షార్జా, దుబాయ్, అబుదాబీలలో ఉన్నన్ని టూరిస్ట్ ప్లేసెస్ మిగతా నాలుగు దేశాల లో తక్కువనే చెప్పొచ్చు.
“సూక్ అల్ జూబేయిల్” షార్జాలో ఉన్న ఒక మాల్! ఇందులో, దేశీ స్వదేశీ కూరగాయలు, పళ్ళు, తేనె, సీఫుడ్, నాన్ వెజ్ వంటి ఎన్నో ఉత్పత్తులు నిర్దిష్టమయిన ధరలకు లభ్యమవుతాయి. మన రైతు బజార్ కి మల్లే, కానీ చాలా అధునాతనంగా అన్ని సదుపాయాలతో శుచి శుభ్రతలతో ఉంటుంది. ఇటువంటిదే దుబాయిలో కూడా “అల్ అవీర్” లో కూడా ఉంది.
ఇక్కడ బర్ దుబాయిలో మన హిందువులకు ఒక సాయిబాబా గుడి కూడా షార్జాలో ఉంది. ఆ గుడిలో అన్ని దేముళ్ళు ఉన్నారు. కొన్ని తెలుగు అసోసియేషన్స్ ఆధ్వర్యంలో, శ్రీ శ్రీనివాస కల్యాణం, విష్ణుసహస్రనామ పారాయణలు వంటి పూజా కార్యక్రమాలు, బతకమ్మ వంటి సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇండియాలో లేకున్నా, ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తూ, పిల్లల పెంపకంలో తలమునకలవుతున్నా, ఇక్కడ ఉన్న మన తెలుగు ఆడపడుచులు (మా బంగారుతల్లితో సహా) తమ ఇళ్ళల్లో నోములు, వ్రతాలు, బొమ్మలకొలువులు, విష్ణు, లలితాసహస్రపారా యణలు, రుద్రాభిషేకాలు, చేసుకుంటున్నారు. వచ్చినవారికి భోజనాలు, తాంబూలాల సత్కారాలు, అన్నీ యధావిధిగా కుటుంబాలతో కలిసి చేసుకోవడం నా కెంతో ఆనందాన్నిచ్చింది.
దీపావళికి, క్రిస్మస్ కి ప్రతి బిల్డింగ్స్ విద్యుద్దీపాలలంకరణతో వెలిగిపోతూ మన భారతీయ సంస్క్రతిని చాటి చెప్తుంటాయి. పటాసులు ఇళ్ళ దగ్గర కాల్చకూడదు కాబట్టి సమీపంలో ఉన్న ఒక సువిశాలమయిన గ్రౌండ్ దగ్గర కాలుస్తారు. ఇక్కడున్న ఇండియన్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, దుబాయ్ లో, షార్జాలో, మనకి ఇండియాలో ఏ బాంబేలోనో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడూ సినీస్టార్స్, వివిధ సెలబ్రెటీల స్టేజ్ షోస్ జరుగుతోనే ఉంటాయి.
అలా ఈసారి మా పిల్లలు ( అమ్మాయి అల్లుడు) నన్ను కపిల్ శర్మ షోకి తీసుకెళ్ళారు. హాలు నిండా క్రిక్కిరిసిన మన భారతీయులను చూసి, అతని షోకి ఉన్న క్రేజ్ చూసి, డబ్బులు ఖర్చుపెట్టి షోకి వచ్చి కళాకారులను ఆదరించే సంస్క్రతి గల మనవారందర్నీ చూసి నాకు సంబ్రమాశ్చర్యాలు కలిగాయి.
ఎక్కడ చూసినా మన ఇండియన్ రెస్టారెంట్స్ జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి.
రజనీకాంత్ అభిమాని పెట్టిన ఒక రెస్టారెంట్ రజనీష్ ఫాన్స్, ఆశాభోంస్లే ఖానా ఖజానా, భారతీయ షెఫ్ సంజీవ్ కపూర్ కి చెందిన “ఖజానా” రెస్టారెంట్ అంతకు ముందు చప్పన్ మహారాజ భోగ్ రెస్టారెంట్, ఆర్యా’స్, పూర్ణామాల్, శరవణా భవన్, అల్ మన్కూల్ లో “క్లేపాట్ రెస్టారెంట్స్ సరేసరి, ఇలా ఎన్నో ఇండియన్ రెస్టారెంట్స్ ఉండటం వలన టూరిస్ట్ లు ఫుడ్ కొరకు ఇబ్బంది పడనవసరంలేదు. ఇక్కడ ఏటేటా నెలల తరబడి నిర్వహించే, దుబాయ్ ఫెస్టివల్ గ్లోబల్ విలేజ్, ప్రత్యేకమయినవి. వివిధ దేశాలకు సంబంధించిన నాణ్యమయిన ఉత్పత్తులు.లభిస్తాయి.
దుబాయ్ సందర్శించాలనుకునేవారికి అక్టోబర్ నుండి ఫిభ్రవరి అనుకూల సమయం! ఇతర సమయాలలో అక్కడ ఉండే ఉష్టోగ్రతను తట్టుకోలేరు. సుమారు అరవయి సెల్సియస్ డిగ్రీలు దాకా ఉంటుందని అంటారు. పగటి వేళ బయటకు వొస్తే తేరిపార చూడలేనంత మిరుమిట్లు గొలిపే ఎండ ఒళ్ళంతా కాపడం పెడ్తున్నంత వేడి చవిచూడాల్సిందే!
మెట్రో ట్రైన్ లో నుండి వెడుతుంటే మనం రెప్పవేయకుండా ఆ ఆకాశ హర్మ్యాలు చూస్తూ ఉండిపోతాము. ట్రాఫిక్ వేళల చూస్తే అన్ని చోట్ల లాగే వరసలు తీరిన కార్లతో రోడ్లు నిండిపోయి ఉంటాయి.
ఉద్యానవనాలు, ఖరీదయిన హొటల్స్, షాపింగ్ మాల్స్, పరిశుభ్రత ఉట్టిపడుతూ, నియమ నియంత్రణల కనుసన్నలలో నిరంతరం కదులుతుండే జనస్రవంతితో కళ కళలాడే సుందర నగరాలు ఈ ఎమిరేట్స్ గురించి చెప్పాలంటే నాకున్న పరిజ్ఞానం సరిపోదు.
అయినా కూడా నాకళ్ళకు నేత్రపర్వంగా, మనసుకి అహ్లాదభరితంగా, మేధస్సుకి అందనంత విజ్ఞాన సంపద గురించి కొంతయినా మీ అందరితో పంచుకోవాలనిపించి ఈ సాహసం చేసాను.
నేను రాయడంలో ఏమయినా పొరపాట్లు ఉంటే అనుభవజ్ఞులు, విజ్ఞానవంతులు అయిన దుబాయ్ వాసులు మన మిత్రులు మన్నించాలని కోరుతూ ఈ దుబాయ్ విశేషా లు ప్రస్తుతానికి ఇంతే అని తెలియచేస్తున్నాను.
మాకింతటి ఆనందాన్నిచ్చిన మా పిల్లలకి ( అమ్మాయి అల్లుడు) కి మరోమారు ఆశీ”స్సులు అంద చేస్తూ “స్వస్తి
*****