నా జీవన యానంలో- రెండవభాగం- 39
-కె.వరలక్ష్మి
భూమిక ఎడిటర్ కె. సత్యవతి రచయిత్రుల కోసం ఒక ప్రయాణం రూపొందించి వివరాలు పంపేరు. నేనూ వస్తానని రిప్లై ఇచ్చేను. ఆ ప్రయాణం కోసం సెప్టెంబర్ 15 – 2006 మధ్యాహ్నం జగ్గంపేట నుంచి బయలుదేరి, రాజమండ్రిలో బస్సుమారి సాయం కాలం 6 కి నరసాపురం చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా మర్నాడు ఉదయానికి వస్తారు. నన్ను సత్యవతిగారి తమ్ముడు ప్రసాద్ గారు బస్టాండులో రిసీవ్ చేసుకుని వాళ్ళింటికి తీసుకెళ్ళేరు. ఆయన భార్య నాగమణి అక్కడి విమెన్స్ కాలేజ్ లో లెక్చరర్. ఎంతో బాగా ట్రీట్ చేసారు. చింత చిగురు వేసి గోదావరి కట్ట చేపల కూరతో బాటు రకరకాల వంటకాలు రుచికరంగా చేసి వడ్డించారు నాగమణిగారు.
16 ఉదయం 9.30కి నేను విమెన్స కాలేజ్ లో రచయిత్రులందర్నీ కలుసు కున్నాను. అందరూ చేతులు కలిపి పలకరించేరు. చంద్రలత నన్ను కౌగలించుకుని నా సర్జరీని గుర్తుచేసుకుని “యూ ఆర్ ఎ బ్రేవ్ లేడీ” అంది. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ తో ఒక గెట్ టుగెదర్ జరిగింది. అక్కడే వేడి వేడి ఉల్లిగారెలు, ఇడ్లీలు తిని, కాఫీతాగి మా కోసం ఏర్పాటు చేసిన మినీబస్సులో పేరు పాలెం బీచ్ కి వెళ్ళేం. సన్నగా ప్రారంభమైన వర్షం మొత్తడం ప్రారంభించింది. బీచ్ వొడ్డునున్న గెస్ట్ హౌస్ లో కూర్చున్నాం. వచ్చిన రచయిత్రులెవరంటే శారదా శ్రీనివాసన్, పి. సత్యవతి, కె.సత్యవతి, రెంటాల కల్పన, కొండేపూడి నిర్మల, సమతా రోషిణి, సుజాతా పట్వారీ, వారణాశి నాగలక్ష్మి, ఎస్.జయ, రజిత, రామ లక్ష్మీ, విష్ణుప్రియ, చంద్రలత, వి. ప్రతిమ, మందరపు హైమవతి, శ్రీ శ్రీ ప్రింటర్స్ ప్రమీల, M.R. O లలిత, హెల్ప్ లైన్ అమ్మాయి, భూమిక స్టాఫ్ నలుగురు. గెస్ట్ హౌస్ లో డిస్కషన్స్ : అందరం తరచూ కలుసుకోవడం ఎలా? అని మొదలై, ఈ ట్రిప్ కి రాని ఒక రచయిత్రి భూమిక పోటీలో బహుమతి వచ్చిన ఒక రచయిత్రిని ఎలాబ్లాక్ మెయిల్ చేసింది లాంటి వాటితో ముగిసింది. వేడివేడిగా వచ్చిన వంటకాలతో భోజనాలు చేసే సరికి వాన తెరిపిచ్చింది.
నల్లని బురదలాంటి ఇసుకతో నిండి ఉన్న పేరుపాలెం బీచ్ ఏమంత శుభ్రంగా లేదు. అయినా కెరటాలతో రారమ్మని పిలిచే సముద్రాన్ని చూస్తూ ఎలా ఆగగలం? కొందరైతే బాగా తడిసి ఎంజాయ్ చేసేరు. సముద్రంలోకి వెళ్ళని వాళ్ళని పై నుంచి వర్షం మళ్ళీ వచ్చి తడిపేసింది. సాయంకాలం వరకూ అక్కడే గడిపి బస్సులో మాకు బస ఇచ్చిన నరసాపురం కాలేజ్ కి చేరుకున్నాం. అది సినీనటుడు చిరంజీవి చదువుకున్న కాలేజ్ అట. అక్కడి VIP గెస్ట్ హౌస్ రూమ్స్ లో మా బస. అందరికీ బెడ్స్, కొందరికి మంచాలు ఉన్నాయి. రాత్రి చీకట్లో గోదారోడ్డుకి నడిచి వెళ్ళి పంటుమీద అవతలి ఒడ్డున సఖినేటి పల్లి రేవు చేరి, దిగకుండానే అదేపంటు మీద తిరిగొచ్చా౦. వేడివేడి చుక్కా రొట్టెలు పొటేటో కుర్మాతో తిని, చాలా రాత్రి వరకూ కబుర్లు చెప్పుకొని నా ‘ఆనకట్ట’ కథ గురించి ప్రసక్తి తెచ్చి, ఆ కబుర్లలో తానా వారి మొదటి బహుమతి వచ్చినందుకు అభినందనలు చెప్పేరు. ‘నవలలు రాసేరా!’ అని అడిగితే ‘ఓపికగా ఉన్నప్పుడు రాసేను’ అన్నాను. అదివిన్న సీనియర్ రచయిత్రి ఒకావిడ ‘నవలలు కూడా రాసేరా’ అని ఆశ్చర్యం అభినయించి ‘మీ ఓపిక పూర్తిగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను!’ ఎందు కంటే ‘ఓపిక తగ్గేక మంచి కథలు రాస్తున్నారు కదా, అందుకు!’అంది, నేనసలే సెంటి మెంటల్ ఫూల్ ని, సర్జరీ అయిన భయంతో ఉన్న నాకు మనసు చివుక్కుమంది. ఆ రాత్రంతా అదే మాట గుర్తొచ్చి, ఓపిక పూర్తిగా తగ్గిపోవడాన్ని ఊహించుకుంటూ నిద్రకు దూరమయ్యాను.
నరసాపురం 300 ఏళ్ళనాటి ఆలయానికి వెళ్ళేం. ముందు రాత్రి నడకలో, ఆదికేశవ – యతిరాజ వాడ వల్లీ తాయారుల ఆలయమది. ఆళ్వారుల చేత స్థాపించబడిన విగ్రహా లట. ఆలయం వైభవంగా నడుస్తో౦ది. అందరం గర్భాలయంలోకి వెళ్ళి గోత్రనామాదు లు చెప్పి శఠగోపం పెట్టించుకున్నాం. బైటికొచ్చి ఎగతాళి, నవ్వులు, పూజారుల మీద సెటైర్లు వేసి ఆనందించారు కొందరు. ఆ హిపోక్రసీ ఏమిటో మరి?
మర్నాడు ఉదయం రిఫ్రెష్ అయ్యి కె. సత్యవతి గారి ఊరు సీతారామపురం వెళ్ళేం. అటు సముద్రానికి, ఇటు గోదావరికీ మధ్యనున్న అందమైన చిన్న ఊరది. సత్యవతి తల్లిగారి ఎత్తరుగుల ఇల్లు, తోటలు రోడ్లు చూసేం. వాకిట్లో బోలెడన్ని పూలు రాల్చిన పారిజాతం చెట్టుతోబాటు బోలెడు పూలు మొక్కలు. అదే ఊళ్ళో ఉన్న లేసుల పరిశ్రమ చూసా౦. చాలా మంది కొనుక్కున్నారు. 11AM కి తిరిగి కాలేజీకి వచ్చాం. మాగెస్ట్ హౌస్ వెనక ఉన్నఓ పెద్ద క్లాస్ రూమ్ లో మీటింగ్ ఏర్పాటు చేసారు. స్టాఫ్, స్టూడెంట్స్ తో హాల్ నిండిపోయింది. వెళ్ళిన అందరినీ స్టేజిపైన కుర్చీలు వేసి కూర్చో బెట్టేరు. అందరూ ఏదో ఒకటి మాట్లాడినా ఆ సభకి గొప్ప ఆకర్షణ శారదా శ్రీనివాసన్ గారు. ఎప్పుడో ఏదో రేడియోలో విన్న ఆమె గొంతు నుంచి పాటలు పాటలు విని అందరూ ఎంతో ఆనందించారు. ఆమెను ఎంతో అభినందించేరు. సభ ముగిసేక మా అందరికీ లేసుతో అల్లిన షాల్స్ ఇచ్చారు. ఆ నాటి గుర్తుగా ఆ షాల్ ఇంకా నా దగ్గర ఉంది. భోజనాల తర్వాత బస్సులో బయలుదేరి పాలకొల్లు దాటేక గోదావరి బ్రిడ్జి మీ౦చి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించాం. సాయం కాలానికి అంతర్వేది చేరుకున్నాం. గుడికి రిపేర్లు జరుగుతున్నాయి. సంధ్య వాలుతున్న వేళ, కరెంటు లేదు. చీకట్లో దీపం వెలుగులో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని నది సంగమం చూడాలని బయలుదేరాం. బస్సు డ్రైవర్ రానన్నాడెందుకో! లైట్ హౌస్ వరకూ నడవలేక ఇటువైపు కొత్తగా కడుతున్న వశిష్ఠాశ్రమం పైకెక్కి దూరం నుంచి నదీ సంగమం చూసి వెనక్కి తిరిగేం. బస్సు రాజమండ్రి చేరేసరికి రాత్రి పదైంది. పేపర్ మిల్లు హౌస్ గెస్ట్ హౌస్ లో మా బస.
ఉదయాన్నే పట్టిసీమ చేరుకుని లాంచి ఎక్కేం. గోదావరి నిండుగా ఉంది. లాంచి కదిలిన మరుక్షణం నుంచీ అందాలే అందాలు, దూరపు కొండలు దగ్గరయ్యే కొద్దీ నలుపు నుంచి పచ్చగా మారడం. గట్ల మీద అక్కడక్కడ గిరిజన గ్రామాలు, లాంచి టాప్ మీద కుర్చీల్లో కూర్చుని సరదాప్రయాణం. లాంచి వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక అమ్మాయి, అబ్బాయి డేన్స్ మొదలు పెట్టేరు. రెండు పాటలయ్యక మావాళ్ళు వాళ్ళని ఆపేసారు. విష్ణుప్రియ, సమత కాస్సేపు డేన్స్ చేసారు. తర్వాత పోలవరం ప్రోజెక్ట్ గురించి చర్చ జరిగింది. నేనైతే రెప్పవేయ్యకుండా కేవలం ప్రకృతినే చూస్తూ ఉండిపోయాను. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలు అన్నీ లాంచీలోనే. పేరంటంపల్లిలో దిగి అక్కడి వెదురు ఇళ్ళ గిరిజన గూడేన్ని, నదిఒడ్డున ఎవరో స్వామీజీ నిర్మించిన చిన్నఆలయాన్ని, ఆలయం పక్కనే గల గల ప్రవహిస్తున్న సెలయేరుని చూసి, గిరిజనులు వెదురు ముక్కలతో తయారు చేసిన కళాకృతుల్ని కొనుక్కుని తిరిగి వెనక్కి లాంచీ ఎక్కేం. చాలా ఎత్తైన ఆ కొండలు మేఘాల చీరలు కట్టుకున్నట్టు అనిపించింది. దేవి పట్నం, పొసమ్మ గండి దగ్గర లాంచి ఆగినా ఎవరం దిగలేదు. చంద్రలత పోలవరం ప్రాజెక్ట్ గురించి వివరంగా రాసుకొచ్చి చదివింది.
“మా ప్రాంతమంతా డ్రైలేండ్. ఈ ప్రోజెక్ట్ వస్తేనే మా వైపు పంటలు పండుతాయి” అనినేను అన్నానే కాని ఇదంతా మునిగిపోయి ఈ దారి మూసుకుపోతుందంటే నాకే బాధేసింది. నిన్నటి సీనియర్ రచయివు మళ్ళీ నా ‘ఆనకట్ట’ కథగురించి ప్రసక్తి తెచ్చి “మీరు ఆ కథలో సంత గురించి రాసేరు. అసలిప్పుడు సంతలెక్కడున్నాయి?” అంది. “మా ఊళ్ళోనూ నేనూ కథలో రాసిన మారేడుమిల్లిలోనూ ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వారానికొకసారి సంతలు జరుగుతాయండి”అన్నాను నేను. “అసలు రెండో బహుమతి కథకి ఫస్ట్ ఇవాల్సుండగా మీకిచ్చేసారు” అంది. ఆ రెండో బహుమతి ఎవరికి వచ్చిందో, జడ్జీలు ఎవరో నా కప్పటికి ఏమీ తెలీదు. ఆవిడ ఎందుకంత అసహనం ప్రదర్శిస్తున్నారో కూడా అర్థం కాలేదు. అది సద్విమర్శ కాకపోయినా నేను వినమ్రంగా, మౌనంగా ఉండి పోయాను. ఇసక మేట వేసి ఉండడం వల్ల లాంచి ఆ లంక వరకూ వెళ్ళేక పట్టిసీమ ఆలయాన్ని చూడలేకపోయాం. లాంచి దిగిన చోట నుంచి బస్సులో రాజమండ్రిలోని అద్దేపల్లి శ్రీధర్ (అద్దేపల్లి వివేకానందదేవి గారి మనుమడు, హైద్రాబాద్ మాదాపూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అట) గారి ఇంటికి చేరుకున్నాం. ఆ రాత్రి వాళ్ళింట్లో భోజనాలు చేసాక రాజమండ్రిలో అద్దకం చేసే చీరలు ఇచ్చారు మా అందరికీ. ఆ రాత్రి ట్రెయిన్స్ కే అందరిదీ తిరుగుప్రయాణం. నేను బస్సెక్కి రాత్రి 10. 30కి జగ్గంపేట చేరుకున్నాను. వెంటనే ‘వరద గోదారి పైన వాన’ పొయె౦ రాసాను. అది డిసెంబర్ లో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చింది. చాన్నాళ్ళు ఆ ప్రయాణం మనసులో నిలిచి ఉంది. కళాకారులెప్పుడూ బాంధవ్యం అనే గుహలో బందీ అయితే బాధతప్పదు. ‘స్వచ్ఛమైన గాలి లాగా స్వేచ్చా జీవితం గడపాలి.’ – అంటాడు ఒక మరాఠీ రచయిత.
శృతి మించిన వినమ్రత మంచిది కాదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే ఇతరులూ అలాగే చేస్తారనేది ఎంత నిజమో రచయిత్రులతో ప్రయాణం నాకు అర్ధం అయ్యేలా చేసింది.
మోహన్ సంవత్సరీకం కోసం అక్టోబర్ 17న మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేను. అక్టోబర్ 28న మా అబ్బాయి ఇంట్లో నా తరపు, ఆయన తరపు చూట్టాల సమక్షంలో, మా పిల్లల ముగ్గురు కుటుంబాలు పాల్గొని కార్యం జరిపించేరు.
మరో రెండు రోజుల్లో 31stన గీత రెండో పొయెట్రీ బుక్ ‘శీత సుమాలు’ ఆవిష్కరణ జరిగింది. కె.శివారెడ్డి, సీతారాం, శిలాలోలిత వక్తలు. చుట్టాలు, మిత్రులు అంతా అటెండెయ్యారు. ఆ మర్నాడే రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, విద్యా శాఖామంత్రి నెదురుమిల్లి రాజ్యలక్ష్మీ చేతుల మీదుగా గీత బెస్ట్ లెక్షరర్ అవార్డు అందు కుంది. ఆ నవంబర్ 6న గీత విశాఖపట్టణం ఆంధ్రాయూనివర్శిటీలో డాక్టరేట్ అందు కుంది. అదే స్టేజి మీద సినీనటుడు చిరంజీవి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
ఆ నవంబరు 18న పిఠాపురంలో ఆవంత్స సోమసుందర్ గారి 83 వ పుట్టిన రోజుకి రచయిత్రుల్ని పిలిచారు. ఓల్లాకి, కాత్యాయనీ విద్మహేకి పురస్కారాలిచ్చి, వెళ్ళిన రచయిత్రులందరికీ వాళ్ళతోబాటు ఉప్పాడ, పిఠాపురం ఆలయాలు చూపించారు. గణపతి సచితానంద నిర్మించిన ఆశ్రమం చూసి, పిఠాపురం రాజావారి కోటకు వెళ్ళేం. అక్కడ సూర్యారావు రాజావారి చిన్న కొడుకు రత్నంరావు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిం చేరు. ఆయనకు కుటుంబమేమి లేదు. పెంపుడు కూతురట, ఒకమ్మాయి చెప్పిన పనులన్నీ చేస్తోంది. పడిపోగా మిగిలిన నాలుగైదు గదుల్లో పూర్వం నాటి రవివర్మ చిత్రాలు, పింగాణీ సామాను, కత్తులు, తుపాకులు, వీణలు, గిటారు, రంగు వెలిసిన బొమ్మలు, పడిపోయిన కోట మధ్య రవీంద్ర నాధ్ ఠాగూర్ కోసం రాజావారు కట్టించిన మేడ గది, వెలుగు మాసిపోయిన వైభవం మధ్య రత్నం రావు ఆరెస్సెస్, బి. జే. పి, ప్రాచీన కవిత్వం అంటూ కబుర్లు చెప్పేడు. పాత ఆల్బమ్ లు తెరచి ఫోటోలు చూపించేడు. చాన్నాళ్ళకి ఇందర్ని చూసి తనకి జీవం తిరిగొచ్చిందన్నాడు. ఆ కోటను చూసిన స్ఫూర్తి తోనే నేను’సహచరి’ కథ రాసేను.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.