కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-15

“గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే” — ఆచంట సత్యవతమ్మ

 -డా. సిహెచ్. సుశీల

          ఆది శంకరాచార్యుల వారు యావద్భారత దేశం పర్యటించి హైందవం, సనాతన ధర్మం సంబంధిత గ్రంథాలను, భాష్యాలను, వ్యాఖ్యానాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేకమంది శిష్యులు వారిననుసరించారు. శంకరాచార్య నాలుగు ప్రముఖ పీఠాలను ఏర్పాటు చేయడమే కాక సన్యాసుల కొరకు వివిధ ప్రాంతాలలో మఠాలను ఏర్పాటు చేసారు. శంకరుల వారి తదనంతరం వారి శిష్య ప్రశిష్య గణాలు కేవలం భిక్షను మాత్రమే స్వీకరిస్తూ, స్వలాభాపేక్ష రహితంగా ప్రజలు సన్మార్గంలో జీవితాన్ని గడిపే ప్రవచనాలు చేస్తూ సమాజంలో ఒక గౌరవ స్థానాన్ని పొందారు. కాలక్రమంలో సోమరి పోతులు, బద్ధకస్తులు, పనులు చేసే శ్రమను తప్పించుకోవడానికి మఠాలలో చేరడం మొదలుపెట్టడంతో అనైతికత పెరిగిపోయింది. మొదట ఉదరపోషణార్ధం సన్యాస అవతారం ఎత్తినవారు క్రమంగా “ధర్మా”న్ని వదిలి “అర్ధం , కామం” పట్ల అనురక్తులై అధర్మాచారణ పరాయణులైనారు. వీరి కల్లబొల్లి మాటలకు ఆకర్షితులైన అమాయకులు మోసపోవడం, ఆస్తిపాస్తులను కోల్పోవడమే కాక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థి తులూ ఏర్పడ్డాయి.
 
          ఇలాంటి దొంగ బాబాల, మోసాలు చేసే సన్యాసుల గురించి ఆచంట సత్యవతమ్మ “గుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే ” కథ 1936 జూన్, గృహలక్ష్మి పత్రికలో రచించారు.
 
          ” నవ నాగరిక యుగమగు నీ యిరువదవ శతాబ్దములో కూడా మన దేశము సగము కన్నే తెరచుట వింత కదా! శోచనీయం కూడాను. అన్ని దేశ పరిస్థితులు అవలోకించుచు కూడా కొన్ని విషయాల్లో వివేకహీనంగా గ్రుడ్డిగా నడవడమేనా! దీనికి కొన్ని కని, వినిన సంగతులు తెలుపుచున్నాను …” అంటూ ప్రారంభిస్తారు.
 
          ఒకచోట – ఒక గోసాయి “మీ ఊళ్ళో ఒక శక్తి ప్రవేశించింది. మీ పశువులను మింగే స్తుంది. నేను “దివ్యదృష్టితో” పరికించి చెబుతున్నాను” అని చెప్తే నమ్మేవారు నమ్మారు. నమ్మనివారిని నమ్మించడానికి ఓ రాత్రి తానే విషం యిచ్చి రెండు మూడు పశువులను చంపేసాడు. మర్నాడు పశువులు చచ్చిపడి ఉండడంతో బెంబేలెత్తి పరిహారం కోసం ఆ “మహానుభావుడి”ని  తీసుకుని వద్దామని వెళుతుంటే, పశువులకు మందు పెట్టడం చూసిన కొందరు అతన్ని చిత్తుగా తన్నడం చూసి ఖంగుతిన్నారు.
 
          కొంతమంది ఇంటింటికీ తిరిగి కొన్ని నోట్లు ఇస్తే ( మంత్ర బలంతో) రెట్టింపు నోట్లు ఇస్తామనీ, బంగారు నగలకి డబుల్, త్రిబుల్ చేస్తామని నమ్మించి, వాటిని తీసుకుని ఉడాయిస్తే నోరు, నెత్తి కొట్టుకుని యేడ్చి ఊరుకున్నారు కొందరు. పిల్లలు కలగని దంపతులకు ఏవో మాయమాటలు చెప్పి, ఏవేవో దోషాలున్నాయని, వాటికి పరిహారాలు చేయాలని వేలకు వేలు ( ఈ రోజుల్లో లక్షలు) దోచుకునే ప్రబుద్ధులున్నారు. వారిని దైవాంశ సంభూతులుగా భావించి, వారిచ్చే ఏ మందో మాకో సేవించి, మతిభ్రమణం లేదా చావు తప్పి కన్ను లొట్ట బోయిన పరిస్థితికి చేరుకునే వారు ఎందరో!
 
          “స్త్రీలు అమాయకంగా దొంగ బాబాలను గుడ్డిగా నమ్మకండి, గోతిలో పడకండి” అంటూ హెచ్చరించారు. ఆ రోజుల్లోనే కాదు ఇప్పుడు ఇంకా ఎక్కువ మోసాలు జరుగు తున్నాయి. మఠాలలో చేరే స్త్రీల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. దైవపూజలంటూ క్షుద్ర పూజలు చేయడం, స్త్రీల పై అసభ్యకరంగా, అశ్లీలంగా, అభ్యంతరకరంగా పూజలు చేస్తూ పాశవిక ఆనందం పొందే దొంగ బాబాలున్నారు. రహస్యంగా కొనసాగినంత కాలం వీరి హవా జరిగిపోతుంది. రహస్యం బైట పడినా, ఎవరైనా పోలీసు రిపోర్టు ఇచ్చినా కటకటాల పాలౌతారు. వార్తాపత్రికల్లో ఆ ఉదంతాలను ప్రజలు చదివి అవాక్కవుతారు.
 
          అంతంత మాత్రం పుస్తక పరిజ్ఞానం కలిగిన కొందరు ప్రవచనాలు పేరిట పురాణాల్లో లేని విషయాలను ఉన్నట్టు తమ మాటల మంత్రజాలంతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. “తాత్వికత” అంటూ పై పూతల మెరుపులను, “ధర్మసూక్ష్మాలు” అంటూ వారు చేసే ఊకదంపుడు ఉపన్యాసాలను నమ్ముతారు చాలా మంది. అంతటి ఆకర్షణీయమైన ఉపమానాలతో, మానవ జీవితంలోని పోలికలతో ముడివేస్తూ, హాస్యోక్తు లతో ఉపన్యసించడంతో ప్రేక్షకులు “నిజమేనేమో” అనుకుంటారు. “మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం” అని, “ఈ మహానుభావుడు మన కళ్ళు తెరిపించాడు” అని చెంపలు వాయించుకుంటారు. “ఆత్మజ్ఞానం పొందండి అజ్ఞానులారా” అనగానే అమాయకంగా నమ్మేసి కన్నీటి పర్యంతమై “హారతి పళ్ళెం”లో శక్తి కొలది, ఇష్టానుసారంగా  సమర్పించు కుని తృప్తి పడతారు.
 
          “ఇట్టి మోసములు పెద్ద పెద్ద పట్నాల్లో మరీ ఎక్కువ. ఎవర్ని నమ్మే రోజులు కావివి. ప్రజల గౌరవపాత్రులగు యోగేశ్వరుల వేషాలతో యున్న ప్రతి వ్యక్తిని గ్రుడ్డిగా అసలే నమ్మకూడదు. ఇంటి యజమాని యొక్క స్వహస్త లిఖిత రూపకము లేనిదే స్త్రీలు నౌకర్లను చాకర్లను యోగులను ఎవరిని నమ్మకూడదు. ఆఖరికి ఎరిగియున్నవారినైనా నమ్మకూడదు”.
 
          విరాగి అంటే రాగద్వేషాలకు అతీతంగా, ముఖ్యంగా అనురాగ బాంధవ్యాలు లేనివాడై ఉండాలి. కానీ కొందరు దొంగలు యోగుల వేషధారణతో రాజకీయాలు నడుపు తారు, స్త్రీలను భక్తి పేరుతో లోబరుచుకుంటారు. డబ్బు దస్కం, నగలు నట్రా దోచు కోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా లోబరచుకుంటారు. కొందరు ఆ పంజరం నుండి బయట పడి కక్కలేక మింగలేక జరిగిన నష్టానికి లోలోపలే కుంగిపోతారు. కానీ కొందరు ఆ మత్తు నే “దైవిక శక్తి” గా భావించి, ఆ సాములోరితో కలిసి మరిన్ని అఘాయిత్యా లకు పాలుపడతారు. అది ‘ ఒక రకమైన పిచ్చి’ అని ఎవరైనా చెప్పినా నమ్మే పరిస్థితిలో ఉండకపోవడం, ఆలోచించకపోవడం వారి కుటుంబ సభ్యులకు తీరని వేదన. సాములోరు చెప్పినట్లు ఊగడం, నాట్యమాడడం, ఏదో లోకంలో ఉన్నట్టు ప్రవర్తించడం గమనిస్తే ఏదో “మత్తు” ద్రావకం సేవించారు అంటూ వైద్యులు నిర్ధారించడం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం.
 
          నిష్కామ యోగి అనేవాడికీ ధన కనక వస్తు వాహనాల పై ఆసక్తి ఉంటుందా! మూఢ నమ్మకాలతో ప్రజలు వేలంవెర్రి గా “అలాగట, ఇలాగట, ఔనట” టకారాలతో ప్రచారాలు చేయడం వల్ల వాళ్ళు సులువుగా మోసం చేయగలుగుతున్నారు.
 
          ” బందరులో నా మధ్య యొక వేదాంతి వచ్చి స్త్రీ పురుషులకా వేదాంత విద్య నుపదేశిస్తానన్నాడట. గుడ్డి నమ్మకాల్లో స్త్రీ లగ్రగణ్యలగుటచే యొకటే వెర్రిపోతగా పోవగా పోవగా, కొన్ని రోజులకొక యవ్వన వితంతువుకుపదేశ నెపంబున నేవో యవ్యాచ్యములు పల్కాడట. అది యూరంతా ప్రాకి ఆ వేదాంతిని తన్న తలపెట్టారట యూరి పెద్దలు. అది తెలిసి పలాయనసూత్ర మవలంబించాడా వెర్రి వేదాంతి. మాయదారి ప్రపంచాన్ని కళ్ళు బాగా తెరిచి విమర్శనగా నడవాలి కానీ ‘గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడ్డమే!” అంటారు సత్యవతమ్మ.
 
          ” ఈ మధ్య యొక సన్యాసి మాయూరు వచ్చి, మఠాలలోను, గుళ్ళలోను ఆధ్యాత్మ రామాయణ మతి సారస్యంగా అంతరార్ధ బాహ్యార్ధము లాకాశమునంటే నేర్పున చెబుతు న్నాడు. మాట మైసూరు ఫక్కీ. వినేవారిలో మూడు వంతులు స్త్రీలే. వారిలో మూడు వంతులు వితంతువులే. తత్వబోధ తరుణుల తల నషాలమంటుచున్నది. సన్యాసిగా  ఆశా కోపము లాకాశమంటుచున్నవి. డబ్బులేని డిప్రెషన్ రోజుల్లో ఎన్నిటికని డబ్బు తేగలరు! అందులో వితంతువులకే కొడుకో, కోడలో యియ్యాలి దయ తలచి.” నాటి పరిస్థితులు ఈ కథలో రచయిత్రి చెబుతున్నా, నేటికీ పెద్దగా మారలేదనిపిస్తోంది. ఎన్ని రోజులైనా ఎవరూ డబ్బులు ఇవ్వక పోవడంతో ఆ యతీంద్రుడు డైరెక్ట్ గా అడిగాడని, కోపగించుకున్నాడని, విసుగు పడ్డాడని అమ్మలక్కలు గుసగుసలాడుకున్నారు. కొందరు మాత్రం ‘యతీంద్రులకు దేహాభిమానం ఎందుకు ‘ అనుకున్నారు పురాణ వైరాగ్యంగా.
 
          “సన్యాసికిన్ని చింతలెందుకు? ఆహార విహారములకింత హడలెందుకు? డబ్బుకై యింత కాంక్షెందుకు? ఆత్మసంయమునకు సత్రం భోజనం, మఠం నిద్ర యుండాలి. ఆ రోజు కేది ప్రాప్తో అది తినాలి కానీ, ఆకాశ హర్మ్యాలెందుకు? లోకహితార్ధమై తన జ్ఞాన మన్యదా పోనీక, వినియోగించు పుణ్యాత్ములకీ యుపాధి నిలుచుటకే పండో భక్షించి జ్ఞానదేహాభివృద్ధితో జీవించి జ్ఞానయోగ సాధనములచే దేహాభిమానం వీడి, ధన్యులై లోకమును తరింపజేయుటకై యుంటయే సన్యాసుల లక్షణము కానీ ‘చవట సన్నాసి రా’ అనిపించుకొనుట యతికులంబుకొక లోపమని మనవి. మనుజుల పరికించి మరీ మసలాలని మా మగువలకు మనవి. అంధత్వ మునకధఃపతనమే యని హెచ్చరిక ” అంటూ ముగిస్తారు రచయిత్రి.
 
          ఎ.సి. కార్లు, పెద్ద పెద్ద సౌధాలు, వెంట శిష్యగణం, వెన్నంటి రాజకీయ బృందం, సకల సౌకర్యాలు ఆడంబరంగా సమకూర్చే భక్త సముదాయం… నేటి స్వాముల వైభోగం చెప్ప నలవిగాదు. ఆ సౌధాల లోపల ఏమేమి అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా యో బైట ఎవరికీ తెలీదు. నేటి సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ వంటి వాటి  ద్వారా బైట ప్రపంచానికి కొన్ని తెలిసి, కొంత హడావుడి జరిగాక, మళ్ళీ ఆ ఊసు ఎక్కడా వినబడదు. లెక్కలేనన్ని ఆశ్రమాల్లో లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. జ్యోతిష్యం అంటూ అవాకులు చవాకులు పేలే దొంగ సిద్ధాంతులు కొందరు ఎప్పుడూ ఎవరో ఒకరు చచ్చిపోతారనో, విడిపోతారనో అశుభమే పలికే వారున్నారు. బాధితులు కూడా వారి పై కేసులు ఎందుకు పెట్టరో అర్ధం కాదు. హస్తసాముద్రికం, గవ్వల శాస్త్రం, చిలక జోస్యం అంటూ ఈ రోజుల్లో నూ కొందరు చెప్పడం, మరికొందరు వినడం, నమ్మడం హాస్యాస్పదం.
 
          ఆచంట సత్యవతమ్మ రాసిన నాటి పరిస్థితికీ ఈనాటికీ తేడా ఏమీ లేదనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, టివిలు, యూట్యూబ్ లు వంటి ఆధునిక సాధనాల వల్ల ‘బిజినెస్’ మరింత పుంజుకుంది. ముఖ్యంగా ఒంటరి స్త్రీలు, వితంతువులు వీరి టార్గెట్. కల్లబొల్లి కబుర్లుతో, ఆకర్షణీయమైన ముచ్చట్లుతో  వారి ఒంటరితనాన్ని దూరం చేసే నెపంతో మోసపూరిత చర్యలు ఎక్కువయ్యాయి. శ్రుతి మించిన పరిస్థితుల్లో ‘జ్ఞానోదయం’ అవుతుంది. 
 
          ఒక్కో గ్రహం మీద కాలుమోపుతూ, విశ్వాంతరాళాల రహస్యాలు వెలికితీయాలని మానవుడు ప్రయత్నిస్తున్న యుగంలో మూఢనమ్మకాలతో సతమతమయ్యే జాతికి విముక్తి ఎప్పుడు! ఎలా! 
 
          1936 లోనే దొంగ స్వాములు వేషాల గురించి చెప్పడం ఆచంట సత్యవతమ్మ గారి అభ్యుదయ దృక్పథానికి నిదర్శనం. బురిడీ బాబాల భాగోతం కథలాగా వివరించారు. 
 
          సరస్వతి- పుష్పవతి, విమల, భక్త సుశీల, పుత్ర పుత్రికా బేధము, పరివర్తనము, దూరపు కొండలు నునుపు, దసరా బహుమానము, కాల మహత్యము వంటి అనేక కథలు రాసిన ఆచంట సత్యవతమ్మ గారి వ్యక్తిగత పరిచయం కూడా తెలియరాలేదు. ఇంత కంటే వివరాలు ఏవి తెలిసినా నెచ్చెలి పత్రిక కు తెలియపరచ వలసినదిగా మనవి.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

One thought on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-15 ఆచంట సత్యవతమ్మ”

  1. బావుంది కధ Rational గా ఆలోచించేవారు అన్ని కాలాల్లో నూవున్నారు.

Leave a Reply

Your email address will not be published.