురంగా పాడుతున్నారు. మీ గానాన్ని వింటూ నిల్చున్నా కాసేపు. అమ్మగారి నడిగుదామనుకుంటే ఆమె లోపలికి వెళ్ళిపోయినారప్పటికే!! కొత్త కావ్యం వ్రాస్తున్నారా స్వామీ?’ధైర్యంగా అడిగాడు వెంకటసుబ్బయ్య.
‘అవునురా! ఎంతమంది ఎన్ని రీతుల రాసినా రామాయణానికుండే ఆకర్షణే వేరు. ఆత్మానం మానుషం మన్యే, నేను మానవ మాత్రుణ్ణే అని రాముడిచేత చాలా చోట్ల వాల్మీకి చెప్పించినా, ఆతని అవతార రహస్యాన్ని కూడా అక్కడక్కడా ధ్వనింపజేస్తూనేఉన్నాడు.
అవన్నీ అటుంచినా ఒక కావ్యంగా కూడా అనితర సాధ్యంగా మలచినాడు కాబట్టే, వేల సంవత్సరాలైనా రామాయణం, భారత మూలల్లోకి ఇంకిపోయి, మన సంస్కృతిని పటిష్టంగా ఉంచుతూ ఉంది. జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే..రామాయణం వ్యాప్తి చెందని దేశం లేదు, భాష లేదురా.
నేను ఉత్తర భారత దేశమంతా తిరిగినాను! అక్కడ వాళ్ళకు తులసీదాసే ప్రామాణి కం. ఎందుకంటే ఆయన వాళ్ళ భాషలో అవధీలో వ్రాసినాడు. పైగా గాన యోగ్యంగా వ్రాసినాడు. జీవితంలో సందర్భమేదైనా అన్నిటికీ తులసీ రామాయణంలోని ఘట్టాలను పాడుకుంటారు వాళ్ళు. మనసారా ఆయనను స్మరించుకోవడం వాళ్ళలోని గొప్ప గుణం రా!! నాకప్పుడే అనిపించింది, రాస్తే గీస్తే ఇటు వంటి రామయణం రాయాలబ్బా అని. నాకెదో పద్ధతిగా బాలకాండే వ్రాయాలన్న నియమమెమీ లేదప్పా!! ముందు కిష్కింధ వ్రాసుకున్నా! అందులోని ఘట్టాలు నన్నావైపు ఆకర్షించినాయి. ఇదుగో ఇప్పుడు బాలకాండ వ్రాస్తున్నా. అందులోని ఒక ఘట్టమే నువ్వు విన్నది.’
*****
(సశేషం)