దేవి చౌధురాణి

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

కథా కాలం

చరిత్రకారులకు ఏ యుద్ధంలో ఏ రాజు గెలిచాడో ముఖ్యం. ప్రబంధకారులకు, కవులకు ఏ రాజు ఎంతటి గొప్ప పరాక్రమవంతుడో, అనగా ఎంతటి పర ఆక్రమణదారుడో ఘణంగా వర్ణించటం ముఖ్యం. అయితే ఈ యుద్ధాలలో నలిగేది మాత్రం సామాన్య ప్రజలే. వారి కథలు, జీవన పోరాటాలు, తిరుగుబాటులు, పోరాటాలు జానపద కథలగానూ, జానపద గీతాలు గానూ జీవిస్తాయి. వీటికి విద్యాధికుల అంతగా గౌరవ స్థాయిని కలిపించకపోవటం జరుగుతుంది. 1750-1780ల కాలం నాటి బెంగాల్ కరువు, ఆ  నేపధ్యంలో బ్రిటిష్ వారి పైన జరిగిన తిరుగుబాటులకు ఒక కథా రూపం ఇచ్చి, ఆ తిరుగుబాటులకు ఒక గౌరవ స్థాయి కల్పించటమే కాకుండా,  యావద్‌భారతాన్ని ఉత్తేజ పరిచినవారు బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ గారు. ఉత్తర బెంగాలు ప్రజలలో జీవించి (నేటి బాంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలిపి), చారిత్రక అంశాలతో కూడిన కథ “దేవి చౌధురాణి”, కథ తెలుసుకునే ముందు, కథా నేపధ్యం తెలుసుకోవలసిన అవసరం వుంది.

          నేటి భారత స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలనే కాక చాలా రాజ్యాలే ఉండేవి. బ్రిటిష్ పాలన అంతగా విస్తరించని కాలం, అనగా 17, 18వ శతాబ్దాలలో ఇంకా ఎక్కువ చిన్నాపెద్ద రాజ్యాలు, సంస్థానాలు, జమీందారీలు, జాగీర్దారీలు ఉండేవి. ఆ కాలంలో రాజభక్తి తప్ప విశాల భారతీయ భావన లేదనే చెప్పవచ్చు. ఆ కాలంలో కలకత్తా బ్రిటిష్ వారి “East India Company” పాలనా కేంద్రం అవటం వలన, బ్రిటిష్ వారి దోపిడీకీ, దౌర్జన్యానికి ఎక్కువ గురి కావటం వలన బెంగాలులో రాజకీయ చైతన్యం ఎక్కువగా  పెరిగింది. ఆ చైతన్యానికి ఒక సైద్దాంతికత కల్పించిన వారు బెంగాలీ విద్యాధికులు, పండిత వర్గం వారు.  ఈ క్రమంలో బుదేబ్ ముఖోపాధ్యాయ అనే ఆయన 1866లో “ఉనాబీమ్స పురాణం” అనే వ్యంగ్య (satire) కావ్యం రచించి, ఇది 19వ పురాణం అని చెప్పారు. ఈ పురాణంలోని ముఖ్య దైవం “ఆర్య స్వామి” ఆయన భార్య పేరు “ఆది భారతి”. పుస్తకం కానీ కథా వివరాలు దొరకటంలేదు. కానీ, ఎప్పటికైనా తప్పక పరిశీలిం చవలసిన అవసరం ఉంది. ఆ తరువాత 1873లో కిరణ్  చంద్ర బెనర్జీ “భరత మాత” అనే నాటకాన్ని ప్రదర్శించారు. పూర్తి కథ, నాటకం, ఇతర వివరాలు దొరకలేదు. ఈ కథకు భూమిక 1770లో బెంగాల్ ప్రాంతంలో వచ్చిన కరువు. వర్షాలు సరిగ్గా కురవకపోవటం, పంటలు పండక పోవటం ఒక కారణం కాగా, అప్పటి బ్రిటిష్ వారు పన్ను రూపేణా పండిన కొంచెం ధాన్యాన్ని, , తరువాయి సంవత్సరానికి దాచుకున్న విత్తనపు గింజలని కూడా తస్కరించటంతో కరవు ఉద్ధృతమయ్యింది. షుమారు 70 లక్షలు నుండి కోటి మంది ప్రజలు దాకా మరణించి ఉండవచ్చని అంచనా. 1873లో కిరణ్ చంద్ర బెనర్జీ కలకత్తాలో “భారత మాత” అనే నాటకాన్ని ప్రదర్శించారు. “భారత మాత” అనే పదం వాడటం ఇదే మొదటిసారి కావచ్చు. 1770ల కాలంలో బెంగాలులోని కరువు భూమికగా వ్రాసి ప్రదర్శించిన నాటకం ఇది. బ్రిటిష్ వారు చేనేత ఇతర పరిశ్రమలను నాశనం చెయ్యటం, సామాన్య ప్రజలు కరువు కాటకాల బాధితులవ్వటం, బ్రిటిష్ వారి దౌర్జన్యాలు ఈ నాటకంలో పొందు పరచబడ్డాయి. కథ క్లుప్తంగా కరువు కారణంగా ఒక బెంగాలి దంపతులు అడవుల పాలయ్యి, దొంగలకి చిక్కుతారు. ఆ దంపతులని దొంగలు కొట్టి ఒక నది ఒడ్డున పడేస్తే, ఒక పూజారి వాళ్ళని రక్షించి, భారత మాత గుడికి తీసుకువెళ్ళి, భారత మాత ఆశీస్సు అందుకోమని చెప్పి, దేశ విముక్తి కోసం పోరాడమని ఉద్బోధ చేస్తాడు. ఆ తరువాత ఆ దంపుతులు ఒక తిరుగుబాటు నిర్వహించి బ్రిటిష్ వారిని ఓడిస్తారు.

          ఆ తరువాత 1882లో బంకిమ చంద్ర ఛటోపాద్యాయ గారు రచించిన ఆనంద మఠంలో బంగొమాత (వంగమాత) ప్రస్తావన ఉంది. ఈ కథ ఇంతకు క్రితం వచ్చిన భారత మాత కథను కొంత వరకు పోలి ఉంది. కథకు నేపధ్యం 1768,1779 కాలంలోని బీర్‌భూమ్, అనగా వీరభూమి. అక్కడి నేల ఎర్రమట్టి. బంకిమ చంద్రగారు ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవ టానికి కారణం చెప్పబోయే కథ ఒక పోరాటం. మహాభారతానికి కురుక్షేత్రం యుద్ధరంగ మైతే, బెంగాలీయుల తిరుగుబాటుకు వీరభూమిని యుద్ధరంగంగా ఎన్నుకోవటం జరిగి ఉండవచ్చు. హర్యానాలో ఉన్న నేటి కురుక్షేత్రం ఎర్ర మట్టితో కూడి ఉంటుంది, ఇది మహాభారత యుద్ధంలో పారిన రక్తానికి నిదర్శనం అంటారు. అలాగే బీర్‌బామ్ లోని  ఎర్రమట్టిని పోరాటానికి చిహ్నంగా బంకిమ చంద్రగారు ఊహించుకుని వుండవచ్చు.  బీర్‌భూమ్ అడవులలో ఉండే సంతాళుల భాషలో భీర్ లేక వీర్ అంటే చెట్లు. కథ మొత్తానికి నేపధ్యం అడవులు అవటం వలన కూడా బీర్‌భూమ్ కథా ప్రదేశంగా సరిపో తుంది. అయితే ఈ నవలలో పేర్కొన్న సంఘటనలు, పాత్రలకు మూలాలు ఉత్తర బెంగాలులోని జలపాయగురి ప్రాంతంలోని ముర్షీదాబాద్, బైకుంఠపురం అడవులలో జరిగిన “సన్యాసి బిద్రోహ్”, అనగా సన్యాసి తిరుగుబాటు.

          ఆనందమఠం 1882లో బంకిమగారి “వంగదర్శన్” పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన నవల. ఆ తరువాత 1884లో వంగదర్శన్ పత్రికలో ధారావాహికంగా వచ్చిన నవల “జయ దుర్గా దేవి చౌధురాణి.” ఈ కథకు మూలం ఉత్తర బెంగాలు ప్రజలు జానపద కథగా పొందుపరిచిన చారిత్రక విశేషాలు. బంకిమ చంద్రగారు బ్రిటిష్ పాలనలో డెప్యుటీ మెజిస్ట్రేట్‌గాను, డెప్యుటీ కలక్టర్‌గాను ఉద్యోగం చేసారు. ఉద్యోగరీత్యా అప్పటి ఉమ్మడి బెంగాలులోని పలుప్రాంతాలలో విధులు నిర్వర్తించారు. అందులోని ఒక ప్రాంతం ఉత్తర బెంగాలులోని ముర్షీదాబాద్ ప్రాంతం. 1770ల కాలంలో రంగాపూర్, దినాజ్‌పూర్ ప్రాంతాలలో జరిగిన సన్యాసి తిరుగుబాటులోని ఒక ముఖ్యమైన ఘట్టం జనపదులలో కథగా, గేయంగా జీవించింది. ఆ కథకు ఒక నవలా రూపం ఇచ్చింది బంకిం చంద్రగారి “దేవి చౌధురాణి”.

          కథా కాలం 1770ల కాలం నాటి  “సన్యాసి విద్రోహ్” అనబడే తిరుగుబాటు. ఈ కథ లోని ముఖ్య పాత్రలు దేవి చౌధురాణి, భవానీ పాఠక్‌లు. ఈ ఇద్దరి పేరులతో నేటి తెలుగు పాఠకులకు అంత పరిచయం వుండి వుండకపోవచ్చు. కానీ, బెంగాలీలకు వీరిద్దరి వీరగాథలతో చిరపరిచయం, తెలుగు వారికి అల్లూరి సీతారామ రాజు(1897-1924) లాగా. బెంగాలు, బీహారు ప్రాంతాలలోని ప్రజలు సన్యాసి విద్రోహ్‌ని బారత దేశపు మొదటి స్వాతంత్ర సమరంగా నేటికీ పరిగణిస్తారు.  

          బంకిమ చంద్రగారు “జయ దుర్గా దేవి చౌధురాణి” కథకు పుస్తక రూపం ఇవ్వటానికి ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1859లో మొట్ట మొదటిగా “BA” పట్టా అందుకున్న ఇద్దరిలో ఒకరు బంకిమ చంద్ర. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరాలు. 1857లో మధ్య భారతంలో జరిగిన యుద్ధంలో ఝాన్సీరాణి వీర మరణం పొందిన వార్త యావత్ భారత దేశం ప్రజ్వలించింది. విద్యార్థి దశలో వున్న బంకిమచంద్రగారిని కూడా ప్రభావితం చేసి వుండవచ్చు. ఆ స్ఫూర్తితో ఆ తరువాత వంగదేశపు వీర గాథలకు కూడా ఒక పుస్తక రూపం ఇవ్వటానికి పూనుకుని వుండవచ్చు.

          వంగదర్శన్ పత్రిక స్థాపించటలో బంకిమచంద్రగారి ముఖ్య ఉద్దేశ్యం జనసామాన్యా నికి జ్ఞానన్ని పంచటము. ఆ పథకంలోని ముఖ్య అంశం సామాన్య ప్రజల భాష అయిన వంగ భాషలో వంగదర్శన్ పత్రికను ప్రచురించటం. ఆ నాటి (1860ల కాలం) విద్వత్సం బంధమైన విషయాలను పరిశీలిస్తే పండిత భాష సంస్కృతం, రాజ భాష ఇంగ్లీషు, ఘరానా భాష అంతకు క్రితం ముస్లిం రాజుల భాష ఫార్శీ. ఇవేవీ సామాన్య ప్రజలకు అర్థ మయ్యే భాషలు కాదు. వంగ భాషలో ఆ నాటి సాహిత్య లేమి కూడా వుంది. ఆ పరిస్థి తులలో వంగ భాషా పత్రిక నెలకొల్పటం, నడపటం ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పక తప్పదు. ఈ రకంగా వంగ భాషా వికాసానికి పతాకధారి అని బంకించంద్ర గారిని చెప్పక తప్పదు. ఈ జాతీయ భాషా వికాసం వంగ భాషతొ ఆగలేదు. ఆ తరువాత వివిధ జాతీయ భాషల సాహిత్య వికాసానికి, పునరుద్ధరణకు దారి చూపింది కూడా.

          1600, 1700ల కాలంలో ముఘల్ రాజ్యంలోని ఒక ప్రాంతం బెంగాల్ సుబాహ్. ఇందులో నేటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, బీహార్, జార్ఖంద్, ఒరిస్సా,  కొన్ని ఈశాన్య ప్రాంతాలు ఉండేవి. ఈ ప్రదేశం ముఘల్ రాజ్యానికే కాక, ప్రపంచంలోనే ఉన్న రాజ్యాల లోనే ఒక ఉన్నత ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడేది. చేనేత పరిశ్రమ, వస్తు ఉత్పత్తి, హూగ్లీ నుండి ఎగుమతులు, నౌకా వ్యాపారంతో బెంగాల్ ప్రాంతం ఒక ఉన్నత స్థితిలో ఉండేది. ఫ్రెంచ్, బ్రిటిష్ మొదలయినవారు వ్యాపారానికి కలకత్తా చేరారు. వారితో పాటు వారికి ఐరోపాలో ఉన్న కలహాలు, యుద్ధాలు కూడా వచ్చాయి (Seven Year War).  అప్పటికి బెంగాల్ ప్రాంతాలు ముఘల్ ముస్లిం పాలకుల అధీనంలో వుండేవి. అయితే జనబాహుళ్యం మాత్రం హిందువులు. నాటి ముస్లిం పాలకులు కొన్ని తరాల వారసత్వపు వరుసలో వచ్చిన వారు. నవాబీ వ్యవస్థలోనూ, నవాబీ కుటుంబాలలోనూ అప్పటికే అంతఃకలహాలు పెల్లుబికి ఉన్నాయి. బెంగాలు పాలకులు రాజ భోగాలకు విలాసాలకు బానిసలవ్వటం, అంతఃపుర కలహాలు కీచులాటలలో నిమగ్నమై ఉండటం వలన  ప్రజా పాలనను నిర్లక్ష్యం చేసారు. పాలక వర్గానికి చెందిన ముస్లిం అధికారుల వేధింపులతో హిందువులలో ప్రతికూల, విరోధ భావాలు పెరిగాయి.   

          అప్పటికి బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్-ఔలా. మీర్ జాఫర్ అనే బంధువు బక్షి పదవి లో ఉండేవాడు. బక్షి పదవిలో సైన్యానికి జీత భత్యాలు పంచటం ఒక విస్తృత అధికారం.  అయితే నవాబీ కుటుంబంలో కీచులాటలు, మీర్ జాఫర్ తన నవాబీ పదవికే ఎసరు పెడుతున్నాడనే అనుమానంతో బక్షీ పదవి నుంచి అతనిని తప్పించి ఒక సైన్యాధికారిని చేసాడు. ఇది అవమానంగా భావించిన మీర్ జాఫార్ దెబ్బ తీసేందుకు ఎదురు చూస్తున్న తరుణంలో, ఫ్రెంచ్ వాళ్ళు బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్-ఔలాని బ్రిటిష్ వారిపై దాడికి ఉసి కొలిపారు. జూన్ 23, 1757లో పలాషి అనే చోట యుద్ధం మొదల్లయ్యింది (Battle of Plassey). అయితే, బ్రిటిష్ సైన్యాధికారి రాబర్ట్ క్లైవుకి, మీర్ జాఫరుకు కుదిరిన లోపాయ కారి ఒప్పందంతో, యుద్ధంలో  మీర్ జాఫర్ తన సేనలను బ్రిటిష్ వారి పైకి దాడి చేయకుండా నిలవరించి, ఈస్ట్ ఇండియా కంపెనీ సేనలు గెలవటానికి తోడ్పడ్డాడు. యుద్ధానంతరం మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవుకి ఇరవై లక్షల రూపాయిలకు పైగా లంచం ఇచ్చి, ఆ పైన ఈస్ట్ ఇండియా కంపెనీకి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయిలు కప్పం చెల్లించటానికి ఒప్పుకుని బెంగాల్ నవాబు అయ్యాడు. సిరాజ్-ఉద్-ఔలా తన సేనలని తీసుకుని ముర్షీదాబాద్ పారిపోతే, మీర్ జాఫర్ కొడుకు మీర్ మారన్ సిరాజ్-ఉద్-ఔలాని 1757 జులై 2న చంపించాడు.

          ఆ తరువాత మీర్ జాఫార్ డచ్‌వాళ్ళతో చేతులు కలిపితే, బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసి అతడిని పదవి నుంచి దింపి, మీర్ జాఫర్ అల్లుడు మీర్ ఖాసిమ్‌ని బెంగాల్ నవాబుని చేసారు. మీర్ ఖాసిమ్‌, అవధ రాజ్యం (నేటి లక్నౌ) నవాబు షుజా-ఉద్-ఔలా, ముఘల్ రాజు షా ఆలంతో కలసి నేటి బీహారులోని బక్సర్ వద్ద బ్రిటిష్ వాళ్ళతో 1764, అక్టోబరు 22న యుద్ధం మొదలు పెట్టారు (Battle of Buxar). అయితే, ఈ ముగ్గురు రాజుల మధ్యలో ఉన్న అంతఃకలహాలు, కీచులాటల వలన సమన్వయం కోల్పోయి ఘోర పరాజ యానికి గురి అయ్యారు. ఈ యుద్ధంలో విజయం సాధించటంతో ముఘల్ రాజ్యంలోని తూర్పు ప్రాంతాలూ, అవధ రాజ్యం, బెంగాల్ పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ అధీనంలోకి వచ్చాయి.

            ఇక్కడ గుర్తించవలసిన మొదటి విషయం 1750ల కాలంలో  దేశం యుద్ధాలతో నిండిపోయింది. ఈ యుద్ధాలు 1800ల దాకా కొనసాగాయి. గమనించ వలసిన ఇంకొక విషయం బ్రిటిష్ వాళ్ళు ఓడించిన రాజులందారూ ముస్లింలు. ముస్లిం పాలనలో రెండవ తరగతి ప్రజలుగా ఉన్న హైందవ జన బాహుళ్యానికి ముస్లింలను ఓడించిన బ్రిటిష్ వాళ్ళు అంటే, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే అలోచన కలిగి ఉండవచ్చు. ఈ భావన ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళకు హిందూ ముస్లిం విభేదాలను రాజకీయంగా వాడు కుని, “Divide and Rule” పద్దతికి ఒక మార్గదర్శకం అయ్యి వుండవచ్చు.

          1750ల కాలంలో డచ్, పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు ప్రతి చిన్న రాజ్యం లోనూ, దివాణంలోనూ చేరి వారికి తుపాకులు సరఫరా చేస్తూ, రాజులు, నవాబులకు ఉన్న అంతఃకలహాలకూ, చిల్లర పోట్లాటలుకు ఆజ్యం పోస్తూ వచ్చారు. ఈ రకంగా పలాషి వద్ధ జరిగిన యుద్ధమే కాకుండా చాలానే చిల్లర యుద్ధాలు మొదలయ్యాయి. ఉదాహరణకు బొబ్బిలి యుద్ధం. తరచి చూస్తే విజయనగరం రాజులు, బొబ్బిలి రాజుల చిల్లర పోట్లాట లు, కోడి పందాల ప్రతీకారాలు పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు, ఫ్రెంచ్ వారి ఆధి పత్యానికి కారణమయ్యింది. ఐరోపా వాసుల ప్రోద్బలంతో, ఇలాంటి చిల్లర యుద్ధాలు ఆ కాలంలో చాలానే జరిగి చిన్నా చితకా రాజ్యాలే కాక ముఘల్ రాజ్యం కూడా క్షీణ దశలోకి చేరింది. 

          పలాషీ యుద్ధం 1757 నాటిదైతే, బక్సార్ యుద్ధం 1764 నాటిది. ఏడు సంవత్సరాలకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ముఘల్ రాజ వంశీకుల పైన విజయం  లభిం చింది. యుద్ధానంతరం 1765, ఆగస్టు 12న అల్హాబాద్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం, బెంగాల్ ప్రాంతంలో పన్నులు వసూలు చేసే అధికారం బ్రిటిష్ వారికి పూర్తిగా లభించింది. ముఘల్ రాజు షా ఆలంకు పన్నులో భాగంగా సంవత్సరానికి 26 లక్షల రూపాయిలు చెల్లించటానికి ఒప్పందం కుదిరింది.         

          ఇది ఒక పెద్ద అసమర్ద, అప్రయోజక, అనిశ్చిత స్థితికి దారి తీసింది. పన్నులు వసూళ్ళు చేసేది కంపెనీ, రాజ్య పాలన మాత్రం ముస్లిములది, ప్రజా బాహుళ్యం హిందువులు. మరి ప్రజల బాగోగులు పట్టించుకునేది ఎవరు? పన్నులు వసూళ్ళు చేసేవాళ్ళా? లేక రాజ్య పాలకులా? పైగా, కంపనీ వాళ్ళకి అప్పటికి పన్ను వసూళ్ళ వ్యవస్థ లేదు. బ్రిటిష్ వారికి, ప్రజలకే కాకుండా, పన్ను వసూళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేయటానికి అధికారులతో కూడా భాషా భేదాలు ఉండేవి. విజయం సాధించింది ఒక “కంపెనీ”. ఈ కంపెనీకి ప్రజల బాగోగుల కన్నా లాభాలు ముఖ్యం. ఈ లాభాల పేరాశ వేటలో, ప్రజల పైన పన్నుల భారం భారీగా పడింది. భాషా భేదాలు, అధికార వ్యవస్థ లోపం వలన, పన్నులు వసూళ్ళు చెయ్యటానికి వివిధ ప్రదేశాలలో జమీందార్లను దళారీలగాను, ప్రతినిధులుగానూ నియమించి వాళ్ళకు పన్ను వసూళ్ళ కోటాలు ఇచ్చారు. ఆ కోటాకు పైబడీ వచ్చిన పన్ను ఈ దళారీల ఆదాయం. వీళ్ళని పర్యవేక్షిం చటానికి బ్రిటిష్ వాళ్ళు కలక్టర్లుగా అధికారం చలాయించేవాళ్ళు. ఈ పన్నులు ఎంత అమానుషంగా ఉండేవంటే, “దేవి చౌధురాణి” కథా ప్రాంతంలోని రంగాపుర్ వద్దనున్న మంథన ఎస్టేటులో 1787లో ప్రజల సంఖ్య 12,146 (4,643 మగవాళ్లు, 4,287 ఆడవాళ్ళు, 3,216 మంది పిల్లలు). వారి మీద 1787లో 34,379 రుపాయల పన్ను విధించారు. అనగా, 1800 సంవత్సరపు బంగారపు ధర ఔన్సు బంగారం 18 రూపాయలగా పరిగణించి, నేటి బంగారం ధర ఔన్సుకి 1,36,059 రూపాయలగా పరిగణిస్తే, నేటి రుపాయలలో, 12,146 మంది జనాభా మీద పడిన పన్ను భారం 25,94,81,232 రూపాయలు. అనగా ప్రతి మనిషి పైనా పడిన భారం ఈ నాటి రూపాయలలో 21,363 రూపాయలు. కుటుంబంలో ఐదుగురు ఉంటే, ఒకొక్క కుటుంబం పైన పడిన భారం 1,06,817 రూపాయలు.

          పన్ను వసూళ్ళకు బెంగాలులోని జలపాయగురి, రంగపూర్ ప్రాంతాలలో (రంగాపూర్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్నది) దళారులు భర్తల ఎదుట భార్యలని, పిల్లలని చెరచి, ఎలా చిత్ర హింసలు పెట్టేవారో,  

          గౌతం కుమార్ దాస్ బాంగ్లాదేశ్ సోషీయాలజీ పత్రికలో వ్రాసిన పరిశోధనా పత్రంలో బ్రిటిష్ వారి రికార్డుల సాక్ష్యాలను ఉటంకిస్తూ ఒక ఉత్తమ పరిశోధనా పత్రం ప్రచురిం చారు. రాజా దేవి సింగ్ అనే వాడిని కంపెనీ గవర్నర్ జెనరల్ వారెన్ హేస్టింగ్స్ మంథన, జలపాయగురి, రంగాపూర్ ప్రాంతాలకు పన్ను వసూళ్ళకు దళారీగా నియమిస్తే, వాడు పెట్టిన బాధలకు ప్రజలు తిరుగుబాటు చేసారు. ఆ తిరుగుబాటుకు నాయకురాలు జయదుర్గా దేవి చౌధురాణి (బెంగాలీ – జోయ్‌దుర్గా దేభీ చౌధొరాణీ). అప్పటికే ఆ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నవాడు భవానీ పాఠక్ (బెంగాలీ – భభానీ పాఠక్). అయితే, బ్రిటిష్ వాళ్ళు, వీరిని డకాయిట్స్, అంటే బందిపోటు దొంగలని ముద్రవేశారు. 

          1764లో బక్సర్ యుద్ధం జరిగి బెంగాల్ ప్రాంతంలో అనిశ్చత స్థితి ఏర్పడి పన్నుల భారం ప్రజల పై పడిన తరువాత, 1768లో ఋతుపవనాలు సరిగ్గా లేక వ్యవసాయం దెబ్బ తిన్నది. ముఖ్యంగా ఆ నాటి ఎగుమతలకు ప్రఖ్యాతి కాంచిన చేనేత పరిశ్రమ, ఆ చేనేతదారులకు ముడిసరుకు ఉత్పత్తి చేసే పత్తి, పట్టు , మల్బరీ వ్యవసాయదారులు పూర్తిగా దెబ్బ తిన్నారు. ఇవే కాక అన్ని పరిశ్రమల మీద కూడా కరువు ప్రభావం తీవ్రంగా పడింది. 1769 కాలానికి తిండి గింజలు దొరకని రోజులు. కరువుతో పాటు, మసూచీ మలేరియా రోగాలు కూడా ప్రజ్వరిల్లాయి. అయితే, కంపెనీ వారు దక్షిన భారత దేశంలో టిప్పు సుల్తాన్, పశ్చిమ మధ్య భారత దేశంలో మరాఠాల పై జరుపుతున్న యుద్ధాలకు, కంపెనీ లాభాల మీది అత్యాసకు, బెంగాల్ ప్రాంతంలోని రైతుల దగ్గర ఉన్న కొంచెం ధాన్యాన్ని పన్నుల రూపేణా తస్కరించటం ఏమాత్రం తగ్గలేదు.  కరువు గురించి మాత్రం జాన్ కార్టియెర్ అనే కంపెనీ అధికారి 1769లో లండన్‌ లోని కంపెనీ డైరెక్టర్లకి ఒక ఉత్తరం వ్రాసాడు. ఇంకొక ఇద్దరు అధికారులు లండన్‌కి రాసిన ఉత్తరాలలో కరువు కారణంగా 1769 సంవత్సరానికి రాబడి తగ్గుతుంది అని మాత్రమే వ్రాసారు. ఆ నాటి క్షామంలో బెంగాల్ ప్రాంతంలో డెబ్భై లక్షల నుండీ కోటి మంది వరకు ప్రజలు మరణిం చారని బ్రిటిష్ వారి అంచనా, ఇది అప్పటి బెంగాల్ ప్రాంతపు జనాభాలో మూడవ వంతు. 1750ల కాలంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్ధిక వ్యవస్థగా ఉన్న బెంగాల్ ప్రాంతం, 1770ల కాలం నాటికి పూర్తిగా కూలిపోయింది.

          సన్యాసి విద్రోహ్‌కి పాల్బడినవారు మదారి ఫకీరులు, దశ్నాని సన్యాసులు, నాగ సాధువులు. మదారి అనగా 14వ శతాబ్దంలో సిరియాకు చెందిన బది-అల్-దీన్ అనే సూఫీ సాధువుకి అనుచరులు. దశ్నాని అనగా అద్వైత వేదాంతం ప్రతిపాదించిన ఆది శంకరా చార్యుల  పదుగురు (దశ) శిష్యుల వారి వారసులు (గిరి, పూరి, భారతి, వన, అరణ్య, పర్వత, సాగర, తీర్థ, ఆశ్రమ, సరస్వతి).  వీరిలో కొంతమందికి ముఘలుల కాలం నుండి దత్తమైన చిన్న చిన్న భూములు వుండేవి. వాటికి సుంకాలు వుండేవి కావు. గిరి గోసాయిలు పట్టు వ్యాపారంలో కూడా వుండేవారు.

          వీరందరూ జట్టులు జట్టులుగా తీర్థ యాత్రలకు తిరుగుతూ, దారిలోని గ్రామ ప్రజల నుండీ, జమిందారుల నుండీ దానాలు పుచ్చుకెనేవారు. మదారి ఫకీరులు, నాగ సాధువు లకు గంజాయి అలవాటు. అలాగే వాళ్లు ఎప్పుడూ అస్త్ర, శస్త్రాలు ధరించి వుండేవారు. కంపెనీవాళ్లు ఈ పకీరులు సన్యాసులు భూములపై పన్నులు కట్టకుండా,  అత్యంత లాభదాయకమైన పట్టు వ్యాపారంపై ఆధిపత్యం వుండటము గమనించారు. ఆ రాబడి కూడా తమకే చెందాలని భావించి,  వాళ్లను గంజాయి త్రాగి అడుక్కు తినే జాతిగా ముద్ర వేసి, వాళ్ళ యాత్రలను అడ్డుకున్నారు. దినాజ్‌పూర్ దగ్గరి భవానీపూర్‌లో గంగా స్నానానికి  చేరిన సన్యాసులను, గోవిందాపుర్‌లో గుమికూడిన ఫకీర్‌లను కంపెనీ వాళ్ళు  సైన్యంతో ముట్టడి చేసారు. అయితే ఈ సన్యాసి-పకీరులు తిరుగు ముట్టడిలో కొన్ని సందర్భాలలో బ్రిటిష్ వారిని చంపి, బ్రిటిష్ వారి బంగళాలు, వారి కచ్చేరీలపై దాడి చేసి, వారు పన్నుల రూపేణా పీడీంచి వసూలు చేసిన సొమ్మును స్వాధీన పరుచుకున్నా రు. అయితే బ్రిటిష్ వారు వీటిని దోపీడీలగా రికార్డులలో పొందుపరిచారు.పైబడి లూటీ లు చేసి, డబ్బు, ధాన్యం దోచుకున్నారు.

          కంపెనీ వాళ్ళు 1965లోని బెంగాలు ప్రాంతంపై విధించి వసూలు చేసిన పన్నులు 65లక్షల రుపాయలు. 1984ల కాలం నాటికి ఈ పన్నులు 2.6 కోట్లు అయ్యాయి. అనగా, 19 సంవత్సారాలలో పన్నులు 400% పెరిగాయి. ఇది రైతు, చేనేత ఇతర గ్రామీణ వ్యవస్థ లను కుప్ప కూల్చిన బ్రిటిష్ వారి విధానం. 

          పన్నుల పెంపకానికి మూల కారణం బెంగాలు భూమి మీది ఆధిపత్యం ఒక కంపెనీకి చెందటమే. East India Company పై 1967లో ఇంగ్లాండులోని వాటాదారులు 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నేటి భారత దేశానికి చెందిన అన్ని ప్రాంతాలలోని పట్టు, పత్తితో నేసిన చేనేతి వస్త్రాలకు ఐరోపాలో అమితమైన గిరాకి వుండేది. ఆ చేనేత ఉత్పత్తుల దిగుమతి నిమిత్తం ఈ పెట్టుబడి జరిగింది. అయితే ఆ కాలంలో, బెంగాలులో కానీ ఇతర దేశీ ప్రాంతాలలో కానీ  విదేశీ వస్తువలుకు ఏమాత్రం ఆదరణ లేదు. అందు వల్ల ఇంగ్లీషు వాళ్లకి ఎగుమతులు చెయ్యటానికి ఉత్పత్తులేమీ లేవు. అందు వలన కేవలం ఇంగ్లాండు నుండి తెచ్చిన బంగారంతో మాత్రమే కొనుగోళ్లు జరిగేవి. ఇది కంపెనీ వాళ్ళకి కష్టమయ్యింది. పైగా పెట్టుబడిదార్లు లాభాల వేటలో ఒత్తిడి పెంచారు. ఇంగ్లాండులోని పెట్టుబడిదార్లకు కానీ, కలకత్తాలోని కంపెనీ అధికార్లకు కానీ, వారికి తోడ్పడిన దేశీ వ్యాపార వర్గం, రెండవ శ్రేణి అధికార వర్గాలకు కానీ, రైతు చేనేత శ్రామిక వర్గాల కష్టనష్టాలు ఏమాత్రం పట్టలేదు. కంపెనీ వారి అత్యాసలతో కూడిన పన్ను విధానాలు, వారి సైనికుల తోడ్పాటుతో వారికి తోడ్పడిన దేశీ వ్యాపారవర్గం పైశాచికత్వానికి గ్రామీణులు  అణచి వేతకు గురి అయ్యి, చివరికి ఆ గ్రామీణులతో బాటు అర్ధిక వ్యవస్థ మొత్తం నిర్మూలించ బడింది.

          గమనించ వలసిన ఇంకొక విషయం ఆనాటి భరత ఖండంపైన ఇంగ్లాండులోని పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం. పారిశ్రామిక విప్లవ కాలం షుమారు 1760 నుండి 1840 దాకా అని చెప్పవచ్చు. 

          ఐరోపాలో చలి కారణంగా పత్తి పండదు, పట్టు పురుగులు పెరగవు. వస్త్రాల దిగుమ తితో బాటు ముడి సరుకును కూడా కంపనీ వాళ్లు ఇంగ్లాండుకి దిగుమతి చేసుకునే వారు. ఆ ముడి సరుకుతో ఇంగ్లాండులోని నేతగాళ్లు వస్త్రాలను తయారు చేసేవారు. అయితే, ఇంగ్లాండులోని నేతగాళ్లకి చెల్లించే ఒకరి జీతంతో బెంగాలులోనూ ఇతర ప్రాంతాలలోనూ ఆరుగురి నేతగాళ్ల జీతాలు చెల్లించవచ్చు. పైగా భరత ఖండంలోని వస్త్రాల నాణ్యత ఎక్కువగా వుండేది. అందుకని ఇంకొందరు పెట్టుబడిదారులు భారత దేశంలో నేత కర్మాగారాలని ఏర్పాటు చేసారు. ఈ పెట్టుబడిదార్లను Factors అని పిలిచేవారు. వారి భాగస్వామ్యంతో నడిచే కర్మాగారం Factory అయ్యింది. నేత పరిశ్రమలోని శ్రామికులు నాలుగు విధాలు. పత్తి పట్టు పండించే రైతులు, నూలు వడికి చరఖాలతో దారాలు చెయ్యటం, చేనేత కుటీర పరిశ్రమలోని వారు, Fఅచ్టరీ కార్మికులు. 1750లో ఇంగ్లాండుకి పత్తి ముడి సరుకు 2.5 కోట్ల పౌనులు దిగుమతి అయ్యింది. 1850నాటికి 588కోట్ల పౌనులు దిగుమతి అయ్యింది. దీనితో దేశీ చేనేత పరిశ్రమలోని నాలుగు విధాల కార్మికులలో నూలు వడికేవారు, చెనేత కూటీర పరిశ్రమలోని వారు, ఫాక్టరీ కార్మికులు ఉపాధి కోల్పో యారు. ఇక పత్తి, పట్టు కొనుగోళ్లు కేవలం కంపెనీ వాళ్లే చెయ్యటం వలన, రైతుకు గిట్టు బాటు కాని తక్కువ ధరలు కంపెనీ వాళ్లే నిర్ణయించే వారు. స్వయంసమృద్ధ గ్రామీణ వ్యవస్థ నాశనమయ్యింది. ఈ విధంగా దేశీ కర్షక కార్మికుల పై పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం చరిత్రకారులు ఎందుకో ఎక్కువగా చర్చించలేదు. 

          1770లో వచ్చిన ఋతుపవనాల లేమి కరువుకి ఒక కారణమైతే, కంపెనీ వాళ్ళ అత్యాస, పన్నులు వసూలు చేసే అస్తవ్యస్త వ్యవస్తా, దాష్టికాలే కాకుండా పారిశ్రామిక విప్లవ ప్రభావాలు కూడా దేశీ అర్ధిక వ్యవస్తలను ఎలా కూలదోసింది మనముచూడవచ్చు. 

          ఈ విధంగా 1770ల కాలంలో  వచ్చిన కరువు, దాని ప్రభావాన్ని, బంకించంద్రగారు “దేవి చౌధురాణి” నవలలో ప్రఫుల్ల 18ఏళ్ల వయసులో అనుభవించిన దారిద్యాన్ని ఒక మానవీయ కోణంలో చూపించారు.

          ఈ నిర్వీర్య స్థితిలో ప్రజలు ఇళ్ళు వదలి వెళ్ళటం సామాన్యం. అప్పటి బెంగాలులో ఉన్న సంసారులు ఎంచుకున్న మార్గం సన్యాసులలో కలసి పోవటం. ఈ సన్యాసులు జట్టులుగా, దళాలుగా ఏర్పడి, ఊళ్ల వెంట తిరుగుతూ అందినవి తింటూ ఉండేవారు.  కొంతమంది సన్యాసులు దళాలుగా ఏర్పడి పుణ్య క్షేత్రాలలోని గుడులు తిరుగుతూ, దార్లలో ఉన్న జమీందార్లు, ధనికుల దగ్గర భిక్షాటాన చేసేవారు. ఆకలికి నిజాయితీ ఉండదు, జట్టులు జట్టులుగా తిరుగుతున్నప్పడు కొందరు సన్యాసులు దోపిడీలకు కూడా పాల్పడి ఉండవచ్చు. కొన్ని చోట్ల ధనికుల మీద దాడులు కూడా జరిగాయి. కొంతమంది సన్యాసులు మాత్రం తిరుగుబాటు దారి పట్టారు. వీరి ధ్యేయం బ్రిటిష్ వారు వసూళ్లు చేసిన పన్నులను, ధాన్యాలను రవాణా మార్గాలలో దాడులు చేసి దోచుకుని ప్రజలకు పంచటం. 1770ల కాలంలో బెంగాలులో జరిగిన తిరుగుబాటుకు “సన్యాసి బిద్రోహ్” అని పేరు. అయితే ఈ సన్యాసి తిరుగుబాటుదార్లను బ్రిటిష్ వారు డెకాయిట్లు, అంటే బందిపోటు దొంగలగా పేర్కొన్నారు. ఆ తిరుగుబాటు సన్యాసి నాయకులలో ముఖ్యుడు భవానీ పాఠక్. ఇంకొక ముఖ్యురాలు మంథన జమిందారిణి జయదుర్గా దేవి చౌధురాణి. వీరికి నేటికీ ఆ ప్రాంతపు ప్రజలలో ఎంతటి ఉన్నత స్థానం ఉన్నదంటే, ఈనాటికీ జలపాయగురి దగ్గర ఉన్న గోశాల గ్రామంలోనూ, మంథన లో ఉన్న కాళీ మాత గుడులలో, వీరి ప్రతిమలకు కాళీ దేవితో పాటు ప్రజలు నిత్య పూజార్చనలు జరుపు తారు.   

          భవానీ పాఠక్, జయదుర్గా దేవి చరిత్రలు, బ్రిటిష్ వారిపైన వారు చేసిన పోరాటాలూ జానపద కథలుగానూ, గేయాలుగానూ 1870ల కాలం నాటికి కూడా జీవించి ఉన్నాయి. అంటే సన్యాసీ విద్రోహ్ జరిగిన వంద సంవత్సారాలకు కూడా. బంకిం చంద్ర చటోపా ధ్యాయ ఉత్తర బెంగాలులో దెప్యూటీ కలక్టరుగా పని చేసినప్పుడు, ఈ కథలు వినటం, పుస్తక రూపం కల్పించటం జరిగి ఉండవచ్చు. దేవీ చౌధురాణీ నవలకు జయదుర్గా దేవీ చౌధురాణీ కథ చారిత్రక మూలాలు. అయితే, ఈ నవలలోనీ పాత్రల చిత్రీకరణ పూర్తి చారిత్రకత అని చెప్పటం కష్టం, ముఖ్యంగా ఆంతరంగీక సంభాషణలు. కానీ, కొన్ని ముఖ్య ఘట్టాలని మాత్రం  గోపాల్ కుమార్ దాస్ గారు ప్రచురించిన పరిశోధనా పత్రంలో నవలలోని సన్నివేశాలకు చారిత్రక మూలాలను బ్రిటిష్ వారి లేఖలు, రికార్డులను ఉదహరిస్తూ  నిరూపించారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.