నా అంతరంగ తరంగాలు-13

-మన్నెం శారద

          ఈ సారి దాదాపు నెలరోజులు గేప్ తో రాస్తున్నాను ఈ ఎపిసోడ్.. ఏవేవో కారణాలతో ఆస్థిమితమయి రాయలేక పోయాను. ఇక నుండి రెగ్యులర్ గా రాయడానికి ప్రయత్ని స్తాను.

మా నయాగరా ప్రయాణం….

ఎన్నోసార్లు ఈ సంగతుల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుని అనుకున్నా, ఇందులో ఏముందిలే అని ఊరుకున్నాను.

          ఇండియా నుండి వెళ్ళిన చాలా మంది ఈ జలపాతాన్ని చూసి తీరాలని కలలు కంటారు. వారివారి పిల్లలు కూడా ఈ అద్భుత జలపాతాన్ని తల్లిదండ్రులకి చూపించి సంతోషపెట్టాలని ఉవ్వీళ్ళూరుతారు.

          …….అలాగే మేము కూడా జులై 4th న నయాగరాకు బయల్దేరేము.

          వర్జీనియా నుండి పెన్సిల్వానియా గుండా మా ప్రయాణం సాగింది. ఇక్కడ పెన్సిల్వానియా రాష్ట్రం గురించి కొంచెం చెప్పుకోవాలి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యా నికి నెలవు ఈ రాష్ట్రం. ఎత్తైన కొండలు. లోయలు. ఆకాశాన్ని అంటే గాఢమైన వృక్షసము దాయం, నదులు,సెలయేళ్ళు చూడకన్నులు చాలని అపురూపమైన అందాలవి. కారు వెళ్తుంటే ఎదురుగా రిబ్బన్ మడతల్లా రోడ్డు దర్శనమిస్తుంది. ముందుకి సాగే కొలది రోడ్డు సాఫీగా, విశాలంగా మారిపోతుంది. ఎదురుగా ఒక్కోసారి ఒక అఖాతం అడ్డమొచ్చేసిన భ్రాంతి కలుగుతుంది. దగ్గరగా వెళ్ళేక సాఫీగా రోడ్డు కనిపిస్తుంది. ఒకపక్క వేలీ మరోపక్క దట్టమైన చెట్లతో కొండలు! ఎదురుగా అకస్మాత్తుగా అడ్డమొచ్చే కొండలు! అటు వంటి చోట కూడా హారన్ వేయకుండా వాళ్ళు డ్రైవ్ చేసే విధానం చాలా అబ్బురపరచేది.

          నా అదృష్టంకొద్దీ ఈస్టేట్ గుండా నాలుగయిదుసార్లు ప్రయాణించాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అందాలవి. ఫాల్ సీసన్ లోనయితే చూడాలి..ఆ రంగుల మేళవింపు ! ఏ చిత్రకారుడి కుంచెకు అందని అందాలు! అవును, దేవుడితో పోటీనామరి! ఎంత దూరం సాగినా అంతే ! చూసిచూసి మన కళ్ళే నొప్పిపుట్టాలి.

          అలా చీకటి పడుతుండగా నయాగరా చేరేం. ఆ రోజు జూలై.4th అమెరికా ఇండి పెండెన్స్ డే. లాంగ్ వీక్! ఇక జనసందోహం చూడాలి… యమ రష్. కారు పార్కింగ్ ప్లేస్ దొరకడానికే గంటసేపు పట్టింది.

          హోటల్ రూమ్ కోసం తెగ తిరిగాం. ఎక్కడా ఖాళీలు లేవు. చీకటి పడిపోయింది.
చివరకు ఒక గుజరాతీ వారు నడుపుతున్న ఒక హోటల్లో రూమ్ దొరికింది. ముందు లగేజ్ పడేసి మొహం కాళ్ళూ, చేతులు కడుక్కుని అలా మంచం మీద ఒరుగు దామను కుంటే “పదండీ పదండీ “అన్నాడు మా వంశీ తొందర పెడుతూ.

          “ఇప్పుడెక్కడకి?” అన్నాను నేను అలసటగా. ఫాల్ చూడాల్సింది ఇప్పుడే. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా బాగా లైట్లతో డెకొరేట్ చేస్తారు అన్నాడు.

          ‘దేవుడా ‘ అంటూ బయలుదేరాం మేము.

          వెళ్తుంటే ఆ వీధులన్నీ కాకినాడని గుర్తుకు తెచ్చాయి. ప్రశాంతంగా చిన్న చిన్న ఇళ్ళు రోడ్డు కటూ ఇటూ చెట్లతో.

          ఆ మాటే అంటే ఫాల్ కి అటు వైపు కెనడా కదా… ఆఁ వాతావరణం ఇటూఉంటుంది. అందుకే కాకినాడని cocanada అన్నారేమో “అన్నాడు వంశీ. జలపాతం అంతా రంగు రంగు దీపాలతో అలంకరించారు. మేము జలపాతం పై భాగాన వున్నాం.

          ఒకపాయ మాత్రం విడివడి ఎదురుగా కెనడా వైపు వుంటుంది. జలపాతం అమెరికా భూ భాగంలోవున్నా ఎక్కువ కన్నులువిందు చేసేది కెనడా నుండే. అందుకే చాలా మంది కెనడాకి వీసా తీసుకుని అటు వెళ్ళి చూస్తారు..మధ్యలో రెండు భూ భాగాలని కలుపుతూ రెయిన్ బో బ్రిడ్జ్ వుంటుంది.

          ఫాల్ కనిపించే విధంగా ఎదురుగా వున్న రెస్టారెంట్ లో కూర్చుని డిన్నర్ చేసాం.
తిరిగి హోటల్ రూమ్ కి వచ్చాక మనం అమెరికాలోనే వున్నామా… అని అనిపించింది. ఫాన్ తిరగదు. బెడ్స్ నిండా నల్లులు… Ac పనిచేయదు… అదో నరకం!

          ఇక తెల్లవారి బఫె సిస్టంలో హోటల్ వారు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ లో ఏమీ లేవు. ఏవో కొన్ని చల్లారిన ఇడ్లీలు, బ్రెడ్ మాత్రమే వున్నాయి. అప్పటికే కొందరు అక్కడున్న అమ్మాయితో గొడవ పడుతున్నారు. ఆఁ అమ్మాయి మాత్రం ఏమీ వినిపించుకోకుండా హాయిగా ఎవరితోనో ఫోన్లో కబుర్లు చెబుతున్నది.. అదో టెక్నిక్ అనుకుంటాను. ఏదో తిన్నామనిపించుకుని బయట పడ్డాం.

          ఆ మర్నాడంతా ప్రోద్దుటి నుండి సాయంత్రందాకా ఆ నదీపరీవాహక ప్రాంతంలో పచ్చికబయళ్ళలో నడుస్తూ చెట్ల క్రింద సేదదీరుతూ కాలం గడిపాం. ముందు అసలు కదలికలేనట్లు, తర్వాత కొద్దిగా అడుగులు వేయడం నేర్చినట్లు ఆ పైన ఉరుకులు, పరుగులతో పరిగెత్తే ఆ నది విన్యాసాన్నిచూసి తీరవలసిందే.

          ఎక్కడకూర్చున్నా కనిపించే విధంగా సందర్శకులకి సంతోషం కలిగించే
విధానంలో టూరింగ్ ప్లేసుల్ని తీర్చిదిద్దడంలో అమెరికన్స్ చాలా ఘనులు!

          చివరి ఘట్టం బోట్లో జలపాతానికి ఎదురుగా వెళ్ళడం!

          నేను రానంటేరానని మొండికేసాను. అంత పెద్ద జలపాతం అంతఎత్తు నుండి క్రిందకి దూకుతుంటే ….అమ్మో…బోటు తిరగబడి పోతుందని ససేమిరా అన్నాను. “ఇది చూడక పోతే: మొత్తం ట్రిప్ అంతా వేస్ట్” అని మా వంశీ ,వాణీ… వాళ్ళతో పాటూ కొందరు అమెరికన్ టూరిస్టులు తెగ బ్రతిమలాడి బోటేక్కించారు. బలిపశువులా ఎక్కాను చివరికి, లిఫ్ట్లో క్రిందకు వెళ్ళి రెయిన్ కోట్స్ వేసుకుని బోటులో వెళ్తుంటే జలపాతం దగ్గరగా …నేను బిగుసుకుని మా వంశీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాను వణికి పోతూ.

          ఒక్కసారిగా ఆ జలపాతం నీళ్ళు జల్లులా చింది మా మీద పడేసరికి…చెప్పలేని సంతోషంతో కేరింతలు కొట్టేను అందరితోపాటూ నేను! అప్పుడు మా వంశీ మొహంలో సంతోషం నేను ఎప్పటకీ మరచిపోలేను. నా ఆనందం చూసి వాడి మొహం వెలిగి పోయింది.

          తిరిగి బయలుదేరబోతూ అక్కడే వున్న’ కోణార్క్ ‘ అనే ఇండియన్ హోటల్ కి భోజనానికి వెళ్ళాం. అక్కడ కూడా బఫె సిస్టమ్..చాలా ఐటమ్స్ వున్నాయి. ఎవరు ఎంతయినా తినొచ్చు.

          అక్కడ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళే వున్నారు. ఇక మనవాళ్ళు చేస్తున్న అల్లర్లు, తినలేకపోయినా కక్కుర్తిగా డీషెస్ తేవడం, పారేయ్యడం. మళ్ళీ వెళ్ళి తేవడం… ఎంతో సిగ్గుగా అనిపించింది ఆఁ దృశ్యం!

          హోటల్ బయట కూర్చోడానికి వేసిన బెంచీల మీద సగం తాగిన బీర్ టిన్స్. లాన్స్ లో విసిరేసిన సీసాలు… పరమ జిగుప్సాకరమై జోక్స్! వీళ్ళలో చాలా మంది సదరు ఇండియా నుండి ఎమ్మెస్ చేయడానికి వచ్చిన మన తెలుగు బిడ్డలే! వచ్చి రాని డ్రైవింగ్ తో కార్లు హైర్ చేసి ఎక్కువగా ఏక్సిడెంట్స్ చేసేది కూడా వీళ్ళే!

          రాత్రి తిరుగు ప్రయాణంలో అనుకోకుండా దారుణమైన అడవిలో చిక్కుపడి పోయాం. జి.పిఎస్ చూపించిన దారి మాటల్లోపడి దాటేయ్యడం వల్ల మళ్ళీ రెండోసారి అది అడవిదారి చూపించింది. ఐ70.,అంటే ఇంటర్ స్టేట్ రోడ్డు దొరకక తెల్లవార్లూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసాం. వంశీ పక్కనే కూర్చుని ఎక్కడవాడు నిద్రవచ్చి తూల్తాడోనని కబుర్లు చెబుతూనే వున్నా. అది సింగిల్ లేన్ రోడ్డు. రెస్ట్ రూమ్స్ లేవు.పెట్రోల్ బంక్స్ లేవు. అసలు ఒక ఇల్లు కూడా కనపడలేదు. ఎదురుగా ఒక వెహికల్ కూడా రావడం లేదు. పక్కనే అఖాతమైన లోయ. ఎన్నిసార్లు సెట్ చేసినా జిపి ఎస్ I 70కి చేర్చలేదు.

          చివరకి తెలతెలవారుతుండగా విశాలమైన మైదానాల్లోకి అడుగుపెట్టాం. అప్పుడు చూశాను అమెరికాలోని అందమైన పల్లెటూళ్ళని. బంగారు రంగు తిరిగిన మొక్కజొన్న . గోధుమ పంటలు, దూరంగా పచ్చిక మేస్తున్న పశువులు. బొమ్మరిళ్ళ లాంటి రైతుల ఇళ్ళు..ఇంటి ముందు వారి అలంకరణలు!.వర్ణనా తీతమైన మహాసౌందర్యం అది!

          చివరకి ఎలాగోలా ఉదయం తొమ్మిది గంటలకు ఐ70 దొరికింది. బ్రతుకుజీవుడా అని కొంపకి జేరేం. ప్రకృతి అంటే ఎంతో ఇష్టపడేనాకు నిజం చెప్పాలంటే కొన్నాళ్ళు చెట్టంటేనే భయం వేసింది ఆ అడవిదారి చూశాకా…

          కానీ ఇప్పుడు కూర్చుని తలచుకుంటే చాలా త్రిల్ గా అనిపిస్తుంది…..అందుకే మీకు కూడా చెప్పాలని..

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.