పేషంట్ చెప్పే కథలు – 24
రాక్షసుడు
–ఆలూరి విజయలక్ష్మి
“అయ్యో! ఏమిటమ్మా యిది? ఈ దెబ్బలేమిటి?” ఆదుర్దాగా అడిగింది శృతి.
“అటక ఎక్కబోయి జారి పడిపోయాను” బలవంతాన బాధను ఓర్చుకుంటూ జవాబిచ్చింది సావిత్రి. రక్తాన్ని దూదితో తుడుస్తూ, పరిశీలనగా గాయాల్ని చూస్తూ ఆలోచిస్తూంది శృతి.
వారం క్రితం భర్తను వెంటబెట్టుకొచ్చిన సావిత్రి గుర్తుకొచ్చింది. రోజారంగు చెక్కిళ్ళు, చిరుసిగ్గుతో వాలిపోతున్న కళ్ళు, చూడగానే ఆకర్షిస్తున్న అలంకరణ, కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు.
సావిత్రి భర్త సోమేశ్వరరావు పదేళ్ళ నుంచీ కువైట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయి ఎనిమిదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. సంవత్సరానికోసారి రెండు నెలలు సెలవు తీసుకుని వస్తూ ఉంటాడు.
“సావిత్రిని పిల్లల్నీ అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు కదా మీరు? ఏళ్ళ తరబడి యిలా విడిగా ఉండడం కష్టంకాదూ?” మాటల మధ్యలో అతన్ని అడిగింది శృతి. అంతవరకూ నవ్వుతూ మాట్లాడుతున్నా అతని కళ్ళల్లో విషాదం సుళ్ళు తిరిగింది.
“ఎందుకు కష్టంగా లేదూ? ఒకోసారి వెధవ ఉద్యోగాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకు పారి పోయి రావాలనిపిస్తుంది. బాగా తిరుగుతున్నప్పుడు ఫరవాలేదు. కొంచెం ఒంట్లో బాగాలేక పోతే చాలు, యింకా జబ్బు తగ్గనే తగ్గదేమో, అక్కడే దిక్కూ మొక్కూ లేకుండా చనిపోతా నేమో, నా వాళ్ళనింక చూడలేనేమోనని అధైర్యం కలుగుతుంది. నా పక్కలు వెచ్చబడితే చాలు. అగ్గగ్గలాడిపోయే అమ్మను తలచుకుంటే ఏడుపు ముంచుకొస్తుంది. సావిత్రి, పిల్లలు కళ్ళముందు మెదిలితే చాలు. రెక్కలు కట్టుకుని యెగిరి రావాలనిపిస్తుంది. కానీ రాలేను. ఉద్యోగాన్ని విడిచిపెట్టనూ లేను. వచ్చి యిక్కడ కూలి చేసుకుని బ్రతకనూ లేను. యిక్కడే పనిలోనూ నిలదొక్కుకోలేకే, అవకాశం కలిసొచ్చి అక్కడకు వెళ్ళాను. మంచో, చెడో ఒక రకమైన బ్రతుక్కి అలవాటు పడిపోయాను. నా భార్య, పిల్లలు, అమ్మ, తమ్ముడు లోటులేకుండా బ్రతకగలిగినంత పంపగలుగుతున్నాను. యింత మందిని అక్కడికి తీసుకెళ్ళి పోషించలేను. కొద్దో, గొప్పో వెనకేసి, కూడపెట్టుకు వచ్చి ఇక్కడేదన్నా వ్యాపారం చేసుకు బ్రతకాలని నా తాపత్రయం. అప్పటిదాకా ఈ బాధ, ఎడబాటుతప్పవు.” సుఖజీవనం కోసం పోరాటం, పట్టుదల, అధైర్యం, సంఘర్షణ, త్యాగాలు, కన్నీళ్ళు – ఆసక్తి గా వాళ్ళని గమనించింది శృతి. అదంతా కళ్ళ ముందు కదిలింది.
“రోజూ ఇంజక్షన్ కి వస్తావా? క్యాప్సూల్స్ రాసివ్వనా?” టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్ట్ చేస్తూ సావిత్రిని అడిగింది శృతి.
ఇంజక్షన్ చేయించుకుంటానమ్మా! త్వరగా మానాలి.” భర్త వున్నా నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉండక యిలా జరిగిందన్న వ్యధ కదిలింది సావిత్రి కళ్ళల్లో.
మరునాడు సావిత్రి వెంట ఆమె భర్తకూడా వచ్చాడు. గాయాలు తగిలినచోట డ్రెస్సింగ్ చేసి, ఇంజెక్షనిచ్చాక సావిత్రిని బయట కూర్చోబెట్టి అతను శృతి రూమ్ లోకి వచ్చాడు.
“ఫరవాలేదు కదా డాక్టర్ గారూ?!” భయంగా అడిగాడతను.
“ఏం ఫరవాలేదు! రెండు రోజుల్లో బాగా తగ్గిపోతాయి” ధైర్యం చెప్పింది శృతి.
ఒక నిమిషం తలవంచుకుని మౌనంగా కూర్చున్నాడతను.
“నన్ను పరీక్షచేసి మంచి మందివ్వాలి డాక్టర్!” గిల్టీగా చూస్తూ అన్నాడతను.
“మిమ్మలినా?!” ఆరోగ్యంగా కనిపిస్తున్న అతనివంక విస్మయంగా చూస్తూ అడిగింది శృతి. అంతలోనే అతని కళ్ళల్లో పలుచటి నీటిపొర కమ్మింది. ఒక నిమిషంలో తమాయించుకున్నాడు.
“సావిత్రి పడిపోలేదు. నేను కొట్టాను” ఆశ్చర్యంగా అతని వంక చూస్తూంది శృతి. భార్యను అపురూపంగా చూసుకునే యితనా అంత దారుణంగా కొట్టింది? ఏ పరిస్థితుల్లో, ఏ భావోద్రేకంలో అతనా పనిచేశాడు?!”
“నిజమే. నేనే కొట్టానండి. సావిత్రి నా ప్రాణం. కానీ… కానీ… నేను ఊహించుకునే దంతా అబద్ధమే, సావిత్రి నిప్పు అంటుంది. అమ్మ… సడన్ గా నాలో అనుమానపు భూతం లేస్తుంది. నేనిక్కడ లేని సమయంలో సావిత్రి ఎవరితోనైనా… ఛీ! ఛీ! మామూలుగా సావిత్రి గురించి యిలా అనుకుంటానికే అసహ్యం. నాలో రాక్షసుడు బయటి కొచ్చిన ప్పుడు ఇదేమీ గుర్తుకు రాదు. సావిత్రిని కొట్టి, తిట్టి హింసించడం ఆ రాక్షసుడికి ఆనందం” మాటలు పేర్చుకుంటూ, దీనంగా తన గురించి చెప్పుకుంటున్న అతని వంక జాలిగా చూసింది శృతి.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.