దేవి చౌధురాణి
(మొదటి భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
కథా రంగం
ఈ కథ జరిగిన ప్రాంతము భౌగోళికముగా ఉత్తర బెంగాలు. ఇది బ్రహ్మపుత్ర, గంగా నదుల సంగమ ప్రాంతము. ఈ పెద్ద నదులే కాకుండా హిమాలయాల నుండి ప్రవిహించే తీస్తా, కర్ల, మహానంద, కరటొయ, నగర, తంగన్, జలధార, కల్యాణి వంటి ఉప నదులు, ఱుతుపవనాలతో ఉప్పొంగే ఇతర నదులతో కూడి దట్టమైన అడవులతో నిండి వుండేది. నేటి పశ్చిమ బెంగాలులోని ముర్షీదాబాద్, జలపాయగురి, కూచ్ బీహార్, వైకుంఠపురం అడవులు, బంగ్లాదేశ్ లోని రంగాపూర్, బోగ్ర, పావన, దినాజ్‌పూర్‌లతో కూడిన ప్రాంతం. ఈ కథలో ప్రస్తావించిన రంగాపుర్ ప్రస్తుతం బాంగ్లాదేశ్‌లో వున్నది. వివిధ నదులు, పాయలతో కూడిన ప్రాంతం అవ్వటం వలన పడవలు, నౌకలు ప్రయాణానికి రవాణాకు ముఖ్య సాధనములు. 1770ల కాలం నాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి వుండటం వలన భూ మార్గాలు అంతంత మాత్రమే. వర్షాకాలంలో నదులు ఉప్పొంగి వరదలు రావటం వలన రైతులకి వరి పంట చేతికందేది కాదు. కరువుకాటకాలతో నిండిన ప్రాంతం.
పౌరాణికంగా ఈ ప్రాంతానికి వరేంద్ర భూమి అని పేరు. రామాయణంలో వరేంద్ర భూమి ప్రసక్తి వున్నదని కూడా చెబుతారు. అలాగే చంద్రగుప్త మౌర్యిడి జన్మభూమిగా కూడా చెబుతారు.
1770లో జరిగిన “సన్యాసి విద్రోహ్” తరువాత రంగపూర్, దినాజ్‌పూర్‌లలో రెండు రైతు తిరుగుబాటులు జరిగాయి. మొదటిది 1782లోనూ, రెండవది 1783లోనూ జరిగాయి. వీటిని బెంగాలీలో “ధింగ్” అని ప్రస్తావించారు. ఈ తిరుగుబాటుల కారణాలూ, చరిత్రను కవిరాజ్ నరహరివిపులంగా చర్చించి, బ్రిటిష్ వారి రికార్డుల పరంగానూ, జానపద కథనా ల పరిశీలనతోను బ్రిటిష్ వారు, వారి బెంగాలి సేవకుల పైశాచికత్వాన్ని నిరూపించారు.
ఆ పుస్తకంలోని విశేషాలు క్లుప్తంగా –
ఉత్తర బెంగాలులో జమిందారీ వ్యవస్థ అక్బరు కాలం నుండి వుండేది. జమిందారు మొఘల్ ప్రభుత్వంలో ఒక బాధ్యత గల స్థానిక అధికారి. పన్నులు వసూలు చెయ్యటమే కాకుండా, సైన్య పోషణ, ప్రజా పాలన బాధ్యతలు కూడా వుండేవి. 1757లో పలాషీ యుద్ధం తరువాత బ్రిటిష్ వాళ్ళు ఉత్తర బెంగాలులో తామే పన్నులు వసూలు చెయ్యటం మొదలుపెట్టారు. అయితే వీరికి ఈ కొత్త ప్రదేశంలో పన్ను వసూళ్ళ వ్యవస్థ, అధికార వర్గం లేదు. అందుకని ఒకొక్క ప్రాంతంలో పన్నులు వసూలు చెయ్యటానికి వేలం పాట వేసారు. పాట పాడిన వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళు, వారి దేశీ సేవకులు వున్నారు. పాటదారు లకి ఆదాయం, లాభం మాత్రమే ముఖ్యం. ఆ ప్రదేశాలలోని ప్రజల బాగోగులు అనవసరం. లాభాపేక్షతో రైతులను పీడించి పన్నులు వసూలు చేసారు. దీనితో జమిందారి వ్యవస్థ క్షీణించటం మొదలయ్యింది.
ప్రజల ఫిర్యాదులు, అర్జీలు ఎక్కువైన తరువాత కలకత్తాలోని కంపెనీ వారు కమిషన్లు వేసి 1765 అమీల్దారి వ్యవస్థను ప్రవేసపెట్టరు. అమీల్దారి ప్రకారం కంపెనీ వారు మహమ్మద్ రెజా ఖాన్ అనే వాడిని దివానుగా నియమించి, వాడికి ప్రతినిధిగా ఒకొక్క ప్రాంతాంలో అమీల్, తహసీల్దారులతో పన్ను వసూళ్ళ వ్యవస్థను ప్రకటించారు. వీరందరికీ కంపెనీ వాళ్ళు పన్నుల కోటాలు ప్రకటించారు. వీరెవరికి ప్రజల బాగోగులు పట్టలేదు. అత్యంత కౄరంగా రైతులను, శ్రామికులను హింసించి అధిక పన్నులు వసూలు చేసారు. వారి హింసలకు బెంగాలులోని మూడవ వంతు జనాభా మరణించిది. చాలా మంది ప్రజలు హింసలను తట్టుకోలేక ఇళ్ళు వదిలి అడవులకు పారిపోయారు. ఈ పరిస్థితులలో దుక్కి దున్నేవాళ్ళు లేక పొలాలన్నీ బీడులయ్యాయి. విశ్వ విఖ్యాతమైన నేత పరిశ్రమ కూలబడింది. గ్రామ వ్యవస్థ కుప్పకూలింది. ఈ విషయాన్ని అప్పటి Governor Harry Verelst, January, 1767 లో వ్రాసిన నివేదికలో ”there had been oppressions and intrigue unknown at any other period” అని ఒప్పుకున్నాడు. ఆ తరువాతి సంవత్సరాలలో ఋతుపవనాలు సరిగా లేక వర్షాభావ స్థితి ఏర్పడింది. అప్పటికే చితికిన గ్రామీణ వ్యవస్థ పూర్తిగా క్షీణించిది. అయినా బ్రిటిష్ వాళ్ళు పన్నుల కోటాను పెంచారు. 1770ల కాలం నాటికి భరించలేని కరవు ఏర్పడింది. కరువ వచ్చిన 1771లోని రాబడి 1768లోని పన్నుల రూపేణా వచ్చిన రాబడి కన్నా ఎక్కువ అని కంపెనీ వాళ్ళు ఇంగ్లాండులోని తమ కంపెనీ డైరెక్టర్లకు ఇచ్చిన నివేదికలో గర్వంగా ప్రకటించు కున్నారు. ఇది సన్యాసి విద్రోహ్‌కి దారి తీసిన పరిస్థితులు. ఇది బంకిమచంద్ర గారి “ఆనందమఠం” నవలకు కథా రంగం.
1771 కాలం నాటికి బెంగాలు జనాభా మూడవ వంతు క్షీణించింది. రైతులు లేక వ్యవసాయ భూములన్నీ బీడులయ్యాయి. బెంగాలులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇంగ్లీషు అధికారుల నుండి, రాబోయే సంవత్సరంలో రాబడి తగ్గుతుందని నివేదికలు అందిన తరువాత కలకత్తా లోని గవర్నర్ Warren Hastings వ్యవసాయ విధానమును మార్చటానికి ఇంకొక క్రొత్త విధానం ప్రవేశ పెట్టాడు. ఇది Five Year Settlement Act. ఈ విధానం ప్రకారం భూములన్నీ కంపెనీ వారివే. పన్నుల వసూళ్ళకు ఒకొక్క ప్రదేశాన్ని ఐదు సంవత్సారాలకు వేలం వేసారు. పాడుకున్నవారు ఎక్కువగా బ్రిటిష్ వారికి కొమ్ము కాస్తున్న కలకత్తాలోని వ్యాపారులు. వారికెవ్వరికీ రైతులు, గ్రామీణ వ్యవస్థ మీద ఆసక్తి లేదు, లాభం మాత్రమే ముఖ్యం. ఇది కేవలం ఐరోపాలోని Rack-Renting విధానాన్ని పోలి వుంది. ఈ విధానం ప్రకారం భూమి మీద హక్కు, దాని పై వచ్చే పంట అన్నీ పాట దారుకే చెందుతాయి. Rack-Renting విధానము అనగా కౌలు కట్టలేని రైతుని ఒక బల్ల పై పడుకోబెట్టి చేతులకు కాళ్ళకు గిలకల పై నుండి తాళ్ళుకట్టి, ఆ గిలకలను తిప్పుతూ, కాళ్ళూ చేతులు లాగుతూ హింసించటం. ఆ Rack-Renting ప్రకారం రైతులని హింసించ టానికి కంపెనీవాళ్ళు సమ్మతించారు. కౌలు, పన్నులు కట్టని లేక కట్టలేని రైతులని ఆనాటి బెంగాలులోని పాటదారులు గ్రామీణులని కంపెనీ సమ్మతితోనూ, ప్రోత్సాహం తోనూ చిత్ర హింసలకు గురి చేసారు.
ఇవి కాక 1780ల కాలం నాటికి ఇంకా అనేక రకాలైన పన్నులను, పన్ను పై పన్నులను విధించారు. వాటిలో ముఖ్యమైనవి హస్తాబంది, రుసుం, హందియ, ఫెరారి, కర్తానీ, సెవానీ, దీరిన్-విల్లా, బత్తా మొదైలైనవి. ఆ పైన కంపెనీ వాళ్ళు ఈ సుంకాలన్నీ బెంగాలులో అప్పటికే వాడుకలో వున్న నారాయాణీ రూపాయలు కాకుండా, ఫ్రెంచి ఆర్కాటు రూపాయలలో చెల్లించాలి అని నిర్ణయించారు. నారాయాణి రూపాయల కన్నా ఫ్రెంచి ఆర్కాటు రుపాయల విలువ 14% ఎక్కువ. చెల్లించని వారిని హింసించే హక్కు పాటదారులకు వుంది. పాటదారుల దగ్గర నుండి సుంకాలని ప్రోగు చేసే పని Tax Collector ది. పాటదారులను, Tax Collector కు కొమ్ము కాసే పని కంపెనీ సైనికులది.
కథలోని కుటుంబ నేపథ్యం/వ్యవస్థ
ఈ కథలోని కుటంబ నేపథ్యం ఒక కులీన బ్రాహ్మణ కుటుంబం. కులీనులు అనగా ఉత్తములు, శ్రేష్ఠులు అనే అర్థముంది. వీరిని కులీనులు అనటానికి కారణం 11వ శతాబ్దములొ వంగదేశపు రాజు ఆదిసురుడు తన రాజ్యంలో వేద జ్ణానమున్న బ్రాహ్మణు లు కరువయ్యారనే ఆలోచనతో కన్యాకుబ్జం నుండి ఐదు బ్రాహ్మణ కుటుంబాలని తన వద్దకు రప్పించుకున్నాడు. ఆ ఐదు కుటుంబాల వాళ్ళు తాము అప్పటికి వంగ దేశంలో వున్న బ్రాహ్మణులకంటే ఉత్తములు, శ్రేష్ఠులు అని ప్రకటించుకుని కులీనులు అనే శాఖను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఐదు కుటంబాలు ఛటర్జీ, ముఖర్జీ, బెనర్జీ, గంగూలీ, భట్టాచార్జీలు.
1700ల కాలం నాటికి ఈ కులీన బ్రాహ్మణ కుటుంబాలు విద్యాధికత వలన, అప్పటికే తాము పాలకవర్గానకి చేరువవ్వటం వలన ముస్లిం పాలనలోనే ధనికులుగా, భూస్వాములుగా స్థిరపడ్డారు. బెంగాలులో ముస్లిం పాలకులు పరాజయం పొంది ఇంగ్లీషువాళ్ళు పాలకులవుతున్నప్పుడు ఈ భూస్వామి వర్గం జమీందారులుగా వున్నారు. జమీందారు అనగా, జమీందారి క్రింద వున్న భూమి నుండి ఇంగ్లీషు పాలకులకి పన్ను రూపేణా ఎంత చెల్లించాలనేది ఇంగ్లీషు వాడు నిర్ణయిస్తే అది చెల్లించేవారు. మిగిలిన ప్రజలు కర్షకులూ, కార్మికులు మాత్రమే. ఇంగ్లీషు వాళ్ళు ఆ తరువాత జమీందారీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన విధానం వేలంపాట. అనగా, ఎవరు ఎక్కువ పన్ను కట్టటానికి పాట పాడితే, ఆ ప్రాంత భూమి పై అధికారం వాళ్ళకి ఇవ్వబడేది. ఈ జమీందారీల పై అధికారం కొన్ని చోట్ల జాగీరుదారుకి వుండేది. కొన్ని జమిందారీలు కలిపి ఒక జాగీరుదారు ఉండేవాడు. ఆ తరువాత ఇంగ్లీషు ప్రభుత్వ ప్రతినిధి కలక్టరు అనగా Tax Collectorని నియమించి ఈ జమీందారుల వద్ద పన్ను వసూలుకు పంపేవారు. ఆ తరువాత 1793లో ఇంగ్లీషు వాళ్ళు ప్రవేశపెట్టినది Permanent Settlement Act. ఈ అన్ని వ్యవస్థలలో విహీనమయినది మాత్రం కర్షక కార్మిక వర్గం.
ఆ నాటి వ్యవస్థలో బెంగాలీ కులీన బ్రాహ్మలు జమిందారీలు. ఈ జమీందారి వ్యవస్థ మొఘలుల కాలం నాటి నుండీ వుండేది. అయితే వారి కాలంలో జమీందారులు పలు రకాలు. కొంత మందికి భూమి మీద అధికారం మాత్రమే వుండేది. వారు కట్టవలసిన పన్ను వారి ఆదాయంలో షుమారు 30% శాతం. మరి కొందరు జమీందార్లకు ఒక సైన్యపు దళాన్ని పోషించి రాజుల యుద్ధావసరాలకు సమకూర్చవలసిన బాధ్యత వుండేది. వారికి పన్ను షుమారు 10%. జమిందారులకు సైన్యాన్ని సమకూర్చే భాద్యతని ఇంగ్లీషువాళ్ళు తొలగించారు. దీనికి ఒక ముఖ్య కారణం 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు కావచ్చు.
చతురంగ బలాలను పోషించే జమీందారులు చౌధరులు. బెంగాల్ ప్రాంతం అనేకమైన నదులు, దట్టమైన అడవులతో కూడి వుండటం వలన వారు చతురంగ బలాల్లో రథ బలం తీసివేసి నౌకా బలాన్ని చేర్చారు. కానీ 1770ల కాలం నాటికే చౌధరి అనేది భూస్వామి వర్గానికి ఒక గౌరవవాచకంగా మాత్రమే నిలచింది. “దేవి చౌధురాణి” అని ఈ రచనకు బంకిమచంద్ర గారు పేరు పెట్టటంతో నాయిక చతురంగ బలాలకు నాయకత్వం వహించటంతో చౌధురాణి పేరును సార్ధకం చేసారు.
బంకిమగారు ఈ కులీన వర్గానికి చెందిన వారే. అయితే ఆయన తార్కికుడు. ఆ నాటికే కులీన వ్యవస్థలో పేరుకుపోయిన దురాచారలను గర్హించిన వారు అవటం వలన, ఆ కులీన వ్యవస్థలోని దురాచారాలను కూడా ఈ నవలలో పొందుపరిచారు. . ఉదాహరణ కు బహు భార్యాత్వం. ఆ నాటి కులీనులు ఆస్తులు పోగేసుకోవటానికి అనేకమైన వివాహాలు చేసుకునేవారట. అలాగే, ఆ నాటికి బ్రాహ్మణ స్త్రీలు కూడా నిరక్ష్యరాసులని చెప్పటం, కులీన బ్రాహ్మల అసూయలతో, అనవసరపు పితలాటకలతో కాపురాలు కూల్చటమూ కూడా ఈ కథలో పొందు పరిచారు.
జయ దుర్గా దేవి చారిత్రకత
బ్రిటిష్ పాలకుల దుర్మార్గాలు ఎన్నన్నా చెప్పవచ్చు. కానీ, రికార్డులు రాయటంలోనూ, భద్ర పరచటంలో మాత్రం వాళ్ళని మెచ్చుకోక తప్పదు. ఈ రికార్డులని శోధించి, పరిశీలించి చారిత్రకంగా జయ దుర్గా దేవి జీవితం గురించి గౌతం కుమార్ దాస్ గారు “Bangladesh e-Journal of Sociology. Volume 15, Number 2. July 2018 “లో “A Review of Past Presence of Debi Chowdhurani and the then Societal Structures of Rangpur, Bangladesh” అనే వ్యాసం ప్రచురించారు. అందులోని ముఖ్య అంశాలతో కూడిన జయ దుర్గా దేవి చౌధురాణి చరిత్ర ఈ విధంగా వుంది.
రంగపూర్ నేటి బంగ్లాదేశ్‌లో వున్నది. ఉత్తర బాంగ్లాదేశ్‌లో, భారత దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉన్నది. ఇది రంగపూర్ జిల్లాకు కేంద్రం. బ్రిటిష్ వారు ఏర్పరిచిన రంగపూర్ జిల్లాలో 75 జమిందారీలు వుండేవి. ఇక్కడ రంగం అనగా విలాసరంగము. కురుక్షేత్ర యుద్ధములో దుర్యోధనుడికి వెనుకగా బారీ సైన్యంతో నడచిన ప్రాగ్‌జ్యోతిష్‌పు రం రాజు భాగదత్తుడికి ఇక్కడ ఒక విలాస మందిరం వుండేదని, అందుకని ఈ ఊరికి రంగపూర్ అని పేరు వచ్చిందని అంటారు. రంగపూర్‌కి 30కి.మి. ఉత్తరాన మంథన వున్నది. 1765లో కంపెని వాళ్ళు “John Grose” అనే వాడిని ఈ ప్రాంతానికి అధికారిగా నియమిస్తే, 1769 నుండి అధికారపు రికార్డులు బధ్రపరచటం మొదలుపెట్టారు. ఆ నాటి రికార్డులు ప్రకారం “దేవి చౌధురాణి” పేరుతో 12మంది వున్నారు. అందులో ముగ్గురు “జయ దుర్గా దేవి చౌధురాణి”లు. “రాయ్, చౌధరి” అనేది ఆనాటి బెంగాల్ జమిందార్లు తమ హోదాను తెలియ చేస్తూ పేర్లుకు చివర పెట్టుకునే గౌరవ వాచకం. చౌధరి గారి భార్య చౌధురాణి. మరి ఈ 12మంది దేవి చుధురాణిలలో బంకిమ నవలలోని నాయిక ఎవరు అనేది బ్రిటిష్ వాళ్ళ రికార్డులలో లేదు.
ఈ ప్రశ్నకు సమాధానం రంగపూర్‌కి దక్షిణాన వున్న ఐటాకుమారి సంస్థానానికి చెందిన రతిరాం దాస్ అనే రాజబన్షి (రాజవంశీ) “జాగేర్ గాన్” (జాగృతి గానం)లో పొందు పరిచాడు. రాజవంశీ అనేది ఒక కులం, వారి వృత్తి రాజులు, జమీందారులు ఇతర ఉన్నత వర్గాల వారి వంశ చరిత్రను, వంశ పరంపరను గానంతో పొందుపరచటం.
దేవి సింగ్ అనేవాడు ఇంగ్లీషువాళ్ళ దగ్గర రంగపూర్ ప్రాంతంలో పన్ను వసూలు చేయటానికి అధికారం పొందాడు. దేవి సింగ్ మరియు అతని సహాయకుడు హర్రాం సేన్ రైతులు, సామాన్యులను అధికమైన పన్నులుతో పీడించటమే కాకుండా, కచేరీకి పిలిపించి భర్తల ఎదుట వారి భార్యలను చెరచటం, వారి పిల్లలను హింసించటం వంటి దుర్మార్గాలకు పాలుబడ్డాడు. వీడి దురాగతాలను ఎదుర్కోవటానికి షుమారు 1783 కాలంలో రంగపూర్ ప్రాంతలోని జమిందారులు అందరూ ఐటాకుమారి జమిందారు శివచంద్ర రాయ్ భవనంలో సమావేశం అయ్యారు. ఇది 1783లో దేవి సింగ్ పైన జరిగిన రైతుల తిరుగుబాటుకి పూర్వ రంగం. ఆ సమావేశాన్ని రతికుమార్ దాస్ అనే రాజవంశీ దృష్టాంతముగా కూర్చి, పాడిన జాగేర్ గాన్‌లోని కథనం ప్రకారం
“ఒకరి తరువాత ఒకరు జమిందారులు వచ్చారు
నగరం అంతా వారి గజ అశ్వ పదాతి దళాలతో నిండింది
పీర్‌గాష జమిందారు జయ దుర్గ దేవి కూడా వచ్చింది
జమిందారులందరూ గుడి ప్రక్కని సమావేశ మందిరంలో కూడారు
ఒకరొకరు జమిందారులందరూ ఆశీనులయ్యారు
పస్తులతో ఎముకల గూళ్ళయ్యి
కట్టుబట్టలు కరువై తోలుకప్పుతో
రైతులు చేతులు కట్టుకుని నిలబడి
గుండెల పై కన్నీరు కారుస్తున్నారు”
ఇక్కడ ప్రస్తావించిన పీర్‌గాష అనేది మంథనకు ఇంకొక పేరు.
రతిరాం దాస్ ఆ తరువాత సమావేశ విశేషాలు నమోదు చేసిన గానంలో –
“శివచంద్ర రాయ్ నిగ్రహం కోల్పోయాడు
ఆ దుర్మార్గపు రాజపుత్రుడు ఒట్టి దొంగ
వాడిని మీరందరూ తరిమెయ్యండి అని అరిచాడు
అది వింటూనే జయ దుర్గా దేవి పౌరుషంగా
మీలో మగవాళ్ళు లేరా, మీకు బలం లేదా
నాది ఆడజన్మ, అయినా సరే
వాడిని పట్టి నా కత్తితో ముక్కలు చేస్తాను
నాకు మీ ఎవ్వరి అవసరం లేదు
నా అనుచరులే నాకు సహాయం చేస్తారు”
ఇక్కడ ప్రస్తావించిన రాజపుత్రుడు దేవి సింగ్.
ఈ రాజవంశీ గానంలో మొదటగా మంథన లేక పీర్గాచ జమిందారిణి జయ దుర్గా దేవిగా గుర్తించబడింది. ఆ తరువాత తన పౌరషంతో, స్థిర నిశ్చయంతో దేవీ సింగ్‌ను తన కత్తికి బలి చేస్తాను అని చెప్పి, ఆ ప్రాంతపు ప్రజలు నేటికీ కొలుస్తున్న, బంకిమ కథా నాయిక దేవి చౌధురాణిగా నిర్ధారించవచ్చు.
*****
(సశేషం)
విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.