బతుకు చిత్రం-37
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత
***
బిక్కుబిక్కుమంటూ చూస్తున్న వారి వద్దకు దేవతక్క వచ్చింది.
జాజులమ్మ, ఈర్లచ్చిమి ఇద్దరూ కంగారుగా ఆమెను చేరారు .
వీరి ఆత్రాన్ని గమనించిన దేవతక్క చెప్పడం మొదలు పెట్టింది.
కమల చాలా ప్రమాదకర పరిస్థితులలో ఉంది. డాక్టర్ గారు ప్రయత్నిస్తున్నారుగాని ఫలితం కనిపించడం లేదు. మీరు ఏది జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్తుంటే ప్రాణం లేని బొమ్మల్లా చూస్తున్దిపోయారు.
సిస్టర్ డాక్టర్ గారు పిలుస్తున్నారని వేరొక సిస్టర్ పిలవడంతో దేవత వెళ్ళిపోయింది.
ఈర్లచ్చిమి ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను వేరొక డాక్టర్ వచ్చి చూశాడు. ఆమె ఆదుర్దా పడకుండా చూసుకొమ్మని చెప్పాడు.
జాజులమ్మకు ఎటూ పాలు పోవడం లేదు. అత్త, కమల ఇంటి దగ్గర పిల్లలు అందరూ గుర్తుకు రాగానే మనసంతా చిలికి నట్టుగా అయిపోయింది.
దేవత మళ్ళీ వచ్చింది. వచ్చీ రాగానే చేతులు పట్టుకొని కమల ….కమల …
చెప్పక్క కమలకు ఎలా ఉంది ?
కమల చనిపోయింది. అన్నది కన్నీళ్ళతో .
అక్కా …అక్కా !ఏంది ?నువ్వు చెప్పేది ?కమల …కమల ..సచ్చిపోయిందా ?నేను నమ్మను. మీరు సక్కగ చూసిండ్రా ? లేదా ? నిన్న రాత్తిరి దాకా లేడి పిల్లోలె హుషారుగా గేన్తుతున్నాట్టున్న కమల్ …కమల …జీవిడ్సిందా ? ఓరి ! భగవంతుడా! ఇదెక్కడి అన్నాలం? రేపో మాపో పిల్లో, పిలగాడో పుడుతడని కొండకు ఎదురుసూసినట్టు ఎదురు సూత్తాంటే ఇప్పుడీ సావు రాసినవెందయ్యా ? అని …ఏమి మాట్లాడుతుందో కూడా తెలియని పిచ్చి తనంతో శోకనం మొదలుపెట్టింది.
ఆమె ఏడుపు విని దూరంగా ఉన్న జనాలు, రాజయ్య, సయిదులు ఒక్కసారిగా అక్కడ చేరారు.
సైదులును పట్టుకొని జాజులమ్మ కమల …కమల …సచ్చిపోయిందటయ్యా !కండ్లల్ల వెట్టుకొని సూసుకుంటే కను దిష్టీ తలిగినట్టయి మనిషి మాయమయిందయ్యో !అని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.
సయిదులుకు, రాజయ్య కూడా పట్టరాని దుఃఖం ఏడవసాగారు.
ఏడుపు,పెడబోబ్బలకు ఆసుపత్రి అంతా గందరగోళంగా తయారవుతుండగా ..
దేవతక్క జాజులమ్మ ఎంత చెప్పినా వినక పోవడంతో గట్టిగా మందలించింది. జరుగవలసిన కార్యక్రమాలు చూడమని చెప్పి అంబులెన్స్ లో కమలను ఇంటికి తీసుకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసింది.
స్పృహలోకచ్చిన ఈర్లచ్చిమి విషయం తెలిసి గుండెలు బాదుకుంది. ఒక అమాయకురాలి నిండు పాణం బాలి తీసుకున్నట్టయిందని, ఈ పాపం తమదేనని కుమిలి పోసాగింది.
తీరని ఆవేదనతోనే కమలను ఇల్లు చేర్చారు.
ఊహించని ఈ సంఘటనకు అందరూ విస్తు పోతూ ఊరంతా వచ్చి గుముగూడింది. రాజయ్య, సైదులు ఏమీ తోచక బొమ్మలా చూస్తుండడంతో ఈర్లచ్చిమి తెలిసిన వారి సాయంతో బల్ల తెప్పించి వేసి కమలను పడుకోబెట్టింది.
పిల్లలు ఏమయిందో తెలియక తలా ఒకరి దగ్గర చేరి చూస్తుండి పోయారు.
కట్టలు తెంచుకొని వస్తున్న కన్నీటిని ఆపే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది. శూక సంద్రంలా ఇటు జనంతోనూ అటు ఎడుపుతోనూ దద్దరిల్లసాగింది.
పొగలా కమల చనిపోయిన వార్త చుట్టుపక్కల ఊర్లకు కూడా చేరింది. జాజులమ్మ కు, కమలకు తెలిసినవారు అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు.
అందరిలోనూ ఒకటే ప్రశ్న? ఎంతో ఆరోగ్యంగా తిరిగిన కమల ఇలా ఎలా చనిపో యింది? అని.
జాజులమ్మ ఎవరి చూపు తగిలిందో, ఎవరు ఏ మందు పెట్టారో …అంటూ శాపనా ర్థాలు పెడుతూ ఎడుస్తుండడంతో ఈర్లచ్చీమి వారించింది.
ఎవరికి ఎంత వరకు బాకో గంతవరకే మెతుకు గంతవరకే బతుకు అని అనుకో సాగారు.
సత్తెమ్మ కూడా వచ్చింది. కానీ, దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడసాగింది.
జాజులమ్మ సత్తేమ్మను చూసి తనే లేచి వెళ్ళి మీదపడి ఏడుస్తుండగా సత్తెమ్మకు లోలోన చాలా భయం వేయసాగింది. అందుకే తానూ ఎడుస్తున్నట్టుగా నిలబడిపోయింది.
ఇలా సాయంత్రం వరకూ గడిచి ఊరి వాళ్ళు సాయం చేయగా కమల కార్యక్రమాలు పూర్తి చేశారు.
***
ఆ రాత్రికి ఎవరో అన్నం వండుకు వచ్చినా ఎవరికీ తినాలని అనిపించలేదు.
పిల్లలు కూడా అన్నం అడుగక చూస్తుండడంతో తెచ్చిన వారే బలవంతంగా పిల్లలకు తినిపించారు.
సైదులుకు, రాజయ్యకు తెలిసిన వారు మందు తెచ్చి మర్యాద చేయాలని చూసినా ఎవరూ ఇష్టపడలేదు.
ఈర్లచ్చిమి తానూ డాక్టర్ దగ్గర పనికి కుదరక పోయి, దగ్గరగా ఉండి చూసుకుంటే ఇట్లాగాకపోయి ఉండునా ? అని పరి పరి విధాలుగా అనుకోసాగింది.
రోజులు గడుస్తున్నాయి. ఎవరూ జరిగిన విషాదం నుండి తేలుకోపోతున్నారు. కమల వస్తువులు, మందులు, వాడగా మిగిలిన మందులూ తీసేయలేక పోతున్నారు.
జాజులమ్మ ఆ రోజు నుండే పనిలోకి పోవడం మొదలు పెట్టింది.
తలా ఒకమాట అంటున్నా అడుగుతున్నా మౌనంగా తన పని చేసుకోసాగింది.
సయిదులు కూడా అంతే. భారంగా గడుస్తున్నట్టుగా అనిపిస్తున్నది.
జాజులమ్మలో తను ఎంత ఇష్టపడి ఈ పెళ్ళి చేసింది? ఎన్ని రకాలుగా మేలుకోరి చేసింది? మాటి మాటికి గుర్తుకు రాగా స్థిమితంగా ఉండలేక పోతున్నది.
ఆ రోజునే పిడుగు లాంటి వార్త తోటి వారి ద్వారా విన్నది.
అది ..సత్తేమ్మకు దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా నేను గాదు, నాకేం దెల్వదు అని కలవరిస్తున్నట్టుగా చెప్పారు. తిండి కూడా మానేసి ఎప్పుడూ ఒక్కతే చీకట్లో కూర్చుంటు న్నదని చెప్పారు.
జాజులమ్మకు ఆత్రం పెరిగింది. తనను చూడాలని. తను గూడా కమల చనిపోయి ననాడు వచ్చి తప్ప ఈ మధ్యలో మొహమాటానికయినా రాకపోవడం, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని, తనకు ఏమయిందోనని కనుక్కోవాలని.
ఆ సాయంత్రం పని నుండి తిరిగి వచ్చేటప్ప్పుడు వెళ్తుండగా తోటి వారు వారించారు.
జాజీ ! నీ ఇంట్లనే సరిగ లేదు. పిల్లలున్నరు. ఈ సాయంత్రం పూట దానింటికి పోయి మల్ల ఆపతి తెచ్చుకునుడు అవసరమా? అనడంతో ఆగిపోయింది.
ఈర్లచ్చిమికి విషయం చెప్పింది. తను కూడా విస్తుపోయింది. తను గూడా వస్తానన్నది.
***
ఇద్దరూ కలిసి సత్తెమ్మ ఇంటికి వెళ్ళారు.
సత్తెమ్మ వీరిని చూడగానే భయపడింది.
ఇద్దరూ ఆమెను అనునయిస్తూ మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ సత్తెమ్మ తప్పు చేసినదానిలా దూరం జరిగింది.
ఎంత సమయం గడిచినా మార్పులేక పోవడంతో వెనుదిరిగారు.
ఇంటికి వస్తుండగా దారిలో మంగమ్మ ఎదురయింది. ఆమె సత్తెమ్మ ఇంటి వెనకాల ఉంటుంది.
అత్తా ! కమల ఎంత పాపం చేసేగదనే? మీకు ? నేను ఆ యాళ్ళ లేకుంటి. అన్నది .
అవునా ! అని ముందుకు నడుస్తుండగా, మల్ల తనే ,
ఔ గని, సత్తి ఇంటికి ఎందుకచ్చినట్టు ?
ఒక్కూరు వాళ్ళు గదా !అక్కా ! అన్నది జాజులమ్మ.
అదిగాదు శేల్లె !అని అటీటు చూసి .గుస గుసగా, సత్తితోని గలిసి ఎటో పోయివచ్చిం ది. పోద్దుగూకినన్క సుత అచ్చిపోయింది.
అప్పుడు పోతనంటే అత్తే తోలింది.
మరి వీళ్ళింట్ల ఎందుకు తిన్నట్టు?
తినడం ఏమిటి ?
ఔ ..!చెల్లె !ఈన్నె తిన్నదట !
మేము ఎవరం లేకుంటే అలా చేసిందా ? అనుకోని ఒక్కతే ఉండి ఇటు అచ్చి తిని పోయిందేమో !
కాదు ..కాదు ..తను కావాలనే ఈడ తిన్నదట. నాకు సత్తే చెప్పింది.
ఈర్లచ్చిమికి ఆసక్తిగా అనిపించింది. తమతో పాటు తమ ఇంటికి రమ్మని తీసు కెళ్ళింది.
సత్తేమ్మతో కలిసి కమల పసరు మందుకు వెళ్ళినది, దానికి పథ్యంగా మూడు రోజులు వెల్లుల్లి కారం తినడం అన్నీ చెప్పింది .
నీకెలా తెలుసు ?
గిట్నే ఓ పగటీలి కమల బాటల కలిత్తే ఏటచ్చినవని అడిగిన కని, చెప్పలే !కని మాట్లాడంగా వెల్లుల్లి వాసన రావట్టింది. ఇదేందో తేడా గున్నదని మల్లో రోజు నేనే సాటు గా జూసిన. ఆళ్ళ మాటలు ఇన్న. మగ పిలగాడు పుట్టాల్నని సత్తి పక్కూరుకు తొలక పొయ్యి మందు దాగిచ్చిందని తెలుసుకొని బాధపడ్డా, అప్పుడే నాకు అందరికి అది ఇమడదని దీని పరిస్థితి ఎట్లుంటదోనని అనుమానపడ్డా. అనుకున్నట్టె ఘోరం జరిగింది అని చెప్పి మల్ల నా మీద పోనియ్యకున్డ్రి అత్తా ! అని వెళ్ళిపోయింది.
జాజులమ్మ, ఈర్లచ్చిమి కమల ఎలా చనిపోయిందో తెలిసిన తరువాత , మగపిల గాడే కావాలని తను చేసిన పని తెలిసి తల్లడిల్లిపోయారు.
కమల అమాయకత్వం ఆమె ప్రాణాన్నే బలి తీసుకున్నదని తెలిసి మరింత బాధ పడ్డారు.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.