యాత్రాగీతం
అమెరికా నించి ఆస్ట్రేలియా
(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)
-డా||కె.గీత
భాగం-13
గ్రేట్ బారియర్ రీఫ్ టూరు (Great Barrier Reef Tour)
గ్రాండ్ కురండా టూరు నించి వచ్చిన సాయంత్రం హోటలు దాటి రోడ్డుకావలగా ఉన్న థాయ్ రెస్టారెంటుకి వెళ్ళి వెజ్ స్ప్రింగ్ రోల్స్, టోఫూ రోల్స్, హోల్ ఫిష్, ఫ్రైడ్ రైస్ తిన్నాం.
మా హోటల్ బెన్సన్ చుట్టుపక్కల చాలా రెస్టారెంట్లు నడిచి వెళ్ళగలిగే దూరంలో ఉండడం ఒక మంచి విషయం.
అంతే కాకుండా రెండు మూడు వీధులవతల ఉన్న నైట్ మార్కెట్ లో కూడా మంచి ఫుడ్ సెంటర్లు చాలా ఉన్నాయి. భోజనం చేసేక అలా నడిచి వద్దామని మేమిద్దరం నైట్ మార్కెట్ వరకు వెళ్ళేం.
అక్కడ చైనీస్ మసాజ్ సెంటర్లలో కాస్సేపు ఫుట్ మసాజ్ కి కూచున్నాం. అక్కడి క్కక్కడే కుర్చీలు వేసి, కాసిన్ని డేరాలు కట్టి మసాజ్ చేస్తున్నారు. పొద్దుట్నించి తిరిగి తిరిగి ఉన్నామేమో భలే రిలాక్స్డ్ గా అనిపించింది. ఐదునిమిషాలు వేన్నీళ్ళలో కాళ్ళు ముంచి తీసి, పదినిమిషాలు క్రీము రాసి పాదాల్ని చక్కగా పడతారు. 10 ని.ల మసాజ్ కి పది ఆస్ట్రేలియన్ డాలర్లు. నాకు మసాజ్ చేసిన అమ్మాయి జపాన్ నించి ఆస్ట్రేలియాకి వర్క్ అండ్ ట్రావెల్ వీసాలో వచ్చిందట. ఆస్ట్రేలియా వీసాల్లో ఈ వర్క్ అండ్ ట్రావెల్ వీసా ప్రత్యేకమైంది. పరిమిత నిబంధనలకు లోబడి నిర్ణీత సమయం వరకు ఈ వీసాతో ఆస్ట్రేలియాలో పనిచేసుకోవచ్చు. తనతో పాటూ అక్కడ జపనీయులు చాలా మంది ఇలాంటి వీసాతో ఇటు వంటి చోట్ల పనిచేస్తున్నారని చెప్పింది. జపాన్ లో చాలా తక్కువ జీతానికి పనిచేయాల్సి వస్తూ ఉందని, ఆ సంపాదన అక్కడ తినడానికి తప్ప ఎందుకూ సరిపోవడం లేదని వాపోయింది. ఇక్కడ సంపాదించిన డబ్బుల్లో ఇంటికి సగం పంపినా తనకి ఇక్కడ సుఖంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేసింది. మసాజ్ కి కాకుండా అమ్మాయికి విడిగా పది డాలర్ల టిప్పు ఇచ్చేసరికి ఎంతో సంతోషపడింది.
మర్నాడు ఉదయాన గ్రేట్ బారియర్ రీఫ్ టూరు (Great Barrier Reef Tour) కోసం పొద్దున్న తొమ్మిది గంటలకి సముద్రతీరంలో ఉన్న షిప్ యార్డుకి వెళ్ళాల్సి ఉండడంతో హోటలు నించి ఎనిమిదిన్నర ప్రాంతంలో నడక మొదలెట్టాం. ఈ టూరు కూడా ప్యాకేజీ టూరులో భాగమే. సరిగ్గా పది, పదిహేను నిమిషాల నడక అక్కణ్ణించి. మేమందరం నైట్ మార్కెట్ లో కొనుక్కున్న కాటన్ దుస్తులేసుకుని తయారయ్యేం.
మాకు ప్రతి టూరుకి ఆన్ లైనులో బార్ కోడ్ తో ఉన్న టిక్కెట్టు కన్ఫర్మేషన్ పంపారు. వాటిని కాగితంమ్మీద ప్రింట్ చేసి పట్టుకుని వెళ్ళాం. అయితే ప్రతిచోటా వాటిని చూసి మళ్ళీ కౌంటర్లలో వాళ్ళ టిక్కెట్లు వాళ్ళు ఇస్తూ వస్తున్నారు. ఇక్కడ కూడా కౌంటరులో అలాగే టిక్కెట్లు తీసుకున్నాం. అవి కాకుండా టూరులో ఉన్న స్నోర్కిలింగు ట్రైనింగ్, అండర్ వాటర్ వాకింగ్ యాక్టివిటీస్ ని విడిగా కొనుక్కున్నారు సత్య, వరు. అందుకోసం ఒక్కొక్కళ్ళకి మణికట్టు మీద తత్సంబంధిత గుర్తుని స్టాంపు కొట్టేరు. గ్లాస్ బోట్ రైడ్, సబ్ మెరీన్ రైడ్లు, స్నోర్కిలింగు వంటివి టూరులో భాగంగానే ఉంటాయి.
మూడంతస్తులుగా ఉన్న పెద్ద పడవ అది. బహుశా: రెండు వందల మంది వరకూ ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నారక్కడ. మేం మధ్య అంతస్తులో ఉన్న సోఫాల్లో కూర్చున్నాం.
పడవ కింది అంతస్తులో చిరుతిళ్ళు అమ్మే స్టాల్ (Snack bar) ఉంది. చిప్సుప్యాకెట్లు కూల్ డ్రింకులు వంటివి కొనుక్కోవచ్చు. మంచినీళ్ళు కావాలంటే కౌంటరు పక్కనే ఉన్న టాప్ లో పట్టుకోవచ్చు. మధ్యాహ్న భోజనం మాత్రం టిక్కెట్టులో భాగంగా వాళ్ళే పెడతారు. సిరి పడవ ఎక్కగానే చిప్సు తింటానని ఒకటే పేచీ మొదలెట్టి కొనే వరకూ ఊరుకోలేదు. భలే నవ్వొచ్చింది నాకు. చిన్నప్పుడు మేం కూడా మా అమ్మానాన్నల్ని ఇలాగే వేధించే వాళ్ళం.
పడవ బయలుదేరిన కాస్సేపట్లోనే అండర్ వాటర్ వాకింగ్ యాక్టివిటీకి ట్రైనింగ్ అని సత్య, వరులని పిలుచుకు వెళ్ళేరు.
చుట్టూ కనుచూపు మేర ఎక్కడ చూసినా లేత నీలిరంగు సముద్రం కనులవిందు చెయ్యసాగింది. సముద్రపు పచ్చదనం అని మాత్రమే పిలవగలిగిన అత్యంత సుందర మైన రంగు కలిగించే ఆహ్లాదం అది. ఆకాశం ఈ సముద్రంతో పోటీ పడి ఓడి పోతూ ఉన్నా తిరిగి ఆ ఒడిలోనే సేదతీరడానికన్నట్లు మేఘసందేశాన్ని పంపుతూ ఉంది. తన గర్భంలో పడగపు ద్వీపాల్ని గుంభనంగా దాచుకున్న సముద్రం సందర్శనకు వస్తున్న నౌకలకు సాదరంగా దారిస్తూ స్వాగతం పలుకుతూ ఉంది. దిగంతాలతో పోటీ పడుతూ ఆ ఆహ్లాద మైన దృశ్యంలో ఎంతోసేపు మైమరిచిపోయాను.
ఆస్ట్రేలియాలోని ఈ గ్రేట్ బారియర్ రీఫ్ ప్రప్రంచంలో కెల్లా పెద్దది. 2300 కి.మీ మేర 900 ద్వీపాల్లో విస్తరించి ఉండి నీటిలో మునిగి ఉన్న దాదాపు మూడువేల గుట్టల సమూహం. ఈ ప్రాంతపు సముద్రాన్ని “పగడపు సముద్రం” (Coral Sea) అంటారు. ఇది కూడా క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో భాగమే. భూ ఉపరితల కక్ష్యలో నుంచి కూడా ఈ అతి పెద్ద కోరల్ రీఫ్ (పగడపు దిబ్బ) ని చూడొచ్చట. ఈ రీఫ్ అంతా సముద్రంలోని సూక్ష్మ జీవులతో నిర్మితమై ఉండడం వల్ల భూమి మీద ప్రాణులచే నిర్మించబడిన నిర్మాణాల్లో ఉపరితల కక్ష్యలో నుంచి చూడగల నిర్మాణం ఇదొక్కటే. ఈ ప్రవాళాలు ఆక్సిజన్ ఎక్కువ గా కలిగిన పరిశుభ్రమైన నీటిలో జీవించే సూక్ష్మజీవులు. ప్రవాళపు మొలకలు భూగోళంలో 20°- 30 డిగ్రీల అక్షాంశాల మధ్య నున్న అయనరేఖా సముద్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. ఇవి సముద్రమట్టం నుండి 45 నుండి 50 మీటర్లు లోతున మాత్రమే పెరుగుతాయి. అలాగే సముద్ర ఉష్ణోగ్రత 20 డిగ్రీల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తాయి. ఆస్ట్రేలియాలోని ఉత్తర తూర్పు తీరం ఇందుకు అత్యంత అనువైనది.
1768లో లూయిస్ డి బౌగైన్‌విల్లే (Louis de Bougainville) అనుకోకుండా ఈ రీఫ్‌ను కనిపెట్టాడట. అయితే ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతాన్ని ఎందుకో తమదిగా ప్రకటించలేదు. 1770లో జేమ్స్ కుక్ నేతృత్వంలోని హెచ్‌ఎమ్ బార్క్ ఎండీవర్ నౌక గ్రేట్ బారియర్ రీఫ్ మీద ప్రయాణించడం వల్ల ఎంతో నష్టాన్ని చవిచూసింది. ఓడలోని సామాన్లని విసిరివేసి తేలిక పరచడం ద్వారా, అలాగే ఆటు పోటు సమయాల్ని గుర్తెరిగి నడపడం ద్వారా మొత్తానికి ఓడని రక్షించగలిగారట. అలా ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. 1791 హెచ్‌ఎమ్ఎస్ పండోరా (HMS Pandora) నౌక ఈ ప్రాంతంలో మునిగిపోయి 35 మందిని బలితీసుకుంది. ఈ ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో కెల్లా పెద్ద సంఘటన ఇదే. 1983లో క్వీన్స్‌ల్యాండ్ మ్యూజియం పండోరా నౌకాశిథిలాల కోసం అన్వేషణ చేసింది.
ఈ ప్రాంతంలో రీఫ్ లు అంతరించిపోకుండా గ్రేట్ బారియర్ రీఫ్ సముద్ర రక్షణ శాఖ కాపాడుతూ ఉంటుంది. అయినప్పటికీ వాతావరణ కాలుష్యం వల్ల, సముద్ర ఉష్టోగ్రతలో పెంపుదల వల్ల 1985 నించి ఇప్పటికి దాదాపు సగభాగం నాశనమైపోయిం దట.
స్థానిక ఆటవిక తెగల వారికి ఈ ప్రాంతం ఆరాధ్యనీయమైనది.
ఆధునిక కాలంలో టూరిజమే ప్రధానంగా ఈ ప్రాంతం విలసిల్లుతూ ఉంది.
*****
(సశేషం)