సర్వసంభవామ్ – 3
-సుశీల నాగరాజ
తిరుమల కొండ…ఇది కట్టెదుర వైకుంఠము! అనేక మహిమల ఆలవాలము!! భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు!
వేదములే శిలలై వెలసిన కొండ
తిరుమలకొండ!
సర్వ భారతీయ మత శాఖలు అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగాభావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు.! భావములోనూ బాహ్యము నందునూ!!!
ఎవరికి వారికి ఎన్నెన్ని స్వానుభవాలున్నా కార్య నిర్వహణాధికారిగా ప్రసాద్ గారి అనుభవాల సమాహారం ప్రత్యేకమై ‘సర్వసంభవామ్’ పేరిట సంతరించుకోవడం వెనుక… నాహం కర్తా హరిః కర్తా అనేది ముమ్మాటికి అక్షర సత్యం!!!..
పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ I A S, గారి ‘సర్వసంభవామ్’ పుస్తకంలోకి !!!
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారం!
1977 లొ నీటిపారుదల మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం వారిచె నియమించబడి హైదరాబాద్ కు వచ్చారు.
ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డిగారి నుంచి ప్రసాద్ గారిని టి టి డి కార్యనిర్వహణాధికారిగా నియమించాలన్న సూచనరావటం..బదిలీలతొ తిరిగే వారికే అందులోని సాధక బాధకాలు అర్థమౌతాయి.
అప్పుడే హైదరాబాద్ కు బదిలీ పై వచ్చి పిల్లల్ని బడిలొ చేర్పించి , స్వంత ఇంట్లో స్థిర పడుతున్న సమయంలొ టి టి డి కార్యనిర్వహణాధికారిగా నియమించాలన్నసూచన రావటంతొ ప్రారంభమౌతుంది మొదటి శీర్షిక.
టి టి డి అధికారాన్ని అంగీకరించటమా వద్దా అన్న డోలాయమానంలొ ఉంటుంది వారి మనస్సు.
ఒకరోజు ఉన్నట్లుండి సినీమా హాలులొ వారి అమ్మాయికి విపరీతమైన మోకాలిలొ నొప్పి రావటం, ఏ మందులకు లొంగక, ఒక నెల పైన బడికి వెళ్ళలేకపోవటం జరుగు తుంది.
చివరికి పోస్టింగ్స్ ఆర్డరు తీసుకుని ఇంటికి వెళ్ళగానే, అమ్మాయి నొప్పి పోయి మామూలుగా నడవగలుగుతున్నానని గెంతుతూ రావటం చూసి ఆశ్చర్యంకలుగుతుంది.
అప్పటి నుంచి తను చేస్తున్న ప్రతి కార్యంలోనూ అదృశ్యంగా భగవంతుని హస్తం కనిపిస్తుండేది.
ఇలా ప్రసాద్ గారు తను తలపెట్టిన కార్యాలలొ వచ్చిన అడ్డంకులు, ఆటంకాలు, ప్రతిఘటనలు, ఎన్నో గండాలు ఏడుకొండలవాడి కృపా కటాక్షంతొ పరిహారమైనాయం టూ వివరిస్తారు.
ప్రతి అధ్యాయమూ పాఠకులను ఆశ్చర్యంలొ ముంచెత్తటమే కాదు, దివ్యానుభూతికి లోనుజేస్తుంది.
జపాలకు జడివానలు!!!
తిరుపతి కొండ పై నీటి కొరత. గోగర్భం రిజర్వాయరు పూర్తిగా ఎండిపోవటం!మానవ ప్రయత్నాలు విఫలం కావడం.
చివరికి వరుణ జపం ప్రారంభం చేయటం. మూడవరోజు సాయంత్రం పుష్కరిణి నుంచి ఆలయం వైపు నడుస్తుంటె వెనుక నుంచి విలేఖరులు ‘ కన్నీళ్ళే తప్ప, వర్షం నీరు కనపడటం’లేదన్న వ్యాఖ్యలు వింటూ ముందుకు సాగటం.
తిరుపతి కొండమీద మాత్రం క్షణంలొ కుంభవృష్టి కురవటం !!! గోగర్భం రిజర్వాయరు పొంగిపొర్లటం.
తిరుమల కొండ పైన నీటి కొరత తీరటం. !
ఇలా తను చేసే ప్రతి కార్యంలోనూ భగవంతుని అభయహస్తంతొ అవరోధాలు కావొచ్చు, పరిపాలనకు సంబంధించిన వైఫల్యాలు కావొచ్చు, భక్తుల సౌకర్యార్థం చేసే పనుల్లొ ఎదురైన సమస్యలు కావచ్చు, అన్ని దూదిపింజల్లా ఎగిరిపోయేవి.
తిరుమలకొండలొ నేటి సౌకర్యాలకు శ్రీకారం చుట్టిన అనేక మందిలొ ప్రసాద్ గారు ఒకరు!
వైకుంఠ క్యూ కాంప్లెక్స్ , మాడవీధుల విస్తరణ, ఆధునిక క్యాంటిన్లు, భక్తుల అనుకూలం కొరకు ‘మాస్టర్ ప్లాను’ మొదలు పెట్టింది ప్రసాద్ గారే.
ఈ ప్రణాళికల సమయంలొ ఇళ్ళు, గుడిసెలు,షెల్టర్లు,దుకాణాలు,
భక్తులకు స్వామి దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, టాయలట్ సమస్యలు పరిష్కరించడం .
ఇలా భక్తుల కొరకు సౌకర్యాలు సమకూర్చడానికి తానే స్వయంగా భక్తులతొ నడక మార్గంలొ మమేకమై ముందుకు సాగటం ద్వారా అనుకూలమైంది .
వర్షానికి, ఎండకూ షెల్టర్లు నిర్మించటానికి కూడా ఇదే కారణం. నడిచి వచ్చే భక్తుల లగేజీ వాళ్ళ గదులకు చేర్చటము కూడా .
అంతేకాదు గరుడ, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించటం, ఇవన్నీ వారి కార్యదక్షతకు నిదర్శనం!
తీర్థం, శటారి గర్భగుడి గుమ్మం లోపల కాకుండా బైట ఇవ్వాలని రూలు పెట్టడం, సాహసోపేతమైన నిర్ణయం. ఆ కారణంగా ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించటమే ముఖ్య ఉద్దేశ్యం.
అంతేకాదు స్వామి దర్శన భాగ్యం కేవలం స్వామి వారి అనుగ్రహం మీదే ఆధారపడి వుంటుంది అని నిరూపించే శీర్షిక “అర్థరాత్రి చీఫ్ సెక్రటరీ”.!
తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనలు ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మూల కారకుల్లొ ఒకరు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు.
రాగిరేకుల మీద లభ్యమైన కీర్తనలను వ్రాత ప్రతుల్లోకి మార్చటంలొనూ, ఆ కీర్తనల వైశిష్ట్యాన్ని వెలుగులోకి తీసుకు రావటంలోనూ అనేక సంవత్సరాలు కృషి చేసిన మహా పురుషుల్లొ అనంతకృష్ణశర్మగారు ముఖ్యులు.
వారి చివరి దశలొ ‘ఆస్థాన పండితులుగా నియమించటం, శ్రీవారి గోల్డుడాలరు మెడలొ వేసి, శాలువా కప్పి , ప్రసాదం ఇవ్వగానే ఆయన కంటివెంట భాష్పాలు ఏకధారగా కారుతున్నాయి. వారి చివరి మాటలు ‘ఇన్నాళ్ళకు నా మీద దయగలిగిందా స్వామి !.’ఆ తరువాత 10, 15 నిమిషాలకు ఆ ప్రసాదం చేతిలో ఉన్నట్లే వారి ఊపిరి శ్రీ వారిలొ కలిసి పోవటం!
‘భారతరత్న ‘ అవార్డుపొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి !
శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః’
పరవశింపజేయగల గాత్ర మాధుర్యం ఆమెది. సంగీత కచేరీలలొ శ్రోతలు ఆమె గానలహరిలొ మునిగిపోయేవారు. ఆమె గాత్రం నుంచి జాలువారే భక్తి ప్రవాహంలొ ఓలలాడేవారు. జవహర్ లాల్ నెహ్రూ ‘Queen of Music’ అని శ్లాఘించారు.
ఎంతో మంది దిగ్గజాలు రూపొందించిన కీర్తనలకు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. వీటితొ గడించిన కీర్తి ఒక ఎత్తు!
ఎమ్.ఎస్ గార్కి ఆర్థిక సహాయం కోసం బాలాజీ పంచరత్నమాల ప్రాజెక్టు, ప్రారంభించినపుడు… మద్రాసులొ వారు అద్దెకుంటున్న చిన్న ఇంటికి వెళ్ళారు ప్రసాద్. ఈ ప్రాజెక్టు గురించి విని సంతోషించినా, కొంచెం వెనక్కి తగ్గారు ఆమె భర్త సదాశివం.’ అన్నమయ్య కీర్తనలు తెలుగులో ఉంటాయి. తమిళ యాస చొరబడకుండ పాడాలంటె ఈ వయస్సులొ ఆమెను బాధ పెట్టటమే అవుతుంది. ఇది సంశయం.
అంతలో ఎం.ఎస్ రావటం నేను బహూకరించిన శ్రీనివాసుని చిత్రపటాన్ని చూస్తూనే ‘ పెరుమాళే … ఎనక్కాక నీంగళే వందు విట్టీర్ గళా. ( శ్రీనివాస, నా కోసం తమరే వచ్చేశారా ?! ) అంటూ పరవశించి పోవటం.! ఆ పెరుమాళ్ కోసం ఎంత కష్టమైనా సాధన చేస్తాను. ఒప్పుకోండి అని భర్తకు చెప్పటం! ఆయన అంగీకరించటం. ఆమె కళ్ళ నుంచి ఆనందాశ్రవులు రాలటం!! ఆ విధంగా ఆమె ఆ వయస్సులొ చేసిన అకుంఠిత సాధనా ఫలితమే నేడు …….. తెలవారగానే తిరుమల మొదలూ ప్రతి దేవాలయంలొ, ప్రతి లోగిళ్ళలొ మొదట ఎం.ఎస్. సుప్రభాతంతొ మేలుకొలుపు , విష్ణుసహస్రనామం భజ గోవిందం అన్నమాచార్యుల కీర్తనలతొ ప్రతిధ్వనిస్తూ గడించిన కీర్తి ఆమెను పతాకస్థాయి కి చేర్చి ఆమె జీవితానికి ధన్యత చేకూర్చింది.
ఇక్కడ ఒక విషయం ఉదహరించాలి అక్బర్ ఆస్థానంలో ఉన్న తాన్ సేన్ మహా గాయకుడు. ఒక రోజు అక్బర్ అద్భుతమైన గాత్రాన్ని విని ,తాన్ సేన్ ను పిలుచుకుని వెళ్ళి ఆ గాత్రాన్ని అతనికి వినిపిస్తాడు. ఆ గాత్రాన్ని వినగానే చిరునవ్వుతో తాన్ సేన్ ‘ నిజమే మహాప్రభూ, ఎందుకంటే నా గాత్రం డిల్లీశ్వరుణ్ణి కీర్తించటానికి మాత్రమె పరిమిత మైంది. కానీ అతని గాత్రం ఆ జగదీశ్వరుణ్ణి కీర్తించటానికి అంకితమైంది’ అంటాడు.
అలాంటి ధన్యజీవి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి.
పంచరత్నమాలా ప్రాజెక్టు ద్వారా ఆమె ఆలపించిన స్వరరాగ ప్రవాహం అజరా మర మైనది. ఎం.ఎస్ జీవితం చరితార్థమైనది. ఆ దివ్యమంగళ విగ్రహరూపునికి ఆమె చేసిన సంగీత సేవతొ పునీతమైనది.!!
చిక్కమంగళూరులొ ఉన్న డి.ఎస్.నాగరాజారావు ఒక ప్రాధమిక స్కూలు టీచర్. ఆ చాలీచాలని జీతంతోనే తల్లి, దండ్రి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తన కుటుంబాన్ని పోషించు కోవాల్సిన స్థితి.
ఆ భక్తునికి స్వప్నంలొ వచ్చి కాసులహారం సమర్పించుకుంటావా’ అని అడగటము. ఆ భగవంతుని కోసం, ఏళ్ళ తరబడి ఒంటి పూట ఉపవాసం చేయటమూ , క్రమంగా ఇంట్లో పరిస్థితులు మారి, తమ్ముళ్ళకు ఉద్యోగాలు వచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం. 16 సంవత్సరాల తరువాత 108 కాసులతో కాసులహారం తయారు చేయించి స్వామికి సమర్పించుకున్న భక్తుల గురించి మనకు ఈ సర్వసంభవామ్ ద్వారానే తెలుస్తుంది.
1982 ఫిబ్రవరిలో మూలవిరాట్టుకి అష్టబంధనం చేసే కార్యక్రమం. సంప్రోక్షణ చేస్తేనే పూర్వపు పవిత్రత పునరుద్దరించబడుతుందని ఆగమశాస్త్రం పేర్కొంటుంది.
సరిగ్గా ఆ అష్టబంధనానికి ముందుటి రోజు అర్చకులు వచ్చి నవరత్నాల సెట్ కావాలని చెప్పడం. ఒకటి తక్కువ కావడానికి మధ్యలో వరాహస్వామి పునరుద్దరణ కార్యక్రమం కొత్తగా చేర్చటం. అవి సేకరించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమ య్యాయి. భారం భగవంతుని పై మోపి గెస్ట్ హౌసుకి వెళ్ళారు.
ఆ అర్థరాత్రి సమయంలొ తన కోసం నాలుగు గంటల నుంచి నడివయస్సు దంపతులు నిరీక్షిస్తున్నారు. వారిని పలకరించె ఓపిక, మనస్సు లేకున్నా కలుస్తారు. . చివరికి తెలిసిందేమిటంటే ‘ ఆలయంలో మూలవిరాట్టుకి అష్టబంధనం చేయిస్తున్నా రని పత్రికలో చదివాను. అష్టబంధనానికి ముందుగా నవరత్నాలు ఉపయోగిస్తారుగా అందుకోసం నవరత్నాలు బహూకరించాలని కోరుతున్నాం.’ అది వినగానే అర్ధరాత్రిలొ సూర్యోదయం అయిందా అనిపించింది. ఇలాంటి ఘటనలు చదువుతుంటె మనసు పులకరించి పోతుంది.
ఎవరో ఆదేశించినట్లు సరైన సమయానికి నవరత్నాలను కానుకగా అర్పించి,సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగినట్లు చేసిన భక్తుడి గురించి తెలిసి ఆశ్చర్య పోవటమె కాక పుస్తకం కింద పెట్టనీక చదివించుకు పోతుంది.
“నాహం కర్తా, హరిః కర్తా“ అనే శీర్షికలో పాడయిపోయిన ధ్వజస్తంభాన్ని మార్చి నూతన ధ్వజస్తంభం స్థాపించటం, ఎంతో సాహోసోపేతం. నిజంగా స్వామి వారే ఆ ఏర్పాటు చేసుకొన్నట్లుగా వుంటుంది.
కర్నాటకలోని ధండేలీ కొండవాలుల్లొ కావలసిన ఆరుమాన్లు దొరకటం ఒక అద్భుతం. అవి విరాళంగా ఇస్తున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ గుండూరావూగారు ప్రకటించారు. తరువాత అంత పొడవువున్న మాన్లు ఏ తొందరకు గురికాక తిరమలకు చేరిపోయాయి.
కొండ పైకి సాగించటం చదువుతుంటె వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అడుగడుక్కు భగవంతుడే ఉండి సాగించాడా అనిపిస్తుంది. 75 అడుగుల మానును పూర్వం ఉన్న ధ్వజస్తంభం చోట ప్రతిష్టించడం ఒక ప్రహసనమే. ఇదే ఈ పుస్తకానికి శీర్షిక గా’ నాహం కర్తా హరిః కర్తా’ అర్హత సాధించుకొంది.
స్వామి వారి పాలాభిషేకంలోని విధి విధానాలు చదువుతుంటె స్వామివారిని ఆ సేవలొ చూసే భాగ్యం ఎంత మందికి కలుగుతుంది!!
తన కూతురు మాధవి పెళ్ళి విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. అల్లుడ్ని పెళ్ళిపీటల పైనే చూడటం ప్రసాద్ గారికి స్వామి వారి పై ఉన్న నిశ్చల భక్తి, భగవదనుగ్రహం పై అచంచలనిష్ఠ.
చివరగా తనకు బదిలీ అయ్యి వేరొక ఉద్యొగంలో చేరేటప్పుడు స్వామి వారి సమక్షం లో చార్జి జరగాల్సింది.
అనేక కారణాల వలన అది నెరవేరదని నిరాశ చెందుతున్న సమయంలొ ‘ఆనందం అర్ణవమైతె ‘ అన్నీ అనుకూలించి ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడైన కలియుగ దైవం శ్రీమన్నారాయణుడి సమక్షంలోనే ప్రసాద్ గారికి ఛార్జి అప్పగించారు. అంతకుమునుపే ‘మేల్ఛాట్’ వస్త్రంతొ సత్కరించారు. స్వామివారి గజాలు ముందు నడుస్తుంటె, సన్నాయి మేళాలతొ, వందలాది అభిమానులతొ, ప్రేమపూర్వక వీడ్కోలు చేశారు.
ఇదంతా అద్భుతం, అవ్యక్తం, అనిర్వచనీయం!!
చివరి భాగం వచ్చినపుడు ప్రసాద్ గారు’ సకలకళా వల్లభుడు ‘అన్న అధ్యాయం తీసేద్దామని ప్రచురణకర్త అన్నపుడు ,
”నేను” ఏమిటని తీర్పు ఇచ్చేవాడు భగవంతుడు. పాఠకులు తీర్పుఇస్తారని నేను పైవాడిని మోసం చేయగలనా! ఆ చాప్టర్ ఉండాల్సిందె! అని చెప్పారు
పనిరాక్షసత్వం!
‘నో ‘అని చెప్పడం సులభం. కార్యం మంచిదైతె, మార్గాన్ని , శక్తినీ, యుక్తినీ పైవాడే ఇస్తాడు.
మానవసంబంధాల నిర్వహణలొ ప్రసాద్ గారిది అందెవేసినచేయి! ఆయన నిజాయితీకి ఒక నిలువెత్తు విగ్రహం.
అత్యంత సమర్థుడైన కార్యనిర్వహణాధికారి !
ఎంతో మంది కార్యనిర్వహణాధికారులుగా పనిచేసిన, చేస్తున్న వారంతా కర్తవ్యంగా భావించి పని చేశారు, పని చేస్తున్నారు. కానీ ప్రసాద్ గారు అచంచలమైన భక్తి ప్రపత్తులతొ, స్వామిసేవగా భావించి తన కర్తవ్యాలను నిర్వహించారు.
ఒక ముక్కలో చెప్పాలంటే…
ఇది ఒక అధికారి రాసిన ఏడుకొండలవాని దివ్య చరితం. అందుకే సంకల్పం మంచిదైనపుడు దాని తాలూకు ఫలితం ఎప్పుడూ విజయం వైపే ఉ౦టుంది! అన్నిటికీ మించి స్వామి దివ్యహస్తం ప్రసాద్ గారికి ప్రతికూల పరిస్థితుల్లో అభయహస్తమై నిలిచింది! సమస్యలను అధిగమించి వేలెత్తి చూపిన వారి నుంచి ప్రశంసల జల్లు కురిపించేలా చేశాయి. ఆయనను చివరి వరకూ టీటీడీ గౌరవ సలహాదారుగా కొనసాగించ డమే ఇందుకు నిదర్శనం!!
పుస్తకం పేరే కాదూ, ప్రసాద్ గారిని నడిపించిన వాక్యం ‘ నాహం కర్తా హరిఃకర్తా!
21 August 2018 ప్రసాద్ గారు భౌతికకాయాన్ని వదిలారు. అత్యంత సమర్థుడైన అధికారి. ఎంతో ప్రేమతొ, భక్తిప్రపత్తులతో, నిలువెత్తు వ్యక్తికి నివాళి.
చివరిగా అంతయు ఆతడే!
మన కులమతాలు,, కలిమి లేములు మన తలపు – నెలవు, వెనుకా- ముందు సర్వ పరివ్యాప్తమై ఆవహించియున్న ఆ దేవదేవుని లీలలు ప్రతివారికీ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో అనుభవమౌతూ ఉంటాయి..!
ఈ ‘సర్వసంభవామ్’ గురించి నేను రాస్తానని, రాయగలనని ఎప్పుడూ అనుకోలేదు. కారణం ఈ ఆధ్యాత్మికత గురించి నాకులేని అవగాహన. ఇందులో ఏదైనా తప్పుగా రాసి ఉంటె అది నాకున్న అవగాహనా లేమితనం. అంతే! ముందుగానే అందుకు క్షమాపణ లు కోరుతున్నాను.!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాతడు..!! కలియుగ దైవంగా, భక్తులపాలిటి కొంగు బంగారమై నిలుస్తున్న ఆపద మొక్కులవానికి నేను ముకుళిత హస్తాలతో అర్పించుకుంటున్న ప్రసూన మాలిక ఈ “”నాహం కర్తా హరిః కర్తా”” సమీక్ష!!
‘వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి!’
*****
(సమాప్తం)