నా జీవన యానంలో- రెండవభాగం- 40

-కె.వరలక్ష్మి

          పుట్టిన రోజు ఫంక్షన్లో స్టేజిపైన గోల్డుకలర్ పెద్దాపురం పట్టుపంచె లాల్చీలో ఆవంత్స సోమసుందర్ గారు మెరిసిపోతూ ఉన్నారు. వెళ్ళిన రచయిత్రులమంతా ‘నేను – నా సాహిత్యకృషి’ అంటూ మాట్లాడేం. పెద్ద వయసు కావడం వల్ల కాబోలు చివరివక్తల వంతు వచ్చేసరికి సోమసుందర్ గారిలో అసహనం పెరిగిపోయి రెండు మాటలు మాట్లాడ గానే దిగిపొమ్మనేవారు. ఏది ఏమైనా మేమున్న ఆ రెండు రోజులూ డా. సీతారామస్వామి గారు, డా. అనూరాధ గారు, మన్మధరావు గారు ఎంతో బాగా ట్రీట్ చేసారు.

          19 ఉదయాన్నే పాతకాలం నాటి పెద్ద పెద్ద బాత్ రూమ్స్ లో వేడినీళ్ళ స్నానాలు కానిచ్చి పెసరట్టు – ఉప్మాతో వేడి వేడి కాఫీలు తాగి ఆహ్లాదంగా రెండు కార్లెక్కాం. కాకినాడ వెళ్ళి బీచ్ లో కాస్సేపు, లలితకళా తోరణం పార్క్ లో కాస్సేపు గడిపేం. తర్వాత జగన్నాధపురం వంతెన దాటి ఆర్యవటం, కోటిపల్లి మీదుగా ‘ర్యాలి’ వెళ్ళి జగన్మోహినీ కేశవాలయం చూసి తిరిగి వస్తూ కోటిపల్లి రేవులో ఆగి పడవల మీద గోదావరి ఆవలి గట్టుకి వెళ్ళి దిగకుండానే తిరిగివచ్చాం. కోటిపల్లి సోమేశ్వరాలయం, దాక్షారామ భీమేశ్వరాల యం చూసి, సాయంకాలానికి తిరిగి కాకినాడలోని సర్పవరం వచ్చాం. అక్కడి వైష్ణవా లయం, మాధవస్వామి గుడి, విగ్రహం పరిశుభ్రంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ముందున్న గాలిగోపురం మీద అద్భుతమైన శృంగార శిల్పాలున్నాయి. అక్కడి నుంచి చంద్రంపాలెంలోని కృష్ణశాస్త్రి గారి ఇంటికి చేరుకునేసరికి సంధ్యవేళైంది. చాలా స్థలం ఆక్రమణకి గురైందట, వారు దానంగా ఇచ్చెయ్యడం వల్ల మిగిలిన దాంట్లో స్కూలు నడుస్తోంది. కృష్ణశాస్త్రిగారు పుట్టి పెరిగిన ఆ ఇంటిని చూడడం ఒక గొప్ప అనుభూతి, అక్కడ నుంచి సామర్లకోట వెళ్ళి కాలవ అవతలి భీమేశ్వరాలయానికి వెళ్ళేం. కార్తీక మాసం కావడం వల్ల ఆలయం దీపతోరణాలతోను, విగ్రహాలు వెండి బంగారు అలంకరణ లతోను మెరిసిపోతున్నాయి. కాలవ ఇవతలికి వచ్చి రైల్వేస్టేషన్లో అందరం కార్లు దిగేం. ఆ రోజు అయిన ఖర్చు ఒక్కొక్కరికీ 330 రూ. మాత్రం అయ్యింది. మిత్రులందర్నీ వదల లేక వదిలి స్టేషన్ బైటికి వచ్చి బస్సు ఎక్కేను. మనసంతా ఆనందంగా, ఆహ్లాదంగా అన్పించింది. మొన్న మొన్న పాపికొండల ప్రయాణంలో తన మాటల్తో నన్ను వేధించిన సీనియర్ రచయిత్రి బృందం గుర్తుకొచ్చింది. చివరికి వాళ్ళు రైల్వే స్టేషనుకి వెళ్తూ కూడా దారిలో బస్టాండులో దిగాలనుకున్న నన్ను కారులో నుంచి దించేయడం, చోటులేదు అనడం గుర్తుకొచ్చి పికిల్ మైండెడ్ జనాలు అని నవ్వుకున్నాను,  ఆ బృందం ఎవరూ ఈ ప్రయాణంలో లేరు.

          అంతలో తిరుపతి భాషా బ్రహ్మోత్సవాల ఆహ్వానం వచ్చింది. వెంటనే నాకూ, నాకు సాయంగా ఉంటుందని మా చిన్న చెల్లెలు సూర్యకుమారికీ ట్రెయిన్ కి రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేయించాను, నవంబర్ 30 నుంచి డిశంబర్ 6 వరకూ జరిగే ఉత్సవాలవి. దానికి ఆర్థిక సాయం సమకూర్చిన రాజశేఖర్ రెడ్డి, ప్లాన్ చేసిన కరుణాకరరెడ్డి, వారికి సాయపడిన సాకం నాగరాజా వంటి వారందరూ శ్లాఘనీయులు. 29 సాయంకాలం శేషాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కి 30 ఉదయం 7కి తిరుపతిలో దిగేం. ఆహుతులందరికీ శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో రూమ్స్ ఎరేంజ్ చేసారు. అక్కడే ఉదయం టిఫిన్స్, రాత్రిభోజనాల ఏర్పాట్లు చేసారు. మధ్యాహ్నం లంచ్ మాత్రం కార్యక్రమాలు జరిగే మహతి ఆడిటోరియం ఆవరణలో.

          ఆ ఉత్సవాలకు ముఖ్యకారకుడైన భూమన కరుణాకరరెడ్డి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్యక్షుడు, గొప్ప సాత్త్వికుడు, ఆలోచనా పరుడు, ఆయన అధ్యక్షుడుగా ప్రారంభసభలో సి. నారాయణ రెడ్డిగారు జ్యోతి ప్రజ్వలన చేసి, చక్కని ఉపన్యాసం ఇచ్చారు. డా. ముదిగొండ శివప్రసాద్ అనారోగ్యంగా ఉన్నా ‘వేదార్థం – వర్తమానం’ అనే అంశం మీద అధారటీతో మాట్లాడేరు, రెండో వక్త డా. వాడ్రేవు చినవీర భద్రుడు ‘ఉపనిషత్సారం’ మీద అంత బాగా మాట్లాడలేకపోయాడు. మధ్యాహ్నం సెషన్లో ‘రామాయణ రమ్యత’ మీద ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి బాగా మాట్లాడేరు, ‘భారతం – సమాకలీనత’ మీద నాగళ్ల గురుప్రసాదరావు స్పీచ్ విసుగు తెప్పించింది. ‘పోతన – భాగవతం’ మీద డా. హెచ్.యస్. బ్రహ్మానందం మంచి వాయిస్తో మాట్లాడేరు, తర్వాత సీనియర్ సినీ నటులు కాంచనకి, గుమ్మడికి సన్మానం జరిగింది. కళాకృష్ణ బృందం ‘తెలుగు వైభవం’, స్వాతి సోమనాధ్ బృందం ‘శరణం గోవిందం’ కూచిపూడి నాట్య ప్రదర్శనలు జరిగాయి. వక్తలకి, కళాకారులకి, సన్మానితులకి అందరికీ ఒకేలాంటి కాశ్మీరు శాలువాలు, శ్రీనివాసుడి చందన శిల్పాలు బహూకరించారు.

          అన్నపూర్ణ అనే విజయవాడకు చెందిన జ్యోతిషపండితురాలికి కూడా మా రూమ్ ఇచ్చారు, ఒకటో తేదీ ఉదయాన్నే నేనూ, మా చెల్లి, అన్నపూర్ణ బైటికెళ్ళి నడుచుకుంటూ గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళేం. వస్తూ దారిలో చెరుకుముక్కలు కొనుక్కుని తిన్నాం. అట్నుంచి అటే మహతికి వెళ్ళిపోయాం. డా. ముక్తేవి భారతి మొల్లరామాయణం మీద, అద్దేపల్లి రామమోహన్రావు భావకవిత్వం మీద, చుక్కా రామయ్య బదులు స్థానిక పండితులెవరో మాట్లాడేరు. మధ్యాహ్నం శతకాలు – సత్యాలు మీద మల్లెమాల, శ్రీ కాళహస్తీశ్వర శతకం మీద మేడసాని మోహన్, విశ్వనాథ సాహితీవైభవం మీద సి. వేదవతి మాట్లాడేరు. బాపు రమణలు బదులు ఆర్టిస్టులు చంద్ర, మోహన్, శంకర్, బాలి లను, కాళీపట్నం రామారావు గార్ని సత్కరించేరు. 6 గం.కి సినీనటి లయ భరతనాట్యం, హాలు కిక్కిరిసి పోయింది. రూంకి వచ్చి పడుకొనే వేళకి డిశంబర్ నెలలో చేస్తున్న చన్నీళ్ళ స్నానాలకి గొంతు నొప్పితో దగ్గు, జలుబు ఎక్కువై సన్నగా చలిజ్వరం మొదలైంది.

          రెండో తేదీ ఉదయం సెషన్లో గురజాడ కన్యాశుల్కం మీద తనికెళ్ళ భరణి, చిల్లర దేవుళ్ళు – మోదుగుపూలు మీద డా. యస్.వి. సత్యన్నారాయణ, అన్నమయ్య శృంగార సంకీర్తనల మీద డా. జయప్రభ మాట్లాడేరు. భోజనాల టైంలో ప్రతిమ, నేను వెళ్ళి  జయప్రభని పరిచయం చేసుకున్నాం. ఆవిడ మా కన్నా చాలా పెద్దదానిలాగా ఫోజ్ కొట్టింది. మేం కూడా దానికి ఆమోదిస్తూ వెర్రి మొహాలు పెట్టాం. అంతలో ఆంధ్రజ్యోతి ఉమామహేశ్వర్రావు, ఖదీర్ బాబు వాళ్ళూ మా మండూర్ ఫారెస్ట్ గెస్ట హౌస్ లో కొందరు రచయితల కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, మమ్మల్నీ రమ్మని కబురందిం చేరు. వెంటనే శ్రీనివాసంకెళ్ళి ఓ జత బట్టలు చిన్న బేగ్ లో సర్దుకుని వాళ్ళు పంపిన బస్సెక్కేం, కొండపైన ఉంది గెస్ట్ హౌస్, అక్కడికెళ్లేక తెలిసింది కారా, సింగమనేనితో బాటు నలభైమంది ఆహ్వానించబడ్డాం. ఎర్రచందనం చెట్లు, ఏవో ప్రత్యేకమైన పూల చెట్లతోనూ నిండి ఆ పరిసరాలు ఎంతో బావున్నాయి. రాత్రి 2.30 వరకూ కథపైన రకరకాల చర్చలు జరిగాయి. జగన్ వైఫ్ సుధకరుణాకరరెడ్డితో మాట్లాడి ఇదంతా ఏర్పాటు చేసిందట. తను దగ్గరుండి రాత్రి భోజనాల్లోకి చికెన్ వగైరాలు వండించింది. భోజనాల తర్వాత పౌర్ణమి ముందు ద్వాదశి వెన్నెల్లో అడవి కాలిబాటల్లో కొంత దూరం నడిచాం. విష్ణుప్రియ తనస్టైల్లో పాటలు పాడింది. ఈ పాటలు విని నక్సలైట్లనుకుని పోలీసులు పట్టుకుపోతారేమో అని  కొందరు జోక్ చేసారు. మర్నాడు ఉదయం లేస్తూనే పొగమంచు కమ్మిన అడవిని చూడడం ఒక అద్భుతమైన అనుభవం, తర్వాత అందరం కొండ దిగువన మూడు నాల్గు కిలోమీటర్లలో ఉన్న ఏరు దగ్గరికి నడిచివెళ్ళేం. గులకరాళ్ళతో నిండి ఉన్న ఏరు. చల్లని స్వచ్ఛమైన నీరు, ఏటి ఒడ్డున కబుర్లు చెప్పుకొంటూ చాలాసేపు గడిపేం, తిరిగి వచ్చి కొండ ఎక్కేసరికి చాలా అలసిపోయాను. జ్వరం ఇంకాస్త ఎక్కువైంది, మరో సెషన్ విమర్శకులది నడిచింది. 1.30 కి తిరిగి మహతికి వచ్చేసాం.

          ఆ ఉదయం మహతిలో ఓల్గా, వీరలక్ష్మి, సుమతీ నరేంద్ర మాట్లాడేరట. మృణాళిని, ఓల్గా భోజనాల దగ్గరకొచ్చి పలకరించారు. ‘‘ఏమ్మా, మీరేనా, మేం కథలు రాయడం లేదా?’’ అని నవ్వుతూ నిష్ఠూరమాడింది ఓల్గా. ఉదయం సుమతీ నరేంద్ర బాగా మాట్లాడిందట, వీరలక్ష్మి బాగా మాట్లాడలేదని, ఆపమని చీటీలు పంపవలసొచ్చిందని చెప్పింది సుధ. మధ్యాహ్నం సింగమనేని, సతీష్ చంద్ర, జ్వాలాముఖిల ఉపన్యాసాలు, మా చెల్లీ నేనూ మహతి ఎదుటి వీధిలో ఒకరింటికెళ్ళి జెమిని ఛానల్లో మా మనవడు కోమల్, మనవరాలు ప్రవల్లిక పాల్గొన్న ‘నువ్వేపులి’ బాలల కార్యక్రమం చూసేం.

          నాల్గో తేదీన మహతికి వెళ్దామని కిందికొచ్చేసరికి నాగరాజాగారు ఆహూతుల్ని టాటా సుమోల్లో ఎక్కించి కొండ పైకి పంపిస్తున్నారు. తుర్లపాటి రాజేశ్వరిగారు, హోసూరు వాళ్ళు మేమూ ఒక జీప్ లో వెళ్ళేం, పైన ఛెయిర్మన్ ఆఫీసులో పర్మిషన్ కార్డులుఇచ్చారు, సెల్లార్ గుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాం శ్రీనివాసుడిని, ఒక గంటలో అయిపోయింది. మళ్ళీ జీపులు వచ్చే వరకూ నాలుగు మాడవీధుల్ని చుట్టి వచ్చాం.

          5వ తేదీన గాయకుడు బాలు, రావికొండల్రావు, కె.బి. లక్ష్మి మాట్లాడేరు, సాయం కాలం సినీనటులు కాంతారావు, కృష్టకుమారిలకు సన్మానం, ముందురోజు బాపు, రమణ, నటుడు ధూళిపాళ, చందమామ బి. విశ్వనాథ రెడ్డిలకు సన్మానం జరిగింది. ఆ రోజు వక్తల్లో ‘కథ – మానవ సంబంధాలు’ మీద కె.బి. లక్ష్మి బాగా మాట్లాడలేకపోయింది ఆ రోజు హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం వినడం అద్బుతమైన అనుభవం 6వ తేదీ డా. మీగడ రామలింగస్వామి ‘పద్యనాటకం’ ప్రసంగం బావుంది. మధ్యాహ్నం శ్రీరమణ, వేటూరి అంత బాగా మాట్లాడలేకపోయారు. సాయంకాలం అక్కినేని నాగేశ్వర్రావు గారికి సన్మానం. ఆయన చాలా బాగా మాట్లాడేరు. అది కాగానే బైటికి వచ్చేసాం. రాత్రి 8 గంటలకి మా ట్రెయిన్, వచ్చేటప్పుడు పూర్తిగా చూడలేకపోయిన తిరుపతి అలంకరణ చూసాం. రోడ్డు డివైడర్లలో నిండుగా పూసిన పూల చెట్ల మధ్య ఏర్పాటుచేసిన హోర్డింగుల మీద ప్రఖ్యాత కవులు, రచయితల ఫోటోలు ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకూ ఒక్క రోడ్డు కూడా వదలకుండా తిరుమల మెట్లవరకూ అసలు ఆ భాషా బ్రహ్మోత్సవాలకు వెళ్ళ గలగడం గొప్ప అనుభూతినిచ్చింది. రచయితను కావడం నా అదృష్టం అన్పించింది.  7వ తేదీ ఉదయానికి హేపీగానే కాని, బాగా దగ్గు, జలుబు, జ్వరంతో ఇంటికి చేరుకున్నా ను. మా చెల్లి రాజమండ్రిలో దిగిపోయింది. సురేఖ అనే అమ్మాయి నా కథల పుస్తకం ‘మట్టి – బంగారం’ మీద యం.ఫిల్ చెయ్యబోతోంది. ఒక రోజు నా దగ్గరకి వచ్చింది. తన గైడు తనని ఇబ్బందిపెడుతున్నాడని చెప్పింది. పాపం, పేదకుటుంబం. చీటికీ మాటికీ డబ్బులు ఐదువేలూ, పదివేలూ అడుగుతున్నాడట. నేను ఫోన్ చేస్తే కట్ చేసాడు. తనకి అవసరమైన మెటీరియల్ నా దగ్గరున్నంత వరకూ ఇచ్చేను, ఏ సాయం కావాలన్నా అడగమని చెప్పేను. పత్రికల్లో వ్యాసాలు, కథానికల పోటీలు పడితే వాటి కటింగ్స్ ఇచ్చి ఎలా రాయాలో చెప్పేను, భయపడుతూ వచ్చిన అమ్మాయి హేపీగా వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ గైడు ‘‘అలా వ్యాసాలు అవీ రాయమని ఎంకరేజ్ చెయ్యకండి. వాళ్ళ దగ్గర అంత సత్తా ఉండదు’’ అన్నాడు నిష్ఠూరంగా. అలాంటి ప్రొఫెసర్లు ఉంటే గురుశిష్య సంబంధా లు ఏం బాగుపడతాయి?

          30-12-2006 ఉదయం ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ని ఇరాక్ ప్రభుత్వం ఉరితీసింది. కారణాలు ఏవైనా కావచ్చు, మనుషుల్ని లేదా ప్రాణుల్ని చంపడం ఎంత అమానుషం! చరిత్రలో వెనక్కెళ్ళి చూస్తే రష్యాలో చివరి జార్ చక్రవర్తిని, అతని కుటుంబం – భార్య, నలుగురు కూతుళ్ళు, చిన్న పిల్లవాడైన కొడుకుని లెనిన్ ప్రభుత్వం కాల్చి చంపడం ఇలాంటిదే. నాకైతే కళ్ళు నీటి చెలమలైపోయాయి. పదునైన, స్పష్టమైన చూపు లేకుంటే రచయితలుగా కంటికి కన్పించే దాన్నే సర్వస్వం అనుకుని దాన్నే రాసి సంతృప్తి చెందుతాం. కాని, జీవితానుభవానికీ, దృక్పధానికీ మధ్య తార్కికమైన దృష్టిని పెంపొందించుకోగలగాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.