రాగసౌరభాలు-1

(ఉపోద్ఘాతం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

 

|| యౌసా ధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః
రంజకో జన చిత్తానాం సరాగః కథితో బుధైః ||

ఏ ధ్వని అయితే స్వరవర్ణములచే అలంకరించబడి, వినువారి మనసులను రంజింప చేస్తుందో అదే సురాగము అని ఆర్యోక్తి.

          నెచ్చెలులూ! ఇవాళ మనం రాగం గురించిన విశేషాలు, ఎక్కువగా థియరీ జోలికి పోకుండా, తెలుసుకుందాం. వచ్చే నెల నుంచి ఒక్కొక్క రాగం తీసుకుని ఆ రాగ లక్షణాలు తెలుసుకుంటూ ఆ రాగం ప్రత్యేకతలు, ఆ రాగంలో ఉన్న ముఖ్యమైన రచనలు తెలుసుకుందాం. మరి చెలులంతా సిద్ధమేనా?

          ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు మంచి రాగం శ్రోతల మనసులను రంజింప జేయాలి. అసలు సంగీతం ఉద్దేశ్యమే అదికదా!

          శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అనే నానుడి తెలిసిందే కదా! సంగీతం వినిపిస్తే పాడిపశువులు ఎక్కువ పాలు ఇస్తాయని శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు. ఇంకా రాగాల గురించి అనేక గమ్మత్తైన విశేషాలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇక
రంగంలోకి దిగేద్దామా?

          ముఖ్యంగా రాగాలు రెండు రకాలు అవే జనక రాగాలు, జన్యరాగాలు. జనకరాగాలనే మేళకర్త రాగాలు అని కూడా అంటారు. మనకి స్వరాలు ఏడు అనే సంగతి తెలిసిందేగా? ఇందులో ‘స’, ‘ప’ స్వరాలు అచల స్వరాలు. ఈ స్వరాల స్థానాలలో తేడాలు ఉండవు. మిగిలిన ఐదు స్వరాల వైవిధ్యాలను బట్టి ‘రి’ 3, ‘గ’ 3, ‘మ’ 2, ‘ద’ 3, ‘ని’ 3, లు ‘స’, ‘ప’ స్వరాలతో కలిపి 16 స్థానాలు ఉంటాయి. ఈ స్వరాల వివిధ ప్రస్ధారాల వలన 72 మేళకర్త/జనకరాగాలు ఏర్పడ్డాయి. వీటిలో ఆరోహణ అవరోహణలో ‘సరిగమపదనిస’ ‘సనిదపమగరిస’ అదే క్రమంలో తప్పనిసరిగా ఉంటాయి.

          ఇక ప్రతి జనక రాగం నుంచి అనేక వేల జన్య రాగాలు పుట్టి సంగీతం అపారంగా, అనంతంగా విస్తృతి చెందింది, ఇంకా చెందుతూనే ఉంది. వీటిని ఉపాంగ రాగాలు అంటారు ఈ రాగాలలో కొన్ని శ్రావ్యతను, రాగ సౌరభాన్ని పెంచేందుకు తమ జనక రాగంలోని స్వరాలే కాకుండా, రెండు లేదా మూడు లేదా నాలుగు భిన్న స్వరాలను కలుపుకొని అందాన్ని సంతరించుకుంటాయి. వీటిని భాషాంగరాగాలు అంటారు. ఇంకా
ఎక్కువగా లోతుల్లోకి పోకుండా ఒక్కొక్క రాగాన్ని తీసుకున్నప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

          మన ఇళ్ళల్లో,పెళ్ళిళ్ళలోనూ, మరేదైనా శుభకార్యంలోనూ మంగళవాద్యాలు తప్పని సరి కదా! వాళ్ళు సాధారణంగా వాతాపిగణపతింభజేహం కానీ, మహాగణపతిం అని కానీ, శుభారంభం చేస్తారు. ఇలా కొన్ని శుభప్రదమైన రాగాలు ఉంటే, కొన్ని రాగాలు మనల్ని నిద్రలోకి జారుస్తాయి. పసిపిల్లలు కూడా లాలిపాటలు వింటూ నిద్రపోవటం పరిపాటే కదా! కొన్ని రాగాలు వింటుంటే కదనోత్సాహము కలుగుతుంటే, కొన్ని రాగాలు మనసుకి శాంతిని కలిగిస్తాయి. అమృతవర్షిని రాగంతో వర్షాలు కురిపించారని, దీపక్ రాగంతో దీపాలు వెలిగాయని, అనేక కథలు ఉన్నాయి. అటువంటిదే ఇంకొక కథ  తెలుసు కుందాం.

          ఆహిరిరాగం మధ్యాహ్న సమయంలో పాడితే ఆహారం దొరకదు అంటారు. 

          ఒక పండితుడు చద్దిమూట కట్టుకొని అడవిలో వెళుతూ తన చద్దిమూటను ఒక వెదురు చెట్టు కొమ్మకి తగిలించి, ఆహిరిరాగాన్ని పాడి, అలసి నిద్రపోయాడట వెదురు కొమ్మలు మధ్యాహ్నానికి నిటారుగా అవ్వటం వలన అతనికి చద్దిమూట అందక భోజనం చేయలేకపోయాడట.

          రాగాలకు ఉన్న ఇంకొక ముఖ్యమైన లక్షణం అనేక రోగాలకు సాంత్వన చేకూర్చ టం. ఆటిజం, కుంగుబాటు వంటి తీవ్రమైన సమస్యలకే కాక, తలనొప్పి, నీరసం వంటి సమస్యలకు కూడా దుష్ప్రభావాలను చూపని విధంగా సంగీతం పనిచేస్తుంది.  విన్నారు గా రాగం గురించిన కొన్ని వింతలు విశేషాలు? వచ్చే సంచిక నుంచి ఒక్కొక్క రాగ సౌరభాన్ని అఘ్రాణిస్తూ, ఆ రాగంలో ఏమేమి కీర్తనలు ఉన్నాయో అలాగే మరే ప్రముఖుల రచనలు ఉన్నాయో తెలుసుకుందాం.

          నెచ్చెలులూ! మీరంతా సిద్ధమేగా? వచ్చేనెల కలుసుకుందాం!

*****
Please follow and like us:

10 thoughts on “రాగసౌరభాలు-1 (ఉపోద్ఘాతం)”

  1. చాలా సంతోషంగా ఉంది .వాణి నల్లాన్ చక్రవర్తి గారు. మీరు సంగీతోపోసన ,నాదోపోసన చేసిన కుటుంబం నుంచి వచ్చిన వారు.
    పైగా స్వయంగా మీరు కూడా సంగీతం అభ్యసించారు.
    మీరు తెలిపే రాగ లక్షణాల గురించి నిరీక్షిస్తుంటాను.
    చిన్న మాట మేడం నాకు తోడి రాగం అంటే చాల అభిమానం, ఆ తరువాత కానడ రాగం .

    ఇది నెచ్చెలి పాఠకులకు ఓ సువర్ణావకాశం.
    ధన్యవాదాలు

  2. రంగాల పరిచయం అద్భుతంగా ఉండండి. ఫాలో అయిపోతాము.

  3. Raaga vaisistaalu telipe ee prayatnam entho mechukotagga vishayam. Sangeeta nishnaatulu paiga, entho pratibha kala kalakarini teliyajese vishayaalskai vechi unnamu. Thank you 🌹vani

  4. “స్ప్రింగ్ బ్రేక్” వలన classes నుండి కొంత ఖాళీ దొరికింది. పన్ను నొప్పి వలన మాట్లాడకుండా వుండే వీలు దొరికింది. ఏ శీర్షిక తో చదవడం మొదలు పెడదామా అనుకుంటే “రాగ సౌరభాలు” కనిపించింది. పౌర్ణమి చంద్రుడు, మల్లెల సౌరభం ఎదురుగా. ఆలస్యమెందుకు? రాగ సౌరభాలు చదవడం ఆరంభించాను. ఎంత చక్కగా అర్థం అయ్యేట్లు వాణి నల్లాన్ చక్రవర్తి గారు వివరించారో చెప్పలేను. ఇందులో నాకు నేను బోధించే గణితం మరియు ఫిజిక్స్ అంశాలు కూడ కనిపించేటప్పటికి మరింత ఉత్సాహం వచ్చింది. అవి ఏమిటో ఇక్కడ చెప్పాలంటే ఈ మెయిల్ పెద్దది అవుతుంది.
    మొత్తం మీద మళ్ళీ సంచికకు ఎదురు చూసెట్లు చేశారు .
    నిర్మల

Leave a Reply

Your email address will not be published.