మిట్ట మధ్యాహ్నపు మరణం- 29

– గౌరీ కృపానందన్

          ఆ గదినిండా సిగరెట్ పొగ వ్యాపించింది. డి.సి. ప్రభాకరం, రాకేష్ ముఖంలో మారే భావాలను పరిశీలనగా చూస్తున్నారు. రాకేష్ టేబిల్ మీద ఉంచిన ఆ వస్తువుల వైపు ఆశ్చర్యంగా చూశాడు.

          “నా గదిలో దొరికాయా?”

          “అవును.”

          “వీటిని ఎవరు అక్కడ పెట్టారు?’

          “మేమూ అదే అడుగుతున్నాము.”

          “నాకు తెలియదు.”

          “మిస్టర్ రాకేష్! ఆడిన అబద్దాలు ఇక చాలు. నిజాయితీగా చెప్పండి. మీరు నిజం చెప్పేదాకా మేము వెయిట్ చేస్తాం.”

          “నిజం అదే. నాకు తెలియదు. ఎవరో నేను లేనప్పుడు వీటిని అక్కడ పెట్టి ఉంటారు. ఇవి అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు.”

          “ఈ కత్తి?’

          “ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు.”

          “మళ్ళీ మొదటి నుంచి అడుగుతాను. సంఘటన జరిగిన మొదటి రోజు సాయంత్రం ఐదు గంటలకి మీరు ఎక్కడికి వెళ్ళారు?”

          “ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకోనివ్వండి. ఆ.. గుర్తుకు వచ్చింది. ఆ రోజు సాయంత్రం కబ్బన్ పార్కుకు వెళ్ళాను.”

          “ఎందుకు?’

          “ఉమను చూస్తూ ఉండడానికి.”

          “ఎందుకు ఆమెను చూస్తూ ఉండడం? అందులోనూ పెళ్ళి అయిన అమ్మాయిని.”

          “ముందే చెప్పానుగా. మీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పను? మై గాడ్! మూర్తిని నేనే హత్య చేసానని అంటున్నారు.”

          “దట్ ఈస్ ది ఐడియా.”

          “అబ్సర్డ్!”

          “పార్కుకు వెళ్ళి వాళ్ళను వెంబడించడంలో మీ ఉద్దేశ్యం?”

          “ఉమను…. ఎలా చెప్పను? ఆమెకీ మా అమ్మకీ చాలా పోలికలు ఉన్నాయి.”

          “ఆల్ రైట్! మీ అమ్మగారికీ ఉమకీ పోలికలు ఉన్నాయి. ఉంటే?”

          “ఆమె గురించి నాకు కాస్తబెంగగా అనిపించింది. తను ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండాలని….”

          మాధవరావు, డి.సి. ని చూసి పెద్దగా నిట్టూర్పు విడిచారు.

          “రాకేష్! మీరు చెప్పే విషయాన్ని కాస్త మా దృక్పథం నుంచి ఆలోచించి చూడండి. కొత్తగా పెళ్ళయిన అమ్మాయిని వెంటాడానని చెప్పారు. మరునాడు ఆమె భర్త చని పోవడానికి పది నిమిషాల ముందు అతన్ని కలిసి, మీ భార్య రత్నం లాంటిదని చెప్పి వచ్చేసానని అన్నారు. అతన్ని హత్య చేసిన ఆయుధం, రక్తపు మరకలు ఉన్న షర్ట్ మీ ఇంట్లో గదిలో ఎలా వచ్చాయని అడిగితే, నాకు తెలియదు. ఎవరో పెట్టి ఉంటారని అంటున్నారు.”

          “కం ఆన్ . మీకు ఇంకో చాన్స్ ఇస్తాను. జరిగింది జరిగినట్లు చెప్పండి.”

          “జరిగింది అదే సార్. మీరు ఎన్ని సార్లు అడిగినా, ఎంత సేపు అడిగినా జరిగింది అదే. అవి నా గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. నేను మూర్తిని హత్య చెయ్య లేదు.”

          “మళ్ళీ అబద్దాలేనా? రాస్కల్! పోలీసులంటే పిచ్చి సన్నాసులనుకున్నావా?”

          “జరిగింది అదే సారీ.”

          ఇంకో సిగరెట్టు వెలిగించుకున్నాడు. అతని చేతులు సన్నగా కంపించడం మాధవరావు దృష్టి నుంచి తప్పించుకోలేదు. ప్రభాకరం అతని దగ్గరగా వెళ్ళి అతని కళ్ళలోకి లోతుగా చూశారు. దెబ్బతిన్న పక్షిలా అతని కళ్ళు ఆయన్నిభయంగా చూశాయి.

          “నాకేమీ తెలియదు సార్.”

          “నువ్వు జెంటిల్ మాన్ కదా. మాయా అంటే ఏమిటి?”

          “తెలియదు.”

          “మల్లీశ్వరం యూత్ అసోసియేషన్ కోసం క్రికెట్ ఆడావు కదా.”

          “ఆడాను.”

          “వాళ్ళు ఒక టీ షర్ట్ ఇచ్చారా?”

          “ఇచ్చారు.”

          “దాన్ని ఎప్పుడైనా వేసుకున్నావా?”

          “వేసుకున్నాను. మొదటి రోజు సాయంత్రం పార్కుకి వెళ్ళేటప్పుడు కూడా వేసు కున్నట్లు జ్ఞాపకం.”

          “అలాగైతే మాయా అంటే ఏమిటో  తెలుసుగా?”

          “నేనేం వ్రాసుకోలేదు. టీ షర్ట్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు. దాన్ని వేసుకున్నాను. అంతే.”

          “ఇదిగో చూడు రాకేష్. నిన్ను అరగంట సేపు వంటరిగా వదిలేసి వెళ్ళిపోతాం. తరువాత వస్తాం. ఆలోగా బాగా ఆలోచించుకో. నిజం ఎప్పుడు దాగదు. నిజం చెప్పావంటే అన్ని సందేహాలు తొలిగిపోతాయి. మూర్తిని ఎందుకు హత్య చేసావన్నది మాత్రం చెప్పు.”

          “నేను హత్య చెయ్యలేదు. చెయ్యలేదు. నేను హత్య చెయ్య లేదు.“ రాకేష్ టేబిల్ మీద తల ఆనించి ఏడవసాగాడు.

          “మాధవరావు! వెళదాం పదండి” అన్నారు డి.సి. ప్రభాకరం.“అందరూ బైటికి రండి. క్లియర్దిస్ ప్లేస్.”

          అతను సన్న గొంతుతో ఏడుస్తూ ఉండగానే అందరూ గది బైటికి వచ్చేసారు.

          “మొండివాడు! రెండు తగిలిస్తే చెప్పేస్తాడు.”

          డి.సి. సాలోచనగా చూస్తూ కాస్సేపు మౌనంగా ఉండి పోయారు.

          “మాధవరావ్! ఆ కత్తి మీద ప్రింట్స్ దొరికాయని అన్నారుగా. ఇతని ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూశారా?”

          “ఇతని ప్రింట్స్ ఇంకా తీయలేదు సార్.”

          “ఇతని ఫింగర్ ప్రింట్స్ తీసి మ్యాచ్ చేసి చూడండి. ఇంత వరకు ఈ హత్యతో ఇతన్ని కనెక్ట్ చేసేటట్లు డైరక్ట్ ఎవిడెన్స్ ఏదీ లేదు. హోటల్లో ఆ రోజు బసచేశాడు. అంతే.”

          “సార్! ఆ కత్తి, డ్రస్సు అన్నీ ఎలా అతని గదిలోకి వచ్చాయి?”

          “తనకి తెలియదంటున్నాడు. తెలుసు అని నిరూపించ వలసిన బాధ్యత మనది. ఆ యింటి నౌకరును పిలిపించండి. అతడిని ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రిజనర్స్ ఆక్ట్ ప్రకారం ప్రింట్స్ తీసుకోవచ్చు. కన్ఫర్మ్ అయిందంటే ఇతన్ని తీవ్రంగా ట్రీట్ చేయ వచ్చు.”

          “తెలివిగా అబద్దాలు ఆడుతున్నాడు సార్.”

          “ఆల్ రైట్! అలాగే అనుకుందాం. కానీ, మిగిలిన విషయాలలో దేంట్లోనూ అబద్దం చెప్పలేదు. తానే ముందుకు వచ్చి మూర్తి గదిలోకి వెళ్ళినట్లు ఒప్పుకున్నాడు. పార్కులో వెంబడించినట్లు చెబుతున్నాడు.”

          “కానీ అసలు విషయంలో మాత్రం నిజం చెప్పడం లేదు.”

          “అదీ తేల్చేసుకుందాం. మీరు ప్రింట్స్ సంగతి చూడండి. నాకు రాత్రి కబురు చెయ్యండి. ఆ ఇంటి నౌకరును రమ్మని చెప్పండి. ఆ అమ్మాయి ఎక్కడ?”

          “ఉమ చెన్నైలో ఉంది.”

          “ఆమెను వెంటనే రమ్మనండి. మూర్తి చనిపోయే ముందు వాళ్ళని వెంబడించాడు. ఏమైనా మాట్లాడాడో తెలుసుకోవాలి. ఈ కేసులో అనుమానితులు ఇంకా ఎవరెవరు ఉన్నారు?”

          “వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేశాం సార్.”

          “అందరిని మరోసారి ఎంక్వయిరీ చేసేద్దాం.”

          “సార్! ఇతను హంతకుడు కాకపోవచ్చని అనుకుంటున్నారా?”

          “ఇతనే కావచ్చు. కాక పోవచ్చు. కేసు ఇప్పుడు ఉన్న స్థితిలో నిర్ధారణగా చెప్పలేము. వీలైనంత త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. అందరినీ పిలిపించండి. అంతకు ముందు…”

          “చెప్పారుగా, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చూడమని.” నిరాసక్తిగా అన్నారు మాధవరావు.

          డి.సి. మళ్ళీ రాకేష్ ఉన్న గదిలోకి వెళ్ళారు. “మిస్టర్ రాకేష్! కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా?”

          “వద్దు సార్. మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. నన్ను చూడండి. నా కళ్ళల్లోకి చూడండి. నేను… నేను… ఈ హత్య చేసి ఉంటానని అనుకుంటున్నారా? మీకు చాలా అనుభవం ఉంది. నన్ను చూసి చెప్పండి. నేను ఈ హత్యను చేసి ఉంటానా?”

          డి.సి. అతని ముఖంలో కనబడ్డ భయాన్ని, చేతిని చూశారు. ఆలోచించారు. “ఆల్ రైట్ రాకేష్. విల్యు టేక్ ఎ పాలీగ్రాఫ్ టెస్ట్?”

          “ఏ టెస్ట్ అయినా తీసుకుంటాను సార్.”

          “మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలంటే ఇస్తారా?”

          “తప్పకుండా. ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి.”

          “నిజంగానే అంటున్నారా?”

          “నేను ఈ హత్య చేయలేదు అలాంటప్పుడు నా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి ఎందుకు భయపడాలి?”

          “వాటినే మీకు ఎదురుగా ఎవిడెన్స్ గా ఉపయోగించుకుంటే.”

          “ఫరవాలేదు. మీరు నిజాన్ని తెలుసుకుంటే సరి,”

          “మాధవరావ్! పాడ్ తీసుకు రండి.”

          మాధవరావు ఆశ్చర్యంగా చూస్తూ ఆఫీసు రూములోకి వెళ్ళారు.

          “సార్! మీరు వెళ్ళే ముందు నిజం చెప్పమని చెప్పారు. మీ దగ్గర ఇంకా కొంచం చెప్పాలి. నేను ఉమకి మాయా అన్న పేరుతో ఒక ఉత్తరం వ్రాసాను. తరువాత ఆమె దగ్గర మూర్తి గత జీవితంలో మాయ అని ఒక మాజీ ప్రేమికురాలు ఉన్నట్లు కల్పించి చెప్పాను. ఆ విషయం మీతో చెప్పాలి.”

          “కాస్త వివరంగా చెప్పండి.”

          “ఉమను నేను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు కూడా అనుకుంటు న్నాను. ఆమెను చూసిన మొదటి క్షణం నుంచి ఈ కోరికను నా మనసులోనే దాచుకు న్నాను. నేను చేసిన ప్రతీ పనీ మీకు వినోదంగా అనిపించవచ్చు. దానికి కారణం ఆశ! అబ్సర్డ్ విత్ హర్. నా ఆలోచనలను ఆమె ఆక్రమించుకుంది. ఆమెను నీడలా వెంబడిం చిన కారణం కూడా అదే.”

          మాధవరావు తెచ్చిన ప్యాడ్ ముందు ఉంచారు. “మిస్టర్ రాకేష్! దీని మీద మీ పది వేళ్ళను ఒక్కసారి నొక్కి తీయండి” అన్నారు.

          కొంచం కూడా తడబడకుండా రాకేష్ ప్యాడ్ మీద చేతివెళ్ళను నొక్కి తీసాడు. సంబాషణ కొనసాగింది.

          “మా అమ్మని చిన్నతనంలోనే కోల్పోయాను. ఇదిగో చూడండి ఫోటో. ఈ ముఖానికి, ఉమకి పోలికలని చూడండి. నేను ఆమెను కోరుకున్నందుకు కారణం ఇదే. దానిని మీరు అర్థం చేసుకోవాలి. మూర్తిని నేను హత్య చేయలేదు. అతని మీద ఈర్ష్య కలిగిన మాట నిజమే. అతను చనిపోయిన విషయం తెలియగానే సంతోషపడ్డాను. భగవంతుడే నాకు ఈ అవకాశం కల్పించి ఇచ్చాడని సంతోషించాను. ఇదే నిజం.”

          “నిజం ఏమిటో మేము తెలుసుకుంటాం. మీరు దిగులు పడకండి. మాధవరావ్! ప్రింట్స్ తీసుకున్నారా?”

          మాధవరావు అతని వేళ్ళ రేఖలు తడి ఆరడానికి వెయిట్ చేస్తున్నారు.

          “కావాలంటే ఉమను అడిగి తెల్సుకోండి.”

          “తప్పకుండా అడుగుతాం. మాధవరావు ఇతన్ని కస్టడీలో ఉంచుకోండి. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు. నేను చెప్పానుగా. దాన్ని వెరిఫై చేయండి.”

          “ఇంకో రెండు గంటలలో తెలిసిపోతుంది సార్.”

          “నేనూ ఎదురు చూస్తుంటాను సార్.” రాకేష్ అన్నాడు

          డి.సి. అతని వైపు విచిత్రంగా చూశారు. ఇంత సహకారం ఇవ్వడం కొంచం విచిత్రంగా అనిపించింది. ఇదంతా నటన కాదు కదా.

          “రేపో ఎల్లుండో అందరినీ రమ్మనండి. ఎవరెవరు ఈ కేసుతో సంబందితులో అందరినీ. ఎంత మంది ఉంటారు?”

          “సార్! అదీ…”

          “నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వండి.”

          “నేను అనుమానించింది మణి, దివ్య, ఆ హోటల్ సర్వర్, రామకృష్ణ, ఒక స్టేజిలో ఉమను కూడా అనుమానించాను. ఆఖరున అన్నీ ఆలోచించి చూస్తే, నేరస్తుడు రాకేష్ అని నిరూపించబడడానికి అవకాశం.”

          “అందరినీ పిలిపించండి. ఇంకోసారి విచారణ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఈ రెండు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ విషయాన్ని మాత్రం నాకు తెలియ జేయండి.”

          “సరే సార్.” మాధవరావు గాఢంగా నిశ్వసించారు.

          “నిరాశ పడకండి. ఇంత వరకు మీరు కనిపెట్టినవన్నీ రిమార్కబిల్! కానీ ఇంకా రూఢీగా ఇతనే అని చెప్పడానికి ఈ వివరాలు చాలవు.”

          “ఖచ్చితంగా రాకేష్ నేరస్తుడు. నూటికి నూరు పాళ్ళు అతనే.”

          “త్వరలోనే తెలిసి పోతుంది. దిగులు పడకండి.”

***

          డిసి. మాధవరావు నుంచి కేసు డైరీని తీసుకుని దాన్ని మెల్లగా తిరగేసారు. మాధవ రావు చురుకుదనం, సూక్ష్మగ్రాహ్యత చూస్తూ ఉంటే ఆశ్చర్యం ఏర్పడింది. ఒక్కొక్కరినీ అడిగిన ప్రశ్నలు, వాళ్ళ జవాబులు, దాని పై తన అభిప్రాయాలు.

          మణి:  నేను ఆడిట్ కోసం వచ్చిందేమో నిజం. కాని, సంఘటన జరిగినప్పుడు నేను అక్కడ లేను, మీరు కావాలంటే కంపెనీలో అడిగి తెలుససుకోవచ్చు.

          సర్వర్: అయ్యయ్యో! నాకెవరూ సపోర్ట్ గా లేదు. బాస్కెట్ బాల్ ఆడితే ఇన్ని చిక్కులు వస్తాయా?

          దివ్య: మై గాడ్! అతని మీద కోపం, ఆవేశం నాకు ఉన్నాయి. అవకాశం దొరికితే అతన్ని చీల్చి చెండాడేదాన్ని. కాని, ఎవరో ముందే ఆ పని చేసేశారు.

          రామకృష్ణ: మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. సాయంత్రం వివరం తెలియ గానే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి చూశాను. సత్య ప్రమాణంగా ఈ హత్యకు, నాకూ ఎటు వంటి సంబంధం లేదు సారి.

          ఎన్ని ప్రశ్నలు? ఎన్ని జవాబులు.

          టెలిఫోన్ మోగింది.

          “సార్! మాధవరావు… లాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది.

          “చెప్పండి” అన్నారు కంగారు పడకుండా.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.