నిన్నటి భవితవ్యం
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-ఎస్వీ. కృష్ణజయంతి
”విడిపోదామా..?”
చాలా ప్రాచీనకాలం నుంచీ విన్పిస్తున్న తుది బెదిరింపు ఇది!
యుగయుగాలుగా ఓడిపోతున్న భార్యల సాధుస్వభావం పై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న ‘మగ పటిమ’కి దొరికిన బ్రహ్మాస్త్రం… ఈ మాటొక్కటే!
వెంటనే బదులివ్వలేదు నేను. అడిగిన వెంటనే ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అన్నది సహేతుకమైన విషయం. అది నిజంగా ఆలోచించి తీసుకునే నిర్ణయంతో సమానం అని నాకు అనుభవపూర్వకంగా ఈ మధ్యనే తెలిసిన సత్యం !
”ఏదోటి చెప్పూ… త్వరగా!” భయానికి కారణం సిద్ధం చేస్తున్నవాడిలా అడిగాడు.
”ఆలోచించుకోవాలి…” కూడబలుకున్నట్లుగా చెప్పాను.
”ఎప్పటికీ ఓ కొలిక్కిరాదు నీ ఆలోచన… నాకు తెలుసు! భవిష్యత్‌ని కూడా ముందు గానే ప్లాన్ చేసుకున్న తర్వాతనా?” దెప్పిపొడుపు.
”అందుక్కాదు. ముందు గమ్యం ఏమిటో నిర్ధారించుకోవాలి! దాని వల్ల ఇద్దరమూ నష్టపోకూడదు. ఎవరి ప్రయోజనాన్ని వారు వేరు చేసుకోవాలి… సవ్యంగానే విడిపోదాం…”
”మనం నష్టపోకూడదని మంచి సలహానే ఇచ్చావ్. అలాంటప్పుడు అంత కంటే దారుణంగా ఉండాలి నిర్ణయమంటే! అంతేగానీ, ఎటు గాలి వీస్తే అటు వెళ్ళేలా ఉండ కూడదు. ఎంతయినా ఆడజాతి కదా మరి..!” అతడి నోటి నుంచి అతి సహజమైన విమర్శ- కాదు, కాదు… చులకన!
నాకిక అతనితో వాదించాలన్పించలేదు.
నిస్తేజంగా కుర్చీలో కూలబడిపోయి అరచేతుల్ని చూసుకున్నాను… ఇవి చాలా శక్తివంతంగానే ఉన్నాయి. ‘వీటితో ఒక గుండ్రని రాయి తీసుకుని దాని మీద నా పేరు రాయాలి. తర్వాత దాన్ని సాధ్యమైనంత వేగంగా దూరంగా విసరాలి!’ అనుకున్నాను.
ఇక్కడితో ఆగిపోకూడదు… కలతకు స్వస్తి చెప్పి జాగృతిని కూడగట్టుకోవాలి… వెంటనే జీవితాన్ని తిరగరాసుకోవాలి. ఇప్పుడు నేనున్న స్థితి వేరు… దీనికి భిన్నంగా పోరాడాలి.
సరిగ్గా… పదేళ్ళ క్రిందట- ఛుడీదార్ వేసుకుని, జుట్టుకి పోనీటెయిల్ వేసి, పక్కమీద ఏడింటి వరకూ వెచ్చగా పడుకుని అమ్మ ఎంత లేపినా లేవకుండా ‘నేను’ అన్న అస్తిత్వపు ఆత్మాతిశయంతో ‘స్వర్గం అనేది ఎక్కడో లేదు… ఈ భూమ్మీదే చూస్తాను!’ అన్నంత గర్వంతో ఉండేదాన్ని.
కానీ… ఇప్పుడు- ‘నాది’ అనే సామాజిక వ్యక్తిత్వానికి లోబడి దుఃఖంతో, విషాదంతో, దిగులుతో అన్నిటినీ కలిపి ‘వాస్తవం’ అనబడే స్పృహతో జీవితాన్ని గడుపుతున్నాను.
సాంఘికంగా నాకు భద్రత కావాలి… అందుకు ‘నేను’ అనే ‘సాధికారత’ సాధించాలి!
అందుకు అవసరమైన శిక్షణ-క్రమశిక్షణ అలవరచుకోవాలి. క్రమంగా జననానికీ, మరణానికీ మధ్య జరిగే నాటకీయ మార్పుకి ‘జీవితం’ అనే సిద్ధాంతాన్ని కనుక్కునే దిశగా నన్ను నేను తెలుసుకునే అనుభవానికి రాటుదేలబోతోంది తను.
ఒక స్థిరమైన ఫలితాన్ని సాధించడానికి మనసు సిద్ధపడుతోంది..,
ఓ అపురూప బంధాన్ని త్యజించడానికి సమయం అసన్నమౌతోంది.
***
వసుమూర్తి పెద్ద అందగాడు కాదు, పేరొందిన ప్రముఖ వ్యక్తీ కాదు…
అతనితో నా పెళ్ళి ప్రేమపూర్వకంగా జరగలేదు, అలాగని- పెద్దలు నిర్ణయించిందీ కాదు…
ఒక ‘అగ్రిమెంట్’తో జరిగింది- పెళ్ళయ్యాక ఇద్దరమూ ‘బాధ్యత’గా బ్రతకాలి. ఆ బాధ్యతలో సెంటిమెంట్లు గానీ, విపరీత ప్రేమానురాగాలుగానీ ఉండవు. ‘ఎప్పుడైనా ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు వస్తే తక్షణం విడిపోదాం!’ అన్న కాంట్రాక్ట్ పద్ధతి పై.
పెళ్ళయిన తొలి రోజుల్లో ఏదో తెలియని అసహాయ స్థితి నన్నావరించింది. ‘ప్రేమ’ అనే అద్భుతమైన ఘర్షణ మొదలైంది నాలో. శారీరకంగా, మాటల వల్ల అతడ్ని మా ‘అగ్రిమెంట్’ నుంచి తప్పించి ‘నా సొంతం’ చేసుకోవాలనే తపన ప్రారంభమైంది.
ప్రశాంతమైనదీ, గంభీరమైనదీ, హుందాతనం ఉన్న ప్రేమలోనే స్వర్గం నిండి వుంటుందన్న అతినమ్మకం నన్ను పరోక్షయుద్ధానికి హేతువుని చేసింది. బాధ్యతల పట్ల నన్ను కాస్త విముఖురాల్ని చేసింది. ఆ బలహీనతే చాలా మంది మగవాళ్ళలో బహిర్గతం గానే ప్రదర్శితమౌతూ, మూర్తిలో నిద్రాణమై ఉన్న ‘పురుషాహంకార’ లక్షణానికి మేల్కొ లుపు పలికింది.
మా ఇద్దరి మధ్యా మానసికంగా ఉండాల్సిన ‘అనుబంధం’- కేవలం ‘శారీరక సంబంధం’గా మారుతూ, జీవితంలోని ఓ ‘కార్యకలాప’మై, అట్నుంచి జీవన సంక్షోభానికి దారితీసే ఓ ‘విధ్వంసం’గా రూపుదిద్దుకుంటోందని ఋజువు చేసే సంఘటనలు రోజు కొక్కటి చొప్పున జరుగుతున్నాయి.
”నిన్ను నువ్వు తెలుసుకోకుండా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించకు. నువ్వింకా భ్రమల స్థితిలోనే ఉన్నావని ముందే రవ్వంతైనా తెలిసుంటే బాగుండేది. ఒక జీవితకాలం నష్టపోయేంత ప్రమాదం జరిగేది కాదు…” అంటాడు. భర్తగా, నా పై అధి పతిగా, నా శరీరానికి అర్పణగా భావిస్తున్న అతని పై నాలోని అనురాగం, ఆత్మీయతలు క్రమంగా గాలిబుడగలైపోసాగాయి.
”నేనున్నానని అనుకోవటం వల్ల మాత్రమే నువ్వు జీవించిలేవు మంజులా! చెయ్యడ మెలాగో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. గుండె, ఊపిరితిత్తులు, కండరాలకి పనిచేసే శక్తి ఉన్నా- వాటిలో విశ్రాంతి లేకుండా రక్తప్రసరణ జరుగుతున్నా- నువ్వు మాత్రం వాటికి బద్ధకాన్ని నేర్పుతున్నావు. ఏ పనీ చెయ్యకుండా మాంసాస్థికల ముద్దగా నా కళ్ళముందు తిరుగుతున్నావ్. ఇలాంటి నిన్ను నా దానిగా ఎలా చేర్చుకుంటాను? కేవలం ఇంటిపని, వంటపని, పిల్లల పని చేసే పనిమనిషిగా తప్ప బాధ్యతల గురించి ఆలోచించని నువ్వు మనిషివెలా అవుతావ్? అసహ్యంగా ఉంది నువ్వంటే!” అన్నాడొకసారి గుండెని చీల్చి చెండాడేలా.
”ఎలా అర్థంచేసుకుంటావు మూర్తీ… నువ్వు నా భర్తవి. నువ్వూ, నేనూ, మన పిల్లలూ, ఈ కుటుంబం ఒక శాశ్వతమైన గుర్తింపు. ఈ గుర్తింపు కోసమే కదా… ఆడది జన్మంతా తపించేది? భర్తగా నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాలని ఉంది. నువ్వలా ప్రేమించలేవా? ప్రేమించేవాడు ప్రత్యేకంగా బాధ్యతలు, కర్తవ్యాల గురించి మాత్రమే మాట్లాడ్తాడా? మనల్ని ఒకటిగా కలిపిన బంధం పై నీకు రవ్వంతైనా మమకారం లేదా?’ …స్త్రీగా నా వాదనని విన్పించాలనే ‘సూత్రం’ నాది.
అదొక కపట సూత్రమనీ, బాధ్యతల బరువు నుంచి తప్పించుకోవడానికి దొరక బుచ్చుకున్న సాధనమనీ ఖండించే ‘పురుషాహంకార ధోరణి’ అతనిది !
***
‘ఏం చేస్తున్నాడో, ఎలా తెస్తున్నాడో తెలీదు… ఇద్దరు చేసే పని ఒక్కడు చేస్తున్నాడు. కలిగిన ప్రతి కష్టానికీ అతడిని అడిగితే తప్ప నాకు భుక్తి లభించడం లేదు. ఈ మాట చెప్పుకోవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఈ అవస్థ నుంచి నాకు విముక్తి కావాలి. అందుకు ఏం చేయాలి?’
సమస్యాత్మకమైన నా పరిస్థితి గురించి బాహ్యంగా ఎవరికీ చెప్పుకోను. చెప్పను కూడా! అలా చెప్పడం వల్ల నాకు దొరికేవి- రెండు ఓదార్పు మాటలు, నాలుగు సానుభూతి పలుకులు! ఆ రెండూ కోరడానికీ, అందుకోవడానికీ సిద్ధంగా లేను నేను. అంతకంటే ఆత్మహత్య నయం! ఓ రకంగా చెప్పాలంటే… అది సమస్య నుంచి తప్పించుకొనే ‘పలాయన వాదం!’
వసుమూర్తితో గల సంబంధంలో నేనెలా ఉన్నానో సరిగ్గా సమాజంతో కూడ నా సంబంధం అలాగే మారుతోందని నాకు గుర్తురావడం లేదు. అన్నింటికంటే మొదట ముఖ్యంగా కావలసింది… నాలో నేను సమూలంగా రూపాంతరం చెందడం!
”నువ్వు నీ బాధ్యత తెలుసుకున్న సమర్ధురాలివైనప్పుడే నిన్ను నిన్నుగా గుర్తిస్తాను. అంతే గానీ- నిండైన పట్టుచీర కట్టుకుని, తలనిండా మల్లెపూలు పెట్టుకుని, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలతో గుడికెళ్ళి ఇంటికొచ్చి ఎదురొస్తే ‘నువ్వే నా అభినవదేవతవి’ అని మెచ్చుకొనే ఉత్తముణ్ణి కాదు నేను మంజులా! నిన్ను నేను ప్రేమికుడిగా స్వీకరించలేదు, పైగా సంపన్నుణ్ణి కూడా కాదు. కేవలం ‘బాధ్యత’… బాధ్యత ఒక్కటే ఇద్దర్నీ ఒకింటి వాళ్ళని చేసింది. ఇద్దరు బిడ్డల తల్లిగా వారికి ప్రేమాను రాగాలు అందించాల్సినదానివి- ఇంకా పెళ్ళికాని ఆడపిల్లలా ‘తొలిప్రేమ తాలూకు అనుభూతుల’ గురించి ప్రాకులాడకు. నీకేదో నీతులు చెప్తున్నాననుకోకు- నాకంటే ఎక్కువ తెలివుంది నీకు!”
‘మానవ సంబంధాలన్నీ అంతర్గత యుద్ధాలే…’ అని తెలపడానికి ఇంతకన్నా నిదర్శనమేముంది?
”నువ్వూహించుకునే ప్రేమే నాలోవుంటే బంగారప్పెట్టెలు తెచ్చే అమ్మాయినే చేసుకునేవాణ్ణి. కానీ, నీలో బాధ్యత నెరవేర్చే పట్టుదల, సమర్ధతా ఉన్నాయని నమ్మి నిన్ను ఇష్టపడ్డాను. ఆ రెండూ చాలా మంది ఆడవారిలో ఉండవు. నువ్వు వారిలో చేరాల ని ప్రయత్నించకు. నీ అస్థిత్వాన్ని నిలుపుకుంటూ నువ్వు నువ్వుగా నిన్ను ఋజువు చేసుకుంటే… ప్రపంచమే నిన్ను ఆరాధిస్తుంది. ఇంతకంటె నువ్వు సాధించాల్సింది ఇంకేమీ లేదు.”
అహం మీద దెబ్బకొట్టే ఆ మాటలు నాలో రోషాన్ని గాక, మానసిక విప్లవాన్ని రేకెత్తిస్తున్నాయి.
‘ఎంత మగాడివైతే మాత్రం భర్త పదవిలో ఉంటూ భార్యని అలాంటి మాటలతో హింసించడం సభ్యత అన్పించు కుంటుందా?’ అని అతన్ని ఘాటుగా విమర్శించలేను. నా బాధ్యత తెలిసికూడా దాన్ని సక్రమంగా నిర్వర్తించకుండా అతనికే వదిలివేశాను కాబట్టి, అతిముఖ్యమైన ‘అస్థిత్వం’ తాలూకు ఉనికిని నిలుపుకునే హక్కుని కూడా కోల్పోయాను నేను.
వాస్తవంలో జరుగుతున్న యుద్ధంలో పోరాడడానికి సంసిద్ధమవ్వాల్సిన నాలో… మానసిక యుద్ధాన్ని ప్రేరేపించడానికి అతనికి అన్ని విధాలుగా అవకాశమిస్తున్నాను.
ఆడవాళ్ళలో కొందరికి మాత్రమే పరిమితమైన మాధుర్యాన్ని ‘వివాహబంధం’ ద్వారా ఏర్పాటు చేసి, మిగతా ఆడవాళ్ళందరికీ తద్వారా ప్రసాదించిన జీవితాన్ని మధురమైన అనుబంధంగా మారకుండా రెండు హృదయాలను చిన్నాభిన్నం చేసే ‘విచ్ఛిన్నకర ప్రక్రియ’గా రూపుదిద్దుకోవడానికి మూలకారణం కూడా ‘భర్త’ అనబడే జీవిత భాగస్వామే!
కొన్ని రాత్రిళ్ళు ఇద్దరు పసిబిడ్డల ఆలనాపాలనలో అలసిపోయి మంచానికి చేరగిలబడినపుడు వెంటనే హృదయం పై దాడి చేసేందుకు విజృంభించే వ్యతిరేక శక్తులు సిద్ధంగా ఉండేవి.
నువ్వు పగలూ, రాత్రిని సమంజసంగా, సమతూకంగా లెక్కించనపుడు సరైన దారి ఎలా అవగతమవుతుంది? ఒక సమస్య వచ్చినపుడు ఇష్టం లేకపోయినా పరిష్కారం కోసం వెంటనే స్పందించే అలవాటు లేని నీకు- అదే అలవాటుగా మారిన ఇష్టమైన మత్తు- ‘నిద్ర’ రూపంలో అంత సులభంగా ఎందుకొస్తుంది?!
‘మానసిక విప్లవం’ లేనిదే ప్రమాదకరమైన ఆంతరంగిక పరిస్థితినీ..; భద్రత, సౌకర్యం, సంతృప్తినీ విచ్ఛిన్నం చేసే హింసాత్మక అవస్థనీ సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోగలవు?
నువ్వు మారడం నీకిష్టం లేనప్పుడు- నీతో భాగస్వామ్యం పంచుకోవడానికి ఒప్పు కున్న వ్యక్తి ఎలా మారతాడు? ఇద్దరూ కలిసినందుకే గదా ఉమ్మడి జీవితం ఒకటి కావాలనుకుంటోంది?!
ఇచ్చిన వాగ్దానం నెరవేర్చనపుడు నిశ్చింత కరువవుతుంది…
చేసేవారు ఒకరున్నారని, ఇక నీకేమీ కష్టాల్లేవని హాయిగా ఉండడంలో అర్థం లేదు.
నువ్వు మేల్కోవాలి! ప్రపంచంతో నీకు చాలా పని ఉంది…
నీ దృష్టిలో ప్రేమించడం అపూర్వమైనది అయినపుడు దాన్ని అందుకోవడం అనేది కూడా అపూర్వమైనదిగానే ఉండాలి. అన్నిటికన్నా ముందు ఆ ప్రేమ కన్నా ముఖ్యమైనది గమ్యం! …లక్ష్యం!!
నిర్దిష్టత లేని గమ్యం జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అప్పుడే అసూయ, ద్వేషం, అధికారపూరిత అసహనాలు ప్రారంభమవుతాయి. అలాంటి అవాంఛిత పరిస్థితిని తట్టు కునే సహనం జీవితాంతం వరకు నీలో ఉంటుందా? జన్మజన్మలుగా నువ్వు వెతికే కళ్ళల్లో మెఱుపునీ, అందమైన వెలుగునీ దర్శించగలిగే గాఢతను సొంతం చేసుకో.
”నేనున్నంత కాలం నువ్వు మేల్కోలేవు. నీ నిండా నాపై నిందారోపణలున్నాయ్. వాటిలో నేనొక్కడ్నే మునిగి పోతుంటే చూస్తూ ఉండిపోతావా? ‘మునిగిపోకు. రా… పైకిరా! నీ కోసం నేనున్నాను!’ అని నువ్వనుకునే ప్రేమపూరిత భావాలు నన్ను పైకెలా తేలుస్తా యి? నా చేతి నందుకుని ‘నీకు తోడుగా నేనున్నాను. నువ్వెందుకు మునిగిపోతావ్‌లే!’ అనే ధైర్యాన్నిచ్చే నీ చేయి నాక్కావాలి గానీ!”
అతడి మాటలు సున్నితంగా ఉండవ్- మొత్తం అధికార దర్పమే, అన్నిటా శాసించే కరకుదనమే!
ఆ కరకుదనమో, కఠినత్వమో, అసహజత్వమో, ఇంకేదో తెలియదు గానీ- అతడికి దగ్గరవ్వాలనుకునే నా వాంఛని ఎప్పటికప్పుడు మనసులోంచి పూర్తిగా దూరం చేస్తుంది, ఏదో తెలీని ‘పరాయి’భావం హృదయం నిండా అలుముకుంటుంది. అది నా స్వేచ్ఛనీ, వాక్ స్వాతంత్య్రాన్నీ హరించివేస్తోంది.
ఇకముందెప్పుడైనా ప్రేమిస్తాడన్న భ్రమలో ఉండేకన్నా- తనలో జనించి, నిరంతరం జ్వలించే ద్వేషాగ్నినీ, అసందర్భమైన తత్త్వతాకిడినీ నా పై ప్రదర్శిస్తూ… తనను తాను మెలిమెల్లిగా చల్లబరచుకుంటున్నాడన్న వాస్తవంలో ఉండడమే నయం.
అలా ఎంత కాలానికి అతడు చల్లబడటం పూర్తవుతుందో తెలీదు కానీ, దాని తాలూకు నిరంకుశ పరిణామాల్ని నిత్యం నేననుభవించాలి… నిరంతరం అంపశయ్య పై గడపాలి… ప్రతిక్షణం ‘అభద్రతాభావం’తో నేను సతమతమవ్వాలి.
***
పెళ్ళికి ముందు నా భర్త గురించి నేను కన్న కలలు… ఇప్పటి వాస్తవానికి పూర్తిగా విభిన్నం!
‘భర్త’ అనే పరిపూర్ణ వ్యక్తిత్వం ‘భార్య’ అనే ప్రాణికి సంపూర్ణ భద్రతనీ, రవంతైనా ప్రేమనీ, పావువంతైనా ఆధారాన్నీ ఇవ్వగలిగేదిగా వుండాలి… వసుమూర్తి ఇందుకు పూర్తిగా విరుద్ధం!!
అతడి వల్ల నేను వ్యక్తిగతమైన కొన్ని విలువైన అనుభూతుల్నీ, మనోగతమైన సున్నితమైన స్పందనల్నీ కోల్పోవాల్సి వచ్చింది. ‘ప్రేమోద్రేకాన్నీ, ఆరాధనా భావాల్నీ, ప్రేమపూరితమైన మురిపాల్నీ స్వయంగా, ప్రత్యక్షంగా అతనికి అందించాలి, ఉత్తేజం పొందాలి…’ అనే కోరిక రోజురోజుకీ మనసులోంచి ఆవిరైపోతోంది.
చాలాసార్లు ఓ భావోద్వేగం మెరుపులా తట్టి గుండెని పలకరించేది…
‘యౌవ్వనంలోనూ, మనసులో మాధుర్యం నిండిన వేళలోనూ ఒకటి మాత్రం జీవితాంతం వరకు మిగలకూడదు, తీరకుండా ఉండకూడదు… అది- హృదయాన్ని సంపూర్ణంగా, స్వచ్ఛంగా కదిలించగల వ్యక్తి పై కలిగిన ప్రేమను ముద్దు ద్వారా గానీ, కౌగిలింత ద్వారా గానీ, బాష్పాల ద్వారా గానీ అంతే సంపూర్ణంగా వ్యక్తం చేయాలి… ఒకే ఒక్కసారి… చివరిసారి!!’
ఇది తీరకపోతే మృత్యువు దగ్గర ఓడిపోయినట్లే! మరో అర్థంలో… అనాథగా కనుమూసినట్లే!
ఇది గుర్తొచ్చినప్పుడల్లా గుండెనిండా ‘శూన్యత’ ఆవరించుకున్న దిగులు!
అనుక్షణం భావరహితమైన ప్రేమను అనుభవిస్తున్న వేదనలో అర్థం ఉందో, లేదో తెలీని తర్కాలు నిర్లిప్తతను కలుగజేస్తున్నాయ్. ఏదో ఒకరోజు తీసుకునే శలవుకి ప్రతి రోజూ శాశ్వతత్వాన్ని పోగుచేస్తున్నట్లుగా ఉంది –
ఫలితం… నా బ్రతుకు మృతసముద్రమై నా పైనే విరుచుకుపడ్తున్నట్లు బీభత్స భావన!
ఏ మూలో పిసరంత ఆశ… వసుమూర్తిలో ఇసుమంతైనా నా పై ప్రేమ కలుగు తుందేమోనని!
జీవితాన్ని ఆస్వాదించే అభిరుచి ఉందిగానీ, అనుభూతులు మిగలడం లేదు. వసుమూర్తి వల్ల జీవితంలో ‘రాజీపడడం’ అనే రాగానికి సరైన చరణం రాయలేక పోతున్నాననే సమస్య రోజురోజుకీ ఆరిపోని ఆజ్యంలా నాలో జ్వలిస్తూ… నన్ను ప్రశ్నిస్తూనే ఉంది.
క్షణక్షణానికీ పొడిబారుతూ ఎండిపోతున్న హృదయం- అనుభవించే స్థితికి దూరమై క్రమక్రమంగా ‘అనుభూతి’ చెందాలన్న ఆసక్తినీ, ఆశనీ నిర్జీవం చేస్తుంటే… ‘భవిష్యత్‌లో నా వల్ల కలిగే ప్రయోజన మేమిటా..?’ అనే ఆలోచనలో పడిన నాకు- అప్రయత్నంగా గుర్తొచ్చింది… వసుమూర్తి కన్నా వాస్తవమైనదేమిటో..?!
అది అవరోధించడానికీ, ఖండించడానికి గానీ వీల్లేనిదనీనూ…
నాలో దాగిన పరివర్తనకి మూలమైనదీ, వివేకానికి ప్రారంభమైనది కూడానూ!
అన్నింటికంటే ముఖ్యం… మొదట గుండె ఏడవడం ఆగిపోవాలి..!
***
”ఎందుకైనా మంచిది… మనం రేపే విడిపోదాం !”
స్పష్టంగా విన్పించిన నా కంఠస్వరంలోని నిశ్చలత్వానికి ఆశ్చర్యంగా చూసిన వసుమూర్తి చూపు- నా మనసులోని ఏదో అంచుని తాకిన ప్రకంపనగా నన్ను కదిలించ గలిగిందొక్క క్షణం !
”గుడ్… మంచి మార్పే!” అన్నాడు సంతోషాన్ని కొనితెచ్చుకుంటూ.
”ఎవరికి ఉండాల్సిన జ్ఞానం వారికి అందుబాటులో ఉపయోగపడడం లేదంటే అందుకు కారణం… ప్రక్కనున్న వారిదే నంటాను. అందుకే మిగిలిన జీవితాన్ని వృధా చేసుకోవడం ఎందుకు? నిజమా, కాదా ?” అడిగాను- మనసుని అదుపులో పెట్టుకుంటూ.
”ఆ మాట నేన్నీకు మొదట్నుంచీ చెప్తూనే ఉన్నాను మంజులా! నీలో ఇపుడు కలిగిన ఈ ఆవేశాన్ని తగ్గించుకోవద్దు… చివరిసారిగా మంచి రొమాన్స్ చేసుకుందామా?”
మూర్తీభవించిన శాడిజానికి ప్రతీకగా కన్పిస్తున్న అతడ్ని ఎలా భావించాలో నాకర్థం కాలేదు.
”అన్నట్టూఁ… ఎందుకు విడిపోదామన్పించింది నీకు ?” మళ్ళీ అడిగాడు.
”నా పిల్లల కోసం! ‘ప్రపంచంలో ఎనభైయ్యేళ్ళు బ్రతకడం గొప్ప కాదు. అన్ని ఏళ్ళు బ్రతికి ఏమీ సాధించలేకపోవటం ఘోరమైన ఓటమి’ అన్న సిద్ధాంతాన్ని చాలా మంది చెప్పారు. నిజమే! నీతో పావు వంతు జీవితాన్ని ఏ ఉపయోగం లేని విధంగా వెచ్చించి నష్టపోయాను. ఇక ఇంతటితో చాలు- మిగిలిన భాగాన్ని నా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దు కోవడానికి ఉపయోగించుకుంటాను. నీ దగ్గరుంటే వారిని సవ్యంగా పెంచలేను సరికదా… సరిగ్గా ప్రేమించలేను కూడా! అనవసరంగా మానసికంగా కృంగిపోవడం తప్ప నీ నుంచి నాకు దక్కింది ఏమీ లేదు. ‘చిన్న మాటలోనైనా కొండంత ప్రేమని అందించగల వ్యక్తి’ కోసం నేను కన్న కలలు ‘వాస్తవానికి అతకవు’ అని నువ్వు నిర్ధారించి చెప్పినందుకు… చాలా థాంక్స్!” నా గొంతు వణకడం అతనికి తెలీదని నాకు తెలుసు.
”మంచిది… మంచిది! త్వరలో మంచి తల్లివి అవుతావనే నమ్మకం నీకుండాలి గానీ, నాకు అవసరం లేదు. నేను చెప్పాల్సింది ఏమీ లేదని మాత్రం చెప్పగలను!” నా నుంచి ఇంకేమీ వినడానికి కూడా ఇష్టంలేదన్న అర్థాన్ని స్పష్టంగా తెలియజేస్తున్న ట్లుంది అతని ధోరణి.
”జీవితమంటే రాత్రికి ముగిసి మర్నాటికి మళ్ళీ కొత్తగా మొదలయ్యే మార్పు లాంటిది మంజుల గారూ! ఈ మార్పుని ఉత్సాహంగా స్వీకరించడంలోనే బయట పడ్తుంది- జీవితం పై వారికున్న ఆశగానీ, ప్రేమగానీ!”
‘వీడ్కోలుకి ముందు బహువచనం ఆతిథ్యం లాంటి’దని ఒకప్పుడు అతడన్న మాట గుర్తొచ్చింది.
”ఆ రెండూ కలగాలంటే కొత్తవూపిరి ఎంతో అవసరమని నా ఉద్దేశం! మనిద్దరి భావాలూ, వైఖరులూ వాస్తవంలో కలవ లేదని ఋజువైంది మూర్తిగారూ! మన అగ్రిమెం ట్‌లో నేను బాధ్యతాయుత మైన జీవితాన్ని కొనసాగిస్తాననే మాటిచ్చాను. పెళ్ళయ్యాక మొదలైన జీవితం ఓ వింతయుద్ధంలా నన్ను చిన్నాభిన్నం చేసింది. నాకంటూ నిర్మించుకున్న స్వేచ్ఛాజీవితం మీ చుట్టూ బంధించుకుపోయినట్లయ్యింది. దాని పై మీ నిర్ణయాధికారాలు, శాసించడాలు, అవమానించడం లాంటివి ఉచ్చుని బిగించినట్లుగా ఉండి- ఓ స్త్రీగా నా మనసు స్పందించ గలిగే సున్నిత ధోరణి మీ నుంచి అందకపోవడం వల్ల ఈ జీవితం నాది కాదనీ, నేను చెయ్యాల్సినవి చాలా ఉన్నాయిగానీ అవి ఈ జీవితం లో నేను పూర్తిచేయలేననీ అర్థమైంది. అందుకే ఈ జీవితం నాకు వద్దనిపిస్తోంది. ఇంతటి ప్రమాదం వల్ల నష్టం కలిగేది నా ఒక్కదానికే కాదు. మీకూ, నాకూ- ముఖ్యంగా… మన ఇద్దరి పిల్లల జీవితాలకీనూ!
నాకిప్పుడు నా బిడ్డలు ముఖ్యం. వారి భవిష్యత్‌ని వారి కనుగుణంగా తీర్చిదిద్దా లనుకుంటున్నాను. దీనికి మీ నుంచి వేరుపడడమే సరైన మార్గమన్పిస్తోంది నాకు.
నా బిడ్డలు ప్రశాంత వాతావరణంలో పెరగాలి. ప్రపంచానికి దూరం, భారం కాకుండా వారికి వారే అద్భుత సామరస్యం సృష్టించుకోవాలన్న ఆశయంతోనైనా నేను ఒంటరిని కావాలనుకుంటున్నాను. నాలో పేరుకుపోయే ఆశలు, ఆశయాలు, సేవా దృక్పథాలు లాంటివన్నీ మీతో ఉంటే అవి నా సోమరితనాన్ని పెంచుతాయే తప్ప- ఆచరణలోకి పనికిరావనుకుంటున్నాను. ఏది ఏమైనా నేను నా జీవితంలో ఓడిపోయాను. అదీ… నా సొంతం, నా స్వర్గం, నా ప్రాణం కావాలని కలలు గన్న ‘నా భర్త’ అనే పాత్ర దగ్గర!!
తొలిసారి… ఒక్కసారి… చివరిసారి… ఇంకా తొంభై తొమ్మిదిసార్లు గెలవడానికి ప్రయత్నిస్తాను- నా బిడ్డల్ని శిక్షతోనైనా, శిక్షణతోనైనా సమర్ధవంతంగా, ఉపయుక్తంగా, పాజిటివ్ దృక్పథంలో పెంచేందుకు! ఈ అవకాశం వల్ల నేనేమిటో నాకు తెలిసే వీలు కలుగవచ్చు.
భావాల్లో వైరుధ్యమో, అవగాహనలో లోపమో, అభిప్రాయాల్లో భేదాలో… కారణం ఏదైనా కానీ- మనిద్దరి జీవితాలు ప్రేమతో ముడిపడిలేవు. అంతర్గతంగా మీలో ఎంత గాఢమైన ప్రేమ ఉందో, లేదో నాకు తెలీదు. నా మూలంగా దాన్ని రూపుమాపుకోవడం ఎందుకు? అందుకు అర్హురాలైన, అదృష్టవంతురాలైన అమ్మాయిని ఎవరినైనా ఆహ్వానించండి. అడ్డు చెప్పడానికే కాదు… అసలు అడ్డుగా కూడా నేనుండనని మాటిస్తు న్నాను. అసందర్భంగా విడిపోవాలనుకునే మీ నిర్ణయాన్ని విమర్శించే హక్కు గానీ, చనువు గానీ నాకు లేవు. నేను మీ నుంచి బలవంతంగా, అయిష్టంగా, జాలిపూర్వకంగా విడిపోవాలనుకోవడం లేదు. నా ఇష్టపూర్వకంగానే, నా బిడ్డల శ్రేయస్సు కోసమే వెళ్లిపోతున్నాను. ఆపై మీకూ, నాకూ ఏ సంబంధమూ లేదు… ఉండదు కూడా!”
నా తరపున చెప్పుకున్న వివరణ అతనిలో ఎలాంటి భావాల్ని రేకెత్తించిందో తెలీదు.
అతనేమీ మాట్లాడలేదు.
*****
కృష్ణజయంతి తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసారు. రచనలు అన్ని ప్రముఖ దిన-వార-పక్ష-మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. రేడియో, దూరదర్శన్ లలో ప్రసారమయ్యాయి. ఎన్నో రచనలకు బహుమతులు వచ్చాయి. తెలుగుసాహిత్యంలో ఎం.ఏ. చదివిన ‘ఎస్వీ. కృష్ణజయంతి’ కథల పై పరిశోధనకు గాను ‘ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం’ నుంచి ఓ విద్యార్థిని ‘ఎం.ఫిల్.’ పట్టా పొందింది. సాహిత్యంలో ‘భారతప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ
వారి ఫెలోషిప్ పొందిన తొలి తెలుగు రచయిత్రి’గా ఖ్యాతి గడించిన ‘కృష్ణజయంతి’ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్ (ఇన్సా)’కి రెండు తెలుగు రాష్ట్రాల తరపున ‘సమన్వయకర్త’గా వ్యవహరిస్తున్నారు. ఈవిడ పలు జాతీయ, అంతర్జాతీయ సాహితీ సదస్సులలో పాల్గొన్నారు.
కథలో బాధ్యత అనే పదం దేని గురించి ?
పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న ఒక స్త్రీ అంతరంగాన్ని చూపారు కథలో. సహజంగా స్త్రీ పురుషుల అవసరాలు, ఆలోచనలు, కోరికలు వేరుగా ఉంటాయి.
బాధ్యత….. దేని గురించి? నాకు పూర్తిగా అర్థం కాలేదు.
ఈకథ కౌముది పత్రిక, జనవరి ’24 సంచికలో ఇంతకుముందే ప్రచురించబడింది.