ఈ తరం నడక – 3
నెమలీకల తాను
(నాంపల్లి సుజాత కవితా సంపుటి “హోమ్ మేకర్”పై సమీక్ష)
-రూపరుక్మిణి. కె
నెమలీకల్ని పుస్తకాల్లో ఎలిజిలుగా దాచుకున్న గమ్మత్తు అలవాటు ఎందరి కుంటుంది.
ఇలా అడిగితే దాదాపు అందరికీ అని చెప్పొచ్చేమో, కానీ దానికి జ్ఞాపకాల సీతాకోక రెక్కలు కట్టి ఎగురవేసేది మాత్రం కొందరివే .
ఎవరికైనా, ఎప్పుడైనా నడక ఎప్పుడు మొదలు పెట్టావు? ఎక్కడ మొదలు పెట్టావు? అని అడగ్గాని నాకు ఓ కల వచ్చింది. అందులో ఓ పుస్తకం చదివాను అది చదవగానే నాలో కలిగిన పులకింతకు పరవశించి మరీ కవిత్వం అయ్యాను అని చెప్పే వాళ్ళు మాత్రం అరుదైన విషయమే. అలా తాను కవిత్వం అవ్వడాన్ని
నా కలంలో నుండి
కవితాక్షర ధార
ఉబికి వచ్చి
నన్ను ఓ కవిగా మార్చింది.
ఇలా తనకు తానే విశ్లేషించుకున్న వ్యక్తి నాంపల్లి సుజాత గారు.
సుజాత గారి ఆవరణలో ఎలిజీలు, స్త్రీ పురుష భేదాల మధ్య చతికిలబడి పోతున్న ఆత్మాభిమానం, నగిషీలు చెక్కిన బాల్యపు ముద్రల నుండి బయటపడలేని ఎన్నో ఊరి ముచ్చట్లు, తన చుట్టూ ఉండే సామాజిక వెలివేతల కథలు, మసకబారిన మనుషుల మనసుల్నీ, మలినమైన భావోద్వేగాలనెన్నింటినో మోసే దుఃఖపు యంత్రాలను,
ఆత్మబంధాలనీ, ఆత్మీయ బంధాలని కట్టు బానిసలుగా మలిచే కనపడని కత్తెరల మధ్య పోకచక్కల్లా ముక్కలయ్యి నలిగే జీవులు కోకొల్లలు అంటూ మనుషుల మధ్య అగాధాలను విప్పి చెప్పారు.
సుజాత గారు టీచరుగా పని చేస్తారు కాబట్టి తన చుట్టూ బాల్యం ఓ కంచుకోటగా నిలబడింది అనుకుంటా..
పిల్లల్ని హాస్టల్లో వదిలేస్తున్న తల్లిదండ్రులని, హాస్టల్లో ఉండే పిల్లలు చూస్తున్న నరకాన్ని ఓ టీచరుగా ఎంతో ఆవేదనతో వ్యక్తం చేస్తుంది.
కొండ అంచుల్లోంచి రాలి పడే ఈ జలపాతాల్ని
కోన గుండెల్లో నుండి రాలిపడే ఈ సెలయేర్లని
ఎవరో డోంట్ టాక్ అన్నారు
బాలల హక్కులు స్వేచ్ఛ పక్షులు అంటూ స్పీచులిస్తావుగా…
ఈకలు పీకి రెక్కలు కత్తిరించి
పౌల్ట్రీ ఫామ్ లో పెంచితే బాల్యం విరబూస్తుందంటారా..?
అంటూ వారు సృజన కారులు అవ్వలేరు అని బాధను వ్యక్తం చేస్తారు.
అలాగే టీనేజ్ నుండి మేజర్స్ అవుతున్న పిల్లలకు స్వేచ్ఛని ఇవ్వాలని తల్లిదండ్రుల తీరుని ఎండగడుతుంది.
నీ కీర్తి కిరీటాల కోసం
వాళ్ళ నెత్తిన మోయలేని భారం మోపడం సరికాదు
అంటూ వాళ్ళంతా ఉదయిస్తున్న సూర్యులని ఆకాశమంత దున్ని రావాలని కోరుకోమని తల్లిదండ్రులని వారి శ్వాస నిశ్వాసుల పై నిఘా వదిలేయండి అని ఓ పంతులమ్మగా వేడుకుంటుంది.
అంతేనా ఉద్యోగ బాధ్యతల మధ్య ఫౌజ్ అంటూ దాంపత్యపు జంటల పేరుతో మిస్ యూస్ అవుతున్న వ్యవస్థ పై ధ్వజమెత్తుతుంది. అలాగే 317 జీవోలలో ప్రాంతీయతను వదులుకొని స్థల మార్పిడుల్ని, సర్దుబాటులతో తట్టుకోలేని ఉద్యోగస్తులకు ధైర్య వాక్యమై నిలబడుతుంది
సుజాత గారు చాలా సున్నిత మనస్కులు అనిపిస్తుంది. తన కవిత్వం చదువుతూ ఉంటే సామాజిక అంశాల పట్ల ఒక లేత చిగురాకులా వణికి పోతూనే అపరకాళిలా ధ్వజమెత్తిస్తారు.
యుగాలనాటి చీకటి గవాక్షం తెరిచి
కాంతిని ఆహ్వానించింది
వీక్షించనియండని లోకాలకు దీపాలు వెలిగించిన చేయూతే ఆమె పొరబడదు అంటూ…
ఆమె పేరుతో ఊరేగి నడమంత్రపు నటనాచాతుర్యం ప్రదర్శించకండి
అని చెప్పడంలో ఆమె ఉద్దేశం ఆమెల యొక్క పనిని ఆమెలని చేసుకొనివ్వండి అనే వేడ్కోలు కనిపిస్తుంది.
రాజకీయ నాయకులు ఎన్నికల బరిలో గెలిచిన భార్యల పేరున రచ్చబండల పై చేస్తున్నరచ్చని, పెత్తనాన్ని, రాజకీయం చేసే రాజకీయ నాయకుల్ని, మహిళా మణులు గెలిచి కూడా వారి పనులు వారిని చేసుకోనివ్వని మూర్ఖులకి ఆ మహిళలని ‘ఫోర్జరీ చెయ్యొద్దు’ అంటూ బాధని వ్యక్తం చేస్తుంది. వాళ్ళు సమర్థవంతమైన పాలన చేయ గలరని వాళ్ళని వాళ్ళ కోసం వదిలేయమని కవిత్వమై నినదిస్తోంది.
అంతేనా మగువా ఎప్పటికీ ఆత్మాభిమానంతో ఉండాలంటూ ఎవరో ఆడించే తోలు బొమ్మలు కాకూడదని కోరుకుంటూ
ఎప్పుడైతే నీ మనుగడ ఇంకొకరి గొడుగుని ఆశ్రయిస్తుందో అప్పటి నుండి వాళ్ళ నియంత్రణలో కాలం వెళ్ళదీయాల్సిందే
అని పరాధీనతలో పరాన్న బుక్కుల ప్రదక్షిణ చేసే ఉపగ్రహానివి కాబోకు అని హెచ్చరిస్తుంది.
బొట్టు తనకు పుట్టుకతోనే వచ్చిందని తాను దాన్ని ధరించే హక్కుని ఎప్పటికీ కోల్పోనని వితంతు తంతుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది.. బ్రతికుండగా ముద్ద పెట్టడం చేతకాని వాళ్ళు పిట్టకేసే పేరుతో ఆడే నాటకాలని రసవత్తరంగా రాసారని చెప్పొచ్చు.
మరో జన్మంటూ ఉంటే మళ్ళీ ఆడపిల్లగానే పుడతాను అని ధీర’ గా పలుకుతుంది.
ఇప్పుడు నువ్వు ఎంత కష్టపెట్టినా
రాళ్ళని ముళ్ళని ఏరిపారేసే
ఆత్మవిశ్వాసం నాది
ఒక జాతి పథకానికి ఉండే ఆత్మగౌరవం కూడా నాదే
మానవ మనుగడకు ప్రాణం పోసే మహిళగా పుట్టాలని కోరుకుంటా..
అంటూ తనను తాను దిశా నిర్దేశం చేసుకుంటుంది.
పిల్లల పెంపకంలో కవలలుగా పుట్టిన ఆడపిల్ల మగ పిల్లవాడి మధ్య కూడా ఎన్నో అవాంతరాలు అంతరాలని చూసిన విసుగుని చూపిస్తుంది మారని వ్యవస్థని మార్పు ఇహనైనా రావాలని ఆక్షేపిస్తుంది. చీర అంటే ప్రేమంటుంది కానీ నేను దాన్ని కట్టలేనని ఆమోద ముద్రలని వేసుకుంది చీర కట్టుకొని ఒక్క అంగుళామైన తడబడకుండా నడవలేని నేటి యువతకి ఈ చీర కవిత
ఈ హోం మేకర్ పుస్తకం నిండా ఇంటి పనుల వల్ల అలసిపోయిన స్త్రీ మూర్తులు తారసపడతారు, కవితాత్మక వాక్యాలు ఎదురవ్వవు, జీ. లక్ష్మి నర్సయ్య సర్ చెప్పినట్టి పూర్తి వచన వ్యాస రూప కవితలు తారసపడతాయి.
ముఖ్యంగా చాలా చోట్ల సుజాత గారే కనిపిస్తారు, స్వగతం కనిపిస్తుంది, ఇందులో తనకి తాను తన ప్రయాణాల్ని, ఎదురవుతున్న సామాజిక కోణంలోని స్త్రీ అస్తిత్వాల్ని ప్రశ్నిస్తూ… తనకు తాను నిబద్ధత కలిగిన వ్యక్తిగా నిలబడడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నిరంతరం పిల్లల మనోభావాలకి పెద్దపిట వేస్తూ తన చుట్టూ మనుషుల్ని,కవిత్వాన్ని ప్రేమించే సుజాత గారు నెచ్చెలి ఈ తరం నడకలో భాగమైనందుకు హృదయపూర్వక అభినందనలతో…
*****
పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
డియర్.. రూపా ! ‘హోమ్ మేకర్ ‘ ని శోధించి, జల్లించి లోతులని ఒడిసి పట్టి బాగా విశ్లేషంచావ్..అభినందనలు