పిల్లలు కాని కాకి గుడ్లు

-కందేపి రాణి ప్రసాద్

          ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. కొమ్మ కొమ్మకో గూడు కట్టుకున్నాయి. ఎవరి గూట్లో వారు గుట్టుగా కాపురం చేస్తున్నాయి. భార్యా పిల్లలతో కలసిమెలసి ఉంటున్నాయి. ఒకరి కొకరు అండగా ఉంటాయి. ఏదైనా ఆపద వచ్చినపుడు పెద్దల మాట వింటాము. ఆ చెట్టు మీద ముసలి కాకులు నాలుగున్నాయి.  అనుభవంలో బాగా తల పండినాయి. అన్ని కలసి ఒకే నిర్ణయం తీసుకుంటాయి. చెట్టున ఉన్న అన్ని కుటుంబాలకు అండగా ఉంటాయి.
 
          ఇలా సాగుతూ ఉండగా ఒక రోజు ఒక కాకి ఏడుస్తూ కూర్చుంది.
 
          ‘ ఏమైంది’ ? అని ఇరుగు పొరుగు కాకులు అడిగాయి.
 
          “ఏమని చెప్పమంటావు నా బాధ” అంటూ మరల ఏడ్చేసింది కాకి.
 
          “అయ్యో ఊరుకో ఊరుకో ! ఏడవకు ముందు కొద్దిగా మంచి నీళ్ళు తాగు” అంటూ మిగతా కాకులు దాన్ని ఊరడించాయి.
 
          అందరూ చెప్తున్న మాటలు, వాళ్ళ ప్రేమ చూసి కాకి ఏడుపు ఆపేసింది. మనసు కాస్త నిదానించింది. అప్పటికి కొద్దిగా తేరుకుని కళ్ళు తుడుచుకుని కూర్చుంది. కొద్దిసేపు మౌనం తర్వాత నిదానంగా చెప్పింది…
 
          “మేము ఈ మధ్య పెట్టిన గుడ్లు పిల్లలు కాలేదు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా పిల్లలు కావటం లేదు” అని చెప్తుండగానే గొంతు బొంగురు పోయింది.
 
          “ఏమైంది ! ఎవరైనా గుడ్లను ఎత్తుకుపోతున్నారా. ఇది ఎప్పుడూ వినలేదే” అంటూ ఆశ్చర్యంగా మిగతా కాకులు అడిగాయి.
 
          ఈ చెట్టు చుట్టు పక్కల ఎక్కడా పాముల పుట్టలు కూడా లేవే! ఒకవేళ పాములు వచ్చి తినేస్తున్నాయా! లేకుంటే ఇంకెవరైనా వస్తున్నారా అని అనుమానంగా అన్నది ఎదురింటి కాకి.
 
          “మనమందరం ఈ మర్రి చెట్టు మీద కలసి మెలసి ఉంటున్నాం. ఇంత వరకూ ఇలాంటి కష్టం గురించి వినలేదు అసలెలా జరిగింది అల్లుడూ” అంటూ కాకి మామ వరసైన కాకి అడిగింది.
 
          వృద్ధ కాకులు ముందుకొచ్చి “ఎవరొచ్చి పోతున్నారో చూడకుండా ఆడవాళ్ళంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. ముందు టీవీలు తీసేయాలిరా” అంటూ ఆవేశంగా అన్నాయి. 
 
          “నువ్వు చెప్పు అసలు ఏమైందో ! నువ్వు నీ భార్య జాగ్రత్తగా గుడ్లను చూసుకోవటం లేదా!” అని పక్కింటి కాకి అడిగింది.
 
          అది కాదు బావా!, మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కానీ మా గుడ్లు పిల్లలుగా మారటం లేదు అంటూ మళ్ళీ ఏడ్చింది కాకి.
 
          ఊరుకో! నువ్వే ఇలా ఏడుస్తుంటే నీ భార్య పరిస్థితి ఏమిటి ? మీరు చక్కగా పొదగడం లేదా! ఏమిటీ ఆరా తీస్తూ అడిగింది అత్త వరసైన మరో కాకి.
 
          “కాదు ఎప్పటి లాగానే పొదుగుతున్నాం కానీ ఎందుకో గుడ్లలో నుంచి పిల్లలు రావటం లేదు. గుడ్డు లోపలే చనిపోతున్నాయి” అంటూ కాకి సమాధానం చెప్పింది.
 
          “ఇంకా ఎవరికైనా ఇలా జరుగుతున్నదా ఈ కాకికి మాత్రమే ఇలా జరుగుతుందా చెప్పండి”! అంటూ వృద్ధ కాకులు మిగతా కాకుల్ని ఉద్దేశించి అడిగాయి, మాకేమి అలా జరుగలేదు. మా గుడ్లన్నీ పిల్లలుగా మారుతున్నాయి. అలాంటి సమస్యేమి రాలేదు అంటూ ఆ మర్రిచెట్టు మీది కాకులన్ని ఒక్కుమ్ముడిగా అరిచి మరీ చెప్పాయి.
 
          అదేమిటబ్బా ! కారణం ఏమై ఉంటుంది అంటూ వృద్ధ కాకులు దీర్ఘాలోచనలో మునిగిపోయాయి. ఎందుకైనా మంచిదని నెమలి వైద్యున్ని పిలిపించాయి.
 
          నెమలి వస్తూనే అందరినీ పరామర్శించింది కాకి సమస్య విని ఆశ్చర్యపోయింది.
 
          “నీవు ఈ మధ్య ఏమేమి తింటున్నావు” అని ఆరా తీసింది. ‘మానవులు తాగే కోకోకోలా, పెప్సీ వంటి పానీయాలేమైనా తాగుతున్నావా! అవి తాగితే కడుపులో ఉన్న పిండాలే కరిగిపోతాయి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావు’ అని కాకి భార్యను అడిగింది.
 
          “ఏమీ లేదు ! నేను ఎప్పటి లాగానే ఆహారం తీసుకుంటున్నాను. పానీయాలు నేనెమీ తాగలేదు డాక్టరు గారూ! ఎందుకనో ఈ మధ్యే ఇలా జరుగుతున్నది” అని కన్నీళ్ళతో చెప్పింది కాకి భార్య.
 
          “నెమలి చెట్టునంతా పరిశీలించింది. అనుమానంగా ఏమీ కనిపించలేదు. వేరే ఎవరికీ ఈ సమస్య లేదు ఇంతకు పూర్వం ఈ సమస్య లేదన్నావు కదా! ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది” అని అడిగింది నెమలి సాలోచనగా!
 
          “ఆరు నెలల నుంచి ఇలా జరుగుతుంది” అని ఆలోచించుకుంటూ చెప్పింది కాకి భార్య, మళ్ళీ గుర్తుకు వచ్చినట్లుగా దాదాపుగా ఈ కొత్త గూడు కట్టుకున్న దగ్గర నుంచీ జరుగుతున్నది అన్నది కాకి భార్య.
 
          నెమలి “పద మీ గూడును పరిశీలిద్దాం” అంటూ గూడు దగ్గరకు వెళ్ళింది. మామూలుగా కర్ర పుల్లలతో గూడు కట్టుకుంది కాకి. కానీ కింద పరుపులాగా ఏవో కనిపి స్తున్నాయి. ఏమిటా అని దగ్గరగా వెళ్ళి చూసింది. ప్లాస్టిక్ కవర్లు వరసగా పేర్చి ఉన్నాయి.
 
          “ఇదేమిటి ఈ ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వేశారు. అంటూ నెమలి కాకిని అడిగింది. పిల్లలకు కర్రపుల్లలు గుచ్చుకోవద్దనీని ఈయనే ఇలా తెచ్చి పెట్టాడు డాక్టరు గారూ ! కనేది నేనైనా ఈయనకు పిల్లలంటే ఎంత ప్రేమనో” కాకి భార్య మురిపెంగా చెప్పింది.
 
          “ఇంత పెద్ద ప్రమాదం ఇంట్లో పెట్టుకుని పిల్లలు కావటం లేదని ఏడిస్తే ఏమొస్తుం ది. ప్లాసిక్ కవర్లు మానవులకు, జంతువులకూ హాని చేస్తాయి. మానవులు ఈ కవర్లను నిషేధిస్తున్నారు. చాలా జంతువులు కవర్లలలో ఉన్న ఆహారంతో పాటుగా కవర్లనూ తిని చచ్చిపోతున్నాయి. ఆవులు గేదెలు మేకలు వంటివి రోడ్డు మీద వాటిని తిని అవి పేగుల కు చుట్టుకోవడం వల్ల చనిపోతున్నాయి. అటువంటి ప్లాస్టిక్ కవర్లను మీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. దాని మీద గుడ్లను పెట్టటం వల్ల అవి పిల్లలు కాకుండా పోతున్నా యి. ప్లాస్టిక్ కవర్లలో ఉండే విష రసాయనాల కారణంగా గుడ్లు పిల్లలుగా మారటం లేదు. ఇదీ విషయం” అని నెమలి తేల్చి చెప్పేసింది.
 
          అన్ని కాకులు ఆశ్చర్యంగా వింటున్నాయి ప్లాస్టిక్ కవర్లతో ఇంత పెద్ద ప్రమాదము న్నదా ఇంత వరకూ మాకేవరికీ తెలియదు అంటూ ఆశ్చర్య పోయాయి.
 
          కాకి, కాకి భార్య “ఏదో మెత్తగా ఉంటాయని అనుకున్నాం కానీ ఇంతలో ఇంత నష్టం జరుగుతుందని తెలియదు. ఇవాళ మీరు రావటం వల్ల ఎన్నో విషయాలు తెలిశాయి ఇక ఎప్పుడూ ఈ పొరపాటు చేయం. డాక్టరు గారూ” అంటూ కళ్ళ నీళ్ళ పర్యాంతంఅయ్యాయి.
 
          నెమలి ఇలా అన్నది.. “కవర్లు తెచ్చుకోని దాని మీద పడుకోవడమే కాదు. కవర్లలోని ఆహారం కూడా తినకండి” అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.