అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 14

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విష్ణు, విశాల ఆస్ట్రేలియాలో స్థిరపడటానికి వచ్చారు. అక్కడ వాతావరణా న్ని, పరిసరాలను ఆకళింపు చేసుకుంటూ, నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న జంట. విశాలకు టేఫ్ కాలేజీలో ఒక నెల వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చేసే అవకాశం వచ్చింది. విష్ణు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కానీ వర్క్ కి కారు ఉండి తీరాలి. తాత్కాలికంగా
విష్ణుకి నైట్ షిఫ్ట్ జాబ్ ఇస్తానని కన్సల్టెంట్ చెప్పింది. విష్ణు ఆలోచనలో పడ్డాడు.

***

          జీవితమంటేనే చిక్కుల వలయం. ఆటుపోటులను ధీటుగా ఎదుర్కొంటూ, కర్తవ్యం గుర్తెరిగి ముందుకు సాగిపోయేవారే విజేతగా నిలుస్తారు. జీవితానికి సార్థకత చేకూర్చు కుంటారు. సమస్య వచ్చినపుడు, తీవ్రతను బట్టి ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం
వస్తుంది, ఎంచుకున్న దారి సరైనదా, కాదా అనేది స్పెక్యులేషనా?

          విష్ణు తను గతంలో ప్రొఫెసర్ ని స్ఫూర్తిగా తీసుకుని, పి.హెచ్.డి చేయటం కోసం వీసా అప్లై చేసాడు. ప్రతి ఐదేళ్ళకి దేశ స్థితి, గతులు మారిపోతూ ఉంటాయి. గతంలో ప్రభుత్వం స్థిర నివాసం కోసం వచ్చిన వారికి డోల్ పేమెంట్ ఇచ్చేవారు. కాని ఇపుడు భార్య, భర్త అయి ఉంటే సరిపోదు. వారికి పిల్లలు ఉంటేనే ఫామిలీ అసిస్టెన్స్ క్రింద సెంటర్ లింక్ ప్రభుత్వ కార్యాలయం నుంచి ప్రతి పదిహేను రోజులకి కాస్త డబ్బు అంద చేస్తారు. ఒకవేళ భార్య, భర్తల కంబైన్డ్ సేలరీ ఎక్కువ ఉంటే వారికి ఈ అవకాశం లేదు.

          విశాలకు టేఫ్ లో పని పూర్తి కాగానే విష్ణు కి ఫోన్ చేసింది. 

          “ నాకు వర్క్ ఫినిష్ అయింది. నేను బస్ స్టాప్ దగ్గిర ఉన్నాను” అంది విశాల.

          విశాల నువ్వు బ్లాక్ టౌన్ కి నేరుగా వచ్చేయ్. నేను కూడా అక్కడకు వచ్చేస్తున్నాను అన్నాడు విష్ణు.

          విశాల మొదటిసారి స్వతంత్రంగా తనంతట తాను ఆస్ట్రేలియాలో బస్ ఎక్కింది. దిగవలసిన చోటు చెప్పి టికెట్ తీసుకుంది. బస్ లో కండక్టర్ ఉండడు. డ్రైవర్ టికెట్ ఇచ్చాడు. స్కూల్ అపుడే వదలటం వల్ల పిల్లలు కేరింతలు, వాళ్ళ మాటలతో కాస్త బస్ లో రణగొణ ధ్వనిగా ఉంది. తను కిటికీ దగ్గర సీటు చూసుకుని కూర్చుంది. పిల్లల సంభాషణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. వాళ్ళ మాటలలో ఆస్ట్రేలియా స్లాంగ్ ఎక్కవ ఉండటం గమనించింది. 

          అబ్బాయి, అమ్మాయి భేదం లేకుండా చక్కగా కలివిడిగా మాట్లాడుకుంటున్నారు.
వాళ్ళ మాటలలో ఆవో, బార్బీ, బ్రెక్కీ ఇలాంటి పదాలు దొర్లాయి. ఆస్ట్రేలియన్  యాక్సెంట్, స్లాంగ్ అర్థం చేసుకోవడం కాస్త కష్టమే అనుకుంది విశాల.

          బస్ స్టాప్ రాగానే బస్ లో ప్రతి సీట్ దగ్గిర ఉన్న ఎర్ర బటన్ ముందుగానే నొక్కు తున్నారు. తరువాత బస్ నెక్స్ట్ స్టాపు లో ఆగుతోంది.

          విశాల బ్లాక్ టౌన్ బస్ స్టాప్ లో దిగగానే ఎదురుగుండా విష్ణు ఆమె కోసం  ఎదురుచూ స్తూ అక్కడ కనిపించగానే ఆమె మొహం విప్పారింది.

          ఇద్దరూ ప్రక్కనే ఉన్న మెక్ డొనాల్డ్ లో చెరో ఐస్ క్రీం కోన్ కొనుక్కుని అక్కడే కూర్చు ని తిన్నారు.

          “దిస్ ఈస్ ద చీపెస్ట్ ఐటెం హియర్, కాస్ట్స్ ఓన్లీ ఫిఫ్టీ సెంట్స్” అన్నాడు విష్ణు.

          “కానీ టేస్ట్ మాత్రం హిమ క్రీములాగనే వెనీలా సువాసనతో చాలా బాగుంది కదా! వేల్యూ ఫర్ మనీ!” అంది విశాల

          “విశాలా! చెప్పు నీ మొదటి రోజు వర్క్ ఎక్స్ పీరియన్స్ అనుభవం?” ఆసక్తిగా అడిగాడు విష్ణు.

          “మొదటి రోజు టేఫ్ కాలేజీలో చాలానే నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆఫీస్ ఎక్విప్ మెంట్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నాను. ఫోటో కాపీ, జిరాక్స్ తీయటం, డాక్యుమెంట్స్ స్కాన్ చేయటం, స్టూడెంట్ కార్డ్స్ లేమినేట్ చేయటం, ఓ ఫుల్ బిజీ. అసలు టైమ్ ఎలా గడిచిందో తెలియలేదు. కొంత మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు.

          ఇండియాలో ఈ పనులు అసలు మనం చేసుకోము. వెళ్ళి జిరాక్స్ షాప్ లో చేయిస్తాము. ఆఫీస్ లలో ప్యూన్ టీ తీసుకొస్తాడు. కాని ఇక్కడ కిచెన్ లో ఎవరి టీ వాళ్ళు కెటిల్ ఆన్ చేసి, టీ బాగ్ తో చేసుకుంటున్నారు” అంటూ కళ్ళు తిప్పుతూ విష్ణుకి చెప్పింది.

          “ఓ ఫర్వాలేదే! మొదటి రోజులోనే చాలానే అనుభవాన్ని గడించావు. పైగా రెండు దేశాలకి మధ్య వ్యత్యాసాలను కాచి వడబోయటం నేర్చుకున్నావు. మేధావివే!” అన్నాడు నవ్వుతూ విష్ణు.

          “ఇపుడిపుడే కొత్తగా మీతో జీవితంలోకి అడుగుపెట్టాను. ఉద్యోగపర్వంలో మొదటి రోజు నాకిది. అవును మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ విశేషాలేమిటి” అని అడిగింది.

          “ఇప్పుడు కాదు, ఇంటికెళ్ళాక మెల్లిగా చెపుతాను, చీకటి పడుతోంది పద ఇంక వెడదాం.” అన్నాడు విష్ణుసాయి.

          సడన్ గా అతను మౌనంగా ఉండటంతో విశాల ఏమీ మాట్లాడలేకపోయింది.

          కానీ విష్ణు మదిలో తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. అతను తన ఆలోచనలో తను ఉన్నాడు. ఏమీ చెప్పే పరిస్థితిలో లేడు.

          “ఇంటికి చేరుకోగానే అతను బెడ్ పై వాలిపోయి, నిద్రలోకి వెళ్ళిపోయాడు.

          విశాల కాస్త నిరాశకు గురైంది. అయినా వెంటనే తేరుకుని చకచకా అన్నం, పప్పు, బంగాళదుంప వేపుడు, చారు వండి అన్నీ సిద్ధం చేసింది.

          విశాలకు మనసులో దిగులు, బెంగ ఆవరించింది. ఒక్కసారి ఆలోచనలు అన్నీ
అమ్మ మీదకు మళ్ళాయి. ఇక్కడకు వచ్చాక, రెగ్యులర్ గా వచ్చే మెనుస్ట్రల్ పీరియడ్స్ ఇంకా రాలేదు. ఎవ్వరితో చెప్పాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ చేతిలోకి ఫోన్ తీసు కుంది.

          తనకు పరిచయమైన నందినికి ఫోన్ చేసింది. 

          “హలో నందిని! నేను విశాల, బాగున్నారా?”

          “హాయ్, విశాలా! నేను బాగున్నాను. లంచ్ అవ్వగానే ఇంక నేను క్లాసులకు వెళ్ళి పోయాను, మళ్ళీ మిమ్మల్ని కలవలేకపోయాను, మీ గురించి మనసులో అనుకున్నాను. మీరే ఫోన్ చేసారు.”

          “మీకు తెలిసిన లేడీ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అని అడిగింది విశాల.

          దానికి నందిని, “మీరు పెర్మనెంట్ రెసిడెంట్ కదా! అన్నీ మెడికేర్ లో కవర్ ఔతాయి. ప్రతి సబర్బ్ కి మెడికల్ సెంటర్స్ ఉంటాయి. అక్కడకు వెళ్ళి, లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ లో లేడీ డాక్టర్స్ నువ్వు అడగవచ్చు. ఇక్కడ ముందు జి.పి అంటే జనరల్ ప్రాక్టీషనర్ చూస్తారు. వాళ్ళు అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్ కి రిఫరెన్స్ ఇస్తేనే స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్ళగలుగుతాము. స్పెషలిస్ట్ డాక్టర్ కి మటుకు కనల్టేషన్ ఎక్కువే ఉంటుంది. ఆర్ యూ ఓకే? అని ఆప్యాయంగా అడిగింది”

          “కాస్త జనరల్ చెకప్ కి వెడదామని, ఐ మిస్డ్ మై పీరియడ్స్. ఇక్కడ నాకు అంతా కొత్త. ఏం చేయాలో తెలియటం లేదు” అని బెరుకుగా అంది విశాల.

          నందిని వెంటనే, “ఓ! ఎనీ గుడ్ న్యూస్! గోయింగ్ టూ హేవ్ అ బేబీ?” అంది.

          ఆ మాటకి విశాల ఒక్కసారి అవాక్కయింది. “అదేమీ కాదులే!” అంది.

          “విశాలా? ఫర్ ఎనీ హెల్ప్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. నేను ఇక్కడకు వచ్చిన కొత్తలో చాలా బెరుకుగా ఉండేదాన్ని. ఇక్కడ మనకు అమ్మ,నాన్న, బంధువులు దగ్గిర ఉండరు కదా! మనకు పరిచయమైన స్నేహితులే బంధువులు. ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చినపుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నన్ను ఒక అక్కగా అనుకో. ఓపెన్ గా అన్ని విషయాలు అడిగితే తప్ప ఎవరూ ఏ విషయం షేర్ చేసుకోరు. జాబ్ కోసం మా ఆయన ఇబ్బంది పడ్డారు. తరువాత ఒకతను పరిచయమై, మా హస్బేండ్ చాలా డెస్పరేట్ గా జాబ్ కోసం చూస్తున్నాను అని చెప్తే, పెట్రోల్ స్టేషన్ లో కాసువల్ జాబ్
ఇచ్చాడు.” అని చెప్పుకొచ్చింది నందిని.

          విశాలకు నందిని మాటలు విన్నాక కాస్త ధైర్యం వచ్చింది.

          “అలాగే తప్పకుండా అడుగుతాను. ధాంక్యూ వెరీ మఛ్ ఫర్ యువర్ హెల్ప్.” అని ఫోన్ పెట్టేసింది.

          విశాలకు చాలా గాబరా ఉంది, ఇపుడు తను ప్రెగ్నెన్సీకి సిద్ధంగా లేదు. ఇంకా సెటిల్ కాకుండా, ఈ పరిస్థితిలో పిల్లలా. అమ్మో! తలుచుకుంటేనే భయంగా ఉంది.

          ఇంతలో విష్ణు నిద్ర నుంచి లేచి హాలులోకి రావడంతో విశాల ఆలోచనల పరం పరకు అడ్డు పడింది.

          ఇద్దరూ వేడి వేడి రుచులను ఆస్వాదిస్తూ, డిన్నర్ తిన్నారు.

          “సారీ విశాలా! ఇందాక బాగా అలసటగా ఉండి, ఏమీ మాట్లాడలేకపోయాను. ఏం జరిగిందంటే, ఇంటర్వ్యూ కి వెళ్ళాను” అంటూ జరిగిన విషయాలు అన్నీ పూసగుచ్చి నట్లు చెప్పాడు. “ఇప్పుడు సమస్య వచ్చి, నేను అ నైట్ షిఫ్ట్ జాబ్ తీసుకోవాలా, వద్దా” అని.

          దానికి విశాల, “మనం ఇల్లు అద్దెకి తీసుకుని మారితే కాస్త స్వేచ్ఛ వస్తుంది. మీరు నైట్ షిఫ్ట్ కి వెళ్ళినా దైర్యంగా ఉండగలను. మళ్ళీ ఇంకోసారి ఎపుడూ ఆస్ట్రేలియా వచ్చి, పొరపాటు చేసానా? అన్న ఆలోచన రానివ్వకండి. నేను ఎం.బి.ఏ చదివేటపుడు డెసిషన్ మేకింగ్ అనాలసిస్ లో థీరీ ఆఫ్ ప్రోపబిలిటీ, కాస్ట్ ఆఫ్ ఆపర్ ట్యూనిటీ థిరిటికల్ గా చదివాను. ఇపుడు మనం ప్రాక్టికల్ గా ఫేస్ చేస్తున్నాము. ఒకవేళ మీకు డ్రైవర్స్ లైసెన్స్ ఉండి, ఆ గోల్డెన్ జాబ్ మీకే వచ్చి ఉంటే ఆస్ట్రేలియా వచ్చి మంచిపనే చేసాను  అను కునేవారు. నేను కేస్ స్టడీస్ చాలానే చదివాను, హిందూ బుక్ ఆఫ్ మేనేజ్మెంట్ లో కేసెస్ చదువుతూ, ఏదైనా సమస్య వచ్చినపుడు దానికి పరిష్కార మార్గం గురించి, సమస్యను ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచించేదాన్ని, నాకు ఆ సబ్జెక్ట్ లో హయ్యస్ట్ మార్కులు కూడా వచ్చాయి అని తన మెమోరీస్ గుర్తు చేసుకుంది విశాల.

          “ఇప్పటి నుంచి మీరు పూర్తి భరోసాతో ఉండండి. నా నుంచి 100% సపోర్ట్ మీకు
ఎప్పుడూ ఉంటుంది” అని విశాల కాన్ఫిడెంట్ గా మాట్లాడేసరికి…

          విష్ణు నవ్వుతూ, ఐయామ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ టాక్. భార్యని కరణేషు మంత్రి అని ఊరికే అనలేదు మన ఆర్యులు. నిన్ను ఉద్దేశించే ఆ మాట చెప్పి ఉంటారు మై డియర్, భార్యామణి!” అన్నాడు.

          వంటింట్లో గిన్నెలు శుభ్రం చేసుకుని వచ్చింది విశాల.

          “ మీతో మరో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇందాక నాకు ఈ రోజు పరిచయమైన నందినితో మాట్లాడాను ఇక్కడ దగ్గర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని. మనకి మెడికేర్ ఉందా, పి.ఆర్ కదా అని అడిగింది.” అని విశాల విష్ణు వేపు చూసింది సమాధానం కోసం. 

          విష్ణు లోపలి నుంచి బ్రోచర్, రెండు కార్డులు తీసుకువచ్చి విశాల చేతికి ఇచ్చాడు.

          “ఈ రోజే పోస్ట్ లో మన ఇద్దరికీ మెడికేర్ కార్డులు వచ్చాయి. మెడికేర్ అంటే  ఆస్ట్రేలియాస్ యూనివర్సల్ హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ స్కీం. చాలా మటుకు మెడికల్ ఎక్స్పెన్సెస్, డాక్టర్ విజిట్స్, మందులకు బల్క్ బిల్లింగ్ చేస్తారు పెర్మనెంట్ రెసిడెంట్స్ కి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే గొప్ప సౌలభ్యం. మనం సంపాదించే ఇన్ కంలో మెడికేర్ లెవీ ద్వారా కొంత పెర్సెంట్ ఛార్జ్ చేస్తారు అని విష్ణు విశాలకి వివరించాడు.

          “నాకు నెలవారీ సైకిల్ లో కాస్త ఇబ్బందిగా ఉంది. హార్మోన్స్ ఇంబాలెన్స్ ఏమిటో చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో. ఆడవాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం విషయంలో ఎంతో ముఖ్యమైనది. చాలామంది నిర్లక్ష్యంతో, కాస్త సిగ్గు, బిడియంతో అవసరమైనపుడు డాక్టర్ ని సంప్రదించకుండా ఆరోగ్యం ఇబ్బందుల పాలు చేసుకుంటారు. ఇండియాలో నాకు ఏ విధమైనా ఇబ్బంది రాలేదు. ఎర్లీ ఇంటర్ వెన్షన్ అనేది చాలా అవసరం. ఏ ఊహాగానాలు లేకుండా ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెడితే మంచిది అనుకుంటున్నాను” అంది విశాల
నవ్వుతూ.

          “ నేను అపాయెంట్మెంట్ కి నీకు లేడీ డాక్టర్ తో బుక్ చేస్తాను, దొరకగానే వెడదాం. ఇంకా మనం చేయవలసిన మరో ముఖ్యమైన విషయం అర్జెంట్ గా డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ టెస్ట్ చేస్తే లెర్నర్స్ లైసెన్స్ వస్తుంది. ఈ శనివారం వెళ్ళి చేద్దాం” అంటూ
విష్ణుసాయి టు డూ లిస్ట్ ఐటెమ్స్ లో నోట్ చేసాడు.

          తరువాతి రోజు విశాలకు డాక్టర్ అపాయింట్ మెంట్ దొరకడంతో తన వర్క్ టేఫ్ లో ముగించుకుని, విష్ణుతో మెడికల్ సెంటర్ కి వెళ్ళింది. అక్కడ రిసెప్షన్ లో మెడికేర్ కార్డ్ చూపించగానే,

          “ఆర్ యూ కమింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్? అని అడిగి సాంద్ర రిసెప్షనిస్ట్ ఫాం ఫిలప్ చేయమంటూ ఒక అట్ట కి క్లిప్ చేయబడిన అప్లికేషన్, పెన్ను ఇచ్చింది విశాలకు.

          విశాల చూడబోయే లేడీ డాక్టర్ పేరు తాన్య. మెడికల్ సెంటర్ చాలా విశాలంగా ఉంది. ఎదురుగా టి.వి లో తక్కువ వాల్యూం తో హెల్త్ ప్రోగ్రాం నడుస్తోంది. టేబుల్ మీద రీడర్స్ డైజెస్ట్ పాత ఇస్యూ పుస్తకాలు పేర్చబడి ఉన్నాయి.

          విశాల డాక్టర్ పిలుపు కోసం నిరీక్షిస్తున్న సమయంలో రీడర్స్ డైజెస్ట్ లో తనకు ఇష్టమైన వర్డ్ పవర్ పేజీ తీసి కొత్త పదాలకు అర్థం చూసింది.

          ఇంతలో “విషాల, అని పేరు వినబడటంతో తల పైకెత్తి చూసింది. ఎదురుగా
డాక్టర్ తాన్య, చిరునవ్వుతో తన గదిలోకి తీసుకుని వెళ్ళింది.

          విశాల కుర్చీలో కూర్చుంటూ, తను కొత్తగా ఈ మధ్యే ఆస్ట్రేలియా వచ్చానని చెపుతూ, తన సమస్యని వివరించింది డాక్టర్ కి.

          తాన్య వివరాలు నోట్ చేసుకుంటూ అన్ని చెకప్ లు చేయసాగింది. క్విక్ టెస్ట్ లు చేస్తూ, చివరిగా ప్రెగ్నెన్సీ కిట్ నర్స్ కి ఇచ్చి చెక్ చేయమంది.

          నర్స్ విశాల ఎదురుగానే కిట్ తీసుకుని, శాంపిల్ చూస్తూ టెస్ట్ రిజల్ట్ కోసం ఆగమని చెప్పింది.

          విశాల ఎంతో టెన్షన్ గా రిజల్ట్ ఏమి చెపుతుందా అని అత్రుతతో వెయిట్ చేస్తోంది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.