జీవితం అంచున -18 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          ఇప్పుడు మహా శూన్యానికి మారు రూపంలా వుంది అమ్మ.

          అప్పటికి మూడు రోజులయ్యింది పాలవాడు కనిపించక.

          ఉదయాన్నే పొగమంచులో దిగంతాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ వెన్నెల గానాన్ని ఆలాపిస్తూ అతని స్మరణలో బాల్కనీలో కూర్చునే అమ్మ అస్తమించే శశిని, ఉదయించే రవిని ఒకేసారి చూడటం జరుగుతోంది. కాని నులి వెచ్చని ఊహలతో తన మనసులో వెన్నెల కురిపించే వాడి జాడే లేదు.

          అయినా ప్రేమ కనిపించనక్కర లేదు… వినిపించనక్కరలేదు.

          అదొక హృదయానుభూతి. ఆ అనుభూతిలో హృదయం అర్ధనిమీలిత పుష్పమవు తుంది.

          ఆ అనుభూతికి ఊహల రెక్కలు చాలు. హృదయ విహంగాన్ని గగన విహారం చేయించటానికి.

          ఉన్నట్టుండి అమ్మ ఏదో గుర్తొచ్చి స్మిత వదనంతో కాసేపు నవ్వుకుంటుంది.

          అంతలోనే ఎందుకో నొచ్చుకుని దిగాలు పడుతుంది.

          లోపల చిత్తడి చేసే అలజడికి తడబడి అమాంతం ఎవరిగానో భ్రమిస్తున్న అతనికి ఫోను కలుపుతుంది.

          నాకు మాటిచ్చిన పాలవాడు అమ్మ పిలుపుకి స్పందించడు.

          ఫోను కలవక తన హృదయాలాపనను అతనికి చేరవేయలేక దిగులుతో కుంగి పోతుంది. అతను లేకుండా ఎలాగని కొంత ఆందోళనకు గురవుతుంది.

          అసలు అతను తనకింకా మిగిలే వున్నాడాని ఒకింత అస్థిమితం అవుతుంది.

          అంతలోనే అతని గోరువెచ్చని ఆలింగన స్పర్శ్సను అనుభూతించి ఆవాహన చేస్తుంది. అనిర్వచనీయమైన తాదాత్మ్యంలో ఏ మహాకవి ఊహలకు అందనంత సమ్మోహనంగా ఇంద్రియాతీత ఆనందాన్ని ఆస్వాదిస్తూ సుషుప్తిలోకి జారుకుంటుంది.

          చిత్రవిచిత్ర భావోద్వేగాలతో అమ్మ ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు.

          నేను పాలవాడిని మానిపించటమే కాకుండా కాశీకి, పనిమనిషి యాదమ్మకి, వంట మనిషికి గట్టిగా వార్నింగు ఇచ్చాను. పాలవాడి ఊసు అమ్మ దగ్గర ఎత్తవద్దని, పాలవాడికి అమ్మకి మధ్య రాయబారం నడప వద్దని.

          వాళ్ళంతా నా మాటను శిరసా ఆచరిస్తారు.

          ఆ రోజు అమ్మ పుట్టినరోజు. తన తలపుల్లో ఇప్పటికీ పరిమళిస్తున్న ఏవేవో పురా స్మృతుల్లో అమ్మ మంచు పల్లకీలో తూగుతోంది. ఆమె మనసు మనసులో లేదు. ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా వుంది. తిండి సయించదు. నిద్ర పట్టదు. తన ప్రేమను అర్ధం చేసుకోలేని ప్రపంచం పైన విరక్తిగా వుంది అమ్మకు. ఆమె గుండె సవ్వడిని వినే వారెవరూ లేరు. ఆమె బాధను  పంచుకునే తన వారెవరూ లేరు.

          యాదమ్మ ఒక్కర్తీ తన మనసును ఎంతో కొంత అర్ధం చేసుకుని ఆమె వ్యథను వింటుంది. నాకు తన ఆలోచనలను చేరవేయటానికే వింటుందని అమ్మకు తెలియదు.

          పాలవాడిని భార్యా సమేతంగా భోజనానికి ఆహ్వానించి దంపతులిద్దరికీ బట్టలు పెట్టాలి. ముందు రోజు కాశీతో చర్చించింది వాళ్ళకు బట్టలతో పాటు డబ్బు ఇస్తే బావుంటుందా లేక ఏమయినా నగ ఇస్తే బావుంటుందా అని.

          కాశీ కంగారు పడి నాకు కాల్ చేసాడు. అమ్మ దగ్గర ఆ వయసులో బంగారం ఎందుకు వుంచారంటూ అమ్మ బుర్ర సరిగ్గా పని చేయటం లేదంటూ వాపోయాడు.

          పాలవాడు ఇంటి దరిదాపులకు రాడని, అమ్మ ఫోను తీయడని, కంగారు పడవద్దని నేను కాశీని సముదాయించాను.

          అమ్మ పుట్టినరోజని బంధువులంతా వచ్చారు. భోజనాలు చేసారు. అమ్మకు చీరలు కూడా తెచ్చారు. కాని అమ్మ అస్థిమితంగా అశాంతిగా వుంది. ఎందరు వచ్చినా తన మనసుకి నచ్చిన తను కోరుకుంటున్న అతను లేడు. అమ్మ ఫోను చేస్తే అతను రెస్పాండ్ అవటం లేదు. చాలా నిస్సహాయంగా వుంది.

          ఎలా అయితే పిచ్చివాళ్ళు ఒక్కోసారి అఘండమైన తెలివిని ప్రదర్శిస్తారో అలాగే అమ్నేషియా వ్యాధిగ్రస్తుల మెదడు ఒక్కోసారి చురుగ్గా అతి తెలివిగా పని చేస్తుంది. ఆతిథ్యానికి వచ్చిన అక్క మనుమరాలి ఫోనుతో అతడికి ఫోను చేసింది. తెలియని నంబరు అవటంతో అతను బదులిచ్చాడు.

          అమ్మ మొహంలో కోటి కాంతులు. ముడతలతో ముకుళించిన ఆ పసిడి మోము కెంజాయ ఛాయలో విప్పారింది. అది ఏ చిత్రకారుని కుంచెకూ అందని ఆనందోద్వేగం.

          “నువ్వు నీ భార్యతో సాయంత్రం భోజనానికి తప్పకుండా రావాలి. ఇవాళ నా పుట్టిన రోజు. నీ కోసం ఎదురు చూస్తుంటాను…” ఆనందంతో వెలిగిపోతున్న ఆ పిచ్చి తల్లి మొహం చూస్తే ఎంతటి శత్రువుకైనా ఆమె సంతోషం కోసం ఏం చేసినా తప్పు లేదని పిస్తుంది.

          తెలియని నంబరు నుండి వచ్చిన అనుకోని అమ్మ కాల్ కి పాలవాడు ఖంగుతిన్నా డు. కొంత నాకు భయపడ్డాడు కూడా.

          “అట్నే వస్తానమ్మా..” అని వెంటనే ఫోను డిస్ కనెక్ట్ చేసేసాడు.

          అమ్మ ఆనందానికి అవధులు లేవు.

          వచ్చిన బంధువులు ఎప్పుడెప్పుడు వెళ్ళి పోతారా అని ఎదురు చూసింది.

          కాశీ కలవరానికి అంతు లేదు. ఎక్కడ సాయంత్రం పాలవాడు వస్తే అమ్మ ఏమేమి ఇచ్చేస్తుందోనని కాశీ ఆందోళన.

          పాలవాడు నిజానికి రాలేదు. కాని అమ్మ ఊహల్లో ఆమె స్నేహితుని రూపంలో వచ్చాడు. అమ్మ చేతి విందు ఆరగించాడు. ఆ సమయంలో అమ్మ ఇంటి లోపలికి అందరి ప్రవేశం నిషేధించింది. ఆ సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామని నేను చేసిన ఫోను కూడా తీయలేదు.

          మళ్ళీ అమ్మ మరెవరి ఫోను నుండైనా పాలవాడికి ఫోను చేయవచ్చని అనుమానిం చిన కాశీ అమ్మ డైరీలో పాలవాడి నంబరులో ఒక అంకెను దిద్ది మార్చేసాడు.

          తనను చూడటానికి ఇంటికి ఎవరు వచ్చినా, వారి ఫోను నుండి ప్రయత్నించే అమ్మకు తెలియదు తన డైరీలో వున్నది తన గుండె చప్పుడుని అతనికి చేరవేయలేని ఒక కలవని రాంగు నంబరని…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.