లేఖాస్త్రం కథలు-4

కుందేలు నాన్న

– కోసూరి ఉమాభారతి

 

“ప్రియమైన నాన్నగారికి,

కిడ్నీ మార్పిడి తరువాత హాస్పిటల్లో కోలుకుంటున్న మిమ్మల్ని చూడగలిగినందుకు .. ఇవాళ మా ఆనందం వర్ణనాతీతం. ఎన్నోయేళ్ళ తరువాత మిమ్మల్ని కళ్ళారా చూసి నప్పుడు అన్నయ్య, నేను భావోద్వేగానికి లోనయ్యాము. కానైతే, మనసు విప్పి మీతో మాట్లాడాలన్న మా కోరికని మీరు తోసిపుచ్చారు. మా విన్నపాలని తిరస్కరించారు.

          మీరు ఊహించనంతగా నిరుత్సాహపడ్డాము. సర్జన్ ప్రసాద్ అంకుల్ సలహా మేరకు, తేరుకుని ఈ లేఖ రాస్తున్నాను. మీరు తప్పక చదివేలా చూస్తానని అంకుల్ హామీ ఇచ్చారు. మీకు తెలియవలసిన ఎన్నో విషయాలని అన్నయ్య తరఫున కూడా ఇందు పొందుపరుస్తున్నాను. 

          నిజానికి, పాతికేళ్ళగా కనుమరుగైన మీ బిడ్డలు ఉన్నట్టుండి ఇలా మీ ముందుకు రావడాన్ని ..  మీరెలా భావిస్తారో అన్న భయం కూడా మాలో లేకపోలేదు. అన్నయ్యని వెంటబెట్టుకుని వీల్-చైర్ లో వచ్చిన నన్ను చూసి మాత్రం … మీలో ఆశ్చర్యం, ఉద్వేగం స్పష్టంగా కనబడ్డాయి. 

          నేను అలా వీల్-చైర్లో ఎందుకున్నానో తెలియని అయోమయం ఒక్క క్షణం మీ ముఖంలో అగుపించినా..  వెనువెంటనే అది ఆగ్రహంగా మారింది. మమ్మల్ని చూడ్డం సహించలేనట్టు…  అసహనంగా మీరు ముఖం తిప్పుకున్నప్పుడు నాకన్నా అన్నయ్య ఎక్కువగా బాధపడ్డాడు. అయినా సరే నేను దగ్గరగా వచ్చి మీ చేతిని అందుకుని, “అలా కాదు నాన్నా… మనసు విప్పి మీతో మాట్లాడనివ్వండి. మేము చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి.” అని అన్నానో లేదో.. మీరు మీ చేతిని వెనక్కి తీసుకున్నారు. మీ నుండి ఆ తిరస్కారాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా బావురుమన్న నన్ను అన్నయ్యే  సముదాయిం చాడు.

          సర్జరీ నుండి కోలుకుంటున్న ఆ స్థితిలో కూడా మీరు ఆగ్రహంతో ఊగిపోతూ మాతో అన్న మాటలు, అడిగిన ప్రశ్నలు, సౌందర్యమ్మ గురించి చెప్పిన విషయాలు మమ్మల్ని ఆందోళనకి గురిచేశాయి. వీలయినంత త్వరగా అన్నివిషయాలకి మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మరింతగా కానవచ్చింది.

          అందుకే, మాట్లాడే అవకాశం ఇవ్వమని మరోమారు అడిగినందుకు .. మీరు మా వంక చూసి, “మీ అమ్మతో మీకు ఎందుకింత పంతం? అన్నేళ్ళ క్రిందట చెప్పాపెట్ట కుండా దొంగలల్లే ఒకరి తరువాత ఒకరు గడప దాటేసిన మీరిద్దరూ, ఇప్పటి వరకు కూడా మమ్మల్ని శత్రువుల్లా దూరం పెట్టారు. తన కడుపున చెడబుట్టారని మీ అమ్మ వాపోని క్షణం లేదు. తన బాధ చూడలేక, పరిస్థితితో వేగలేక ఇదిగో ఇలా రోగిష్టినయ్యాను. రోగం వల్ల కాదు నేను కృంగిపోయింది… మీ వల్ల, మీ ప్రవర్తన వల్ల, మీ తిరస్కారం వల్ల. మేము నలుగురిలో తలెత్తి హుందాగా బతకలేక పోయాము.” అంటూ మీరు భావోద్వేగానికి గురయ్యారు. అన్నయ్య అందించిన నీళ్ళు తాగి కళ్ళు మూసుకుని మౌనంగా ఉండి పోయారు. మీ వంక చూస్తూ… అక్కడే ఉండిపోయాము. 

          తూటాల్లాంటి మీ మాటలతో నా మనసు పాతికేళ్ళ క్రితం జరిగిన సంఘటనల వైపు పరుగు తీసింది. 

          ‘తల్లితండ్రులైన మీతో సంబంధబాంధవ్యాలని తెంచేసుకుని..ముందుగా అన్నయ్య, ఆ తరువాత కొన్నాళ్ళకి నేను … అమ్మతో విభేదించి, కలహించి, తెగతెంపులు చేసుకుని … చెప్పకుండా గడప దాటేశాము. నిజమే, ఆ తరువాత కూడా మీతో మాట్లాడ లేదు. పట్టించుకోలేదు. ప్రేమ లేక కాదు నాన్న.. కేవలం మా అమ్మ సౌందర్యమ్మ…  మాతో వ్యవహరించే తీరు, అవలంభించే వైఖరి మాకు కొన్నిమార్లు శాపాలుగా మారి మా జీవితాల్లో విపరీత పరిణామాలకి దారితీశాయి. 

          సౌందర్యమ్మ చేష్టలకి అప్పట్లో మేమూ తలెత్తుకుని సమాజంలో మనలేక పోయాము. మీరేమో ఆమె నోటికి జంకి నోరు మెదిపేవారు కాదు. ఇక వేరు దారి లేక, మా వ్యక్తిత్వాలని చంపుకోలేక .. అలా గూడు వీడిపోయామే గాని, మీ పట్ల గౌరవాభిమానాలు లేక కాదు… నాన్నగారు.’ అని నాలో నేను మదనపడుతుండగా మీరు మళ్ళీ కళ్ళు తెరిచి మమ్మల్ని చూసారు.

          అన్నయ్య ఆదుర్దాగా “నాన్నగారు” అనగానే, “మీరింకా వెళ్ళలేదా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇవాళ మీ అమ్మ ఇక్కడి నుండి వెళ్ళగానే… మీరిలా దర్శనమిచ్చారంటే … ఇంకా కూడా మీ అమ్మని బద్దశత్రువులాగానే చూస్తున్నారని తేలిపోయింది. మరోమాట లేకుండా ఇక్కడి నుండి బయటకి నడవండి … లేదంటే స్టాఫ్ ని పిలుస్తాను.” అనేశారు. 

          మీ ఉగ్రరూపం చూసి, చేసేది లేక నిష్క్రమించాము. దిగాలుగా రూము బయట కూర్చునున్న మాకు… ఇలా ఉత్తరం రాయమన్న డాక్టర్ అంకుల్ ప్రోత్సాహం సరయినదేననిపించింది. 

          నేరుగా విషయానికి వస్తాను. చిన్నతనంలో క్రమశిక్షణ పేరిట సౌందర్యమ్మ  కఠవు గానే ఉండేది. మాకు ఆసక్తి లేని మ్యూజిక్, డాన్స్, టెన్నిస్ క్లాసులకి తిప్పేది. ఇద్దరమూ మీలా అందంగా ఉన్నామని చెబుతూ.. సంగీత, నృత్యాల్లో కృషి చేయాలని నెట్టేది.  సంగీతం, గానం నాకు వంటబట్టింది కనుక ఆమెకి కొంత వరకు తృప్తి కలిగింది. కానీ ఏ మాత్రం ఇష్టం లేని అందాల పోటీలకు, స్విమ్మింగ్ పోటీలకు నన్ను బెదిరించి, గదమాయించి తీసుకుని వెళ్ళేది. మీరు మొదట్లో కలిగించుకొని ఆమెని వారించినా…  అమ్మకు ఎదురు చెప్పే ధైర్యం లేకేనేమో గమ్మునుండి పోయారు. సౌందర్యమ్మ నోటి దురుసుకి, కఠిన  వైఖరికి మీకు లాగానే ఎదురు చెప్పలేక ఇష్టంలేని చదువులు, కష్టం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొన్నాము. 

          ఇంజినీరింగు చదువు మానేసి అన్నయ్య మెడిసిన్ లో చేరకపోయినా, రాష్ట్ర నాటక పరిషత్ వాళ్ళ నాటకాల్లో నటించదానికి నేను ఒప్పుకోకపోయినా…  మా తండ్రి ఐన మీకు శిక్ష పడుతుందని మమ్మల్ని బెదిరించింది  సౌందర్యమ్మ. మళ్ళీ వారానికి ఊపిరాడని దగ్గుతో, నోరు పెగలక అంతుపట్టని అనారోగ్యానికి మీరు గురైనప్పుడు… ఆ పరిస్థితి తాను కల్పించిందేనని గర్వంగా మా వద్ద  అమ్మ ప్రకటించినప్పుడు ఆమెలోని రాక్షసత్వం  అర్ధమయ్యింది. ఆ అనారోగ్యం నుండి మీకు ఉపశమనం కలగడాన్ని, తన షరతులకు మేము ఒప్పుకోడానికి ముడి పెట్టింది మా కన్నతల్లిసౌందర్యమ్మ. మమ్మల్ని కట్టడి చేసి తన ఇష్టానుసారంగా నడిపించేందుకు తన భర్తకి కూడా హాని తలపెట్టగలదని అర్ధ మయ్యి విస్తుపోయాము. 

          అంతే. అన్నయ్య మెడికోగా, నేను డ్రామా కంపెనీ నటిగా జీవితాలని మొదలెట్టా ము.  నాకు ఏమాత్రం ఇష్టం లేని ముళ్ళబాట పై నడిచాను. పదహారేళ్ళ నుండి డ్రామా కంపెనీతో ఊళ్ళూళ్ళు తిరిగాను. ఆ మార్గంలో… ధూమపానం, మద్యపానం చేస్తూ వెకిలిగా నడుచుకునే కొందరు మగ రాబందుల నడుమ రోజూ చస్తూ బతికాను.

          నాకు నచ్చని డ్రామా, స్విమ్మింగ్ వంటి కార్యక్రమాలు చేయించవద్దని మీరు కలగ చేసుకోబోతే, ‘సాకారం కాని నా సినిమా కలని మన అంజలి ద్వారా నెరవేర్చుకోవాలను కోడం తప్పుకాదు కదా! కాబట్టి మీరుమాట్లాడకండి వాసుదేవ’ అంటూ అమ్మ మీ నోరు నొక్కేయడం గుర్తుందా నాన్నా? నాన్నంటే నమ్మకం, నాన్నంటే రక్షణ, భద్రత. ఆ నమ్మకం, బధ్రతాభావం ఆ నాడే పోయాయి నాన్నగారు.

          అంతటితో ఆగిందా అమ్మ? అందచందాలతో, ప్రతిభతో తన కూతురు అంజలి త్వరలోనే ఇండియన్ ‘జానెట్ జాక్సన్’ లాగా తారాస్థాయికి చేరుకోబోతుందని నా గురించి, కోట్ల రూపాయల కట్నంతో తన కొడుకు అనిల్ కి త్వరలో అందమైన అమ్మాయి భార్య కాబోతుందని..అన్నయ్య గురించి.. ఉన్నవి, లేనివీ  కల్పించి … సౌందర్యమ్మ ఊరూవాడా చాటింపు వేసినప్పుడు…  మేము సిగ్గుతో తలలు  దించుకున్నాము నాన్నగారు.  

          మా జీవితాల్లో తరువాతి అనూహ్య పరిణామం.. అన్నయ్య వివాహ ఘట్టం. కస్తూరిని ప్రేమవివాహం చేసుకుంటానని అన్నయ్య స్థిరంగా చెప్పినప్పుడు అమ్మ ఎంత యాగీ చేసిందో, వాళ్ళిద్దరినీ ఎన్ని శాపనార్దాలో పెట్టిందో, ఎంతలా దుర్భాషలాడిందో  మీకూ తెలుసు. అన్నివిధాలా అన్నయ్యకి తగిన భార్య అవ్వగల కస్తూరి పట్ల సౌందర్యమ్మ  అలా విషాన్ని కక్కడం ఎవ్వరూ హర్షించలేదని ఆమెకి తెలియదేమో.

          అప్పుడే.. అన్నయ్యని నేను కూడా ప్రోత్సహించి అమ్మ రాక్షసత్వం నుండి, ఇంటి నుండీ సాగనంపాను. అన్నయ్య కస్తూరిని పెళ్ళి చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు.  తరువాత ఏడాది పాటు సౌందర్యమ్మ వాళ్ళ పై విషం కక్కుతూనే ఉంది. 

          ఎప్పటికో విసిగి వేసారాక, ఆమె దృష్టి నా పై కేంద్రీకృతమై, ‘వర్ధమాన సినీతార’ అని తానే నా పై ముద్ర వేసి నన్ను బలవంతంగా బొంబాయికి తీసుకుని వెళ్ళింది. అక్కడ తన బంధువుల ఇంట మకాం వేసి, నన్ను రోజుకి రెండు సినీ నిర్మాణ సంస్థల ఆఫీసులకి తిప్పింది. అప్పుడప్పుడు వారి ఎదుట పాడమనేది… ఒక్కోప్పుడు నటించమనేది.  కొందరు నిర్మాతలు నాకు స్క్రీన్-టెస్ట్ చేయించారు. మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఓ నిర్మాత నాకు తన చిత్రంలో వాంప్ కారెక్టర్ కి  ట్రైనింగ్ ఇస్తాన్నాడు. మరొకరు యాక్టింగ్ క్లాస్ అటెండ్ అవ్వమన్నాడు. అలా నెలరోజుల పాటు నన్ను నేను మానసికంగా చంపే సుకుని వారి నడుమ ఓ మరబొమ్మలా మెలిగాను. 

          ఓ రోజు నిర్మాత ముస్తాఫ్ నన్ను మూడురోజుల పాటు తన గెస్ట్-హౌస్ లో వదిలి వెళ్ళమని సౌందర్యమ్మనే అడిగాడు. ఆమె ముందు కలవరపడింది. నేను అక్కడి నుండి బయటకి నడిచాను.

          “ఇదంతా మామూలే అంజు .. నేను వెంట లేకుండా నీవెక్కడకీ రావని చెప్పేస్తాను లే. ఇంత వరకూ వచ్చి ఇప్పుడు వెనుతిరిగితే అప్రతిష్ట పాలవుతాము.”  అన్న అమ్మతో “విషం తాగి చస్తానని’’ తెగేసి చెప్పడంతో సర్దుకుని మరునాడు బయలుదేరి తిరిగి ఇల్లు చేరాము. నెలన్నర పాటు మేము బొంబాయి వెళ్ళామని మాత్రమే మీకు తెలుసు.

          అంతటితో ఊరుకుందా? నా కోసం పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టింది సౌందర్యమ్మ. రాజమండ్రిలో వెంకటేశ్వర్లు అనే యాభై ఏళ్ళ జమీందారుని కట్టు కుంటే…  ఆయనే నిర్మాతగా మారి నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీస్తాడని చెప్పి, అతనితో పెళ్ళికి నన్ను ఒప్పించాలని చూసిందంటే …  నా కన్నతల్లి  మనస్తత్వాన్ని ఏమని అంచనా వేయాలో చెప్పండి నాన్నా. నేను సరే అంటే మిమ్మల్ని ఒప్పించడం తనకి కష్టమేమీ కాదని, పైగా సినీ నటిగా స్థిరపడ్డాక జీవితాన్ని ఎలాగంటే అలా మలుచుకో వచ్చని కూడా నాకు హితవు చెప్పింది. మౌనంగా ఉండిపోయాను. ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకోమంటూ ప్రతిరోజూ గుర్తు చేసేది.

          తరువాత రెండు వారాలకి నా ఇరవైయొకటవ పుట్టినరోజున నాతో గుడికి రమ్మని మీ ఇరువురినీ కోరాను. అక్కడ అర్చన చేయించాక మీ ఇరువురి పాదాలు తాకి దీవెనలు పొందాను. ఇల్లు చేరాక మీ ఇద్దరితో కలిసి పాయసం, పులిహోర సేవించాను. కాసేపాగి ఐస్-క్రీమ్ కేక్ కోసి.. సెలెబ్రేట్ చేసుకున్నాను.

          సాయంత్రమయ్యాక  మ్యూజిక్  క్లాస్ కి వెళ్ళిన దాన్ని మ్యూజిక్ టీచర్ తాయారమ్మ దీవెనలతోనే ఆమె కొడుకు అరవింద్ ని అదే గుళ్ళో వివాహం చేసుకుని అతనితో  పాండు చెరీకి వెళ్ళిపోయాను. అంతే మళ్ళీ ఇరవైనాలుగేళ్ళ తరువాత మిమ్మల్ని నిన్నచూసాను.  తప్పో ఒప్పో, మీ బిడ్డల్ని అర్ధం చేసుకుని క్షమించండి నాన్నగారు.    

 ఇట్లు

మీ అంజలి.

***

          చదవడం ముగించి పొంగి పొర్లుతున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నమైనా చేయకుండా పసిపిల్లాడిలా ఏడవసాగాడు…  అనిల్, అంజలిల తండ్రి వాసుదేవ.  అప్పటి వరకు కాస్త దూరంగా మౌనంగా ఉండిపోయిన సర్జన్ ప్రసాద్ … పేషేంట్ బెడ్ వద్దకి చైర్ లాక్కుని కూర్చున్నాడు.

          “ముందు కళ్ళు తుడుచుకో మిత్రమా. కాస్త తేరుకో. చక్కగా కోలుకున్నావు. ఇవాళ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీ భార్య ఇక్కడికి వచ్చేలోగా నీకు ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలి.” అంటూ ట్రేలో ఉన్న టాబ్లెట్స్, నీళ్ళు అందించాడు ప్రసాద్.

          నిముషం సమయం ఇచ్చి, “చూడు వాసు, గత ఇరవైయేళ్ళగా మీ బిడ్డలు .. అనిల్, అంజలి నాతో టచ్ లోనే ఉన్నారు. నీ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారు.  ఎప్పటి కప్పుడు నీ బాగోగుల గురించి, అనారోగ్యం గురించి వివరాలు అందిస్తూనే ఉన్నాను. నీకు కిడ్నీ మార్పిడి అవసరం అని తెలుసుకుని నెల క్రిందటే కిడ్నీ మ్యాచ్ కోసం అనిల్, అంజలి పరీక్షలు చేయించుకున్నారు. 

          అంజలి కిడ్నీ నీకు పెర్ఫెక్ట్ మ్యాచ్ అవడంతో నాలుగురోజులు ముందుగా ఇక్కడికి వచ్చి తన కిడ్నీ ఇచ్చి, ఇక్కడ మన ఆసుపత్రిలోనే కోలుకుంటుంది. అలా నీ కూతురు అంజలి తన కిడ్నీ దానం చేసి నిన్ను తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేసినా…. తమ తల్లితో ఉన్న విబేధాల వల్ల తన పేరు గోప్యంగానే ఉంచమని కోరింది.” అంటూ క్షణంసేపు వాసుదేవ వంక నిశితంగా చూసాడు ప్రసాద్. .

          “నిజంగా అంజలికి, అనిల్ కి కూడా నీ పట్ల ఉన్నతమైన పూజ్యభావమే లేకపోతే ఇంత దూరం వచ్చేవారు కాదుగా.  కన్నతండ్రి కోసం తన కిడ్నీ దానం చేయగలగడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తుందిరా నీ కూతురు. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నీ పిల్లలిద్దరూ చాలా ఎదురు చూసారు.” అంటూ  నిశ్చేష్టుడయి చూస్తున్న వాసుదేవ భుజం పై తట్టాడు డాక్టర్ ప్రసాద్. కళ్ళు తుడుచుకోమంటూ టిష్యు బాక్స్ అందించాడు స్నేహితుడికి. 

          “చూడు .. నాకు మీ జీవితాల్లోని అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ప్రాణస్నేహితు డిగా ఓ మాట చెబుతాను వాసు. భార్య పట్ల… భయమో, భక్త్తో, ప్రేమో ఏదైనా ఉండచ్చు. కానీ కడుపున పుట్టిన బిడ్డల విషయంలో తండ్రి అనేవాడు తన పాత్ర సవ్యంగా పోషిం చాలి. లేకుంటే అనర్ధాలే జరుగుతాయి.” అంటూ… కాలింగ్ బెల్ నొక్కి, అటెండెంట్ కి రెండు కాఫీలు తెప్పించమని పురమాయించాడు. నర్సుని పిలిచి, తాను ఆర్డర్ చేసిన టెస్ట్ రిపోర్ట్స్ వెంటనే తెప్పించమని అడిగాడు.

          మౌనంగా ఆలోచనలో ఉన్న వాసుదేవ చేతి పై తడుతూ, ”చాలా విషయాలు చెప్పాను. ఓపిగ్గా విన్నావు. తాపీగా అలోచించి నిమ్మళంగా ఉండు.”  ధైర్యం చెబుతున్న ధోరణిలో ప్రసాద్.

          ఉదాసీనంగా తలెత్తి ప్రసాద్ వంక చూసాడు వాసుదేవ. “నీవు నాకు ముందే ఈ సలహాసహకారాలని అందించవలసింది ప్రసాద్. చేతులు కాలాక..అన్నట్టుగా ఇప్పుడు ఇదంతా చెబితే ఎలా జీర్ణించుకోనురా?” అన్నాడు కాస్త నిష్టూరంగా. 

          “అంజలి, అనిల్ నా వద్దకు వచ్చి, కుటుంబంలోని పరిస్థితులు వివరించి నా సహాయం కోరినప్పుడు వాళ్ళు టీనేజర్స్. కన్నతండ్రివే అయినా వారి ప్రాపకం విషయంలో ‘కుందేలు నాన్న’గా  మిగిలిపోయావు. వారి పెంపకం విషయంలో ఓ తటస్థ తండ్రిగా మిగిలిపోయావని అర్ధమయింది.

          అందుకే నన్ను ఆశ్రయించిన నీ బిడ్డలని అక్కున చేర్చుకుని దేవుడిచ్చిన తండ్రిగా వ్యవహరించాలని నిశ్చయించుకున్నాను. నాకు మీ పిల్లలతో  ఉన్న బాంధవ్యాన్ని నీకు తెలియనివ్వలేదురా వాసు. వాళ్ళు కోరింది కూడా అదే. వాళ్ళ చదువులు, తల్లితో విబేధాలు, వారి నిర్ణయాలు, గడప దాటడాలు నాకు తెలిసే జరిగాయిరా. నిజం. అంజలికి ఆ సంబంధం కుదిర్చింది కూడా నేనే.” అన్నాడు ప్రసాద్.

          “నిజమే నేను ‘కుందేలు నాన్న’ని. నా భార్య నోటికి, ప్రవర్తనకి, వేధింపులకు వెరచి బాధ్యతల నుండి తప్పుకున్నాను. అన్నీ సర్దుకుంటాయని భ్రమలో ఉండిపోయిన పిరికి వెధవని. నా కన్నబిడ్డలకి మంచి బాల్యాన్ని ఇవ్వలేకపోయాను. మంచి తండ్రిని కాలేక పోయాను. అంతా  నా ఖర్మ.” అంటూ వాపోయాడు వాసుదేవ.

          బిడ్డల వ్యక్తిత్వాలని, ఇష్టాయిష్టాలని అర్ధం చేసుకుని, వారికి చేయూతనివ్వాలే  తప్ప…తల్లితండ్రుల తీరని కోరికలకు బిడ్డలని సాధకాలుగా వాడుకోకూడదు అన్న నిజం ఇప్పటికైనా నీ భార్య గ్రహిస్తే చాలు. సరేలేరా, వాసు. అన్ని విషయాలు, వివరణలు ఇప్పుడు నీ ముందున్నాయి. ఇక్కడి నుండి అంతా నీ చేతిలోనే ఉంది.” అంటూ నవ్వేసాడు ప్రసాద్.

          నిట్టూర్చాడు వాసుదేవ. “నిజానికి నీవు చేసిన మేలుకు ఎప్పటికీ ఋణపడి ఉంటానురా ప్రసాద్.” అంటూ స్నేహితుడు చేతిని తన నుదిటికి తీసుకున్నాడు వాసుదేవ.

          “ఛ,  ఊరుకోరా.. నీతో నా స్నేహం ఈనాటిదా? నీ కుటుంబంలో వైషమ్యాలు తొలిగి ప్రశాంతత నెలకొనాలిరా వాసు.” అన్నాడు ఆప్యాయంగా స్నేహితుడి భుజం పై తడుతూ… డాక్టర్ ప్రసాద్.

*****

Please follow and like us:

2 thoughts on “లేఖాస్త్రం కథలు-4 – కుందేలు నాన్న”

  1. లేఖాస్త్రం కథలో కుందేలు నాన్న కథ చాలా బాగుంది కథ చదువుతుంటే మనసును కుదిపేసింది. తండ్రికి కూతురి ఆప్యాయత చాలా బాగా రాశారు మేడం

    1. ధన్యవాదాలు లక్ష్మీ గారు..

Leave a Reply

Your email address will not be published.