యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-16

మెల్ బోర్న్ – రోజు 1

మెల్ బోర్న్ లో వాతావరణం సిడ్నీ కంటే చల్లగా ఉంది. 

చల్లదనంలో  ఇంచుమించుగా మా శాన్ ఫ్రాన్ సిస్కోతో సమానంగా అనిపించింది. 

          కెయిర్న్స్ లోని వేడిమి, ఉక్కపోతల నించి రెండు రోజుల్లో మళ్ళీ చల్లని వాతావరణంలోకి వచ్చి పడేసరికి హాయిగా ఉరకలేశారు పిల్లలు. మా ఇద్దరికీ ఇండియాలో లాగా ఉండడం వల్ల కెయిర్న్స్ వాతావరణం బాగా నచ్చింది. 

          అయిదుగంటల కల్లా ఊబర్ లో స్కై డెక్ కి చేరేం. ఊబర్ డ్రైవర్ మేం ఎక్కిన దగ్గరనించి మాట్లాడుతూనే ఉన్నాడు. అతను చైనా నించి వచ్చి అక్కడ పదిహేనేళ్ళ కిందట స్థిరపడ్డాడట. ఒకప్పుడు ఏదో చిన్నాచితకా పనులు చేసేవాడట. కారు కొనుక్కుని పూర్తి సమయం అదే జీవనాధారంగా మార్చుకున్నాక సంతోషంగా ఉన్నానని చెప్పేడు.  అతని సీటు చుట్టూ ఛార్జర్లు, ఫోను పెట్టుకునే స్టాండు, అద్దానికి విండ్ షీల్డు, జారబడేం దుకు కుషను… ఇలా రకరకాల వస్తువులు ఉన్నాయి. మెల్ బోర్న్ నగరం తనకి బాగా నచ్చుతుందని సిడ్నీతో పోలిస్తే ఇక్కడ సమానంగా బతుకుతెరువు లభిస్తుందని, ఆదాయం తక్కువ ఉన్నా ఇక్కడ హాయిగా బతక వచ్చని చెప్పేడు. ఇండియన్స్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఊబర్ డ్రైవర్లుగా స్థిర పడుతున్నారని, ఇండియన్ల సంఖ్య గత ఐదేళ్ళలో గణనీయంగా పెరిగిందని చెప్పేడు. ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు ఇండియన్లు వాళ్ళ ఉద్యోగాలు కొల్లగొడుతున్నట్లు గొంతులో కొంత బాధ ధ్వనించడాన్ని గమనించేం. ఇక స్కై డెక్ చుట్టుపక్కల చూడవలసిన విశేషాలు అంటూ కొన్ని ప్రదేశాల వివరాలు చెప్పాడు. మేం దిగేటప్పుడు అతనికి ఊబర్ రేటింగులో అయిదు స్టార్లు ఇవ్వడం మర్చిపోవద్దని పదేపదే చెప్పేడు. 

          ఇక పదిహేను నిమిషాల్లో స్కై డెక్ కి చేరుకున్నాం. 

          975 అడుగుల ఎత్తునున్న యురేకా టవర్ (Eureka Tower) మీద ఉన్న అబ్జర్వేషన్ డెక్ ఈ స్కై డెక్. 

          ప్రపంచంలోనే 15 వ ఎత్తైన భవంతి ఇది. ఇక్కడి నుంచి మెల్ బోర్న్ నగరం మొత్తాన్ని చూడవచ్చు. 

          టవర్ లాబీలోనే ఒక వర్ట్చ్యువల్  షో , గిఫ్ట్ షాపు ఉంటాయి. వర్త్యువల్ షో ఎంట్రెన్సులో మెల్ బోర్న్ నగర మినీయేచర్ రూపాన్ని పరికిస్తూ అక్కడ 18 వ శతాబ్ది నించి మెల్ బోర్న్ నగర స్వరూపంలో కలిగిన మార్పుల్ని చిన్న స్క్రీన్ మీద చూస్తూ వివరాలు తెలుసుకోవడం కూడా మంచి అనుభూతి. 

          ఇక వర్ట్చ్యువల్ షోకి ఒక్కొక్కళ్ళకి 14 డాలర్లు టిక్కెట్టు. మొదట సత్య, వరు వెళ్ళోచ్చారు. చిన్న చిన్న గుండ్రంగా తిరిగే కుర్చీల్లో కూర్చుని కళ్ళకి అద్దాలు వంటివి పెట్టుకుని ఎవరి ప్రపంచంలో వాళ్ళు విహరిస్తుంటారు. వర్ట్చ్యువల్ షోలు ఎంత ఫ్యూచర్ టెక్నాలజీ అయినా మనుషులు పూర్తిగా తమ వాస్తవిక స్పృహని కోల్పోయి ఊహల్లో విహరించే విధానం ఎందుకో నాకు నచ్చని విషయం. కానీ సత్య, వరు వస్తూనే నేను తప్పక చూడవలసిందేనని పట్టుబట్టి నన్ను కూడా పంపించేసేరు. 

          గాల్లో తేలియాడుతూ మెల్ బోర్న్ నగర విహారం అది. ప్రతి ప్రదేశంలోనూ అక్కడే తిరుగాడుతూ ఉన్నట్టు, చూసే దృశ్యంలో మనమూ భాగమై ఉన్నట్టు కలిగే ఒక రకమైన ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి అది. మెల్ బోర్న్ నగరాన్ని, చుట్టూ విశేషాల్ని ఒక్క షోతో చుట్టి రావడం చాలా బావున్నప్పటికీ ఎత్తు నించి కింద పడేందుకు ఉన్న భయం వల్ల నేను పెట్టిన కేకలకి నా చుట్టూ జనం హడిలిపోయేరు. షో కాగానే నన్ను చూసి గట్టిగా నవ్వుతున్న మా వాళ్ళని ఇంకోసారి నన్ను ఇలాంటి వాటికి తీసుకెళ్ళ వద్దని గట్టిగా చివాట్లు వేసాను. 

          ఇక స్కైడెక్ పైకి ఒక్కసారి మాత్రమే వెళ్ళే టిక్కెట్టు అది. కిందికి వస్తే మళ్ళీ టిక్కెట్టు కొనుక్కోవాల్సిందే. 

          మనిషికి మామూలు ఎంట్రన్సు టిక్కెట్టు పెద్దవాళ్ళకి 28 డాలర్లు, పిల్లలకి 18 డాలర్లు. ఎంట్రీ టిక్కెట్టు, అక్కడ ఉన్న ఎట్రాక్షన్లయిన వర్ట్చ్యువల్  షో, ఎడ్జ్ , ప్లాంక్ లతో  కలిపి పెద్దవాళ్ళకి దాదాపు 61 డాలర్లు, పిల్లలకి 43 డాలర్లు. మేం యధావిధిగా నాకు, సిరికి కేవలం రెండు ఎంట్రీ  టిక్కెట్లు, సత్య, వరులకు  రెండు ఆల్ రౌండ్ టిక్కెట్లు కొనుక్కు న్నాం. ఇవన్నీ ప్యాకేజీ టూరు కాకుండా మా అంతట మేం విడిగా బుక్ చేసుకున్నాం. ఇక నాకు వర్ట్చ్యువల్  షో టిక్కెట్టు అదనంగా అప్పటికప్పుడు కొన్నాం. వెరసి మా నలుగురికీ దాదాపు 175 ఆస్ట్రేలియన్ డాలర్లు అయ్యింది. 

          దాదాపు మూణ్ణాలుగు గంటలు సులభంగా గడపొచ్చక్కడ. వర్ట్చ్యువల్ ఎట్రాక్షన్స్ ఉండడం వల్ల పిల్లలకి, అడ్వెంచర్లు బాగా ఇష్టమైన వాళ్ళకి బావుంటుంది. ఇక మామూలుగా అబ్జర్వేషన్ డెక్ చూసి వద్దామనుకునే వాళ్ళకి శోభాయమానమైన నగర దృశ్యం కనువిందు చేస్తుంది. ఎలాగైనా చూసి తీరవల్సిన ప్రదేశం ఈ స్కైడెక్. నాకు మామూలుగా హైట్స్ అంటే అంత భయం కాదు కానీ రోలర్ కోస్టర్లు, ఎత్తు నించి పడవేసే షోలంటే భయం. ఇలా ఎత్తు నించి దృశ్యాలు చూడడమంటే మాత్రం భలే ఇష్టం. 

          గుండ్రంగా చుట్టూ అద్దాలతో ఉన్న స్కైడెక్ లోపల చుట్టూ నడిచి  తిరుగుతూ నగర అద్భుత దృశ్యాల్ని తిలకించవచ్చు. ఒక వైపు బార్, మరో వైపు కాఫీ, తినుబండారాలు అమ్మే దుకాణం, ఒక చోట పిల్లలు ఆడుకునే చిన్న ఆటస్థలం, మధ్యలో వర్ట్చ్యువల్ ఎట్రాక్షన్స్ , ఒక వైపు డెక్ బయటికి ఉన్న బాల్కనీలాంటి ప్రదేశం ఉంటాయి. బాల్కనీ లోకి వెళ్ళడానికి కట్టుదిట్టమైన రెండు అద్దాల తలుపులు ఉంటాయి. బాల్కనీకి పూర్తిగా మెష్ కట్టి ఉన్నా అంత ఎత్తున ఉండడం వల్ల, పైగా ఆ రోజు విసురుగా వీస్తున్న గాలికి ఎక్కడ ఎగిరిపోతామో అన్న భ్రాంతి, భయం కలిగింది. 

          ఎత్తులంటే ఉన్న భయం వల్ల సిరి  ఐస్ క్రీం తింటూ ఐ పాడ్ తో ఆడుకుంటూ, అద్దాలనించి దూరంగా ఓ చోట స్థిరంగా కూచుంది. ఇక నేను నచ్చిన చోట నచ్చినంత సేపు చూస్తూ దృశ్యాల్ని కళ్ళ నింపుకుంటూ తిరిగాను. నగరానికి చందనపు పాపిటలా నున్న యర్రా నది (Yarra River) మీద సాయంత్రపు ఎండ ఏటవాలుగా ప్రతిఫలిస్తూ ఉంది. నది మీద వరుసగా పదో పదిహేనో వంతెనలు బొమ్మలాట కోసం నిలబెట్టిన పూతిక పుల్లల్లా ఉన్నాయి. నేలలోంచి ఇనుప వృక్షాలు మొలుచుకొచ్చినట్లు ఒక పక్కగా ఎత్తైన భవనాలు, మరోపక్క లక్కపిడతల్లాంటి ఇళ్ళు, చిన్నపాటి భవనాలు. మరోవైపు కను చూపు చివరల్ని తాకుతున్న దిగంతపు వర్ణంతో పోటీ పడుతున్న సముద్రతీరం. షిప్ యార్డులో బుల్లి కాగితం పడవల మీద రంగుల రంగుల అట్ట పెట్టెలు పేర్చినట్లు తేలుతున్న సరకుల కంటైనర్ల ఓడలు. అందమైన ఆ దృశ్యాల్ని మైమరిచి చూస్తూ డెక్ చుట్టూ ప్రదక్షిణలు చేసేను. 

          “ఎడ్జ్” అనేది స్కై డెక్  బయటికి సాచిన నేలమీది అద్దాలలో నుంచి కిందికి చూడడం, ప్లాంక్ షో వర్ట్చ్యువల్ షో. సత్య, వరు అవన్నీ ముగించుకుని వస్తూనే కిందికి చూస్తూ దగ్గర్లో బ్రిడ్జికి అటూ, ఇటూ నదిమీద వేళ్ళాడుతూ వెళ్తూ, వస్తున్న జిప్ లైన్ ని చూసి ఇక అక్కడికి వెళదామని తొందర చేసేరు. అప్పటికి దాదాపు ఆరున్నర కావస్తూం ది. ఇక హడావిడిగా కిందికి వచ్చాం. రోడ్డు దాటగానే నదీ తీరం. తీరాన వరసగా రెస్టారెంట్లు, భోజనాల హడావిడి. అక్కడ అప్పటిదాకా ఆస్ట్రేలియాలో చూసిన అన్నిచోట్ల కంటే జనం అధికంగా కనిపించి బాగా సంతోషం వేసింది. అంతే కాకుండా ఇండియన్స్ ఎక్కువ కనిపించసాగేరు. 

          పదినిమిషాలు నడవగానే జిప్ లైన్ ఉన్న ప్రదేశం వచ్చింది. టిక్కెట్లు ఇవతలి తీరాన కొనుక్కుని అవతలి తీరానికి వంతెన మీంచి నడిచి వెళ్ళి అక్కణ్ణించి జిప్ లైన్ లో తిరిగి ఈ తీరానికి రావడమన్నమాట. అయితే నడుచుకుంటూ కులాసాగా అవతలి తీరానికి వెళ్ళిన వీళ్ళు ఎంతకీ జిప్ లైన్ లో ఇటు రారే! వీడియో తీద్దామని నేను తీరంలో నిలబడి చూడసాగేను. ఇంతకీ కెమెరాని జూమ్ చేసి చూస్తే విషయం ఏవిటంటే వీళ్ళు బంగీ జంప్ టిక్కెట్లు కూడా కొనుక్కున్నారు. అటు వైపు ఉన్న పెద్ద బిల్డింగ్ మీంచి నడుముకు తాడు కట్టుకుని బంగీ జంప్ అంటూ కిందికి దూకుతున్న వీళ్ళ సాహసాన్ని చూసి మతిపోయింది నాకు. అటు తర్వాత మరో అరగంటలో నది మీద తీగెతో వేళ్ళా డుతూ అట్నుంచి యిటుకి జిప్ లైన్ దిగి ఇద్దరూ నవ్వుకుంటూ వచ్చేవరకు లోపల్లోపల భయపడుతూనే ఉన్నాను. 

          ఇక సిరి అంతవరకు ఎవరో తెచ్చుకున్న కుక్కపిల్లతో ఆడసాగింది. 

          మొత్తానికి ఆ రోజు అందరికీ అనుకోకుండా బోల్డు సరదాలు పూర్తయ్యాయి. ఇక ఎనిమిది గంటల ప్రాంతంలో అందరికీ ఆకలి వేస్తూ ఉండడంతో అక్కడే వచ్చే దార్లో ఫుడ్ కోర్ట్ పైన ఉన్న రెస్టారెంట్లలో మిడిల్ ఈస్ట్ రెస్టారెంటుకి వెళ్ళి ఫలాఫల్స్ అనబడే పునుగుల వంటివి, పుల్లని ద్రాక్ష ఆకులో చుట్టిన అన్నం, కూరగాయలు, పుల్లకి గుచ్చి వేడి చేసి ఇచ్చే మాంసం, చికెన్  రాప్, బక్ లావా స్వీటు వంటి వాటితో భోజనం చేసాం. భోజనం తరువాత అక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్న సంగీత కార్యక్రమంలో వినసొంపుగా వినవస్తున్న అరబిక్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ కాస్సేపు కూచున్నాం. 

          మెల్లగా తొమ్మిదిన్నర ప్రాంతంలో రోడ్డు మీదికి వచ్చి హోటలుకి ఊబర్ తీసుకున్నాం. ట్రాఫిక్ బాగా ఉంది ఆ సమయంలో. పది నిమిషాల సమయంలో దాదాపు ఒక మైలు దూరం వెళ్ళి ఉంటాం. వరు అప్పుడు చూసుకుంది తన పర్సు ఎక్కడో మర్చిపోయిందని. బహుశా: రెస్టారెంటులో మర్చిపోయి ఉంటుందని వెంటనే  కారుని వెనక్కి తిప్పమని అడిగాం. కారు నడిపే అతను పాపం వెంటనే ఉరుకుల పరుగుల మీద ట్రాఫిక్ లేని రోడ్డుకి తిప్పి తీసుకురాసాగేడు. నేను ఎందుకైనా మంచిదని ఫోటోలు చూడసాగేను. అస్తమాటూ నేను అయినదానికీ, కానిదానికీ ప్రతి ప్రదేశంలోనూ బోల్డు  ఫోటోలు తీస్తూ ఉంటానని ఏడిపిస్తూ ఉంటారు మా వాళ్ళు. అవి ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి. ఫొటోల్లో వెనక్కి వెళ్ళి చూస్తే స్కై డెక్ మీదికి వెళ్ళిన మొదటి ఫోటోలో మాత్రమే వరు చేతిలో పర్సు ఉంది. అంటే వెళ్తూనే తనెళ్ళిన ఎడ్జ్ షో దగ్గిర వదిలేసిం దన్నమాట. స్కై డెక్ పది గంటలకి మూసేస్తారు. వెంటనే కారుని అటు తిప్పమని మేం వెళ్ళేసరికి పది నిమిషాల తక్కువ పది అయ్యింది. ఎంట్రన్స్ అప్పటికే మూసి వెయ్యడం తో బయటకు వచ్చే దార్లో ఉన్న గిఫ్ట్ సెంటర్ కి నేను, వరు పరుగెత్తాం. అక్కడ మరో అయిదు నిముషాలు లైనులో వేచి ఉండవలసి వచ్చింది. అక్కడ స్టాఫ్ కి పర్సుతో ఉన్న మా అమ్మాయి ఫోటో చూపించి నేను వివరించంగానే వాళ్ళు అదృష్టం కొద్దీ స్కై డెక్ మీద ఉన్న వారికి వెంటనే విషయం ఇంటర్ కామ్ లో చెప్పి పైకి వెళ్తున్న స్టాఫ్ ని ఇచ్చి మమ్మల్ని టిక్కెట్టు లేకపోయినా పైకి పంపించారు. పైన ఎదురైన మొదటి అమ్మాయి పరుగున మమ్మల్ని అక్కడున్న కెఫెలోని అమ్మాయికి అప్పగించింది. ఆమె ఫోటో చూడగానే అప్పటికే తీసి తన దగ్గిర పెట్టుకున్న పర్సుని వెంటనే సొరుగులోంచి తీసి మాకు ఇచ్చింది. అప్పటికి మా వరు బాగా టెన్షను పడింది. తన కాలేజీ ఐడెంటిటీ, డ్రైవింగ్ లైసెన్సు, క్రెడిట్ కార్డు వంటివన్నీ ఉన్నాయి మరి అందులో. సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసాం. వెనక్కి వచ్చేటపుడు లిఫ్ట్ లో పది దఫాలు పట్టేటంత మంది ఉండడంతో మేం అయిదో  దఫా వారితో కలిసి కిందికి వచ్చాం. మేం తిరిగొచ్చే వరకు సత్య, సిరి అదే టాక్సీలో వేచి ఉన్నారు. అలా ఎక్కువ సేపు వెయిటింగ్ లో ఉంచడం వల్ల టాక్సీ  బిల్ పెరిగింది. అయినా పర్సు తిరిగి దొరకడమే పదివేలు అనుకున్నాం. 

          అదే అమెరికాలో అయితే లాస్ట్ అండ్ ఫౌండ్ లో ఎవరైనా అప్పగించేక మీకు తెలియజేస్తాం వెళ్ళిరండి అని కింది నించే పంపేస్తారు. పోనీ మర్నాడు వచ్చి వెతుక్కుం దామంటే విషయం ఏవిటంటే స్కై డెక్ ప్రతిరోజూ మధ్యాహ్నం పన్నెండింటికి మాత్రమే తెరుస్తారు. ఆ మర్నాడు మేం పదకొండు ప్రాంతంలో ప్యాకేజీ టూరులోని ఒక ప్రధానమైన టూరుకి వెళ్ళాల్సి ఉంది. అక్కణ్ణించి వెనక్కి రాత్రి పదకొండు దాటాకే వస్తాం. ఇక ఆ మర్నాడు మధ్యాహ్నం పదకొండుకల్లా మరొక టూరు బుక్ చేసుకున్నాం. పైగా అక్కడున్నన్నాళ్లు ఈ టెన్షనుతో వరుకి నిద్ర పట్టకపోను. 

          అలా ఆ రోజు ప్రపంచంలోని మంచి వాళ్ళు ఎందరో మాకు ఎదురయ్యి, సహాయం చెయ్యడం వల్ల పోయిన పర్సు నిక్షేపంగా తిరిగొచ్చింది. మొత్తానికి హోటలుకి వెళ్ళే సరికి  పదకొండు అయ్యింది. అప్పటికే విపరీతంగా అలిసిపోయి ఉన్నామేమో ఇక ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాం. మెల్ బోర్న్ లోని మొదటి రోజు కథ అలా సుఖాంతమైంది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.