గోరింటాకు కోన్లు
-కందేపి రాణి ప్రసాద్
అడవిని ఆనుకుని ఊరు ఉండటం వల్ల తరచూ జంతువులు ఊర్లోకి వెళ్ళేవి. అక్కడి నుంచి వచ్చాక ఊర్లోని విషయాలు వింతగా చెప్పుకునేవి. “మనుష్యులకు నడవడం అవసరం లేకుండా సైకిళ్ళు, మోటారు వాహనాలు ఉంటాయి. వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ సెల్ ఫోనులు ఉంటాయి. ఇళ్ళలో టీవీలు ఉంటాయి. పిల్లలేమో ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు. ఏమో రాస్తూ ఉంటారు. ఇలా ఏవేవో చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాయి. వీళ్ళ మాటల్ని ఊర్లోకిరాని క్రూర మృగాలు విచిత్రంగా వింటుంటాయి. క్రూర మృగాల్ని ఉల్లోకి రానివ్వరు కదా! పాపం వాటికివన్ని తెలియదు.
ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చింది. ఉళ్ళో ఉన్న మనుష్యులంతా పండుగ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. ఇళ్ళ ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుంటున్నారు. ఇళ్ళలో బూజు దులిపి నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటున్నారు. అదేంటో ప్రతి ఇంట్లో అరిశలు వండుకుంటున్నారు. అవి వండుతుంటే ఎంత కమ్మని వాసన వస్తుందో ఆడపిల్లలు పూల జడలు వేసుకుంటున్నారు. తలంటు పోసుకుని కొత్త బట్టలు తొడు క్కుంటున్నారు. అలాగే ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఎర్రగా మారిన చేతుల్ని చూసుకుని మురిసిపోతున్నారు.
ఎర్రగా పండిన ఆడపిల్లల చేతుల్ని చూసిన కోతి పిల్లలు సంబర పడ్డాయి. మన చేతులూ అలా మారితే బాగుండును అనుకున్నాయి. ‘అసలు వాళ్ళేమి చేస్తే అలా ఎర్ర బడుతున్నాయి’ అని చూడాలనుకున్నాయి.
గ్రామంలోకి వెళ్ళిన కోతి పిల్లలు ఒక ఇంటి దగ్గర ఆగాయి. అక్కడ నలుగురైదుగురు ఆడపిల్లలు కూర్చుని గోరింటాకును పెట్టుకుంటున్నారు. గోరింటాకు కోన్లు తెచ్చుకొని అందంగా అర చేతుల మీద డిజైన్లు వేసుకుంటున్నారు. ఒకరి చేతికి మరొకరు పెడుతు న్నారు. ఎండిపోయిన వాళ్ళు చేతులు కడుక్కుని చూసుకుంటున్నారు. ఎంత ఎర్రగా పండాయో చూసుకుని మురుస్తున్నారు. అందరి చేతుల్లో కోన్లున్నాయి.
ఆ కొన్ల వల్లే చేతులు ఎర్రబడుతున్నాయని కోతి పిల్లలకు అర్థమయింది. ఎలాగైనా ఆ కొన్లను సంపందించాలి అనుకున్నాయి. కోన్ ను తీసుకెళ్ళి పోతే మన చేతుల్ని కూడా ఎర్రగా మార్చుకోవచ్చు అనుకున్నాయి. వాళ్ళ దగ్గర్నుంచి ఎలా తేవాలా అని ఆలోచిస్తు న్నాయి. సమయం కోసం ఎదురు చూస్తున్నాయి.
ఆడపిల్లల దగ్గరకు ఒక చిన్న పాప వచ్చింది. అక్కడున్న గోరింటాకు కోన్లతో ఆటలు ఆడుతున్నది. ఆ కోన్లను అటూ ఇటూ విసిరేస్తున్నది. బుడి బుడి నడకలు నడుస్తూ కోన్లను విసిరేస్తూ మరల తెచ్చుకుంటూ ఆడుకుంటున్నది. ఒకసారి కోన్ ను దూరంగా విసిరింది. వాళ్ళెవరూ చూడటం లేదు. మళ్ళీ మరో కోన్ ను విసిరేసింది. ఇదే మంచి అదను అనుకుని కోతి పిల్లలు ముందుకు దూకాయి. అకస్మాత్తుగా వచ్చిన కోతి పిల్లల్ని చూసి పాప బెదిరింది. కోతి పిల్లలు ఆ కోన్లను తీసుకుని పారి పోయాయి. పాప ఏడుపుకు ఆడపిల్లలంతా ఇటూ వైపు తిరిగారు. కోతి పిల్లలు కోన్లను ఎత్తుకు పోవడం చూసి నవ్వు కున్నారు. పాపను ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయారు.
కోన్లను తీసుకున్న కోతి పిల్లలు అడవిలోకి పరుగెత్తాయి. అడవిని చేరీ చేరడంతోనే స్నేహితులందర్నీ పిలిచాయి. అన్ని ఒక్కచోటుకు చేరాయి. కోతి పిల్లలు కోన్లను చూపెట్టాయి. అన్నీ సంతోషంగా చప్పట్లు కొట్టాయి. కోన్లను తీసి పిల్ల జంతువులన్నీ చేతులకు పూసుకున్నాయి. “రెండు గంటల తర్వాత చేతులు కడుక్కోవాలి” అని చెప్పాయి కోతి పిల్లలు పిల్ల జంతువులు సరేనని తలూపాయి. అన్నీ ఆనందంగా ఉన్నాయి. రెండు గంటల తర్వాత తమ చేతులు ఎంత అందంగా ఉంటాయో అని ఆలోచించుకుంటున్నాయి.
ఒక గంట దాటగానే పిల్ల బాతు “నా చేయి దురదగా ఉంది” అన్నది. నాకైతే చెయ్యి మండుతోంది అంటూ పిల్ల కుందేలు గెంత సాగింది. కోతి పిల్లలు కూడా మంటలు, మంటలు అంటూ ఎగరసాగారు. కాసేపటికి పిల్ల జంతువుల అరుపులు మిన్నంటాయి.
పక్కనే ఉన్న చెరువులో దిగి తమ చేతుల కున్న కోన్ గోరింటాకు కడుక్కున్నాయి. ఎర్రగా పండటం మాట అటుంచి తోలు ఊడి ఎర్రగా మాంసం బయటకు కనబడుతోంది.
బాతు పిల్లలు దురదలతో బొబ్బలతో గోక్కో సాగాయి. కుందేలు పిల్లల చేతి చర్మం ఊడిపోయి మంటకు ఎడవసాగాయి. కోతి పిల్లల చేతులకు ఎర్రని కురుపులు చెయ్యంతా వచ్చాయి. వీటి ఎడుపులకు వాళ్ళ పెద్దవాళ్ళు బయటకు వచ్చాయి.
పిల్లల చేతులు, వాళ్ళ బాధలు చూసి బాధపడిన తల్లి దండ్రులు ఎలుగుబంటి వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాయి. దారంతా అవి ఏడుస్తూనే వచ్చాయి. ఎలుగు బంటి పిల్ల జంతువుల చేతుల్ని పరీక్షించింది. అవి రసాయనాల వలన ఏర్పడినదని గ్రహిం చింది. గోరింటాకు ఎలా పెట్టుకున్నారని అడిగింది.
గ్రామం నుంచి గోరింటాకు కోన్లు తెచ్చుకున్న దగ్గర నుంచి విషయమంతా చెప్పాయి. దాంతో ఎలుగుబంటికి విషయం అర్థమైంది. గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే మన అడవిలో ఎన్నో చెట్లు ఉన్నాయి కదా! ఆ ఆకుల్ని కోసుకుని మెత్తగా రుబ్బుకుని చేతులకు పెట్టుకోవచ్చు కదా! మనుష్యులు వాడే కోన్లు ఎందుకు తెచ్చుకున్నారు అన్నది ఎలుగుబంటి.
పిల్ల జంతువులు గోరింటాకు చెట్లు తమకు తెలియవని చెప్పాయి. ఎలుగుబంటి ఆశ్చర్యంగా నోరెళ్ళ బెట్టింది. అడవిలో పుట్టి అడవిలో ఉన్న చెట్ల గురించి తెలియదంటే ఎలా! ఈ తప్పు మీది కాదు. మీ తల్లి దండ్రులది. ఇలా పెంచితే పిల్లలకు ఏం తెలుస్తాయి ఎప్పుడూ అడవి మీద పడి సంపాందించుకోవడంతో పాటు కాస్త పిల్లల్ని కూడా పట్టించు కోవాలి. పిల్లలకు మంచి చెడు చెప్పాలి కదా! అంటూ ఎలుగుబంటి తల్లి దండ్రుల నుద్దేశించి అన్నది.
తల్లి దండ్రులు తలదించుకున్నాయి. తాము చేస్తున్న పొరపాటు తమకూ తెలుసు. కానీ ఏం చేయలేక పోతున్నాయి. పిల్లల బాధల్ని చూసి తట్టుకోలేక పోయాయి. “ఇది మా తప్పే వైద్యులు గారూ! ముందు మందివ్వండి” అంటూ వేడుకున్నాయి.
“వాళ్ళకి ఆయింట్ మెంట్ రాశాను. మంటలు తగ్గడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. కాబట్టి భయమేమి లేదు. కొద్ది సేపటికి మంట తగ్గుతుంది. ఇవన్నీ తగ్గడానికి వారం నుంచి నెల రోజుల వ్యవధి పడుతుంది. అయినా వెంటనే ట్రీట్ మెంట్ మొదలుపెట్టాం. కాబట్టి పరవాలెదులే” అంటూ ఎలుగుబంటి తల్లి దండ్రులకు నిదానంగా చెప్పింది.
తల్లిదండ్రుల్లో ఒక కుందేలు “వైద్యులు గారూ! మనుష్యులకు చక్కగా ఎర్రగా పండిన గోరింటాకు కోన్లు మా పిల్లలకు ఇబ్బంది తెచ్చాయి ఎందువలన ? కారణం ఏమై ఉంటుంది” అని సందేహం వెలిబుచ్చింది.
దానికి సమాధానంగా ఎలుగులుంటి నవ్వుతూ “మీ పిల్లలకు మాత్రమే కాదు మనుష్యులకు కూడా ఇలాగే జరుగుతుంది ఒక్కొక్కసారి ప్రతి సారీ ఇలాగే జరగదు. కోన్లలో పిక్రిక్ యాసిడ్ అనే రసాయనం కలుపుతారు, ఇది కలర్ ఏజెంట్. దీని వలన ముదురు ఎరుపు రంగు వస్తుందని కోన్లలో దీనిని కలుపుతారు. ఇది కల్తీ చేయటం అన్నమాట. ఇలాంటి రసాయనాల వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. పై పెచ్చు కొంత మందికి ఆ రసాయనాల కుండే ఎలర్జీ వలన పుండ్లు పుడతాయి. గోరింటాకు ను ఎండబెట్టి పొడిగా మార్చి కోన్లు తయారు చేయ్యాలి. అయితే వ్యాపారస్తులు అధిక లాభాల కోసం పిక్రిక్ యాసిడ్ వంటి ఆమ్లాలను కలపడం వలన ఎన్నో నష్టాలు జరుగు తున్నాయి. ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన కొన్లను వాడినా కూడా ఇలాగే జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి చక్కగా గోరింటాకును వాడుకుంటే అన్నింటి కన్నా ఉత్తమం” అంటూ సుదీర్ఘoగా చెప్పింది ఎలుగుబంటి.
“అవును వైద్యులు గారూ! ఇక నుంచి మేము మా పిల్లలకు అన్ని విషయలూ విడ మరిచి చెపుతాము. అలాగే మన అటవీ సంపద గురించి తెలియజేస్తాం. మేము పిల్లల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తాం” అని తల్లి దండ్రుల జంతువులన్నీ మూకుమ్మడిగా చెప్పాయి.
ఎలుగుబంటి సంతోషంగా తలూపి “ రోజూ ఒకసారి నాకు తెచ్చి చూపించండి. ఇక ఇంటికి వెళ్ళవచ్చు. జాగ్రత్తగా చుసుకోండి” అని చెప్పి అందర్నీ ఇంటికి పంపేసింది. జంతువులన్నీ సంతోషంగా ఇంటికి వెళ్ళాయి.
*****
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.