మగువ జీవితం

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– దయా నందన్

ఏ పనీ లేకుండా
ఏ పనీ చేయకుండా
కాసేపైనా కళ్ళు మూసుకుని
సేదతీరగ ఆశ చిగురించెను మదిలోన…!
 
కానీ
కాలమాగునా?
కనికరించునా?
 
నీకు ఆ హక్కు లేదని వంట గదిలోని ప్రెషర్ కుక్కర్ పెట్టే కేక,
నేలనున్న మట్టి కనిపించట్లేదటే అని మూలనున్న చీపురు పరక,
విప్పి పారేసిన బట్టల కుప్ప మా సంగతేమిటని చిలిపి అలక,
ఉదయం తిని వొదిలేసిన పళ్ళాలు మధ్యాహ్నం లేపమని చెప్పి పెట్టే గురక,
ఈ రోజు వంట వారానికి తగ్గట్టా లేక వాతావరణానికి తగ్గాట్టా అని
కూరగాయల తికమక!
 
ఇల్లంతా శుభ్రం చేసి కాసేపైనా సేద తీరుదామంటే…
బుజ్జిగాడి బడి గంట, ఆయన గారి బండి గంట
ఆశ విరమించుకోమని వెకిలి నవ్వుల పకపక!
 
ఇంతలో
 
ఒసేయ్ కోడలు పిల్లా మమల్ని పట్టించుకునే ఉద్దేశ్యం లేదా నీకిక?
 
హ్హా………..!
కాలమాగదు
కనికరించదు
మగువ జీవితంలో
సూర్యుడు అస్తమించడు…!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.