అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 17
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళికాగానే, పెర్మనెంట్రెసిడెంట్స్గాఆస్ట్రేలియా వెడతారు. గోపీ ఇంట్లోప్రస్తుతం పేయింగ్గెస్ట్గాఉంటున్నారు. గోపీ ఇండియా నుంచి తిరిగివస్తాడు. విశాల, విష్ణు ఇద్దరూ జాబ్ మొదలు పెట్టారు. ఇల్లు చూసుకుని సామాన్తో అద్దెఇంట్లోకి మారదామని నిర్ణయించుకున్నారు.
***
జీవితంలో ముందుకు సాగాలంటే నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి. ఎవరోవచ్చి, ఏదో చేస్తారు అనే భ్రమలో బ్రతికే కన్నా, నువ్వున్న పరిధిలో నీకు నువ్వు చేసుకోగలిగేది, నీ కుటుంబంలో సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతలు, చుట్టూ ఉన్న సమాజానికి మేలైన పనులు నిర్వర్తించగలగటం, నువ్వు దేశ పౌరునిగా ఉద్యోగిగా నిర్వర్తించే బాధ్యతలు, సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోగలిగే నేర్పు, కష్ట సమయంలో ఓర్పు, దీక్ష, నిరంతర పరిశ్రమ ఇవ్వన్నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నిర్దేశిక సూత్రాలు.
రవి కారులో రాగానే, విష్ణు సూట్ కేసులు, ఇతర లగేజి కారు బూటులో సర్దాడు. విశాల విష్ణుని అనుసరించి వెనుక సీటులో వాణి ప్రక్కన కూర్చుంది. విష్ణు వెనక్కి వెళ్ళి, గోపీకి బై చెప్పి తిరిగి కారులో రవి ప్రక్కన కూర్చున్నాడు. రవికి ఇంటి అడ్రస్ చెప్పగానే, అందరూ అక్కడి నుంచి బయలుదేరారు.
పదినిమిషాలలోనే అందరూ సెవెన్ హిల్స్ అపార్ట్ మెంట్స్ దగ్గరికి చేరుకున్నారు. ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్స్ అది. విష్ణు తీసుకున్న అపార్ట్ మెంట్ మొదటి ఫ్లోర్ లో ఉంది. కారు పార్కింగ్ షెడ్ లో పెట్టగానే, వాణి సెపరేట్ గా తను తెచ్చుకున్న బాగ్ తీసుకుంది. అంతా మెట్లు ఎక్కి మొదటి ఫ్లోర్ చేరుకున్నారు. విష్ణు తాళాలు తీసుకుని ఏడవ నెంబర్ ఉన్న యూనిట్ దగ్గర ఆగాడు. తలుపు ఓపెన్ చేయగానే, వాణి ముందుకు
వచ్చి విశాల, విష్ణులను ప్రక్క ప్రక్కనే నుంచోమంది. విశాల చేతిలో పార్వతి, పరమేశ్వరు ల ఫోటో పెట్టి, కుడికాలుతో ఇంట్లోకి ముందు అడుగు పెట్టమంది.
విశాల, విష్ణు నవ్వుతూ ఒకేసారి వారు మొట్ట మొదటగా ఏర్పరుచుకున్న గూటిలోనికి కాలు మోపారు. విశాల శివ, పార్వతుల ఫోటోని హాలులో ఒక ప్రక్క గోడకి సెంటర్ లో పెట్టి, నమస్కరించుకుంది.
హాలు ప్రక్కనే కిచెన్ ఆనుకుని ఉంది. కిచెన్ లో ఎలక్ట్రిక్ స్టవ్, నాలుగు బర్నర్స్ తో ఉంది. ప్రక్కనే చిన్న ఫ్రిజ్. మరో వైపు వాష్ బేసిన్. హాల్ కి రెండో వైపు సింగిల్ బెడ్ రూమ్ విత్ ఎటాచ్ డ్ బాత్ అండ్ టాయ్ లెట్. బెడ్ రూమ్ లో అద్దాల స్లైడింగ్ డోర్ తో ఉన్న బిల్ట్ ఇన్ కప్ బోర్డ్. హాల్ బయట చిన్న బాల్కనీ. విశాల మొదటిసారి ఈ ఇంటిని
చూస్తోంది కాబట్టి ఒకసారి ఇంటి పరిసరాన్ని సంతృప్తికరంగా చూసుకుంది. ఒక జంటకి తగినట్లుగా ఆ యూనిట్ సింపుల్ గా ఉంది. ఇంట్లో పెద్ద కింగ్ సైజ్ మంచము, హాలులో సోఫా ఉన్నాయి.
రవి, విష్ణు సాయి కారు దగ్గరకు సామాను తీసుకురావడానికి వెళ్ళారు. వాణి కిచెన్ లో తను తెచ్చిన బాగ్ లోంచి పాల సీసా, స్టీల్ గిన్నె బయటికి తీసింది. గిన్నెలోకి పాలు పోసి స్టవ్ మీద పెట్టింది.
“అక్కా! మీకు భలే ముందు చూపు ఉంది. పాలు తీసుకువచ్చారు”. అంది విశాల.
“ఈ రోజు స్వప్నని ఆయన స్కూల్ లో దింపేసారు కాబట్టి నేను రిలాక్స్ డ్ గా అన్ని బ్యాగ్ లో సర్దాను. మీరు మొదటిసారి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇల్లు ఏర్పరుచు కుంటున్నా రు. పాలు పొంగించుకోవడం శుభచిహ్నం కదా!” అంది వాణి.
“నాకు అక్క లేని లోటు తీర్చారు. నేను ఇక్కడకు వచ్చే ముందు చాలా బెంగ
పడ్డాను, అందర్నీ వదిలి వచ్చేస్తున్నందుకు. కానీ మీ పరిచయం వల్ల నాకు ఆ బెంగ తీరింది. అవసరానికి భగవంతుడు పంపిన మా మంచి అక్కయ్య” అంది వాణిని చూస్తూ.
విష్ణు, రవి అన్ని పెట్టెలు, మరో పెద్ద అట్ట పెట్టె తీసుకుని లోపలికి వచ్చారు.
విశాల అన్ని సామాన్లు చూసుకుని, “అవును ఆ అట్ట పెట్టె ఏమిటి? మేము తీసుకు రాలేదు కదా?” అంది.
రవి, వాణీ ఇద్దరూ ఆ అట్టెపెట్టె లోంచి పాక్ చేయబడిన ఆరు గిన్నెల స్టీల్ కుకింగ్ సెట్ ఇద్దరి చేతిలో కంగ్రాట్యులేషన్స్ అని పెట్టారు.
ఊహించని ఆ కానుకను చూసి విష్ణు వెంటనే “అరె! రవిగారు ఏమిటి ఇంత ఖరీదైన కానుక. మేము ఇండియా నుంచి కొరియర్ లో స్టీల్ గిన్నెలు తెప్పించుకుంటున్నాము అన్నాడు మొహమాటపడుతూ.
“ఫర్వాలేదు! ఇపుడు మీకు ఇవి అవసరం కదా అని తీసుకున్నాము. ఇది మీ న్యూ
మారీడ్ లైఫ్ కి గుర్తుగా మీకు మేమిస్తున్న కానుక అనుకోండి” అన్నాడు రవి చిరునవ్వుతో.
“ అవును మన వంటలకి తగ్గట్టుగా స్టీల్ గిన్నెలు మీకు ఎక్కడ దొరికాయి?” అంది విశాల.
“ఇక్కడ మయ్యర్స్ లో ఒక్కోసారి డీల్స్ లో దొరుకుతాయి. నేను చూడగానే తీసేసు కున్నాను” అంది వాణి.
రవి కోట్లకు పడగలెత్తినా, అతనిలో అరుదైన గుణం మనిషికి, మాటకి , గుణానికి
ఎంతో విలువనిస్తాడు. తనకు నచ్చితే డబ్బుకి వెనుకంజ వేయకుండా అవసరమైనపుడు వెన్నంటి ఉంటాడు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే సుగుణస్వభావి.
వాళ్ళిద్దరూ ఇపుడే ఆస్ట్రేలియాలో అడుగిడినా కానీ, ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి నపుడు, పాపకి ఫెరరో రోచై చాక్లెట్స్ చేతిలో పెట్టి, ఏ కల్మషం లేకుండా గల గల మాట్లాడిన విశాల రవి, వాణీలని ఆకట్టుకుంది. చిన్న చిన్న తీపి గురుతులు భవిష్యత్తులో స్నేహబంధం పటిష్ఠం చేస్తాయి. ఇపుడు అదే ఆ ఇరువురి కుటుంబాల మధ్య పెన వేసుకున్న అనుబంధం.
ఇంతలో స్టవ్ పై పాలు పొంగుతున్నపుడు కాస్త బియ్యంతో అన్నం పరమాన్నం చేసి వాణి, విశాల దేవుడికి నైవేద్యం పెట్టారు.
“విశాలా! ఈ ఎలక్ట్రిక్ స్టవ్ తో వంట చేసేటపుడు జాగ్రత్త. మన ఇండియన్ కుకింగ్ కి నాకైతే గాస్ స్టవ్ ఈస్ బెస్ట్ అంటాను. ఎలక్ట్రిక్ స్టవ్ వెంటనే వేడెక్కదు. తరువాత మనం స్విచ్ ఆఫ్ చేసినా కొంతసేపటి వరకు పూర్తిగా వేడి ఆగదు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో
మేము ఉన్న ఇంటిలో ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట అంటే గాభరా వచ్చేది. నేను ఒకసారి స్టవ్ మీద పెసరపప్పు పెట్టాను. స్టీల్ గిన్నెలో నా లెక్క ప్రకారం పది నిమిషాలు అనుకున్నా ను. స్టవ్ ఆపినా గాని ఎక్కువ వేడి వల్ల పెసరపప్పు కాస్త గట్టిగా ఐపోయింది. అందుకని తగినంత నీళ్ళు, మీడియం టెంపరేచర్ ఉండేటట్లు చూసుకోవాలి. గిన్నెని స్టవ్ మీద నుంచి వెంటనే తీసెయ్యి.” అని కొన్ని కిటుకులు చెప్పింది వాణీ.
కాసేపు రెండు జంటలు కబుర్లు చెప్పుకుని, వాణీ, రవి మళ్ళీ కలుద్దాం, ఏమైనా
సాయం కావాలంటే అడగండి అని చెప్పి ఇద్దరూ వెనుదిరిగారు.
“ఎలా ఉంది భార్యామణీ, ఇల్లు? నువ్వు ఊ అనకుండానే నేను ఓకే చేసేసాను. నీకు నచ్చిందా? మీ ఇంట్లో లాగా ఇది పెద్ద భవంతి కాదనుకో!” అన్నాడు విష్ణు.
“భలేవారే! సమయానికి మీరు తీసుకున్న ద బెస్ట్ డెసిషన్. బ్రహ్మాండంగా ఉంది. ఇండియాకి, ఇక్కడకు నేను కొన్ని విషయాలలో లింకు పెట్టడం లేదు. సింప్లిసిటీ ఈస్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్!” అంది విశాల .
ఇద్దరూ చకచక సూట్ కేస్ లో బట్టలన్నీ వార్డ్ రోబ్ లో సర్దేసారు. ఇంటికి నడిచే దూరంలోనే గణపతి ఇండియన్ గ్రోసరీ స్టోర్, నాలుగు అడుగులు వేస్తే ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్ ఉన్నాయి. విశాల, విష్ణు ఇద్దరూ కావలసిన కూరలు, గ్రోసరీస్ కొనుక్కుని వచ్చారు.
“ఇంట్లో మైక్రోఓవెన్ కూడా ఉంది విశాలా, చూసావా?” అన్నాడు విష్ణు.
మెల్లిగా ఇవన్నీ జాగ్రత్తగా వాడటం అలవాటు చేసుకోవాలి. అంది విశాల, అక్కడ ఉన్న మైక్రో వేవ్ ఇన్ స్ట్రక్షన్ మేన్యువల్ తిరగేసింది. “ఏమండీ! ఇందులో వండాలంటే మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్స్ సెపరేట్ గా కొనాలి. టెంపరేచర్ జాగ్రత్తగా చూసి టైమర్ పెట్టాలి. ఇందులో అప్పడాలు, పల్లీలు నూనె లేకుండానే ఆయిల్ లెస్ గా ఫ్రై ఔతాయి” అని విష్ణుతో చెప్పింది.
“అన్నం, కేరట్ కూర, ముద్ద పప్పు, టొమాటో చారు మొదటిసారిగా మన ఇంట్లో చేసిన థాలీ ఆరగించండి మహాశయా!” అంటూ విశాల ఇద్దరికీ ప్లేట్లలో భోజనం వడ్డించింది.
మాంచి ఆకలి మీద ఉన్నాడేమో విష్ణు ఆవురావురు మని అన్ని ఆథరవులు
“అమోఘం!” అంటూ ఆరగించాడు. “మన ఇంట్లో నువ్వు చేసిన ఈ మొదటి వంట
ఎప్పటికీ గుర్తుంటుంది విశాలా!” అన్నాడు విష్ణు.
“రేపు మనం ఇద్దరం ఎర్లీగా లేవాలి, నువ్వు లేవగానే నన్ను నిద్ర లేపు విశాలా!” అంటూ విష్ణు చెప్పాడు.
విశాల ఉదయం లేస్తూనే తను కూడా తెచ్చుకున్న రెండు చిన్న వెండి దీపపు కుందెలని బయటకి తీసి, దేముడి పటం ముందు నేతితో దీపం వెలిగించి నమస్కరిం చింది.
బ్రెడ్, బటర్ బ్రేక్ ఫాస్ట్ చేసి, లంచ్ కి అన్నం, కూర బాక్స్ లో సర్దేసింది. ఇద్దరూ ట్రైన్ లో వర్క్ కి బయలుదేరారు.
సాయంత్రం ఇద్దరూ వర్క్ పూర్తి చేసుకుని స్టేషన్ దగ్గర కలుసుకున్నారు.
విష్ణుని చూడగానే విశాల అంది, “ఈ రోజు స్పెషల్ ఏమిటో గెస్ చేసారా? నా ఫస్ట్ జీతం బ్యాంక్ లో పడుతుంది. చెక్ చేద్దామా? ఇండియాలో కాకుండా ఇక్కడ డాలర్స్ లో నా మొదటి సంపాదన అంది” ఎక్సైటింగ్ గా విశాల.
వావ్! కంగ్రాట్యులేషన్స్, విశాలా! ఇక్కడ ఆటో బ్యాంక్ లో చెక్ చేద్దాం అని కార్డ్ మెషీన్ లో పెట్టి విశాలకి సేవింగ్స్ అకౌంట్ చూపించాడు.
విశాల ఆనందంగా “లెట్స్ హేవ్ ఎ కప్ ఆఫ్ కాఫీ” అని అక్కడ గ్లోరియా జీన్స్ కాఫీ షాప్ లో కెపాచినో ఆర్డర్ చేసింది. విశాల, విష్ణు ఇంటికి చేరాకున్నారు.
విష్ణు విశాలను చూస్తూ, “మన దూరాభారాలు, నడకలు, ఈ రైలు ప్రయాణము
తప్పాలంటే కిం కర్తవ్యం నేను లైసెన్స్ తెచ్చుకోవాలి. ఈ రోజే డ్రైవింగ్ లెసెన్స్ మొదలెడుతున్నాను. ఇంకో అరగంటలో కరణ్ వస్తున్నాడు” అని చెప్పాడు విష్ణు.
గుడ్ లక్ అని చెప్పింది విశాల.
అనుకున్నట్లుగా విష్ణు డ్రైవింగ్ లెసన్స్ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఒక ప్రెస్టీజ్ డ్రైవింగ్ స్కూల్ బోర్డ్ తో నీలం కారు అపార్ట్ మెంట్ డ్రైవ్ వే దగ్గిర ఆగింది.
విష్ణు ముందుకు వెళ్ళి, హాయ్, ఈస్ ఇట్ కరణ్? అని అడిగాడు. యస్, అయామ్ యువర్ ఇన్ స్ట్రక్టర్ కరణ్, ప్లీస్ కమిన్ అన్నాడు.
హాయ్ అయామ్, విష్ణు అంటూ కారు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. కరణ్ కి తన లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లాగ్ బుక్ చూపించాడు. కరణ్ లైసెన్స్ చూసి లాగ్ బుక్ లో సంతకం చేసాడు.
విష్ణు కారుని చూసాడు. ఇన్ స్ట్రక్టర్ సీటు దగ్గర మరొక బ్రేక్, మిర్రర్ లో మరొక చిన్న మిర్రర్ ఉన్నాయి.
కరణ్ విష్ణుని అడిగాను భారత దేశంలో కారు నడిపారా? లేదు.
నేను ఇంతవరకు కారు నడపలేదు.
ఓ, మోటార్ సైకిల్ నడిపారా
మోటార్ సైకిల్ నడిపాను
ఎబిసి రూల్ ఫర్ డ్రైవింగ్ అని చెప్తూ
ఎ – ఆక్సిలరేటర్
బి – బ్రేక్
సి- క్లచ్
ఎడమకాలు రెస్టింగ్ పొజిషన్ లో ఉండాలి
చెకింగ్ బ్లైండ్ స్పాట్స్
కనీసం మూడు సెకన్ల ముందు కారుకి దూరంగా ఉండాలి. స్కూల్ జోన్ లో ఉదయం 9.30am-4.30pm స్పీడ్ 40km/h మించరాదు. ఇలా ముందు బేసిక్ రూల్స్, గైడ్ లైన్స్ కరణ్ విష్ణుకి వివరించాడు. డ్రైవింగ్ వీల్ ఆటో స్టీరింగ్ గురించి చెప్పి మిర్రర్స్, సీట్ adjust చేసుకోవటం చూపించాడు. మొదటగా పార్కింగ్ నుంచి డ్రైవింగ్ మోడ్ లో పెట్టి, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి, బ్లైండ్ స్పాట్ చెక్ చేయటం నేర్పాడు.
మెల్లిగా లెఫ్ట్, రైట్, స్ట్రైట్ చెప్పి ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అక్కడక్కడ పొజిషనింగ్ సరిగా లేనపుడు కరణ్ వీల్ తను పట్టుకుని అసిస్ట్ చేస్తున్నాడు. సరిగ్గా రౌండ్ అబౌట్ దగ్గిర అపుడే ఒక వెవికిల్ వస్తోంది, విష్ణు అది గమనించకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయబోయాడు. వెంటనే కరణ్ హాండ్ బ్రేక్ వేసి హెజార్డ్ తప్పించాడు. ఆ పరిణామానికి ఒక్కసారిగా విష్ణు ఒళ్ళు గగుర్పొడిచింది.
బి కేర్ ఫుల్ నెక్స్ట్ టైమ్ అని కరణ్ కాస్త సీరియస్ గా చెప్పాడు. అటు ఇటు రెండు వైపులా తల తిప్పి చూడాలి రౌండ్ అబౌట్స్, రైట్ టర్న్, గివ్ వే, స్టాప్ సైన్స్ దగ్గిర అని అన్నాడు కరణ్.
మొత్తానికి గంట సేపు ఎక్కువ రద్దీ లేని రోడ్లలో విష్ణు చేత డ్రైవింగ్ చేయించాడు
కరణ్.
మిగతా క్లాసులు వారంలో వివిధ సమయాలలో బుక్ చేసుకున్నాడు విష్ణు. లాగ్ బుక్ లో స్కూల్ సమయంలో, రాత్రి సమయంలో, ఒకరోజు విపరీతమైన వర్షం వస్తున్నపుడు డ్రైవింగ్ పట్టుదలగా నేర్చుకుంటున్నాడు విష్ణు. అయితే అదే సమయంలో డ్రైవింగ్ కోసం డబ్బులు కూడా బాగానే ఖర్చు అవుతున్నాయి.
“విశాలా! నువ్వేమనుకోనంటే నేను నీకు వచ్చిన మొదటి జీతం డ్రైవింగ్ లైసన్స్ కోసం తీసుకుంటాను” అన్నాడు విష్ణు తటపటాయిస్తూ.
విశాలా తనకు వచ్చిన మొదటి జీతం దేనికి వాడుకోవాలి అని లెక్కలు వేసుకుం టోంది.
విష్ణు నుంచి వచ్చిన ఊహించని ప్రశ్నకు ఏమనాలో విశాలకు తెలియలేదు.
“అవునా? ఎంత ఇవ్వాలి? మనం ఈ డ్రైవింగ్ లెసన్స్ కి మొత్తం ఒకేసారి కట్టాలా?” అని ప్రశ్నించింది విశాల.
ఆ మాటలకి విష్ణు మనసులో కాస్త చికాకు పడినా తమాయించుకుని,
చూడు, విశాలా! నీకైనా, నాకైనా ఈ డ్రైవింగ్ లెసన్స్, గెటింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఈస్ కంపల్సరీ. నువ్వు అది నెసిసరీ ఈవిల్ అనుకో, ఏదైనా అనుకో. బట్ దిస్ ఈస్ ఎన్ ఇన్ వెస్ట్ మెంట్ ఫర్ ద లైఫ్ ఎవర్, ఫరెవర్. డ్రైవింగ్ పర్ ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇట్ సేవ్స్ అవర్ లైవ్స్. ఆ మాటలకు బిత్తరపోయిన విశాల అతని ముఖ కవళికలని చూసి వెంటనే అంది.
“క్షణికంలో అన్న మాట. నన్ను క్షమించండి, మీరు చాలా లోతుగా ఆలోచించారు.
మీరు చెప్పినది అక్షరాలా నిజం. మీరు తప్పకుండా తీసుకోండి నా డబ్బు, మీ డబ్బు అనేమి లేదు. మనం ఇద్దరం జాయింట్ అకౌంట్ చేసుకుని, మన ఇంటి అవసరాలకు వాడుకుంటున్నాము.”
అప్పటికి వాతావరణం చల్లబడింది ఇద్దరు కలిసి భోజనం చేసారు. అవసర మైనపుడు డబ్బు అటు ఇటు రొటేషన్ చేయాలి తప్పదు. బయట ఎవరిని అడగకుండా నేను విశాలను అడగటంలో తప్పులేదు కదా అని మరోసారి మధన పడ్డాడు విష్ణు.
ఏదో మొదటిసారి నాకు వచ్చిన సేలరీ, సేవింగ్ చేసి ఏదో కొనుక్కోవాలి అని పిచ్చి పిచ్చి ఊహలలో ఉన్నాను. ఛీ, అనవసరంగా విష్ణు అడిగిన మాటకు వెంటనే అలాగే అని ఉంటే బాగుండేది. పాపిష్టి డాలర్ మా ఇద్దరి మధ్య సరిహద్దు రేఖ గీసిందా? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది విశాల.
విష్ణు మారిన ఈ ఇల్లు అవసరాలకు ఆదుకునే పెన్నిధిలా ఉన్నాగాని, ఇపుడిపుడే
ప్రారంభించిన క్రొత్త జీవితం ముదిరి పాకాన పడుతోంది. విశాల, విష్ణు ఇద్దరు వారి జాబ్ లకు కలిసి వెడతారు. విష్ణు ఇంటికి రాగానే డ్రైవింగ్ లెసన్స్ కి వెళ్ళటం, మళ్ళీ రేపు జాబ్ కి రెడీ అవ్వడం ఇలా రొటీన్ జీవితంలోకి ఇద్దరూ అలవాటు పడుతున్నారు. డ్రైవింగ్ కి అవుతున్న ఖర్చు మాట ఎలా ఉన్నాగానీ, విష్ణు తన బ్రెయిన్ లో ఉన్న కణాలన్నీ డ్రైవింగ్ కోసమే వెచ్చిస్తున్నాడు. దీనితో విశాల, విష్ణు మధ్య మాటలు తగ్గిపోయాయి.
డ్రైవింగ్ స్కిల్స్, టెక్నిక్స్ – త్రీ పాయింట్ టర్న్, రివర్స్ పార్కింగ్, పేర్లర్ పార్కింగ్, క్రెబ్ సైడ్ పార్కింగ్, లేన్ ఛేంజింగ్ ఇలా అన్నీ డ్రైవింగ్ టెస్ట్ లో పాసవ్వడానికి ఈ అంశాలపై పట్టు సాధించేందుకు విష్ణు, కరణ్ తో కలిసి కృషి చేస్తున్నాడు.
“ఎలా అవుతున్నాయి మీ డ్రైవింగ్ క్లాసులు” అని విశాల అడిగింది ఇంటికి
చేరుకున్న విష్ణుతో.
“ఆస్ట్రేలియా లో డ్రైవింగ్ ఒకందుకు సులభమే. భారతదేశంలోలాగ ఎడమవైపు చేస్తారు. పాపం అమెరికా వెళ్ళిన భారతీయులకు కుడివైపు డ్రైవింగ్ కి అలవాటు పడటం కష్ఠమే కదా! కవి ఈ విషయంలో తన పదాలు మార్చుకోవాల్సి ఉంటుంది, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనటం సరి కాదు కదా” అని నవ్వుతూ విష్ణు అన్నాడు.
“ఇలా మీరు నాతో నవ్వుతూ మాట్లాడి చాలా రోజులు అయ్యింది” అంది విశాల.
కష్టం+ఇష్టం-సుఖం= సక్సెస్ ఇది సక్సెస్ మంత్రం విశాలా! అర్థం చేసుకో. నా డ్రైవింగ్ టెస్ట్ అయితే అపుడు నేను కాస్త ఫ్రీ అవుతాను అన్నాడు విష్ణు.
కష్టపడిన శ్రమకి ఫలితం ఆసన్నమయ్యే రోజు రానే వచ్చింది.. విష్ణు ఆ రోజు డ్రైవింగ్ టెస్ట్ కి సిద్ధమవుతున్నాడు. డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ కరణ్ తో ఒక సాంపిల్ మాక్ డ్రైవింగ్ టెస్ట్ చేసాడు. కరణ్ అవసరమైన చోట కొన్ని టిప్స్, సజెషన్స్ ఇచ్చాడు. విష్ణు ఐదు నిమిషాలు న్యూసౌత్ వేల్స్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ దగ్గర నిరీక్షిస్తూ కుర్చీలోకూర్చుని ప్రశాంతంగా జరుగబోయో డ్రైవింగ్ టెస్ట్ గురించి యోచన చేసుకుంటూ కళ్ళు మూసు కున్నాడు. అనుకున్న సమయానికి పన్నెండు గంటల కల్లా డ్రైవింగ్ టెస్ట్ కోసంఆఫీసర్ బయటికి వచ్చాడు.
* * * * *
(ఇంకా ఉంది)
నేను సిడ్నీ ఆస్ట్రేలియా లో ఉంటాను. మా తల్లిదండ్రులు శ్రీమతి శ్రీదేవి పెయ్యేటి మరియు శ్రీ రంగారావు పెయ్యేటి గార్లు ఇరువురు రచయితలు. ప్రవృత్తి పరంగా 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో తెలుగు రేడియో కార్యక్రమాలు, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తున్నాను. వృత్తి రీత్యా ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్థానికంగా తెలుగు వాణి రేడియో కన్వీనర్ గా సేవలు అందించాను. వందకు పైగా రేడియో కార్యక్రమాలు 15 రేడియో నాటికలు దర్శకత్వం చేపట్టి ప్రసారం చేశాను. ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చిన్నారులకు పాఠశాలలో religious education లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ద్వారా హిందూ మత బోధన తరగతులు తీసుకున్నాను. జాగృతి కథల పోటీలో నా కథలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు ఇరవై వరకు కథలు రాసాను, కథలు, కవితలు కొత్తవి రాస్తున్నాను. నా కథలు పలు పత్రికలలో, కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు, లలితగీతాలు, పాటలు పాడతాను. పలు వేదికలకు సమన్వయకర్తగా వ్యవహరించాను. సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలు గా నాలుగు సంవత్సరాలు సేవలు అందించాను. స్థానికంగా తెలుగువాణి మరియు జనరంజని రేడియో కార్యక్రమాలు, ఇంకా అంతర్జాలంలో తెలుగువన్ రేడియోలో వారం వారం కార్యక్రమాలు చేయటం నాకు అత్యంత ప్రీతికరం. “సకల కళాదర్శిని” వేదిక స్థాపించి, “స్త్రీ హృదయం” శ్రీ పెయ్యేటి రంగారావు గారి కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ తొలి కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించాను. మున్ముందు కళా, సాహిత్యం, సాహిత్య కార్యక్రమాలు “సకల కళాదర్శిని” ద్వారా అందచేయాలని భావిస్తున్నాను. వాహిని మాసపత్రిక “సాహితీ సదస్సు” అంతర్జాల మాధ్యమం జూమ్ ద్వారా విజయవంతంగా నాలుగు గంటలకు పైగా మూడు సదస్సులు నిర్వహించాను. దాదాపు ఐదు గంటలకు పైగా విజయవంతంగా విభిన్నమైన తెలుగు అంశాలతో కొనసాగింది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక వారోత్సవాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. భారతదేశంలో సాహిత్యంలో పలు అంశాలపై పత్ర సమర్పణ అందచేశాను.