విజ్ఞానశాస్త్రంలో వనితలు-13

ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి మహిళా ప్రొఫెసర్ – డోరొతీ హిల్ (1907-1997)

– బ్రిస్బేన్ శారద

          నేను పని చేసే యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో మా బిల్డింగ్ పక్కనే డోరోతీ హిల్ ఇంజినీరింగ్ ఎండ్ సైన్సెస్ లైబ్రరీ (Dorothy Hill Engineering and Sciences Library) వుంటుంది. ఆసక్తితో డోరొతీ హిల్ గురించి వివరాలు సేకరించాను.

          వైజ్ఞానిక శాస్త్రాల్లో పని చేయడమంటే పరిశోధన పైన ఆసక్తి, ప్రశ్నలకు  సమాధానా లు తెలుసుకోవాలనే జిజ్ఞాసా, ప్రకృతి పైన ఆరాధనా భావం వుంటే చాలనుకుంటాం సాధారణంగా. కానీ, అవి చాలవు.

          చేస్తున్న పరిశోధనా ఫలితాలను ముందు తరాల వారికి అందించాలంటే, ఎంతో క్రమశిక్షణ, నిజం పట్ల నిబద్ధత కూడ అవసరం. క్రమశిక్షణ ఎందుకంటే- పరిశోధనా పద్ధతులనూ ఫలితాలనూ కూడ వివరంగా, సూక్ష్మమైన వివరాలతో సహా రికార్డు చేయ వలసి వుంటుంది. చేసేది ప్రయోగాలైతే ఈ వివరాలకెంతో ప్రాముఖ్యత వుంటుంది. ఏదైనా వివరాలు చెలరేగినప్పుడు శాస్త్రజ్ఞులు వ్రాసే ఈ ప్రయోగాల వివరాలు (తేదీలతో సహా) చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. వీటితో పాటు బోధన కూడా.    నిజమైన శాస్త్రజ్ఞుడంటే కేవలం పరిశోధనలూ, ప్రయోగాలే కాకుండా, బోధనకూ, క్రమశిక్షణకూ, చిన్న చిన్న వివరాల మీదా శ్రద్ధ చూపిస్తూ వుండాలన్నమాట.

          డోరోతీ హిల్ అటువంటి ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త. వీటన్నిటితో పాటు, తనతో పాటు పనిచేసే ఇతర టీం సభ్యుల పట్ల ఎంతో నమ్మకాన్నీ, గౌరవాన్నీ కలిగి వుండాలని గాఢంగా
విశ్వసించారామె. ఈనాటి పోటీ ప్రపంచంలో తమతో కలిసి పనిచేసే వారిని నమ్మడం తెలివి తక్కువతనంగా పరిగణించబడుతూ వుండడంతో, మనకిది నమ్మలేని విషయంగా కనిపించొచ్చు.

          ఆమెతో పనిచేసిన వారందరూ ఆమె తమ పై వుంచిన నమ్మకాన్నీ, ఏ పరిశోధనా ఫలితాన్నైనా, సిద్ధాంతాన్నైనా రహస్యంగా దాచుకోకుండా తమతో పంచుకోవడాన్నీ తలచుకుని గర్వంగా చెప్పుకున్నారు. పక్క మనిషిని అంత నిర్మలంగా నమ్మాలంటే
పరిశుద్ధమైన అంతరంగంతో పాటు ఎంతో కొంత అమాయకత్వం కూడా వుండాలి కాబోలు.

          భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన డోరొతీ హిల్ కేవలం శాస్త్ర పరిశోధనే కాదు, యూనివర్సిటీలో సైన్సు బోధన కొరకు కూడా ఎంతో కృషి చేసారు. మేము నివసించే బ్రిస్బేన్ నగరంలోనే ఆవిడ పుట్టి, పెరిగీ, పేలియాంటాలజీలో పరిశోధనలు చేసారు. శాస్త్ర పరిశోధనే కాదు,
పరిశోధనా విధానాలు కూడా చాలా ముఖ్యమని నమ్మారామె. అందుకే, శాస్త్రీయ పరిశో ధనా విధానాలను (Scientific methods) వీలైనంత గ్రంథస్థం చేసి, విద్యార్థులకు బోధించారు. ఈ పరిశోధనా విధానాలని అమలులో పెట్టాలంటే ఎంతో నమ్మకమైన జట్టు కూడగట్టు కోవాలన్నది ఆమె సిద్ధాంతం.

          డోరొతీ హిల్ 1907లో బ్రిస్బేన్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాబర్ట్ హిల్, తల్లి సారా హిల్. రాబర్ట్ ఒక పెద్ద దుకాణలో పనిచేసేవారు. తమ పూర్వీకులంతా ఇంగ్లండులోని రైతులు. వారి కుటుంబంలో ఎవరూ సైన్సు వైపు ఆకర్షితులైనట్టు దాఖలాలు లేవు.
1920 నుంచి 1924 వరకూ డోరొతీ బ్రిస్బేన్ గర్ల్స్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. అక్కడ లెక్కలూ రసాయన శాస్త్రమూ, జీవ శాస్త్రమూ చెప్పేవారు కానీ, ఫిజిక్సు చెప్పేవారు కాదు.
స్కూల్లో సైన్సు చదువు పై ఆసక్తి పెరిగినా, ఆమె ఇంగ్లీషులో, చరిత్రలో, ఆటల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. స్కూల్లో చదువుకుంటూనే ఆమె సైన్సు సబ్జక్టులు ఆడపిల్లలు తప్పక చదవొచ్చనే అభిప్రాయానికొచ్చారు. మెడిసిన్ చదివి ఏదైనా రీసెర్చి లేబోరేటొరీలో పని చేయాలని ఆశ పడ్డారు. అయితే ఆ రోజుల్లో యూనివర్సిటీ ఆఫ్
క్వీన్స్‌లాండ్‌లో వైద్య విద్య బోధించేవారు కాదు. దానికోసం సిడ్నీకో, మెల్బోర్న్‌కో వెళ్ళాల్సి వచ్చేది.

          ఏడుగురు సంతానంలో మూడవదైన డోరొతీని అంతంత దూరం పంపించి
చదివించే ఆర్థిక స్తోమతలేని కాలం. దానికి తోడు ఆమెకి యూనివర్సిటీ వారిచ్చే ఉపకార వేతనం కూడా దొరికింది. రసాయన శాస్త్రం చదవడానికి అక్కడే చేరిపోయారు డోరొతీ.
యూనివర్సిటీలో రసాయన శాస్త్రంతో పాటు ఇంకొక సబ్జక్టు కూడా చదవాలనే నిబంధన వుండేది. డోరొతీ భూగర్భ శాస్త్రాన్నెన్నుకున్నారు. 1928లో భూగర్భ శాస్త్రంలో బంగారు పతకం సాధించి ముగించారు. ఆమెకు ఈ భూగర్భ శాస్త్రం పైన ఆసక్తి పెరగటానికి రెండు కారణలు వున్నాయంటారు. ఒకటి ఆమె ప్రొఫెసర్ హెచ్.సీ. రిచర్‌డ్స్. రెండోది, ఆమెకు
పల్లెల్లో సంచరించడమంటే వున్న ఇష్టం. పుట్టింది మొదలు బ్రిస్బేన్ నగరంలోనే వున్న డోరొతీకి ఆస్ట్రేలియాలోని పల్లెలూ, రైతులూ, సముద్ర తీరాలూ, పగడాల దిబ్బలూ చాలా
ఆసక్తికరంగా ఇష్టంగా అనిపించేవి. భూగర్భ శాస్త్రం చదవడానికి బ్రిస్బేన్ నగరం చుట్టూ వున్న లోయల్లో గుర్రం పైన తిరిగారామె.

          యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి మహిళా విద్యార్థిని డోరొతీ. ఈ పతకంతో పాటు ఆమెకి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రంలో పీహెచ్‌డి చేయడానికి వేతనం కూడా ఇచ్చారు. ఒక పెద్ద అంతర్జాతీయ విశ్వ విద్యాలయంలో చదవడం తన ఆలోచనా పరిధినెంతో విస్తృతం చేసిందన్నారు డోరొతీ ఒక ఇంటర్వ్యూలో. అన్నిటికంటే ఆమెకి కేంబ్రిడ్జిలో నచ్చింది అక్కడి గ్రంథాలయం. అటు వంటి గ్రంథాలయాలుంటే ఎంతటి పరిశోధనైనా సాగించవచ్చు అనుకున్నారామె. భూగర్భంలో దొరికే శిలాజాలను భద్రపరిచే అక్కడి మ్యూజియంలూ, గ్రంథాలయాలూ
ఆమె పరిశోధనకెంతో ఉపయోగపడ్డాయి.

          కేంబ్రిడ్జిలో ఏడెనిమిదేళ్ళు గడిపిన తరవాత ఆస్ట్రేలియాకి తిరిగొచ్చేయాలను కున్నారు డోరొతీ. ఆస్ట్రేలియాను చుట్టుముట్టి వున్న సముద్రంలో ఎంతో జీవ వైవిధ్య ముంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా తూర్పు తీరల్లోని పగడపు దిబ్బలు (Coral Reef) అంద చందాలకే కాదు, జీవ జాలం గురిని పరిశోధన చేయాలనుకునేవారికి పెన్నిధి. అందుకే బ్రిస్బేన్ తిరిగి వొచ్చేయమని ఆమెని ప్రోత్సహించారు ఆమె తొలి గురువు రిచర్‌డ్స్. 1937లో ఆమె ఆస్ట్రేలియా తిరిగొచ్చారు. 

          1938 నుండి 1943 వరకూ ఆమె పగడాల దిబ్బలోని జీవ శిలాజాల గురించీ, జీవ వైవిధ్యం గురించీ, వాటి క్రబద్ధీకరణ గురించీ పుంఖానుపుంఖాలుగా పేపర్లు వ్రాసారు. అప్పటికే ఆమె ఈ విషయంలో ప్రపంచ ప్రఖ్యాతినార్జించారు. ప్రపంచమంతటినించీ
శాస్త్రజ్ఞులు ఆమెకి తమ శిలాజాలను పంపే వారట, పరిశీలన కోసం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె యూనివర్సిటీలో బోధనా, పరిశోధనా సాగిస్తూనే, ఆస్ట్రేలియా నావికదళం కోసం మరికొందరు స్త్రీలతో కలిసి పనిచేసారు. ఆ రోజుల్లో ఆమె వారానికి ఎనభై-తొంభై గంటల వరకూ పనిచేసేవారట. 1952లో డోరొతీ జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఆస్త్రేలియాకి అధ్యక్షురాలిగా నియమించబడ్డారు. 1971లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ ప్రొఫెసోరియల్ బోర్డ్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. 1972లో ఆమె యూనివర్సిటీ ఉద్యోగాన్నుంచి విరమణ తీసుకుని, కేవలం పరిశోధన పైనే దృష్టి
కేంద్రీకరించారు. అలా 1987 వరకూ పనిచేసారావిడ.

          యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ లైబ్రరీ అప్పట్లో చాలా దయనీయంగా వుండేదట. పరిశోధనల కోసం లైబ్రరీలు చాలా ముఖ్యమని గాఢంగా నమ్మిన డోరొతీ యూనివర్సిటి లైబ్రరీని పునరుద్ధరించారు. తన దగ్గర వున్న పుస్తకాలూ, పేపర్లూ, డబ్బూ కలిపి జియోలజీ లైబ్రరీ ప్రారంభించారావిడ. క్రమేణా ఆ లైబ్రరీని సైన్సూ, ఇంజినీరింగూ, అన్నిటికీ కలిపి ఒకే పెద్ద లైబ్రరీగా అవతరించింది. 1997 లో హిల్ మరణించారు. ఆమె అందుకున్న పురస్కారాలకూ, గౌరవ మర్యాదలకూ లెక్కే లేదు.

మచ్చుకు కొన్ని-
1971- ఆస్ట్రేలియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంటు (మొదటి మహిళ)
యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ చరిత్ర కారుడు అమెని ‘డెభ్బై అయిదేళ్ళ యూనివర్సిటీ చరిత్రలో డోరొతీ హిల్ కంటే అద్భుతమైన విద్యార్థుల్లేరు’,అన్నారు.

2002 నుంచీ ఆస్ట్రేలియన అకాడేమీ ఆఫ్ సైన్సెస్ ఆమె పేరిట ‘డోరొతీ హిల్ అవార్డు’ ని మహిళా భూగర్భ శాస్త్రజ్ఞులకందచేస్తుంది.

ఆమె పేరిట 2017లో క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఒక జిల్లా ఏర్పడింది. కోరల్ రీఫ్‌లోని చాలా రకాలైన పగడాలకు ఆమె పేరిచ్చారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.