శిథిల స్వప్నం (కవిత)

– డా.కటుకోఝ్వల రమేష్

భద్రంగా కూడేసుకున్న
బ్రతుకు తాలూకు
కలలు ముక్కలవ్వటం
ఎవ్వరూ తీర్చలేని వెలితి
అకస్మాత్తుగా కుప్పకూలిన
కాలపు గోడల మధ్య
దేహాలు నుజ్జయి పోవటం
అత్యంత సహజం కావచ్చు
కానీ………
రూపాంతరం చెందని
ఎన్నో స్వప్నాలు
శిథిలమవుతాయి కూడా…

ఒకానొక కాళరాత్రి
విరుచుకు పడిన విధి
మహావిషాదాల్ని పరచి పోవచ్చు
కానీ……..
ప్రపంచ గుమ్మాన
కన్నీళ్ళతో మోకరిల్లి
చరిచిన వేదనా భరిత గుండె చప్పుళ్ళకు
ఎవ్వరూ ఆసాంతం అద్దం పట్టలేరు

బాధలు ఎప్పుడూ
వందశాతం గ్రంథస్థం కావు
దృశ్యాలను చూసే కళ్ళు
మనసును తోడుక్కున్నప్పుడే
స్వప్నాలు శిథిల మవ్వటం కనిపిస్తాయి

భౌతికంగానో మానసికంగానో
గాయపడ్డ ప్రాణాలు
తెరిపిన పడాలంటే..
అనివార్యంగా మరుపు లేపనాలు
మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ వుండాలి

ఎవ్వరైనా ఇప్పుడు
చెయ్యాల్సింది ఒక్కటే..
హృదయ కుహరం అహరహం
కొత్తదనాలు తొడిగెట్టు
ఆనందాల్ని పోగు చేసుకోవాలి
కూలిన కునారిల్లిన
శిథిల స్వప్నాల నుంచి

*****

Please follow and like us:

3 thoughts on “శిథిల స్వప్నం (కవిత)”

  1. అద్భుతంగా చెప్పారు. కూలిన కునారిల్లిన స్వప్నాల నుండి ఆనందాలను పోగుచేసుకోవాలి… గాయపడ్డ ప్రాణాలకు అనివార్యంగా మరుపు లేపనాలు రాసుకోవాలి… గ్రేట్ పాజిటివ్ ఆటిట్యూడ్.. loved it

  2. చాలా బాగుందండి.
    శిధిలాలను పునాదులుగా చేసుకోవాలనే భావుకత ,
    మరపు లేపనాలే మనసు గాయానికి మందు.
    చాలా బాగుంది
    కవి గారికి అభినందనలు.

    .

  3. శ్రీ కటుకోఝ్వల రమేష్ గారి శిధిల స్వప్నం కవిత ఒక ఆశావహ దృక్పధాన్ని పెంపొందించుకొనవల్సిన ఆవశ్యకతను తెలియచేసే మంచి కవిత. భౌతికమైనవైనా, మానసికమైనవైనా నష్టాలు మన జీవితంలో తారసిల్లినప్పుడు, ఆనందమనే ఆయుధంతో వాటిని ఎదుర్కొని అధిగమించవచ్చనీ, మరపు అన్ని గాయాలను మాంపివేయగలిగే చక్కటి మందు అని మంచి మెటఫర్ల ద్వారా తెలియచేశారు. కవికి, నెచ్చెలి సంపాదక వర్గానికీ, అభినందనలు.
    బి.వి. శివ ప్రసాద్

Leave a Reply to చిలుకూరి. ఉషా రాణి Cancel reply

Your email address will not be published.