అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 16

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. గోపీ డైవోర్సీ అని తెలుసుకుని విశాల త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విష్ణుతో చెపుతుంది. విశాలకి టేఫ్ కాలేజీలో వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం వచ్చింది. విష్ణుకి ఉద్యోగ అవకాశం వచ్చినా, ఇంటికి దూరం, కారు
కంపల్సరీ అని కన్సల్టెంట్ చెప్పడంతో నిరాశ చెందుతాడు. ఆస్టేలియా వచ్చి తప్పు చేసానా అని ఆలోచనలో పడతాడు. విశాల అతనికి ధైర్యం చెపుతుంది. విశాల డాక్టర్ చెకప్ కోసం మెడికల్ సెంటర్ కి విష్ణుతో వెళ్ళింది.

***

          జీవితం సుఖ దుఃఖాల మేలు కలయిక. రెండూ ఒకదానిని వెంబడించి ఒకటి పయనం కొనసాగిస్తాయి మనిషి జీవితంలో. సుఖంగా ఉన్నపుడు సంతోష సాగరంలో, దుఃఖం కలిగినపుడు శోక సముద్రంలో మునిగిపోకుండా రెంటినీ సమానంగా స్వీక రించినపుడు బ్రతుకు నావ ఒడిదుడుకుల అలల పై తేలుతూ సాఫీగా గడుస్తుంది.

          చేతిలో ఫోన్ పెట్టుకుని విష్ణు నెమ్మదిగా మెష్ తలుపు తీసాడు. మెయిన్ డోర్ తీసి ఉండటంతో లోపలికి వెళ్ళి చూసాడు. టి.వి ఆన్ చేసి ఉంది. సోఫా లో గోపీ తీరిగ్గా కూర్చుని ఉన్నాడు.

          అతనిని చూడగానే భారమైన నిట్టూర్పు విడిచి “ఓ! మీరు ఈ రోజే వచ్చేసారా? ఆదివారం వస్తారనుకున్నాము.” అన్నాడు విష్ణు.

          దానికి గోపీ నవ్వుతూ, “లేదు, నాఫ్లైట్ అనుకోకుండా ముందు రోజుకు మార్చుకు న్నాను.” అన్నాడు. 

          ఇంతలో విశాల ‘భగవంతుడా! నీకు ధన్యవాదాలు. రక్షించావు తండ్రీ!’ అని
మనసులో అనుకుంటూ లోపలికి వచ్చింది.

          “ఇద్దరూ నెల రోజులు బాగానే అలవాటు పడినట్టున్నారు ఇక్కడ.

          ఇంటి రూపురేఖలు మారిపోయాయి. వస్తువులు అన్నీ మీకు తగ్గట్టుగ్గా అమర్చు కున్నారేంటి!” అని కాస్త అక్కసుగా మాట్లాడాడు గోపి.

          విశాలకు అతని వాలకం చూడగానే, డ్రింక్ చేసాడేమో అనిపించింది. ముభావంగా లోపలికి వెళ్ళిపోయింది.

          విష్ణుసాయి కూడా పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడి, గదిలోకి వచ్చేసాడు.

          విశాల ముందుగానే ఊహించి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనటం సబబే కదా!.
ఇంక ఆలస్యం చేయకుండా మూడు రోజులలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం
శ్రేయస్కరం అనుకున్నాడు విష్ణు.

          తనతో విశాల మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవడం నచ్చలేదు గోపీకి. అతనికి లోపల కుతుకుత ఉడికిపోతోంది.

          తన జీవితంలో పెద్ద అగాధం ఏర్పడినట్లు క్రుంగిపోయాడు. లంకంత ఇల్లు కొను క్కున్నాను. సుఖశాంతులు లేవు. నెత్తిమీద మళ్ళీ మోర్టగేజ్ అనే రుణభారం ఒకటి.
ఇల్లు పెద్దగా ఉన్న అతని మనసు వేల ఆలోచనలతో ఇరుకుగా ఉంది. టి.వి సౌండ్ గట్టిగా పెట్టుకుని, ‘గ్రీన్ మైల్’ సినిమా చూడసాగాడు. అసలే మనసు బాధలో ఉంది. దానికి తోడు ఈ క్రైమ్ సినిమా, ఇవి చాలవు మనిషిని దిగలాగడానికి. మనసులో అసంతృప్తిగా, వేదనాభరితమైన సినిమా చూస్తూ, సోఫా బెడ్ వాల్చుకుని నిద్రలోకి ఒరిగాడు గోపి.

          మాటలు కరువైన రాతిరి, శరీరం అలసట చెంది, విశాల, విష్ణు త్వరగా నిద్ర పోయారు.

          మరునాడు గోపీ, జెట్ లేగ్ తో ఇంకా నిద్ర లేవలేదు.

          విశాల, విష్ణు త్వరగా తయారై, ఫ్రిజ్ లో బ్రెడ్, జామ్ శాండ్ విచ్ చేసుకుని, ఇంట్లోం చి బయట పడి ఎవరి పనులకు వాళ్ళు ఇద్దరూ రెండుగా చీలి వెళ్ళిపోయారు.

          విష్ణు ఆలోచనలు వేగంగా పరుగెడుతున్నాయి. వర్క్ తొమ్మిది గంటలకు మొదలవు తుంది. ఈ లోపుగా అర్జెంట్ గా కొన్ని పనులు చేసేయాలి అనుకున్నాడు.

          లీసాకు ఫోన్ చేసాడు. రెంటల్ అగ్రీమెంట్ కాగితాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంటి అద్దె లీజ్ అప్రూవ్ అయిందని లీసా చెప్పింది.

          విష్ణు మూడు రోజులలో ఈ బుధవారం మేము ఇంట్లోకి మారతాము, పేపర్ వర్క్ పూర్తి చేయడానికి ఆఫీస్ కి వెళ్ళి సంతకం చేసాడు. ఇంటి తాళాలు మంగళవారం ఇస్తాను అని చెప్పింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ లీసా.

          అక్కడి నుంచి బయటపడి, విష్ణు డ్రైవింగ్ పాఠాలు మొదలు పెట్టడానికి కరణ్ కి ఫోన్ చేసాడు. వారానికి రెండు పాఠాలు తీసుకోవడానికి, గంటకు నలభై డాలర్లు చొప్పున అతనితో పది పాఠాలు తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

          విష్ణు పోస్టాఫీస్ కి చేరుకోగానే కర్తార్ సింగ్ అతనికి వర్క్ పక్కనే ఉండి ట్రాన్సేక్షన్ ఎలా చేయాలో, ఎఫ్ పాస్ మెషీన్ ఆపరేషన్, స్కానింగ్ ప్రోడక్ట్స్, పోస్టాఫీస్ డెలివరీ టైమ్ ఇలా వివిధ అంశాలలో తర్ఫీదు ఇచ్చాడు.

          విష్ణు చేసే జాబ్ నుంచుని చేయాలి. ఆ రోజు పెద్దగా రద్దీ లేదు. అక్కడకి వచ్చే కస్టమర్ల లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు.

          ఈ జాబ్ ప్రస్తుతానికి ఖర్చులు గడవడానికి ఫర్వాలేదు. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే తన డ్రీమ్ జాబ్ తనను వెతుక్కుంటూ వస్తుంది అనుకున్నాడు.

          నిమిషాలు క్షణాల్లాగా గడిచిపోయాయి ఆ రోజు విష్ణు కి ఆస్ట్రేలియాలో తన మొదటి ఉద్యోగం అది.

          బయటికి రాగానే విశాలకి ఫోన్ చేసి బ్లాక్ టౌన్ స్టేషన్ కి  రమ్మన్నాడు.

          ఇద్దరూ మెక్ డోనాల్డ్ లో టీ తాగుతూ జరిగిన విషయాలు పూస గుచ్చినట్లు చెప్ప సాగాడు విశాలకి విష్ణు.

          “చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇంటికి వెడితే మాట్లాడుకోవడానికి ఉండదు.
మనం ఈ బుధవారమే ఇల్లు మారుతున్నాము. రెంటల్ అగ్రిమెంట్ ఆరు నెలలకి
సైన్ చేసాను ప్రస్తుతానికి. గోపీకి ఈ విషయం తాళాలు తీసుకున్నాక రేపు చెపుతాను.
ఈ రెండు రోజులు కష్టపడదాము మాటల తీవ్రత తగ్గిద్దాము. నిన్న అతని వాలకం నాకు నచ్చలేదు. టి.వి వాల్యూమ్ గట్టిగా పెట్టాడు. ఏ కోశాన ఒక మంచి మాట లేదు. అందుకే వెంటనే మారాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. మనం వెళ్ళబోతున్న అపార్ట్ మెంట్ ఫర్నిష్డ్. అందుకని మనం మంచము, ఫ్రిజ్ కొనుక్కునే అవసరం లేదు ప్రస్తుతానికి.”

          అన్ని విషయాలు విన్నాక విశాల అంది. “చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే గోపీకి మీరు అడ్వాన్స్ కట్టారా?”

          దానికి విష్ణు “అది ఈ వారంతో లెక్క సరిపోతుంది. ఆ సంగతి నేను చూసుకుంటా ను. యు డోంట్ వర్రీ మై డియర్!” అన్నాడు.

          “మనకి ఇతర సామాగ్రి వంట వండుకోవటానికి కావాలి కదా!” అంది ఎన్నో ఆలోచనలు నిండిన వదనంతో విశాల.

          “అవును పాయింటే! మనవాళ్ళని స్టీలు సామాను కొరియర్ చేయమంటాను
ఇక్కడికి” అని అనుకున్నదే తడవుగా ఫోన్ చేసాడు ఇంటికి విష్ణు.

          తల్లి, దండ్రిని పలుకరించాడు. “మేము బుధవారం ఒక అపార్ట్ మెంట్ లోకి మారుతున్నాము. మాకు వంటకి గిన్నెలు కావాలి. ఇక్కడ మన అవసరాలకు తగ్గట్టుగా అన్ని సెట్ గా ఉండవు కదా! పెళ్ళిలో మా ఇద్దరికీ నాన్ స్టికింగ్ కుకింగ్ గిఫ్ట్ సెట్, ప్రెషర్ కుకర్ వచ్చాయి కదా. అమ్మా! నువ్వు ఇంక వంట చేసుకోవడానికి అవసరమైన బూరెల మూకుడు, సుమీత్ గ్రైండర్ అన్నీ కొరియర్ పంపండి. అడ్రస్ ఇల్లు మారగానే వివరాలు ఇస్తాను” అన్నాడు విష్ణు.

          ఇంతలో విశాల, ఫోన్ లాక్కుని “అత్తయ్యా! ఎలా ఉన్నారు? వీలైతే మాలతి చందూర్ వంటల పుస్తకం కూడా కొరియర్ లో పంపించండి” అంది నవ్వుతూ విశాల.

          ఇంతలో బీప్ వచ్చి “యూ హేవ్ ఓన్లీ ఫైవ్ డాలర్స్ రిమైనింగ్” అని వాయిస్ మెసేజ్ వచ్చింది. ఫోన్ కాల్ కట్ అయింది.

          ఇద్దరూ ఫోన్ మాట్లాడటం అవ్వగానే చుట్టుపక్కల ఒకసారి చూసింది, “ఎవరూ మనని చూడటం లేదు కదా! ఎక్సైట్ మెంట్ తో గట్టిగా మాట్లాడేసామా?” అంది గుసగుసగా విశాల.

          “లక్కీగా ఎవరు లేరులే. ఈసారి నుంచి మాట్లాడే ముందే చుట్టూ ఎవరైన ఉన్నారేమో ముందే చూసుకో” అన్నాడు నవ్వుతూ విష్ణు.

          ఇద్దరూ ఆనందంగా ఇంటికి చేరుకున్నారు.

          అభిరుచులు, అలవాట్లు, మనస్తత్వాలు కలిస్తే మాటలు రాజ్యాలేలుతాయి. అదే మనుష్యులు నచ్చకపోతే, అభిప్రాయాలు కలవకపోతే, అగాధాలు ఏర్పడి, మనస్సులు బ్రద్దలౌతాయి. అదే ఇపుడు గోపీ ఇంట్లో, ఒంట్లో రగులుతున్న జ్వాల. అతని జ్వాల
ఆరుతుందా?

          అపుడే ఇంట్లోకి అడుగుపెట్టిన విశాల, విష్ణుని గోపీ చూడగానే హలో చెప్పాడు.

          “ఈ రోజు మీరు బాగా ప్రొద్దున్నే బయటికి వెళ్ళిపోయినట్లున్నారే!” అన్నాడు గోపి.

          విష్ణు “అవును పనులున్నాయి. ప్రస్తుతం నేను టెంపరరీ జాజ్ లో చేరాను” అన్నాడు.

          “మీరు వచ్చి నెల దాటింది కదా! వచ్చే నెల పేమెంట్ కి నేను వేరే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను. డబ్బు అందులో పే చేయండి” అన్నాడు గోపి.

          “నేనే ఆ విషయం గురించి మాడ్లాడుదామనుకున్నాను. మీరే ఆ విషయం ఎత్తారు. ఇంక ఆ అవసరం లేదు. మేము ఈ బుధవారం వెళ్ళిపోతున్నాము.” అన్నాడు విష్ణు.

          “మీరు ముందే ఆ విషయం చెప్పక్కర్లేదా? ఒక్కరోజు నోటీస్ లో అలా వెళ్ళిపోతాన నడం ఏమి బాగాలేదు. నా ఫ్రెండ్ రిఫరెన్స్ మీద మీకు ఇచ్చాను.” అన్నాడు గోపి ఉక్రోషంతో.

          దానికి చిరు మందహాసం చేసి, విష్ణు అన్నాడు “థాంక్స్ గోపీ ఫర్ ద హాస్పిటాలిటీ. నేను వినయ్ మిమ్మల్ని సజెస్ట్ చేయగానే, సరే అని మీ ఇంటికి పేయింగ్ గెస్ట్ గా అదే నమ్మకంతో మీ ఇంటికి వచ్చాను. లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. మీకు ఒక మంచి తోడు దొరకాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్!” అని కూల్ గా విష్ణు చెప్పేసరికి, గోపీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

          కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు అతని ముఖంలో. వెంటనే తేరుకుని “ఒకే విష్ణూ! లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్” అని షేకెండ్ ఇచ్చాడు.

          అప్పటికి వాతావరణం నార్మల్ గా అయింది.

          విశాల చుట్టూ ఉన్న టవల్స్, బట్టలు అన్ని టైడీ చేసి అన్నీ సూట్ కేస్ లో సర్దుకుంది. తప్పదు ఇంకొక రోజు ఈ మజిలీ ఇక్కడ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.

          విష్ణుకి మనసులో ఇపుడు ఏ విధమైన బెరుకు లేదు. గట్టి ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. తను అనుకున్నది ఏదైనా జరిగి తీరుతుంది. కృత నిశ్చయంతో నేను అసలంటూ పని మొదలు పెట్టాలి. ఒకసారి రంగంలోకి దూకాక పనులు వాటంతట అవి జరుగుతాయి. రేపు చేయవలసిన పనుల లిస్ట్ చాలానే ఉంది అనుకుంటూ విష్ణు ధీమాగా నిద్రపోయాడు.

          విశాల, విష్ణు ఉదయమే లైట్ బ్రేక్ ఫాస్ట్ బ్రెడ్ బటర్ తిని, ఇంట్లోంచి బయట పడి వర్క్ కి వెళ్ళిపోయారు.

          విష్ణు తన వేలెట్ లో విజిటింగ్ కార్డ్స్ చూస్తూ తనకు షాపింగ్ సెంటర్ లో పరిచయమైన రవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇల్లు మారుతున్నామని.

          “అవునా! విష్ణు. గుడ్ న్యూస్. ఈ రోజు మా ఇంటికి డిన్నర్ కి రండి. సాయంత్రం కలుస్తాను” అని ఫోన్ పెట్టేసాడు. విష్ణు వర్క్ కి వెళ్ళాక కర్తార్ సింగ్ తో ఇల్లు మారుతున్న విషయం చెప్పాడు. “రేపు నేను వర్క్ కి రాలేను.” అన్నాడు.

          దానికి కర్తార్ “ఓకే, శనివారం షిఫ్ట్ తీసుకో. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు” అని మైత్రీపూర్వకంగా విష్ణు భుజం తట్టాడు.

          సాయంత్రం లీసా దగ్గరకి వెళ్ళి ఇంటి తాళాలు తీసుకున్నాడు విష్ణు.

          విశాల కి ఫోన్ చేసి బ్లాక్ టౌన్ స్టేషన్ దగ్గరకి రమ్మాన్నాడు విష్ణు.

          విశాల, విష్ణు వెస్ట్ ఫీల్డ్ లోకి దారి తీసారు.

          “విశాలా! ఈ రోజు మనం రవి వాళ్ళింటికి వెడుతున్నాము. ఆయన కాసేపట్లో ఇక్కడికి వస్తారు.” అన్నాడు విష్ణు.

          విశాల అక్కడే ఊల్ వర్త్ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ఫెరారో రోచి చాక్లెట్స్ బాక్స్ తీసుకుంది.

          రవి రాగానే అతని కార్లో ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళారు.

          వాణి వాళ్ళని చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించింది. వాళ్ళ అమ్మాయి స్వప్న ఆనందంగా “ఆంటీ!” అంటూ విశాల ఒళ్ళో కూర్చుంది.

          విశాల చాక్లెట్ బాక్స్ స్వప్న చేతిలో పెట్టింది.

          “ఇంటికి వస్తువులు అవసరమౌతాయి మొహమాట పడద్దు” అని వాణి చిన్న
ఎలక్ట్రిక్ కుకర్, మరో రెండు స్టీల్ గిన్నెలు, పోపుల డబ్బా వద్దన్నా వినకుండా బాగ్ లో సర్దింది.

          విశాల వాణిని ఆ క్షణంలో ‘అక్కా!’ అనే పిలుపుతో ఆప్యాయంగా కౌగలించుకుంది.
అందరూ కబుర్లు చెప్పుకుంటూ, బంధువుల కన్నా ఎక్కువగా కలిసిపోయి డిన్నర్
చేసారు.

          “రేపు ఉదయం పది గంటలకు మేము వస్తాము” అని రవి వాళ్ళని ఇంటి దగ్గర
దిగబెట్టి వెనుతిరిగాడు.

          ఇంటికి వెళ్ళేసరికి గోపీ ఇంటిలో లేడు.

          విష్ణు, విశాల వాళ్ళ సామాను అంతా పాక్ చేసారు. రాత్రి పది గంటలకు గోపీ వచ్చాడు. విష్ణుకి గోపీతో మాట్లాడే ఆస్కారం లేకపోయింది.

          విశాలకి నిద్ర పట్టడం లేదు. మరో 12 గంటలలో మరో క్రొత్త లోకంలో  అడుగిడ బోతోంది. తన స్వంత గూడు. నిజం చెప్పాలంటే అనుకోకుండా ఈ చట్రంలో గోపీ ఇంట్లో
పేయింగ్ గెస్ట్ గా ఉండటం విశాలకు ఏమాత్రం ఇష్టం లేదు. ఉంటే అత్తగారింట్లో, లేదా పుట్టింట్లో. అంతకుమించి వేరే ఇంట్లో, పేయింగ్ గెస్ట్ ఈ కాన్సెప్ట్ విశాలకు నచ్చలేదు. తన ప్రమేయం లేకుండా కొద్ది రోజులు తన స్వాతంత్రాన్ని ఎవరో లాక్కున్న భావన
కలిగింది విశాలకు.

          “ఏది ఏమైతేనేం. నేను నమ్మే నా లలితా దేవి నా వెంటే ఉంటుంది” అని మనసులో లలితా దేవి రూపాన్ని స్మరించుకుంటూ నిద్రపోయింది విశాల. ఉదయం పది గంటలు కావస్తోంది. విష్ణు గోపీకి ఇంటి తాళాలు ఇచ్చాడు. గోపీ వాళ్లు వెళ్ళబోయే ఇంటి అడ్రస్ అడిగాడు.

          అదే సమయానికి రవి రావడంతో విష్ణు పెద్ద సూట్ కేసులు తీసుకుని కారులో
పెట్టడానికి వెళ్ళాడు. అతనిని అనుసరించి, విశాల కూడా బయటికి నడిచింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.