వెనుతిరగని వెన్నెల(భాగం-57)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా ఎదురయ్యి పెళ్ళిచేసుకుంటాడు.
***
ఆ సాయంత్రం కాలేజీ నించి వస్తూనే గట్టు మీద కూచున్న కొత్త ముఖాల్ని చూసి “ఎవరా” అని ఆలోచించసాగింది.
నలిగిపోయిన పాత కాటన్ చీర, సరిగా దువ్వుకోని తల, అడ్డదిడ్డంగా అంటించు కున్నట్టున్న కుంకం బొట్టు, వెలిసిపోయిన చేతి సంచీ. ఆవిడ పక్కనే కూచున్నతను తన్మయిని చూస్తూనే లేచి నిలబడ్డాడు. కావి రంగుకి చేరిన పాత తెల్ల పంచె, ముతక చొక్కా, భుజమ్మీద మాసిన తువ్వాలు చేతిన పాత బడిన చీరల కొట్లో ఇచ్చే కర్రల చేతి సంచీ.
రోజూ అప్పటికే స్కూలు నించి వాకిట్లో వచ్చి ఆడుకునే బాబు వీళ్ళని చూసి భయ పడ్డట్లున్నాడు. ఎదురింటి పిల్లలతో బాటూ వీధి చివర ఆడసాగేడు. తల్లి రావడం చూసి బండి వెనకాలే పరుగెత్తుకు వచ్చి చెంగు చాటున దాక్కున్నాడు.
ఆవిడ మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టు ఉంది.
అతను సందేహంగా తన్మయి వైపు ఒకడుగు వేసి “మా యబ్బాయి ప్రభు….” అని నసిగేడు.
అప్పటికి అర్థమయ్యింది తన్మయికి వీళ్ళు ప్రభుని కన్న తల్లిదండ్రులన్న సంగతి.
“తనకు చిన్నతనంలో తెలిసిన వారు ప్రభుని పెంచిన తల్లిదండ్రులన్నమాట. ప్రభు నెలనెలా డబ్బులు పంపుతున్నా, ఇంకా కటిక పేదరికంలో మగ్గుతున్నట్టే ఉన్నాయి వీళ్ళ ఆహార్యాలు. కారణం ఏవిటో మరి! అది సరే ఇదేవిటి హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యేరు!!” వాళ్ళని హఠాత్తుగా అక్కడ చూసి తన్మయికి ఏం చెయ్యాలో తోచ లేదు.
చప్పున గొంతు సరిచేసుకుంటూ “రండి, లోపలికి రండి” అని పిలిచింది.
అతను “ఫర్వాలేదమ్మా” అని ఇచ్చిన మంచినీళ్ళు తీసుకుంటూ హాల్లో వేసిన కుర్చీలో కూచున్నాడు. ఆవిడ మాత్రం లోపలికి రాకుండా, ఉలక్కుండా పలక్కుండా అక్కడే భీష్మించినట్లు కూచుంది.
“ఇదిగో బేబీ, ఈవిడే మన కోడలమ్మ. మంచీలు తాగుతావా” అన్నాడతను గారపళ్ళు పెట్టి నవ్వుతూ.
తన్మయి వైపు చూడడం కూడా ఇష్టం లేనట్లు ముఖం తిప్పుకుంది ఆవిడ.
తన్మయి లోపలి గదిలో టెలీఫోను దగ్గిరికి గబగబా నడిచింది.
మరీ సరిపోవడంలేదని తమ రెండు గదులనానుకుని ఉన్న మరోగది కూడా ఈ మధ్యే అద్దెకు తీసుకున్నారు.
ప్రభుకి ఈ మధ్యే ఆఫీసు వాళ్ళు పేజర్ ఇచ్చారు. మెసేజీ చూసుకుని వెంటనే ఫోను చేసేడు.
“వాళ్ళని జాగ్రత్తగా చూడు, ఇప్పుడే బయలుదేరుతున్నాను” గాభరాగా అన్నాడు అవతల్నించి.
వాళ్ళు వొస్తున్నారన్నమాట ప్రభుకి కూడా తెలీదన్నమాట.
“మీ అబ్బాయి ట్రాఫిక్కులోపడి ఇంటికి రావడానికి చాలా టైము పడుతుంది. బాత్రూములో నీళ్ళు పెట్టేను. ముఖాలు కడుక్కుని కాస్త టీ తాగుదురు రండి.” అని కొత్త టవల్ ఒకటి తెచ్చి ఇచ్చింది వాళ్ళకి తన్మయి.
“ఆవిడ ముఖం కడుక్కోదు కానీ, టీ ముందు ఇచ్చెయ్యమ్మా” అని ఆయన బాత్రూములోకి వెళ్ళేడు.
స్టవ్వు మీద టీ కలుపుతూ ఉందే కానీ అసలేమీ అర్థం కావడం లేదు తన్మయికి “వీళ్ళు సరాసరి ఇంటికెందుకొచ్చేరు? ప్రభుని, తనని నిలదీసి అడుగుదామనా? తమతో గొడవ పడదామనా?”
ఎవరికైతే తెలీకూడదనుకుంటూ ప్రభు తమ పెళ్ళిని ఇన్నాళ్ళూ రహస్యంగా దాస్తూ వచ్చాడో వాళ్ళే సరాసరి వచ్చేసేరు. ప్రభు వాళ్ళ అక్కకి ఉత్తరం రాసేడు కాబట్టి, ఆవిడ ద్వారా వీళ్ళకి విషయం ఇప్పటికి తెలిసి ఉండాలి. బహుశా: ఇప్పుడు హఠాత్తుగా రావడా నికి కారణం అదే అయి ఉంటుంది.
“ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారో? లేదో? ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? ప్రభు వీళ్ళతో వెళ్ళిపోతాడా? తనతో గొడవ పెట్టి ప్రభుని తన నుంచి తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారా?” రకరకాల ఆలోచనలతో తల నెప్పి రాసాగింది తన్మయి.
అయినా ప్రభు ఏవైనా చిన్నపిల్లవాడా వెళ్ళిపోవడానికి? పైగా తన ఇష్టప్రకారమే చేసుకున్నాడు.
ఎంత పిలిచినా లోపలికి రాకుండా ఆవిడ వాకిట్లో వీధి అరుగు మీదే చేతిన సంచీ పట్టుకుని పక్కకు తిరిగి కూచుంది.
ఇక లాభం లేదని ఆయనా తన టీ గ్లాసు పుచ్చుకుని అరుగు మీద మరో వైపు చతికిలబడ్డాడు తన్మయి వాకిట్లో వేసిన కుర్చీ మీదకి కాళ్ళు బారజాపి.
ఇంకా నయం తమ ఇంటికి గేటు ఉంది కాబట్టి సరిపోయింది. లోపలి అరుగు బయట వీధిలో నడిచే వాళ్ళేవ్వరికీ కనబడదు. లేకపోతే కాందిశీకుల్లా ఉన్న వీళ్ళని చూసి చుట్టూ అందరూ వివరాలు అడిగేవాళ్ళు.
తన్మయి బాబుకి స్నానం చేయించి, హోం వర్కులు రాయించి, గబగబా వంట పని మొదలు పెట్టింది.
వీధిలో ఏ బండి చప్పుడైనా ప్రభు వచ్చేడేమోనని ఆత్రంగా కిటికీలోంచి చూడ సాగింది.
వాళ్ళని చూస్తే ఒక వైపు భయం, మరో వైపు జాలి పుట్టుకురాసాగింది తన్మయికి.
ఎప్పుడు ఏం తిన్నారో ఏమో! బిస్కెట్ల పాకెట్టు పట్టుకెళ్ళి ఇమ్మని బాబుకిచ్చి పంపించింది.
వాడు మరునిమిషంలో పాకెట్టు పుచ్చుకుని వెనక్కు పారిపోయి వచ్చేడు.
సమయానికి తాయిబా కూడా లేదు, తనైతే చుట్టుపక్కల పిల్లలెవరితోనైనా ఏ కూల్ డ్రింకో ఇట్టే తెప్పిస్తుంది.
తను వెళ్ళోద్దామనుకుని మళ్ళీ విరమించుకుంది. తనతో మాట్లాడడమే వీళ్ళకు ఇష్టం లేనట్లుంది.
“ప్చ్” అని నిట్టూర్చి బాబుని నిద్రపుచ్చడానికి లోపలి గదిలోకి తీసుకెళ్ళింది.
మరో గంటలో ప్రభు రావడంతోనే, తల్లిని లేపి పొదివి పట్టుకుని లోపలికి తీసుకు వచ్చి తన్మయి వైపు చికాగ్గా చూస్తూ “మా వాళ్ళని లోపలికి రమ్మనడం కంటే నీ కొడుకుని నిద్రపుచ్చడం ఎక్కువైపోయిందా?” అని, అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న పిల్లాణ్ణి రెక్కపుచ్చుకుని లేపి, అతని తల్లిని మంచమ్మీద కూచోబెట్టి కాళ్ళ దగ్గిర కూచున్నాడు. అతని తండ్రి ఆ పక్కనే కుర్చీ మీద కూచున్నాడు.
తన్మయి ఎగిసిరాబోతున్న దుః ఖాన్ని అదిమిపట్టి బాబునెత్తుకుని మధ్య గదిలో వైరు మంచమ్మీద పడుకోబెట్టి అక్కడే కూచుండిపోయింది.
అసలేవిటి ప్రభు ఉద్దేశ్యం? వాళ్ళని రమ్మని పిలిచినా వాళ్ళే కదా రానని మొరాయించారు. ప్రభు మాటలు విని కూడా ఆ విషయం చెప్పకుండా ఊరుకున్నారు వాళ్ళు.
పైగా అతని తండ్రి ముఖంలో పైశాచికమైన నవ్వొకటి.
బాబు పక్కన పడుకుందే కానీ ప్రభు ప్రవర్తనకు, చికాకుకు బాధ కలగసాగింది. అసలే కిందటి వారంలో పిల్లాణ్ణి కొట్టినప్పుడు జరిగిన సంఘటన నించే ఇంకా తేరుకో లేదు తను.
ఇంతలో ఇదొకటి.
ఎక్కడ లోపం జరిగింది? ఎందుకు ఇలా జరుగుతూంది? ఆలోచనల్తో తల బద్దలు కాసాగింది.
లోపల నించి ఆవిడ ముక్కు చీదీ చీదీ శోకాలు పెట్టడం, మధ్య మధ్య అతని తండ్రి రంకెలు, ప్రభు కళ్ళనీళ్ళతో సంజాయిషీ ఇవ్వడం… అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి.
మొత్తానికి ఏడుపు ఆపి గొంతు విప్పింది ఆవిడ. “సరే నాయినా, నీకు నచ్చింది నువ్వు సేసుకున్నావు. మరి మేవూ సుట్టూ అందరికీ సెప్పుకోవాల గదా మా యబ్బాయికి పెళ్ళయ్యిందని. పిల్లోణ్ణి నాల్రోజులు ఆవిడ అమ్మగారింటి కాడ ఏడయినా దించి ఆవిణ్ణి తీసుకుని రా. మన ఇంటికాడ సిన్న పంక్సనేమైనా సేసుకుందాం” అంది.
అంతదానికే బహు సంతోషపడిపోతూ తన్మయిని గొంతెత్తి పిలుస్తూ గుమ్మం వరకు వచ్చి వెనక్కి తిరిగి “అదేం వొద్దులే అమ్మా, మీరు వొప్పుకున్నారు అంతే చాలు నాకు, చుట్టూ అందరి సంగతీ వదిలెయ్యండి” అంటూ చప్పున వాళ్ళ కాళ్ళకి నమస్కరించేడు. అప్రయత్నంగా తన్మయి కూడా వంగి నమస్కరించింది.
ఆవిడ ఇష్టం లేనట్టు చికాగ్గా మొహం పెట్టి చప్పున కాళ్ళు వెనక్కి లాక్కుంటూ “అటైతే ఇక మేవూ యెనక్కి పోం. అక్క ఎలాగూ మనకాడే ఉంటంది గదా, పిల్లల్ని తీసుకుని ఇల్లు ఖాళీసేసి ఈడికే వచ్చియ్యమని కబురెట్టు” అంది.
“ఊ…అలాగే చేద్దాం” అన్నాడు ప్రభు ఆనందబాష్పాల్ని తుడుచుకుంటూ.
తండ్రి వాకిట్లోకెళ్ళి కాండ్రించి ఉమ్మేసి, “ఈడిలాటి ముదనష్టప్పనిజేసినా, ఉన్న పళాన ఇది కొడుక్కాడికి పోదావంటేనే అనుకున్నాను, ఇలాటి పిట్టింగేదో పెడతాదని” అన్నాడు.
ప్రభు బయటికెళ్ళి ” ఇప్పుడేవైంది నాన్నా, అమ్మ చెప్పినట్లు అందరం కలిసి ఇక్కడే ఉందాం. మీకు పుట్టి పెరిగిన ఊరని మమకారం ఉంటే అప్పుడప్పుడూ వెళ్ళి రావడం ఎంత పనని?” అన్నాడు.
“ఏదోటి కానియ్యండి” అన్నాడు మళ్ళీ ఉమ్మేసి.
కాస్సేపట్లో తన్మయి భోజనాలు వడ్డించింది.
తన ప్రమేయమే లేనట్లు ఒకదాని తర్వాత ఒకటి ఏమేం చెయ్యాలో వాళ్ళలో వాళ్ళు అన్నీ మాట్లాడేసుకున్నారు. ప్రభు కనీసం తనతో ఒక్కమాట కూడా సంప్రదించడం లేదు.
అసలు అక్కడ తన్మయి ఉన్నట్టు కూడా ఎవరూ పట్టించుకోకుండా భోజనాలు కానిచ్చేరు.
వాళ్ళకి లోపలి గదిలో పక్కలు వేసేక చాప తీసుకుని డాబా మీదికి వెళ్ళింది తన్మయి. దాదాపు పన్నెండు గంటల వేళ వచ్చేడు ప్రభు.
“హమ్మయ్య, వీళ్ళనెలా ఒప్పించాలో అన్న బెంగ కూడా తీరిపోయింది నాకు. మా అమ్మా, నాన్నా ఎంత మంచివాళ్ళు నిజంగా! రోజూ వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకున్నా సరిపోదు. నన్ను ఎక్కడ దూరం చేసేస్తారో అని ఎంత బాధ వేసేదో నాకే తెలుసు. ఇక ఏ బెంగా లేదు నాకు. ఇక మనం కనీసం నాలుగ్గదులుండే పెద్ద ఇల్లు చూసుకుని మారాలి. అసలే అక్కా, పిల్లలూ కూడా మనతోనే ఉండడానికి వస్తున్నారు” అన్నాడు గబగబా.
తన్మయి నిశ్శబ్దంగా విని “ఇదంతా మన పెళ్ళికి ముందు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు?” అంది.
“ఏమని?” అన్నాడు ఆశ్చర్యంగా.
“వీళ్ళందరితోనూ మనం కలిసి ఉండాలని” అంది.
“ఎందుకు చెప్పలేదు? మా వాళ్ళని చూసుకోవాలని చెప్పేను కదా!” అన్నాడు.
ఈ సారి ఆశ్చర్యపోవడం తన్మయి వంతయ్యింది “మీ వాళ్ళని చూసుకోవడమంటే ఇదా! డబ్బులు పంపడం అని అనుకున్నాను” అంది.
“నువ్వెలా అనుకున్నావో నాకు తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళంతట వాళ్ళే మన దగ్గర ఎప్పటికీ ఉండిపోవడానికి వచ్చేరు, ఇంతకంటే అదృష్టం ఇంకేముంది?”అన్నాడు సంతోషంగా.
“అది సరే, వాళ్ళని నేను లోపలికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రానన్నారు. నువ్వు నన్ను తప్పుబట్టడం ఏవయినా బావుందా?” అంది.
ఒక్క సారి తల విదిలించి “వదిలెయ్యి, ఏదో గబుక్కున అనేసాను” అని “అన్నట్టు వాళ్ళకి ఏ కొరతా రాకుండా చూసుకోవాలి మనం” అన్నాడు.
“అయినా ఇంత పెద్ద సిటీలో ఇంత మంది.. మన ఇద్దరి జీతాలతో….” అనేదో అనబోతున్న తన్మయితో…
“ఇలా చూడు, వాళ్ళకిష్టం లేని పెళ్ళి చేసుకున్నందుకు వాళ్ళు నన్ను వెలివేయ కుండా మనతో కలిసి ఉండాలనుకోవడమే ఎంతో సంతోషించవలసిన విషయం. ఇందు కు నేను జీవితాంతం వాళ్ళను నెత్తిన పెట్టుకున్నా సరిపోని పెద్ద మనసులు వారివి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు నీకేది సంతోషం అనిపిస్తే అది చెయ్యొచ్చు, కానీ వాళ్ళు మాత్రం నాతోనే ఉంటారు” సీరియస్ గా అన్నాడు.
తన్మయి నిశ్శబ్దం వహించింది. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు! నిన్న మొన్నటి వరకూ ఒంటరిగా ఎన్నో కష్టాలు పడి, చివరికి తన కోసమే అలమటించిన ప్రభుని ఇష్టపడి పెళ్ళి చేసుకుంది. అతను కాకుండా మరో జీవితాన్ని తనకి ఊహించు కోవడం కూడా ఇష్టం లేదు.
అసలు “నీకేది సంతోషం అనిపిస్తే అది చెయ్య” మన్న మాట అనడానికి ఇతనికి నోరెలా వస్తూంది?
అదే అడిగింది.
“చూడు, నీతో వాదించే ఓపిక నాకు లేదు. అసలే ఆఫీసులోనే నాకు బోల్డు తలకాయ నొప్పులున్నాయి. ఇంట్లో కూడా తలనెప్పి తెప్పించకు” అని విసవిసా కిందికి వెళ్ళి పోయేడు.
తన్మయి సూన్యమైన మనస్సుతో రోదన పూడుకుపోయిన గొంతులో బాధని దిగమ్రింగి కళ్ళు మూసుకుని ప్రార్థించింది.
మిత్రమా! నా కోసం ప్రభు గొప్ప సాహసం చేసేడు నిజమే. వీళ్ళు అతన్ని కన్న తల్లిదండ్రులు కాబట్టి గౌరవించాలి. ఇక డబ్బులంటే నా కెప్పుడూ పెద్ద ప్రేమ లేదు. పొదుపుగా, ఉన్నదాంతో బతకడం అలవాటే. ఎలా జరగాలని ఉందో నాకంటే నీకే బాగా తెలుసు. నాకు తగిన శక్తిని, నిలబడే ధైర్యాన్ని ఇవ్వు”
తన్మయి బాధని విన్నట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చినుకు లు పడసాగేయి.
అప్పటికి దుఃఖం కట్టలు తెంచుకుంది.
వానలో అలానే తడుస్తూ , రోదిస్తూ ఉండిపోయింది.
***
మర్నాడు సెలవు పెట్టి ఊర్లో చుట్టుపక్కల కాస్త పెద్ద ఇళ్ళు వెతికి రావడానికి బయలుదేరేరు.
రాత్రి నిద్రలేమికి, వానలో తడిసినందువల్లా తన్మయికి తలపోటు రాసాగింది.
నడవడానికి కూడా ఓపిక లేదు. తను రానంటే ప్రభు మరోలా అర్థం చేసుకుంటాడే తప్ప ప్రయోజనం ఉండదు.
మౌనంగా బండి మీద అతని వెనక కూచుంది.
ఆవిడ పొద్దున్నే వంటింట్లోకి వస్తూనే పెద్ద గొంతు పెట్టుకుని భర్తతో “ఇలా సూడు బావా, మనోడి సంసారం. ఒకళ్ళు తిన్నా కంచం కడుక్కుని మరొకళ్ళు తినాల. సరింగా నాలుగు బొచ్చెలు కూడా లేవు కర్మ, ఈ మాతల్లి పున్నెవా అని ఎన్నో జమ్మిందారీ సమ్మందాలు కాదని ఎల్లగొట్టీసేడు. హవ్వ, కన్నెపిల్లలందర్నీ కాదనీసి ఈ పిల్లల తల్లిని కట్టీసుకున్నాడు” అంది నోరు నొక్కుకుంటూ.
ప్రభు వెంటనే అందుకుని “ఇంత కాలం మేమే కదా అని ఏవీ కొనుక్కోలేదు. సాయంత్రం అలా వెళ్ళి నీకేం కావాలో అన్నీ కొని తెచ్చుకుందాం” అన్నాడు నవ్వుతూ తల్లి మాటల్ని అతి తేలిగ్గా తీసుకుంటూ.
ఆవిడేం మాత్లాడుతూందో తన్మయికి ఏవీ అర్థం కావడంలేదు.
అయినా నిశ్శబ్దంగా ఆవిడకి స్నానానికి నీళ్ళు పెట్టింది.
ఆవిడ తన సంచీలోంచి పాత చీరొకటి తీసుకుని కట్టుకోబోతూంటే తన్మయి మొన్నే కొనుక్కున్న కాటన్ చీరొకటి తీసి ఇవ్వబోయింది.
“ఏం మా రాణీ! మేం నీ స్తాయికి తగమనా నీ సీర కట్టుకోమంటన్నావు. నా కొడుకు తలుచుకుంటే ఇంతకి బాబులాటి సీరలు కొనిపెడతాడు నాకు” అంది కటువుగా విసిరి కొడుతూ.
ఏవీ వినబడనట్టు ప్రభు మాట్లాడకుండా బయటికెళ్ళి బండి తీసేడు.
తన్మయి ఏదో అనేలోగా గేటు దగ్గిర ప్రభు హారను మోగించడంతో మాట్లాడకుండా బయటికి నడిచింది తన్మయి.
బండెక్కుతూనే “మా అమ్మకి నచ్చిన చీరలు ఆవిడని కట్టుకోనివ్వు” అన్నాడు.
తన్మయికి మనస్సు చివుక్కుమంది.
తనతో పరిచయం లేని ఇతని తల్లి తనని అర్థం చేసుకోకపోవడంలో అర్థం ఉంది. కానీ ప్రభు ఇలా మాట్లాడడంలో అర్థం ఉందా?
అదే అడిగింది.
“మళ్ళీ మొదలెట్టేవా? ఇలా చూడు. వాళ్ళని వీలైనంత సంతోషంగా ఉంచడమే నా ధ్యేయం. లక్ష మాటలైనా అనే హక్కు వాళ్ళకుంది. నేను చేసినది ముమ్మాటికీ తప్పే. ఇలా శిక్షని అనుభవించాల్సిందే” అన్నాడు.
తన్మయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. “ప్రభు శిక్షని అనుభవిస్తున్నాడా? తను అనుభవిస్తూందా?”
నిట్టూర్చి మాట్లాడకుండా ఉండిపోయింది.
దగ్గర్లో ఉన్న ఇళ్ళేవీ ప్రభుకి ఒక పట్టాన నచ్చడం లేదు.
టులెట్ బోర్డులు చూసుకుంటూ దాదాపు పదిపదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్న మరో ఏరియాలోకి వచ్చేసేరు.
తన్మయికి తల తిరగసాగింది. “ఏదయినా తాగుదామా?” అంది.
“ఊ..” అంటూ బండిని పక్కనే ఉన్న చిన్న బేకరీ ముందు ఆపేడు.
ఎదురుగా ఉన్న టులెట్ బోర్డు చూపిస్తూ “ఇక్కడైతే నా ఆఫీసుకి కూడా దగ్గరవు తుంది కాస్త. ఏవంటావ్” అన్నాడు డూప్లెక్సు హౌస్ ఒకటి చూస్తూనే.
తన్మయి టులెట్ బోర్డుకున్న అయిదంకెల అద్దె గురించే ఆలోచిస్తూంది. ఇప్పుడు వాళ్ళిచ్చే అద్దెకు మరో రెండు వంతులెక్కువ. పైగా రెండు నెలల అడ్వాన్సు కట్టాలి.
ఇంత వరకు ప్రభు తన జీతంలో తన పెట్రోలు ఖర్చులకు మాత్రం ఉంచుకుని, మిగతాదంతా వాళ్ళ వాళ్ళకి పంపించేస్తూ వచ్చేడు.
ఇల్లంతా తన్మయి తనొక్క జీతంతోనే నడిపేది.
“ఇప్పుడు తన జీతం మొత్తం కేవలం అద్దెకే పోతుంది” అర్థం కానట్టు మొహం పెట్టింది తన్మయి.
ఇంతలోనే “సరేనండీ, మేం రేపూ, ఎల్లుండుల్లో వచ్చేస్తాం” అని ఒక వెయ్యి తీసి అడ్వాన్సు” ఇచ్చేసేడు ఇంటాయనకి.
బయటికి వచ్చి బండెక్కుతూనే నేనంతా ఆలోచించే అడ్వాన్సు ఇచ్చేను. “మా వాళ్ళు ఇక మనతోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళకి డబ్బులు నెలనెలా పంపక్కరలేదు కదా, ఇక అడ్వాన్సు అంటావా, మొన్నే బోనసు వస్తే మా అమ్మకు పంపేను. అవింకా ఉండే ఉంటాయి” అన్నాడు.
***
ఆ మర్నాడు తల్లిదండ్రుల్ని కూడా తీసుకెళ్ళి ఇల్లు చూపించుకొచ్చేడు ప్రభు.
రాగానే “ఇల్లు శానా బాగుంది. ఎవరి గదులాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయి. ముందే సెప్తున్నాను, మేవు కిందనే ఉంటావు. పైన పెద్ద గది అక్కకి, పిల్లలకీ సరిపోతది. మీరు ఆ పక్కనే ఉన్న చిన్న గదిలో ఉండండి. పిల్లోడు పైన మధ్య హాల్లో పడుకుంటాడు. ఇంక వంట గది కిందనే ఉన్నాది కాబట్టి అది నాది. ఈవిడ అందులో అడుగెట్టనాకి ఈల్లేదు” అంది.
తన్మయికి తన జీవితం మీద పెత్తనం మొదలవ్వబోతూ ఉందో, బాధ్యతలు తప్పుతున్నాయో అర్థం కాలేదు.
ఒక పక్క ప్రభు “వాళ్ళేమన్నా వాళ్ళతో ఏవీ వాదించకు. కొన్నాళ్ళకి కోపం తీరి వాళ్ళే శాంతిస్తారు” అంటున్నాడు.
“ఏదేమైనా ప్రభుతో కొత్త జీవితం ఇలా ప్రారంభమయ్యింది ” తనలో తనే నిట్టూర్చింది తన్మయి.
ఇంతలో ప్రభు తల్లి దగ్గిరికెళ్ళి మెల్లిగా నసుగుతూ “అమ్మా, మనం ఇంటికి అడ్వాన్సు కట్టాలి. నీకు మొన్న పంపిన బోనసు డబ్బులు….” అన్నాడు.
వెంటనే ఏడుపు గొంతు పెట్టి “ఇయ్యో అయ్యెక్కడున్నాయమ్మా, ఇడుగో మీ నాన్న తాకట్టెట్టేసిన నా తాలిబొట్టు, అక్క గొలుసు, ఉంగరవూ ఇడిపించడానికి సరిపోయేయి” అంది మెళ్ళోంచి పసుపు తాడు చివర సొట్టలు పడి మకిలి పట్టిన సన్నని రేకుల్లాంటి సూత్రాలు చూపిస్తూ.
అవన్నీ తాకట్లు పెట్టి విడిపించినా ప్రభు పంపించిన డబ్బుల్లో సగం కూడా ఖర్చవ్వవన్న సంగతి అర్థం అయింది.
ప్రభుకి ఈ విషయాలు సరిగా తెలియవు, తెలిసినా ఇక వాళ్ళని అడగడు.
తన్మయి అక్కణ్ణించి లేచి వాకిట్లోకి వచ్చింది.
వెనకే వచ్చిన ప్రభు “మనకి రెండే మార్గాలున్నాయి. ఒకటి –డబ్బులు సమకూరే వరకూ ఇక్కడే అడ్జస్టు కావడం, రెండు– నీ గాజులు తాకట్టు పెట్టడం” అన్నాడు బాధగా మొహం పెట్టి.
తన్మయి మరు నిమిషంలో అతని చేతిలో తన గాజులు తీసి పెట్టింది “బాధపడకు” అంటూ “కానీ నెల నెలా అద్దె చాలా ఎక్కువ. ఇక మనకంటూ ఏవీ సేవింగ్సు ఉండవు మరి, ఏ కష్టం వచ్చినా..” అంది సాలోచనగా.
“థాంక్యూ థాంక్యూ తనూ. ముందు ఏదో రకంగా నడవనీ. కాస్త సెటిల్ అయ్యేక ఆలోచిద్దాం” ఆనందంగా అని లోపలికెళ్ళేడు.
భవిష్యత్తు పట్ల లోపలెక్కడో భయం భయంగా ఉన్నా అతని ముఖంలోని ఆనందం కోసం ఏదైనా చెయ్యొచ్చనిపించింది తన్మయికి.
ఇంతలో లోపల గట్టిగా జరుగుతున్న సంభాషణ వినిపించసాగింది.
“నువ్వు నెల నెలా మాకిచ్చే డబ్బుల్తో నీ సంసారాన్ని కూడా నడపడం మా వొల్ల కాదు. ఆవిడీ, ఆవిడి సోకులూ, ఆ పిల్లోడి సదువులూ” అంటూన్న తల్లితో
“అవన్నీ మీరు పెట్టక్కరలేదు, కేవలం ఇంటద్దె కట్టండి చాలు. మిగతా అంతా తను తన జీతం నుంచి చూసుకుంటుంది” అని బతిమిలాడసాగేడు ప్రభు.
“కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు కూడా ఆవిణ్ణే కట్టమను” అన్నాడు అతని తండ్రి.
బయట మొక్కల్లోకి చూస్తూ గాఢంగా నిట్టూర్చింది తన్మయి.
తన జీవితం ఏం కానుంది?!
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.