ఈ తరం నడక – 1

కాంతిపుంజాల్ని వెతుకుతూ

(అరుణ నారదభట్ల కవితాసంపుటి “లోపలి ముసురు”పై సమీక్ష)

-రూపరుక్మిణి. కె

          ఊపిరాడని గదుల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంక్రీట్ బిల్డింగుల్లో కూర్చున్న ప్పుడు తడిచిన రెక్కలని విసురుకుంటూ.. రంగు రంగుల సీతాకోకచిలుక ఒకటి మన ఇంటి కిటికీగుండా వచ్చి పలకరిస్తే ఎంత హాయిగా ఉంటుంది..
 
          ఇంత ఉక్కపోత ప్రపంచంలో కూడా ఆ రంగుల సీతాకోకచిలుక మోసుకొచ్చే వాన చినుకుల తడి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కొందరి కవిత్వం చదువుతూ ఉన్నప్పుడు అదే స్వచ్ఛత కనిపిస్తుంది.. మనసు కాసేపు ఊయల చేసి ఆ సీతాకోక రంగుల హరివిల్లు లో ఎలా తన్మయత్వం పొందుతామో… అలా ఈ లోపలి ముసురు ముచ్చట్లలో సేద తీరవచ్చు.
 
          అరుణ గారికి ఇది రెండో కవితా సంపుటి. “ఇన్నాళ్ళ మౌనం తర్వాత” చాలా కాలానికి తన రెండో కవితా సంపుటి తీసుకొచ్చారు.
 
          అరుణ నారదభట్ల కవిత్వం నిర్మలంగా స్వచ్ఛంగా లో…లోపలి ముసురులో తడిపేస్తుంది. తనకి వర్షం అంటే ఇష్టం అందులో కూడా ముసురు పట్టిన రోజులు, నేల తడి అద్దుకున్న రోజులు, ఆమని పిలిచే వేళ, చిగుర్లుతొడిగే కొమ్మలు, సముద్రము, అలలు, ఆకాశము, వెన్నెల… వీటితోపాటు ప్రయాణించే కాలంలో కాంతి వేగాన్ని అందుకునే అణు, పరమాణువుల సామాన్య శాస్త్రంలోకి మానవుడి సాంఘిక జీవన ప్రమాణాలని తేలికగా ముడి వేయగలిగే కవిత్వం అరుణ సొంతం.
 
          నువ్వు,నేను, ఆమె అతడు అనే తరాజు బేరిజులు, మీమాంసలు, డొల్లతనం ఏవీ ఇక్కడ తన కవిత్వంలో కనపడవు.
 
          మానవమేధో సంపత్తి, మనుషుల మధ్య బంధాలు అనుబంధాల మధ్య మధ్య తరగతి జీవితాల తలసరి కొలమానాలు, ప్రకృతి ఇచ్చిన వరాలన్నింటిని అంది పుచ్చుకుని మెలుకువను అందుకున్న పద సంపద ఆమెది.. ఎక్కడా ఏ ఒక్క అంశం కూడా మళ్ళీ చెప్పినట్టు కనపడదు. అలవోకగా తన చుట్టూ వుండే గదిలో కనిపించే వస్తువులతో కూడా కవితా వస్తువుని చేసి మన కళ్ళకి ఓ మాయ తెరని కట్టి తాను చెప్పదలుచుకున్న విషయం పట్ల స్పష్టత తీసుకొస్తారు…
 
          తనకేంతో ఇష్టమైన వర్షంతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది తన మొదటి కవితలో..
 
” వర్షమా
నువ్వు ఎక్కడ పడితే అక్కడ కురుస్తావు….
 
నిన్నని ఏం లాభం, ఆ వేడి మేఘాలకే చెప్పాలి  
మా పల్లెల పొలిమేరల్లో తిరగమని 
ఐనా
నాకు పది చేతులు ఉంటే బాగుండును
ఈ వర్షపు మేఘాలను ఎత్తుకుపోయి
వాన లేని చోట స్వేచ్ఛగా తిరగమని వదిలేసి వచ్చేదాన్ని 
 
పిచ్చివాన మురికిలో మునిగిపోతుంది
ఇక్కడ మట్టి లేదని తెలియదు అనుకుంటా ” అంటూ కురవాల్సిన పల్లె వనాల్లో ఈ వాన కురవట్లేదని రైతుల భూములన్ని బీడు భూములవుతున్నాయని ఇక్కడ ఈ మహానగర పు గోడలకు బండరాళ్ళకు ఈ వాన అవసరం లేదని చెప్తుంది
 
          ఊరి చెరువు మాట్లాడిన మాటలని నెగళ్ళ పగుళ్ళ గొంతుతో వినిపిస్తుంది.రైతమ్మగా మనసున్న శ్రమ సంగీతం మహిళ అని
 
” తొలకరి చినుకుల్లో మట్టి వాసనల్లో
నడుముకు చెక్కిన చింగులకు కొంగును సోపతి   
ఇచ్చి
ఏడ్చే బిడ్డకు తల్లిలా
భూమికి విత్తనాల చనుబాలు కురిపిస్తుంది.”
అని మహిళ ఏ పని చేసిన నిబద్ధతతో చేసే ఆమె
” ఆనందాల ఒదుగు మూట అంటుంది “
 
అన్నీ తానై కవితలో…  
ఆమె అంటే అతనికి ఎంతో ప్రేమ ఉన్నచోట మాటలతో పని లేదు అంటూనే….,
అన్ని బంధాలు తానై అతీతమైన ప్రేమను పంచే భర్తవున్నాక ప్రపంచంతో ఆమెకు పెద్దగా పని లేదు అంటుంది.
 
          అరుణ కవిత్వంలో నాకు నచ్చే అంశం ఒకటి ఉంది విషయం సూటిగా చెప్తూ నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా పాజిటివ్ ఎసెన్స్ ని పెంచుకుంటూ జీవిత గమనం ఉండా లని కోరుకుంటుంది.
 
ఈ కవితలోనే చూడండి
 
“తను నిశ్శబ్దంగానే అనిపిస్తూ ఉంటాడు
ప్రేమ పాటల్లో చిలిపిగా మునిగిపోతూ
కాస్త దూరం జరిగిన దగ్గరగా ఉంటూ
తన చుట్టే ప్రేమై పెన వేసుకుంటాడు
ఆమె తన కష్టసుఖాలు చెప్పుకునేందుకు
పెద్దగా స్నేహితుల అవసరం లేదు
బంధువుల ఆసరాతో పనిలేదు తోబుట్టువుల బలము పెద్దగా అక్కరలేదు
పిల్లల అండదండలు కావాలని లేదు
కాసేపు కాలక్షేపానికి తప్ప ఆమెకు ప్రపంచంతో పనిలేదు” అని చెప్పే క్రమంలో..
 
          మనుషుల ఆలోచనల్లో డిప్రెషన్ అనేది చాలా పెద్ద స్పేస్ ని ఆక్రమిస్తుంది అందునా స్త్రీలలో మోనోపాజ్ తర్వాత ఏర్పడే డిప్రెషన్ కి కారణం ఒంటరితనం ఖాళీ తనం.. పిల్లలు పెద్దయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు స్త్రీలకు కావలసింది కాస్త సాంత్వననిచ్చేది భర్త ప్రేమే అని అదొక్కటి ఉంటే ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు అంటుంది.
 
కాసింత ఖాళీ 
ఖాళీ తనంలో ఒంటరి క్షణాలను కలిసి మెలసి పంచుకునేది ఇంట్లో ఉండే వస్తువుల ఉనికి ఎలా ఉందో చెప్తూ…. “ఆ వస్తువుల మధ్య ఒంటరితనం వెళ్ళాడ దిశాను అంటుంది “ఏ కవి మాత్రం కాలాన్ని బంధించకుండా ఉంటారు ఏ కవి హృదయమైనా చెలించ కుండా వుండలేని కాలం కరోనాకాలం.
 
ఆ కాలాన్ని బంధిస్తూ..
 
ఎందుకీ ముసుగు, తడిసిపోతూ, 24/7 కవితల్లో
” విచిత్ర నాటకంలో బలి పశువు అవుతుంది కాలం
పూర్తిగా రూపం మార్చుకుని
అపసవ్య దిశన పరిగెడుతోంది భూగోళం
లోకం ప్రేమ కోసం తపిస్తుంది
ఆనందం కోసం వెంపర్లాడుతూ పరుగులు తీస్తుంది
సంతృప్తి లేక దాహంతో నిండిన ఉప్పుసముద్రం అవుతుంది. ” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే…
 
చప్పట్లు కొట్టలేను లో…
“పదహారు గంటల పనిని లెక్కిస్తూ చేతిపై వాలిన నిర్జీవ జీవులకు మలాం పూస్తూ అతను పని గంటలు పలవరిస్తూ ఎరుకలోనే ఉన్నాడు.” అంటూ
“ఎవరి డబ్బాల్లో వాళ్ళం నిలబడడం తప్ప ఇప్పుడు ఏం చేయగలం” అని కరోనాకాలాన్ని కాప్చర్ చేసింది. 
 
ఇసుక సంగీతం ఇక్కడ అరుణ అలల నురగలతో మాట్లాడుతూ అల్లిన కవిత తన సున్నిత మనసుకి దర్పణం.
 
” నిన్ను ప్రియుడనుకోవాలా? దాసుడనుకోవాలా?
స్నేహితుడివనుకోవాలనుకుంటా…
నీ అనిర్వచనీయ హృదయ స్పందనలో
నీపై ఎన్ని పాదాలు మోపినా అదే మెత్తదనం
ఇంత ఓర్పు ఓదార్పు
ఆ కడలి సహవాసివనా?
ఎన్ని అడుగులు వేసానో తీరం వెంట
ఒక్కసారైనా అంతుచిక్కవెందుకో… “
 
          బ్లాక్ హోల్స్ కవిత చదువుతున్నంత సేపు మనకు సైన్స్ టీచర్ కనపడుతుంది కవిత కోసం తను వాడిన మెటాఫర్స్ అన్ని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, కాంతిపుంజాలు, సకరాత్మక రేణువులు కృష్ణ బిలాలు,… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో చాలా సైంటిఫిక్ మెటాఫర్స్ కనిపిస్తాయి, తనకు సైన్స్ పట్ల ఉన్న అవగాహనో.. ఎవరూ వాడని మెటాఫర్స్ వాడాలన్న ఆలోచనో కానీ కొత్త సైన్స్ మెటాఫర్స్ తో కాసేపు మన ఆలోచనలని కట్టిపడేస్తుంది.
 
ఒకానొక ఒక కొన్ని కవితలో…
స్త్రీలకు ఉండే కలలు ఆశలు కుటుంబ అవసరాల్లో విలువైన జీవిత కాలాన్ని కోల్పోతుం టారు ఆ స్థితిని కవితగా మారుస్తూ
 
“జాలి…
వలపన్ని బ్లాక్ హోలై చుట్టుకుని
స్వేచ్ఛ రహదారికి తలుపులు మూసి
ఒకానొక మైకమై లాక్కుంటుంది తనవైపుకు ఇక్కడే ఆకులు రాల్చే చెట్టు అవుతుంటాం ” అంటూ స్త్రీ గా కోల్పోయే సమయాల్ని చెప్తుంది 
 
నేస్తమా కవితలో…
మనుషులుగా మనల్ని మనం నిర్మించుకున్న కాలంలో విభజించుకున్న పనుల మధ్య స్త్రీ, పురుషులుగా వేరు పడ్డామే కానీ వేరే ఇంకేం లేదంటూ… చెప్పే వాక్యాలు చూడాలి
 
“మహిళా దినోత్సవానికి ఇవాళ మనిషితనాన్ని కదా గుర్తు చేయవలసింది
ఆత్మలకు తొడిగిన ఆడా, మగ దేహాలే కదా ఇవన్నీ
మనం ఆహ్లాదంగా నవ్వుతూ ప్రయాణించే రోజిది
కొన్ని అనూహ్యక్షణాల్లో తప్పిపోవడం చిక్కుకోవడం
ఒకానొక క్షణకాల తమకం మాత్రమే
 
ఇటువైపుగా రా నువ్వు నీలాగే
స్వచ్ఛమైన బాటొకటి నిర్మించుకున్నావ్ 
అదింకా ఇక్కడే నీ కోసం ఎదురుచూస్తోంది” అని కాలం ఒడిలో తన ప్రతిమని తానే గుర్తుపట్టాల్సిన సమయాల్ని గుర్తుచేస్తుంది 
 
వ్యర్థ ప్రయాస, మరణం కవితల్లో…
మరణం అందరికీ సహజమేం కాదని చెప్తుంది
“అమ్మ ఒంటరి వే నువ్వు నిన్ను నిన్నుగా చూడడానికి కొలమానం అక్కరలేదు”
…………
చిన్ని చిరునవ్వులలో దాగిన ప్రేమపూర్వక మాటలు చాలు “
అనారోగ్యం పాలైన అమ్మల దీనస్థితినీ, విస్తరిస్తున్న మమతల బంధాల్ని, గుర్తించాల్సిన క్షణాల్ని ఆర్థిక అసమానతల్లో ఆవిరవుతున్న బంధాల్ని వివరిస్తూనే…
 
” నిన్ను నిన్నుగా గుర్తించే నలుగురు కావాలి
కష్టంలో, కాష్టంలో నిన్నుగా ప్రేమించే మనసు ఒకటి ఉండాలి అంటుంది.
 
ఎన్ని గాయాలైన ఒక మనిషిగా కోలుకొని నడవడానికి
“మంచు ముత్యాలు లాంటి జ్ఞాపకం ఒకటి సరిపోతుంది” అని లోపలి ముసురుగా తన అక్షరాల్లోని జ్ఞాపకాలే చాలంటుంది.
 
ఎదురీతకు పడ్డాక లో… 
స్త్రీగా పుట్టాక ఎన్నో బావ దొంతరలను పసితనపు ఛాయాలోనే నింపుకున్నవి ఒకటా రెండా ఆమె ఎదనిండా వేల పాలపుంతలు ఉన్నాయని మంచి చెడుల మధ్య మంత్రసానితనం ఒప్పుకున్నాక పురిటి నొప్పుల నుండి బయటపడ్డాక అందునా స్త్రీ అయిన కారణంగా తన మానసిక స్థితి ఎలా ఉన్నా చుట్టూ ఉన్న పరిస్థితులను సరి చేసుకునే బాధ్యత ఎప్పుడూ స్త్రీదే అని అందుకోసం స్థితప్రజ్ఞత కలిగిన మునుషులై మానసిక రుగ్మతలను సరి చేసే వైద్యవృత్తిని పండించాల్సిందే అంటుంది.
 
          సామాజిక వ్యవస్థ పై మార్పులు ఎవరు కోరుకోరు అందరికీ మార్పు కావాలి అని ఉంటుంది అయితే ఈ మార్పును కోరుకోవడంలో ఎవరి ఆలోచన, ఆవరణ వారిది.
అపసవ్యం కవితలో… 
 
“ఆకాశహార్మ్యలు, పూరి గుడిసెల మురికివాడలు 
గ్రాఫ్ హై బీపీ పెరిగినంత అసాధారణంగా పెంచుదాం.
శృంగ ద్రోణుల తరంగ నిక్వణలు
పిక్ లెవెల్ సంఖ్యాశాస్త్రంలో ఇమిడిపోవాలి తప్ప
సరళ తారతమ్యాల సామూహిక ప్రశాంతతల
సంగీత జరిలాంటి జీవన సరళి మనకెందుకు?!”
 
సామ్రాజ్య సహజాభివృద్ధితో మనకేం పని?!
అంటూ క్రిటిక్ గా మాట్లాడుతుంది.
 
          తెల్లకాకులు ఇదో సామాజిక కోణంలో రాసిన కవిత “మనుషుల మధ్య స్వార్ధాన్ని ప్రశ్నిస్తూ మూలనబడేసే పథకాలు ఎందుకు అంటుంది.
 
          మధ్యతరగతి జీవితాన్ని ఎర్ర నేలలుగా పోల్చి దుమ్ముకొట్టుకు పోతున్న సామాజిక స్థితిగతుల్ని ఎత్తిచూపే నైపుణ్యం తనది. జీవన ప్రమాణాలను ఒడిసిపట్టే తలసరి లెక్కల్ని కవిత్వం చేస్తూ…
 
          ప్రభుత్వాలు కాగితాల మీద చూపే లెక్కలు ఎంత వరకు వాస్తవం అన్న ప్రశ్నను సంధిస్తూ ఎందుకీ లెక్కలు ఉపాధి కల్పనలు లేకుండా అని సూటిగా ప్రశ్నిస్తుంది
 
” ఉపాధి కల్పనలు లేవు
వికాస కేంద్రాలు లేవు
విశాల హృదయాలు లేవు
ఒక్క మెతుకు కోసం వేలమంది
 
సముద్రాలను దాచే చీకటి గుహలు కొన్ని
చెమట చుక్కల్ని పోగేసి సొరంగాల్లో నింపుతున్న దళారి యాజమాన్యాలు కొన్ని
ప్రగతికి ఇవే సారథులు
 
ఇంతటి మహావిశ్వంలో సమానత్వం చీకటి అయింది. “
అని చెప్తూ పచ్చని అడవుల్ని లెక్కించాలి గాని ఈ మనుషుల రంగుల్ని, ఆర్థిక సమానత్వాలని అందరికీ ఆపాదించడం ఎందుకు అని ప్రశ్నిస్తుంది.
 
          ఎట్ ద రేట్ ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇన్సెంటివ్ ఫార్మేట్ని తీసుకుంటుంది. జీవితాలన్నీ సెల్ఫోన్ స్క్రీన్ పై మాత్రమే ఆధారపడ్డాయని అందులో అప్పులు, మిగుల్చుకున్న ఆస్తులు అన్ని సెల్ఫోన్ తోనే అనుసంధానం చేయబడిన జీవితాల నిర్మాణాన్ని చక్కగా వివరిస్తారు.
 
          ఆర్గానిక్ లోకంలో మార్కెటింగ్ వ్యవస్థలో శ్రమజీవుల శ్రమ ఎలా వ్యాపార సామ్రాజ్యాలలోకి చేరిపోయిందో చెప్తూ తన నిరసన చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
 
“కొవ్వులను పిండి తీసే నూనెల తాజాదనాలు
సున్నపుదారుల్లో ఔషధ విక్రయాలు
పావలాకు దొరికే బెల్లం ముక్క
ఆర్గానిక్ ట్యాగ్లో ఇప్పుడు నూట పాతికే..” అంటుంది 
 
కీటో ఎఫెక్ట్ లో వైద్యో నారాయణో హరి అంటారు కదా అటు వంటి వైద్యం ఇప్పుడు రూపు మార్చుకొని ఎన్ని మాయల్ని సృష్టిస్తుందో చెప్తూ…
 
” ధనిక జీవన ఫాస్ట్ ఫుడ్ లో రా ఫుడ్ నై
డ్రై ఫ్రూట్స్ లో నాని మొలకెత్తిన విత్తనాన్ని
కి డైట్ గాను కీటో డైట్ గాను
నిలువెత్తు ఆరోగ్య సూత్రాన్నై
చిరుధాన్యాన్నై, పసరు కషాయాన్నై వస్తూనే ఉంటా.
…….. కొత్తగా కవ్విస్తూ చిత్ర విచిత్రమైన వైద్యాన్నై వింతలు సృష్టిస్తూనే ఉంటా.. అంటారు.
 
మౌనరాగం
మొక్కల్లో మనల్ని మనం ఎలా చూసుకోవాలో చెప్తున్నప్పుడు ‘మౌనంగా ఎదగమని మొక్క నీకు చెప్తుంది’ పాట గుర్తుకు రాక మానదు.
మనిషికి ఉన్నట్లే ఎదుగుదలలో తేడాలు ఉంటాయని మొక్కలకు కూడా చీకటి నీడలు ఉంటాయని మనిషికీ, చెట్టుకి రెండింటికి ఎదిగే క్రమంలో శిక్షణలో భాగంగా చిరుకొమ్మలు విరిచేస్తారని పోషణనివ్వకుండా హేళన చేయొద్దని చెప్తున్నప్పుడు…..
“మోక్ష సాధనకై తపిస్తున్న మునిలా దాని త్యాగం ముందు మనం ఎంతో” ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలంటారు.
 
అనేకానేక రూపాల్లో తనని తాను మగువ ఎలా మలుచుకుంటుందో చెప్పిన తీరు ఆకట్టుకోక మానదు
రైతు దుఃఖం మెతుకు దుఃఖంగా ఎలా మారిపోతుందో కవిత్వీకరిస్తూ…
 
” నేను నా కంచంలోకే పంట రావాలంటాను
అతడు మట్టి పూజలోనే పువ్వై పూచి ఆ చేను గట్ల చుట్టే కంచె కాపలా ఉంటాడు…
……… తన ధాన్యపురాశిని తానే ధైర్యంగా బుక్కెడు తినలేని దొడ్డు బియ్యం అవుతూ ఉంటాడు. ” అంటూ మెతుకు కథని చెప్తారు.
 
మరీ మన లోపలి మనిషిని మనం వెతుకులాడొద్దని
“మళ్ళీ మనకు మనం నిండారా నిండడానికి కూడా సమయం పట్టేలా కాలపు లౌకిక పరీక్ష జరుగుతుందని” ఏది ఇప్పుడు నేను కాను ఎందులోనూ నేను లేను అంటారు.
 
మీ కోరికల్లో నన్ను బంధించకండి
అంటున్నప్పుడు అనుబంధాల బంధాల్ని ప్రశ్నిస్తూ…
 
” నన్ను ఎలాగోలా కనిపెంచారు
ప్రేమను డబ్బుతో కొనిచ్చారు
ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని ఎందుకు నిందిస్తారు
మీకే నేనేంటో తెలియదు
వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది
నాకు ఏం కావాలో “
 
జీవన ప్రవాహంలో తుషార బిందువునే అంటూనే…. నా రాతేదో నేను రాసుకుంటాను.
 
” నువ్వలా మరీ జాలి పడకు!
నేను కింద పడ్డ ప్రతిసారి
ఓ కొత్త పాఠం నేర్చుకుంటూనే ఉన్నాను
నాకు ఏదో చేతకాదన్న నీ బ్రమ ఏదైతే ఉందో అద్గదే 
మరీ చికాకు తెప్పిస్తుంది “
 
అంటూనే కొందరిని చూసి జాలి పడాలని అంటుంది
 
మనసు మనది మనకే రిఫ్లెక్షన్ అచ్చం అద్దంలాగే
రోజుకో మాత్ర వేసి మనసును మసి చేయకు
విష బీజాలు నాటే ప్రయత్నం ఎందుకు
వీలైతే కొన్ని ఆనంద క్షణాలను పంచే పనిలో ఉండు లేదా కాసింత మౌనం వహించు
నీ మనసుతో పాటు ఇతరులు బాగుంటారు.
అని ఇతరుల పై విషాన్ని చిమ్మె మనస్తత్వాలను చూసి జాలి పడాలని ఆవేదనగా చెప్తారు.
 
          ” కలిసి ఉన్నట్టే ఉన్నాం గానీ నెమ్మదిగా నిశ్శబ్దం ఆవహించి శూన్యాన్ని పరిచయం చేసింది కాలం” అనే వాక్యాలతో దూరం అవుతున్న బంధాలను ఎవరికి వారే ఎలా ఉంటున్నారు చెప్పే ప్రయత్నం బావుంటుంది.
 
          ఇలా చెప్పుకుంటూ పోతే అరుణ కవిత్వంలో ఒ వెన్నెల ముక్కని, దోసిట్లో సముద్రాన్నీ, రెప్పల చాటున వెన్నెలని, ఏ రుగ్మతలు అంటని సృష్టి జీవధార అమ్మగా కవిత్వాన్ని పరిచయం చేస్తుంది….
 
          అరుణ కవిత్వంలో మంచి మెటఫర్స్ తో పాటు.. లోతైన సామాజిక చూపు, లౌకిక దృక్పథం, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తదనం నగరపు మధ్యతరగతి జీవితపు ఆనవాళ్ళు, ఆకర్షణల హంగులు కోల్పోతున్న సమయాలు కాంతిపుంజలు అన్నీ అన్నింటినీ వెతకొచ్చు… కొన్నిసార్లు కొన్ని పదాల కఠినత్వాన్ని కూడా ఎదుర్కోవాలి..
 
అభినందనలు అరుణ నారదభట్ల గారు
 
కవిత్వ సంపుటి పేరు : లోపలి ముసురు (2022)
రచయిత పేరు : అరుణ నారదభట్ల

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.