వెనుతిరగని వెన్నెల(భాగం-58)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా ఎదురయ్యి పెళ్ళి చేసుకుంటాడు.
***
మర్నాడు తన్మయి కాలేజీ నుంచి వచ్చేసరికి లోపల అదే పనిగా టీవీ మోగుతూంది. ఈటీవీ, జెమినీ టీవీ ఒకదాని తర్వాతొకటి మోగుతున్నాయి.
బాబు కూడా స్కూలు నుంచి రాగానే ఇంట్లో వీళ్ళతో బాటూ టీవీ ముందు కూచున్న ట్టున్నాడు. వాడి స్కూలు సంచీ, విప్పిన బూట్లు, సాక్సులు ఒక పక్కకి విసిరేసి ఉన్నాయి.
ఎప్పుడూ బుద్ధిగా ఇంటికి రాగానే బూట్లు, సాక్సులు విప్పి తలుపు చాటున పొందిగ్గా పెట్టి, ముఖం కాళ్ళూ కడుక్కుని, బట్టలు మార్చుకుని, తలదువ్వుకుని, పుస్తకాలు ముందేసు కుని గబగబా ముందు హోంవర్కు పూర్తి చేసుకునే బాబు ఇవేళ ఇంకా స్కూలు నుంచి వచ్చిన మురికి బట్టల్లోనే ఉన్నాడు. ప్రభు అమ్మా, నాన్నా కూచున్న కుర్చీల ముందు నేల మీద కూచుని దృష్టి తిప్పకుండా టీవీ చూస్తున్న బాబుని చూడగానే తన్మయికి తెలీని కోపం ముంచుకొచ్చింది.
ఇద్దరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి పిల్లాణ్ణి పట్టించుకోకపోవడమే కాకుండా, వాణ్ణి వాళ్ళ పక్కన కుర్చీ మీద కూచోనివ్వకుండా, నేల మీద కూచోబెట్టేరు. వాళ్ళనేమీ అనలేని తన్మయి అరచెయ్యి వాడి వీపుకంటుకునేలా ఒక్కటంటించి “లే” అని పక్క గదిలోకి లాక్కెళ్ళింది.
అయినా వాళ్ళు అక్కడ జరుగుతున్నది తమకు సంబంధం లేనట్టు టీవీ చూడసాగేరు. అనుకోని సంఘటనకి బిత్తరపోయి, అంతలోనే వీపు మీది దెబ్బకు తాళలేక “అమ్మా” అని మంచమ్మీద పడి దొర్లి దొర్లి గుక్కపెట్టి ఏడవసాగేడు బాబు. అప్పటిగ్గానీ తన్మయికి తనేం చేసిందో అర్థం కాలేదు.
“అయ్యో, అయ్యో” అంటూ వాణ్ణి కౌగిలించుకుని తనూ దుఃఖించసాగింది. మరు నిమిషంలో తన ఏడుపు ఆపి వెక్కుతూనే తల్లి కళ్ళ నీళ్ళు తుడవసాగేడు బాబు. తన పరిస్థితికి తనే తమాయించుకోలేక తన్మయి వాడి వీపు నిమురుతూ అలాగే మంచమ్మీద వాలిపోయింది. ఎంతసేపు ఉండిపోయిందో తెలీలేదు. చీకటి పడుతుండగా చేతిమీద నిద్రపోతున్న బాబుని పక్కకి జరిపి వంటింట్లోకి వెళ్ళింది.
హాల్లో టీవీ ముందు కదలకుండా వాళ్ళలాగే కళ్ళప్పగించి చూస్తున్నారు తన్మయి వాళ్ళ ముందు నుంచి నడిచినా అసలక్కడ ఉన్నట్టే పట్టించుకోకుండా. కుర్చీల పక్కనే తాగిన టీ గ్లాసుల్లో మిగిలిన టీ పక్కకి ఒలికి గ్లాసులు నేల మీద దొర్లుతూ ఈగలు ముసర సాగేయి.
తన్మయి గ్లాసుల్ని తీసి, గబగబా తడిగుడ్డ తెచ్చి నేల మీది టీని వత్తి, వంటింట్లోకి వెళ్ళి స్టవ్వు మీద కుక్కర్ పెట్టింది. మామూలుగా తన్మయి వారాంతంలో తప్ప టీవీ చూడదు. చూసినా కేవలం న్యూస్ వచ్చే కాసేపే. రోజూ ఈ సరికి బాబుకి హోం వర్కులు పూర్తి చేయించి, స్నానం చేయించి, అన్నం తినిపించి పడుకోబెట్టేసేది. మరో గంటలో వంట పూర్తి చేసి వాళ్ళని అన్నం తినడానికి రమ్మని పిలిచింది. వాళ్ళు కనీసం తల పక్కకి కూడా తిప్పి చూడకపోవడంతో చేసేదేం లేక బాబుని లేపి కాస్త తినిపించ బోయింది. నిద్రకళ్ళతో సగం మెలకువలో “అమ్మా! వద్దమ్మా.. కొట్టొద్దు ” అని ఏడవ సాగేడు. ఎత్తుకుని భుజాన వేసుకుని పడుకోబెట్టడానికి డాబా మీదికి తీసుకెళ్ళి తనూ వాడి పక్కన నడుం వాల్చింది.
ఎన్ని బాధలున్నా బాబు పక్కన పడుకోగానే మనశ్శాంతిగా అనిపిస్తుంది తన్మయికి.
వాడి వీపు మీద తడిమి “ఏమ్మా, ఇంకా నొప్పిగా ఉందా?” అంది.
తలూపుతున్న బాబుని హత్తుకుంటూ “నన్ను క్షమించు నాన్నా! ఇంకెప్పుడూ నిన్ను కొట్టను” అని తనలో తనే ప్రతిజ్ఞ చేసుకుంది.
నిశ్శబ్దంగా తల నిమురుతూన్న తల్లి వైపు తిరిగి పొట్ట మీద చెయ్యి వేసి అప్పటికి మెలకువ వచ్చినట్లు “అమ్మా, వీళ్ళు ఎవరు?” అనడిగేడు.
“డాడీ కి అమ్మా, నాన్నా” అంది నిర్లిప్తంగా.
“మరి వాళ్ళను ఏమని పిలవాలి?”
“మన అమ్మమ్మా, తాతయ్యలని పిలిచినట్లే నానమ్మ, తాతయ్య అని పిలువు” అంది.
ఇంతలో ప్రభు వచ్చినట్లు బండి శబ్దం రాగానే కిందికి వెళ్ళి వాళ్ళకి భోజనాలకు అన్నీ సర్ది పెట్టి మళ్ళీ పైకి వచ్చేసింది తన్మయి.
తన్మయి తిందో, లేదో ప్రభు అడగలేదు. తన్మయి చెప్పలేదు. బాబు మీద అన్యాయంగా తనలా చెయ్యి చేసుకున్నందుకు భోజనం చెయ్యకుండానే నడుం వాల్చింది తన్మయి. కింద అర్థ రాత్రి వరకూ టీవీ మోగుతూనే ఉంది. ప్రభు తల్లిదండ్రు లతో కులాసాగా కబుర్లు చెప్పడం తన్మయికి వినిపిస్తూనే ఉంది.
***
ఉదయం తన్మయి లేచి వచ్చేసరికి హాల్లో ఎవ్వరూ లేకపోయినా టీవీ ఆన్ చేసే ఉంది. తన్మయి నిశ్శబ్దంగా టీవీ ఆఫ్ చేసి బాత్రూములోకి వెళ్ళింది. లోపలి గదిలో నుంచి గురకలు వినిపిస్తున్నాయి. హాల్లో పడుకున్న ప్రభు కళ్ళు చిట్లించి చూసి “టైం ఎంత య్యింది?” అన్నాడు.
తన్మయి సమాధానం విని ఒక్క ఉదుటున లేచి “త్వరగా తయారవ్వు. అక్కా, పిల్లలూ స్టేషనుకి వస్తున్నారు మనం వెళ్ళాలి” అన్నాడు.
ఆదివారం కావడంతో పొద్దున్నే టిఫినుకంటూ గారెలకి పప్పు నానబోసింది ముందు రోజు రాత్రి.
అదే చెప్పింది.
“సర్లే, నేనొక్కణ్ణే వెళ్ళోస్తాను, వీళ్ళకు కావలసినవన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకో” అని వెళ్ళేడు ప్రభు.
బాబు గబుక్కున పరుగెత్తుకెళ్ళి గేటు పట్టుకుని నిలబడి ప్రభు వెళ్ళిన వైపే చూస్తూ “డాడీ! టాటా!” అనరిచేడు బాబు. ఇంతలో ఎప్పుడు లేచిందో ఆవిడ గబుక్కున గుమ్మం దగ్గిరికి వచ్చి ఒక్క అరుపు అరిచింది.
“ఇదుగో ఒరే, ఇప్పుడే చెప్తున్నాను నా కొడుకుని “డాడీ” అని పిలిచేవంటే మర్యాద దక్కదు. ఎవడికి పుట్టేవురా? నా కొడుక్కి పుట్టేవా? ఇదుగో, నువ్వు మమ్మల్ని తాతయ్య, నాన్నమ్మ అని పిల్డానికి ఈల్లేదు. నువ్వూ మాకు ఏవీ కావు గుర్తెట్టుకో” బాబు మీద గదమాయింపులు వినిపించి గబుక్కున వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది తన్మయి.
అప్పటికే బిక్క చచ్చిపోయిన మొహంతో తల్లిని చూడగానే గబుక్కున వెనక్కి చేరి గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు బాబు.
తన్మయికి కోపం కట్టలు తెంచుకుంది.
“మాటలు మర్యాదగా రానీండి. పసిపిల్లాడితో మాట్లాడే మాటలేనా అవి?” అని అరిచింది.
“అమ్మో, అమ్మో నా కొడుకు ఇంట్లో ఉన్నంతసేపు మింగిలాగా ఉండి, ఆడలాగెళ్ళ గానే ఎలా నోరేసుకుని పడిపోతందో రాకాసి ముండ. నువ్వూ, నీ కొడుకూ నాశనమైపోనూ. నా కొడుకే దొరికేడే నీకు తగులుకోవడానికి లంజా…” అంటూ బూతు తిట్ల దండకం లంకించుకుంది బేబమ్మ.
తన్మయికి తల తిరగసాగింది. చెవులు గట్టిగా మూసుకుని వంటింట్లోకి బాబుతో సహా వెళ్ళి తలుపేసుకుంది.
ఛీ, ఛీ, ఛీ. జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ తనని ఇలాగ భయంకరమైన తిట్లు తిట్టలేదు. తన జీవితం పెనం మీంచి పొయ్యిలోకి పడిందని అర్థం అయ్యింది.
చుట్టుముడుతున్న నైరాశ్యంతో కళ్ళు మూసుకుని ఏడుస్తున్న బాబుని హత్తుకుని నేల మీద కూచుండిపోయింది.
***
మరో రెండు గంటల్లో ప్రభు వచ్చేడు. వెనకే ప్రభు అక్క, ఆవిడ కూతురు, కొడుకు, మూడేళ్ళ మనవరాలు ఆటో దిగేరు. ఆవిడకి దాదాపు నలభైయేళ్లుంటాయేమో. “మా యమ్మాయికి ఎనిమిదో తరగతిలోనే పెళ్ళి చేసేసేం, వెంటనే కూతురు” అంది జుట్టు సరిచేసుకుంటూ ప్రభు అక్క తన్మయి నుద్దేశించి.
తన్మయికి అప్పటికే ప్రభు తల్లి తిట్లకి చికాగ్గా ఉంది.
ఎప్పుడు ఈ విషయం ప్రస్తావించాలా ఆలోచిస్తూనే ప్రభు అక్క మాట్లాడుతుండగా లేచెళ్ళి మంచినీళ్ళ గ్లాసులు తెచ్చి మౌనంగా అందించింది. చిన్నపాప తల్లి కొంగు పట్టుకుని అదేపనిగా లాగుతూండడంతో కూతుర్ని ఒళ్లో వేసుకుని అరుగు మీదే కూచుని పాలివ్వసాగింది ఆ అమ్మాయి. మూడేళ్ళమ్మాయి తల్లి దగ్గిర ఇంకా పాలు తాగడం చూసి బాబు తన్మయి వెనక దాక్కున్నాడు.
ఆవిడ కొడుక్కి ఇరవయ్యేళ్లుంటాయేమో. చేతిలోని రెండు గోనె సంచుల సామాన్లని అరుగు మీద మరోవైపు పెట్టి, తన్మయిని చూసీ చూడనట్టు తల దించుకుని లోపలికెళ్ళి టీవీ ముందు కూచున్నాడు. ప్రభు అక్క ప్రభు కంటే పెద్దదని తెలుసు కానీ ఇంత పెద్ద దని తెలీదు.
ఆవిడింకా తన్మయి వైపే చూస్తూ మాట్లాడుతూనే ఉంది. “అయిదేళ్ల కిందట భర్త పోయిన దగ్గర్నుంచి ఆవిడ అమ్మగారింట్లోనే ఉందట. ఇక ఆవిడ కూతురి భర్త మిలటరీ లో ఉంటున్నాడు కాబట్టి ఆ అమ్మాయీ ఆవిడతోనే ఉన్నది పెళ్ళయిన దగ్గర నుంచి.
అబ్బాయి ఏడో తరగతి ఫెయిలయ్యి ఇక అటు చదువూ చదవలేదు, ఇటు ఏ పనీ నేర్చుకో లేదు.”
ఇంత సంసారాన్ని నడపడానికి తమ జీతాలు ఎలా సరిపోతాయో తెలీడం లేదు తన్మయికి.
వాళ్ళందరికీ టిఫిన్లు, కాఫీలు అయ్యీ కాక ముందే మధ్యాహ్నం వంటకి పెద్ద చేపలు రెండు తీసుకు వచ్చేడు ప్రభు. వాటిని శుభ్రం చేసి, వండి, భోజనాలు పెట్టి వంటిల్లు శుభ్రం చేసుకునే సరికి వికారంగా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించసాగింది తన్మయికి.
హాల్లో అంతా కిక్కిరిసినట్టు టీ.వీ ముందు కూచున్నారు. ప్రభు కూడా వాళ్ళతో బాటూ కూచున్నాడు. బాబు బయటికి ఆడుకోవడానికి వెళ్ళేడు. లోపల గదిలోకి వెళ్ళి పడుకుందామంటే అప్పటికే బేబమ్మ మంచమ్మీద మధ్యాహ్నపు నిద్ర తీయసాగింది.
ఇక చేసేదేం ఇక తన్మయి వంట గదిలో ఒక వారగా చాప పరుచుకుంది. అరగంటలో టీలు కావాలని ప్రభు వచ్చేడు.
తన్మయిని చూస్తూనే “ఇలా ఇక్కడ ఎవరితోనూ కలవకుండా ఒక్కదానివీ ఉండక పోతే అలా వచ్చి టీవీ ముందు అందరితో కూచోవచ్చు కదా” అన్నాడు. పగటి పూట ఎప్పుడూ పడుకోని తను అసలు ఎందుకు పడుకుందో అడుగుతాడనుకున్న తన్మయికి తనకు ఒంట్లో బాలేదన్న విషయం కూడా చెప్పాలనిపించలేదు. మాట్లాడకుండా నెమ్మదిగా లేచి టీ పెట్టడానికి స్టవ్వు వెలిగించింది.
అసలే పొద్దున్న ఆవిడ చేసిన రాద్ధాంతానికి మనసేమీ బాగోలేదు.
ఈ విషయం ప్రభుతో రాత్రికి మాట్లాడాలి. వీళ్ళ నోటికి హద్దూ పద్దూ లేకుండా మాట్లాడితే కుదరదని గట్టిగా చెప్పాలి.
టీ తాగడానికి తల్లిని లేపేడు ప్రభు. బయటికి రాగానే బేబమ్మ ప్రభుతో గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది.
“ఇదిగో చినబాబూ, నీ పెళ్ళాం వరసేవీ బాగోలేదు. నిన్న ఆ పిల్లోడు మా కాళ్ళ కాడ కూకున్నాడని లాక్కెల్లిపోయింది. మేం టీలు తాగినకాడ ఎనకాలే తడిగుడ్డ ఎట్టి తుడుసు కుంటంది. అంటే మావు అంటరానోళ్ళ వనా?…అదలాగుంచు. ఆ పిల్లోడు నిన్ను “డాడీ” అని పిల్నాకి ఈల్లేదు. నిన్నా మొన్న పెళ్ళయ్యి, అప్పుడే ఆరేళ్ళ పిల్లోడికి తండ్రెలా అయిపోయేవురా మా కర్మగాపోతే! నీ పెళ్ళాం నీ ముందు మింగిలాగా ఉంటంది కానీ మమ్మల్నేవన్నాదో తెల్సా, ‘మాటలు జాగర్తగా రానియ్య’న్నాదిరా ” అని శోకాలు పెట్ట సాగింది.
ప్రభు నిశ్శబ్దంగా విన్నాడే గానీ ఏవీ మాట్లాడలేదు.
చుట్టూ ఉన్నవాళ్ళంతా ఇది తమకు మామూలే అన్నట్లు ఓ పక్కన పెద్దగా మోగుతున్న టీవీ చూడసాగేరు.
ఆ రాత్రి ప్రభు తన్మయితో మాట్లాడడం ఇష్టం లేనట్లు తప్పించుకు తిరిగేడు.
డాబా మీద ఒక పక్కకు నిద్రకుపక్రమించబోతున్న ప్రభుని తట్టి సీరియస్ గా అంది తన్మయి.
“వాళ్ళ మటుకు వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఏవిటి నీ ఉద్దేశ్యం ఒక్క మాట కూడా మాట్లాడవు?” అంది.
“నువ్వు మటుకు ఏవైనా గొప్పదానివా? వాళ్ళు ఏం మాట్లాడినా ఎదురు చెప్పొద్దు అని చెప్పేను. నువ్వేం చేసేవు?” అన్నాడు.
“అంటే వాళ్ళు “ఎవడికి పుట్టేవురా?” అని నోరులేని పిల్లాడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా, నన్ను దారుణంగా బూతులు తిడుతున్నా ఊరుకోవాలా?” అంది దుఃఖం నిండిన కళ్ళతో.
“అవును. వాళ్ళేమన్నా ఊరుకోవాలి. వాళ్ళకి చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకున్నా నన్ను క్షమించేరు. అందుకు కృతజ్ఞత చూపాల్సింది పోయి నువ్వూ, నీ కొడుకూ కల్సి ఈ గొడవలేంటి? ఇలా చూడు రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లవుతాయి. రేపసలే ఇల్లు మారాలి మనం. ఇక ఇంతకంటే నీతో వాదించే ఓపిక లేదు నాకు” అని ముసుగు మొహం మీదికి లాక్కున్నాడు.
తన్మయికి బాధ, కోపం చుట్టుముట్టేయి.
“నువ్వెంత అన్యాయంగా మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ వాళ్ళు నీకు ఎంత ముఖ్యమైనా ఏ కల్మషం ఎరగని నా పసివాడు నాకు అంత కంటే ముఖ్యం. వాడి మీద ఈగ వాలినా సహించను. గుర్తుపెట్టుకో” అంది.
***
ఆ మరుసటి రోజే ఇల్లు మారాల్సి ఉంది.
తన్మయి ఉదయం లేచిన దగ్గర నించి ఆలోచించ సాగింది.
“ప్రభు తనని వొదిలి వాళ్ళతో వెళ్ళిపోయినా ఫర్వాలేదనుకుని తను వీళ్ళతోబాటూ వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోతే!”
“ఎప్పటిలానే తను, బాబు, తన జీవితం మళ్ళీ మొదలుపెడితే”
మళ్ళీ అంతలోనే “తనలా విడిగా వెళ్ళిపోవడమే వాళ్ళకి కూడా కావలసింది. ఏవుంది! ప్రభుకి మళ్ళీ పెళ్ళి చేస్తారు. అసలు నిజానికి వీళ్ళు ఇక్కడికి గొప్ప క్షమా హృదయంతో రాలేదు. కావాలని తనని ఏడిపించి పంపెయ్యడానికే వచ్చేరు. ప్రభుని కావాలనుకుని పెళ్ళి చేసుకుని ఇంతలోనే ఓడిపోయినట్లు తనెందుకు విడిపోవాలి?” అని పట్టుదల కలగసాగింది.
చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని వచ్చి స్థిమితంగా ఆలోచించసాగింది.
ఈ సమస్యల్ని వీళ్ళతోనే ఉండి పరిష్కరించుకోవాలి. అదెంత కష్టసాధ్యమైనా సరే.
తనకి ప్రభు ముఖ్యం. ప్రభు తాత్కాలికంగా కఠినంగా మాట్లాడుతున్నాడు కానీ తనంటే ఎంత ప్రేమ లేకపోతే ఇంతగా తను ప్రేమించే వీళ్ళందర్నీ కాదని తనని పెళ్ళి చేసుకుంటాడు!
ఒకటి మాత్రం నిజం. శేఖర్ లాగా ప్రభు మూర్ఖుడు కాడు. తనకి ఎప్పటికీ అన్యాయం చెయ్యడు. తను మాత్రం ఎందుకు అతన్ని వదిలి వెళ్ళిపోవాలి?
లోపల్లోపల పరిపరి విధాలా ఆలోచిస్తూ మారు మాట్లాడకుండా సంచులు తీసుకుని సామాన్లు సర్దసాగింది.
వాళ్ళ సామాన్లు ఉన్న కాసిన్నీ తెచ్చుకున్న సంచుల్లో అలాగే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పనేమీలేదు. తన్మయి ఒక్కతే తన సామాన్లు సర్దుకోవాల్సి రావడంతోనో ఏమో ముందురోజు వికారం తీవ్రతరమైంది. కానీ వంట సామాన్లు సర్దడానికి, పుస్తకాలు, బట్టలు సర్దడానికి గానీ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళున్నా తన్మయిని సాయం కావాలా అని కూడా అడగలేదు.
అదే అంది ప్రభుతో.
“ఇలా చూడు, వాళ్ళ నుంచి నువ్వు ఏవీ ఎప్పుడూ ఎక్సపెక్ట్ చెయ్యొద్దు. నేను చేస్తానుగా నీకు సాయం” అన్నాడు అసలు ముందురోజు ఏవీ జరగనట్టు ముఖం పెట్టి ప్రభు.
తన్మయి ఊపిరి గట్టిగా పీల్చి నిట్టూర్చింది. “ఏవిటితని వరస?”
మంచం, టీవీ, బీరువా వంటి పెద్ద సామాన్లు ప్రభు, అతని మేనల్లుడు కలిసి వ్యాను లోకి ఎక్కించేందుకు వీలుగా దుప్పట్లు, సంచులు వేసి కట్టేరు. వెళ్ళే ముందు చెప్పి రావడానికి తన్మయి తాయిబా దగ్గిరికి వెళ్ళింది.
“ఏమో ఇది మేడం, సారు జిమ్మెదారీ అంతా నీ మింద పడింది. మల్ల గలీజు గలీజు మాటలంటుండ్రు. నిన్నటి సంది అంతా ఇన్నా నేను. నువ్వే జర సోచాయించుకోవాలె. ఇయ్యేల ఇల్లు ఖాళీ చేస్తురంటే మస్తు బాద గొడ్తాఉంది నాకు. ఎట్ల బతుకతవో ఏమో ఈళ్ళ మద్దెన” అంది టీ కలిపి ఇస్తూ.
తన్మయి నిశ్శబ్దంగా తలుపుతూ “ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు తాయిబా. ప్రభు స్వతహాగా చాలా మంచివాడు. వీళ్ళు రానంతవరకూ నన్ను ఎంతబాగా చూసేడో నువ్వూ చూసేవుగా. పైగా ఇప్పుడు నెల తప్పినట్లుంది. నేను ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా ఈ బిడ్డ కూడా తండ్రి లేని జీవితం గడపాలి. పైగా ఇద్దరు పిల్లల్ని ఒక్క దానినీ పెంచుకురాగలనా? అంతా అయోమయంగా ఉంది” అంది ఎన్ని రోజులు ఆలస్య మయ్యిందో లెక్కపెట్టుకుంటూ.
“అమ్మ ఎంత మంచి వార్త చెప్పినవు మేడం, ఇంకేం పరేషాని గాకు. అల్లా నిన్ను సల్లగ సూస్తడు. సారు గిట్ల నిన్ను మంచిగ సూసుకుంటడు. మన్మడో, మన్మరాలో అయితే మీ అత్తమామలు గిట్ల మారుతరులే తియ్యి” సంతోషంగా అంటూ తాయిబా “నడు, నేనొస్త సర్దనీకి. నువ్వు బరువులు గిట్ల మొయ్యనే గూడదు” అంది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.