యాదోంకి బారాత్-16

-వారాల ఆనంద్

 

కొన్నిసార్లు వంచన గెలుస్తుంది
అవమానం కోరడాలా తగుల్తుంది
కానీ
“కాలం” డస్టర్ లా వాటిని తుడిచేసి
ముందుకు సాగుతుంది. 

జ్ఞాపకాల వెల్లువలో ఎన్నో ఎన్నెన్నో…
నడిచి వచ్చిన దారి..
గడిపి వచ్చిన కాలం..
వుండి వచ్చిన వూరూ

ఎన్నో సంఘటనలనీ సందర్భాలనీ వాటిని మించి ఎందరొ మనుషుల్నీ గుర్తు చేస్తుంది. మరెందరినో చిత్రంగా మరుగున పడేస్తుంది. కవులూ, రచయితలూ, కళాకారులూ, ప్రముఖులూ ఎందరో గుర్తొస్తారు. వాళ్ళని మరీ మరీ గుర్తుచేసుకుంటాం మంచిదే కానీ మనతో కలిసి నాలుగు అడుగులు వేసి మన వెన్నుతట్టి నిలబెట్టిన వాళ్ళూ వుంటారు వాళ్ళని మర్చిపోతాం లేదా జ్ఞాపకాల పొరల్లో వాళ్ళంతా అట్లావుండి పోతారు. అట్లా నా వేములవాడ జీవిత కాలం నాటి జ్ఞాపకాలలో వున్న కొంత మంది మిత్రుల గురించి ఇవ్వాల గుర్తుచేసు కుంటున్నాను. వాళ్ళు కవులో కళాకారులో కాదు. కానీ గొప్ప మనుషు లు, గొప్ప స్నేహితులు. మంచిని అభిమానించిన వాళ్ళు. నా యాదొంకి బారాత్ లో నాతో పాటు నడవ వలసిన వాళ్ళు. ఇక్కడ కూడా నా పరిమితులు నాకు తెలుసు. ఈ ప్రవాహం లో కొందరు నా స్మృతి పథంలోంచి వెళ్ళిపోయి వుంటారు. నాదీ అతి పరిమితమయిన జ్ఞాపకమే కదా.

మీకు ఆసక్తిగా వుంటుందో లేదో తెలీదు కానీ వెలుగులోకి రాని కొందరు వేములవాడ మిత్రుల గురించి నాలుగు మాటలు.

          1981లో వేములవాడలో ఫిలిం సోసైటీ పెట్టాలని ఆలోచన కలిగినప్పుడు కలిసిన మిత్రులు అనేక మంది. అప్పటిదాకా సాహిత్యం, సంగీతం, నాటక రంగ కార్యక్రమాలు మాత్రమే తెలిసిన వూరికి మంచి సినిమాని, ఆర్ట్ సినిమాని పరిచయం చేయడం నా పని. ఏ పనీ ఒక్కడితో కాదు. కొంత మంది కలవాలి. ఒక సమూహం ఏర్పడాలి. ఒకే ఆలోచనతో సాగాలి. నాకేమో కరీంనగర్ ఫిలిం సొసైటీతో కొంచెం పరిచయం వుంది. మంచి సినిమాల పైన వచ్చిన సాహిత్యం కొంత చదివాను. అప్పటికి వేములవాడ ఒక పెద్ద గ్రామం మాత్రమె. అక్కడికి గొప్ప సినిమాలు తేవడం చూపించడం వాటిపైన చర్చలు అవీ పెట్టడం కొంత సాహసమే. నేను మొట్టమొదట ఈ ప్రస్తావనను తెచ్చింది మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్ తో. ఎగిరి గంతేశాడు. చలో అన్నాడు. అంత ఈజీనా. సభ్యులు కావాలి సినిమా హాలు మాట్లాడాలి అన్నాను. అన్నీ చూద్దాం నేనున్నాను కదా అన్నాడు. ఇద్దరం కలిసిన రెండవ వ్యక్తి పీ.ఎస్.రవీంద్ర. అప్పటికే కవిత్వం ఫోటోగ్రఫ్ఫీల్లో వున్న పీఎస్ ఎంతో ఉత్సాహం చూపించాడు. ఇంకేముంది నేను కరీంనగర్ నరెడ్ల శ్రీనివాస్ దగ్గరి నుండి బై లాస్ తెచ్చేశాను. ఇక సంస్థ కార్యవర్గాన్ని రూపొందించడం. అధ్యక్షుడు ఎవరయితే బాగుంటుంది. నగుబోతు ప్రభాకర్ అన్నారు. కలుద్దాం అన్నాను. తనని తన ఇంజనీరింగ్ షాపులో కలవగానే క్షణం కూడా ఆలోచించకుండా పదండి ముందుకు అన్నాడు. నగుబోతు ప్రభాకర్ అప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసి తండ్రి సూచనల మేరకు వ్యాపారంలో స్థిరపడ్డాడు. నిజానికి ఇంజనీరుగా ఉద్యోగంలో చేరివుంటే ఏ  చీఫ్ ఇంజనీరు గానొ పదవీ విరమణ చేసి ఉండేవాడు. ఎంతో ఆత్మీయుడు, నిగర్వి. నవ్వడం తప్ప ఆయన కోపం నేనెప్పుడూ చూడలేదు. ఆయన అధ్యక్షుడు కావడం ఫిలిం సొసైటీకి గొప్ప ఆలంబన లభించినట్టు అయింది. ఇక ఉపాధ్యక్షుడు ఎవరు అనుకుంటూ కొమురవెల్లి నారాయణ బంగ్లాలో వున్న నల్ల ప్రభాకర్ గుర్తొచ్చాడు. మాది ఆలస్యం చేసే రకం కాదు. పద వెళ్దాం అనుకున్నాం. ప్రదీప్ ఎలెక్ట్రికల్స్ కు వెళ్ళాం. ఏముంది మొదట టీ అన్నాడు. విషయం చెప్పాం. మీరంతా వున్నంక నాదేముంది అంటూ ఇంకా ఎవరెవరు సహకరిస్తారో కొన్ని పేర్లు చెప్పాడు. తప్పును తప్పు ఒప్పును ఒప్పు అనే లక్షణం నల్ల ప్రభాకర్ ది. ఒక సంఘటన గుర్తొస్తున్నది. కరీంనగర్ జిల్లా ఫిలిం సొసైటీల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఉదయం గోకుల్ టాకీసు కార్యక్రమంలో నగుబోతు ప్రభాకర్ సభకు అధ్యక్షత వహించాడు. మధ్యాహ్నం గ్రామపంచాయతి ఆఫీసులో జరిగిన సమావేశానికి కార్యదర్శిగా నేను అధ్యక్షత వహించాను. సభ బాగా జరిగింది. అందరం హాపీ. తెల్లారి నల్ల ప్రభాకర్ నేరుగా నన్నే అడిగాడు “నిన్న మధ్యాహ్నం కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షు డిగా నగుబోతు ప్రభాకర్ ను వేదిక మీదికి పిలవాల్సింది తప్పు చేసారు ఆనంద్” నేను అవాక్కు అయ్యాను నిజమే నాకు తోచలేదు. ఉదయం సభలో తానున్నాడు కదా అను కున్నాం. సారీ అన్నాను. అంతటి సూటి మనిషి నల్ల ప్రభాకర్.

          ఇక వయసులోనూ అనుభవంలోనూ మా కంటే చాలా పెద్దాయన నగుబోతు చంద్ర మౌళిగారు. ఆయన కవీ రచయితా కాదు, నటుడు కాదు. సంగీతం తెలిసిన వాడు, కానీ కళ లంటే ప్రాణం. కవిత్వమన్నా, కవులన్నా ప్రేమ. అన్ని సాహితీ సాంస్కృతిక సంస్థలతో గొప్ప ఆత్మీయ సన్నిహిత సంబంధం ఆయనది. ఫిలిం సొసైటీ కోశాదికారి స్థానానికి మాకు ఆయన్ను మించిన వ్యక్తి లేడు. తన దగ్గర ప్రస్తావన తేగానే. మంచి కళాత్మక సినిమాలు చూడడమే కాదు మనవాళ్ళకు చూపించే పనికదా పదండి పోదాం అన్నారాయన. పెద్ద వాడుగా అయన అందించిన ప్రోత్సాహం ఉత్సాహం మరువలేనిది. ఆయన సున్ని తత్వాన్ని మంచితనాన్ని గురించి ఒక సంఘటన చెప్పాలనిపిస్తున్నది. శంకరాభరణం సినిమా వచ్చిన సమయమది. రాష్ట్రంలో ఆ సినిమా ఒక ఊపు కదా. సినిమా చూసిన చద్రమౌళి గారికి జే.వి.సోమయాజులు మీద గొప్ప అభిమానం కలిగింది. ఒక రకంగా అరాధనీయ భావం కూడా. అదే సమయంలో ఎదో కార్యక్రమంలో పాల్గొనడానికి సోమయా జలు వేములవాడకు వచ్చారు. గెస్ట్ హౌసులో వున్నఆయన్ని కలవడానికి నగుబోతు చంద్రమౌళి వెళ్ళారు. సోమయాజులు ఆర్టిస్టు కదా. గదిలో మందేసుకుంటూ వున్నాడు. ఆ స్థితిలో ఆయన్ని చూసిన నగుబోతు చంద్రమౌళి గారి తల తిరిగిపోయి ఛీ అనుకుం టూ వచ్చేసాడు. బయట కొచ్చి ఎంతగా బాధ పడ్డాడో..మాతో చెబుతూ అంత గొప్ప పాత్ర చేసిన వాణ్ని ఆ స్థితిలో చూడ్డంతో మొత్తం నటుల మీదే అభిమానం పోయిందిఅన్నాడు. అట్లా కాదని చెప్పినా ఆయన అభిప్రాయం మారలేదు. తన విశ్వాసాల మీద అంతటి నిబద్దత ఆయనది. ఇక మరో మిత్రుడు సన్నిహితుడు శ్రీ యాద కిషన్. ఉద్యోగంలోనూ జీవితంలోనూ నేను స్థిరపడడంలో నా వెన్నంటే వున్న అత్యంత ఆత్మీయుడాయాన. సిరిసిల్లా ఉద్యోగ కాలం నుండి కలిసి జరిపిన ప్రయాణం మాది. ఆయన కవో కళాకారుడో కాదు. మంచి మనసున్న దగ్గరి మిత్రుడు శ్రేయోభిలాషి. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పీజీ కాలేజీలో చేరిం తర్వాత..అనేక సందర్భాల్లో నా ఆవేశానికి అడ్డుకట్టగా నిలిచి నన్ను నిలదొక్కుకునేలా చేసాడు. సినిమాలు, కవిత్వమూ సరే ఇల్లు వుండాలి అంటూ వెంట బడ్డాడు. డబ్బులు ఎక్కడివి సార్ అంటే నువ్వు మొదలు పెట్టు ఎక్కడి నుంచో వస్తాయి మొదలయితే శురూ చేయి అనేవాడు. నేను ఎంతకూ కదలక పోయేసరికి ఇంటికి వచ్చి నా సహచరి ఇందిరతో ఏమమ్మా మీ సారుతో ఇల్లు కట్టించవా.. అన్నాడు ఇంకేముంది ఇందిర నా వెంటబడడం… మిత్రుల సాయంతో కరీంనగర్ లో ఓ గూడు ఏర్పడింది. అంతే కాదు ఇప్పటికీ అన్ని విషయాల్లో ప్రాక్టికల్ సలహాలు ఇస్తూ నన్ను నేల మీద నిల బెట్టాడు కిషన్ సర్.

          ఆయన తమ్ములు మురళి, అశోక్, ప్రసాద్ లు కూడా స్నేహంగానే వుండేవాళ్ళు. అట్లా స్నేహంగా వున్న మరి కుటుంబం బొడ్ల వారి కుటుంబం. వారిలో గట్టయ్య మా కంటే చాల పెద్దవాడు. బంగారం వ్యాపారంలో ఉండేవాడు. రెండవవాడు బొడ్ల హరిబాబు ఎన్నో వ్యాపారాలు చేసాడు, ఎంతో ఆత్మీయంగా వున్నవాడు. ఇక మూడవ వాడు అశోక్ అంజనీ మెడికల్ హాల్. చివరివాడు బొడ్ల చక్రపాణి. మా తోటి వాడు. మా పీ.ఎస్. వాళ్ళ క్లాస్ మెట్. వ్యాపారవేత్త. తనకు కరీంనగర్ లోని ఎస్.వీ.టీ.సి. కాలేజీ వ్యవస్థాపకుడు శ్రీ నాగభూషణం గారి అమ్మాయి అనురాధతో పెళ్ళి అయింది. ఇద్దరు సంతానం. బొడ్ల అనురాధ గారు డిగ్రీ పీజీ పూర్తి చేసి గొప్ప అధ్యాపకురాలయ్యారు. తానే నా కవిత్వాన్ని ‘SIGNATURE OF LOVE” పేర ఇంగ్లిష్ లోకి అనువదించారు. ( ఆ వివరాలన్నీ మరో సారి విపులంగా రాస్తాను).

          ఇక ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన నాయకుడు శ్రీ ప్రతాప చంద్రమౌళి. అదే సమయంలో డైరెక్ట్ ఎన్నికల్లో గ్రామపంచాయతి సర్పంచ్ గా ఎన్నికయిన వాడాయన. ఎలాంటి స్వార్థ రాజకీయాలు అంటని వాడు. మా ఫిలిం సొసైటీకి సలహాదారుగా వుండి ఆయన అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. ఏ మీటింగ్ కయినా పంచాయతీ హాలును వాడుకోండి అని అనుమతినిచ్చాడు.

          ఈ సమయంలో నా మదిలో గుర్తోస్తున్న మరి మిత్రుడు శ్రీ మ్యాన వెంగయ్య. రాజ్ ఫోటో స్టూడియో అధినేత. వేములవాడలో వున్నన్ని రోజులు మేమాయనతో సన్నిహిత సంబంధం వున్నవాళ్ళం. ఎంతో ఆత్మీయంగా వున్న స్నేహం మాది. ఒక్క వేములవాడ జాతర సమయంలో తప్ప కలువని రోజంటూ వుండేది కాదు. ఆయన దగ్గరే మొట్టమొదటి సారి డార్క్ రూమ్ చూసాను. ఫిలిం రీల్ డెవలప్ చేసే పద్ధతి, ప్రింట్ వేసే తీరు చూసాను. It’s a great experience, thanks to Vengaiah. ఆయనేమో తాను తీసిన నా ఫోటో ఒకటి పెద్ద సైజు చేసి స్టూడియోలో పెట్టాడు. దిష్టి కోసమా అని నవ్వుతూ నేనంటే ఫోటో చూడు ఎంత బాగుందో.. అన్నాడు.

          ఇక ఇక్కడ ఒక హోటల్ గురించి దాని యజమాని గురించీ తప్పక చెప్పుకోవాలి. హోటల్ పేరు నటరాజ్ హోటల్. యజమాని శ్రీ నర్సయ్య, మాకు దూరపు బంధువు తాత వరుస. ఇంకేముంది హోటల్ కు వెళ్ళినప్పుడల్లా సరదా మాటలు జోకులూ నవ్వు లాటలూ పండేవి. ఫిలిం సొసైటీ ప్రదర్శనల్లో రే ‘షత్రంజ్ కే ఖిలారీ’ వెశాం. సినిమా అయిపోయిన తర్వాత వచ్చి నటరాజ్ హోటల్ లో కూర్చుని టీ తాగుతూ సినిమా గురించి చర్చించుకుంటూ వున్నాం. ఇంతలో నర్సయ్య తాత వచ్చాడు. తానూ సభ్యుడే కనుక సినిమా ఎట్లుంది అని అడిగాం. ఏముంది సినిమా చూసి వచ్చి నా పని నేను చేసు కుంటున్నా అన్నాడు. మా కర్థం కాలేదు..అది అర్థం అయిన ఆయన సోమరితనం పనికి రాదనీ, వ్యసనం అసలే కూడదని తెలుసుకుని వచ్చి నా పని నేను చేసుకున్తున్నానోయీ మంచి సినిమా చూపించారు అని అభినందించారు. ఒక సినిమాకు అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది. అంతే కాదు అదే హోటల్ లో రంగులకల టీం వచ్చినప్పుడు కూడా ఆర్టిస్ట్ వైకుంఠం, సుదర్శన్ తదితరులం టీలు తాగి ఎన్నో ముచ్చట్లు పెట్టు కున్నాం.  

ఇంకా ఆ రోజుల్లో సిరిసిల్లాకు కానీ దగ్గరి ఏ ఇతర ప్రాంతాలకు కానీ సినీ సాహితీ ప్రముఖులు ఎవరు వచ్చినా వేములవాడ రాజన్న దగ్గరికి రావడం తప్పనిసరిగా జరిగేది. లేదా మేమన్నా తీసుకోచ్చేవాళ్ళం అట్లా ఒక సారి దేవదాస్ కనకాల, వి.మధుసూదన్ రావులు సిరిసిల్లాకు వస్తే వేములవాడకు పిలిచి ఫిలిం సొసైటీ మిత్రులందరమూ వారిని సత్కరించాం.

          ఇంకా ఆ రోజుల్లో పత్రికా విలేఖరులుగా వున్న సంకేపల్లి నాగేంద్ర శర్మ, మామిడిపల్లి కృష్ణమూర్తిలు కూడా ఎంతో స్నేహంగానూ, ప్రోత్సాహంగానూ వుండేవాళ్ళు. 

***

కాలం తోసుకెల్తుంది
తీరం ఆహ్వానిస్తుంది
సుఖః దుఖపు అలలు పరామర్శిస్తాయి
**** అంతేకాదు

తక్కువ చేసి చూసేవాడూ 
కించ పరిచేవాడూ ఉన్నంత కాలం
నీ ఎదుగుదలకు ‘ఎరువు’ కొరత వుండదు
పరుగుకు ‘వేగం’ తక్కువా కాదు….

***

          అందుకే నా బతుకు ప్రయాణం 1984 తర్వాత వేములవాడ నుంచి కదిలి కరీంనగర్ సిరిసిల్లల నడుమ కొనసాగుతూ వచ్చింది. కరీంనగర్ లో నివాసం సిరిసిల్లాలో ఉద్యోగం. తెల్లారి లేస్తే ప్రయాణం. బస్సు కావచ్చు. లారీ కావచ్చు. జీపయినా కావచ్చు. ప్రయాణం ప్రయాణమే. అయితే ఒక్కోసారి విచిత్రాలు జరిగేవి. బయలుదేరిన తర్వాత షాబాజ్ పల్లె వాగు వచ్చి పొంగి పొర్లి అక్కడ మూల వాగు మీద వున్న ‘రోడ్ డాం’ మునిగి పోయేది. ఇక ఏముంది. అటువాళ్ళు ఆటే ఇటు వాళ్ళు ఇటే. ఉసూరుమంటూ వెనక్కు తిరిగి వచ్చే వాళ్ళం. ఇప్పుడయితే తెలంగాణా వచ్చిం తర్వాత మిడ్ మానేరు ప్రాజెక్టు రావడంతో అక్కడ పెద్ద వంతెన కట్టారు. దాంతో షాబాజ్ పల్లె, కొదురుపాక లాంటి చాలా గ్రామాలకు వసతీ అందమూ రెండూ వచ్చాయి. అప్పుడు సిరిసిల్ల కాలేజీకి ప్రిన్సిపాల్గా వేములవాడ కు చెందిన రాగంపేట పుల్లయ్య గారి తర్వాత గోలి పద్మారెడ్డి గారు వచ్చారు. ఆయనా కరీంనగర్ నుంచే రోజూ మాతో కలిసే ప్రయాణం చేసేవారు. ఏ  వాహనమయినా ఎక్కే వారు. ఎలాంటి డాంబికం లేని మంచి మనిషి. తనకు విశ్వనాథ కవిత్వమంటే ప్రీతి. పద్యాలు ఆలవోకగా వినిపిస్తూవుండే వారు. నిజానికి తన సబ్జెక్ట్ మాత్స్. మేము ఖార్ఖాన గాడ్డా కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో అక్కడ పద్మా రెడ్డి గారు మాత్స్ అధ్యాపకుడు. మాది బయాలజీ కావడంతో తన క్లాసులు వినలేదు కాని గొప్ప టీచర్ అని పేరు. అట్లా నాకు మా పలువురు టీచర్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.అప్పటికే శ్రీధర్ రావు గారు, పార్వెల్ల గోపాలకృష్ణ గార్లతో కలిసి పని చేసాను. పద్మారెడ్డి గారితో పని గొప్ప సరదా గా వుండేది. చాలా సూటిగా స్పష్టంగా వుండే వారాయన.

          కాలేజీలో పని ఆ తర్వాత సిరిసిల్ల ఫిలిం సొసైటీ మిత్రులు రుద్ర రవి భోగ రవి, సలీం వారితో పాటు జూకంటి జగన్నాధం కొడం పవన్ సిరిసిల్లలో మిత్రులకేం తక్కువ.

          అదట్లా వుంటే కరీంనగర్లో మంకమ్మతోట, కాశ్మీర్ గడ్డల సరిహద్దులో నాన్న ఇంటి నిర్మాణం చేసారు. మొదట నాలుగు గదుల ఇల్లు తర్వాత కొంత ఖాళీ జాగా తర్వాత వంటిల్లు డైనింగ్ కోసం మరి రెండు గదులు. సాయన్నకిరాయి ఇంటి నుండి స్వంత ఇంట్లోకి మారడం మా అందరికీ ముఖ్యంగా అమ్మకు గొప్ప ఆనందం కలిగించింది. తను ఎంతో ఉత్సాహంగా వుండేది ఆ ఇంట్లో. అంతకు ముందు నుంచే మా నాన్నను దత్తత తీసుకున్న మా చిననానమ్మ లక్ష్మమ్మ మా తోనే వుండేది. తన చివరంటా మాతో వుంది. ఎంతో అమాయకంగా ప్రేమగా వుండేది. అప్పుడే మా పెద్దమ్మ సుమిత్రనారాయణ రావుల కుమారుడు నోముల రాజ్కుమార్ ఆతని చెల్లెలు రాజ్యలక్ష్మి చదువుకోవడానికి కరీంనగర్ వచ్చి మా ఇంట్లోనే వుండేవాళ్ళు ఇల్లంతా పెద్ద సందడిగా గడిచేది. ఇంతలో రాజ్ కుమార్ కు లంగ్స్ కు సంబంధించి ఒక చిన్న సమస్య వచ్చింది. అందరమూ కంగారు పడ్డాము. అప్పుడే వరంగల్ నుంచి బదిలీ అయి డాక్టర్ లక్ష్మినారాయణ అనే ఫిజిషియన్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కు వచ్చారు. కాన్చీట్ దగ్గరలోనే నివాసం వుండేవారు. తన దగ్గరకు తీసుకెళ్ళాం. ఆయన ఆయన శ్రీమతి ఎంతో సింపుల్గా వుండేవాళ్ళు. నేను వెళ్ళి  అడగ్గానే హాస్పిటల్ కు తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళగానే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. బెడ్ చుట్టూ పరదా కట్టి లంగ్స్ లోంచి ద్రవాన్ని తీసే పనిలో వున్నాడు డాక్టర్. ఇంతలో పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. పెద్దమ్మ ఏమి జరుగుతుందో నన్న భయంతో పరదా తీసిలోనికి తొంగి చూసింది. అంతే డాక్టర్ లక్ష్మినారాయణ గారికి కోపంతో బయటకు వచ్చి కత్తులు కటార్లు పెద్దమ్మకిచ్చి వెళ్ళు వెళ్ళి నువ్వు చేయిపో అన్నాడు. అందరం హతాశులమయ్యాం. నేనే ఎంతగానో ప్రాధేయపడితే తిరిగి వచ్చి ట్రీట్ చేసారు. తన పని తనను చేయనీయడం లేదన్నది సార్ కోపం. అది ఒక రకంగా నిజమే. ఎక్కడ యితే కోపం వుంటుందో అక్కడే ప్రేమా వుంటుంది అన్నట్టు డాక్టర్ లక్ష్మినారాయణ మా పట్ల ఎంతో స్నేహంగా వుండేవారు. ఆయన శ్రీమతి కూడా, ఇంతలో అమ్మకి కూడా వదల ని జ్వరం పట్టుకుంది డాక్టర్ లక్ష్మినారాయణ అనేక రకాల మందులు ఇచ్చినా తగ్గక పోయే సరికి.. ఒక సారి నన్నడిగారు గతంలో వేరే ఏదయినా సమస్య ఉండేదా అన్నారు. ఒకసారి ఎప్పుడో ఎదో సమస్య అన్నారు. డాక్టర్ భూమరెడ్డి చూసారు అని చెప్పాను. పాత రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ మార్చారు, అమ్మ క్రమంగా కోలుకుంది. కానీ పూర్తి నార్మల్ కాలేదు. తనకి  బాగాలేదు ఇక పెద్ద చెల్లి మంజులకు పెళ్ళి చేయాలని నాన్న నిశ్చయిం చారు. నాన్నకు తన పెద్దక్క కాశమ్మ అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుక్కి తన కూతురిని ఇవ్వాలని తలంపు. అమ్మకూ పెద్ద అభ్యంతరం లేదు. మేనరికమే కదా. ఏముంది పెదనాన్న జగన్నాధం ముందుపడ్డారు. శ్యాం బావతో పెళ్ళికుదిరింది. ఇంటి ముందే పందిరి వేసి ఘంగానే పెళ్ళి చేసారు నాన్న. అమ్మకు చాలా సంతోషం వేసింది. ఎందు కంటే 1974 తర్వాత మళ్ళీ వారాల వంశంతో రాకపోకలు శురూ అయ్యాయని. ఇంట్లో పెళ్ళి సందడి ముగియగానే పెద్దమ్మ మదిలో తన కూతురి పెళ్ళి గురించి ఆలోచన మొదలయింది. నేనప్పుడు సిరిసిల్లా కరీంనగర్ల నడుమ షెటిల్ కొడుతున్నాను. నాకు పలుసార్లు జీపుల్లోనో బస్సుల్లోనో బి.రమేష్ తారస పడేవాడు. తాను అప్పటికే ఎం.ఏ. ఎకనామిక్స్. కానీ గ్రూప్4 లో సెలెక్ట్ అయి సిరిసిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. వేములవాడ దగ్గరి మామిడిపల్లికి చెందిన తను మంచి వాడు అనిపించింది. పెద్దమ్మ వాళ్ళకు చెప్పాను. ఇంకే ముంది సోల్తీ పెట్టారు. సంబంధం కుదిరింది. మాటా ముచ్చటా అయి పెళ్ళి నిశ్చయమయింది. కిష్టాపూర్ లో పెళ్ళి. నేను కొంచెం ఎక్కువే బాధ్యతలు తీసుకున్నాను. కరీంనగర్ నుంచి సామాన్లు తీసుకెళ్ళి ఆ వూర్లో మొట్టమొదటి సారి అతిథులకు ‘బఫే’ భోజనం పెట్టాం. పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. రాజ్యం రమేష్ లు సిరిసిల్లాలో కాపురం పెట్టారు. రుద్ర రవి వాళ్ళతో కూడా వాళ్ళకు స్నేహం కుదిరింది. అదొక జ్ఞాపకం.     

          మరో వైపు నాకు స్థాన చలనం. గోదావరిఖని కాలేజీలో పనిచేస్తున్న మిత్రుడు ఎడ్ల రాజేందర్ రిక్వెస్ట్ పెట్టుకుని సిరిసిల్లకు బదిలీ చేయించు కున్నాడు. నాది పరిపాలనా త్మక బదిలీ. తాను వెంటనే వచ్చి జాయిన్ అయ్యాడు. ఆటోమేటిక్ గా నేను రిలీవ్. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి అంతకు ముందే ఎప్పుడో రాజేందర్ బదిలీకి ప్రయత్నం చేశాడుట. ఆనంద రావు గారని RJD, ADMINISTRATIVE OFICER ని కల్సి విజ్ఞప్తి చేసారు. అందుకు ఆయన పాజిటివ్ గానే స్పందించారు. కానీ ఆనంద రావు గారి అల్లుడు ఇంజేనీర్ అశోక్ కుమార్ నా పాత మిత్రుడు. విషయం తెలిసి సిర్సిసిల్లలో మా మిత్రుడు న్నారు ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పడంతో అప్పుడు అది ఆగిపోయిది. ఆ విషయం చాల రోజుల తరవాత అశోక్ ఒక సారి నాకు చెప్పాడు. అయినా రాజేందర్ కు గోదావరిఖనిలో ఇబ్బందిగా వుంది కాబట్టి బదిలీ ప్రయత్నం పట్ల నా కేమీ తప్పనిపించలేదు. అది సహజం. కానీ నాకు గోదావరిఖని వెళ్ళడం ఇష్టం లేదు. పెద్ద కారణం అంటూ లేదు కానీ ఎందుకో నొ..

          వరంగల్ లో REGIONAL JOINT DIRECTOR, బదిలీ చేయాలి ఎంతో ప్రయత్నం చేసాం. చుట్టాలతో స్నేహితులతో చేసిన ప్రయత్నాలేవీ ఫలితం ఇవ్వలేదు. అప్పుడు RJD గా వున్న పీసి రావు పెద్ద లంచగొండి అని డబ్బులు ఇస్తే తప్ప పనులు కావని ఎవరో చెప్పారు. ఏముంది నా అమాయకత్వమో ఆతి తెలివో. మర్నాడు పీసీ రావు ఇంటికి వెళ్ళా ను సార్ అని పిలిస్తే వాళ్ళమ్మాయి వచ్చి నాన్నగారు లేరు ఆఫీసుకు వెళ్ళారు అక్కడే కలవండి అంది. నేనూరుకోవాలి గదా .. నాకో ట్రాన్స్ఫర్ పనుంది ఈ డబ్బులు సార్ కివ్వండి.. అని ఇచ్చాను ఆ అమ్మాయి కంగారు పడిపోయింది. నొ నొ అంటూ లోనికి పారి పోయింది. నేను అప్పటికి గుర్తించాను నేను చేసిన పని తప్పని. ఏం చేస్తాను ఉసూరు మంటూ తిరిగి వచ్చాను. 

          ఇక చివరి ప్రయత్నంగా అప్పుడు అక్కడే వడ్డేపల్లి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా  పనిచేస్తున్న అంపశయ్య నవీన్ గారిని వెళ్ళి కలిసాను. విషయం చెప్పాను. సరే నేను జేడీ ని ఇవ్వాళ కలుస్తాను రేపు రా అన్నాడు. మర్నాడుదయం వెళ్ళగానే ఆనంద్ వాళ్ళు డబ్బులు తింటారు గానీ అంత డైరెక్ట్ గా వుండదు వ్యవహారం. నేను వెళ్ళి చెప్పగానే ఇంతెత్తున ఎగిరాడు..నువ్వు రచయితవు అదీ అని చెప్పగానే నేమ్మదించాడు.. కానీ పని అవుతుందని చెప్పలేను అన్నాడు. ఇంకే ముంది అప్పటికే నాలుగు నెలలు గడిచాయి సెలవులు దాదాపు అయిపోయాయి. అలసిపోయాను.

          మర్నాడు ఉదయం బస్సెక్కి గోదావరిఖని వెళ్ళి అక్కడ కాలేజీలో చేరిపోయాను. బంధువుల ఇంట్లో కొంతకాలం వున్నాను. పెద్ద దూరం కాదు కాబట్టి సోమవారం ఉదయం బయలుదేరి కాలేజీకి వెళ్ళి రాత్రి వాళ్ళింట్లో బస వారంలో మధ్యలో ఒకసారి, వారాంతం మరోసారి కరీంనగర్ వెళ్ళడం అంతే అట్లా కొంత కాలమే. కాలేజీలో స్నేహాలు కలిసాయి కాలేజీకి ముందే వున్నఅశోక్ టాకీస్ వెనకాల గదుల్లో కొందరం కలిసి చేరిపోయాం.

గోదావరిఖని అనుభవాలు మళ్ళీ …

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.