స్నేహానికి సరిహద్దులు లేవు

-శాంతిశ్రీ బెనర్జీ

          2023లో స్వర్ణకిలారి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘ఇంతియానం’ చదివాను. నలభైఐదు మంది మహిళలు రాసిన యాత్రాకథనాల పుస్తకమిది. ఫొటోలు, హంగులూ, ఆర్భాటాలు లేకుండ, మనస్సుల్లోంచి వొలికిన ఆలోచనలనూ, అనుభవాలనూ, ఆవేశా లనూ పొందపరుస్తూ రాసిన అత్యంత సహజమైన యాత్రారచన ఇది. ఇది చదివిన తర్వాత 1985 నాటి నా ఏథెన్స్‌ (గ్రీసు దేశ రాజధాని) ప్రస్థానం గురించి రాయాలన్న ప్రగాఢమైన కోరిక కలిగింది. ఇప్పటికీ గుర్తున్న విషయాలను రాస్తే ఫర్వాలేదన్న భరోసా వచ్చింది. అందుకే ఈ ప్రయత్నం.

          ఆ రోజుల్లో ఇండియా, గ్రీకు ప్రభుత్వాల మధ్య కల్చరల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్స్‌ ఉండేవి. దాని ప్రకారం ప్రతి సంవత్సరం కొంత మంది ఇండియన్స్‌ని గ్రీస్‌ పంపేవారు. కొంత మంది గ్రీక్స్‌ ఇండియా వచ్చేవారు. దాని కోసం ప్రకటన చేసి, ఇంటర్వ్యూలు జరిపేవారు. నేనప్పుడు డిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్‌.ఫిల్‌. చేసి, డిల్లీ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి.కి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. 1984 ఆగస్టులో వచ్చిన భారత ప్రభుత్వం వారి ప్రకటన చూసి మా వారు నన్ను అప్లై చెయ్యమని ప్రోత్సహించారు. నేను చేశాను గాని నాకు వస్తుందన్న నమ్మకం కలుగలేదు. అక్టోబర్‌లో ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ పానల్‌లో నలుగురైదుగురున్నారు గాని, నన్ను ముఖ్యంగా ప్రశ్నలడిగిన కపిలా వాత్సాయన్‌ గారు నాకిప్పటికీ గుర్తున్నారు. నవంబర్‌లో సెలెక్టయినట్లు లెటర్‌ పంపారు.

          ఇంకా లెటర్‌లో 1985 జనవరి మొదటి వారానికల్లా ఏథెన్స్‌ వెళ్ళి, ఆరు నెలలక్కడ ఉండాలనీ, పాస్‌పోర్ట్‌, వీసా విషయాల్లో విదేశాంగశాఖ వారు సహాయం చేసి, త్వరగా వచ్చేలా చేస్తారని రాశారు. ఆర్కియాలజీకి సంబంధించిన విషయం పై నేను స్టడీ చెయ్యాలని, ఏథెన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసరు నాకు పరిశోధనలో గైడెన్స్‌ ఇస్తారని, నాకు నెలకి 25,000 డ్రాచ్మా (drachma-గ్రీకు కరెన్సీ) స్కాలర్‌షిప్‌ వస్తుందని కూడా లెటర్‌లో ప్రస్తావించారు. ఇక నేను వెళ్ళే ప్రయత్నాల్లో పడిపోయాను. ఏ ఎయిర్‌లైన్స్‌లో వెళ్ళానో, ఎలా వెళ్ళానో గుర్తు లేకపోయినా, మూడుసార్లు విమానాలు మారి 1985 జనవరి మొదటి వారంలో ఏథెన్స్‌ చేరుకున్నానని మాత్రం జ్ఞాపకముంది.

          విమానాశ్రయంలో నన్ను రిసీవ్‌ చేసుకోడానికి ఇండియన్‌ ఎంబసీ నుండి మిస్టర్‌ మల్‌హోత్రా (పూర్తిపేరు మర్చిపోయాను) వచ్చారు. నన్ను టాక్సీలో వైడబ్లూసిఏ (YWCA) తీసుకెళ్ళారు. అక్కడ నాకు రూము బుక్‌ చేసినట్లు తెలిసింది. ఆయన డాలర్లను గ్రీకు కరెన్సీలోకి మార్చడానికి కూడా సహాయం చేశారు. నేనక్కడ ఇరవై రోజులున్నాను. మధ్యలో నాలుగైదు రోజులు ఒక చైనీస్‌ యువతి నాతో రూము షేరు చేసుకుంది. ఆమె టూరిస్టుగా వచ్చింది. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడలేకపోయినా కొద్దో గొప్పో మేనేజ్‌ చెయ్యగలిగేది. అతికొద్ది సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరం కలిసి బస్సులో అక్రోపోలీస్‌ చూసొచ్చాం. అక్రోపోలీస్‌ ఏథెన్స్‌లో ఒక కొండ మీద కట్టబడిన కోట. ఇది ప్రాచీన గ్రీకు సమాజానికి, మతానికి కేంద్రంగా ఉండేది. ఇందులోని కట్టడాలన్నీ ముందు వెనుకలుగా క్రీ.పూ. ఐదవ శతాబ్దానికి చెందినవి. కట్టడాల్లో ముఖ్యమైనది పార్ధినాన్‌. అది నగర దేవత ఎథీనా మందిరం. ఆ చైనీస్‌ యువతి ఉన్నన్ని రోజులు సరదాగా గడిచింది. ఆమె షాపింగ్‌కు వెళ్ళినపుడు నన్ను కూడా తీసుకెళ్ళింది.

          వైడబ్యూసిఏలో వాళ్ళిచ్చే భోజనం బాగా ఖరీదవడమే కాకుండా, రుచిగా ఉండేది కాదు. అందుకని బ్రెడ్‌, చీజ్‌, ఫలాలతో సరిపెట్టుకునేదాన్ని. అప్పుడప్పుడు తోచక మధ్యాహ్నం అక్కడున్న రెస్టారెంటుకి వెళ్ళి టీ తాగేదాన్ని. చాలాసేపు అక్కడే కూర్చుని వచ్చేపొయ్యే వాళ్ళని చూస్తూ, పుస్తకం చదువుతూ గడిపేదాన్ని. ఒకసారి దాదాపు ఆరడుగులున్న యువతి నా పక్కకి వచ్చి కూర్చొని తనని తాను పరిచయం చేసుకుంది. ఆమె జర్మన్‌ యువతి బార్బరా. తర్వాత మాటల్లో తెల్సిందేమిటంటే ఆమెకి ఇండియన్స్‌ అంటే చాలా ఇష్టమని, బీహార్‌ లోని ముంగేర్‌లో ఉన్న బీహార్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగాలో యోగా నేర్చుకోవడానికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుందని తెలిసింది. అదే రెస్టారెంట్‌లో చాలాసార్లు కల్సుకున్నాం. నెమ్మదిగా మంచి స్నేహితులమయ్యాం. జర్మన్‌ మాతృ భాషయినా ఆంగ్ల, గ్రీకు భాషల్లో కూడా చక్కగా సంభాషించగలదు బార్బరా. ఆమె తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి తన ఫ్లాటుకు రమ్మని ఆహ్వానించింది. వెళ్ళాను కూడా. తర్వాత నా అపార్ట్‌మెంట్‌కి చాలాసార్లు వచ్చి కల్సింది. బార్బరాతో అలా మొదలయిన స్నేహం చాలా సంవత్సరాలు సాగింది. ఇండియా వచ్చేసాక కూడా ఉత్తరాలు రాసుకున్నాం.

          బార్బరాతో కలసి ఏజియన్‌ సముద్రంలోనున్న మైకోనోస్‌ అనే గ్రీకు ద్వీపం వెళ్ళడం నాకు మరపురాని అనుభవం. ఏథెన్స్‌ నుంచి ఫెర్రీలో అక్కడికి వెళ్ళడానికి సుమారు నాలుగు గంటలు పట్టింది. ఎంతో అందమైన, ఆకర్షణీయమైన ద్వీపమది. చిన్న ఇల్లులాంటి గెస్ట్‌హౌస్‌లో ఉండటానికి బార్బరా రూము బుక్‌ చేసింది. వేసవికాలంలో టూరిస్టులు చాలా మంది వచ్చారు. విందులు, వినోదాలు, నృత్యాలు, సంగీతం నలు వైపులా మారుమ్రోగుతాయి. ముఖ్యంగా సాయంకాలం చీకటి పడినప్పటి నుంచి రాత్రంతా ఇవి సాగుతాయి. అక్కడ ఇళ్ళకి తెల్ల పెయింట్‌ వేస్తారు. కిటికీలు, తలుపులు నీలం రంగులో ఉంటాయి.

          బార్బరాతో కలసి మరో వింత ప్రదేశానికి వెళ్ళడం నేను జన్మలో మర్చిపోలేను! అది ఏథెన్స్‌ దగ్గరలోనున్న లేడీస్‌ న్యూడ్‌ బీచ్‌ ! అక్కడ స్త్రీలు ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా తిరుగుతారు, తింటారు, త్రాగుతారు, సముద్ర స్నానాలు చేస్తారు. బార్బరా నేను రానంటున్నా ఏం ఫర్వాలేదని తీసుకెళ్ళింది. నేను మాత్రం దిగంబరంగా ఉండనని ముందే చెప్పాను. ఆమె అదేం పెద్ద సమస్య కాదని భరోసా ఇచ్చింది. వాళ్ళందరూ అలా తమల్ని తాము మర్చిపోయి, స్పృహలేకుండా, ఉల్లాసంగా తిరుగుతుంటే బట్టలతోనున్న నాకు చచ్చేంత సిగ్గువేసింది. ఎక్కువసేపు అక్కడ ఉండలేక బార్బరాని బయటికి లాక్కొ చ్చాను. నిజం చెప్పొద్దూ ! ఉబకాయులైన కొందరు మహిళలను అలా చూడటం నాలో జుగుప్సని కలిగించింది ! దీన్నే కల్చరల్‌ షాక్‌ అంటారు కాబోలు!

          తర్వాత ఇండియన్‌ ఫ్రెండ్స్‌ సహాయంతో ఒక బేస్‌మెంట్‌ అపార్ట్‌మెంట్‌ అద్దెకి తీసుకున్నాను. ఎందుకంటే వైడబ్యూసిఏలో ఉండటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ! నా అపార్ట్‌మెంటున్న బిల్డింగ్‌ యజమాని పైన రెండవ అంతస్థులో ఉంటారు. ఆయన భార్య మిసెస్‌ సోఫియా బిల్డింగ్‌ వ్యవహారాలన్నీ చూచుకునేది. కొద్దికాలంలోనే మా మధ్య మైత్రి ఏర్పడింది. ఆమె తనకి వచ్చిన కొద్దిపాటి ఇంగ్లీషు పదాలతో, ఒక్కోసారి హావభావాలతో సంభాషణలు సాగటానికి ప్రయత్నాలు చేసేది. మొదట్లోనే నేను స్టూడెంట్ని అని తెల్సుకుని నాకు ఒక కుర్చీ, బల్ల, మంచం, పరుపు ఏర్పాటు చేసింది. వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించేది. ముఖ్యంగా ప్రతి శనివారం సాయంత్రం ఒక గ్రీకు టెలివిజన్‌ ఛానల్లో ‘జ్యూయల్‌ ఇన్‌ ది క్రౌన్‌’ అనే సీరియల్‌ వస్తుండేది. అది 1984కు సంబంధించిన బ్రిటీష్‌ టెలివిజన్‌ సీరియల్‌. దాన్ని బ్రిటీష్‌ రచయిత పాల్‌ స్కాట్‌ నవలల ఆధారంగా తీశారు. ఇండియాలో ఆంగ్ల సామ్రాజ్యపు ఆఖరి దినాల చరిత్ర దాని వృత్తాంతం ! ఇంటావిడ సీరియల్‌ చూడటానికి నన్ను ఆహ్వానించడమే కాకుండా తినడానికి ఏదో ఒక స్వీట్‌ పెట్టేది. కమలాపండు తొక్కతో చేసిన స్వీట్‌ ఎక్కువగా ఇవ్వడం నాకిప్పటికీ గుర్తు! వగరుగా, తియ్యగా బాగుండేది! యూనివర్సిటీ విద్యార్థులు, ఇంగ్లీషు చక్కగా మాట్లాడగలిగిన వారైన ఇంటావిడ కూతురు, కొడుకు కూడా నాతో స్నేహంగా మెలిగేవారు. నేను ఇండియా వచ్చేస్తున్నపుడు ఆ కుటుంబం నాకు ఫేర్‌వెల్‌ లంచ్‌ ఇచ్చింది. ఫోటోలు కూడా తీసుకున్నాం !

          ఏథెన్స్‌లో నన్ను ఆశ్చర్యపరచిన విషయం ఏమిటంటే గ్రీకులు ఇండియా గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ! వాళ్ళ టి.వి.లలో ఇండియాకి సంబంధించిన వార్తలను రెగ్యు లర్‌గా చూపిస్తారని కూడా తెలిసింది. నేను ఎప్పుడైన చీర కట్టుకుని కనబడితే నా దగ్గరికి వచ్చి ఇందిరాగాంధిని సెక్యూరిటీ గార్డ్‌ షూట్‌ చేసిన సంఘటన (31 అక్టోబర్‌, 1984) గురించి అనేక ప్రశ్నలు వేసేవారు. చీర కట్టుకునే విధానం కూడా వాళ్ళకెంతో విస్మయం కలిగించేది. వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూస్తూ వెళ్ళేవారు. ఆ రోజుల్లో నాకు జుట్టు బాగా పొడుగ్గా, వత్తుగా ఉండేది. ఎప్పుడైనా తలంటు పోసుకుని, ఆరడానికి వదిలేసి, బయట ఏదైనా కొనడానికి వెళ్ళినపుడు నా జుట్టుని ముఖ్యంగా గ్రీకు మహిళలు ఆశ్చర్యంగా చూసేవారు. కొందరు నా దగ్గరికొచ్చి రియలా కాదా అని అడుగుతూ పరిశీలించేవారు.

          మా అపార్టుమెంట్‌కి దగ్గరలో ఒక మాంసం కొట్టుండేది. అందులో బుచ్చర్‌ అంటే మాంసం కొట్టి ఇచ్చే వ్యక్తి ఎత్తుగా, మంచి ముఖ కవళికలతో గ్రీకు వీరులను గుర్తుకు తెచ్చేవిధంగా ఉండేవాడు. అతను తెల్లకోటు వేసుకుని మనవైపు మాంసం అమ్మేవాళ్ళకి ఎంతో విభిన్నంగా హ్యాండ్సమ్‌గా ఉండేవాడు. అతనికి నన్ను, నా చీరకట్టుని చూస్తే ఎంతో ఆశ్చర్యం! నేను పోతుంటే నిలబడి చూస్తుండేవాడు. తర్వాత ‘నమస్తే’ అనడం నేర్చుకుని నేనటు వైపు వెళ్తున్నప్పుడల్లా చేతులు జోడిరచి ‘నమస్తే’ చెప్తుండేవాడు. ఒక రోజు ధైర్యం చేసి కాఫీకి కూడా ఆహ్వానించాడు. నేను మర్యాదగా తిరస్కరించాననుకోండి! అతనెప్పుడైనా గుర్తుకు వస్తే నాకిప్పటికి నవ్వొస్తుంది !

          నాకు గ్రీకు గవర్నమెంటు వాళ్ళిచ్చే స్కాలర్‌షిప్‌ సరిపోవడమే కాకుండా కొంత సేవ్‌ చెయ్యగలిగాను. దానితో ఇటలీ, పారిస్‌ చూడటానికి వెళ్ళాలనుకున్నాను. స్నేహితులు కూడా నాకు ధైర్యం చెప్పారు. మే నెల చివర్లో ఏథెన్స్‌ నుంచి బస్సులో బయలుదేరాను. అలాంటి బస్సులను కోచ్‌లంటారు. అవి దూర ప్రయాణాలు చెయ్యడానికి వీలుగా, అన్ని సౌకర్యాలతో బావుంటాయి. ముందుగా నేను ఇటలీలోని ట్రైస్టే వెళ్ళాను. మా మరిదిగారి స్నేహితుని చెల్లెలు మనోరమ అక్కడి యూనివర్సిటీలో ఆస్ట్రో ఫిజిక్స్‌లో పిహెచ్‌.డి. చేస్తుంది. ఆమెతో రెండు రోజులు గడిపి రైల్లో ఇటలీ వెళ్ళాను. అక్కడ వెన్నిస్‌, ఫ్లారెన్స్‌, రోము, పాంపే చూశాను. అక్కడ నుండి మళ్ళీ ట్రైస్టే వచ్చి మనోరమ దగ్గర ఒక రోజుండి పారిస్‌ వెళ్ళాను. మనోరమ కలుపుగోలుతనం, ఆతిథ్యం మరుపురానివి. ఆమె సలహాలు, హెచ్చరికలు కూడా నా ప్రయాణంలో ఎంతో ఉపయోగపడ్డాయి. పది సంవత్సరాల క్రితం ఆమె కేన్సర్‌తో మరణించిందని తెలిసినపుడు మనస్సు వికలమయింది!

          జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ, డిల్లీలో నాతో పాటు చదువుకున్న నా మలయాళీ స్నేహితురాలు రూప రాహులన్‌ పారిస్‌ యూనివర్సిటీలో పి.హెచ్‌.డి. చేస్తూ, యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన హస్టల్లో ఉండేది. ఆమె నన్ను పారిస్‌ రమ్మని సాదరంగా ఆహ్వానించింది. ఆమె ఉండే హాస్టల్‌లో తొమ్మిది రోజులుండి పారిస్‌ చూశాను. ఆ విశేషాలన్నీ రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. పారిస్‌లో నాకు విపరీతంగా నచ్చినవి లౌవ్రే మ్యూజియం (Louvre museum), పికాసో నేషనల్‌ మ్యూజియం (Picasso National Museum). లౌవ్రేలో రెండు రోజులు పూర్తిగా గడిపి చూశాను. అక్కడ బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాసులో పెట్టబడిన లియోనార్డో డావిన్సీ పెయింటింగ్‌ ‘మొనాలీసా’ చూసిన జ్ఞాపకం మనస్సులో ముద్రవేసింది.

          పారిస్‌ వీధులలో సంగీతకారులు, వాద్యకారులు తమ కళలను ప్రదర్శిస్తూ, ప్రజల ను ఆకట్టుకుంటూ కనబడతారు. కెఫేల ముందు ఆరుబయట కుర్చీల్లో సాహిత్యకారులు, బుద్ధిజీవులు కూర్చొని గంటల తరబడి చర్చలు సాగించడం అక్కడ సర్వసాధారణం ! రూప ఉండే హాస్టల్లోనే ఫరా రెహమాన్‌, ఫర్‌హత్‌ రెహమాన్‌ అనే ఇద్దరు పాకిస్తానీ యువతు లుండేవారు. వారు కవలలు. మంచి పసిమి రంగుతో చాలా అందంగా ఉండేవారు. రూప వాళ్ళని పరిచయం చేసింది. ఎప్పటి నుంచో పరిచయమున్నట్లు స్నేహం ఇట్టే ఏర్పడిం ది. రెండు ప్రభుత్వాల మధ్యనున్న వైరం మా స్నేహానికి అడ్డు రాలేదు. రూపతోటి, వాళ్ళ తోటి గడిపిన క్షణాలు, రువ్విన నవ్వులు ఇంకా గుర్తున్నాయి. పారిస్‌లో గడిపిన ఆ తొమ్మిది రోజులు గిర్రున తిరిగిపోయాయి.

          ఏథెన్స్‌ వెళ్ళే తిరుగు ప్రయాణంలో పారిస్‌లో మళ్ళీ కోచ్‌ ఎక్కాను. యుగోస్లావియా, గ్రీసు సరిహద్దుల్లో కోచ్‌ను ఆపి పాస్‌పోర్ట్‌లు చెక్‌ చేశారు గ్రీకు ఆఫీసర్లు. అందరినీ ఓకే చేసి, నన్ను కోచ్‌ దిగమన్నారు. నాకర్ధం కాలేదు. అయోమయంగా దిగాను. నన్నక్కడ రూమ్‌లో వెయిట్‌ చెయ్యమన్నారు. టెన్షన్‌తో రెండు, మూడు గంటలు కూర్చున్నాను. అది వరకు ఆపిన వారిలో మధ్య వయస్కుడైన ఒక జర్మను వ్యక్తి నన్ను గమనిస్తూ, చివరికి నా దగ్గరకొచ్చి సమస్య ఏమిటని అడిగి, నా వివరాలు తెలుసుకున్నాడు. నేను ఇండియన్‌ స్టూడెంట్‌ అని తెలుసుకుని ఏథెన్స్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీకి ఫోను చెయ్యమన్నాడు. అలా చెప్పడమే కాకుండా, ఫోను డైరెక్టరీ తెచ్చి, నెంబర్‌ వెతికి నాకిచ్చాడు. నేను ఫోన్‌లో ఇండియన్‌ ఎంబసీ వాళ్ళకి నా పరిస్థితి తెలియపరిచాను. వాళ్ళు వెంటనే తగిన చర్య తీసుకున్నారు. బోర్డర్‌ అధికారులు నా దగ్గరకొచ్చి పాస్‌పోర్ట్‌ మరొకసారి చెక్‌ చేసి నన్ను వెళ్ళొచ్చని చెప్పడమే కాకుండా, ఏమ్‌స్టర్‌డామ్‌ నుంచి ఏథెన్స్‌కి కారులో వెడుతున్న ఒక డచ్‌ యువకుడ్ని రిక్వెస్టు చేసి, నన్నాకారులో పంపే ఏర్పాటు చేశారు. నేను కారులో ఎక్కేంత వరకు ఆ జర్మను వ్యక్తి నాకు తోడుగా ఉండి, నాకు వీడ్కోలిచ్చాడు. ఆ డచ్‌ యువకుడు కూడా నాతో ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాడు. అతను ఇంగ్లీషులో బాగా మాట్లాడటం వలన సంభాషణలు చక్కగా సాగాయి. దారిలో ఆపినచోటల్లా నాకు కూల్‌డ్రింక్స్‌, ఆహారపదార్థాలు తెచ్చిచ్చాడు. చివరికి ఏథెన్స్‌లో నా అపార్ట్‌మెంట్‌ ముందు కారాపాడు. నేనతన్ని టీ తీసుకుని వెళ్ళ మని ఆహ్వానించగా, లోపలికొచ్చి టీ తీసుకుని నాకు బై చెప్పి సెలవు తీసుకున్నాడు.

          ఇక నా అపార్ట్‌మెంట్‌కి దగ్గర్లోనే కమల్‌ వర్మ, పూర్ణిమ వర్మ అనే ఇండియన్‌ జంట, వాళ్ళ మూడేళ్ళ చిన్న కూతురు ఉండేవారు. పూర్ణిమ కూతుర్ని ట్రాలీలో కూర్చోబెట్టుకుని నేనూ, ఆమె షాపింగ్‌ వెళ్ళేవాళ్ళం. వారానికొకసారి పెట్టే వీక్లీ మార్కెట్‌కి వెళ్ళి కూరగా యలు, పండ్లు, ఇంకా అవసరమైన వస్తువులు తెచ్చుకునేవాళ్ళం. అప్పుడప్పుడు దగ్గర్లో ఉన్న ఇండియన్‌ కుటుంబాల ఇళ్ళకూ కూడా వెళ్ళేవాళ్ళం. ఏథెన్స్‌లో ఇండియన్స్‌ ఉన్నారు గాని చాలా తక్కువ. నేను బస్సులో అప్పుడప్పుడు అమెరికన్‌ లైబ్రరీకి, బ్రిటీష్‌ లైబ్రరీకి వెడుతుండేదాన్ని. ఇంగ్లీషు నవలలు తెచ్చుకుని చదువుతుండేదాన్ని.

          ఏథెన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన నా గైడ్‌ మిసెస్‌ డోరిస్‌ తక్కువ వ్యవధిలో నేను లోతైన రిసెర్చ్‌ చెయ్యలేనని గ్రహించి, గ్రీసులోని ఆర్కియాలిజికల్‌ సైట్స్‌ మీద బిబ్లియోగ్రఫీ తయారు చేసే సులువైన పనిని అప్పగించారు. పేపర్‌ నేను తయారు చేసి సబ్మిట్‌ చేయగా, నాకు సర్టిఫికెట్‌ ఇచ్చారు. అది ఇప్పటికీ నా దగ్గర సురక్షితంగా ఉంది. నేను ఇండియా వచ్చే ముందు నాకు రెస్టారెంట్‌లో ఫేర్‌వెల్‌ లంచ్‌ కూడా ఇచ్చారు. ఇండియా గురించి తెల్సుకోవాలన్న ఆసక్తి ఆమెలో మెండుగా ఉండేది. నన్ను రకరకాల ప్రశ్నలు వేసి సమాచారాన్ని రాబట్టేవారు.

          జూన్‌ మాసం చివర్లో నా ఇండియా టికెట్‌ బుక్‌ చేసుకున్నాను. ఏథెన్స్‌ ఎంత బాగున్నా, ఎప్పుడు డిల్లీ చేరుకుంటానా అని మనస్సు తొందరపడిరది. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ! అంటారు కదా ! కానీ ఇక్కడున్న ఆరునెలలు నాకు జీవితాంతం గుర్తుంచుకునే అనుభవాలు కలిగాయి. ఆ అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు డైరీలో రాసుకోలేదు కాబట్టి గుర్తున్నవరకు రాసి మీ ముందుంచాను.

          ఒకటి మాత్రం నిజం ! నాకే సమస్య వచ్చినా, ఎవరో ఒకరు నా పక్కన నిలబడ్డారు. వారిలో భారతీయులు, మీదుమిక్కిలి విదేశీయులు ఉన్నారు. ఇక స్నేహం విషయానికొస్తే జాతి, మతం, కులం, దేశం అనే సరిహద్దులకు అతీతమైన, అద్భుతమైన అనుభూతి అని ఏథెన్స్‌ అనుభవాలు నాకు నేర్పాయి. అందుకే అంటాను స్నేహానికి సరిహద్దులు లేవని ! మాచవరపు ఆదినారాయణ గారు తన పుస్తకం ‘సైబీరియా బాటసారి’లో రాసిన వాక్యాలు: ‘‘వైవిధ్యభరితమైన ప్రపంచాన్ని ప్రేమంచగలిగినప్పుడే పక్కనున్న వారిని ప్రపంచ పౌరుడిగా గుర్తించగలం. గ్రహాంతర వాసినైనా, సహవాసిగా మార్చగలిగేది ప్రయాణికుడే’’ అక్షర సత్యాలు.

*****

Please follow and like us:

One thought on “స్నేహానికి సరిహద్దులు లేవు”

Leave a Reply

Your email address will not be published.